తెలుగులో 23 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహులకు ఇవి ఉపయోగపడతాయి.
9 భారత్ అభివృద్ధి ప్రోజెక్టుల కోసం జపాన్ అధికారిక అభివృద్ధి సహాయం
జపాన్ ప్రభుత్వం, భారతదేశంలోని వివిధ రంగాలలోని తొమ్మిది ప్రాజెక్ట్‌ల కోసం 232.2 బిలియన్ యెన్ల అధికారిక అభివృద్ధి సహాయ (ఓడిఎ) రుణాన్ని అందజేసింది. ఈ సహాయ ఒప్పందం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ చొరవ భారతదేశ వృద్ధిలో జపాన్ యొక్క నిరంతర పెట్టుబడిని సూచిస్తుంది.
ఈ నోట్ల మార్పిడి ఒప్పందం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ మరియు భారతదేశంలోని జపాన్ రాయబారి సుజుకి హిరోషి మధ్య న్యూఢిల్లీలో జరిగింది. ఇండియా మరియు జపాన్‌లు 1958 నుండి ఈ ద్వైపాక్షిక అభివృద్ధి సహకారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఆర్థిక భాగస్వామ్యం, భారతదేశం-జపాన్ సంబంధాలలో కీలక స్తంభం, ఇది గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా పురోగమిస్తోంది.
- నార్త్ ఈస్ట్ రోడ్ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (ధుబ్రి-ఫుల్‌బరి వంతెన | 34.54 బిలియన్ యెన్లు)
- నార్త్ ఈస్ట్ రోడ్ నెట్‌వర్క్ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఫుల్బరి-గోరాగ్రే సెక్షన్ ఎన్‌హెచ్ 127బి | 15.56 బిలియన్ యెన్లు)
- తెలంగాణలో స్టార్టప్ మరియు ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించే ప్రాజెక్ట్ (23.7 బిలియన్ యెన్లు)
- చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్ (ఫేజ్ 2) నిర్మాణ ప్రాజెక్ట్ (49.85 బిలియన్ యెన్లు)
- హర్యానాలో సస్టైనబుల్ హార్టికల్చర్‌ను ప్రోత్సహించే ప్రాజెక్ట్ (16.21 బిలియన్ యెన్లు)
- రాజస్థాన్‌లో వాతావరణ మార్పుల ప్రతిస్పందన మరియు పర్యావరణ వ్యవస్థ సేవల మెరుగుదల కోసం ప్రాజెక్ట్ (26.13 బిలియన్ యెన్లు)
- నాగాలాండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (కొహిమాలో మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఏర్పాటు ప్రాజెక్ట్ | 10 బిలియన్ యెన్లు)
- ఉత్తరాఖండ్‌లో పట్టణ నీటి సరఫరా వ్యవస్థ మెరుగుదల కోసం ప్రాజెక్ట్ (16.21 బిలియన్ యెన్లు)
- డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ (ఫేజ్ 1) (40 బిలియన్ యెన్లు)
జపాన్ యొక్క తాజా అధికారిక అభివృద్ధి సహాయ (ఓడిఎ) రుణం దేశంలోని వివిధ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంశాల యందు దృష్టి సారిస్తుంది. ఇందులో ప్రధానంగా ఈశాన్య ప్రాంతంలో రహదారి నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించబడింది. ఇది ఈ ప్రాంతంలో రహదారి ప్రాప్యత మరియు ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది.
అదనంగా చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో రహదారి కనెక్షన్‌లను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అలానే భారతదేశంలో సాంకేతిక పురోగతికి కేంద్రమైన తెలంగాణలో స్టార్టప్‌లు మరియు ఇన్నోవేషన్‌లను ప్రోత్సహించే ప్రాజెక్ట్ యొక్క రుణ మద్దతు కూడా, శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించే భారతదేశ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది.
అంతే కాకుండా రాజస్థాన్‌లో వాతావరణ మార్పుల ప్రతిస్పందన మరియు పర్యావరణ వ్యవస్థల సేవలను మెరుగుపరచడం, అలాగే హర్యానాలో స్థిరమైన ఉద్యానవనాన్ని ప్రోత్సహించడం వంటి ప్రాజెక్టులు భారతదేశ పర్యావరణ సుస్థిరత ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో జపాన్ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి.
ఐబిఎస్ఎ ఫండ్ కోసం 1 మిలియన్ డాలర్ల విరాళం అందించిన భారత్
ఇండియా, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా (ఐబిఎస్ఎ) చే స్థాపించబడిన పేదరికం మరియు ఆకలి నిర్మూలన నిధికి భారతదేశం 1 మిలియన్ యూఎస్ డాలర్ల మానవీయ సహకారం అందించింది. ఈ విరాళం అందించడం ద్వారా పేదరికం మరియు ఆకలి నిర్ములనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
ఈ సహకారం ఇండియా జీ20 ప్రెసిడెన్సీ ఎజెండాలో కీలకమైన దక్షిణ-దక్షిణ సహకారంపై భారతదేశం యొక్క దృష్టిని హైలైట్ చేస్తుంది. ఈ సహాయ చెక్కును భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి రుచిరా కాంబోజ్, యూఎన్ ఆఫీస్ డైరెక్టర్ దిమా అల్-ఖతీబ్‌కు అందజేశారు.
ఐబిఎస్ఎ ఫండ్, దక్షిణాది దేశాలలో పేదరిక మరియు ఆకలి నిర్ములన ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇస్తుంది. ఆహార భద్రత, హెచ్‌ఐవి/ఎయిడ్స్ నిర్ములన, సురక్షితమైన తాగునీటి ప్రాప్యత వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దీనిని ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు, ఐబిఎస్ఎ ఫండ్ గ్లోబల్ సౌత్‌లోని 37 దేశాలలో 45 ప్రాజెక్ట్‌లకు మద్దతుగా 50.6 మిలియన్ డాలర్ల సహాయం కేటాయించింది.
ఈ సంవత్సరం ఐబిఎస్ఎ ఫండ్ ఇప్పటికే మూడు ప్రాజెక్టులను ఆమోదించింది. వీటిలో బెలిజ్‌లో మైక్రోగ్రిడ్‌లను ఉపయోగించి గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్ట్, దక్షిణ సూడాన్‌లో స్థిరమైన వ్యవసాయాన్ని నడిపేందుకు మహిళలు మరియు యువతకు సాధికారత అందించే ప్రాజెక్ట్ మరియు పాలస్తీనాలో వ్యవసాయ-వ్యాపార అభివృద్ధిలో పెట్టుబడి/ముబద్ర్తి ప్రాజెక్ట్ ఉన్నాయి.
- ఐబిఎస్ఎ ఫండ్ 2004లో స్థాపించబడింది, 2006 నుండి సేవలు అందిస్తుంది.
- ఇండియా, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా దేశాలు ఐబిఎస్ఎ ఫండ్‌కు ప్రతి సంవత్సరం ఒక మిలియన్ యూఎస్ డాలర్లు విరాళంగా అందజేస్తాయి.
- స్థానిక ప్రభుత్వాలు, జాతీయ సంస్థల భాగస్వామ్యం ద్వారా డిమాండ్-ఆధారిత ప్రాతిపదికన ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇస్తుంది.
- ఇది దక్షిణ దేశాల ప్రయోజనం కోసం సౌత్-సౌత్ సహకార కార్యక్రమాలను అమలు చేయడంలో ఇది ముందుంది.
- 2004లో ఈ ఫండ్ స్థాపించబడినప్పటి నుండి భారత్ ఇప్పటి వరకు18 మిలియన్ డాలర్ల సహాయం అందించింది.
- యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ సౌత్-సౌత్ కోఆపరేషన్ ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ మరియు సెక్రటేరియట్‌గా పనిచేస్తుంది.
జీడీ బిర్లా అవార్డు గెలుచుకున్న మొదటి మహిళా శాస్త్రవేత్తగా అదితి సేన్
ప్రయాగ్‌రాజ్‌లోని హరీష్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ అదితి సేన్, జీడి బిర్లా అవార్డు గెలుచుకున్న మొదటి మహిళా శాస్త్రవేత్తగా నిలిచారు. సైంటిఫిక్ ఎక్సలెన్స్ కోసం అందించే ఈ అవార్డు 2023 ఏడాదికి గాను క్వాంటం టెక్నాలజీస్ రంగానికి ఆమె చేసిన కృషికి అందజేశారు.
కోల్‌కతాలో జన్మించిన అదితి సేన్, క్వాంటం ఇన్ఫర్మేషన్, కంప్యూటేషన్, క్వాంటం క్రిప్టోగ్రఫీ, క్వాంటం ఆప్టిక్స్ మరియు మెనీ-బాడీ ఫిజిక్స్‌తో సహా క్వాంటం కమ్యూనికేషన్‌పై పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు. కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న సమయంలోనే ఆమె క్వాంటం ఇన్ఫర్మేషన్ థియరీ రంగంలో తన పరిశోధనను ప్రారంభించారు. 2004లో ఆమె యూనివర్శిటీ ఆఫ్ గ్డాన్స్ నుండి డాక్టరేట్ పొందారు.
అదితి సేన్ తన కెరీరులో ఎన్నో అరుదైన రికార్డులు, గౌరవాలు అందుకున్నారు. 2022 జనవరిలో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ఆమె ఎన్నికయ్యారు. అదే ఏడాది అక్టోబరులో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2018లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుండి అత్యున్నత భారతీయ సైన్స్ అవార్డులలో ఒకటి అయిన శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతిని అందుకున్నారు. తద్వారా ఫిజికల్ సైన్స్ విభాగంలో ఈ బహుమతిని పొందిన మొదటి మహిళగా నిలిచారు.
2012లో యువ శాస్త్రవేత్తలకు ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ ఇచ్చే ద్వైవార్షిక బుటీ ఫౌండేషన్ అవార్డు కూడా ఆమెకు వరించింది. వీటితో పాటుగా స్పెయిన్‌లోని ప్రతిష్టాత్మక రామోన్ వై కాజల్ ఫెలోషిప్ మరియు జర్మనీలోని అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఫౌండేషన్ అందించే హంబోల్ట్ రీసెర్చ్ ఫెలోషిప్‌ను కూడా ఆమె అందుకున్నారు.
- జీడి బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది 1991 లో కేకే బిర్లా ఫౌండేషన్ ద్వారా స్థాపించబడింది.
- ఇది ప్రముఖ భారతీయ పరోపకారి ఘనశ్యామ్ దాస్ బిర్లా గౌరవార్థం అందిస్తున్నారు.
- ఈ అవార్డు భారతీయ శాస్త్రవేత్తలు గత 5 సంవత్సరాలలో చేపట్టిన అత్యుత్తమ శాస్త్రీయ పరిశోధనకు అందించబడుతుంది.
- అవార్డు గ్రహీతకు 5 లక్షల నగదు బహుమతిని అందిస్తారు. ఈ అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది.
- మెడికల్ సైన్స్, బేసిక్ మరియు అప్లైడ్‌తో సహా అన్ని సైన్స్ శాఖల పరిశోధనలకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది.
- 2023 విజేత : అదితి సేన్ (క్వాంటం ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్)
- 2022 విజేత : నారాయణ్ ప్రధాన్ (మెటీరియల్ సైన్స్‌కు అత్యుత్తమ సహకారం)
భారత అంతరిక్ష రంగంలో 100% ఎఫ్‌డిఐకి ప్రభుత్వం ఆమోదం
భారత అంతరిక్ష రంగానికి సంబంధించి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానంలో సవరణకు ప్రభుత్వం సమ్మతం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ నిర్ధేశించిన ఆత్మనిర్భర్ భారత్ దృక్పథాన్ని సాకారం చేసేందుకు ఈ ఎఫ్‌డిఐ విధాన సవరణను ఆమోదించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతరిక్ష రంగంలో మెరుగైన ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా భారతదేశ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేసే దృష్టిని అమలు చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు ప్రభుత్వ ఆమోదం మార్గం ద్వారా మాత్రమే ఉపగ్రహాల ఏర్పాటు మరియు నిర్వహణలో ఎఫ్‌డిఐలు అనుమతించబడుతున్నాయి. ఈ విధానం భారత అంతరిక్ష రంగంలో దేశీయ, విదేశీ కంపెనీల సహకారం మరియు వనరుల ప్రాప్యతనుకు అడ్డుపడుతుండంతో, ఇండియన్ స్పేస్ పాలసీ 2023 కింద వివిధ స్పేస్ ఉప-విభాగాలు/కార్యకలాపాల కోసం సరళీకృత ఎఫ్‌డిఐ థ్రెషోల్డ్‌లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పాలసీని ప్రస్తుతం మరింత సవరించి ఆటోమేటిక్ మార్గం ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారం తెరిచింది.
- సవరించిన ఎఫ్‌డిఐ విధానం ప్రకారం, అంతరిక్ష రంగంలో 100% ఎఫ్‌డిఐలు అనుమతించబడతాయి.
- ఉపగ్రహాలు-తయారీ & ఆపరేషన్, శాటిలైట్ డేటా ఉత్పత్తులు, గ్రౌండ్ సెగ్మెంట్ & యూజర్ సెగ్మెంట్ విభాగాలలో 74% ఎఫ్‌డిఐ అనుమతిస్తుంది.
- లాంచ్ వెహికల్ ప్రొడక్షన్ మరియు స్పేస్‌పోర్ట్ డెవలప్‌మెంట్ వంటి కార్యకలాపాల కోసం 49% ఎఫ్‌డిఐ అనుమతిస్తుంది.
- ఉపగ్రహాలు, గ్రౌండ్ సెగ్మెంట్ మరియు యూజర్ సెగ్మెంట్ భాగాలు మరియు సిస్టమ్‌లు/ఉప-వ్యవస్థల తయారీ రంగంలో 100% ఎఫ్‌డిఐ అనుమతిస్తుంది.
ఈ విధాన మార్పు భారతదేశ అంతరిక్ష ఆకాంక్షల కోసం ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. అంతర్జాతీయ సహకారాన్ని స్వీకరించడం ద్వారా, భారతదేశం ఈ రంగంలో ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి ఇప్పటికే ఉన్న తన బలాలను ఉపయోగించుకోవచ్చు.
ఎస్‌బిఎమ్ బ్యాంక్ ఇండియా నూతన ఎండీ & సీఈఓగా ఆశిష్ విజయకర్
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బిఎమ్ బ్యాంక్ ఇండియా, ఆశిష్ విజయకర్‌ని తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ & సీఈఓ) గా నియమించినట్లు ప్రకటించింది. ఇతని నియామకానికి ఫిబ్రవరి 6న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది.
ఆశిష్ విజయకర్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లో సుమారు మూడు దశాబ్దాల అనుభవంతో ఒక వెటరన్ బ్యాంకరుగా గుర్తింపు పొందారు. ప్రపంచ వ్యాపారాలను నిర్మించడంలో మరియు అభివృద్ధి చేయడంలో బలమైన నేపథ్యం ఉన్న ఈయన, ఇది వరకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో కీలక నాయకత్వ స్థానాలను నిర్వర్తించారు.
ఆశిష్ విజయకర్ బాంబే యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుండి సీఏ మరియు బాంబే యూనివర్సిటీ నుండి ఎల్ఎల్‌బి పూర్తి చేశారు. త్వరలో ఎస్‌బిఎమ్ బ్యాంక్ ఇండియాలోని ప్రతిభావంతులైన బృందంతో కలిసి పనిచేయడానికి ఆయన ఈ నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు.
- ఎస్‌బిఎమ్ బ్యాంక్ ఇండియా అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ యొక్క అనుబంధ సంస్థ.
- ఇది 2018 నుండి ముంబై కేంద్రంగా దేశంలో బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది.
- ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ వంటి ఇతర ప్రధాన నగరాల్లో దీని శాఖలు ఉన్నాయి.
- ఎస్‌బిఎమ్ బ్యాంక్ ఇండియా చైర్మన్ : సత్తార్ హజీ అబ్దులా
- ఎస్‌బిఎమ్ బ్యాంక్ ఇండియా సీఈఓ : ఆశిష్ విజయకర్
ప్రపంచ వ్యాప్తంగా టాప్ 300 సహకార సంస్థలలో ఇఫ్కో నెంబర్ వన్
ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ( ఇఫ్కో) మరోసారి నంబర్ వన్ కోఆపరేటివ్ అనే ప్రతిష్టాత్మక బిరుదును పొందింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 300 సహకార సంస్థలలో ఇఫ్కో ప్రధమ స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా ఇఫ్కో ఇదే ఘనతను పొంది ఉంది.
ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ (ఐసీఏ) ప్రచురించిన 12వ వార్షిక ప్రపంచ సహకార మానిటర్ నివేదిక యొక్క 2023 ఎడిషన్ ప్రకారం, దేశం యొక్క జీడీపీ మరియు సంస్థ యొక్క టర్నోవర్‌కు సంబంధించిన ర్యాంకింగులో గత ఆర్థిక సంవత్సరంలో 97వ స్థానంలో ఉన్న ఇఫ్కో, ఈ ఏడాది 72వ స్థానానికి చేరుకుంది.
- ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) 1967లో 57 సభ్యుల సహకార సంఘాలతో ప్రారంభించబడింది.
- ప్రస్తుతం దేశం యొక్క తలసరి జీడీపీ టర్నోవర్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద సహకార సంస్థగా రూపుదిద్దుకుంది.
- ప్రస్తుతం ఇస్కో దాదాపు 35,000 సహకార సంఘాలతో 50 మిలియన్లకు పైగా భారతీయ రైతులకు చేరువైంది.
- యూరియాలో దాదాపు 19% మార్కెట్ వాటాతో మరియు కాంప్లెక్స్ ఎరువులలో 31% మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద ఎరువుల తయారీదారునిగా ఉంది.
- ఇఫ్కో రైతుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి నానోరియా మరియు నానోడాప్‌ను అభివృద్ధి చేసింది.
- ప్రస్తుత ఇఫ్కో ఛైర్మన్ : దిలీప్ సంఘాని
- ప్రస్తుత ఇఫ్కో సీఈఓ : యూఎస్ అవస్థి
ఛత్తీస్‌గఢ్‌లో 211 పీఎం శ్రీ పాఠశాలలు ప్రారంభించిన ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 211 పీఎం శ్రీ పాఠశాలలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఇదే వేదిక ద్వారా కేంద్రీయ విద్యాలయాల కోసం డిజిటల్ లైబ్రరీని, రాష్ట్రంలోని నవోదయ విద్యాలయం కోసం వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లను కూడా ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు.
- పీఎం శ్రీ స్కూల్ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన కేంద్ర ప్రాయోజిత పథకం.
- పీఎం శ్రీ అనగా పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని అర్ధం.
- వీటిని 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన మౌలిక సదుపాయాలు, వినూత్న బోధన మరియు సాంకేతికతతో నిర్మిస్తున్నారు.
- ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 14500 కంటే ఎక్కువ పాఠశాలలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేసింది.
- ఈ పథకం కోసం 2022-23 నుండి 2026-27 వరకు ఐదేళ్ల కాలానికి 27360 కోట్లు బడ్జెట్ కేటాయించారు.
- ఈ పాఠశాలలు సమగ్ర శిక్ష, కేంద్రీయ విద్యాలయాలు & నవోదయ విద్యాలయాల పరిపాలనా నిర్మాణం ద్వారా నడపబడతాయి.
- 18 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉంటారని అంచనా.
- ఈ పథకం మూడు దశలలో పూర్తి చేయనున్నారు.