తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 15 ఫిబ్రవరి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 15 ఫిబ్రవరి 2024

15 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం

మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసిన తర్వాత హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా హర్యానా బిజెపి నాయకుడు నయాబ్ సింగ్ సైనీ మార్చి 12న ప్రమాణస్వీకారం చేశారు. జననాయక్ జనతా పార్టీ (జెజెపి)తో బిజెపి పొత్తు తెగిపోవడంతో మనోహర్ లాల్ ఖట్టర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఖట్టర్ రాజీనామా లేఖను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆమోదించడంతో నయాబ్ సింగ్ సైనీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 5 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు, హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు కూడా ఉంది. ప్రభుత్వం నుండి బయటికొచ్చిన మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. బీజేపీకి చెందిన హిసార్ ఎంపీ బ్రిజేంద్ర సింగ్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ కారణంగానే బీజేపీ-జేజేపీ కూటమిల సంకీర్ణ ప్రభుత్వం చెడింది.

  • నయాబ్ సింగ్ సైనీ హర్యానాలోని ఓబీసీ కమ్యూనిటీకి చెందిన బీజేపీ నాయకుడు.
  • సైనీ 1996లో భారతీయ జనతా పార్టీతో తన అనుబంధాన్ని ప్రారంభించారు.
  • సైనీ 2014లో నారాయణగర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
  • 2016లో ఖట్టర్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడా సేవలు అందించారు.
  • నయాబ్ సింగ్ సైనీ 2023 అక్టోబర్‌లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డారు.

హర్యానాలో ఓబీసీ కమ్యూనిటీపై బలమైన పట్టు ఉండటంతో, రాష్ట్రంలో మైనారిటీల విస్తరణలో సైనీ బిజెపికి ప్రధాన ఆధారం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలానే ఖట్టర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉండటంతో, రాష్ట్రంలో మరో రాజాకీయ సంక్షోభంకు తావులేదని బీజేపీ అధిష్టానం భావిస్తుంది.

మిషన్ దివ్యాస్త్ర (అగ్ని 5) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డిఓ

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డిఓ) మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి యొక్క మొదటి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో ఈ విమాన పరీక్షను ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మార్చి 11న నిర్వహించారు.

ఒకే క్షిపణి నుండి బహుళ వార్‌హెడ్‌లను ప్రయోగించగల సామర్థ్యాన్ని ప్రదర్శించడం ఈ పరీక్ష లక్ష్యం, ఇది ఏకకాలంలో ప్రత్యేక లక్ష్యాలను చేధించడానికి వీలు కల్పిస్తుంది. ఈ విజయవంతమైన ప్రయోగం ఈ అధునాతన క్షిపణి సాంకేతికతతో ఎంపిక చేయబడిన దేశాల సమూహంలో భారతదేశాన్ని ఉంచుతుంది.

మిషన్ దివ్యాస్త్ర విజయం భారతదేశ స్వదేశీ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో ఒక ప్రధాన పురోగతిని సూచిస్తుంది. భారతదేశం యొక్క వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లే డీఆర్‌డిఓ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల అంకితభావం మరియు నైపుణ్యానికి ఇది నిదర్శనం.

  • క్షిపణి: అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి
  • మిషన్ పేరు : మిషన్ దివ్యాస్త్ర
  • సాంకేతికత: బహుళ స్వతంత్ర రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి)
  • ప్రయోగ స్థలం : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం (ఒడిశా)
  • ఫలితం: మిషన్ విజయవంతం, రూపొందించిన అన్ని పారామితులను సాధించింది.
  • ప్రాముఖ్యత: ఎంఐఆర్‌వి సాంకేతికతో ప్రయోగించిన ఈ ప్రయోగం భారతదేశాన్ని ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్‌లో చేర్చింది.

మధ్యప్రదేశ్ కొత్త లోకాయుక్తగా జస్టిస్ సత్యేంద్ర కుమార్ సింగ్ నియామకం

జస్టిస్ సత్యేంద్ర కుమార్ సింగ్ మధ్యప్రదేశ్ కొత్త లోకాయుక్తగా నియమితులయ్యారు. గవర్నర్ మంగూభాయ్ పటేల్ మార్చి 12న ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి అయిన  జస్టిస్‌ సత్యేంద్ర కుమార్ సింగ్‌, అంతకముందు భోపాల్‌లోని ప్రిన్సిపల్ రిజిస్ట్రార్ మరియు అదనపు జిల్లా జడ్జితో సహా న్యాయవ్యవస్థలో వివిధ ముఖ్యమైన పదవులను నిర్వహించారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ప్రక్రియను పాటించకుండా లోకాయుక్త నియామకం చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేత ఉమంగ్ సింఘార్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు లేఖ రాశారు. సెలక్షన్ కమిటీ సభ్యులలో ఒకరుగా ఉన్న తన అనుమతి లేకుండా లోకాయుక్తను నియమించారని ఆయన ఆరోపించారు.

మధ్యప్రదేశ్ లోకాయుక్త మరియు ఉప-లోకాయుక్త అధినియం, 1981 నిబంధనల ప్రకారం జరగాలని ఆయన పేర్కొన్నారు. అలానే ఈ నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో ఈ నియామకాన్ని ఆయన సుప్రీం కోర్టులో కూడా సవాలు చేసారు.

అయితే లోకాయుక్త నియామకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్థించింది. రాజకీయ మైలేజీ కోసం ఈ విషయంలో సంప్రదించకుండా ప్రతిపక్ష నాయకుడు "తప్పుడు మరియు నిరాధార" ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేసిన వ్యక్తినే ప్రభుత్వం నియమయించినట్లు వెల్లడించింది.

  • లోకాయుక్త అనేది ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించడానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబడిన అవినీతి నిరోధక అథారిటీ.
  • ఇది ప్రభుత్వంలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర వహిస్తుంది.
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా లేదా భారతదేశంలోని ఏదైనా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని మాత్రమే లోకాయుక్త్‌గా నియమించబడతారు.
  • లోకాయుక్త్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి , శాసన సభ మరియు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, శాసనసభ స్పీకర్ మరియు ఛైర్మన్‌తో ఏకాభిప్రాయంతో సిపార్సు చేస్తారు. వీరు సిపార్సు చేసిన వ్యక్తిని రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు.
  • లోకాయుక్త భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించడానికి ఏర్పాటు చేయబడుతుంది.
  • 2013లో లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం తర్వాత అధికారికంగా లోక్‌పాల్ మరియు లోకాయుక్త ఏర్పాటు తప్పనిసరి చేయబడింది.

షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ఛైర్మన్‌గా కిషోర్ మక్వానా నియామకం

షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా కిషోర్ మక్వానా మార్చి 11న బాధ్యతలు స్వీకరించారు. అలానే యూపీ నుంచి లవ్ కుష్ కుమార్, తెలంగాణ నుంచి వడ్డేపల్లి రాంచందర్ కొత్త సభ్యులుగా నియమితులయ్యారు. ఇది 7వ ఎస్సీ జాతీయ కమిషన్.

గత ఏడాది ఆగస్టులో అప్పటి ఛైర్మన్ విజయ్ సంప్లా ఎన్‌సిఎస్‌సికి రాజీనామా చేశాక, ఆ సమయంలో వైస్ ఛైర్మన్‌గా ఉన్న అరుణ్ హల్డర్ తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అరుణ్ హల్డర్ పదవీకాలం ముగిసే వరకు అంటే ఫిబ్రవరి 18 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. 6వ కమిషన్‌లోని మరో ఇద్దరు సభ్యుల పదవీకాలం కూడా ఫిబ్రవరి నెలలో ముగిసింది.

మక్వానా ఇది వరకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) గుజరాత్ యూనిట్ సంయుక్త అధికార ప్రతినిధిగా పనిచేశారు. జర్నలిస్ట్ మరియు కాలమిస్ట్‌గా కూడా వివిధ పత్రికలలో సేవలు అందించారు. కిషోర్ మక్వానా సామాజిక క్రాంతి నా మహానాయక్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, స్వామి వివేకానంద సఫల్తా నో మంత్రం వంటి విషయాలపై 33 కంటే ఎక్కువ పుస్తకాలకు రచయితగా ఉన్నారు.

  • షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్ అనేది భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక భారత రాజ్యాంగ సంస్థ.
  • ఇది షెడ్యూల్డ్ కులాలు మరియు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీల సామాజిక, విద్యను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి ఏర్పాటు చేయబడింది.
  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌కు సంబంధించి విధి విధానాలను వివరిస్తుంది.
  • ఆర్టికల్ 338 A షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌కు సంబంధించి వివరిస్తుంది.
  • షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ 1978 లో ఏర్పాటు చేయబడింది.
  • అయితే విడిగా షెడ్యూల్డ్ కులాల కోసం మొదటి జాతీయ కమిషన్ 2004లో సూరజ్ భాన్ చైర్మన్‌గా ఏర్పడింది.

నయీం ఖాన్ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్‌పై ప్రభుత్వం నిషేధం

నయీం అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్‌ను మార్చి 12న కేంద్ర హోంశాఖ ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఫ్రంట్ పాల్పడుతోందని మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసులో పేర్కొంది.

ఈ కారణాల వల్ల, జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ (జెకెఎన్ఎఫ్) కార్యకలాపాలకు సంబంధించి, తక్షణమే అమల్లోకి వచ్చేలా ఫ్రంట్‌ను 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించాల్సిన అవసరం ఉందని నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం గట్టిగా అభిప్రాయపడింది.

జెకెఎన్ఎఫ్ కాశ్మీర్ ప్రజలను ఎన్నికలలో పాల్గొనడం మానుకోవాలని నిరంతరం కోరుతూనే ఉందని, తద్వారా భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగపరంగా గుర్తించబడిన ప్రాథమిక అంశాలను లక్ష్యంగా చేసుకుని విఘాతం కలిగించిందని ప్రభుత్వం పేర్కొంది.

దేశవ్యతిరేక మరియు విధ్వంసక కార్యకలాపాలలో పాల్గొనడం, ప్రజల మధ్య విద్వేష బీజాలు నాటడం, శాంతిభద్రతలను అస్థిరపరిచేలా ప్రజలను ప్రోత్సహించడం, ఆయుధాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశం నుండి జమ్మూ మరియు కాశ్మీర్‌ను విడదీయడాన్ని ప్రోత్సహించడం, సహాయం చేయడం మరియు ప్రోత్సహించడంలో ఈ ఫ్రంట్ పాల్గొంటుందని తెలిపింది.

  • ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో నయీం ఖాన్ ఇప్పటికే 2017 ఆగస్టు 14 నుంచి జైలులో ఉన్నారు.
  • నయీం ఖాన్ జైలులో ఉన్న జెకెఎన్ఎఫ్ కాశ్మీర్ లోయలో "అశాంతి" సృష్టించినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆరోపిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ యందు పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తేదీ నుండి ఐదేళ్ల కాలానికి అమలులో ఉంటుంది.
  • గత ఫిబ్రవరి 28న కూడా ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ & కాశ్మీర్ సంస్థను చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటిస్తూ కేంద్రం నిషేధించింది.

జెకెఎన్ఎఫ్‌పై నిషేధం , ఆ సంస్థ కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది జెకెఎన్ఎఫ్ సమావేశాలు, ర్యాలీలు లేదా ఇతర బహిరంగ కార్యక్రమాలను నిర్వహించకుండా నిరోధిస్తుంది. తద్వారా దాని సభ్యులు అరెస్టు మరియు నిర్బంధాన్ని కూడా ఎదుర్కోవచ్చు. ఈ నిషేధం హురియత్ కాన్ఫరెన్స్‌ను మరింత ఒంటరిగా చేసే అవకాశం ఉంది.

Post Comment