తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 14 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 14 మార్చి 2024

13 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

Advertisement

ఎన్నికల కమీషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా

2024 లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు భారత ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి మార్చి 9న రాజీనామా చేశారు. అతని రాజీనామాను భారత రాష్ట్రపతి తక్షణమే ఆమోదించారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్న రాజీవ్ కుమార్ వచ్చే ఫిబ్రవరి 2025లో పదవీ విరమణ చేయబోతున్నందున, ఆయన తర్వాత అరుణ్ గోయెల్ ఈ హోదాను పొందే అవకాశం ఉండేది.

గోయెల్ తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు కారణమని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన భారత ఎన్నికల సంఘంలో ఇప్పటికే ఒక ఖాళీ ఉంది. అరుణ్ గోయెల్ రాజీనామాతో కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతదేశంలో ఏకైక ఎన్నికల కమీషనర్‌గా సీఈసీ రాజీవ్ కుమార్ మాత్రమే ప్రస్తుతం పదవిలో ఉన్నారు. సాధారణ ఎన్నికల కమిషనర్లు లేరు.

పంజాబ్ క్యాడర్‌కు చెందిన 1985-బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గోయెల్ నవంబర్ 2022లో ఎన్నికల సంఘంలో చేరారు. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో గోయెల్ యొక్క అనూహ్య నిష్క్రమణ భారత రాజకీయాలలో అనేక ప్రశ్నలకు దారితీసింది.

2022లో గుజరాత్ మరియు అనేక ఇతర రాష్ట్రాలలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోయెల్ నియామకం జరిగింది. అయితే భారతదేశంలో ఎన్నికల కమిషనర్ల నియామకంలో మరింత పారదర్శక ప్రక్రియను డిమాండ్ చేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అతని నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ నియామకం ఏకపక్షంగా మరియు భారత ఎన్నికల సంఘం యొక్క సంస్థాగత సమగ్రత మరియు స్వాతంత్ర్యానికి విఘాతం కలిగిస్తోందని ఈ పిటిషన్‌లో పేర్కొంది. ఎన్నికల కమిషన్‌లో చేరడానికి ముందు అరుణ్ గోయెల్ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం కూడా ఈ వివాదానికి ఆజ్యం పోసింది.

ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) చట్టం 2023 గత డిసెంబర్ నెలలో ఆమోదం పొందటంతో, న్యాయ మంత్రి నేతృత్వంలోని మరియు ఇద్దరు యూనియన్ కార్యదర్శులతో కూడిన సెర్చ్ కమిటీ కొత్త ఈసీల నియామక ప్రక్రియను చేపట్టనుంది.

ప్రధానమంత్రి నేతృత్వంలోని ఈ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా ఏకైక అతిపెద్ద ప్రతిపక్ష నాయకుడు, తుది అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన పేర్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా నియమిస్తారు. ఈ కొత్త చట్టం ఎన్నికల కమీషనర్లను ఎంపిక చేసే ప్రక్రియ యొక్క పూర్తి అధికారాన్ని ప్రభుత్వానికి లేదా ప్రధానమంత్రికి కల్పిస్తుంది. తద్వారా ఇది అధికారిక పార్టీకి రాజకీయ లబ్ది కూర్చేలా మార్చబడింది.

జల్ శక్తి అభియాన్ : క్యాచ్ ద రెయిన్ 2024 ప్రచార కార్యక్రమం ప్రారంభం

జల్ శక్తి మంత్రిత్వ శాఖ "జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్-2024" ప్రచారా కార్యక్రమం యొక్క ఐదవ ఎడిషన్‌ను మార్చి 8న ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వర్షాకాలంకు ముందు దేశవ్యాప్తంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మరియు స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం ప్రధానంగా నీటి నిర్వహణ, పరిరక్షణ మరియు సుస్థిరతలో మహిళలను ప్రోత్సహించడమే కాకుండా వారు పోషించే కీలక పాత్రను గుర్తించి, ప్రశంసిస్తుంది. ఈ ప్రచార కార్యక్రమం నారీ శక్తి సే జల్ శక్తి అనే అంశం (థీమ్)పై ఈ ఏడాది నివహిస్తున్నారు. దీని ద్వారా నారీ శక్తి మరియు నీటి వనరుల స్థిరమైన నిర్వహణ అంటే జల్ శక్తి మధ్య శక్తివంతమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

ఇదే వేదిక ద్వారా జల్ శక్తి అభియాన్: 2019 నుండి 2023 మరియు 101 వాటర్ ఛాంపియన్స్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ అనే రెండు పుస్తకాలను కూడా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. ఈ ఈవెంట్‌లో “జల్ శక్తి అభియాన్ 2019 నుండి 2023 వరకు – నీటి భద్రత దిశగా సాగుతున్న ప్రజా నాయకత్వ ఉద్యమం” అనే చలనచిత్రంను కూడా ప్రదర్శించింది.

  • జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్-2024 ప్రచారం 9 మార్చి, 2024 నుండి 30 నవంబర్, 2024 వరకు నిర్వహిస్తారు.
  • ఈ కార్యక్రమం ప్రీ-మాన్‌సూన్ మరియు రుతుపవన కాలాన్ని కవర్ చేస్తూ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.
  • దేశంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ రుతుపవనాలకు ముందు, తర్వాత దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణపై అవగహన కల్పిస్తారు.
  • ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా నీటి వనరులను లెక్కించడం, జియో-ట్యాగింగ్ చేయడం మరియు జాబితా చేయడం మరియు నీటి సంరక్షణ కోసం శాస్త్రీయ ప్రణాళికల తయారీ వంటివి నిర్వహిస్తారు.
  • అలానే అన్ని జిల్లాల్లో జల్ శక్తి కేంద్రాల ఏర్పాటు, తీవ్రమైన అటవీ నిర్మూలన వలన వచ్చే అనర్దాలపై ప్రజలలో అవగాహన కల్పించడం వంటివి చేస్తారు.

జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని 2021లో మొదటిసారి నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలను కవర్ చేస్తూ ప్రతి సంవత్సరం ఇది అమలు చేయబడుతుంది. 2019 నుండి, జల్ శక్తి అభియాన్ ప్రచారం కింద, దేశవ్యాప్తంగా సుమారు 1.29 కోట్ల నీటి సంబంధిత పనులు చేపట్టబడ్డాయి. ఇంకా, 661 జల శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి అలానే 527 జిల్లాలు నీటి సంరక్షణ ప్రణాళికలను సిద్ధం చేశాయి.

ప్రపంచ రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుగా భారతదేశం

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్‌ల తయారీలో భారతదేశం రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్‌ల ఉత్పత్తిలో చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారత్ ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో $11 బిలియన్లు లేదా సుమారు ₹90,955 కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌లను భారత్ ఎగుమతి చేసినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇది మొత్తం దేశీయ ఉత్పత్తిలో $44 బిలియన్లు లేదా ₹ 3.6 ట్రిలియన్లకు సమానం.

ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి భారతదేశ మొబైల్ ఫోన్ ఎగుమతులు ₹ 1.2 ట్రిలియన్లు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మొబైల్ ఫోన్‌ల మొత్తం దేశీయ ఉత్పత్తిలో దాదాపు మూడింట ఒక వంతు ఎగుమతులు జరుగుతున్నాయి. భారతదేశం ప్రస్తుతం ఐదవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఎగుమతిదారునిగా అవతరించింది.

ఇటీవలే ఆపిల్ మరియు శాంసంగ్ వంటి ప్రముఖ ఫోన్ తయారీ సంస్థలు కూడా ఇండియాలో తమ తయారీ యూనిట్లు ప్రారంభించేందుకు సిద్దమౌతున్నాయి. భారతదేశ మొబైల్ ఫోన్ తయారీ పరిశ్రమ గత 10 సంవత్సరాలలో సంచితంగా ₹ 19.45 ట్రిలియన్ల విలువైన 2.45 బిలియన్ పరికరాలను ఉత్పత్తి చేసిందని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అంచనా వెచింది.

2014 నాటికి 78% మొబైల్ ఫోన్ల దిగుమతులపై ఆధారపడిన ఈ రంగం ప్రస్తుతం 97% స్వయం సమృద్ధికి మారింది. ఇది భవిష్యత్తు మొబైల్ ఫోన్ల ఎగుమతి వృద్ధికి దారి తీస్తుంది. చైనాకు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ వాల్యూ చెయిన్‌లు లేదా జివిసిలకు ఎలక్ట్రానిక్స్‌ తయారీ సామర్థ్యాలను అందించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ సరఫరా గొలుసులలో కీలకమైన భాగంగా చేయాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది.

ఛత్తీసగఢ్ లో మహతారి వందన యోజన ప్రారంభించిన పీఎం మోడీ

ఛత్తీస్‌గఢ్‌లో మహతారి వందన్ యోజన అనే నూతన సంక్షేమ పథకాన్ని ప్రధాని మోడీ మార్చి 10న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆ రాష్ట్రంలోని అర్హులైన వివాహిత మహిళలకు నెలవారీ రూ. 1000 ఆర్థిక సహాయం అందజేస్తారు. మహిళల ఆర్థిక సాధికారత కల్పించడం, వారికి ఆర్థిక భద్రత కల్పించడం, లింగ సమానత్వాన్ని పెంపొందించడం మరియు కుటుంబంలో మహిళల నిర్ణయాత్మక పాత్రను బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం.

జనవరి 1, 2024 నాటికి 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న రాష్ట్రంలోని అర్హులైన వివాహిత మహిళలందరికీ ఈ పథకం ప్రయోజనాలను అందజేస్తారు. వితంతువులు, విడాకులు తీసుకున్న మరియు భర్త విడిచిపెట్టిన మహిళలలు కూడా ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 70 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారని అంచనా వేస్తున్నారు.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మహాతరి వందన యోజన మొదటి విడత మొత్తం 655 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చికున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన కుటుంబం దాని మహిళల శ్రేయస్సు నుండి ఉద్భవిస్తుందని నొక్కిచెప్పారు.

గర్భిణీ స్త్రీలకు ఉచిత టీకాలు మరియు రూ. 5,000 ఆర్థిక సహాయంతో సహా అనేక కీలక చర్యలను ప్రధాని ఈ వేదిక ద్వారా ప్రకటించారు. ఆశా మరియు అంగన్‌వాడీ వర్కర్ల వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ₹5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలని కూడా ఆయన నొక్కి చెప్పారు.

వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి, ఛత్తీస్‌గఢ్‌లోని వరి రైతులకు చేసిన ప్రతిజ్ఞను గౌరవిస్తూ పెండింగ్‌లో ఉన్న బోనస్‌లను సకాలంలో చెల్లిస్తామని ప్రధాన మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. అటల్ జీ జయంతి సందర్భంగా ₹ 3,700 కోట్ల బోనస్‌ల పంపిణీ సహా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

ప్రపంచంలోనే అతి పొడవైన బై-లేన్ సెలా టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెలా టన్నెల్ అని పిలువబడే ప్రపంచంలోనే అతిపెద్ద బై-లేన్ సొరంగాన్ని మార్చి 9న అరుణాచల్‌లో ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో జరిగిన 'విక్షిత్ భారత్ విక్షిత్ నార్త్ ఈస్ట్' కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, ఈ వేదిక ద్వారా ఈ ప్రారంభోత్సం జరిపారు. ఇది వెస్ట్ కమెంగ్ జిల్లాలో 13,700 అడుగుల ఎత్తులో నిర్మించారు.

సెలా టన్నెల్ అనేది అరుణాచల్ ప్రదేశ్‌లోని సెలా పాస్ మీదుగా తవాంగ్‌ కనెక్టివిటీ అందించే రోడ్డు మార్గం. ఈ ఇంజనీరింగ్ అద్భుతంను సుమారు ₹ 825 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది. ఈ సొరంగం దేశానికి కూడా వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. దీనికి 2019లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) సమీపంలోని చైనా సరిహద్దులో ఉన్న వ్యూహాత్మక తవాంగ్ ప్రాంతం మరియు ఇతర ఫార్వర్డ్ ప్రాంతాలకు అన్ని సీజన్లలో కనెక్టివిటీని అందించే దేశం యొక్క ఎత్తైన రోడ్డు సొరంగంగా ఉండనుంది.

  • ఈ ప్రాజెక్ట్ 13,000 అడుగుల ఎత్తులో నిర్మించబడిన ప్రపంచంలోనే అతి పొడవైన జంట-లేన్ సొరంగం.
  • ఈ జంట ట్యూబ్ సొరంగంలో 980 మీటర్ల పొడవుతో టన్నెల్ 1ని, 1555 మీటర్ల పొడవుతో టన్నెల్ 2 ని నిర్మించారు.
  • టన్నెల్ 2లో ట్రాఫిక్ కోసం ఒక బై-లేన్ ట్యూబ్ మరియు అత్యవసర పరిస్థితుల కోసం ఒక ఎస్కేప్ ట్యూబ్ ఉన్నాయి.
  • బిసిటి రోడ్ నుండి బయలుదేరే టన్నెల్ 1కి ఏడు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు మరియు టన్నెల్ 1 నుండి టన్నెల్ 2ని కలిపే 1.3 కిలోమీటర్ల లింక్ రోడ్డు నిర్మాణం కూడా ఇందులో ఉంది.
  • ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతం, అరుణాచల్ ప్రదేశ్‌లోని బలిపర-చారిదూర్-తవాంగ్ రోడ్‌లోని సెలా పాస్ మీదుగా తవాంగ్‌కు అన్ని వాతావరణ సీజన్లలో కనెక్టివిటీని అందిస్తుంది.
  • ఈ సొరంగంను కొత్త ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతిని ఉపయోగించి మరియు అత్యున్నత ప్రమాణాల భద్రతా సదుపాయాలతో నిర్మించారు.

భారతదేశంలో 7,396 గోల్డెన్ లంగర్ల జనాభా ఉన్నట్లు అంచనా

భారతదేశంలో అంతరించిపోతున్న గోల్డెన్ లంగర్ జనాభా గతంలో 6,000గా అంచనా వేయగా ప్రస్తుత తాజా గణన ప్రకారం వీటి సంఖ్య 7,396 కి పెరిగినట్లు నివేదించబడింది. తాజా సర్వే మానస్ బయోస్పియర్ రిజర్వ్ మరియు ఉత్తర-పశ్చిమ అస్సాంలోని కొన్ని అడవులలో నిర్వహించబడింది.

ఈ సర్వేను ప్రైమేట్ రీసెర్చ్ సెంటర్ ఎన్ఈ ఇండియా, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ, కన్జర్వేషన్ హిమాలయాస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ సంయుక్తంగా రెండు దశల్లో నిర్వహించాయి.

ఈ బృందం 706 ప్రత్యేక సమూహాలలో 7,720 గోల్డెన్ లంగర్లను మరియు 31 ఒంటరి మగ గోల్డెన్ లంగర్లను లెక్కించినట్లు నివేదించింది. 2008-09 అంచనా ప్రకారం భారతదేశంలో 6,000 గోల్డెన్ లంగర్లు ఉన్నాయి, అయితే ప్రస్తుత హెడ్-కౌంట్ ప్రకారం వాటి జనాభా పరిమాణంలో పెరుగుదలను సూచించింది.

మానస్ బయోస్పియర్ రిజర్వ్‌లోని రిపు రిజర్వ్ ఫారెస్ట్‌లో గోల్డెన్ లాంగర్స్ యొక్క ప్రధాన జనాభా కనుగొనబడింది. ఈ ప్రాంతంలో దాదాపు 2,847 గోల్డెన్ లాంగర్స్ లెక్కించబడ్డాయి, ఆ తర్వాత చిరాంగ్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో 2,000 గుర్తించబడ్డాయి. అలానే మానస్ నేషనల్ పార్క్ యందు 719 నివేదించబడ్డాయి. దక్షిణ అస్సాంలోని కోక్రాఝర్ జిల్లాలోని చక్రశిల వన్యప్రాణుల అభయారణ్యంలో 838, బొంగైగావ్ జిల్లాలోని కకోయిజానా రిజర్వ్ ఫారెస్ట్‌లో 464 గోల్డెన్ లాంగర్స్ గుర్తించారు.

  • గోల్డెన్ లంగూర్ (ట్రాచిపిథెకస్ గీయి) భారతదేశంలోని పశ్చిమ అస్సాం మరియు భూటాన్ పర్వత ప్రాంతాలలో కనిపించే పురాతన కోతులు.
  • గోల్డెన్ లంగర్ 1950లలో ప్రకృతి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ప్రిచర్డ్ గీచే పాశ్చాత్య ప్రపంచం దృష్టికి తీసుకురాబడ్డాయి.
  • ఈ జాతిలో రెండు ఉపజాతులు ఉన్నాయి. 1. ట్రాచిపిథెకస్ గీ గీ ఖజురియా (1956), 2. ట్రాచిపిథెకస్ గీయ్ భూతానెన్సిస్ వాంగ్‌చుక్ (2003).
  • గోల్డెన్ లంగర్లు ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. మానవ ఆక్రమణల కారణంగా వాటి నివాస నష్టం జరిగి ఇవి అంతరించిపోతున్నాయి.
  • ఈ జాతులు హిమాలయ ప్రజలచే పవిత్ర జంతువులుగా పూజించబడతాయి.

Advertisement

Post Comment