Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 16 అక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 16 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 16 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ ప్రోగ్రామ్‌లో 5 కొత్త క్రీడలు

ఒలింపిక్స్ క్రీడలలో కొత్తగా ఐదు క్రీడలను చేర్చేందుకు, లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ ఆమోదించింది. ఈ కొత్తగా చేరే క్రీడల జాబితాలో బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, క్రికెట్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ మరియు స్క్వాష్‌లు ఉన్నాయి.

ఈ ఐదు కీడలు లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడల ప్రోగ్రామ్‌లో అధికారికంగా చేర్చబడతాయి. ఈ విషయాన్నీ ఇటీవలే ఇండియాలో జరిగిన 141వ ఒలింపిక్ కమిటీ సెషన్ యందు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటించారు. ఫ్లాగ్ ఫుట్‌బాల్ మరియు స్క్వాష్‌లు కొత్తగా లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలలో అరంగేట్రం చేయనుండగా, బేస్ బాల్/సాఫ్ట్‌బాల్, క్రికెట్ మరియు లాక్రోస్ క్రీడలు ఇదివరకే ఒలింపిక్స్ యందు నిర్వహించబడ్డాయి.

బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ ఒలింపిక్ క్రీడల యొక్క అనేక ఎడిషన్‌లలో నిర్వహించబడ్డాయి. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ 2020లో కూడా ఈ గేమ్ జాబితా చేయబడింది. మరోవైపు శతాబ్దా కాలం తర్వాత మొదటిసారిగా ఒలింపిక్ క్రీడలలో క్రికెట్ కనిపించనుంది. చివరిగా పారిస్ 1900 ఒలింపిక్ క్రీడలలో క్రికెట్ నిర్వహించబడింది.  అలానే సెయింట్ లూయిస్ 1904 మరియు లండన్ 1908 ఒలింపిక్స్ తర్వాత లాక్రోస్‌ తిరిగి 2028 ఒలింపిక్ క్రీడలలో కనిపించనుంది.

మేఘాలయ మఖిర్ అల్లం ప్రమోట్ కోసం టర్మరిక్ ట్రినిటీ సహాయం

టర్మరిక్ ట్రినిటీ అని పిలవబడే 2021 పద్మశ్రీ విజేత ట్రినిటీ సైయో ఇప్పుడు మేఘాలయ యొక్క ప్రత్యేకమైన "మఖిర్ అల్లం" ప్రచారంపై దృష్టి సారించనున్నారు. మేఘాలయలో లకడాంగ్ పసుపు సాగును ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి గాను ఆమెకు 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందించింది. స్థానికులు ఆమెను టర్మరిక్ ట్రినిటీ అని పిలుచుకుంటురు. ట్రినిటీ అనగా క్రైస్తవ మతంలో ముగ్గురు దేవతల సమూహం అని అర్ధం.

మఖిర్ అల్లం దాని ప్రత్యేక తీక్షణత మరియు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని ములీహ్ గ్రామానికి చెందిన సైయో, కొత్త తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో మఖిర్ అల్లం సాగును ప్రోత్సహించడానికి కృషి చేయడంతో పాటుగా మఖిర్ అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెంచేందుకు కూడా నడుం బిగించారు.

మఖిర్ అల్లం సాగును వాణిజ్య స్థాయిలో ప్రోత్సహించేందుకు సైయో మేఘాలయలో రైతులతో కలిసి పని చేస్తున్నారు. మఖిర్ అల్లం కోసం కొత్త ఉత్పత్తులు మరియు మార్కెట్‌లను అభివృద్ధి చేయడానికి కూడా ఆమె కృషి చేస్తున్నారు. మఖిర్ అల్లంను గ్లోబల్ మార్కెట్‌లో ప్రీమియం ఉత్పత్తిగా స్థాపించడం ఆమె లక్ష్యాలలో ఒకటి.

సైయో ప్రయత్నాలు ఇప్పటికే ఫలిస్తున్నాయి. 2023లో మఖిర్ అల్లం సాగు మరియు ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడానికి ఆమెకు భారత ప్రభుత్వం నుండి గ్రాంట్ లభించింది. అల్లం కోసం కొత్త ఉత్పత్తులు మరియు మార్కెట్లను అభివృద్ధి చేయడానికి ఆమె ఇప్పటికే అనేక ప్రైవేట్ కంపెనీలతో కలిసి పని చేస్తున్నారు.

తెలంగాణలో దొరికిన మధ్య రాతి యుగ శిలా చిత్రాలు

హైదరాబాద్ చరిత్రకు కొత్తగా మెసోలిథిక్ రాక్ ఆర్ట్ జోడించబడింది. ఇటీవలే హైదరాబాద్ సమీపంలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఒక ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణ జరిగింది. ఇందులో మెసోలిథిక్ నుండి మెగాలిథిక్ కాలానికి చెందిన 75 కంటే ఎక్కువ రాక్ ఆర్ట్ సైట్లు ఈ ప్రాంతంలో ఉన్నట్లు కనుగొన్నారు.

మధ్యశిలాయుగం అనేది క్రీ.పూ. 10,000 నుండి 4,000 మధ్య కాలానికి చెందినది. చరిత్రకారుల ప్రకారం ప్రస్తుతం దొరికిన రాక్ పెయింటింగ్‌లు 6,000 నుండి 12,000 సంవత్సరాల నాటివని తెలుస్తుంది. ఈ కనుగొనబడిన పెయింటింగ్‌లలో తాబేళ్లు, చేపలు, పాములు మరియు రేఖాగణిత మూలాంశాన్ని వర్ణించే బొమ్మలు ఉన్నాయి. మధ్య రాతి యుగంలో ఈ ప్రాంతంలో నివసించిన వేటగాళ్లు సేకరించే మెసోలిథిక్ జంతువుల చిత్రాలగా వీటిని పేర్కొంటున్నారు.

రాక్ పెయింటింగ్స్ యొక్క ఆవిష్కరణ ఒక ప్రధాన పురావస్తు అన్వేషణ. ఎందుకంటే ఇది హైదరాబాద్‌లోని మధ్యశిలాయుగ మానవుల జీవితాల గురించి కొత్త అంతర్దృష్టులను అందిస్తుంది. గతంలో అనుకున్నదానికంటే చాలా ముందుగానే ఈ ప్రాంతంలో మానవులు నివసించారని ఈ చిత్రలేఖనాలు సూచిస్తున్నాయి. ఇది హైదరాబాద్ యొక్క ప్రారంభ చరిత్రకు కొత్త వెలుగునిస్తుంది. ఈ నగరం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం మరియు సంరక్షించడం యొక్క ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది.

క్లీన్ ఎనర్జీ కోసం జపాన్-వరల్డ్ బ్యాంకు భాగస్వామ్య కార్యక్రమం

ప్రపంచ బ్యాంక్ మరియు జపాన్‌లు అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వడం కోసం రెసిలియెంట్ అండ్ ఇంక్లూజివ్ సప్లయ్ చైన్ ఎన్‌హాన్స్‌మెంట్ (RISE) కార్యక్రమాన్ని మొరాకోలో ప్రారంభించాయి. ఈ భాగస్వామ్యం ఖనిజ మరియు ప్రపంచ స్వచ్ఛమైన ఇంధన తయారీ పరిశ్రమలలో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

క్లీన్ ఎనర్జీలో ఖనిజ పెట్టుబడులు మరియు ఉద్యోగాలను పెంచడానికి ఇరువురు కలిసి పనిచేయనున్నారు. ఈ భాగస్వామ్యం శక్తి పరివర్తన ప్రపంచ ఖనిజ విలువ గొలుసులతో పాటు పది మిలియన్ల ఉద్యోగాలతో ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను సృష్టిస్తుందని భావిస్తున్నారు.

పేదరికంపై పోరాటంలో ఉద్యోగాలను సృష్టించడం మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడం కోసం ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ఇటలీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కెనడా మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌ వంటి దేశాలతో కలిసి పనిచేస్తుంది. దేశాలు ఇప్పటికే $40 మిలియన్ల కంటే ఎక్కువ ప్రారంభ సహకారం అందించాయి. తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాల స్థిరమైన అభివృద్ధికి మరియు క్లీన్ ఎనర్జీ ఉత్పత్తుల సరఫరా గొలుసు వైవిధ్యతకు తోడ్పడటానికి జపాన్ మొత్తం $25 మిలియన్లను అందించాలని యోచిస్తోంది.

ఇటీవలే మరాకెచ్‌లో జరిగిన 2023 ప్రపంచ బ్యాంక్-ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వార్షిక సమావేశాలలో జపాన్ ఆర్థిక మంత్రి సుజుకి షునిచి మరియు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. చిలీ మరియు భారతదేశం కూడా కాబోయే దేశాల ప్రతినిధులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

వన్ సీజీఐఎఆర్ గ్లోబల్ చొరవలో భాగస్వామ్యమైన ఇక్రిశాట్

ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) అక్టోబర్ 10, 2023న వన్ సీజీఐఎఆర్ గ్లోబల్ చొరవలో చేరింది. వాతావరణ సంక్షోభం ద్వారా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ఆహారం, భూమి మరియు నీటి వ్యవస్థలను మార్చడానికి ఏకీకృత విధానాన్ని రూపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ చొరవ ఆహారం మరియు పోషకాహారం-సురక్షిత భవిష్యత్తు కోసం సైన్స్ మరియు ఆవిష్కరణలను అందిస్తుంది.

వన్ సీజీఐఎఆర్ గ్లోబల్ చొరవలో సీజీఐఎఆర్ మరియు ఇక్రిశాట్ సహా మరో 12 సీజీఐఎఆర్ పరిశోధనా కేంద్రాలు కలిసి పనిచేయనున్నాయి. ఈ భాగస్వామ్య ఒప్పందంపై ఇక్రిశాట్ గవర్నింగ్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ ప్రభు పింగళి, సీజీఐఎఆర్ సిస్టమ్ బోర్డ్ చైర్ ప్రొఫెసర్ లిండివే మాజెల్ సిబాండాలు సంతకం చేశారు.

హైదరాబాద్‌లో ఉన్న ఇక్రిశాట్ ఉష్ణమండల డ్రైల్యాండ్ వ్యవసాయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక ప్రముఖ వ్యవసాయ పరిశోధనా సంస్థ. ఇది ఐదు అత్యంత పోషకమైన కరువు-తట్టుకోగల పంటలపై పరిశోధనను నిర్వహిస్తుంది. వాటిలో చిక్‌పా మిల్లెట్, డోవ్ ప్రోసో మిల్లెట్, పెర్ల్ మిల్లెట్, జొన్న మరియు వేరుశెనగ వంటివి ఉన్నాయి.

ఇక్రిశాట్ ఆసియా మరియు ఆఫ్రికాలోని పొడి ఉష్ణమండలంలో మిలియన్ల మంది ప్రజలకు ఆహార భద్రత మరియు పోషకాహారాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వన్ సీజీఐఎఆర్ చొరవతో ఇక్రిశాట్ భాగస్వామ్యం వ్యవసాయ ఆవిష్కరణ మరియు పరివర్తనను వేగవంతం చేయడానికి ఇతర సీజీఐఎఆర్ కేంద్రాలతో మరింత సన్నిహితంగా పని చేయడానికి అనుమతిస్తుంది. మెరుగైన వ్యవసాయం ద్వారా 600 మిలియన్ల పేదలకు ఆకలి, పేదరికం మరియు క్షీణించిన వాతావరణాన్ని అధిగమించడానికి ఇక్రిశాట్ తన లక్ష్యాన్ని సాధించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

సీజీఐఎఆర్ అనగా కన్సార్టియం ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్ అని అర్ధం. ఇది ఆహార సురక్షిత భవిష్యత్తు కోసం పరిశోధనలో నిమగ్నమైన సంస్థలను ఏకం చేసే ప్రపంచ భాగస్వామ్యం. సీజీఐఎఆర్ అనే పేరు కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క ఎక్రోనిం నుండి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచ వ్యవసాయ ఆవిష్కరణ నెట్‌వర్క్. దీనిని 1971లో ఏర్పాటు చేసారు.

తమిళనాడులో నీలగిరి తహర్ ప్రాజెక్ట్ ప్రారంభం

తమ రాష్ట్ర జంతువును సంరక్షించేందుకు తమిళనాడు ప్రభుత్వం నీలగిరి తహర్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతరించిపోతున్న ఈ జాతుల గురించి అవగాహన కల్పించడం మరియు వాటి రక్షణ కోసం చర్యలు చేపట్టడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీనిని అక్టోబర్ 12, 2023న చెన్నైలోని సెక్రటేరియట్ ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం తమిళనాడు ప్రభుత్వం 25 కోట్ల బడ్జెట్ కేటాయించింది.

నీలగిరి తహర్ అనేది భారతదేశంలోని పశ్చిమ కనుమలలో మాత్రమే కనిపించే జంతువు. ఇది తమిళనాడు రాష్ట్ర జంతువు. ఇది ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉంది. ఆవాసాల నష్టం, వేటాడటం మరియు వ్యాధుల కారణంగా నీలగిరి తహర్ జనాభా ఇటీవలి సంవత్సరాలలో బాగా కుదించుకుపోయింది.

ప్రాజెక్ట్ నీలగిరి తహర్ అనేది ఈ ముఖ్యమైన జాతులను మరియు దాని నివాసాలను పరిరక్షించడంలో సహాయపడే ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ నీలగిరిలో పర్యావరణ పర్యాటకాన్ని పెంపొందిస్తుందని మరియు స్థానిక కమ్యూనిటీలకు ప్రయోజనాలను అందించాలని కూడా భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ నీలగిరి తహర్ పరిరక్షణపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఇది ఆ జాతుల నివాసాలను రక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి, వేటాడటం మరియు ఇతర బెదిరింపులను తగ్గించడానికి మరియు నీలగిరి తహర్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి సహాయపడుతుంది.

గోవాలోని జీడిపప్పు పరిశ్రమకు జీఐ ట్యాగ్

గోవా జీడిపప్పు (కెర్నల్)కి భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ లభించింది. ఇది గోవాలో జీడిపప్పు పరిశ్రమకు ఒక ముఖ్యమైన విజయం, ఎందుకంటే ఇది గోవా జీడిపప్పు యొక్క కీర్తి మరియు నాణ్యతను కాపాడటానికి సహాయపడుతుంది. ఇది గోవా జీడిపప్పుకు డిమాండ్‌ను పెంచడానికి మరియు పరిశ్రమలో కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుంది.

గోవా జీడిపప్పు పెద్ద పరిమాణం, క్రీము ఆకృతి మరియు తీపి రుచికి ప్రసిద్ధి చెందింది. అవి విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం. గోవా జీడిపప్పు సాగు 16వ శతాబ్దం నాటిది, పోర్చుగీస్ వారు గోవాలో జీడిపప్పును ప్రవేశపెట్టారు. గోవా యొక్క నిర్దిష్ట నేల మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతంలో ఇది పరిశ్రమగా వృద్ధి చెందింది.

ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుండి ఉత్పన్నమయ్యే ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ ఇవ్వబడుతుంది.  చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ద్వారా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జిఐ) ఆఫ్ గూడ్స్ యాక్ట్, 1999 కింద ఈ జిఐ ట్యాగ్‌ మంజూరు చేయబడుతుంది. ఈ గుర్తింపు సదురు ఉత్పత్తికి స్థానిక గుర్తింపుతో పాటుగా, గ్లోబల్ మార్కెటింగ్ అవకాశాలకు తలుపులు తెరుస్తుంది.

వైజాగ్‌లో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో 35 కోట్లతో నిర్మించిన ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను అక్టోబర్ 16న ప్రారంభించారు. మధురవాడ ఐటీ హిల్ నంబర్ 2లో ప్రారంభించిన ఈ కేంద్రం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ యూనిట్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్ వర్క్‌ప్లేస్‌గా రూపొందించబడింది. దాదాపు 1000 మంది ఉద్యోగులు అక్కడ నుండి పని చేసేందుకు అవకాశం ఉంటుంది

ఈ కార్యాలయాన్ని గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. ఇది విశాలమైన ఆడియో మరియు వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, ఆధునిక ఫలహారశాల మరియు విస్తారమైన పార్కింగ్ సౌకర్యాలు వంటి అత్యాధునిక సౌకర్యాలతో అమర్చబడి ఉంది.

ఇదే పర్యటనలో ఆయన పరవాడ ఫార్మసిటీలో 300 కోట్లతో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్‌ యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా దాదాపు 800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. అలానే అచ్యుతాపురంలో నిర్మించిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ (ఏపీఐ) ఉత్పత్తి యూనిట్‌ను కూడా సీఎం ప్రారంభించారు.

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం

జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా యూపీఎస్సీ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రభుత్వం ₹1 లక్ష నుండి ₹1.50 లక్షల ప్రోత్సాహకాలను అందజేయాలని భావిస్తుంది. స్థానిక సివిల్ సర్వీసెస్ ఔత్సాహికులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించనుంది.

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులను ప్రోత్సహించేందుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కొత్త పథకాన్ని ప్రకటించారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కోసం జీఓఎంఎస్ 58ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి విడుదల చేశారు. ప్రతి ఏడాది ఏపీ నుండి సుమారు 40 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఎంపికవుతున్నట్లు  ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉండి, యూపీఎస్సీ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈ పథకం అమలు చేస్తారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అర్హులు. ఈ పథకం సివిల్స్ ఆశావహులు తమ చదువులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. అలానే ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎక్కువ మంది యువకులను సివిల్ సర్వీసెస్‌లో వృత్తి వైపు ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది.

Post Comment