2023 జనవరి నెలకు సంబంధించిన సమకాలిన డిఫెన్స్ మరియు సెక్యూరిటీ అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.
ఎఈఆర్‌బి ఛైర్మన్‌గా దినేష్ కుమార్ శుక్లా
అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (AERB) నూతన చైర్మనుగా సీనియర్ అణు శాస్త్రవేత్త దినేష్ కుమార్ శుక్లా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే మూడేళ్ళ కాలానికి ఆయన ఈ హోదాలో ఉండనున్నారు దినేష్ కుమార్ గతంలో ఇదే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా విధులు నిర్వర్తించారు.
దినేష్ కుమార్ శుక్లా న్యూక్లియర్ సేఫ్టీ రంగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నిపుణుడుగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల నుండి 1980లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈయన, 1981లో భాభా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ సెంటర్ (BARC)లో నుండి తన కెరీర్ ప్రారంభించారు
అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్‌ను 15 నవంబర్ 1983న భారత రాష్ట్రపతి అటామిక్ ఎనర్జీ యాక్ట్, 1962 (60 KB) చట్టం ద్వారా దేశంలో అణు నియంత్రణ మరియు భద్రతా విధులను నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
కాకినాడలో AMPHEX 2023 ఎక్సర్‌సైజ్
భారత నౌకాదళం యొక్క ద్వైవార్షిక ట్రై-సర్వీసెస్ యాంఫిబియస్ ఎక్సర్‌సైజ్ (AMPHEX 2023) ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడలో జనవరి 17 నుండి 23 మధ్య నిర్వహించబడింది. ఈ 6 రోజుల మెగా సైనిక విన్యాసాలలో ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు కూడా పాల్గొన్నాయి. ఇలాంటి సైనిక ఎక్సర్‌సైజ్ కాకినాడ తీరంలో నిర్వహించడం ఇదే తొలిసారి.
భారత నౌకాదళానికి చెందిన లార్జ్ ప్లాట్‌ఫాం డాక్ (LPD), ల్యాండింగ్ షిప్‌లు, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లు, మెరైన్ కమాండోలు (మార్కోస్), హెలికాప్టర్లు మరియు విమానాలతో కూడిన అనేక ఉభయచర నౌకలు ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి. అలానే భారత సైన్యం నుండి స్పెషల్ ఫోర్సెస్, ఆర్టిలరీ మరియు సాయుధ వాహనాలతో సహా 900 మంది సైనికులు పాల్గొనగా. వైమానిక దళం నుండి జాగ్వార్ యుద్ధ విమానాలు, C 130 విమానాలు ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి.
దేశంలోనే నంబర్ వన్ పీఎస్‌గా అస్కా పోలీస్ స్టేషన్
పోలీసు స్టేషన్‌ల వార్షిక ర్యాంకింగ్‌లో ఒడిశాలోని గంజాం జిల్లాలోని అస్కా మోడల్ పోలీస్ స్టేషన్ 2022 సంవత్సరానికి గాను దేశంలోనే నంబర్ వన్ పోలీస్ స్టేషన్‌గా నిలిచింది. ఈ జాబితాలో రెండవ స్థానంను ఇదే రాష్ట్రం నుండి గంగాపూర్ పీఎస్ దక్కించుకోగా, మూడవ స్థానంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంకు చెందిన చంపావత్ పీఎస్ నిలిచింది.
జనవరి 20న న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్‌లో జరిగిన డీజీఎస్పీ/ఐజీఎస్పీ కాన్ఫరెన్స్ 2022 సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ జాబితాను విడుదల చేశారు.
డిజిసిఎ తదుపరి డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ దేవ్ దత్
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ దేవ్ దత్ నియమితులయ్యారు. విక్రమ్ దేవ్ దత్ నియామకానికి సంబంధించి జనవరి 21న కేంద్రం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 28 నుండి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది భారతదేశంలోని పౌర విమానయానాన్ని నియంత్రించే చట్టబద్ధమైన సంస్థ. ఇది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
ఇండియన్ నేవీ మెరిటైమ్ ఎక్సర్సైజ్ - ట్రోపెక్స్ 2023
ఇండియన్ నేవీ యొక్క ద్వైవార్షిక మెరిటైమ్ ఎక్సర్సైజ్ - ట్రోపెక్స్ (TROPEX) 2023 ఎడిషన్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రారంభమైంది. ఈ సైన్యక విన్యాశాలలో ఇండియన్ నేవీతో పాటుగా భారత సైన్యం, భారత వైమానిక దళం మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ దళాలు పాల్గొంటాయి.
ట్రోపెక్స్ ఎక్సర్సైజ్ జనవరి - మార్చి 23 నుండి మూడు నెలల పాటు నిర్వహించబడుతోంది. ఈ వ్యాయామంలో భాగంగా, డిస్ట్రాయర్‌లు, ఫ్రిగేట్‌లు, కొర్వెట్‌లు అలాగే సబ్‌మెరైన్‌లు మరియు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా భారత నావికాదళంలోని ఉపరితల పోరాట యోధులందరూ పాల్గొంటారు. దీనిని మొదటిసారి 2019లో ప్రారంభించారు.
వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అధిపతిగా పంకజ్ మోహన్ సిన్హా
ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా, జనవరి 1న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ మార్షల్ పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి 1985లో గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. అదే ఏడాది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యందు ఫైటర్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించారు.
వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అనేది న్యూ ఢిల్లీ కేంద్రంగా 1949లో ఏర్పాటు చేయబడ్డ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రాంతీయ కమాండ్లలో ఒకటి. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన ఎయిర్ కమాండ్. ఈ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలో పదహారు వైమానిక స్థావరాలు ఉన్నాయి. ఇది ఉత్తర భారతదేశ వైమానిక రక్షణకు బాధ్యత వహిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలోని సుబ్రోటో పార్క్‌లో ఉంది.
సియాచిన్‌లో మోహరించిన మొదటి మహిళా అధికారిగా శివ చౌహాన్
ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కెప్టెన్ శివ చౌహాన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి అయినా సియాచిన్ గ్లేసియర్ ఆపరేషన్‌లో మోహరించిన మొదటి మహిళా అధికారిగా నిలిచారు. 1984లో సియాచిన్ గ్లేసియర్‌ను స్వాధీనం చేసుకునేందుకు భారత సైనిక దళాలు చేపట్టిన మేఘదూత్ ఆపరేషన్ తర్వాత ఇంతవరకు ఏ మహిళా అధికారి ఇక్కడ నియమింపబడలేదు.
సియాచిన్‌లో ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. చౌహాన్ ఇప్పుడు 15,632 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్ వద్ద మోహరించారు. హిమానీనదంపై దాదాపు 80% పోస్ట్‌లు 16,000 అడుగుల పైన ఉన్నాయి, ఇతర సైనికుల మాదిరిగానే చౌహాన్ కూడా మూడు నెలల పాటు ఘనీభవించిన ల్యాండ్‌స్కేప్‌లో మోహరిస్తారు.
తొలి వార్‌గేమ్ మహిళా ఫైటర్ పైలట్‌గా అవని చతుర్వేది
భారతదేశపు మొదటి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్‌లలో ఒకరైన అవనీ చతుర్వేది త్వరలో అంతర్జాతీయ వైమానిక యుద్ధ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఏడాది జనవరి 12 నుండి 26 వరకు హ్యకురి ఎయిర్ బేస్‌లో భారత్ మరియు జపాన్ మధ్య జరిగే తొలి 'వీర్ గార్డియన్ 2023' ఉమ్మడి వ్యాయామంలో ఈమె భారత బృందంతో పాల్గొనున్నారు.
ఏడేళ్ల క్రితం దేశ వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌లుగా నియమితులైన మహిళల తొలి బ్యాచ్‌లో అవనీ చతుర్వేది ఒకరు. స్క్వాడ్రన్ లీడర్‌గా ఆమె అంతర్జాతీయ ఎయిర్ డ్రిల్స్‌లో భాగమవడం ద్వారా భారత దేశం నుండి ఈ ఘనత దక్కించుకున్న మొదటి ఫైటర్ పైలట్‌గా నిలిచారు. అలానే సుఖోయ్ విమానాన్ని నడపబోతున్న భారత తొలి మహిళా పైలట్‌గా కూడా నిలవనుంది.
ఇండియా, ఫ్రాన్స్ ద్వైపాక్షిక వ్యాయామం 'వరుణ' ప్రారంభం
ఇండియా మరియు ఫ్రాన్స్‌ల మధ్య నిర్వహించే ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం 'వరుణ' యొక్క 21వ ఎడిషన్, జనవరి 16న గోవా తీరంలో ప్రారంభమైంది. ఈ రెండు నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక విన్యాసాన్ని 1993లో ప్రారంభించారు. 2001 నుండి దీనిని 'వరుణ వ్యాయామం' పేరుతొ నిర్వహిస్తున్నారు.
భారతదేశం-ఫ్రాన్స్ నౌకా దళాల మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధాన్ని పెంపొందించే లక్ష్యంగా దీనిని జరుపుతారు. ఈ వ్యాయామం 2023 జనవరి 16 నుండి 20 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ వ్యాయామం ద్వారా రెండు నౌకాదళాల యూనిట్లు సముద్ర రంగంలో తమ యుద్ధ-పోరాట నైపుణ్యాలను మెరుగుపరుచుకోనున్నాయి.
ఇండో- ఈజిప్ట్ జాయింట్ ఎక్సర్‌సైజ్ సైక్లోన్ - I ప్రారంభం
సైక్లోన్ పేరుతొ నిర్వహిస్తున్న ఇండో- ఈజిప్ట్ దళాల జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ యొక్క ప్రారంభ ఎడిషన్, జనవరి 14న జైసల్మేర్‌లో ప్రారంభమైంది. ఈ సైనిక కసరత్తు 14 రోజులు పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. రెండు దేశాల ప్రత్యేక దళాల నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంతో పాటుగా రెండు సైన్యాల మధ్య సహకారం మరింత పెంపొందించుకోవడమే ఈ వ్యాయామం లక్ష్యం.
భారత్ మరియు ఈజిప్టుల మధ్య 75 ఏళ్ళ దైపాక్షిక సంబంధం పూర్తియిన సంధర్బంగా, ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అడ్బెల్ ఫట్టా ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత రిపబ్లిక్ డే పరేడ్‌కు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇదే తొలిసారి.
ఇండో-జపాన్ వీర్ గార్డియన్ ఎక్సర్‌సైజ్ 2023
ఇండియా మరియు జపాన్ వైమానిక దళాల ద్వైపాక్షిక వైమానిక రక్షణ వ్యాయామం 'వీర్ గార్డియన్ 2023' యొక్క ప్రారంభ ఎడిషన్ జపాన్‌లోని హ్యకురి ఎయిర్ బేస్ వద్ద జనవరి 12 నుండి 26 మధ్య నిర్వహించినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 16 రోజుల పాటు సాగిన ఉమ్మడి శిక్షణ సమయంలో రెండు వైమానిక దళాలు సంక్లిష్టమైన మరియు సమగ్రమైన వైమానిక విన్యాసాలలో పాల్గొన్నాయి.
జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ నుండి F-2 మరియు F-15 విమానాలు పాల్గొనగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి Su-30 MKI విమానాలు పాల్గున్నాయి. ఈ 'వీర్ గార్డియన్ 2023' వ్యాయామం రెండు వైమానిక దళాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.