Advertisement
Latest Current affairs in Telugu : 3 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Latest Current affairs in Telugu : 3 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Latest Current affairs 3 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

యూఏఈలో ప్రపంచ అతిపెద్ద సింగిల్-సైట్ సోలార్ పవర్ ప్లాంట్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించింది. 2-గిగావాట్ల సామర్థ్యం గల ఈ అల్ దఫ్రా సోలార్ ఫోటోవోల్టాయిక్ (పీవీ) ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్టును అబుదాబికి 35 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసారు. ఇది దాదాపు 200,000 గృహాలకు శక్తినిచ్చేంత విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు.

అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ పరిధిలోకి వచ్చే స్వీహాన్ పీవీ పవర్ కంపెనీ ఈ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. ఇది అబుదాబి ప్రభుత్వం మరియు చైనా యొక్క జింకో సోలార్ హోల్డింగ్ మరియు జపాన్ యొక్క మారుబేని కార్ప్ ఆఫ్ కన్సార్టియంల జాయింట్ వెంచర్.

ఈ ప్లాంట్ దాదాపు 20 చదరపు కిలోమీటర్ల మేర ఎడారిలో నిర్మించబడింది. ఈ సోలార్ ప్లాంట్ 4 మిలియన్ ద్విముఖ సోలార్ ప్యానెల్‌లతో రూపొందించబడింది. ఈ ప్యానెల్‌లను రెండు వైపులా సూర్యరశ్మిని సంగ్రహించే విధంగా తీర్చిదిద్దారు. ఈ ప్లాంట్ దాదాపు 200,000 గృహాలకు శక్తిని అందించడమే కాకుండా ఏడాదికి 2.3 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది.

ది ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్ స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ తాజా డేటా ప్రకారం, సౌరశక్తి వినియోగంలో యూఏఈ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. తలసరి సౌర శక్తి వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది. కేవలం ఒక దశాబ్దంలో శక్తి వైవిధ్యీకరణలో భాగంగా సౌర శక్తిని వ్యవస్థాపించడం ద్వారా యూఏఈ ప్రముఖ దేశాలను అధిగమించింది.

అల్ దఫ్రా సోలార్ పివి ప్లాంట్ ప్రారంభోత్సవం యుఎఇలో జరగనున్న యుఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (సిఓపి28)కి కొద్ది వారాల ముందు జరిగింది. ఆ దేశం యొక్క ప్రతిష్టాత్మకమైన క్లీన్ ఎనర్జీ లక్ష్యాల కోసం ఈ ప్లాంట్ ఒక ప్రధాన ముందడుగు. ఇది 2050 నాటికి పునరుత్పాదక వనరుల నుండి 50% విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే యూఏఈ యొక్క లక్ష్యాన్ని మీరింత చేరువ చేసింది.

బంగాళాఖాతంలో మిచాంగ్ తుపాన్

నవంబర్ మొదటి వారంలో ఏర్పడ్డ మిధిలీ తుఫాన్, బంగ్లాదేశ్ మరియు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలోని అనేక జిల్లాలను తాకిన కొద్ది రోజులకే మరో ఉష్ణమండల తుపాన్ బంగాళాఖాతంలో ఏర్పడింది. డిసెంబర్ 2న దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, డిసెంబర్ 5న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో మిచాంగ్ తుపానుగా తీరం దాటింది. ఇది ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడ్డ నాల్గువ ఉష్ణమండల తుపాన్.

మిచాంగ్ తుపాన్ పేరును మయన్మార్ ప్రతిపాదించింది. మిచాంగ్ అనగా విస్తారమైన లేదా బలమైన అని అర్ధం. సైక్లోన్ మిచాంగ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో భారీస్థాయి ఆస్తి, పంట నష్టాన్ని కలిగించింది. మహారాష్ట్ర విదర్భ ప్రాంతం మరియు ఒడిశా రాష్ట్రంపై కూడా దీని ప్రభావం కనిపించింది.

ఉష్ణమండల తుఫాన్లకు పేరు పెట్టడానికి  ప్రపంచ వాతావరణ సంస్థ మరియు ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక కమిషన్ బాధ్యత వహిస్తాయి. తుఫానుల పేర్లు ప్రాంతీయ నియమాలపై ఆధారపడి ఉంటాయి. అట్లాంటిక్ మరియు దక్షిణ అర్ధగోళంలో (హిందూ మహాసముద్రం మరియు దక్షిణ పసిఫిక్) ఏర్పడే ఉష్ణమండల తుఫానులకు అక్షర క్రమంలో పేర్లను ప్రతిపాదిస్తారు. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఉష్ణమండల తుఫానులకు ముందుగా 13 సభ్యదేశాలు ద్వారా జాబితా చేయబడ్డ పేర్లను అక్షరక్రమంలో నామకరణం చేస్తారు.

2023 లో భారత తీరాలలో ఏర్పడ్డ తుపానుల జాబితా

ఈ ఏడాది భారత తీరప్రాంతాల్లో మొత్తం ఆరు తుపానులు ఏర్పడ్డయి. వీటిలో నాలుగు తుపాన్లు బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి. వీటిలో మోచా తుపాన్, బిపార్జోయ్ తుపాన్, తేజ్ తుపాన్, హమూన్ తుపాన్, మిధిలి తుపాన్ మరియు తాజా మిచాంగ్ తుపాన్ ఉన్నాయి.

మోచా సైక్లోన్ : మోచా ఈ ఏడాది ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ శక్తివంతమైన మరియు ప్రాణాంతకమైన ఉష్ణమండల తుఫాను. ఇది 9 మే 2023లో అండమాన్ మరియు నికోబార్ దీవులు , శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, భారతదేశం, యునాన్ భాగాలను ప్రభావితం చేసింది. ఈ తుపాన్ బంగ్లాదేశ్ & మయన్మార్ సరిహద్దులో తీరం దాటింది. ఇది 2023 ఉత్తర హిందూ మహాసముద్ర తుఫాను సీజన్‌లో ఏర్పడ్డ రెండవ అల్పపీడనం మరియు మొదటి తుఫాను తుఫాను. ఈ తుపానుకు మోచా (మోఖా) పేరును యెమెన్ ప్రతిపాదించింది.

బిపార్జోయ్ తుపాన్ : బిపార్జోయ్ తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన శక్తివంతమైన మరియు అస్థిర ఉష్ణమండల తుఫాను. ఇది 2023లో ఏర్పడ్డ రెండవ ఉత్తర హిందూ మహాసముద్ర తుఫాను. ఈ తుపాన్ జూన్ 16న భారతదేశంలోని నలియా (గుజరాత్) ప్రాంతంలో తీరాన్ని తాకింది. దీనికి పొరుగున ఉన్న బంగ్లాదేశ్ 'బిపార్జోయ్' అని పేరు పెట్టింది, బెంగాలీ భాషలో 'విపత్తు' అని దీని అర్థం. ఈ తుపాన్ భారతదేశం మరియు పాకిస్తాన్ లను ప్రభావితం చేసింది.

తేజ్ తుపాన్ : తేజ్ మధ్య-దక్షిణ అరేబియా సముద్రం మీదుగా ఏర్పడి యెమెన్‌పై ల్యాండ్‌ఫాల్ చేసిన తీవ్రమైన ఉష్ణమండల తుఫాను. ఇది ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడ్డ రెండవ తుపాన్. మొత్తంగా ఈ ఏడాది దేశంలో ఏర్పడ్డ మూడవ తుపాన్. అలానే 2018 లుబాన్ తుఫాను తర్వాత యెమెన్‌ దేశం తీరాన్ని తాకిన మొదటి తుఫాను ఇది. ఈ తుపాన్ 2023 అక్టోబర్ 23 మరియు 24 మధ్య యెమెన్‌లోని అల్ మహ్రా గవర్నరేట్‌లో ల్యాండ్‌ఫాల్ చేసింది. ఇది సోకోత్రా, యెమెన్, ఒమన్, సౌదీ అరేబియా లను ప్రభావితం చేసింది. తుఫాను తేజ్‌కి భారతదేశం పేరు పెట్టింది.

హమూన్ తుపాన్ : హమూన్ తుపాన్ ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడ్డ రెండవ ఉష్ణమండల తుఫాను. ఇది ఈ ఏడాది అక్టోబర్ 24న బంగ్లాదేశ్‌లో తీరాన్ని తాకింది. ఇది 2023 ఉత్తర హిందూ మహాసముద్ర తుఫాను సీజన్‌లో ఏర్పడ్డ నాల్గవ తుఫాను. ఇది బంగ్లాదేశ్, మయన్మార్, ఈశాన్య భారతదేశంను ప్రభావితం చేసింది. హమూన్ తుపానుకు ఇరాన్ పేరు పెట్టింది. హమూన్ అనేది ఒక పర్షియన్ పదం, ఇది లోతట్టు ఎడారి సరస్సులు లేదా చిత్తడి నేలలను సూచిస్తుంది.

మిధిలి తుపాన్ : మిధిలీ తుఫాను ఈ ఏడాది నవంబర్ 17, 2023న బంగ్లాదేశ్‌లో ల్యాండ్‌ఫాల్ చేసిన ఒక చిన్న తుఫాను. ఇది 2023 ఉత్తర హిందూ మహాసముద్రం తుఫాను సీజన్‌లో ఏర్పడ్డ ఐదవ తుఫాను అలానే బంగాళాఖాతంలో ఏర్పడ్డ మూడవ ఉష్ణమండల తుఫాను. ఇది ఈశాన్య భారతదేశం మరియు బంగ్లాదేశ్ ప్రాంతంలో ప్రభావితం చేసింది. ఈ తుఫానుకు మాల్దీవులు సూచించిన మిధిలి అని పేరు పెట్టారు. ఈ తుపాన్ బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మరియు మోంగ్లా మధ్య తీరాన్ని దాటింది.

మిచాంగ్ తుపాన్ : మిచాంగ్ తుపాన్ ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడ్డ నాలుగవ ఉష్ణమండల తుఫాను. ఇది డిసెంబర్ 5, 2023న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల సమీపంలో ల్యాండ్‌ఫాల్ చేసింది. 2021 సెప్టెంబర్ నెలలో ఏర్పడ్డ గులాబ్ తుఫాను తర్వాత ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిన మొదటి తుఫాను ఇది. ఈ తుపానుకు మయన్మార్‌చే ప్రతిపాదించబడ్డ మిచాంగ్ అనే పేరును పెట్టారు. మిచాంగ్ అంటే 'బలం మరియు స్థితిస్థాపకత' అని అర్ధం. ఈ తుపాన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో భారీస్థాయి ఆస్తి, పంట నష్టాన్ని కలిగించింది. మహారాష్ట్ర విదర్భ ప్రాంతం మరియు ఒడిశా రాష్ట్రంపై కూడా దీని ప్రభావం కనిపించింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

నవంబర్ 7 నుండి 30 మధ్య జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మరియు మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న భారత ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మిజోరాంలో స్థానిక మతపరమైన వేడుకల కారణంతో డిసెంబర్ 4న ఫలితాలు వెలువడ్డాయి. తాజా ఎన్నికలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ విజేతగా నిలువగా, తెలంగాణాలో కాంగ్రెస్, మిజోరాంలో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ విజేతగా నిలిచింది.

మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు : మధ్యప్రదేశ్ శాసనసభలోని మొత్తం 230 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 17 నవంబర్ 2023న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల ప్రకారం భారతీయ జనతా పార్టీ 163 సీట్లలో విజయం సాధించగా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలను దక్కించుకుంది. ఈ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ పార్టీ తిరిగి అధికారం నిలబెట్టుకుంది. గత 18 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగు సార్లు సీఎంగా పనిచేసారు.

రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు : రాజస్థాన్ శాసనసభలోని 200 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 25 నవంబర్ 2023న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల ప్రకారం భారతీయ జనతా పార్టీ 115 సీట్లలో విజయం సాధించగా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 69 స్థానాలను దక్కించుకుంది. ఈ రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. దీనితో ఈ రాష్ట్రంలో అధికార పార్టీ అధికారం కోల్పోయే ఆనవాయితీ కొనసాగినట్లు అయ్యింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు : తెలంగాణా శాసనసభలోని మొత్తం 119 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 30 నవంబర్ 2023న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల ప్రకారం భారత జాతీయ కాంగ్రెస్ 64 సీట్లలో విజయం సాధించగా, అధికార భారత రాష్ట్ర సమితి 39 స్థానాలను మాత్రమే దక్కించుకుని అధికారం కోల్పోయింది. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలను, ఎంఐఎం 7 స్థానాలను పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగటం ఇది మూడవసారి. గత రెండు పర్యాయాలలో కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అధికారంలో ఉంది.

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు : ఛత్తీస్‌గఢ్ శాసనసభలోని మొత్తం 90 మంది సభ్యులను ఎన్నుకోవడానికి నవంబర్ 7 మరియు 17 నవంబర్ 2023న రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల ప్రకారం భారతీయ జనతా పార్టీ 54 సీట్లలో విజయం సాధించగా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలను దక్కించుకుంది. ఈ రాష్ట్రంలో భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది.

మిజోరాం ఎన్నికల ఫలితాలు : మిజోరాం శాసనసభలోని మొత్తం 40 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 7 నవంబర్ 2023న  ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 4న వెలువడిన ఫలితాల ప్రకారం ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ అత్యధికంగా 27 స్థానాలతో విజయం సాధించగా, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ కేవలం 10 స్థానాలకు పరిమితమై అధికారం కోల్పోయింది. జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ జూలై 2019లో నమోదుఅయినా నాలుగేళ్లలో అధికారం చేజిక్కించుకుంది.

Post Comment