Latest Current affairs in Telugu : 8 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Latest Current affairs in Telugu : 8 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Latest Current affairs in Telugu 8 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్‌ల మొదటి డెల్టా ర్యాంకింగ్‌ విడుదల

నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ఏబీపీ) యొక్క మొదటి డెల్టా ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ఈ మొదటి డెల్టా ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాణి బ్లాక్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లా కౌశాంబి బ్లాక్‌ రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 329 జిల్లాల పరిధిలో 500 ఆకాంక్షాత్మక బ్లాక్‌లకు సంబంధించి ఈ ర్యాంకింగ్ అందించబడింది.

ఈ ఏడాది జూన్ నెల వరకు బ్లాక్‌ల పనితీరు సూచికలలో సాధించిన పురోగతి ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇవ్వబడింది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా బ్లాకుల ర్యాంకింగ్‌ను లెక్కించడం ఇదే మొదటిసారి. ఏబీపీతో పాటు, 2023 అక్టోబర్ నెలలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ (ఏడీపీ) ర్యాంకింగ్‌లు కూడా ప్రకటించబడ్డాయి. ఇందులో రాయగడ (ఒడిశా) మరియు జముయి (బీహార్) వరుసగా మొదటి మరియు రెండవ ర్యాంక్‌లను సాధించాయి. ఏడీపీ యొక్క థీమాటిక్ మరియు ఓవరాల్ కేటగిరీల ఆధారంగా అగ్రశ్రేణి ర్యాంకర్లను సత్కరించారు.

ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ఏబీపీ) ఈ ఏడాది జనవరి 7 ప్రారంభించబడింది. ఏబీపీ భారతదేశంలోని అత్యంత కష్టతరమైన మరియు సాపేక్షంగా అభివృద్ధి చెందని బ్లాక్‌లలోని పౌరుల జీవన నాణ్యతను మరియు పాలనను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. భారతదేశంలోని 27 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలలో 329 జిల్లాల నుండి 500 బ్లాక్‌లలో ఈ కార్యక్రమం అమలులో ఉంది.

ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బేరీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్, ప్రొఫెసర్ రమేష్ చంద్, డాక్టర్ వీకే పాల్ మరియు డాక్టర్ అరవింద్ వీరమణి మరియు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం కూడా హాజరయ్యారు.

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుండి బహిష్కరణ

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, డిసెంబర్ 8న పార్లమెంటు నుండి బహిష్కరించబడ్డారు. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ముడుపు (క్యాష్ ఫర్ క్వెరీ) తీసుకోవడంతో పాటుగా తన పార్లమెంట్ ప్రొఫైల్ యూజర్ వివరాలు బయట వ్యక్తులతో పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు విఘాతం కలిగించారని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమెను దోషిగా నిర్ధారించడంతో ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది.

ఈ ఏడాది అక్టోబరు నెలలో న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ ఈమె పై పార్లమెంటులో ఫిర్యాదు చేశారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు ప్రతిగా దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి మొయిత్రా నగదు మరియు బహుమతులు పొందారని ఆయన ఆరోపిస్తూ ఈ పిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును స్వీకర్ లోక్‌సభ ఎథిక్స్ కమిటీకి అందజేశారు. ఈ విషయాన్ని విచారించిన ఎథిక్స్ కమిటీ, డిసెంబర్ 8న తన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ద్వారా మోయిత్రా "అనైతిక ప్రవర్తన"కి పాల్పడిందని నిర్ధారించింది. అలానే ఆమెను లోక్‌సభ నుండి బహిష్కరించాలని సిఫార్సు చేసింది.

మోయిత్రా ఈ ఆరోపణలను ఖండించారు. ఎథిక్స్ కమిటీ తనకు న్యాయబద్ధమైన విచారణను నిరాకరించిందని, కేవలం మాటలు మరియు ఊహాగానాల ఆధారంగా ఈ నివేదికలో తనను దోషిగా నిర్దారించినట్లు పేర్కొంది. ఈ క్యాష్-ఫర్-క్వరీ' కేసులో లోక్‌సభ నుండి బహిష్కరణను సవాలు చేసేందుకు మహువా మోయిత్రా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.

ఈ బహిష్కరణ రాజకీయ ప్రేరేపితమైనదని, ఇది మొయిత్రా యొక్క వాక్ స్వాతంత్ర్య హక్కును ఉల్లంఘిస్తునట్లు పేర్కొంది. ఈ అప్పీల్‌ను వచ్చే నెలల్లో సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ కేసు ఫలితం భారతదేశంలోని ఎంపీల వాక్ స్వాతంత్ర్యం మరియు భావప్రకటనా స్వేచ్ఛపై గణనీయమైన ప్రభావాలను చూపుతుంది.

మేరా గావ్, మేరీ ధరోహర్ ప్రాజెక్టు ప్రారంభం

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, దేశ వ్యాప్తంగా గ్రామాల సాంస్కృతిక మ్యాపింగ్ మరియు డాక్యుమెంటేషన్ చేయడం కోసం మేరా గావ్ మేరీ ధరోహర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని విభిన్న కమ్యూనిటీల సాంస్కృతిక వారసత్వం యొక్క గుర్తింపును, ప్రత్యేకతను మ్యాపింగ్ చేయనుంది. భారతీయ గ్రామీణ జీవితం, చరిత్ర మరియు నైతికతలతో కూడిన సమగ్ర సమాచారాన్నిడిజిటిలైజ్ చేస్తూ వర్చువల్ మరియు నిజ-సమయ సందర్శకులకు అందుబాటులో ఉంచుతుంది.

ఈ ప్రాజెక్ట్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ భాగస్వామ్యంతో అమలు చేయబడుతోంది. ఇందులో భాగంగా గ్రామీణ చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, కళ మరియు సంస్కృతితో సహా వారి సాంస్కృతిక వారసత్వ సమాచారాన్ని సేకరించడానికి గ్రామాల స్థాయిలో సర్వేలను నిర్వహిస్తోంది. సేకరించిన సమాచారాన్ని టెక్స్ట్, ఇమేజ్‌లు మరియు వీడియోలతో సహా వివిధ ఫార్మాట్‌లలో డాక్యుమెంట్ చేస్తోంది.

గ్రామీణ మరియు పట్టణ జనాభాలో భారతదేశం యొక్క సుసంపన్నమైన మరియు వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన పెంచడానికి ఈ ప్రాజెక్ట్ సహాయం చేస్తుంది. భవిష్యత్ తరాలకు భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది.

ఈ ప్రాజెక్ట్ దశలవారీగా అమలు చేయబడుతోంది, మొదటి దశ భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో 100 గ్రామాలను కవర్ చేస్తుంది. రెండవ దశ ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతంలో అదనంగా 100 గ్రామాలను కవర్ చేస్తుంది మరియు మూడవ దశ దేశంలోని మిగిలిన అన్ని గ్రామాలను కవర్ చేస్తుంది. ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి డిసెంబర్ 7న రాజ్యసభలో తెలిపారు. దీని కోసం మేరా గావ్, మేరీ ధరోహర్ (MGMD) వెబ్ పోర్టల్ కూడా ఈ ఏడాది జూలై 27న ప్రారంభించబడింది.

ఇండియా సహకారంతో గ్రీన్ రైజింగ్ చొరవను ప్రారంభించిన యూనిసెఫ్

యూనిసెఫ్  యొక్క జనరేషన్ అన్‌లిమిటెడ్, భారతదేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ సహకారంతో "గ్లోబల్ గ్రీన్ రైజింగ్" అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 8న దుబాయ్‌లోని కాప్28 సమావేశంలో ఆవిష్కరించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్  సానుకూల పర్యావరణ మార్పు కోసం యువతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్రీన్ రైజింగ్ ఇండియా అలయన్స్ సహకారంతో అమలు చేయబడుతుంది.

గ్లోబల్ గ్రీన్ రైజింగ్ మరియు గ్రీన్ రైజింగ్ ఇండియా అలయన్స్ అనేవి యూనిసెఫ్, జనరేషన్ అన్‌లిమిటెడ్ మరియు విభిన్నమైన పబ్లిక్, ప్రైవేట్ మరియు యూత్ భాగస్వాములతో కూడిన సహకార ప్రయత్నాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యువకులను సమీకరించడం, వారి కమ్యూనిటీలపై వాతావరణ మార్పుల యొక్క తీవ్రమైన ప్రభావాలను పరిష్కరించడం మరియు వాటికి అనుగుణంగా హరిత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం వీటి ప్రధాన లక్ష్యం.

గ్రీన్ రైజింగ్ చొరవ వాతావరణ మార్పుల యొక్క తీవ్ర ప్రభావాలను పరిష్కరించడానికి ప్రపంచ ప్రయత్నానికి అనుగుణంగా, అట్టడుగు స్థాయిలో ప్రభావవంతమైన పర్యావరణ చర్యల కోసం యువతను నిమగ్నం చేయడంపై దృష్టి పెడుతుంది. భారతదేశంలో జనరేషన్ అన్‌లిమిటెడ్ ఇండియా (యువా!) ప్రచారం మరియు మిషన్ లైఫ్ ఉద్యమం ద్వారా దీనిని నిర్వహించనున్నారు.

2030 నాటికి 50 మిలియన్ల యువ భారతీయులను చేరుకోవడం మరియు సాధికారత కల్పించడం, పర్యావరణ స్పృహ కలిగిన నాయకుల తరాన్ని ప్రోత్సహించడం ఈ చొరవ లక్ష్యం. అడవుల పెంపకం, పునరుత్పాదక శక్తి, వ్యర్థాల నిర్వహణ మరియు స్థిరమైన వ్యవసాయం వంటి రంగాల్లో యువత నేతృత్వంలోని కార్యక్రమాలకు గ్రీన్ రైజింగ్ మద్దతు ఇస్తుంది.

జనరేషన్ అన్‌లిమిటెడ్ ఇండియా (యువా!) 2019లో యూనిసెఫ్ మరియు ఇండియా సహకారంతో ప్రారంభించబబడింది. ఇది ఒక గ్లోబల్ మల్టీ-సెక్టార్ పార్టనర్‌షిప్. ఈ చొరవ యువ జనరేషన్ విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధిని ఉపాధి మరియు వ్యవస్థాపకతకు అనుసంధానిస్తుంది. ఇప్పటి వరకు 26 మిలియన్ల మంది యువకులకు ఇది ప్రయోజనం చేకూర్చింది.

మిషన్ లైఫ్ ఉద్యమాన్ని 1 నవంబర్ 2021న గ్లాస్గోలోని కాప్ 26లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత స్థాయిలో పౌరులను ప్రోత్సహిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో పర్యావరణ అనుకూలమైన జీవన శైలిని ఇది ప్రోత్సహిస్తుంది. దీని కోసం మిషన్ లైఫ్ ప్రతిజ్ఞను (పర్యావరణాన్ని పరిరక్షించడానికి నా దైనందిన జీవితంలో సాధ్యమయ్యే అన్ని మార్పులు చేస్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను) కూడా రూపొందించింది.

బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ (ఇండియా) గా ఫెడరల్ బ్యాంక్

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయినా ఫెడరల్ బ్యాంక్ (ఇండియా), ఫైనాన్షియల్ టైమ్స్ యాజమాన్యంలోని ది బ్యాంకర్ చేత "బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ (ఇండియా) 2023" గా గుర్తించబడింది. ఫెడరల్ బ్యాంకు ఈ ఏడాది భారతీయ బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ పనితీరును కనబరిచేవారిలో ఒకటిగా నిలిచింది. ఈ అవార్డును నవంబర్ 30న లండన్‌లో నిర్వహించబడిన బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ వేడుకలో అందజేశారు. 2023లో 140 దేశాల్లోని ఆర్థిక సంస్థలు ఈ అవార్డులు అందుకున్నాయి.

ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ అనేది కేరళలోని కొచ్చిలోని అలువాలో ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకు. దీనిని 23 ఏప్రిల్ 1931న కులంగర పాలో హోర్మిస్ స్థాపించారు. ఈ బ్యాంకు దేశ వ్యాప్తంగా 1,408+ బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. అబుదాబి మరియు దుబాయ్‌లలో విదేశీ ప్రతినిధుల కార్యాలయాలను కూడా కలిగి ఉంది. ఈ బ్యాంకు ప్రస్తుత చైర్మన్ మరియు సీఈఓగా శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు.

ఇకపోతే ది బ్యాంకర్స్ అవార్డులలో ఇటలీకి చెందిన యూనిక్రెడిట్, గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు అందుకుంది. అలానే ఆఫ్రికా రీజియన్ నుండి యునైటెడ్ బ్యాంక్ ఫర్ ఆఫ్రికా, అమెరికా నుండి బాంకో బిల్బావో విజ్కాయా అర్జెంటారియా, ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుండి మేబ్యాంక్, మధ్య & తూర్పు యూరప్ నుండి రైఫీసెన్ బ్యాంక్, మిడిల్ ఈస్ట్ నుండి అరబ్ బ్యాంక్ మరియు పశ్చిమ యూరోప్ నుండి యూనిక్రెడిట్ ఉత్తమ బ్యాంకింగ్ అవార్డు అందుకున్నాయి.

ప్రపంచ నాల్గవ అతిపెద్ద బీమా సంస్థగా ఎల్ఐసి

ఎస్&పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్థిక రిజర్వ్‌ల ఆధారంగా ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద బీమా కంపెనీగా అవతరించింది. ఈ నివేదిక ప్రకారం ఎల్ఐసి వద్ద $ 500 బిలియన్లకు పైగా నిల్వలు ఉన్నట్లు నివేదించింది. ఎస్&పి గ్లోబల్ ఇటీవల ప్రపంచంలోని 50 అతిపెద్ద జీవిత బీమా సంస్థల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆసియా నుండి 17 సంస్థలు అగ్రశ్రేణి జీవిత బీమా సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. చైనా మరియు జపాన్‌లు దీనికి సంబంధించి ఆసియాలో అగ్రస్థానాన్ని పంచుకున్నాయి.

నవంబర్ 29న ప్రచురించబడిన ర్యాంకింగ్‌లో ముంబై ప్రధాన కార్యాలయమైన ఎల్‌ఐసి నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో జర్మనీకి చెందిన అలియన్జ్ ఎస్ఈ అగ్రస్థానంలో ఉండగా తర్వాత రెండు స్థానాలలో చైనా యొక్క చైనా లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జపాన్ యొక్క నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. అమెరికా ఆధారిత మెట్‌లైఫ్ మరియు ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్ ఇంక్ ఐదవ స్థానంలో నిలిచింది.

  1. అలియన్జ్ ఎస్ఈ : $750.20 బిలియన్లు (జర్మనీ)
  2. చైనా లైఫ్ ఇన్సూరెన్స్ : $616.90 బిలియన్లు (చైనా)
  3. నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ : $536.80 బిలియన్లు (జపాన్)
  4. ఎల్‌ఐసి : $ 503 బిలియన్లు (ఇండియా)
  5. మెట్‌లైఫ్ మరియు ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్ ఇంక్ $ 500 బిలియన్లు (యూఎస్)

మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్‌గా రాజీవ్ ఆనంద్‌

మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన చైర్మన్‌గా రాజీవ్ ఆనంద్ నియమితులయ్యారు. రాజీవ్ డిసెంబర్ 5న ప్రస్తుత చైర్మన్ అనల్జిత్ సింగ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ ఆనంద్ ఇది వరకు మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యందు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంగా సేవలు అందిస్తున్న ప్రముఖ భారతీయ జీవిత బీమా సంస్థ. ఇది భారతదేశంలోని అతిపెద్ద నాన్-బ్యాంక్ ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థలలో ఒకటి. ఈ సంస్థ 2001లో స్థాపించబడింది. ఇది మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు యాక్సిస్ బ్యాంక్ మధ్య 80:20 జాయింట్ వెంచర్.

Advertisement

Post Comment