Advertisement
ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ అవకాశాలు | ఇంటర్ అర్హుతతో ఉద్యోగాలు
Career Guidance Career Options

ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ అవకాశాలు | ఇంటర్ అర్హుతతో ఉద్యోగాలు

ఇంటర్ పూర్తిచేసే విద్యార్థులందరికి ఉన్నత విద్య చదివే అవకాశం ఉండకపోవచ్చు, ప్రధానంగా గ్రామీణ, నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులకు ఈ సమస్య ఉంటుంది. వీరికి ఉచిత విద్య కల్పించిన చదువుకునే అవకాశం ఉండదు. వీరి కుటుంబ ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా వీరికి ఉద్యోగం చేయడం తప్పనిసరి కావొచ్చు. అలానే చదువుపై ఆసక్తి కుదరక ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడే ఆలోచన ఉండే విద్యార్థులకు ఈ ఆర్టికల్ ఉపయోగపడనుంది.

బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేస్తే మినహా ఉద్యోగాలకు ఒక స్థిరమైన అర్హత రాదనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోనే కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా బ్యాంకుల నుంచి త్రివిధ దళాల వరకు అనేక రకాల ఉద్యోగ అవకాశాలు వీరికి ఆహ్వానం పలుకుతున్నాయి.

ఈ ఉద్యోగాలు సాధించడం ద్వారా చిన్న వయసులోనే స్థిరపడే అవకాశంతో పాటుగా ఆర్థికంగా నిలదొక్కుకుని ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఉద్యోగంలోనూ క్రమంగా పై స్థాయికి చేరుకోవచ్చు.

ఇంటర్ అర్హుతతో రైల్వే ఉద్యోగాలు

దేశంలో మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించే ఏకైక ఉద్యోగ నియామక బోర్డుగా ఇండియన్ రైల్వే ముందుంటోంది. ఎక్కువశాతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాల్లో రైల్వే ఒకటి. ఇండియన్ రైల్వే ఇంటర్ (10+12) అర్హుతలో టెక్నికల్/ నాన్ టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ బోర్డు పరిధిలో భర్తీచేసే ఈ ఉద్యోగాలకు ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొద్దిపాటి కృషితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే

ఇంటర్ అర్హుతతో భర్తీ చేసే రైల్వే ఉద్యోగాల జాబితాలో 1. కమర్షియల్ క్లర్క్ 2. టికెట్ కలెక్టర్/ టికెట్ ఎగ్జామినర్ 3. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 4. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 5. ట్రెయిన్స్ క్లర్క్ 6. ట్రెయిన్ టికెట్/ స్టాటిస్టికల్ క్లర్క్ 7. గూడ్స్ క్లర్క్ 8. కోచింగ్ క్లర్క్ వంటి ఉద్యోగాలు ఉంటాయి.

ఎంతో పోటీ ఉండే ఈ ఉద్యోగాల కోసం ఇండియన్ రైల్వే రాతపరీక్ష నిర్వహిస్తుంది. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అరిథ్‌మెటిక్ విభాగాల నుండి ప్రశ్నలు ఉంటాయి.

90 నిమిషాలు వ్యవధిలో 100 నుంచి 120 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. రాతపరీక్షలో అర్హుత పొందిన వారికీ అవసరమైతే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. లేదా రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

ఇంటర్ అర్హుతతో త్రివిధ దళాలల్లో ఉద్యోగాలు

సరిహద్దు రక్షణ వ్యవహారాలలో, దేశ విపత్తు సమయాల్లో ఇటు దేశానికీ, అటు ప్రజలకు స్పూర్తిదాయకమైన సేవలు అందించే త్రివిధ దళాలలో ఇంటర్మీడియట్  అర్హుతతో ఎంట్రీ స్థాయి కొలువు పొందే అవకాశం ఉంది. త్రివిధ దళాలలో కొలువు పొందితే చిన్న వయస్సులోనే దేశానికి సేవ చేసే అదృష్టం దక్కించుకోవచ్చు. దీనితో పాటుగా ఉన్నత విద్యను అభ్యసించే గొప్ప అవకాశం త్రివిధ దళాల ఉద్యోగులకు ఉంటుంది.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో వివిధ హోదాల్లో ఖాళీల భర్తీ చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు.పి.ఎస్.సి) ఏటా రెండుసార్లు ఎన్.డి.ఎ. అండ్ నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ఇంటర్ పూర్తిచేసి, 16 నుండి 19 ఏళ్ళ మధ్య ఉండే అవివాహిత పురుషులు ఈ పరీక్షా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్.డి.ఎ. ఆర్మీ వింగ్ ఉద్యోగాల కోసం ఇంటర్ అన్ని గ్రూపులు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎయిర్‌ఫోర్స్, ఎన్.డి.ఎ. నావెల్ వింగ్స్, నావెల్ అకాడమీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) కోసం ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ పాసై ఉండాలి. ఎంపిక రాతపరీక్ష, జనరల్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలకు ఎంపికైన వారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్.డి.ఎ.)లో కనీసం 3 సంవత్సరాలపాటు ప్రిలిమినరీ శిక్షణ ఉంటుంది. మొదటి రెండున్నర సంవత్సరాలు అందరికీ సమానం. దీన్లో పాసైతే తాము చేరిన విభాగాన్నిబట్టి బి.ఎస్‌సి./ బి.ఎస్‌సి. (కంప్యూటర్)/ బి.ఎ. డిగ్రీని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.) ఇస్తుంది.

నావెల్ అకాడమీకి ఎంపికైన వారికి కేరళలోని ఎజిమలా ప్రాంతంలో ఉన్న నావెల్ అకాడమీలో 4 సంవత్సరాలు శిక్షణ ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారికి బి.టెక్. డిగ్రీ ఇస్తారు. ఎన్.డి.ఎ. శిక్షణ అనంతరం త‌దుప‌రి శిక్షణ నిమిత్తం ఆర్మీ అభ్యర్థులను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి, నావెల్ అభ్యర్థులను ఆరు నెలలపాటు కేడెట్ ట్రెయినింగ్‌షిప్‌కు, ఎయిర్‌ఫోర్స్ వారిని హైదరాబాద్‌లోని ఎ.ఎఫ్.ఎ. విభాగానికి పంపిస్తారు.

నియామకాల్లో భాగంగా ఆర్మీలో చేరే వారికి లెఫ్టినెంట్ హోదా ఇస్తారు. ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులకు ఫ్లయింగ్ ఆఫీసర్, నేవీ అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలను ఇస్తారు. భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) ఏవియేషన్ కేడర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో 'అబ్జర్వర్‌గా (షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్) పోస్టులకు ఇంటర్‌లో సైన్స్ గ్రూపులలో ఉత్తీర్ణత పొందిన దరఖాస్తు చేసుకోవచ్చు.

సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ద్వారా జరిగే ఈ నియామకాలు రెండు దశల్లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి ఆఫీసర్లుగా సబ్-లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారి కెరీర్ సబ్-లెఫ్టినెంట్ హోదాలో మొదలవుతుంది. తరువాత లెఫ్టినెంట్, లెఫ్టినెంట్ కమాండర్, కమాండర్ హోదాలకు చేరుకుంటారు.

ఇంటర్ అర్హుతతో బ్యాంకింగ్ ఉద్యోగాలు

క్రమం తప్పకుండా ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడే  రంగాలలో బ్యాంకింగ్ సెక్టార్ ముందు వరుసలో ఉంటుంది. ఇంటర్ అర్హుతతో బ్యాంకు క్లరికల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేల సంఖ్యలో భర్తీచేసే క్లరికల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఇంటర్ యందు 55 నుండి 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలానే ఇంగ్లిష్ బాగా రాయడం, చదవడం మరియు కంప్యూటర్ అంశాలలో పరిజ్ఞానం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. రెండు పేపర్లుగా జరిగే ఈ పరీక్షలో మొదటి దశలో ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ క్లరికల్ ఆప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగాల నుండి ప్రశ్నలు ఇవ్వబడతయి.

రెండవ దశలో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. దీన్లో 5 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. సుమారు 45 నిమిషాలు కేటాయిస్తారు. కనీసం మూడింటికి సమాధానాలను తమ రాష్ట్ర అధికార భాషలో రాయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు తుది ప్రాధాన్యత ఇస్తారు.

ఇంటర్ అర్హుతతో పోలీస్ ఉద్యోగాలు

ఇంటర్ అర్హుతతో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే ఈ నియామకాలలో స్త్టెపెండరీ క్యాడెట్ ట్రెయినీ (ఎస్‌సీటీ) పోలీస్ కానిస్టేబుల్ (సివిల్- పురుషులు), ఎస్‌సీటీ కానిస్టేబుల్స్ (సివిల్ - ఏఆర్ మహిళలు) తదితర విభాగాలు ఉంటాయి. ఇంటర్ ఏ గ్రూప్ చదివిన ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నియామక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. ప్రాథమిక ఎంపిక పరీక్షగా రన్నింగు టాస్క్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాథమిక దశ పూర్తిచేసిన వారికి శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. చివరిగా మూడవ దశలో ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. పరీక్షలో ఇంగ్లిష్, అరిథ్‌మెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. అన్నింటా ఉత్తమ ప్రతిభ చూపించిన వారిని ఉదోగంలోకి తీసుకుంటారు.

ఇంటర్ అర్హుతతో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంట్ కార్యాలయాలు మరియు కేంద్రప్రభుత్వ ఆర్గనైజషన్స్'లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ మరియు గ్రేడ్ ‘డి సిబ్బంది, లోయర్ డివిజనల్ క్లర్క్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లును నియమించేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇంటర్మీడియట్ అర్హుతతో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది.

ఇంటర్మీడియట్ (10+2) స్థాయిలో నిర్వహించే ఈ నియామక పరీక్షకు దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత నుండి పోటీ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు 7th పే స్కేల్ ప్రకారం 19900/-(పే లెవెల్ 2) నుండి 25500/-(పే లెవెల్ 4) పరిధిలో చెల్లిస్తారు. ఎంపిక రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. వీటితో పాటుగా టెన్త్ క్లాస్ అర్హుతతో ఎస్‌ఎస్‌సి భర్తీ చేసే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వీటన్నింటితో పాటుగా మరెన్నో చిన్నాచితకా నియామక పరీక్షలు ఇంటర్ అర్హుతతో అందుబాటులో ఉన్నాయి. అలానే స్వల్పకాలిక వ్యవధితో పూర్తియ్యే నైపుణ్య అభివృద్ధి కోర్సులను నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంటుంది.

Post Comment