Daily Current affairs in Telugu 13 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.
ఆర్సెనిక్ మరియు మెటల్ అయాన్ల తొలగింపు కోసం అమృత్ టెక్నాలజీ
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నీటి నుండి ఆర్సెనిక్ మరియు మెటల్ అయాన్లను తొలగించడానికి 'AMRIT' (ఆర్సెనిక్ మరియు మెటల్ రిమూవల్ బై ఇండియన్ టెక్నాలజీ) అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ సాంకేతికతలో వీరు నానో-స్కేల్ ఐరన్ ఆక్సీ-హైడ్రాక్సైడ్‌ను ఉపయోగించారు. ఇది నీటిని దాని ద్వారా పంపినప్పుడు ఆర్సెనిక్‌ను ఎంపిక చేసి తొలగిస్తుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ దేశీయ మరియు కమ్యూనిటీ స్థాయిల కోసం అభివృద్ధి చేయబడింది.
ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఆర్సెనిక్ మరియు సీసం, క్రోమియం మరియు ఫ్లోరైడ్‌తో సహా వివిధ లోహ అయాన్‌లను తొలగించడంలో అధిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. వీటిని ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ యందు భాగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డిసెంబర్ 11న రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.
దేశంలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన సురక్షితమైన & తాగదగిన కుళాయి నీటి సరఫరా కోసం భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా భారత ప్రభుత్వం ఆగస్టు 2019లో రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేయడానికి జల్ జీవన్ మిషన్ ప్రారంభించింది. జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పటి నుండి, గ్రామీణ గృహాలకు కుళాయి నీటి ప్రాప్యతను పెంపొందించే దిశగా దేశంలో గణనీయమైన పురోగతి సాధించింది.
ఈజిప్ట్ & చైనా మిస్సాట్-2 ఉపగ్రహా ప్రయోగం విజయవంతం
చైనా మరియు ఈజిప్ట్‌లు డిసెంబర్ 4, 2023న మిస్ర్‌శాట్-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించాయి. ఈ ప్రయోగం వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి లాంగ్ మార్చ్-2C క్యారియర్ రాకెట్ ద్వారా నిర్వహించబడింది. మిస్ర్‌శాట్ - 2 ఉపగ్రహ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు 2019లో ఈజిప్ట్ మరియు చైనా $ 72 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ప్రాజెక్టు యందు ఈజిప్షియన్ స్పేస్ ఏజెన్సీ మరియు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఉమ్మడిగా పనిచేసాయి.
ఈ ఉమ్మడి అభివృద్ధిలో చైనా, ఈజిప్టు సిబ్బందికి మొత్తం ఉపగ్రహ రూపకల్పన, అసెంబ్లీ మరియు పరీక్షలను కవర్ చేసే శిక్షణా కార్యక్రమాలను అందించింది. మిస్ర్‌శాట్ అనేది అధునాతన ఆప్టికల్ ఇమేజింగ్ టెక్నాలజీతో కూడిన భూమి పరిశీలన ఉపగ్రహం. ఇది ఈజిప్ట్ యొక్క భూమి మరియు నీటి వనరుల యొక్క అధిక-రిజల్యూషన్ చిత్రాలను అందిస్తుంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, జాతీయ వనరులు, పట్టణ ప్రణాళిక మరియు తీరప్రాంత మార్పు పర్యవేక్షణతో సహా వివిధ రంగాలలో కీలక పాత్ర పోషించనుంది.
ప్రపంచ తోలి లిక్విడ్ మీథేన్ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించిన చైనా
చైనాకు చెందిన ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ స్పేస్ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి మీథేన్-ఇంధన అంతరిక్ష రాకెట్ "జుక్-2" ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ల్యాండ్‌స్పేస్ టెక్నాలజీ కార్పొరేషన్ అనే ఈ ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ సంస్థ జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి డిసెంబర్ 9న ఈ ప్రయోగం నిర్వహించింది. ఇది విజయవంతం అయిన మొదటి మీథేన్-ఆధారిత రాకెట్‌గా నిలిచింది.
జుక్-2 వై-3 రాకెట్ అనేది ల్యాండ్‌స్పేస్ కంపెనీచే అభివృద్ధి చేయబడిన ఒక చిన్న, మూడు-దశల లాంచర్. ఇది 50 కిలోల బరువున్న రెండు టెస్ట్ శాటిలైట్‌లను కక్ష్యలోకి విజయవంతంగా తీసుకువెళ్లింది. మీథేన్-లిక్విడ్ ఆక్సిజన్ రాకెట్ తక్కువ కాలుష్యం, సురక్షిత మరియు చౌకైనది. ఇవి పునర్వినియోగ రాకెట్‌కు తగిన ప్రొపెల్లెంట్‌గా కూడా పరిగణించబడుతుంది.
ఈ ఏడాది జూలైలో ల్యాండ్‌స్పేస్ మీథేన్-లిక్విడ్ ఆక్సిజన్ రాకెట్‌ను ప్రయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి కంపెనీగా అవతరించింది, యునైటెడ్ స్టేట్స్ ప్రత్యర్థులైన ఎలోన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ మరియు జెఫ్ బెజోస్ యొక్క బ్లూ ఆరిజిన్‌ల కంటే ఇది ముందుంది.
హైదరాబాద్‌లో కొత్త పోలీసు కమిషనరుగా కొత్తకోట శ్రీనివాస రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ కొత్త పోలీస్ కమీషనర్‌గా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ప్రస్తుత సిట్టింగ్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా 2001 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జి సుధీర్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌గా, 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు.
ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణు దేవ్ సాయి ప్రమాణ స్వీకారం
ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా సీనియర్ గిరిజన నాయకుడు విష్ణు దేవ్ సాయి డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేశారు. విష్ణు దేవ్ సాయితో పాటుగా ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మలతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు హాజరయ్యారు.
ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో 90 మంది సభ్యుల శానసభలో బీజేపీ 54 స్థానాలను కైవసం చేసుకుని విజేతగా నిలిచింది. నాలుగు సార్లు లోక్‌సభ ఎంపీగా మరియు మూడుసార్లు రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా పని చేయడంతో సహా అతని విస్తృతమైన రాజకీయ అనుభవం, గిరిజన ప్రాంత ప్రాతినిధ్యం అతన్ని అత్యున్నత పదవికి ఎంపిక చేసింది. తాజా శాసనసభ ఎన్నికలలో కుంకూరి అసెంబ్లీ స్థానం నుండి విష్ణు దేవ్ సాయి మొత్తం 87,604 ఓట్లతో విజయం సాధించారు.
విష్ణు దేవ్ సాయి 2000 సంవత్సరంలో ఏర్పాటైన చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి నాల్గవ ముఖ్యమంత్రి. 1990లో ఛత్తీస్‌గఢ్‌లో సర్పంచ్‌గా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు. విష్ణు దేవ్, పీఎం మోడీ మొదటి క్యాబినెట్‌లో గనులు, ఉక్కు శాఖకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. విష్ణు దేవ్ సాయి 1999 నుండి 2014 వరకు రాయ్‌గఢ్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.
మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2000 ఫలితంగా 1 నవంబర్ 2000న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుండి నలుగురు వ్యక్తులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రాష్ట్ర మొదటి సీఎంగా భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన అజిత్ జోగి పనిచేసారు. ఆయన తర్వాత 2003లో భారతీయ జనతా పార్టీకి చెందిన రమణ్ సింగ్ వరుసగా మూడు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నుండి 2023 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన భూపేష్ బఘెల్ సీఎంగా ఉన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన బీజేపీ పార్టీ నుండి విష్ణుదేవ్ సాయి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ విజయం సాధించిన తర్వాత ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. మోహన్ యాదవ్ ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ్ నియోజకవర్గం నుండి మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన గతంలో 2013, 2018 లో కూడా ఇదే ఉజ్జయిని దక్షిణ్ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2 జూలై 2020న శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఈయన క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ జరగగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగింది. రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 66 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ నుండి 5 సార్లు ఎంపీగా, 16న్నర సంవత్సరాలు (4 సార్లు) సీఎంగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, ఈ సారి బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి రేస్ నుండి తప్పుకున్నారు.
మాలిలో ముగిసిన 10 ఏళ్ళ యూఎన్ శాంతి పరిరక్షక మిషన్
మాలిలో గత పదేళ్లుగా ఐక్యరాజ్యసమితి నిర్వహించిన మల్టీడైమెన్షనల్ ఇంటిగ్రేటెడ్ స్టెబిలైజేషన్ మిషన్ (MINUSMA) అధికారికంగా ముగించింది. 2012 ఇస్లామిస్ట్ తిరుగుబాటు తర్వాత మాలిని స్థిరీకరించడంలో సహాయపడటానికి 2013లో ఈ మిషన్ స్థాపించబడింది. అయితే ఇటీవలి సంవత్సరాలలో ఈ మిషన్ యందు పెరుగుతున్న విమర్శల కారణంగా, చివరికి మాలియన్ ప్రభుత్వం దాని ఉపసంహరణను అభ్యర్థించింది.
మాలి సైనిక ప్రభుత్వం జూన్ 2020లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ నుండి మోహరించిన ఈ మిషన్‌ను నిష్క్రమించాలని డిమాండ్ చేస్తుంది. ఈ మిషన్ గత దశాబ్ద కాలంగా మాలిలో సుమారు 15,000 మంది సైనికులు మరియు పోలీసుల ద్వారా నిర్వహించబడింది. అయితే మిషన్ భారీ నష్టాలను చవిచూసింది, 300 మందికి పైగా శాంతి పరిరక్షకులు ఈ సమయంలో మరణించారు.