Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 16 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 16 ఫిబ్రవరి 2024

తెలుగులో 16 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహులకు ఇవి ఉపయోగపడతాయి.

ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన సుప్రీం కోర్టు

ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం సమాచార హక్కు మరియు వాక్ మరియు భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పులో పేర్కొంది. ఈ పథకం రాజకీయ నిధులకు పారదర్శకత తీసుకురావడంలో విఫలమైనందున దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.

ఎలక్టోరల్ బాండ్ల పథకంను 2018లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. రాజకీయ నిధులకు పారదర్శకతను తీసుకురావడానికి రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాల స్థానంలో ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది. ఈ పథకంలోని నిబంధనల ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే అర్హులు.

ఈ రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు గతంలో జరిగిన లోక్‌సభ లేదా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 1 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొంది ఉండాలి. ఎలక్టోరల్ బాండ్ అనేది ఒక రకమైన ప్రామిసరీ నోటు లేదా బేరర్ బాండ్ వంటిది. వీటిని భారతీయ పౌరులు లేదా సంస్థలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. వీటిని ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంచింది.

  • 15 ఫిబ్రవరి 2024న, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఏకగ్రీవంగా కొట్టివేసింది.
  • ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం సమాచార హక్కు మరియు వాక్ మరియు భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించినట్లు పేర్కొంది.
  • కంపెనీల చట్టంలోని సెక్షన్ 182కి సవరణ ద్వారా కార్పొరేట్ రాజకీయ నిధులను అనుమతించడం రాజ్యాంగ విరుద్ధం అని తెలిపింది.
  • ఈ పథకం కార్పొరేట్ సంస్థలు మరియు రాజకీయ నాయకుల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాట్లకు దారి తీస్తుందని ఎద్దేవా చేసింది.
  • అదే సమయంలో మార్చి 6లోగా దాతలు మరియు గ్రహీతల వివరాలను భారత ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది.
  • అయితే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ వివరాలను సమర్పించడంలో విఫలమైంది.
  • మార్చి 6 తేదీ కంటే మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
  • సుప్రీం కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. మార్చి 11, 2024 సాయంత్రానికి వీటి వివరాలు భారత ఎన్నికల సంఘానికి వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.
  • భారత ఎన్నికల సంఘం మార్చి 15, 2024న వీటిని విడుదల చేసింది.
  • ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019 మరియు జనవరి 24, 2024 మధ్య క్యాష్ చేసిన అన్ని బాండ్లకు సంబంధించినవిగా ఉన్నాయి.

ఎలక్టోరల్ బాండ్ల పథకం రెండు ప్రధాన కారణాల వలన భారత సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిఐఎల్) ద్వారా చట్టపరమైన సవాలుకు గురైంది. ఇందులో మొదటిది ఈ పథకం భారతదేశంలో రాజకీయ నిధుల సేకరణలో పూర్తి పారదర్శకతను లోపింపజేస్తుంది. తద్వారా ఎన్నికల సంఘం మరియు దేశ పౌరులు రాజకీయ విరాళాలు మరియు పార్టీల ముఖ్యమైన ఆదాయ వనరులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందకుండా నిరోధిస్తుంది.

ఇక రెండవది ఈ పథకాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం ద్వారా ఇది పార్లమెంటులోని రాజ్యసభలో చర్చకు తోవలేకుండా ఆమోదింపచేసింది. ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్య మరియు ఇది అధికారాల విభజన సిద్ధాంతాన్ని మరియు పౌరుడి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది.

ఈ పిల్ అక్టోబర్ 2017లో సుప్రీం కోర్టులో దాఖలాలు చేయబడింది, ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 2018లో తన ప్రతిస్పందనను సమర్పించింది. మార్చి 2018లో న్యాయ మంత్రిత్వ శాఖ కూడా దీనికి ప్రతిస్పందించింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి చేసిన సవరణల చట్టబద్ధతను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వేతర సంస్థ అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సమర్పించిన పిటిషన్ల సేకరణను సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిపిఐ(ఎం) నాయకుడు సీతారాం ఏచూరి తన పిటిషన్‌లో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ మరియు ఎలక్టోరల్ బాండ్ల జారీ మరియు ఫైనాన్స్ యాక్ట్ 2017ని ప్రభుత్వం ఏకపక్షంగా మరియు వివక్షపూరితంగా ఆమోదించిందని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే దీనికి ప్రతివాదనగా ఎలక్టోరల్ బాండ్‌లను ప్రవేశపెట్టాలనే తన నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్ధించుకుంది. రాజకీయ పార్టీల నిధుల సేకరణలో నల్లధనం యొక్క విపరీతమైన ముప్పును తగ్గించడానికి మరియు ఎన్నికల సంస్కరణలను ప్రోత్సహించడానికి వాటిని ప్రవేశపెట్టినట్లు సుప్రీంకోర్టులో నొక్కి చెప్పింది.

తాజా తీర్పు ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు పౌరులకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. సమాచార హక్కు విస్తరణలో కీలకమైన అంశం ఏమిటంటే అది రాష్ట్ర వ్యవహారాలకే పరిమితం కాకుండా భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి అవసరమైన సమాచారాన్ని కూడా కలిగి ఉంటుందని అని పేర్కొంది. రాజకీయ పార్టీలకు ఆర్థిక విరాళాలు రెండు కారణాల వల్ల జరుగుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది, రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదా క్విడ్ ప్రోకో మార్గం కావచ్చు అని పేర్కొంది. అన్ని రాజకీయ సంస్కరణలు పబ్లిక్ పాలసీని మార్చే ఉద్దేశ్యంతో చేయబడవు అని తెలిపింది.

ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో ప్రారంభమైనప్పటి నుండి, తాజా సుప్రీం కోర్టు తీర్పు చెప్పే వరకు అధికారిక లెక్కలు ఇంకా తేలినప్పటికీ దాదాపు 16,000 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు జరిగినట్లు తెలుస్తుంది. వాటిలో మెజారిటీ వాటా బీజేపీ పార్టీకి చేరినట్లు నివేదికలు చెప్తున్నాయి.

ఈ జాబితాలో మిస్టర్ శాంటియాగో మార్టిన్ నిర్వహిస్తున్న ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతిపెద్ద దాతగా ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం తెలుస్తుంది. ఈ లాటరీ కంపెనీ 2019–2024 మధ్య కాలంలో రూ. 1,300 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఈ సంస్థ ఈడీ ద్వారా మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న ఏడు రోజుల తర్వాత రూ. 100 కోట్ల విలువైన బాండ్‌లను కొనుగోలు చేసినట్లు ఈ రిపోర్టు చూపిస్తుంది.

ఈ జాబితాలో రెండవ మరియు ఐదవ అతిపెద్ద దాతలుగా మేఘా ఇంజినీరింగ్ మరియు వేదాంత లిమిటెడ్ నిలిచాయి. అలానే మూడవ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థగా భావిస్తున్న క్విక్ సప్లై చైన్ ఉంది. అయితే ఈ ఆరోపణలను రిలయన్స్ తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా నిధులు సేకరించిన టాప్ 10 రాజకీయ పార్టీల జాబితాను కింది పట్టికలో మీరు చూడొచ్చు.

రాజకీయ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల విలువ
1 భారతీయ జనతా పార్టీ 6,060 కోట్లు
2 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1,609 కోట్లు
3 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (అధ్యక్షుడు) 1,421 కోట్లు
4 భారత రాష్ట్ర సమితి 1,214 కోట్లు
5 బిజు జనతా దళ్ 775 కోట్లు
6 పార్లమెంట్‌లో డీఎంకే పార్టీ 639 కోట్లు
7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 337 కోట్లు
8 తెలుగు దేశం పార్టీ 218 కోట్లు
9 శివసేన 158 కోట్లు
10 రాష్ట్రీయ జనతా దళ్ 72 కోట్లు

ఐఆర్‌సిటిసి నూతన సీఎండీగా సంజయ్ కుమార్ జైన్

1990 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ అధికారి సంజయ్ కుమార్ జైన్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సిటిసి) యొక్క నూతన ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కుమార్ జైన్ రైల్వే మంత్రిత్వ శాఖతో సహా ప్రభుత్వ రంగ సంస్థలలో మూడు దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు.

సంజయ్ కుమార్ జైన్ ఈ హోదాకు ముందు ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజరుగా సేవలు అందించారు. అంతక ముందు ముంబై డివిజనల్ రైల్వే మేనేజరుగా, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్కపార్ట్ టైమ్ చైర్మన్ మరియు సీఈఓగా కూడా సేవలు అందించారు.

  • సంజయ్ కుమార్  ముంబై రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్‌గా ఉన్న సమయంలో దాదాపు 30,000 మంది సిబ్బందిని విజయవంతంగా నడిపించారు.
  • దాదాపు 40 లక్షల మంది రోజువారీ ప్రయాణికులకులతో దేశంలో అతిపెద్ద ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌ను ఆయన విజయవంతంగా నిర్వహించారు.
  • ముంబై రైల్వేలో ఈయన నిర్వహించిన స్వచ్ఛత మిషన్‌ కార్యక్రమం వలన చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ జల్ శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్తమ ఐకానిక్ స్వచ్ఛతా ప్లేస్ అవార్డు అందుకుంది.
  • 2019లో ముంబై బైకుల్లా రైల్వే స్టేషన్ యొక్క ప్రతిష్టాత్మక హెరిటేజ్ పరిరక్షణను ప్రారంభించే అధికారాన్ని ఆయన దక్కించుకున్నారు.
  • ఈ స్టేషన్ 2023లో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం యునెస్కో యొక్క ఆసియా పసిఫిక్ కల్చరల్ హెటిటేజ్ అవార్డును గెలుచుకుంది.
  • ముంబైలోని మాతుంగాలో మహిళలతో నడిచే మొట్టమొదటి రైల్వే స్టేషన్‌ను నిర్వహించడం ద్వారా అతను మహిళా సాధికారతను ప్రోత్సహించారు.
  • ఈ రైల్వే స్టేషన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జాబితా చేయబడింది.
  • ఈయన హయాంలోనే ముంబయిలోని రైల్వే లైన్ల వెంబడి ఉన్న నివాస ప్రాంతాల నుండి చెత్తను సేకరించేందుకు మక్ స్పెషల్ రైలు ప్రారంభించబడింది.

ఇస్రో ఇన్సాట్-3డిఎస్‌ వాతావరణ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

వాతావరణ పర్యవేక్షణ మరియు విపత్తు హెచ్చరికల నిర్వహణ కోసం అభివృద్ధి చేసిన ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఈ అంతరిక్ష ప్రయోగాన్ని ఫిబ్రవరి 17, 2024, సాయంత్రం 5:30 గంటలకు శ్రీహరికోట నుండి జీఎస్ఎల్వి 16వ రాకెట్ ద్వారా నిర్వహించారు.

ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహం అనేది జియోస్టేషనరీ ఆర్బిట్ యందు ప్రవేశపెట్టేందుకు రూపొందించిన మూడవ తరం వాతావరణ ఉపగ్రహం. తాజా ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈ వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

  • ఇన్సాట్-3డీఎస్ మరింత మెరుగైన వాతావరణ మరియు విపత్తు హెచ్చరిక కోసం రూపొందించబడింది.
  • ఇది భూమి మరియు సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం కూడా రూపొందించబడింది.
  • ఇన్సాట్-3డీఎస్ మిషన్, పూర్తిగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నిధులతో అభివృద్ధి చేయబడింది.
  • ఈ ఉపగ్రహం ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్సాట్-3డి మరియు ఇన్సాట్-3డిఆర్ ఉపగ్రహాలతో పాటుగా సేవలు అందిస్తుంది.

జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వి) అనేది మూడు-దశల 51.7 మీటర్ల పొడవు గల లాంచ్ వెహికల్. ఇది 420 టన్నుల బరువును కలిగి ఉంటుంది. దీని మొదటి దశ (జిఎస్1)లో 139-టన్నుల ప్రొపెల్లెంట్ మరియు నాలుగు ఎర్త్-స్టోరబుల్ ప్రొపెల్లెంట్ స్టేజ్‌లు (ఎల్40) స్ట్రాపాన్‌లను కలిగి ఉండే సాలిడ్ ప్రొపెల్లెంట్ (ఎస్139) మోటార్‌ను కలిగి ఉంటుంది. ఇవి ఒక్కొక్కటి 40 టన్నుల ద్రవ ప్రొపెల్లెంట్‌ను కలిగి ఉంటాయి.

రెండవ దశ (జిఎస్2) కూడా 40-టన్నుల ప్రొపెల్లెంట్‌తో లోడ్ చేయబడిన ఎర్త్-స్టోరబుల్ ప్రొపెల్లెంట్ కలిగి ఉంటుంది. మూడవ దశ (జిఎస్3) ద్రవ ఆక్సిజన్ మరియు ద్రవ హైడ్రోజన్ యొక్క 15-టన్నుల ప్రొపెల్లెంట్ లోడింగ్‌తో కూడిన క్రయోజెనిక్ దశ. ఈ రాకెట్ కమ్యూనికేషన్, నావిగేషన్, ఎర్త్ రిసోర్స్ సర్వేలు మరియు ఇతర యాజమాన్య మిషన్‌ను నిర్వహించడం కోసం ఇస్రో ఉపయోగిస్తుంది.

గురుముఖి లిపిలో టైపింగ్ కోసం పురాన్ వ్యవస్థ పరిచయం

పంజాబ్ యూనివర్సిటీ గురుముఖి లిపిలో టైపింగ్ అనుభవాన్ని మెరుగుపర్చడం కోసం పురాన్ వ్యవస్థను పరిచయం చేసింది. పంజాబీ యూనివర్శిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగంకు చెందిన డా. అమన్‌దీప్ వర్మ మార్గదర్శకత్వంలో గుర్జోత్ సింగ్ మహి దీనిని అభివృద్ధి చేశారు.

ఈ సాంకేతికత ఇటీవలే కేరళలోని కోజికోడ్‌లో "న్యూ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇంజినీరింగ్" అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఉత్తమ పరిశోధనా పత్రం టైటిల్‌ను దక్కించుకుంది. పురాన్ సిస్టమ్ భాషా వాక్యాలను సూచించడమే కాకుండా వినియోగదారులకు ఉద్దేశించిన అంశానికి సంబంధించి ఔచిత్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ అభివృద్ధి భాషా సాంకేతిక పరిశోధనలో, ప్రత్యేకించి స్థానిక మాండలికాలలో గుర్తించదగిన ఖాళీని పూర్తిస్తుంది.

ఆంగ్ల భాషలో ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ, గురుముఖి స్క్రిప్ట్‌పై దృష్టి కేంద్రీకరించడం వలన "పురాన్" ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది పంజాబీ మాట్లాడేవారికి నూతన డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను అందిస్తుంది. పంజాబీ భాషను ఆధునీకరించే దిశగా ఈ ఘనత ఒక కీలకమైన ముందడుగుగా భావించవచ్చు.

రోజురోజుకి ఇంటర్నెట్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్ యొక్క పెరుగుతున్న వినియోగంతో, ప్రజలు ఆన్‌లైన్‌లో పంజాబీలో టైప్ చేయడాన్ని పురాన్ సులభతరం మరియు వేగవంతం చేస్తుంది. వినియోగదారులు టైప్ చేస్తున్నప్పుడు సందర్భానుసారంగా సంబంధిత వాక్యలు సూచించడం ద్వారా వారి శోధన పరిధిని పెంచుతుంది.

విశాఖపట్నంలో మిలాన్ నావల్ డ్రిల్ 12వ ఎడిషన్ విజయవంతం

మిలాన్ నేవల్ ఎక్సర్‌సైజ్ యొక్క 12వ ఎడిషన్, ఫిబ్రవరి 19-27 వరకు విశాఖపట్నంలో నిర్వహించబడింది. ఇది ప్రపంచ సముద్ర సహకారానికి సంబంధించిన భారీ నౌకాదళ ప్రదర్శనగా చెప్పొచ్చు. ఈ ఏడాది మిలాన్ నేవల్ ఎక్సర్‌సైజ్ యందు ప్రపంచవ్యాప్తంగా 50 నౌకాదళాలు పాల్గొన్నాయి. ఈ వ్యాయామాన్ని ఫిబ్రవరి 19న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.

మిలాన్ నేవల్ ఎక్సర్‌సైజ్ 1995లో మొదటిసారి నిర్వహించారు. ఈ ప్రారంభ ఎడిషన్‌లో పాల్గొన్నాయి భారత నౌకాదళంతో పాటు ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక మరియు థాయ్‌లాండ్ నౌకాదళాలు మాత్రమే పాల్గొన్నాయి. ప్రస్తుతం ఈ వ్యాయామంలో ఇండో-పసిఫిక్ అంతటా 50 నౌకాదళాలు పాల్గొంటున్నాయి.

  • మిలాన్ నేవల్ ఎక్సర్‌సైజ్ ప్రారంభం నుండి అండమాన్ మరియు నికోబార్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించేవారు.
  • ఈ వ్యాయామం 2022 విశాఖపట్నంలో తొలిసారి నిర్వహించారు. తాజా ఎడిషన్ కూడా ఇక్కడే జరిగింది.
  • మిలన్ మొదటిసారిగా 1995లో నిర్వహించబడింది. అప్పటి నుండి ఈవెంట్ 2001, 2005, 2016 మరియు 2020 మినహా ద్వైవార్షికంగా నిర్వహించబడింది.
  • అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కారణంగా 2001 మరియు 2016 ఎడిషన్‌లు నిర్వహించబడలేదు. అలానే 2004 హిందూ మహాసముద్రం భూకంపం మరియు సునామీ కారణంగా 2005 ఈవెంట్ జరగలేదు.
  • ఈ ఏడాది 'కామరాడెరీ కోహెషన్ కోలాబరేషన్' అనే నినాదంతో ఈ వ్యాయామం నిర్వహించారు.

మిలాన్ నేవల్ ఎక్సర్‌సైజ్ నౌకాదళల మధ్య ఇంటర్‌ఆపరేబిలిటీని మెరుగుపరచడానికి మరియు నావికా నైపుణ్యాలను ప్రదర్శించడానికి రూపొందించబడిన విస్తృత శ్రేణి కార్యకలాపాలను కలిగి ఉంది. దీనిని హార్బర్ ఫేజ్ మరియు సీ ఫేజ్ పేర్లతో రెండు దశలలో నిర్వహిస్తారు.

హార్బర్ ఫేజ్ యందు ఇంటర్నేషనల్ మారిటైమ్ సెమినార్, బీచ్‌లో సిటీ పెరేడ్, స్వావ్లాంబన్ ఎగ్జిబిషన్, సబ్జెక్ట్ మేటర్ ఎక్స్‌పర్ట్ ఎక్స్ఛేంజ్ సాధారణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సీ ఫేజ్ యందు స్నేహపూర్వక విదేశీ దేశాలు మరియు భారత నౌకాదళం నుండి నౌకలు, విమానాలు మరియు జలాంతర్గాములు పెద్ద ఎత్తున విన్యాసాలు నిర్వహిస్తాయి. అధునాతన వాయు రక్షణ కార్యకలాపాలు, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం మరియు ఉపరితల వ్యతిరేక యుద్ధం వంటి సముద్ర వ్యాయామాలు నిర్వహిస్తారు.

క్వాడ్ కూటమి బలోపేతం కోసం బిల్లును ఆమోదించిన యూఎస్

యూఎస్, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ మధ్య సహకారాన్ని బలోపేతం చేసే క్వాడ్ బిల్లును యూఎస్ ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ బిల్లు క్వాడ్ ఇంట్రా-పార్లమెంటరీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు పిలుపునిస్తుంది. ఇది క్వాడ్ కార్యకలాపాలపై నవీకరణ మరియు యూఎస్ కాంగ్రెస్‌ సహకారంపై దృష్టి సారిస్తుంది. ఈ గ్రూప్ ప్రతి క్వాడ్ దేశం నుండి ప్రతినిదులను కలిగి ఉంటుంది.

ఈ ప్రతీకాత్మకతక బిల్లుకు 379 మంది హౌస్ ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా, 39 మంది సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఇది చట్టంగా మారడానికి ముందు సెనేట్ ఈ చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది, అదే సమయంలో యూఎస్ అధ్యక్షుడు దానిపై సంతకం చేయాల్సి ఉంటుంది.

క్వాడ్ వర్కింగ్ గ్రూప్ మధ్య సాధారణ సమావేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ బిల్లు వివరిస్తుంది. అలానే నాయకత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి క్వాడ్ యొక్క నలుగురు సభ్యుల మధ్య ఉమ్మడి సహకారాన్ని బలోపేతం చేయడం ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం.

  • క్వాడ్ అనగా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని అర్ధం.
  • ఇది ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఏర్పాటు చేయబడిన ఇంటర్-గవర్నమెంటల్ సెక్యూరిటీ ఫోరమ్.
  • క్వాడ్ 2007లో తొలిసారి ప్రారంభించబడింది.
  • ఆస్ట్రేలియన్ ప్రధాని జాన్ హోవార్డ్ , భారత ప్రధాని మన్మోహన్ సింగ్, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ డిక్ చెనీల మద్దతుతో జపాన్ ప్రధాని షింజో అబే ఈ సంభాషణను ప్రారంభించారు.
  • అయితే కెవిన్ రూడ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆస్ట్రేలియా ఉపసంహరణ తర్వాత 2008లో క్వాడ్ నిలిపివేయబడింది. ఇది తిరిగి 2017 లో ప్రారంభమైంది.
  • క్వాడ్ సభ్య దేశాలు ఎక్సర్‌సైజ్ మలబార్ పేరుతో వార్షిక వ్యాయామం నిర్వహిస్తాయి.

క్వాడ్ ప్రారంభంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. అయితే తర్వాత కాలంలో ఇది సముద్ర భద్రత, విపత్తు ఉపశమనం మరియు ఉచిత మరియు బహిరంగ ఇండో-పసిఫిక్‌ను భద్రతను ప్రోత్సహించడం వంటి వివిధ అంశాలకు తన సహకారాన్ని విస్తరించింది.

Post Comment