తెలంగాణ విద్యార్థులు మరియు నిరుద్యోగులకు విద్యా, ఉద్యోగ పరమైన అవసరాలు సమకూర్చడానికి టీ సాట్ టీవీ ఏర్పాటు చేయబడింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వ ఐ.టి శాఖలో విభాగమైన టి-సాట్ నెట్వర్క్ నిర్వహిస్తుంది.
వీటి ద్వారా పాఠశాల విద్యార్థులకు, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు, పోటీపరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు టీవీ, యూట్యూబ్, వెబ్సైటు మరియు ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వారికి అవసరమయ్యే ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తుంది.
టీ సాట్ పాఠశాల విద్యార్థుల కోసం నిపుణ, విద్యా పేరుతో రెండు టీవీ ఛానళ్లను ప్రారంభించింది. ఇవి 24 గంటల నిడివితో పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు అందిస్తున్నాయి. ఈ ఛానళ్లను అన్ని కేబుల్ టీవీలలో, డీటీహెచ్ చానెల్స్ ద్వారా అందిస్తున్నారు.
అలానే జియో టీవీ యాప్ ద్వారా ఈ ఛానళ్లను ఉచితంగా టీ సాట్ ప్రచారం చేస్తుంది. 3 నుండి 10 వ తరగతి వరకు లైవ్ తరగతులతో పాటుగా వాటికీ సంబంధించిన డిజిటల్ లైబ్రరీని కూడా అందుబాటులో ఉంచింది. వీటిని మొబైల్ యాప్ మరియు యూట్యూబ్ ద్వారా విద్యార్థులు ఏ సమయంలోనైనా వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.
ప్రవేశ పరీక్షలు మరియు గ్రూప్స్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారి కోసం ఉదయం 6 నుండి 10 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తుంది. ఎంసెట్, జేఈఈ మరియు నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు సంబంధించి ప్రిపరేషన్ గైడెన్స్ తో పాటుగా 600 గంటల నిడివి గల పూర్తిస్థాయి పరీక్షా సంబంధిత అంశాలను అందుబాటులో ఉంచింది. పాలీసెట్ సంబంధించి 90 గంటల నిడివి గల వీడియో పాఠాలు సమకూర్చిపెట్టింది.
రాష్ట్ర, వివిధ జాతీయ పోటీ పరీక్షల కోసం సిద్దమౌతున్న అభ్యర్థుల కోసం కరెంటు అఫైర్స్, జనరల్ స్టడీస్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ వంటి అంశాలకు సంబందించి విస్తృతమైన వీడియో ట్యుటోరియల్స్ ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తుంది.
టీ సాట్ టైమ్స్ పేరుతో ఇ- మ్యాగజైన్ పబ్లిష్ చేస్తుంది. ఇందులో ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ తో పాటుగా, కరెంటు అఫైర్స్ ని అందిస్తుంది.
పోటీ పరీక్షల్లో ప్రధాన భూమిక పోషించే మ్యాథమెటిక్స్ సంబంధించి అవగాహనా, మెళుకువలు, సులువుగా సమస్యలు సాధించే నైపుణ్యాన్ని అందించేందుకు గణితంలో నిష్ణాతులైన ఎస్.వి.ఆర్.కె. రెడ్డి గారిచే ‘స్పీడ్ మ్యాథ్స్’ పేరుతో 9 గంటల పాఠాలు రూపొందించి యూట్యూబ్ మరియు యాప్ లో అందుబాటులో ఉంచించి. ఇంగ్లీష్ బాష ఐదు పట్టు సాధించేందుకు టి-సాట్ వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, రామకృష్ణ మఠం వారిచే 80 గంటల ఇంగ్లీష్ పాఠాలు అందుబాటులో ఉంచారు.