తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 17 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 17 ఫిబ్రవరి 2024

తెలుగులో 17 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

టెస్ట్ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసిన రెండో భారతీయుడిగా అశ్విన్

రాజ్‌కోట్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. అనిల్ కుంబ్లే తర్వాత భారత్ నుంచి ఈ రికార్డు మార్కు వికెట్లు సాధించిన బౌలర్ అశ్విన్ మాత్రమే, అలానే మొత్తం అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదవ బౌలరుగా అవతరించాడు.

నవంబర్ 2011లో తన టెస్టు అరంగేట్రం చేసిన అశ్విన్, ఇప్పటి నుండి టెస్టుల్లో భారత్‌కు స్ట్రైక్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు, అశ్విన్ సాధించిన 500 టెస్ట్ వికెట్లలో 347 వికెట్లు స్వదేశంలో సాధించాడు. అశ్విన్ ఈ ఘనతను కేవలం 98 టెస్ట్ మ్యాచ్‌లలో సాధించాడు. దీనితో ముత్తయ్య మురళీధరన్ తర్వాత టెస్ట్ చరిత్రలో ఈ మైలురాయికి చేరుకున్న రెండవ అత్యంత వేగవంతమైన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు.

మిగతా ఏడుగురు బౌలర్లలో ఒక్కొక్కరు ఈ మైలురాయిని చేరుకోవడానికి 100కి పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో 34 సార్లు ఒక మ్యాచులో ఐదు వికెట్ల ఫిట్ సాధించగా, 8 సార్లు 10 వికెట్ల ఫిట్ సాధించాడు. జేమ్స్ అండర్సన్, లియాన్ మరియు అశ్విన్ మాత్రమే టెస్ట్ క్రికెట్‌లో 400 కంటే ఎక్కువ వికెట్లు సాధించిన చురుకైన బౌలర్లుగా పరిగణించబడుతారు.

ఇండియా నుండి అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (619), ఆర్. అశ్విన్ (500*), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), జహీర్ ఖాన్ (311) మరియు ఇషాంత్ శర్మ (311) లు టాప్ 6 లో ఉన్నారు.

ఆటగాడు వికెట్లు
ముత్తయ్య మురళీధరన్ 800
షేన్ వార్న్ 708
జేమ్స్ ఆండర్సన్ 695
అనిల్ కుంబ్లే 619
స్టువర్ట్ బ్రాడ్ 604
గ్లెన్ మెక్‌గ్రాత్ 563
కోర్ట్నీ వాల్ష్ 519
నాథన్ లియోన్ 517
రవిచంద్రన్ అశ్విన్ 500
డేల్ స్టెయిన్ 439

బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మహిళలు విజయం

మలేషియాలోని షా ఆలమ్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో అన్మోల్ ఖర్బ్ మరియు పివి సింధు నేతృత్వంలోని భారత మహిళల జట్టు థాయ్‌లాండ్‌పై 3-2 తేడాతో చారిత్రాత్మక  విజయం సాధించారు. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మహిళల జట్టు స్వర్ణం గెలవడం ఇదే తొలిసారి.

భారత పురుషుల జట్టు గతంలో 2016, 2020లో బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలను కైవసం చేసుకుంది, అయితే మహిళల జట్టుకు ఇది చారిత్రాత్మక విజయం. ఈ టోర్నమెంట్ అంతటా తన స్థిరమైన ప్రదర్శనతో స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన 17 ఏళ్ల అన్మోల్ ఖర్బ్ వంటి కొంతమంది యువ ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది.

ఈవెంట్‌లో పాల్గొన్న హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలతో కూడిన 10 మంది సభ్యుల భారత్ పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఇంటిముఖం పట్టింది. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌ 2024 పురుషుల టైటిల్‌ను చైనా సొంతం చేసుకుంది.

  • బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్స్ 2024 ఫిబ్రవరి 13 నుండి 18 వరకు మలేషియాలో జరిగింది.
  • బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్స్ అనేది ఆసియాలోని ఉత్తమ పురుషుల మరియు మహిళల బ్యాడ్మింటన్ జాతీయ జట్ల మధ్య నిర్వహించే ద్వైవార్షిక టోర్నమెంట్.
  • ఇది 2016 నుండి పురుషుల మరియు మహిళల జట్లకు విడివిగా నిర్వహిస్తున్నారు.
  • ఇది థామస్ మరియు ఉబెర్ కప్‌లకు అర్హత టోర్నమెంట్‌గా కూడా పనిచేస్తుంది.

స్పామ్ కాల్ బెదిరింపుల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

స్పామ్ కాల్ బెదిరింపుల పరిష్కారం కోసం రోహిత్ కుమార్ సింగ్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కొత్తగా కమిటీని ఏర్పాటు చేసింది. టెలికామ్ వినియోగదారులు స్వీకరించే ఇబ్బందికరమైన/ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్‌ల సమస్యను పరిష్కరించడానికి దీనిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ స్పామ్ కాల్‌లను అరికట్టడానికి ప్రత్యేకంగా నూతన మార్గదర్శకాలను రూపొందించనుంది.

ఈ కమిటీలో కమిటీలో టెలికాం ప్రొవైడర్లు, ట్రాయ్ రెగ్యులేటరీ బాడీలు, ఆర్థిక సంస్థలు మరియు వినియోగదారుల వ్యవహారాల విభాగాలు వంటి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ చొరవ స్పామ్ కాల్‌ల సమస్యను పరిష్కరించడానికి బహుముఖ విధానాన్ని సూచిస్తుంది. వివిధ సంబంధిత పక్షాలను చేర్చుకోవడం ద్వారా, టెలిమార్కెటింగ్ పద్ధతులను నియంత్రించడానికి మరియు వినియోగదారులకు అధికారం కల్పించడానికి ఈ కమిటీ సమగ్ర మార్గదర్శకాలను రూపొందించవచ్చు.

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అధ్యక్షతన, 14 ఫిబ్రవరి, 2024న స్పామ్ కాల్ సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
  • ఈ సమావేశం స్పామ్ కాల్‌లు వినియోగదారుల గోప్యతను మాత్రమే కాకుండా వినియోగదారుల హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నాయని అంచనా వేసింది.
  • ఇలాంటి స్పామ్ కాల్స్‌లో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ తర్వాత ఆర్థిక సేవల రంగం నుండి వస్తున్నట్లు పేర్కొంది.
  • స్పామ్ కాలర్లు ఇప్పుడు ఇంటర్నెట్ కాల్‌కు మారుతున్నారని, ముఖ్యంగా వాట్సాప్‌ని ఉపయోగించి వినియోగదారులను పోంజీ స్కీమ్‌లు, క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్‌లు మరియు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాల ద్వారా ఆకర్షిస్తున్నారని తెలిపింది.
  • రిజిస్టర్డ్ టెలిమార్కెటర్ల నుండి స్పామ్ సందేశాలు మరియు ఇబ్బందికరమైన కాల్‌లకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మరియు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు నివేదించింది.
  • ఎయిర్‌టెల్, వోడాఫోన్, జియో, బిఎస్ఎన్ఎల్ వంటి ఆపరేటర్ల పోర్టల్‌ల ద్వారా టెలిమార్కెటర్లు మరియు వ్యాపార సంస్థల యొక్క సెండర్ ఐడీలు మరియు ఎస్ఎంఎస్ టెంప్లేట్‌లను పొందాలని సూచించింది.
  • డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లలో వ్యాపారాలు తమ వ్యాపార వివరాలను అందించడం ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవలే కాలంలో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ)ని ప్రవేశపెట్టడం ద్వారా బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్ ఇండస్ట్రీ కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది వ్యాపార సంస్థలు చేసే అన్ని లావాదేవీల రికార్డును నిర్వహించే బ్లాక్-చెయిన్ ఆధారిత రిజిస్ట్రేషన్ సిస్టమ్‌గా పని చేస్తుంది. తద్వారా స్పామ్ కాల్ బెదిరింపుల నుండి వినియోగదారులకు రక్షణ కల్పిస్తుంది.

వన మిత్ర పథకాన్ని ప్రారంభించిన హర్యానా సీఎం ఖట్టర్

చెట్ల పెంపకంలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు గాను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఫిబ్రవరి 15న 'వన మిత్ర' పథకాన్ని మరియు దాని పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతాలను పెంపొందించడం, అడవుల మనుగడ రేటు పెంపుదల, అటవీయేతర ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను పెట్టుకుంది.

  • 1.80 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న కుటుంబాల సభ్యులు 'వన మిత్రలు'గా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది.
  • 18 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా వన మిత్రలుగా చేరొచ్చు.
  • ఒక్కో వన మిత్రుడు గరిష్టంగా 1,000 మొక్కలు నాటవచ్చు.
  • మొదటి ఏడాదిలో జియో-ట్యాగింగ్ మరియు పిట్ యొక్క ఫోటోను అప్‌లోడ్ చేసిన వారికి రూ.20 అందజేస్తారు.
  • జియో ట్యాగింగ్ అనంతరం నాటిన ప్రతి చెట్టుకు వన మిత్రలకు రూ.30 అందజేయనున్నారు.
  • నాటిన చెట్ల నిర్వహణ, భద్రత కోసం ఒక్కో మొక్కకు రూ.10 చొప్పున అందిస్తున్నారు.
  • రెండవ ఏడాదిలో వన మిత్రలు ప్రతి నెలా ఒక్కో ప్లాంట్‌కు రూ.8 ప్రోత్సహకం అందుకుంటారు.
  • మూడవ సంవత్సరంలో ప్రతి నెలా జీవించే మొక్కకు రూ. 5 అందుకుంటారు.

ఈ పథకం యొక్క మొదటి దశలో 7500 వన మిత్రలను ఎంపిక చేయనున్నారు. ఒక వన మిత్ర వారి గ్రామం, పట్టణం లేదా నగరంలో చెట్ల పెంపకం కోసం అటవీ రహిత భూమిని ఎంచుకోవచ్చు. నాటిన చెట్టు వన మిత్ర స్వంత భూమిలో పెరిగితే, వారు చెట్టు యజమానిగా పరిగణించబడతారు. ఈ పథకం కింద మొదటి ఏడాదిలో ఎంపికైన వన మిత్రలకు శిక్షణ ఇప్పించి వారిచే చెట్ల పెంపకం చేయిస్తారు.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం 3.4 లక్షల సాయుధ దళాల పోలీసులు కేటాయింపు

ఈ ఏడాది ఏప్రిల్ మరియు మే నెలలో నిర్వహించే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 3,400 కంపెనీల నుండి 3.40 లక్షల మంది సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని మోహస్తున్నట్లు కేంద్ర  సంఘం సూత్రపాయంగా వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలతో సహా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా మరియు సిక్కిం రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా వీరిని దశలవారీగా మోహరించేందుకు సిద్ధమౌతోంది.

వీరు ఎన్నికల సమయంలో పోలింగ్ రోజు సంబంధిత విధులు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల తరలింపు వంటి విధులతో సహా పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెంటర్‌ల రక్షణ, కౌంటింగ్ సెంటర్ సెక్యూరిటీ వంటి ఎన్నికల విధులలో పాల్గొంటారు. స్వేచ్ఛా, న్యాయమైన మరియు శాంతియుత ఎన్నికలను నిర్వహించడానికి దశలవారీగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వీరు సేవలు అందిస్తారు.

దశలవారీగా పశ్చిమ బెంగాల్‌లో గరిష్టంగా 920 కంపెనీల సాయుదళాలను, ఆ తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్‌లో 635 సాయుదళాల కంపెనీలను, ఛత్తీస్‌గఢ్‌లో 360 సాయుదళాల కంపెనీలు, బీహార్‌లో 295 కంపెనీలు, ఉత్తరప్రదేశ్‌లో 252 కంపెనీలు మరియు ఆంధ్రాలో 250 కంపెనీలను మోహరించనున్నారు.

ఈ ఎన్నికల ప్రక్రియలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ మాత్రమే కాకుండా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశాస్త్ర సీమా బాల్ మరియు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దళాలు కూడా పాల్గొంటాయి. ఈ దళాల తరలింపు మరియు నిర్వహణ కోసం రైల్వే శాఖ ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది.

ఆరు ఎయిమ్స్‌ ఆసుపత్రులను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 20 నుండి 25 మధ్య కొత్తగా నిర్మించిన ఆరు కొత్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఆసుపత్రులను జాతికి అంకితం చేశారు. కొత్తగా ప్రారంభించిన ఆరు ఎయిమ్స్ ఆసుపత్రులలో ఎయిమ్స్ విజయపూర్, ఎయిమ్స్ రాజ్‌కోట్, ఎయిమ్స్ భటిండా, ఎయిమ్స్ రాయ్ బరేలీ, ఎయిమ్స్ మంగళగిరి మరియు ఎయిమ్స్ కళ్యాణి ఉన్నాయి.

  1. ఎయిమ్స్ విజయపూర్
  2. ఎయిమ్స్ రాజ్‌కోట్
  3. ఎయిమ్స్ భటిండా
  4. ఎయిమ్స్ రాయ్ బరేలీ
  5. ఎయిమ్స్ మంగళగిరి
  6. ఎయిమ్స్ కళ్యాణి

ఫిబ్రవరి 20న జమ్మూలోని విజయ్‌పూర్‌లో నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2019లో ఈ ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆయుష్మాన్ భారత్, విక్షిత్ భారత్' లక్ష్యం కింద, ఫిబ్రవరి 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఐదు కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రధాని మోదీ అంకితం చేశారు.

  • ఎయిమ్స్‌ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్త ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం.
  • దేశంలో మొదటి ఎయిమ్స్ న్యూఢిల్లీ 1956లో స్థాపించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 24 ఇన్‌స్టిట్యూట్‌లు ప్రకటించబడ్డాయి.
  • భారతదేశంలో ప్రస్తుతం మొత్తం 19 ఎయిమ్స్ కళాశాలలు సేవలు అందిస్తున్నాయి.
  • మరో 5 ఎయిమ్స్ ఇన్‌స్టిట్యూట్‌లు 2025 చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి.
  • ప్రధాన్ మంత్రి స్వాస్త్య సురక్ష యోజన కింద ప్రస్తుతం వీటిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది.
  • ప్రధాన్ మంత్రి స్వాస్త్య సురక్ష యోజన అధికారికంగా మార్చి 2006లో ప్రారంభించబడింది.
  • ఈ పథకం మొదటి దశలో పాట్నా, భోపాల్, రాయ్‌పూర్, భువనేశ్వర్, జోధ్‌పూర్ మరియు రిషికేశ్‌లలో 6 ఎయిమ్స్ ఏర్పాటు చేశారు.
  • మార్చి 1, 2022న, పీఎం నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద మణిపూర్ రాష్ట్రానికి ఎయిమ్స్ ప్రకటించారు.
  • ఎయిమ్స్ మణిపూర్ ఈశాన్య రాష్ట్రాలలో ఏర్పాటు చేయబడ్డ మొదటి ఎయిమ్స్ ఆసుపత్రి.
  • దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే రెండు ఎయిమ్స్ ఉన్నాయి. ఇవి రాయ్‌బరేలీ మరియు గోరఖ్‌పూర్‌ యందు ఏర్పాటు చేసారు.

Advertisement

Post Comment