Advertisement
Latest Current affairs in Telugu : 9 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Latest Current affairs in Telugu : 9 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Latest Current affairs in Telugu 9 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

కోజికోడ్ జిల్లాలో సుచిత్వ తీరం ప్రాజెక్ట్ ప్రారంభం

కేరళలోని కోజికోడ్ జిల్లా పరిపాలన విభాగం సుచిత్వ తీరం (క్లీన్ కోస్ట్) అనే నూతన ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ఆ జిల్లా పరిధిలోని 42 కి.మీ పొడవైన తీరప్రాంత పరిశుభ్రతను కాపాడే దిశగా తీరప్రాంతంలో పర్యావరణ సమతుల్యతను కాపాడడం మరియు పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా ప్లాస్టిక్ ఫ్రీ సముద్ర తీరాలను తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది.

ఈ ప్రాజెక్ట్ 'మాలిన్య ముక్త నవకేరళం' కార్యక్రమంలో భాగం. దీనిని స్థానిక పరిపాలన విభాగం పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా డిసెంబరు 9న జిల్లాలో పరిధిలోని 12 తీరప్రాంత ప్రాంతాలలో పెద్దఎత్తున స్వచ్ఛ ప్రచారం నిర్వహించారు. కోజికోడ్‌లోని భట్ రోడ్ బీచ్‌లో జిల్లా కలెక్టర్ స్నేహిల్ కుమార్ సింగ్, సబ్ కలెక్టర్ వి.చెల్సాసిని, స్థానిక పరిపాలన జాయింట్ డైరెక్టర్ పిఎస్ షినో అందరూ క్లీనప్ ప్రయత్నాల్లో పాల్గొన్నారు.

క్యూఎస్ భారతీయ ర్యాంకింగులో ఢిల్లీ యూనివర్సిటీ టాప్

2024 క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్‌లో 56 భారతీయ విశ్వవిద్యాలయాలలో ఢిల్లీ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది. గ్లోబల్ టాప్ 300లో ఉన్న ఏకైక భారతీయ విద్యా సంస్థగా కూడా నిలిచింది. ఈ జాబితాలో ఢిల్లీ యూనివర్సిటీ 220వ స్థానంలో నిలిచింది. కాగా భారతదేశం నుండి బాంబే ఐఐటీ (303), మద్రాస్ ఐఐటీ (344), ఖరగ్‌పూర్ ఐఐటీ (349) మరియు రూర్కీ (387)ఐఐటీలు టాప్ 400లో చోటు దక్కించుకున్నాయి.

ఎన్విరాన్‌మెంటల్ సస్టైనబిలిటీ ఇండికేటర్‌లో నాలుగు భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని టాప్ 100లో చోటు సంపాదించాయి. వీటిలో వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి) ప్రపంచవ్యాప్తంగా 49వ స్థానంలో నిలిచింది. అలానే క్యూఎస్ యూనివర్సిటీ సమానత్వ సూచికలో మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గ్లోబల్ ర్యాంకింగులో 463వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని టాప్ 500లో ఉన్న ఏకైక భారతీయ సంస్థ ఇది మాత్రమే.

2024 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 95 దేశాల్లోని 1,397 సంస్థలకు సంభందించి విడుదల చేసింది. టొరంటో విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన విశ్వవిద్యాలయంగా పేరుపొందింది. రెండవ స్థానంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, మూడవ స్థానంలో మాంచెస్టర్ విశ్వవిద్యాలయం ఉన్నాయి. టాప్ 10 క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీలు.

  1. టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా)
  2. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (యూఎస్)
  3. మాంచెస్టర్ విశ్వవిద్యాలయం (యూకే)
  4. బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం (కెనడా)
  5. ఆక్లాండ్ విశ్వవిద్యాలయం (న్యూజిలాండ్)
  6. ఇంపీరియల్ కాలేజ్ లండన్ (యూకే)
  7. సిడ్నీ విశ్వవిద్యాలయం (ఆస్ట్రేలియా)
  8. లండ్ విశ్వవిద్యాలయం (స్వీడన్)
  9. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం (ఆస్ట్రేలియా)
  10. వెస్ట్రన్ యూనివర్సిటీ (కెనడా)

ఆగ్నేయాసియా ప్రాంతంలో ఇండియాలోనే 66% మలేరియా కేసులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం 2022లో సౌత్ - ఈస్ట్ ఆసియా ప్రాంతంలో మొత్తం మలేరియా కేసుల్లో 66 % భారత్‌లోనే నమోదయినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ మలేరియా కేసులు నమోదవ్వగా ఆగ్నేయాసియా ప్రాంతంలో 66 శాతం ఘటనలు భారత్‌లోనే ఉన్నట్లు నివేదించింది. అలానే ఈ ఏడాది ఈ ప్రాంతంలో జరిగిన మొత్తం మలేరియా మరణాలలో 94% భారతదేశం మరియు ఇండోనేషియాలో సంభవించాయని ఈ నివేదిక పేర్కొంది.

ఈ ప్రాంతంలోని దాదాపు 46% మలేరియా కేసులకు ప్లాస్మోడియం వైవాక్స్ కారణమైతే, 54% కేసులకు ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ కారణమైనట్లు నివేదించింది. అయితే ఈ నివేదిక ఆఫ్రికన్ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా 94% కేసులు నమోదు కాబడినట్లు నివేదించగా, తొమ్మిది దేశాలతో కూడిన ఆగ్నేయాసియా ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా 2% మలేరియా కేసులు మాత్రమే నమోదు అయినట్లు తెలిపింది.

డాక్టర్ హేమచంద్రన్ రవికుమార్‌కు కర్మవీర్ చక్ర పతకం

భారతీయ శాస్త్రవేత్త డా . హేమచంద్రన్ రవికుమార్‌కు కర్మవీర్ చక్ర మెడల్ మరియు రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ అనే రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఆయన చేసిన అత్యుత్తమ శాస్త్రీయ సహకారాలకు గ్లోబల్ గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దళిత రైతు నారాయణప్పకు వినూత్న వ్యవసాయం కోసం ఈ కర్మవీర చక్ర అవార్డు అందజేశారు.

కర్మవీర్ చక్ర అవార్డు అనేది అంతర్జాతీయ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవో, ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో అందించే పౌర గౌరవం. ఈ అవార్డును భారత 11వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జ్ణాపకారం అందజేస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ మధ్యలో ఈ అవార్డును అందజేస్తారు. భారతదేశ శ్వేత విప్లవ పితామహుడిగా పేరుగాంచిన వర్గీస్ కురియన్ కర్మవీర్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తిగా నిలిచారు.

ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపు పరిమితి పెంపు

ఆసుపత్రులు మరియు విద్యా సంస్థల చెల్లింపు కోసం యూపీఐ లావాదేవీ పరిమితిని 1 లక్ష నుండి 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించింది. అలానే రికరింగ్ చెల్లింపుల కోసం ఇ-మాండేట్ పరిమితిని కూడా ఆర్‌బిఐ లక్ష రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా రంగాలలో డిజిటల్ చెల్లింపులను పెంచుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు వినియోగదారులు ఖరీదైన చికిత్సలు మరియు ట్యూషన్ ఫీజుల కోసం సులభంగా యూపీఐ చెల్లింపులు జరపవచ్చు.

రెగ్యులేటర్ మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్, బీమా ప్రీమియం మరియు కార్డ్ బిల్లుల చెల్లింపుల పునరావృతమయ్యే డిజిటల్ చెల్లింపుల పరిమితిని 15,000 నుండి 1 లక్ష వరకు పెంచాలని నిర్ణయించింది. అంటే మీరు ఇప్పుడు యూపీఐ ద్వారా 1 లక్ష వరకు యుటిలిటీ బిల్లులు లేదా సబ్‌స్క్రిప్షన్ సేవల వంటి వాటికి పునరావృత చెల్లింపులను సెటప్ చేసుకోవచ్చు. ఈ కొత్త పరిమితి డిసెంబర్ 9, 2023 నుండి అమలులోకి వచ్చింది.

604 బిలియన్ డాలర్ల మార్కు చేరుకున్న భారతదేశ ఫారెక్స్ నిల్వలు

భారతదేశ విదేశీ మారక నిల్వలు డిసెంబర్ 1 నాటికి $604 బిలియన్లకు చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ $600 బిలియన్ల మార్కును అధిగమించినట్లు పేర్కొన్నారు. దేశంలోకి పెరిగిన ఎఫ్‌డిఐ ప్రవాహాలు, ఐటీ, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో ఎగుమతి ఆదాయాలు పెరగడం కూడా ఈ పెరుగుదలకు దోహదపడినట్లు తెలుస్తుంది.

బలమైన ఫారెక్స్ నిల్వలు భారతీయ ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సూచిస్తాయి, ఇది మరింత పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఈ నిల్వలు మొత్తం స్థూల ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తాయి మరియు ప్రభుత్వానికి దాని కరెన్సీ మరియు బాహ్య రుణ నిర్వహణలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తాయి.

విదేశీ మారక నిల్వలు అనేవి విదేశీ కరెన్సీల రూపంలో సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్‌లో ఉంచబడిన ఆస్తులు. ఈ ఆస్తులు బ్యాంకు నోట్లు, బాండ్లు, ట్రెజరీ బిల్లులు లేదా బంగారం రూపంలో ఉండవచ్చు. ఇవి ఒక దేశానికి అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి ఉపయోగపడతాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదిక ప్రకారం యూఎస్ డాలర్ మారకపు రేటు ఆధారంగా చైనా, జపాన్, స్విట్జర్లాండ్, ఇండియా మరియు రష్యా దేశాలు టాప్ 5 విదేశీ నిల్వలు ఉన్న దేశాలుగా ఉన్నాయి.

క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో ఇండియాకు 7వ ర్యాంక్‌కు

2023 క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (సీసీపిఐ)లో భారతదేశం 7వ స్థానంలో ఉంది, ఇది 2014లో దాని మునుపటి 31వ ర్యాంక్ నుండి గణనీయమైన మెరుగుదలని సూచిస్తుంది. దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ క్లైమేట్ కాన్ఫరెన్స్ (కాప్-28) సందర్భంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశం వరుసగా ఐదవ సంవత్సరం కూడా టాప్ 10 స్థానాలలో నిలిచింది. ఈ ఇండెక్స్‌లో మొదటి మూడు స్థానాలను ఏ దేశానికి కేటాయించబడనప్పటికీ డెన్మార్క్ ఈ ఇండెక్స్‌లో ముందుంది, తర్వాత స్వీడన్ మరియు చిలీ దేశాలు ఉన్నాయి. అలానే చివరి మూడు స్థానాలలో ఇరాన్ , సౌదీ అరేబియా మరియు కజకిస్తాన్ దేశాలు ఉన్నాయి.

గ్లోబల్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 90 శాతానికి పైగా కవర్ చేస్తూ 63 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ వాతావరణ ఉపశమన ప్రయత్నాలను ఈ ఇండెక్స్ అంచనా వేసింది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు, ఇంధన వినియోగం, వాతావరణ విధానం మరియు పునరుత్పాదక శక్తి వంటి అంశాలలో సీసీపిఐ దేశాలను అంచనా వేసింది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు మరియు ఇంధన వినియోగ విభాగాల్లో భారతదేశం అధిక మార్కులను సంపాదించింది. ఈ ర్యాంకింగులో అతిపెద్ద కాలుష్యకారకమైన చైనా 51వ స్థానంలో ఉండగా, రెండవ అతిపెద్ద ఉద్గారిణి అయిన యూఎస్ 57వ స్థానంలో నిలిచింది.

ఈ  క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ మొదటిసారిగా 2005లో ప్రచురించబడింది. నాటి నుండి ఏటా యూఎన్ వాతావరణ మార్పు సదస్సులో తాజా డేటాను ప్రదర్శిస్తుంది. ఈ ఇండెక్స్ జర్మన్ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ జర్మన్‌వాచ్ న్యూ క్లైమేట్ ఇన్‌స్టిట్యూట్ రూపొందిస్తుంది. దీనికి క్లైమేట్ యాక్షన్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ సహకారం అందిస్తుంది. అలానే బార్తెల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందిస్తుంది.

విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 10 నుండి 12 మధ్య నిర్వహించింది. ఈ మూడు రోజుల శాస్త్రీయ సంగీత మహోత్సవాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి వి విద్యావతి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా ఈ గ్రాండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ మూడు రోజుల శాస్త్రీయ సంగీత మహోత్సవం దేశంలోని ప్రఖ్యాత సంగీతకారుల శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు మరియు ప్రాంతీయ వంటకాలు, స్థానిక హస్తకళలు మరియు చేనేత వస్త్రాల ప్రదర్శన వంటి అనేక రకాల కార్యకలాపాలకు వేదిక అయ్యింది.

Post Comment