తెలుగులో 19 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహులకు ఇవి ఉపయోగపడతాయి.
77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులు
77వ బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం 18 ఫిబ్రవరి 2024 న లండన్ సౌత్‌బ్యాంక్ సెంటర్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో నిర్వహించబడింది. బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులను సాధారణంగా బాఫ్టా ఫిల్మ్ అవార్డులు అని పిలుస్తారు. ఈ అవార్డులు మునపటి ఏడాది విడుదలైన ఉత్తమ బ్రిటిష్ మరియు విదేశీ చిత్రాలను సత్కరిస్తూ ఇవ్వబడతాయి.
ఈ ఏడాది బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఒపెన్‌హైమర్ చిత్రం అత్యధికంగా పదమూడు నామినేషన్‌లను అందుకోగా, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడుతో సహా ఏడు కేటగిర్లలో అత్యధికంగా 7 అవార్డులు అందుకుంది. అలానే బ్రిటీష్ చిత్రాలు పూర్ థింగ్స్ మరియు ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఈ ఏడాది బహుళ అవార్డులను గెలుచుకున్నాయి.
లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి భారతీయ నటి దీపికా పదుకొణె కూడా హాజరయ్యారు. దీపికా ఒక అవార్డును అందించడానికి కనిపించినప్పుడు భారతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. బాఫ్టా అవార్డ్స్ నైట్‌లో దీపికా పదుకొణె సబ్యసాచి చీరలో మెరిచారు.
అవార్డు కేటగిరి | అవార్డు గ్రహీత |
---|---|
ఉత్తమ చిత్రం | ఒపెన్‌హైమర్ |
ఉత్తమ దర్శకుడు | క్రిస్టోఫర్ ఎడ్వర్డ్ నోలన్ (ఒపెన్‌హైమర్) |
ఉత్తమ నటుడు | సిలియన్ మర్ఫీ (ఒపెన్‌హైమర్) |
ఉత్తమ నటి | ఎమిలీ జీన్ (పూర్ థింగ్స్) |
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే | అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ (జస్టిన్ ట్రైట్) |
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే | అమెరికన్ ఫిక్షన్ (కార్డ్ జెఫెర్సన్) |
ఉత్తమ యానిమేషన్ చిత్రం | ది బాయ్ అండ్ ది హెరాన్ |
ఉత్తమ డాక్యుమెంటరీ | 20 డేస్ ఇన్ మారియుపోల్ |
ఉత్తమ చిత్రం (విదేశీ భాష) | ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ |
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ | లుడ్విగ్ గోరాన్సన్ (ఒపెన్‌హీమర్) |
బెస్ట్ బ్రిటిష్ సినిమా | ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ |
బెస్ట్ బ్రిటిష్ షార్ట్ ఫిల్మ్ | జెల్లీ ఫిష్ అండ్ క్రాబ్స్ |
బాప్టా రైజింగ్ స్టార్ అవార్డు | మియా మెక్కెన్నా(బ్రూస్) |
బ్రిటీష్ రచయిత & దర్శకుడు | ఎర్త్ మామా (సవనా లీఫ్) |
ఉత్తమ మేకప్ & హెయిర్ | షోనా హీత్, జేమ్స్ ప్రైస్ & జ్సుజ్సా మిహాలెక్ (పూర్ థింగ్స్) |
ప్రపంచ మొట్టమొదటి వుడ్ శాటిలైట్ ప్రయోగించనున్న జపాన్
నాసా మరియు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీలు ఉమ్మడిగా ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహమైన లిగ్నోశాట్ ప్రోబ్‌ను ప్రయోగించడానికి సిద్దమౌతున్నాయి. మాగ్నోలియా కలపతో తయారు చేయబడిన ఈ లిగ్నోశాట్ ఉపగ్రహం, సుమారు కాఫీ మగ్-సైజులో ఉంటుంది. ఈ ఏడాది వేసవి నాటికి దీనిని భూమి యొక్క కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ఈ రెండు అంతరిక్ష ఏజెన్సీలు సిద్దమౌతున్నాయి.
ఈ సంచలనాత్మక చొరవ అంతరిక్ష శిధిలాల యొక్క పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడంతో పాటుగా భూకక్ష్యలో మరింత స్థిరమైన అంతరిక్ష భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పర్యావరణ అనుకూల అంతరిక్ష అన్వేషణలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
ప్రస్తుతం అల్యూమినియంతో నిర్మిస్తున్న సాంప్రదాయ ఉపగ్రహాలు భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు హానికరమైన వ్యర్ధాలను విడుదల చేస్తున్నాయి. ఇవి సున్నితమైన ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. అయితే వుడ్‌తో రూపొందించే లిగ్నోశాట్, రీ-ఎంట్రీ సమయంలో పూర్తిగా కాలిపోతుంది, ఇది ఎటువంటి హానికరమైన జాడను వదిలివేయదు.
విస్తృతమైన పరిశోధన తర్వాత మాగ్నోలియా కలప లిగ్నోశాట్‌కు అనువైన పదార్థంగా భావించబడింది. క్యోటో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కలప నమూనాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ప్రయోగాలు చేశారు, ఇక్కడ మాగ్నోలియా తక్కువ-భూమి కక్ష్య యొక్క కఠినమైన శూన్యంలో అసాధారణమైన పనితనం మరియు స్థితిస్థాపకతను ప్రదర్శించింది.
- ఇది దాని పర్యావరణ ప్రయోజనాలకు మించి అద్భుతమైన ఫలితాలను ప్రదర్శించింది.
- లిగ్నోశాట్ స్పేస్ జంక్ సమస్యను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
- ఇది విద్యుదయస్కాంత తరంగాలను సులభంగా చెక్క గుండా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుంది.
- ఇది ఇతర ఉపగ్రహ నిర్మాణంలో పరికరాలను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది.
- ఇది తన పరికరాలు విడిపోయి శిధిలాలుగా మారే ప్రమాదాన్ని తొలగిస్తుంది.
- పరిశుభ్రమైన మరియు సురక్షితమైన అంతరిక్ష వాతావరణానికి దోహదం చేస్తుంది.
గుల్జార్, సంస్కృత పండితుడు రాంభద్రాచార్యలకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రధానం
ప్రఖ్యాత ఉర్దూ కవి గుల్జార్ మరియు సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యలు 58వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలుగా ఎంపికయ్యారు. భారతీయ సాహిత్యానికి సంబంధించి ఇరువురు చేసిన కృషికి గాను 2023 ఏడాదికి సంబంధించి ఈ అవార్డు ప్రధానం చేయబడింది.
గుల్జార్ : గుల్జార్‌గా ప్రసిద్ధి చెందిన సంపూరణ్ సింగ్ కల్రా హిందీ సినిమాల్లో ప్రముఖ స్క్రీన్ రచియితగా పేరు పొందారు. గుల్జార్ ఈ యుగంలోని అత్యుత్తమ ఉర్దూ కవులలో ఒకరిగా పరిగణించబడ్డారు. గుల్జార్ 2002లో ఉర్దూ భాషలో సాహిత్య అకాడమీ అవార్డును, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2004లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
వీటిలో పాటుగా అతని సినిమా రచనలకు కనీసం ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా అందుకున్నారు. 2009లో ఆస్కార్ అవార్డును మరియు 2010లో గ్రామీ అవార్డును అందుకున్న "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రంలోని "జై హో" పాటను రాసింది ఈయనే.
రంభద్రాచార్య : రంభద్రాచార్య చిత్రకూట్‌లోని తులసీ పీఠం వ్యవస్థాపకుడు మరియు అధిపతిగా ప్రసిద్ధి. రామానంద శాఖకు చెందిన నలుగురు జగద్గురు రామానందాచార్యులలో రామభద్రాచార్య ఒకరు. ఈయన 1982 నుండి ఈ పదవిలో ఉన్నారు. ఈయన ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మిక నాయకుడుగా మరియు విద్యావేత్తగా గుర్తింపు పొందారు. రంభద్రాచార్య నాలుగు భారతీయ ఇతిహాసాలతో సహా 240 కంటే ఎక్కువ పుస్తకాలు మరియు గ్రంథాలు రచించారు.
రంభద్రాచార్య 22 భాషలు మాట్లాడగలిగే బహుభాషావేత్త, ఈయన సంస్కృతం, హిందీ, అవధి మరియు మైథిలీతో సహా అనేక భారతీయ భాషలలో రచనలు చేసి ఉన్నారు. ఈయన 2015లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.
జ్ఞానపీఠ్ అవార్డు భారతీయ సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలకుగానూ ప్రతి సంవత్సరం దేశంలోనే అత్యున్నత సాహిత్య గౌరవంగా అందించబడుతుంది. ఈ అవార్డు 1944లో ఏర్పాటు చేయబడింది. సంస్కృత భాషకు ఈ అవార్డును అందజేయడం ఇది రెండోసారి కాగా ఉర్దూ భాషకు ఐదోసారి.
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతకు రూ. 21 లక్షల ప్రైజ్ మనీ, వాగ్దేవి విగ్రహం మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభా రాయ్ అధ్యక్షతన జరిగిన సెలక్షన్ కమిటీ ఈ అవార్డు గ్రహీతలను నిర్ణయించింది. గత ఏడాది గోవా రచయిత దామోదర్ మౌజో 2022కి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.
అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క కొత్త అధ్యక్షుడిగా నవాఫ్ సలామ్
లెబనీస్ న్యాయమూర్తి నవాఫ్ సలామ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) కొత్త అధ్యక్షుడిగా ఫిబ్రవరి 06న ఎన్నికయ్యారు. వచ్చే మూడు సంవత్సరాల కాలానికి ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నవాఫ్ సలామ్ గతంలో జూలై 2007 నుండి డిసెంబర్ 2017 వరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో లెబనాన్ రాయబారి మరియు శాశ్వత ప్రతినిధిగా సేవలు అందించారు.
అలానే ఇజ్రాయెల్‌పై మారణహోమం కేసులో దక్షిణాఫ్రికా కోరిన అన్ని చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఉగాండా న్యాయమూర్తి జూలియా సెబుటిండే ఇదే పదవీకాలానికి ఐసీజే ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందన్న దక్షిణాఫ్రికా వాదనను యూఎన్ కోర్టు గత నెలలో తన తాత్కాలిక తీర్పులో ఆమోదయోగ్యమైనదిగా గుర్తించింది.
- అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన న్యాయవ్యవస్థ.
- ఐసీజే జూన్ 1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ద్వారా స్థాపించబడింది.
- ఏప్రిల్ 1946లో తన కార్యకలాపాలను ప్రారంభించింది.
- యూఎన్ జనరల్ అసెంబ్లీ మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా తొమ్మిదేళ్ల కాలానికి ఎన్నుకోబడిన 15 మంది న్యాయమూర్తులతో ఐసీజే పనిచేస్తుంది.
- ఐసీజేను ప్రపంచ న్యాయస్థానం అని కూడా పిలుస్తారు.
- ఇది దేశాల మధ్య సాధారణ వివాదాలను పరిష్కరించే ఏకైక అంతర్జాతీయ న్యాయస్థానం.
- ఇది అంతర్జాతీయ న్యాయ సమస్యలపై సలహా అభిప్రాయాలను కూడా అందిస్తుంది
- . ఐసీజే ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు ప్రధాన శాఖలలో ఒకటి.
- అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది.
సిక్కిం ఇన్‌స్పైర్స్ ప్రాజెక్టు కోసం $100 మిలియన్ల సహాయం ప్రకటించిన వరల్డ్ బ్యాంకు
ప్రపంచ బ్యాంకు సిక్కిం ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ప్రొవిజన్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ రివైవింగ్ ఎకానమీస్ (ఇన్‌స్పైర్స్) ప్రాజెక్టు కోసం 100 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించింది. ఈ ప్రాంతంలోని 300,500 మంది మహిళలు మరియు యువతకు శిక్షణ, నైపుణ్యం మరియు ఉద్యోగాలు కల్పించేందుకు సిక్కిం రాష్ట్ర ప్రయత్నాలకు మద్దతుగా ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ఆమోదించింది.
ఇన్‌స్పైర్స్ అనేది ఎంప్లాయ్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేసే ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఇది ప్రైవేట్ రంగ సంస్థలు, కేంద్ర ఏజెన్సీలు మరియు వ్యాపార సంఘాలతో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మహిళలు, యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధిని కల్పిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెడుతుంది. సిక్కింలోని మహిళలు మరియు యువత ప్రాధాన్యతా రంగాలలో చేరడానికి మరియు రాష్ట్ర మరియు దేశం యొక్క అభివృద్ధి కథలో భాగం కావడానికి ఉన్న అడ్డంకులను తొలగించడం దీని లక్ష్యం.
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో 40 శాతం మంది యువత వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా, మిగిలిన వారికి తయారీ మరియు సేవలు వంటి వ్యవసాయేతర రంగాలలో నైపుణ్యం కల్పించాలని సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సిక్కిం యువతలో దాదాపు 70 శాతం మంది పునరుత్పాదక శక్తి మరియు ఐటీ వంటి రంగాలలో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నారని, వారికి సాంకేతిక మరియు ప్రాథమిక నైపుణ్యాలు అవసరమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు ఈ చొరవ సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్డి) నుండి ఈ $100 మిలియన్ల రుణం అందించబడుతుంది. ఈ రుణం ఐదున్నర సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌తో 14 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంటుంది.
అత్యంత ప్రజాదరణ సీఎంల జాబితాలో నవీన్ పట్నాయక్‌కు అగ్రస్థానం
దేశంలోని అత్యంత ప్రజాదరణ సీఎంల జాబితాలో నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. ప్రముఖ మీడియా సంస్థ ఎఎన్ఐ నివేదిక ప్రకారం నవీన్ పట్నాయక్ 52.7 శాతం ప్రజాదరణ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలవగా, ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 51.3 శాతం పాపులారిటీ రేటింగ్‌తో రెండో స్థానంలో, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ 48.6 శాతం పాపులారిటీతో మూడో స్థానంలో నిలిచారు.
ఈ సర్వే దేశంలోని ముఖ్యమంత్రుల ప్రజాదరణ మరియు ఆమోదయోగ్యతను అంచనా వేయడానికి నిర్వహించబడింది. ఈ ర్యాంకింగులో నవీన్ పట్నాయక్ వరుసగా ఏడవసారి అగ్రస్థానంలో నిలిచారు. నవీన్ ఒడిశాకు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. ఆయన గత రెండు దశాబ్దాలుగా ఈ పదవిలో ఉన్నారు. పవన్ చామ్లింగ్ తర్వాత దేశంలో ముఖ్యమంత్రిగా వరుసగా ఐదుసార్లు గెలిచిన రెండవ భారత ముఖ్యమంత్రిగా నవీన్ రికార్డు నమోదు చేశారు.
- నవీన్ పట్నాయక్ (ఒడిశా) : 52.7 శాతం పాపులారిటీ
- యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్) : 51.3 శాతం పాపులారిటీ
- హిమంత బిస్వా శర్మ (అస్సాం) : 48.6 శాతం పాపులారిటీ
- భూపేంద్ర పటేల్ (గుజరాత్) : 42.6 శాతం పాపులారిటీ
- మాణిక్ సాహా (త్రిపుర) : 41.4 శాతం పాపులారిటీ
- ప్రమోద్ సావంత్ (గోవా) : 41.1 శాతం పాపులారిటీ
- పుష్కర్ సింగ్ ధామి (ఉత్తరాఖండ్) : 40.1 శాతం పాపులారిటీ
- అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ) : 36.6 శాతం పాపులారిటీ
- ఎంకే స్టాలిన్ (తమిళనాడు) : 35.8 శాతం పాపులారిటీ
- మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్) : 32.8 శాతం పాపులారిటీ
దేశంలోని అత్యంత ప్రజాదరణ సీఎంల జాబితాలో టాప్ 10 లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా దక్షిణ భారత దేశం నుంచి ఏ ఒక్క ముఖ్యమంత్రి మొదటి 5 స్థానాల్లో చోటు దక్కించుకోలేదు.