Advertisement
తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు
February Telugu Current Affairs

తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 10న, 2024-25 సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో, కేంద్ర ప్రభుత్వ కేటాయంపులకు అనుగుణంగా ఈ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాక, రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయానికి రూ.2,01,178 కోట్లు కేటాయించగా, మూలధన వ్యయానికి రూ.29,669 కోట్లు కేటాయించారు. ఎన్నికల ముందు కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు అమలు కోసం రూ.53,196 కోట్లు కేటాయించారు. డిసెంబర్ 2023లో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ మధ్యంతర బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.19,746 కోట్లు, నీటిపారుదల రంగానికి రూ.28,024 కోట్లు కేటాయించారు.

  • ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూడవ శాసనసభ బడ్జెట్.
  • గత రెండు శాశనసభలలో  మొత్తం 10 బడ్జెట్లను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
  • కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన తోలి బడ్జెట్ ఇది.
  • ఆర్థికమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
  • 2024-25 సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
  • ఫిబ్రవరి 8న గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రసంగం చేసారు.

తెలంగాణ బడ్జెట్ యందు కీలక అంశాలు

ఆర్థిక వృద్ధి : 2023-24 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డిపి) ప్రస్తుత ధరలలో 2022-23తో పోల్చినప్పుడు 13,02,371 కోట్ల రూపాయల నుండి 14,49,708 కోట్లకు పరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆర్ధిక వృద్ధి రేటు 14.7 శాతం నుండి 11.3 శాతానికి క్షీణించినట్లు పేర్కొంది.

అలానే దేశీయ స్థాయిలో కూడా వృద్ధి రేటు 16.1 శాతం నుండి 8.9 శాతానికి భారీగా పడిపోయినట్లు నివేదించింది. దీని పర్యవసానంగా, భారతదేశ జిడిపి వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 2.4 శాతం ఎక్కువ ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు, స్థిరమైన ధరలలో, గత సంవత్సరం 7.5 శాతం నుండి ఒక శాతం తగ్గి ఈ సంవత్సరానికి 6.5 శాతానికి పడిపోయినట్లు తెలిపింది.

తెలంగాణ మరియు భారతదేశం యొక్క ప్రస్తుత మరియు స్థిరమైన ధరల వద్ద భిన్నమైన వృద్ధి రేట్లు, తెలంగాణలో ఉన్న అధిక ద్రవ్యోల్బణం రేటును సూచిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2023 డిసెంబర్లో తెలంగాణలో 6.65 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల సూచీ, 5.69 శాతంగా ఉన్న దేశ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉన్నట్లు పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 5 వ స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం, 2023- 24లో 3,43,297 రూపాయలుగా ఉంటుందని అంచనా వేయబడింది. అయితే  గత ఏడాది తెలంగాణ తలసరి ఆదాయం 3,09,912 రూపాయలుగా తేలింది. దీనితో పోలిస్తే ఈ సంవత్సరం పెరుగుదల కనిపిస్తున్నప్పటికి, వృద్ధి రేటు మాత్రం క్షీణించిందని ప్రభుత్వం తెలిపింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పడ్డాక తీసుకున్న కీలక నిర్ణయాలు

  • కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ను మహాత్మా జ్యోతిబాపూలే భవన్‌గా పేరు మార్చి ప్రజా పరిపాలనకి శుభారంభం చేసింది.
  • ప్రజల సమస్యలు వినేందుకు ప్రతివారం రెండు రోజులు ప్రజావాణి నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.
  • దీని ఒక పోర్టల్ ద్వారా ప్రజావాణి దరఖాస్తులన్నింటిని నమోదు చేసి అవి పరిష్కారం అయ్యే దాక వాటిని ట్రాక్ చేసే అవకాశం కల్పించారు.
  • అభయహస్తం పేరుతొ ప్రకటించిన ఆరు గారెంటీలలో రెండింటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటలలో అమలు చేసి చూపించారు.
  • ఇచ్చిన ఆరు హామీల అమలుకై అర్హులైన లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం ప్రజాపాలన పేరుతొ డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు 1.29 కోట్ల దరఖాస్తులు స్వీకరించారు.
  • మహాలక్ష్మి పథకంలో భాగం అయిన మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకంను 09 డిసెంబర్ 2023 న ప్రారంభించింది.
  • ఈ పథకం అమలు కోసం ఇప్పటికే నెలకు 300 కోట్ల రూపాయల చొప్పున అదనపు నిధులు మంజూరు చేసింది.
  • ఇదే డిసెంబర్ 9న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద పేద ప్రజల వైద్య ఖర్చుల పరిమితిని 5.00 లక్షల రూపాయల నుండి 10.00 లక్షల రూపాయలకు పెంచింది.
  • గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు 500/- రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్ సరఫరా పథకాలను ఫిబ్రవరి నుండి అమలు చేసేందుకు సిద్దమవుతుంది.
  • అలానే మిలిగిన హామీలు మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువవికాసం హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు పేర్కొంది.
  • ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలు కోసం 53,196 కోట్ల రూపాయలు కేటాయించింది.
  • ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫొరం వార్షిక సమావేశంలో  ప్రభుత్వం దాదాపు 40వేల కోట్ల భారీ పెట్టుబడులు రాబట్టింది.
  • ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం చిన్న మరియు సూక్ష్మ సంస్థలు స్థాపించడానికి వీలుగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం పీఎం మిత్ర నిధులు వినియోగించనున్నట్లు తెలిపింది.
  • మూసీ ప్రక్షాళనతో పాటు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధికల్పనా జోన్ గా మార్చే కార్యాచరణ మొదలుపెట్టింది. లండన్ థేమ్స్ నది నిర్వహణ తీరును పరిశీలించిన ప్రభుత్వం, అదే తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి పరచాలని యోచిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్ యందు 1,000 కోట్లు కేటాయించింది.
  • ఈ ప్రాజెక్టు అమలు కోసం ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మరియు నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రిలతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది.
  • హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ నగరంను పట్టణ ప్రాంతంగా, ఔటర్ రింగ్ రోడ్డు మరియు ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతంను పెరి ఆర్బన్ జోన్‌గా, అలానే ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్‌గా నిర్ధారించి దానికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

తెలంగాణ 2024 బడ్జెట్లో కీలక కేటాయింపులు

మంత్రిత్వశాఖ బడ్జెట్ కేటాయింపు (కోట్లలో)
మొత్తం రాష్ట్ర బ‌డ్జెట్ 2,75,891 కోట్లు
రాష్ట్ర రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు
రాష్ట్ర మూల ధన వ్యయం 29,669 కోట్లు
ఆరు గ్యారెంటీలు 53,196 కోట్లు
మూసీ ప్రాజెక్టు 1,000 కోట్లు
పరిశ్రమల శాఖ 2543 కోట్లు
ఐటీ శాఖ 774 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ 40,080 కోట్లు
పురపాలక శాఖ 11,692 కోట్లు
వ్యవసాయ శాఖ 19,746 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణం 1,250 కోట్లు
ఎస్సీ సంక్షేమం 21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమం 13,013 కోట్లు
మైనార్టీ సంక్షేమం 2,262 కోట్లు
బీసీ గురుకుల భవనాల నిర్మాణం 1,546 కోట్లు
బీసీ సంక్షేమం రూ8 వేల కోట్లు 8,000 కోట్లు
విద్యా రంగం 21,389 కోట్లు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు 500 కోట్లు
యూనివర్సిటీల్లో సదుపాయాలు 500 కోట్లు
ఆరోగ్య శాఖ 11,500 కోట్లు
విద్యుత్ రంగం (గృహ జ్యోతి) 2,418 కోట్లు
విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు
గృహ నిర్మాణం 7,740 కోట్లు
నీటి పారుదల 28,024 కోట్లు

తెలంగాణ బడ్జెట్ ప్రసంగంలో కీలక హామీలు

  • ఈ ఏడాదిలో 15,000 మంది కానిస్టేబుళ్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • అలానే రాబొయ్యే రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రణాళికలు ప్రకటించింది.
  • ప్రభుత్వ కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకంతో పాటు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహణ కోసం ₹40 కోట్లు కేటాయించింది.
  • విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
  • రైతులు మరియు కౌలు రైతులకు ఏటా రూ.15,000 పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించింది.
  • అలానే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమౌతున్నట్లు తెలిపింది.
  • స్థలం లేని వారికి ఇంటి స్థలం కేటాయింపు, స్థలం ఉంది సొంత ఇళ్లు లేని వారికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది.
  • విద్యార్థులు రూ. 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డులను త్వరలో అందుకోనున్నారు.
  • వృద్ధులకు నెలవారీ పింఛను రూ.4,000 పెంచనున్నారు.

Post Comment