Advertisement
Latest Current affairs in Telugu : 4 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Latest Current affairs in Telugu : 4 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Latest Current affairs 4 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

భారతదేశ 84వ గ్రాండ్‌మాస్టర్‌గా వైశాలి రమేష్‌బాబు

చెన్నైకి చెందిన 22 ఏళ్ళ వైశాలి రమేష్‌బాబు భారతదేశ 84వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించారు. స్పెయిన్‌లో జరిగిన 2023 IV ఎల్లోబ్రెగాట్ ఓపెన్‌లో వైశాలి 2500 రేటింగ్‌ను అధిగమించి భారతదేశపు 84వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించారు. కోనేరు హంపీ మరియు హారిక ద్రోణవల్లి తర్వాత భారతదేశం నుండి మూడవ మహిళా గ్రాండ్‌మాస్టరుగా వైశాలి రమేష్‌బాబు నిలిచారు.

వైశాలి గతంలో ఎక్స్‌ట్రాకాన్ ఓపెన్ 2019, ఫిషర్ మెమోరియల్ 2022 మరియు ఖతార్ ఓపెన్ 2023 రూపంలో మూడు గ్రాండ్‌మాస్టర్ నిబంధలను అధిగమించి 2500 రేటింగ్‌కు చేరువయ్యింది. ఆమె ప్రస్తుతం 2501.5 లైవ్ రేటింగ్‌తో మహిళల ర్యాంకింగ్‌లో ప్రపంచ నంబర్ 11గా, భారతదేశ ర్యాంకింగులో రెండవ స్థానంలో ఉన్నారు. దీనితో పాటుగా వైశాలి మరియు ఆమె తమ్ముడు రమేష్‌బాబు ప్రగ్నానంద గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సాధించిన మొదటి తోబుట్టువుల జంటగా చరిత్ర సృష్టించారు.

రమేష్‌బాబు ప్రజ్ఞానానంద 10 సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయ మాస్టర్ అయ్యాడు. 12 సంవత్సరాల వయస్సులో గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. 2023 చెస్ ప్రపంచ కప్‌లో 18 ఏళ్ల ప్రగ్నానంద చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకున్న ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. చదరంగం ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్‌లో ప్రగ్నానంద ఫాబియానో ​​కరువానాను టై-బ్రేక్‌లలో ఓడించి, చెస్ ప్రపంచకప్ చరిత్రలో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫైనల్ చేరిన రెండో భారతీయుడు నిలిచాడు.

ఢిల్లీలో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ 2023

ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ 2023 ( ఐఐజిఎఫ్ 2023) డిసెంబర్ 5, 2023న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో నిర్వహించారు. ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ అనేది ఒక బహుళ-స్టేక్ హోల్డర్ ప్లాట్‌ఫారమ్, ఇది ఇంటర్నెట్‌కు సంబంధించిన పబ్లిక్ పాలసీ సమస్యలను చర్చించడానికి వేదిక కల్పిస్తుంది. ఐఐజిఎఫ్ యొక్క మొదటి రెండు ఎడిషన్‌లను 2021 మరియు 2022లో విజయవంతంగా నిర్వహించిన తర్వాత, ఐఐజిఎఫ్ యొక్క మూడవ ఎడిషన్ 'మూవింగ్ ఫార్వర్డ్ – కాలిబ్రేటింగ్ భారత్స్ డిజిటల్ ఎజెండా' అనే థీమ్‌తో నిర్వహించారు.

భారత్ కోసం సురక్షితమైన, విశ్వసనీయమైన & స్థితిస్థాపకమైన సైబర్‌స్పేస్‌ను నిర్మించడం, దేశం యొక్క అభివృద్ధి లక్ష్యాల కోసం ఇన్నోవేషన్‌ను ప్రారంభించడం, దేశంలో ఇంటర్నెట్ విభజనలను తగ్గించడం, గ్లోబల్ డిజిటల్ గవర్నెన్స్ & కోఆపరేషన్ నాయకత్వం వంటి అంశాలను లోతుగా పరిశోధించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహించింది.

ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ అనేది Uయూఎన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్‌తో అనుబంధించబడిన ఒక చొరవ. ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ అనేది ఒక బహుళ-స్టేక్ హోల్డర్ ప్లాట్‌ఫారమ్. ఐజిఎఫ్ ఇంటర్నెట్ అవకాశాలను పెంపొందించడంతో పాటుగా దాని ద్వారా తలెత్తే ప్రమాదాలు మరియు సవాళ్లను పరిష్కరించడంలో అవగాహనను సులభతరం చేస్తుంది.

 ఐసీఎఫ్ఆర్ఈ యొక్క మొదటి మహిళా డీజీగా కాంచన్ దేవి

మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1991 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్ అధికారి కాంచన్ దేవి, డెహ్రాడూన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసిఎఫ్‌ఆర్‌ఇ) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. దీనితో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా అధికారిణిగా ఆమె అవతరించారు. కాంచన్ దేవి గత నాలుగు సంవత్సరాలుగా ఐసిఎఫ్‌ఆర్‌ఇలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది కేంద్ర అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయంప్రతిపత్త సంస్థ. దీనిని 1986లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ యందు ఉంది. ఈ అటవీ పరిశోధన సంస్థ దేశంలోని సహజ అటవీ పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, రక్షణ, పునరుత్పత్తి, పునరావాసం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలుర జాబితాలో బోస్ కృష్ణమాచారి

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆర్ట్ మ్యాగజైన్ అయిన ఆర్ట్ రివ్యూ, కొచ్చి-ముజిరిస్ బినాలే సహ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు బోస్ కృష్ణమాచారిని దాని ప్రతిష్టాత్మక "పవర్ 100" జాబితాలో చోటు కల్పించింది. ఈ జాబితా ప్రపంచవ్యాప్తంగా సమకాలీన కళారంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించి గౌరవించింది. ఈ జాబితాలో ఆయన 38 స్థానంలో చోటు దక్కించుకున్నారు.

ఈ జాబితా సమకాలీన కళా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులను గుర్తిస్తుంది. ఇందులో కళాకారులు, ఆలోచనాపరులు, క్యూరేటర్లు, గ్యాలరిస్టులు, మ్యూజియం డైరెక్టర్లు మరియు కలెక్టర్లు ఉన్నారు. ప్రపంచ కళారంగంలో ఆయన చేసిన విశేష కృషిని ఈ మ్యాగజైన్ హైలైట్ చేసింది. సమకాలీన కళకు, ముఖ్యంగా ప్రాంతీయ సంశ్లేషణ మరియు కళ యొక్క ప్రజాస్వామ్యీకరణపై అతని దృష్టిని, ప్రముఖ అంతర్జాతీయ వేదికగా కొచ్చి బినాలేను స్థాపించడంలో అతని పాత్రను ఈ పత్రిక ప్రత్యేకంగా ప్రశంసించింది.

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క డిజిఫార్మడ్ పోర్టల్‌ ప్రారంభం

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునరుద్ధరించిన డిజిఫార్మడ్ (DIGI-PHARMed) పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ కొత్త పోర్టల్ దేశవ్యాప్తంగా ఫార్మసిస్ట్‌లు, ఫార్మసీ సంస్థలు, విద్యార్థులు మరియు ఉద్యోగార్ధులకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఫార్మసీ సంస్థలు/ఫార్మసిస్ట్/ఫార్మసీ విద్యార్థి/ఫార్మసిస్ట్ ఉద్యోగార్ధులకు ఎండ్-టు-ఎండ్ క్లౌడ్-ఆధారిత డిఐజిటల్ సేవలను అందిస్తుంది.

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధమైన సంస్థ. ఇది ఫార్మసీ చట్టం 1948 ద్వారా ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని ఫార్మసీ విద్యను నియంత్రిస్తుంది.

తెలంగాణ కొత్త డైరెక్టర్ జనరల్‌గా రవి గుప్తా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్, రవి గుప్తాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా మరియు పోలీస్ ఫోర్స్ హెడ్‌గా పూర్తి అదనపు బాధ్యతతో తక్షణమే అమల్లోకి వస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఇద్దరు అదనపు డీజీ ర్యాంక్ అధికారులు సంజయ్ జైన్ మరియు మహేష్ మురళీధర్ భగవత్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది.

డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సంధర్బంగా డీజీపీ అంజనీకుమార్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమై ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల పూర్తి ఫలితాలు రాకముందే ఈ చొరవ తీసుకున్నందుకు గాను ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2023

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) 2023 నివేదిక డిసెంబర్ 5, 2023 న విడుదల చేయబడింది. ఈ నివేదిక 2022 సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో నేరాలకు సంబంధించిన డేటాను అందిస్తుంది. ఈ నివేదిక మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలపై నమోదైన నేరాలు నాలుగు శాతం పెరిగినట్లు నివేదించింది. 2022లో ప్రతిరోజూ 468 మంది ప్రాణాలు తీసుకున్నట్లు నివేదించింది. సైబర్ నేరాలు దాదాపు 25 శాతం పెరిగినట్లు కూడా తెలిపింది. గత ఏడాది 4,45,256 కేసులు నమోదయ్యాయినట్లు పేర్కొంది.

మహిళలపై నేరాల జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, మహారాష్ట్ర (45,331), రాజస్థాన్ (45,058) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హత్య విత్ రేప్/గ్యాంగ్‌రేప్' కేటగిరీ కింద, ఉత్తరప్రదేశ్ 62 నమోదైన కేసులతో మళ్లీ అగ్రస్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ 41తో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీలో గతేడాది 1,204 అత్యాచార కేసులు నమోదు కాగా, జైపూర్‌లో 497 కేసులు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వెల్లడించాయి.

2022లో పిల్లలపై నేరాలకు సంబంధించి మొత్తం 1,62,449 కేసులు నమోదయ్యాయి, 2021 (1,49,404 కేసులు)తో పోలిస్తే 8.7% పెరుగుదల కనిపించింది. ఈ కేసులకు సంబంధించి మహారాష్ట్రలో 20,762 కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్ (20,415), ఉత్తరప్రదేశ్ (18,682) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

సైబర్ నేరాల కింద మొత్తం 65,893 కేసులు నమోదయ్యాయి, 2021 (52,974 కేసులు) కంటే నమోదులో 24.4 % పెరుగుదల కనిపించింది. 2022లో తెలంగాణలో అత్యధికంగా 15,297 సైబర్ నేరాలు నమోదయ్యాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో 9,940 సైబర్ క్రైమ్ కేసులతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, ముంబై (4,724), హైదరాబాద్ (4,436) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2022లో వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. మొత్తం 11,290 మంది ఆత్మహత్య కేసులు నమోదు కాగా వారిలో 53% (6,083) మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. రైతుల ఆత్మహత్యలలో మహారాష్ట్రలో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానాలలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

కోల్‌కతా వరుసగా మూడో సంవత్సరం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ప్రకటించబడింది. ఆ తర్వాత స్థానాలలో పూణె (మహారాష్ట్ర) మరియు హైదరాబాద్ (తెలంగాణ) నగరాలు ఉన్నాయి. నివేదిక “క్రైమ్ ఇన్ ఇండియా 2022” పేరుతో 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు అలాగే కేంద్ర ఏజెన్సీల నుండి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించబడింది. ఈ నివేదిక ఏటా ఆగస్టు నెలలలో విడుదల చేయబడుతుంది.

Post Comment