Advertisement
తెలుగు కరెంట్ అఫైర్స్ 27 ఫిబ్రవరి 2023 | పోటీ పరీక్షల స్పెషల్
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ 27 ఫిబ్రవరి 2023 | పోటీ పరీక్షల స్పెషల్

వీక్లీ కరెంట్ అఫైర్స్ 20 ఫిబ్రవరి 2023 తెలుగులో ఉచితంగా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల సౌలభ్యం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న తాజా సమకాలిన అంశాలను మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఈ సమాచారం మీ పోటీపరీక్షల సన్నద్ధతను మరింత మెరుగుపరుచుస్తుందని భావిస్తున్నాం.

తెలుగులో ఫిబ్రవరి 2023 కరెంట్ అఫైర్స్

భారత్-ఉజ్బెకిస్తాన్ ద్వైవార్షిక సైనిక శిక్షణ వ్యాయామం డస్ట్‌లిక్ ప్రారంభం

భారత సైన్యం మరియు ఉజ్బెకిస్తాన్ సైన్యం మధ్య జరిగే ద్వైవార్షిక శిక్షణ వ్యాయామం డస్ట్‌లిక్ (DUSTLIK) యొక్క నాల్గవ ఎడిషన్ ఫిబ్రవరి 21 నుండి 5 మార్చి, 2023 వరకు ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌లో నిర్వహిస్తున్నారు.

ఈ ద్వైపాక్షిక వ్యాయామంలో వెస్ట్రన్ కమాండ్‌లో భాగమైన 14వ బెటాలియన్, ది గార్వాల్ రైఫిల్స్ ద్వారా భారత బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది. అలానే ఉజ్బెకిస్తాన్ సైన్యం నుండి నార్త్ వెస్ట్రన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ యొక్క దళాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ ఉమ్మడి వ్యాయామం ఐక్యరాజ్యసమితి ఆదేశం మేరకు ఉప సంప్రదాయ దృష్టాంతంతో ఇరు దేశాల మధ్య సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జరుగుతుంది.

రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియాలోని భూపరివేష్టిత దేశం. ఈ దేశానికి పడమర, ఉత్తరాన కజకస్తాన్, తూర్పున కిర్గిజ్ స్తాన్, తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. దీని రాజధాని నగరం తాష్కెంట్. ప్రస్తుత ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్.

జైపూర్‌లో 18వ వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్

18 వ వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్ సమావేశాలు ఫిబ్రవరి 21 -23 తేదీల మధ్య జైపూర్‌లో నిర్వహించారు. ఈ 3 రోజుల సదస్సును ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశాలను రైల్వే సెక్యూఐర్తి స్ట్రాటజీ - రెస్పాన్సేస్ అండ్ విజన్ ఫర్ ఫ్యూచర్ థీమ్‌తో నిర్వహించారు.

ఈ సమావేశాలలో ప్రస్తుత రైల్వే భద్రతా సవాళ్లు మరియు నూతన పరిష్కారాలపై చర్చించారు. అలానే రైల్వే రంగంలో నిర్మాణాత్మక చర్చలు, ఆలోచనల మార్పిడి మరియు ఉత్తమ సాంకేతిక ఉత్పత్తులపై మేధోమథనం జరిగింది.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) భారతదేశంలోని రైల్వే భద్రతా వ్యవహారాలు మరియు చట్టాన్ని అమలు చేసే సంస్థ. ఇది 1957లో ఫెడరల్ ఫోర్స్‌గా ఏర్పాటై, తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతొ సేవలు అందిస్తుంది. ఇది రైల్వే ఆస్తి మరియు రైల్వే ప్రయాణీకుల భద్రతకు బాధ్యత వహిస్తుంది.

ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) 1922 లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది. ఇది రైలు రవాణా పరిశోధన, అభివృద్ధి & ప్రమోషన్ కోసం రైల్వే రంగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఎంపాస్‌పోర్టు పోలీస్ యాప్‌ ప్రారంభం

పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపాస్‌పోర్టు పోలీస్ యాప్‌ పేరుతొ నూతన మొబైల్ అప్లికేషన్ ప్రారంభించింది. ఈ కొత్త యాప్ మొబైల్ టాబ్లెట్‌ల ద్వారా డిజిటల్ మరియు పేపర్‌లెస్ వెరిఫికేషన్ రిపోర్టులను సమర్పించడానికి పోలీసు సిబ్బందిని అనుమతిస్తుంది, దీని ద్వారా పాస్‌పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ సమయాన్ని తగ్గిస్తుంది.

పోలీసు ధృవీకరణ అనేది పాస్‌పోర్ట్ జారీ వ్యవస్థలో అంతర్భాగం. ఈ ధృవీకరణ వ్యక్తిగతంగా చేయబడుతుంది. దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న చిరునామాను పోలీస్ అధికారి సందర్శిస్తారు. సమాచార ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసిన తర్వాత, పోలీస్ స్టేషన్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నోటిఫికేషన్ పంపుతుంది. దీని తర్వాత, దరఖాస్తుదారునికి పాస్‌పోర్ట్ జారీ చేయబడుతుంది.

పాస్‌పోర్ట్ అనేది ఒక రకమైన వ్యక్తిగత గుర్తింపు పత్రం. ఒక వ్యక్తి పౌరసత్వం కలిగిఉన్న దేశాన్ని ధృవీకరించడానికి పాస్‌పోర్ట్ ఉపయోగించబడుతుంది. ఇది అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం మరియు చట్టబద్దం చేస్తుంది.

చైనా, రష్యా & దక్షిణాఫ్రికాల ఉమ్మడి నావికా వ్యాయామం మోసి II ప్రారంభం

రష్యా-చైనాలతో కలిసి దక్షిణాఫ్రికా సంయుక్త నావికా సైనిక వ్యాయామం నిర్వహించింది. మోసి II పేరుతొ జరుగుతున్నా ఈ పదిరోజుల నావికా విన్యాసాలు దక్షిణాఫ్రికా తీరంలో హిందూ మహాసముద్రంలో జరుగుతున్నాయి. 350 మంది సాయుధ దళాల సభ్యులు ఇందులో పాల్గున్నట్లు దక్షిణాఫ్రికా జాతీయ రక్షణ దళం తెలిపింది.

జిర్కాన్ హైపర్‌సోనిక్ క్షిపణులను మోసుకెళ్లే అడ్మిరల్ గోర్ష్‌కోవ్ యుద్ధనౌకను పంపనున్నట్లు రష్యా ప్రకటించింది. ఇవి ధ్వని కంటే తొమ్మిది రెట్లు వేగంతో ఎగురుతాయి మరియు 1,000 కిమీ (620 మైళ్ళు) లక్ష్య పరిధిని ఛేదిస్తాయి. ఒక పక్కన ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం యొక్క మొదటి వార్షికోత్సవం జరుగుతుండగా చైనా, రష్యాలతో కలిసి దక్షిణాఫ్రికా ఈ సైనిక వ్యాయామం నిర్వహించడం వివిధ ప్రపంచ దేశాల విమర్శలకు గురవుతుంది.

ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధ వివాదంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం తటస్థంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇలాంటి వార్షిక సైనిక విన్యాసాలు ఫ్రాన్స్ మరియు యుఎస్‌తో సహా ఇతర దేశాలతో మామూలుగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

యునిసెఫ్‌ బాలల హక్కుల జాతీయ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

యునిసెఫ్‌ బాలల హక్కులకు సంబంధించి భారత జాతీయ రాయబారిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఫిబ్రవరి 19 న నియమితులయ్యారు. దీనితో యునిసెఫ్ ఇండియాతో కలిసి బాలల హక్కుల కోసం తన సహాయాన్ని అందించనున్నారు.

ఆయుష్మాన్ ఖురానా ఇది వరకు 2020 లో పిల్లలపై హింసను నిరోధించే మరియు విస్తృత బాలల హక్కుల ఎజెండా కోసం వాదించడానికి యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కూడా నియమితులయ్యారు. యూనిసెఫ్ బాలల హక్కుల కాపాడటం కోసం గ్లోబల్, రీజినల్ మరియు నేషనల్ అంబాసిడర్‌లను నియమిస్తుంది. వీరి ద్వారా యూనిసెఫ్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది.

యునిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మానవతా మరియు అభివృద్ధి సహాయాన్ని అందించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ. దీని పూర్తి పేరు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. అయితే ఇప్పుడు అధికారికంగా యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్'గా పిలువబడుతోంది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.

కార్తీక్ సుబ్రమణ్యంకు నేషనల్ జియోగ్రాఫిక్ 'పిక్చర్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డు

భారత సంతతికి చెందిన అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కార్తీక్ సుబ్రమణ్యం 2023 నేషనల్ జియోగ్రాఫిక్ యొక్క ' పిక్చర్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్నాడు. తన అలస్కా పర్యటనలో ఈగిల్ ప్రిజర్వ్‌లో తీసిన 'డాన్స్ ఆఫ్ ది ఈగల్స్' ఫోటో ఈ అవార్డు గెలుచుకుంది.

గిన్నిస్ రికార్డులో లడఖ్ ఫ్రోజెన్ లేక్ ఆఫ్ మారథాన్‌

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఫిబ్రవరి 20న మొదటి 'ఫ్రోజెన్ లేక్ హాఫ్ మారథాన్ నిర్వహించారు. లడఖ్‌లోని 13,862 అడుగుల ఎత్తులో ఉన్న ఘనీభవించిన పాంగోంగ్ త్సో సరస్సుపై, సున్నా ఉష్ణోగ్రతలలో విజయవంతంగా నిర్వహించిన ఈ 21-కిమీ ఆఫీషియల్ రన్నింగ్ ఈవెంట్‌, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఘనీభవించిన  హాఫ్ మారథాన్‌గా గిన్నిస్ ప్రపంచ రికార్డులో నమోదు చేయబడింది.

ది లాస్ట్ రన్ థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని లడఖ్ ఆటోనొమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మరియు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ లడఖ్ ఉమ్మడిగా నిర్వహించాయి. హిమాలయ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో పాంగోంగ్ త్సో సరస్సు ఒకటి. ఇప్పుడు ఇది భారతదేశపు మొట్టమొదటి 'ఫ్రోజెన్ లేక్ హాఫ్ మారథాన్'కు ఆతిథ్యం ఇచ్చిన సరస్సుగా ప్రసిద్ధికెక్కింది.

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల విజేతలు

సినిమా రంగంలో భారతదేశ అత్యున్నత పురస్కారాలుగా పరిగణించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 విజేతల జాబితా వెలువడింది. ఫిబ్రవరి 20న ముంబైలో జరిగిన దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ది కాశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోగా. బాలీవుడ్ జంట అలియా భట్ మరియు రణబీర్ కపూర్ ఉత్తమ నటి, మరియు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు.

  • ఉత్తమ చిత్రం - ది కాశ్మీర్ ఫైల్స్
  • ఉత్తమ దర్శకుడు: ఆర్ బాల్కీ (చుప్ రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్)
  • ఉత్తమ నటుడు: రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్రా: పార్ట్ 1)
  • ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కతియావాడియా)
  • మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి (కాంతారా)
  • చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ సహకారం: రేఖ
  • ఉత్తమ వెబ్ సిరీస్: రుద్ర -  ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్
  • విమర్శకుల ఉత్తమ నటుడు: వరుణ్ ధావన్ (భేదియా)
  • ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ - ఆర్ఆర్ఆర్
  • టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: అనుపమ
  • మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ - అనుపమ్ ఖేర్ (కాశ్మీర్ ఫైల్స్)
  • ఉత్తమ గాయని: నీతి మోహన్ (మేరీ జాన్)
  • ఉత్తమ గాయకుడు: సచేత్ టాండన్ (మయ్య మైను)

49వ అంతర్జాతీయ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్-2023

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఏడు రోజుల 49వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్-2023 ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. ఏడాదికోసారి జరిగే ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 1975లో ప్రారంభించబడింది. దీనిని మధ్యప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తుంది.

ఈ డాన్స్ కార్యక్రమంలో జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన భారతీయ శాస్త్రీయ నృత్య రూపాల ప్రదర్శిస్తారు. ఈ వేడుకలో దేశంలోని మరియు ప్రపంచంలోని ప్రసిద్ధ కళాకారులు తమ నృత్య ప్రదర్శనలను ప్రదర్శిస్తారు.

76వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల విజేతలు

76వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్థుల వేడుక 19 ఫిబ్రవరి 2023న లండన్ సౌత్‌బ్యాంక్ సెంటర్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. 2022లో ఉత్తమ జాతీయ మరియు విదేశీ చిత్రాలను సత్కరిస్తూ ఈ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రిచర్డ్ ఇ. గ్రాంట్  మరియు అలిసన్ హమ్మండ్ హోస్టులుగా వ్యవహరించారు.

  • ఉత్తమ నటుడు : ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)
  • ఉత్తమ నటి : కేట్ బ్లాంచెట్ (తార్)
  • ఉత్తమ చిత్రం : ఆల్ క్విట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
  • ఉత్తమ డైరెక్టర్ - ఎడ్వర్డ్ బెర్గెర్ (ఆల్ క్విట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్)
  • ఉత్తమ డాక్యుమెంటరీ - నవల్నీ
  • ఉత్తమ బ్రిటిష్ చిత్రం - ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ సీఎండీగా రాజేష్ రాయ్

కేంద్ర ప్రభుత్వం ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ఐటిఐ) సీఎండీగా రాజేష్ రాయ్‌ని నియమిస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది. వచ్చే ఐదేళ్ల కాలానికి ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది బెంగుళూరు కేంద్రంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, భారత ప్రభుత్వం యాజమాన్యంలో ఉంది. దీనిని 1948 లో ఏర్పాటు చేశారు.

డా. మహేంద్ర మిశ్రాకు అంతర్జాతీయ మదర్ లాంగ్వేజ్ అవార్డు

భారతీయ విద్యావేత్త మరియు ఒడిషా సామాజిక కార్యకర్త డాక్టర్ మహేంద్ర కుమార్ మిశ్రాకు అంతర్జాతీయ మదర్ లాంగ్వేజ్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఫిబ్రవరి 21న ఢాకాలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రోజున ప్రదానం చేశారు. దీనితో మహేంద్ర మిశ్రా ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడిగా నిలిచాడు.

ఈ ఏడాది ఢాకాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి షేక్ హసీనా మొత్తం నలుగురు గ్రహీతలకు రెండు జాతీయ అవార్డులు మరియు రెండు అంతర్జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. బంగ్లాదేశ్ జాతీయులు హబీబుర్ రెహమాన్ మరియు రంజిత్ సింఘాలకు జాతీయ అవార్డులు లభించగా, మహేంద్ర కుమార్ మిశ్రా మరియు కెనడాలోని వాంకోవర్‌లోని మదర్ లాంగ్వేజ్ లవర్స్ ఆఫ్ వరల్డ్ సొసైటీకి అంతర్జాతీయ అవార్డులు లభించాయి.

డాక్టర్ మిశ్రా ఒడిశాలోని అట్టడుగు భాషల భాష, సంస్కృతి మరియు విద్యపై మూడు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. అంతర్జాతీయ మదర్ లాంగ్వేజ్ అవార్డు 2021లో యునెస్కో ద్వారా స్థాపించబడింది. ఈ అవార్డును మాతృభాషల పరిరక్షణ, పునరుజ్జీవనం మరియు అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తులకు, సంస్థలకు అందిస్తారు.

కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా రాజీవ్ రఘువంశీ

కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)గా రాజీవ్ రఘువంశీ నియమితులయ్యారు. రాజీవ్ రఘువంశీ ప్రస్తుతం ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్‌లో సెక్రటరీ-కమ్-సైంటిఫిక్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి 28 నుండి నూతన డిసిజిఐగా బాధ్యతలు స్వీకరిస్తారు.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదా అనేది భారత ప్రభుత్వం యొక్క సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విభాగ అధిపతి. ఈ సంస్థ వ్యాక్సిన్‌లు మరియు  ఔషధాల యొక్క లైసెన్స్‌ల ఆమోదానికి బాధ్యత వహిస్తుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. భారతదేశంలో ఔషధాల తయారీ, అమ్మకాలు, దిగుమతి మరియు పంపిణీకి ప్రమాణాలను కూడా నిర్దేశిస్తుంది.

సంసద్ రత్న అవార్డు విజేతలు 2023

సంసద్ రత్న అవార్డుల 13వ ఎడిషన్ విజేతలు ప్రకటించబడ్డారు. సంసద్ రత్న అవార్డ్స్ 2023 కోసం లోక్‌సభ నుండి 8 మంది, రాజ్యసభ నుండి ఐదుగురు ఎంపీలు. అదనంగా రెండు డిపార్ట్‌మెంట్ సంబంధిత స్టాండింగ్ కమిటీలు (DRSC) మరియు ఇద్దరు ఇతర నాయకులు ప్రత్యేక అవార్డుల కేటగిరీ కింద నామినేట్ చేయబడ్డారు.

2022 నుండి అనుభవజ్ఞులైన నాయకులను గౌరవించేందుకు "డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్" కొత్తగా ప్రారంభించారు. ఈ ఏడాది ఈ అవార్డును సిపిఎం సీనియర్ నాయకుడు శ్రీ టీకే రంగరాజన్‌కు అందిస్తున్నారు. కింది పేర్కొన్న అన్ని అవార్డులు 25 మార్చి 2023న న్యూ ఢిల్లీలో అందించబడతాయి. సివిల్ సొసైటీ తరపున ఈ అవార్డులను అందజేస్తారు.

సంసద్ రత్న అవార్డులను అత్యుత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లను గౌరవించడం కోసం 2010లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచన మేరకు ఏర్పాటు చేశారు. ఆయనే స్వయంగా 2010లో చెన్నైలో ఈ అవార్డు ఫంక్షన్ మొదటి ఎడిషన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం సంసద్ రత్న అవార్డుల కమిటీకి శ్రీ కె. శ్రీనివాసన్ వ్యవస్థాపక చైర్మన్ మరియు శ్రీమతి ప్రియదర్శిని రాహుల్ అధ్యక్షురాలిగా ఉన్నారు.

  1.  శ్రీ బిద్యుత్ బరన్ మహతో (బీజేపీ, జార్ఖండ్).
  2. డాక్టర్ సుకాంత మజుందార్ (బీజేపీ, పశ్చిమ బెంగాల్).
  3. శ్రీ కుల్దీప్ రాయ్ శర్మ (కాంగ్రెస్, అండమాన్ నికోబార్ దీవులు).
  4. డాక్టర్ హీనా విజయకుమార్ గావిట్ (బిజెపి, మహారాష్ట్ర).
  5. శ్రీ అధిర్ రంజన్ చౌదరి (ఐఎన్‌సి, పశ్చిమ బెంగాల్).
  6. శ్రీ గోపాల్ చినయ్య శెట్టి (బిజెపి, మహారాష్ట్ర).
  7. శ్రీ సుధీర్ గుప్తా (బిజెపి, మధ్యప్రదేశ్).
  8. డాక్టర్ జాన్ బ్రిట్టాస్ (సిపిఎం, కేరళ).
  9. డాక్టర్ మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ బీహార్).
  10. ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్ (ఎన్సీపీ, మహారాష్ట్ర) .
  11. విషంభర్ ప్రసాద్ నిషాద్ (సమాజ్వాది పార్టీ, యూపీ).
  12. ఛాయా వర్మ (కాంగ్రెస్, ఛత్తీస్‌గఢ్).
  13. పార్లమెంటరీ సంబంధిత స్టాండింగ్ కమిటీలు (DRSC).
  14. ఫైనాన్స్ కమిటీ (లోక్‌సభ కమిటీ - ఛైర్మన్ - శ్రీ జయంత్ సిన్హా, బిజెపి, జార్ఖండ్)

ముంబైలోని చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ పేరు మార్పు

ముంబైలోని చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ పేరు మార్చుతూ మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం తీర్మానించింది. చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్‌ పేరు స్థానంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ చింతమన్‌రావ్ దేశ్‌ముఖ్ పేరు నివేదించింది. దేనికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే త్వరలో చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్‌, చింతమన్‌రావ్ దేశ్‌ముఖ్ స్టేషన్‌గా మారనుంది.

సీడీ దేశ్‌ముఖ్ అని పిలుచుకునే మహారాష్ట్రకు చెందిన చింతమన్ ద్వారకానాథ్ దేశ్‌ముఖ్, స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నరుగా సేవలు అందించారు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారు.

రష్యాపై యూఎన్ నాన్‌బైండింగ్ రిజల్యూషన్‌ ఆమోదం

ఉక్రెయిన్‌లో యుద్ధంను విరమించుకోవాలని కోరుతూ రష్యాకు పిలుపునిచ్చే నాన్‌బైండింగ్ తీర్మానానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి 23న ఆమోదం తెలిపింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తికావడంతో, రష్యా దండయాత్ర మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసతి ఈ బలమైన సందేశాన్ని పంపింది. తక్షణమే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

ఉక్రెయిన్ తన మిత్రదేశాలతో సంప్రదింపులు జరిపి రూపొందించిన తీర్మానం 141-7 ఓటుతో యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఆమోదించబడింది, 32 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇందులో భారతదేశం కూడా ఉంది. ఇక ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏడు దేశాలలో బెలారస్, నికరాగ్వా, రష్యా, సిరియా, ఉత్తర కొరియా, ఎరిట్రియా మరియు రష్యాతో సన్నిహిత సైనిక సంబంధాలను కలిగి ఉన్న మాలి దేశం ఉన్నాయి.

'బారిసు కన్నడ డిమ్ దిమావా' ఫెస్టివల్‌ ప్రారంభం

ఫిబ్రవరి 25 న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ' బరిసు కన్నడ డిమ్ దిమావా సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్నారు.

ప్రధానమంత్రి 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' విజన్‌కు అనుగుణంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవంకు వందలాది మంది కర్ణాటక నృత్య, సంగీతం, నాటక కళాకారులు తమ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి హాజరయ్యారు.

ప్రపంచ బ్యాంక్‌కు అధ్యక్షుడిగా అజయ్ బంగా

మాస్టర్ కార్డ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించడానికి నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. అతను గతంలో జూలై 2010 నుండి డిసెంబర్ 31, 2020 వరకు మాస్టర్ కార్డ్ కంపెనీకి ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా సేవలు అందించారు.

ప్రపంచ బ్యాంకు అనేది ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోభివృద్ధికై ధన సాయం చేసేందుకు గాను 1945 లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. ప్రస్తుతం ఇది ఇది మూలధన ప్రాజెక్టులను చేపట్టలనే ఉద్దేశంతో పేద దేశాల ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేస్తుంది. ప్రపంచ బ్యాంకులో ప్రస్తుతం 189 సభ్య దేశాలు ఉన్నాయి.

అబుదాబిలో 2023 ఐ2యూ2 బిజినెస్ ఫోరమ్

ఫిబ్రవరి 21-22 తేదీల్లో అబుదాబిలో జరిగే ఐ2యూ2 యొక్క మొదటి వైస్ మినిస్టీరియల్ సమావేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ నెలలో కాప్28కి యూఏఈ ఆతిధ్యం ఇస్తున్నందున, ఈ సమావేశాల్లో భాగస్వామ్య దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని మరియు ఇంధన సంక్షోభం, వ్యాపార పెట్టుబడులు మరియు ఆహార అభద్రత నిర్వహణతో సహా, అత్యంత ముఖ్యమైన ఆర్థిక సమస్యలపై చర్చించారు.

ఇదే వేదిక ద్వారా స్మార్ట్ వ్యవసాయానికి పెట్టుబడి మరియు మద్దతును వేగవంతం చేసే లక్ష్యంతో యూఎస్ మరియు యూఏఈ ప్రారంభించిన అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్ (AIM4C) లో ఇండియా చేరుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ జాబితాలో 42 దేశాల ప్రభుత్వాలతో పాటుగా 275 కంటే ఎక్కువ  వ్యవసాయ,క్లైమేట్ సంస్థలు ఉన్నాయి.

ఐ2యూ2 అనేది భారతదేశం, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లతో కూడిన అంతర్-ప్రభుత్వ ఆర్థిక సహకార ఫోరమ్. దీనిని అక్టోబర్ 2021లో ప్రారంభించారు. దీనిని సభ్య దేశాల మధ్య నీరు, శక్తి, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం మరియు ఆహార భద్రతలో పాటుగా పరస్పర ఉమ్మడి పెట్టుబడుల ద్వారా పరస్పర సహకారం అందించేందుకు ప్రారంభించారు.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌లో రష్యా సభ్యత్వం రద్దు

ఉక్రెయిన్ పైన యుద్ధం కారణంగా తమతో ఉన్న రష్యా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు, గ్లోబల్ యాంటీ మనీ లాండరింగ్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వెల్లడించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ భద్రత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో తమ ప్రధాన సూత్రాలకు వ్యతిరేకంగా రష్యన్ ఫెడరేషన్ యొక్క చర్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంతర్జాతీయంగా మనీలాండరింగ్ మరియు టెర్రరిజం ఫైనాన్సింగ్ నివారణకు బాధ్యత వహిస్తుంది. ఇది 200 కంటే ఎక్కువ దేశాలకు మరియు దర్యాప్తు సంస్థలకు భద్రత ప్రమాణాలను నిర్దేశిస్తుంది.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా మరియు తీవ్రవాదంతో సహా తీవ్రమైన నేరాలను పరిష్కరించడానికి అధికారులకు సహాయం చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం పారిస్ నగరంలో ఉంది. దీనిని 1989లో గ్రూప్ ఆఫ్ సెవెన్ దేశాలు ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం దీనిని అధ్యక్షుడుగా ఇండియాకు చెందిన టి రాజ కుమార్ ఉన్నారు.

జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ భారత పర్యటన

జర్మనీ ఛాన్సలర్, ఓలాఫ్ స్కోల్జ్ ఫిబ్రవరి 25-26 తేదీలలో భారతదేశంలో పర్యటించారు. ఛాన్సలర్‌గా భారతదేశంలో మొదటిసారి పర్యటించిన ఓలాఫ్ స్కోల్జ్, తన పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ముచ్చటించారు. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై చర్చలు జరిపారు. భారత్, జర్మనీలు జీ4 లో సభ్య దేశాలుగా ఉన్నాయి.

2011లో ద్వైవార్షిక ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్ (IGC) మెకానిజం ప్రారంభమైన తర్వాత జర్మనీ ఛాన్సలర్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు నాయకుల ద్విపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉగ్రవాదం మరియు వేర్పాటువాదంపై పోరాటంలో భారతదేశం మరియు జర్మనీల మధ్య క్రియాశీల సహకారం ఉందని వెల్లడించారు.

ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారానికి భద్రత మరియు రక్షణ చురుకైన మూలస్తంభమని ప్రధాన మంత్రి అన్నారు. గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్‌ని గత ఏడాది నా జర్మనీ పర్యటన సందర్భంగా ప్రకటించామని మోదీ చెప్పారు. దీని ద్వారా క్లైమేట్ యాక్షన్ మరియు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ రంగాలలో ఇరు దేశాలు సహకారాన్ని విస్తరిస్తున్నాయని ఆయన హైలైట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంకు 4 హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డులు

6వ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో ఎస్ఎస్ రాజమౌళి యొక్క ఎపిక్ పీరియడ్ డ్రామా ఆర్ఆర్ఆర్ చిత్రం నాలుగు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ స్టంట్స్, ఉత్తమ పాట (నాటు నాటు), మరియు ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలలో ఈ అవార్డులు అందుకుంది.

ఈ చిత్రం ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రముఖ అవార్డులను అందుకోగా, ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్‌ను గెలుచుకుంది.

కేరళలో రోబోటిక్ మ్యాన్‌హోల్ క్లీనర్లు ప్రారంభం

మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేయడానికి రోబోటిక్స్ టెక్నాలజీని ఉపయోగించిన దేశంలో మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఫిబ్రవరి 24న టెంపుల్ టౌన్‌లోని మురుగునీటిని శుభ్రం చేయడానికి కేరళ ప్రభుత్వం బాండికూట్ అనే మొదటి రోబోటిక్ స్కావెంజర్‌ను ప్రారంభించింది. దీనిని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ప్రారంభించారు.

Y20 ఇండియా సమ్మిట్‌కు మహారాజా సాయాజీరావు యూనివర్శిటీ ఆతిథ్యం

గుజరాత్‌లోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ వడోదరలో ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో నిర్వహించిన యూత్ 20 ఇండియా సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఈ సదస్సు 'వసుధైవ్ కుటుంబం - ఒకే భూమి-ఒక కుటుంబం-ఒక భవిష్యత్తు' అనే నినాదంతో నిర్వహించారు. ఈ సమ్మిట్‌లో 62 దేశాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పుకు కేంద్రం ఆమోదం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరును 'ఛత్రపతి శంభాజీనగర్'గా మరియు ఉస్మానాబాద్ నగరాన్ని 'ధరాశివ్'గా పేరు మార్చడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పేరు మార్పుకు సంబంధించిన తీర్మానాన్ని గత ఏడాది జులై 16వ తేదీన మహారాష్టలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఆమోదించింది.

ఔరంగాబాద్‌ను సంభాజీనగర్‌గా మరియు ఉస్మానాబాద్‌ని ధరాశివ్‌గా పేరు మార్చేందుకు గతంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే షిండే తిరుగుబాటుతో గత జూన్‌లో ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం గత కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేసి, తాజా నిర్ణయం తీసుకుంది.

Post Comment