Advertisement
ఆర్ట్ & కల్చర్ | కరెంటు అఫైర్స్ : మే 2022
Telugu Current Affairs

ఆర్ట్ & కల్చర్ | కరెంటు అఫైర్స్ : మే 2022

సంతూర్ మాస్ట్రో పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూశారు

ప్రముఖ సంగీత విద్వాంసుడు మరియు సంతూర్ వాద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ మే 10న ముంబైలో గుండెపోటుతో మరణించారు. జమ్మూలో జన్మించిన శివకుమార్, ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సంగీత వాయిద్యంను ప్రపంచ సంగీత ప్రపంచానికి పరిచయం చేసారు. బయట ప్రపంచానికి అంతగా తెలియని వాయిద్యానికి తన కళతో ఉన్నతమైన హోదాను కల్పించారు. భారతీయ సంగీతానికి పండిట్ శివకుమార్ శర్మ చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1991లో పద్మశ్రీ అవార్డు అందించింది. అలానే 2001 లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.

యేటా మే 12 న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్

ఐక్యరాజ్యసమితి యేటా మే 12 వ తేదీని అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా మొక్కల ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటుగా వాటి ద్వారా ప్రపంచ ఆకలిని అంతం చేయడం, పేదరికాన్ని తగ్గించడం, జీవవైవిధ్యం మరియు పర్యావరణ పరిరక్షణ మరియు ఆర్థికాభివృద్ధి పెంపొందించడం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్త అవగాహన కల్పించనున్నారు.

మోడీ@20 డ్రీమ్స్ మీట్ డెలివరీ' పుస్తకం విడుదల

మోదీ @ 20  డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే కొత్త పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆవిష్కరించారు. ఇది ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 20 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనా నమూనాను విశిదీకరిస్తుంది. ఈ పుస్తకంలో ప్రధాని మోదీ విజన్, ఆయన కలలు మరియు అతని విస్తృతమైన అంతర్దృష్టితో కూడిన ప్రయాణాలు మరియు అనుభవపూర్వక జ్ణాపకాలు ఉన్నాయి.ఈ పుస్తకం ప్రధాని మోదీ కేబినెట్ సహచరుల ద్వారా రూపొందించబడింది.

ఆగ్రాలో హునార్ హాత్ 2022 ప్రారంభం

హునార్ హాత్ యొక్క 41వ ఎడిషన్‌ను కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ మరియు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సింగ్ బఘేల్ అధికారికంగా ప్రారంభించారు. ఇది సాంప్రదాయ కళాకారులకు సంబంధించిన వార్షిక వేడుక. ఈ ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల 800 లకు పైగా కళాకారులు హాజరవుతారు. ఈ ఉత్సవాలు యేటా 10 నుండి 12 రోజులు నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా ప్రాచీన హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే ఉద్దేశ్యంతో నిర్వహిస్తారు.

దేశంలో మొదటి ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభం

కేరళ ప్రభుత్వం దేశంలో మొదటి ప్రభుత్వ యాజమాన్య ఓటీటీ (ఓవర్ -ది-టాప్) ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. సీస్పేస్ (CSPACE) పేరుతో ప్రారంభమైన ఈ వినోదపు వేదికలో సినిమాలు, డాక్యూమెంటరీ ఫిలిమ్స్ మరియు షార్ట్ ఫిల్మ్‌లను ప్రేక్షుకుల కోసం అందుబాటులో ఉంచనున్నారు. సీస్పేస్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ను కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించింది.

మణిపూర్ షిరుయి లిల్లీ ఫెస్టివల్ 2022

మణిపూర్‌లో షిరుయి లిల్లీ ఫెస్టివల్ 2022 4వ ఎడిషన్ మే 25న ప్రారంభమైంది. ఈ వార్షిక ఉత్సవాన్ని మణిపూర్ పర్యాటక శాఖ నిర్వహిస్తుంది. దీనిని ఏప్రిల్ మరియు మే నెలల్లో షిరుయ్ లిల్లీ పుష్పించే కాలంకు గుర్తుగా జరుపుకుంటారు. షిరుయి లిల్లీ పుష్పం మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో మాత్రమే కన్పిస్తుంది. ఇది ప్రపంచంలో మరో చోట కనిపించదు. ఇది మణిపూర్ జాతీయ పుష్పంగా గుర్తించబడింది.

భారతదేశపు అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

మే 27 న దేశ రాజధానిలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మే 27 మరియు 28 తేదీలలో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రభుత్వ అధికారులు, సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు (పిఎస్‌యులు), విదేశీ దౌత్యవేత్తలు, ప్రైవేట్ కంపెనీలతో పాటు డ్రోన్ స్టార్టప్‌లకు చెందిన సుమారు1600 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022 లో 70 మందికి పైగా ఎగ్జిబిటర్లు, వివిధ కేటగిర్లకుచెందిన డ్రోన్‌లను ప్రదర్శించారు. ఇందులో 'మేడ్ ఇన్ ఇండియా' డ్రోన్ ట్యాక్సీ నమూనా ప్రదర్శన వంటివి ఉన్నాయి.

భారతదేశపు మొదటి లావెండర్ ఫెస్టివల్ ప్రారంభం

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలోని భాదేర్వాలో దేశంలోనే మొట్టమొదటి 'లావెండర్ పండుగను మే 26న ప్రారంభించారు. రెండు రోజుల నిడివితో సాగే ఈ ఉత్సవాలు అరోమా మిషన్-2 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. సిఎస్ఐఆర్ సహాయంతో దేశవ్యాప్తంగా రైతుల ద్వారా ముఖ్యమైన ఔషధ మరియు సుగంధ మొక్కల సాగును అలవాటు పర్చేందుకు అరోమా మిషన్‌ రూపకల్పన చేసారు.

Post Comment