బిజినెస్ & ఎకానమీ | కరెంటు అఫైర్స్ : మే 2022
Telugu Current Affairs

బిజినెస్ & ఎకానమీ | కరెంటు అఫైర్స్ : మే 2022

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదు నిల్వల నిష్పత్తి పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని 50 బేసిస్ పాయింట్లు (bps) పెంచుతూ 4.5 శాతానికి ప్రకటించింది. ఈ పెంపు మే 21 నుండి అమలులోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా బహుళ-సంవత్సరాల కాల వ్యవధిలో బ్యాంకింగ్ సెక్టార్ నుండి లిక్విడిటీని క్రమంగా ఉపసంహరించుకోనున్నారు. తాజా నిర్ణయం ద్వారా ప్రభుత్వం దాదాపు ₹87,000 కోట్ల లిక్విడిటీని బ్యాంకింగ్ వ్యవస్థ నుండి స్వీకరించనుంది. అదే విదంగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.4 శాతానికి చేర్చుతూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

CRR అంటే కాష్ రిజర్వ్ రేషియో అని అర్ధం. ఇది సెంట్రల్ బ్యాంకు వద్ద ఉన్న మొత్తం డిపాజిట్ల శాతంకు సమానం. ఇది లిక్విడ్ నగదుగా నిర్వహించబడుతుంది. ఈ లిక్విడ్ నగదుపై బ్యాంకులకు వడ్డీని చెల్లించదు. అలానే పెట్టుబడి మరియు రుణ ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించదు. దీనిని ప్రభుత్వాల కోరికమేరకు దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు మాత్రమే ఉపయోగిస్తారు.

ఎల్ఐసి యొక్క $2.7 బిలియన్ డాలర్ల ఐపిఓ ప్రారంభం

దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) యొక్క ప్రారంభ పబ్లిక్ ఆఫర్ మే 4న ప్రారంభమైనది. ఐపిఓను మే 4 నుండి మే 9 వరకు అందుబాటులో ఉంచింది. ఐపిఓ అనేది కొత్త స్టాక్ జారీలో ప్రజలకు ప్రైవేట్ కార్పొరేషన్ యొక్క షేర్లను అందించే ప్రక్రియను సూచిస్తుంది. ఎల్ఐసి తన తొలి పబ్లిక్ ఆఫర్ కోసం ఈక్విటీ షేర్‌కి 902 నుండి 949 రూపాయల ధరను నిర్ణయించింది.

పెట్టుబడిదారులు కనీసం 15 ఈక్విటీ షేర్లును కొనుక్కోవాల్సి ఉంటుంది. రిటైల్ మరియు ఎలిజిబుల్ ఎంప్లాయీ కేటగిరీకి ఒక్కో షేరుకు 45 రూపాయలు మరియు పాలసీ హోల్డర్ కేటగిరీకి ఒక్కో షేరుకు 60 రూపాయల తగ్గింపును ఆఫర్ అందించింది. ఈ ఐపిఓతో ప్రభుత్వం 22 కోట్ల 13 లక్షల షేర్లను విక్రయించడం ద్వారా బీమా సంస్థలో తన 3.5 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని చూస్తోంది. ఐపిఓ ద్వారా దాదాపు 21 వేల కోట్ల రూపాయలను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సెంచరీకి చేరిన భారత యునికార్న్ స్టార్టప్‌ల జాబిత

భారతదేశ యునికార్న్ స్టార్టప్‌ల జాబితా 100 మార్కుకు చేరుకుంది. వీటి మార్కెట్ విలువ సుమారు 332.7 బిలియన్ డాలర్లకు సమానం. తాజాగా నియోబ్యాంక్ ఓపెన్ దేశంలో 100వ యునికార్న్ స్టార్టప్‌గా నిలిచింది. దీనితో భారతదేశంలో యునికార్న్ వేవ్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అవతరించే 10 యునికార్న్‌లలో 1 యునికార్న్‌ భారత్ నుండి ఉంటున్నట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

యునికార్న్ అనేది వెంచర్ క్యాపిటల్ పరిశ్రమలో 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన స్టార్టప్ కంపెనీల కోసం ఉపయోగించే పదం. 2021-22 సంవత్సరంలో భారత్ యునికార్న్‌ల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదు అయ్యింది. మొత్తం 44 స్టార్టప్‌లు ఏడాది పొడవునా యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించాయి. వీటి  మొత్తం విలువ అక్షరాలా $93 బిలియన్లు.

2016న స్టార్టప్ ఇండియా చొరవ ప్రారంభించినప్పటి నుండి, 2022 మే 2 వరకు దేశంలో 69,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లు గుర్తింపు పొందాయని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో 56 విభిన్న రంగాలలో సమస్యలను పరిష్కరించే స్టార్టప్‌లను గుర్తించినట్లు తెలిపింది. ఇందులో అత్యధికంగా ఐటీ నుండి 13 శాతం, ఆరోగ్యం మరియు సైన్స్ నుండి 9 శాతం, ఎడ్యుకేషన్ సంబంధించి 7 శాతం, వృత్తి మరియు వాణిజ్య సేవలకు చెందినవి 5 శాతం, వ్యవసాయంవి 5 శాతం మరియు ఆహారం రంగానికి సంబంధించి 5 శాతం సంస్థలు ప్రారంభమైనట్లు నివేదించింది.

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు బాధ్యతలు మరోమారు జీఎమ్ఆర్ సంస్థకే

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు మరో 30 సంవత్సరాల (2038 వరకు) పాటు నిర్వహించడానికి జీఎమ్ఆర్ గ్రూప్‌కు హక్కులను మంజూరు చేస్తున్నట్లు భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలుచుకునే ఈ ఎయిర్‌పోర్టును జీఎమ్ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) నిర్వహిస్తుంది.

ఈ సంస్థలో జీఎమ్ఆర్ గ్రూపుకు 63% వాటా ఉండగా, 13 శాతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు. మరో 13 శాతం తెలంగాణ ప్రభుత్వం కలిగి ఉన్నాయి. ఇంకో 11 శాతం మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హాద్ కలిగి ఉంది.

ఎయిర్ ఇండియా  సీఈఓ & ఎండీగా క్యాంప్‌బెల్ విల్సన్

టాటా సన్స్, ఎయిర్ ఇండియా యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్‌ డైరెక్టరుగా క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమించినట్లు ప్రకటించింది. క్యాంప్‌బెల్ విల్సన్‌ ఇదివరకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీఈఓగా పనిచేసారు. టాటా సన్స్, ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం నుండి దక్కించుకున్నాక మొదట మాజీ టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ ఇల్కర్ ఐసీని సీఈఓగా నియమించింది. ఆయన వివిధ కారణాలతో ఈ బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించడంతో  ఆయన స్థానంలో క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమించుకుంది.

అదానీ చేతికి అంబుజా సిమెంట్స్ మరియు ఏసీసీ సిమెంట్

స్విట్జర్లాండ్‌కు చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్‌లో హోల్సిమ్ యొక్క 63.1% వాటాను మరియు ACC లిమిటెడ్‌లో 54.5% హోల్డింగ్‌ను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ దేశంలోనే నంబర్ 2 సిమెంట్ తయారీదారుగా అవతరించింది. ఈ కొనుగోలు విలువ 10.5 బిలియన్ డాలర్లు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

ఇండిగో సీఈఓగా పీటర్ ఎల్బర్స్‌

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) డైరెక్టర్ల బోర్డు పీటర్ ఎల్బర్స్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. ఎల్బర్స్, 2014 నుండి కేఎల్ఏం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ యొక్క ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా ఉన్నారు. ఆయన ఈ ఏడాది అక్టోబర్ 1 లోపు ఇండిగో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇదిఇలా ఉండగా 53.5 శాతం మార్కెట్ షేరుతో ఇండిగో దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా సేవలు అందిస్తుంది.

ఎయిర్‌టెల్ సీఈఓగా & ఎండీగా మరోమారు గోపాల్ విట్టల్‌

ప్రముఖ భారతీయ టెలికామ్ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ మరో ఐదేళ్ల కాలానికి గోపాల్ విట్టల్‌ను మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన 31 డిసెంబర్ 2028 వరకు ఈ పదవిలో ఉండనున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త సీఈఓగా బి గోవిందరాజన్

ఐషర్ మోటార్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బి గోవిందరాజన్‌ని నియమించినట్లు వెల్లడించింది. అతను ఆసంస్థ యొక్క హోల్‌టైమ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించనున్నారు.

పేటిఎమ్ సీఈఓ మరియు ఎండీగా విజయ్ శేఖర్ శర్మ

ప్రముఖ డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మరో ఐదు సంవత్సరాల కాలానికి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా తిరిగి నియమితులయ్యారు. అతని పదవీకాలం డిసెంబర్ 19, 2022 నుండి డిసెంబర్ 18, 2027 వరకు ఉండనుంది.

Advertisement

Post Comment