Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 09, 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 09, 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 09, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.

పౌరుల కోసం జాతీయ డిజిటల్ ఐడీ ప్రవేశపెట్టిన భూటాన్

భూటాన్ తన పౌరులకు ప్రపంచంలోనే మొదటి స్వీయ సార్వభౌమ జాతీయ డిజిటల్ గుర్తింపు కార్డు వ్యవస్థను అమలు చేయడానికి తన ప్రణాళికలను ఆవిష్కరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే భూటాన్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ నివేదిక ప్రకారం ఈ జాతీయ డిజిటల్ ఐడీ అనేది ఒకరకమైన డిజిటల్ వాలెట్ మాదిరి పనిచేస్తుంది. ఇది పౌరులకు సురక్షితమైన మరియు ధృవీకరించదగిన గుర్తింపు ఆధారాలను అందించడానికి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగిస్తుంది.

ఇది ఒకరకమైన వికేంద్రీకృత ఐడీ సాంకేతికత ఆధారంగా స్వీయ-సార్వభౌమ గుర్తింపు నమూనాను ఉపయోగించి రూపొందించబడింది. ఇది వినియోగదారులకు వారి ఐడీపై ఎక్కువ నియంత్రణను ఇస్తుంది. పౌరులు తమ వ్యక్తిగత డేటాను ఎవరితో పంచుకోవచ్చో ఎంచుకోవడానికి వారికి అనుమతిస్తుంది. ఈ ఐడీ వ్యవస్థ భారతదేశం యొక్క ఆధార్ బయోమెట్రిక్ ఐడీ వ్యవస్థను పోలి ఉంటుంది.

ఈ జాతీయ డిజిటల్ వాలెట్ వ్యక్తిగత ఐడీతో పాటుగా పౌరుల ఆరోగ్య వివరాలు, పన్ను దాఖలు, విద్య మరియు జనాభా లెక్కల రికార్డులు, రెవెన్యూ, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు మరియు వ్యాపార పత్రాలతో సహా ఇతర సమాచారాన్ని కూడా కలిగి ఉంటుందని ఇది పేర్కొంది.

ఇండియా, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సమావేశంలో 3 అవగహన ఒప్పందాలపై సంతకం

సెప్టెంబరు 8, 2023న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం తర్వాత ఇరుదేశలు మూడు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. ఈమూడు అవగాహన ఒప్పందాలలో డిజిటల్ చెల్లింపు మెకానిజమ్స్‌లో సహకారం, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం పునరుద్ధరణ, వ్యవసాయ పరిశోధనలో సహకారం ఉన్నాయి.

డిజిటల్ చెల్లింపు మెకానిజమ్స్‌లో సహకార ఒప్పందం రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపు విధానాలను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు బంగ్లాదేశ్ బ్యాంక్‌ల మధ్య సహకారాన్ని అనుమతిస్తుంది. సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం పునరుద్ధరణ అవగాహన ఒప్పందం 2023-2025 ఏడాదిలా కోసం పునరుధరించబడుతుంది. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు మరియు కళాకారుల మార్పిడిని సులభతరం చేస్తుంది.

వ్యవసాయ పరిశోధనలో సహకారం అవగాహన ఒప్పందం ఇరుదేశల వ్యవసాయ పరిశోధన, విద్య మరియు విస్తరణ రంగాలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మరియు బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్ మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం భారత్-బంగ్లాదేశ్ సంబంధాలలో ఒక ముఖ్యమైన పరిణామం. డిజిటల్ చెల్లింపులు, సంస్కృతి మరియు వ్యవసాయంతో సహా అనేక రంగాలలో రెండు దేశాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం ఉపసంహరణకు అస్సాం సిపార్సు

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ని తమ రాష్ట్రం నుండి ఉపసంహరించుకోవాలని అస్సాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సెప్టెంబరు 8, 2023న ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అధ్యక్షతన జరిగిన అస్సాం కేబినెట్ సమావేశం తర్వాత ఈ సిఫార్సు చేయబడింది.

ఎఎఫ్ఎస్‌పిఎ అనేది ఒక వివాదాస్పద చట్టం. ఇది "సున్నిత ప్రాంతాలు"గా ప్రకటించబడిన ప్రాంతాలలో సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలను మంజూరు చేస్తుంది. అనుమానిత ఉగ్రవాదులను వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి, శోధించడానికి మరియు కాల్చడానికి ఈ చట్టం సాయుధ బలగాలను అనుమతిస్తుంది.

1990లో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ ద్వారా రాష్ట్రం వేర్పాటువాద తిరుగుబాటు ప్రారంభమైనప్పటి నుండి అస్సాంలో ఈ ఎఎఫ్ఎస్‌పిఎ అమలులో ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, అస్సాంలోని కొన్ని ప్రాంతాల నుండి ఈ చట్టం క్రమంగా ఉపసంహరించబడింది, అయితే ఇది ఇప్పటికీ కొన్ని జిల్లాలలో అమలులో ఉంది. మొత్తం రాష్ట్రం నుంచి ఎఎఫ్ఎస్‌పిఎ ఉపసంహరణకు సిఫారసు చేస్తూ అస్సాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ముఖ్యమైన పరిణామం.

ఇది అస్సాంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడటానికి మరియు మానవ హక్కుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు సంకేతం. ఎఎఫ్ఎస్‌పిఎ ఉపసంహరణ అస్సాం ప్రజలకు అనేక సానుకూల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది రాష్ట్రం యొక్క సైనికీకరణను తగ్గించడానికి మరియు ప్రజలు, భద్రతా దళాల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరియు సామాజిక పురోగతికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది.

నంద్ బాబా మిల్క్ మిషన్ అమలు కోసం కమిటీని ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నంద్ బాబా మిల్క్ మిషన్‌ను అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ, సహకార శాఖ, ఆర్థిక శాఖ ప్రతినిధులు ఉంటారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని యువత మరియు మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఈ మిషన్‌ను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

నంద్ బాబా మిల్క్ మిషన్ అనేది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 2023లో పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారులకు సాధికారత కల్పించడానికి ప్రారంభించిన పథకం. ఈ పథకం ప్రభుత్వం ₹1,000 కోట్ల బడ్జెట్‌ ప్రకటించింది. ఈ పథకం 10 మిలియన్లకు పైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా.

సందర్శకుల కోసం జీ20 ఇండియా మొబైల్ యాప్‌ ప్రారంభం

భారత ప్రభుత్వం జీ20 సమావేశాలకు హాజరయ్యే సందర్శకుల కోసం జీ20 ఇండియా మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. సందర్శకులకు జీ20 సమ్మిట్ మరియు సంబంధిత ఈవెంట్‌ల గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి, అలాగే భారతదేశం గురించి రవాణా, వసతి మరియు పర్యాటక ఆకర్షణలు వంటి ఆచరణాత్మక సమాచారాన్ని అందించడానికి ఈ యాప్ రూపొందించబడింది. ఈ యాప్‌ను కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 4, 2023న ప్రారంభించారు.

జీ20 సమ్మిట్ సందర్భంగా భారతదేశానికి వచ్చే సందర్శకులకు జీ20 ఇండియా మొబైల్ యాప్ విలువైన వనరు. ఇది సందర్శకులకు జీ20 సమ్మిట్ మరియు సంబంధిత ఈవెంట్‌ల గురించి సమాచారాన్ని అందిస్తుంది, అలాగే భారతదేశం గురించి ఆచరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్ ఇంటరాక్టివ్‌గా కూడా ఉంటుంది. వినియోగదారులు తమ అభిప్రాయాన్ని మరియు సూచనలను పంచుకోవడానికి అనుమతిస్తుంది.

భారతదేశంలో జీ20 సమ్మిట్ 2023 ముఖ్యాంశాలు

భారత జీ20 అధ్యక్షతన 18వ జీ20 సమావేశాలు సెప్టెంబర్ 9 నుండి 10 వ తేదీల మధ్య న్యూఢిల్లీలో నిర్వహించబడ్డాయి. ఈ సమ్మిట్‌కు G20 సభ్య దేశాల నాయకులు, అలాగే అతిథి దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ మరియు ఆర్థిక శత్రుత్వం పెరుగుతున్న సమయంలో ఈ సమావేశం జరిగింది. దీనిలో అభివృద్ధి జీ20 దేశాలు ప్రపంచవ్యాప్తంగా కొత్త పొత్తులను రూపొందిస్తున్నాయి. ఈ సమావేశంలో 55 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ (ఎయూ)కి జీ20 శాశ్వత సభ్య హోదా కల్పించే నిర్ణయం తీసుకున్నారు.

యునైటెడ్ స్టేట్స్, భారతదేశం మరియు సౌదీ అరేబియా నాయకులు మధ్యప్రాచ్యం మరియు దక్షిణాసియా, యూరప్‌ల మధ్య రైలు మరియు ఓడరేవుల లింక్‌లను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించారు, ఇది "నిజమైన పెద్ద ఒప్పందం" అని యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు.

2023 G20 సమ్మిట్ అనేక కీలక అంశాలపై దృష్టి సారించింది. వాటిలోప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పులు, ఆహార భద్రత మరియు డిజిటల్ పరివర్తన వంటివి ఉన్నాయి.ఈ సమావేశంలో కోవిడ్-19 మహమ్మారి నుండి ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ మరియు స్థిరమైన మరియు సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించే మార్గాల గురించి నాయకులు చర్చించారు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలను తక్కువ-కార్బన్ ఆర్థిక వ్యవస్థకు మార్చడంలో మద్దతు ఇవ్వడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నాయకులు చర్చించారు.

ఆర్థిక వృద్ధి మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి డిజిటల్ టెక్నాలజీల శక్తిని ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని నాయకులు నొక్కి చెప్పారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న సందర్భంలో ప్రపంచ ఆహారం మరియు ఇంధన భద్రతను నిర్ధారించాల్సిన అవసరాన్ని నాయకులు చర్చించారు. గ్లోబల్ హెల్త్ సిస్టమ్‌లను బలోపేతం చేయడం మరియు అందరికీ ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం గురించి కూడా చర్చించారు.

స్థిరమైన జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి గ్లోబల్ బయో ఫ్యూయల్స్ అలయన్స్‌ను రూపొందించడానికి జీ20 నాయకులు అంగీకరించారు. ఈ కూటమి స్థిరమైన జీవ ఇంధనాల సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి మరియు స్థిరమైన జీవ ఇంధనాల వాణిజ్యీకరణను ప్రోత్సహించడానికి పని చేస్తుంది.

భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ సెంటర్‌ను స్థాపించడానికి G20 నాయకులు అంగీకరించారు. గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి మరియు గ్రీన్ హైడ్రోజన్ యొక్క వాణిజ్యీకరణను ప్రోత్సహించడానికి ఈ కేంద్రం పని చేస్తుంది. జీ20 నాయకులు అందరికీ విద్యపై గ్లోబల్ పార్టనర్‌షిప్‌ను ప్రారంభించారు. పిల్లలు మరియు యువకులందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ఈ భాగస్వామ్యం పని చేస్తుంది.

ప్రపంచ ఆహార భద్రత సంక్షోభాన్ని పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి G20 నాయకులు కట్టుబడి ఉన్నారు. సుస్థిర వ్యవసాయంలో పెట్టుబడులను పెంచడానికి మరియు ఆహార ఉత్పత్తులలో బహిరంగ మరియు న్యాయమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి వారు అంగీకరించారు. లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. మహిళా విద్యలో పెట్టుబడులను పెంచేందుకు, శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు వారు అంగీకరించారు.

G20 ఢిల్లీ డిక్లరేషన్ : G20 ఢిల్లీ డిక్లరేషన్ అనేది భారతదేశంలో 2023 G20 సమ్మిట్ ముగింపులో G20 సభ్య దేశాల నాయకులు జారీ చేసిన ఉమ్మడి ప్రకటన. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పు, ఆహార భద్రత మరియు డిజిటల్ పరివర్తనతో సహా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ఈ డిక్లరేషన్ కట్టుబడి ఉంది.

గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G20) సమగ్ర సరూపం

గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G20) అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదిక. దీనిని 1999లో ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత ఏర్పాటు చేసారు. ఇది అన్ని ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక సమస్యలపై గ్లోబల్ ఆర్కిటెక్చర్ మరియు పాలనను రూపొందించడంలో మరియు బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారతదేశం 1 డిసెంబర్ 2022 నుండి 30 నవంబర్ 2023 వరకు G20 అధ్యక్ష పదవిని కలిగి ఉంది. గత ఏడాది ఈ అధ్యక్షతను ఇండోనేషియా నిర్వహించింది. ఈ నవంబర్ నుండి దీనిని బ్రెజిల్ నిర్వహించనుంది.

జీ 20 సభ్య దేశాలు : భారత్, యూఎస్, యూకే, చైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆర్జెంటినా, జపాన్, మెక్సికో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, టర్కియే, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్, యూరోపియన్ యూనియన్ కమీషన్. జీ 20 ఆహ్వానితా దేశాలు : బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషన్, ఒమాన్, నెదర్లాండ్స్, నైజిరియా, సింగపూర్, స్పెయిన్, యూఏఈ.

జీ 20 సమ్మిట్ యందు పాల్గొనే అంతర్జాతీయ సంస్థలు : ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కోసం కూటమి (CDRI), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (FSB), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO), ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF), ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA), ఆర్గనైజేషన్ ఆర్థిక సహకారం & అభివృద్ధి (OECD), ఐక్యరాజ్యసమితి (UN), ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO).

జీ20 లోగో భారతదేశ జాతీయ జెండా యొక్క శక్తివంతమైన రంగుల నుండి ప్రేరణ పొంది రూపొందించారు. ఈ లోగోలో భారత జాతీయ జండా రంగులలో ఉన్న జీ20 అక్షరాలతో పాటుగా వాటి పక్కన కమలంపై ఉంచిన గ్లోబ్ చిత్రం ఉంటుంది. వీటి కిందన హిందీ, ఇంగ్లీష్ భాషల్లో భారత్ 2023, ఇండియా 2023 అని లిఖించారు. భారత అధ్యక్షన జరిగిన ఈ సమావేశంకు “వసుధైవ కుటుంబం లేదా ఒక భూమి, ఒక కుటుంబం,  ఒక భవిష్యత్తు” అనే థీమ్ నిర్ణయించారు.

జీ20 రెండు సమాంతర ట్రాక్‌లను కలిగి ఉంటుంది. ఇందులో ఫైనాన్స్ ట్రాక్ మరియు షెర్పా ట్రాక్ అనేవి రెండు ఉంటాయి. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ఫైనాన్స్ ట్రాక్‌కు నాయకత్వం వహిస్తారు. ఫైనాన్స్ ట్రాక్ తర్వాత షెర్పాలు షెర్పా ట్రాక్‌కు నాయకత్వం వహిస్తారు. భారత జీ20 షెర్పాగా అమితాబ్ కాంత్ వ్యవరిస్తున్నారు. G20 ప్రక్రియ సభ్య దేశాల షెర్పాలచే సమన్వయం చేయబడుతుంది.

వీరికి అదనంగా ఈ కూటమికి జీ20 దేశాల పౌర సమాజాలు, పార్లమెంటేరియన్లు, థింక్ ట్యాంక్‌లు, మహిళలు, యువత, కార్మికులు, వ్యాపారాలు మరియు పరిశోధకులను ఒకచోట చేర్చే ఎంగేజ్‌మెంట్ గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూప్‌కు శాశ్వత సెక్రటేరియట్ లేదు. అయితే ప్రెసిడెన్సీ నిర్వహించే దేశానికి ట్రోయికా మద్దతు ఇస్తుంది. ట్రోయికా అనగా మునుపటి, ప్రస్తుత మరియు ఇన్‌కమింగ్ ప్రెసిడెన్సీ నిర్వహించే మూడు జీ20 దేశాల సమూహం. ప్రస్తుతం ఈ త్రయంలో వరుసగా ఇండోనేషియా, ఇండియా మరియు బ్రెజిల్‌ దేశాలు ఉన్నాయి.

భారత అధ్యక్షన అధికారిక G20 సమావేశాలు గత డిసెంబర్ 2022 నుండి ఈ సెప్టెంబర్ 2023 వరకు దేశ వ్యాప్తంగా 28 నగరాలలో నిర్వహబడ్డాయి. ఈ జాబితాలో శ్రీనగర్ (జమ్మూ & కాశ్మీర్) అమృత్‌సర్ (పంజాబ్), చండీగఢ్, గురుగ్రామ్ (హర్యానా), రిషికేశ్ (ఉత్తరాఖండ్), న్యూఢిల్లీ (ఢిల్లీ), జైపూర్, జోధ్‌పూర్, ఉదయపూర్ (రాజస్థాన్), రాన్ ఆఫ్ కచ్, కెవాడియా (గుజరాత్), ముంబై, పూణే (మహారాష్ట్ర), ఇండోర్, ఖజురహో (మధ్యప్రదేశ్), లక్నో, వారణాసి (ఉత్తరప్రదేశ్), సిలిగురి, కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), గౌహతి (అస్సాం), భువనేశ్వర్ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), హైదరాబాద్ (తెలంగాణ), గోవా (గోవా), హంపి, బెంగళూరు (కర్ణాటక), చెన్నై, మహాబలిపురం (తమిళనాడు), కొచ్చి, కుమరకోమ్, తిరువనంతపురం (కేరళ) ఉన్నాయి.

జీ20 ఎంగేజ్‌మెంట్ గ్రూపులు : జీ20 కూటమిలో 11 ప్రభుత్వేతర భాగస్వాములతో కూడిన ఎంగేజ్‌మెంట్ గ్రూపులు ఉన్నాయి. ఇవి G20 నాయకులకు సిఫార్సులను అందిస్తాయి. విధాన రూపకల్పన ప్రక్రియకు సహకరిస్తాయి. వీటిలో బిజినెస్ 20, సివిల్ 20, లేబర్ 20, పార్లమెంట్ 20, సైన్స్ 20, సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్స్ 20, స్టార్టప్ 20, థింక్ 20, అర్బన్ 20, ఉమెన్ 20, యూత్ 20 వంటివి ఉన్నాయి.

  1. బిజినెస్ 20 : బి20 అనేది ప్రపంచ వ్యాపార సంఘానికి ప్రాతినిధ్యం వహించే అధికారిక జీ 20 డైలాగ్ ఫోరమ్. ఇది 2010లో స్థాపించబడింది. ఇది గ్లోబల్ బిజినెస్ లీడర్‌లను ప్రోత్సహించే ప్రక్రియకు నాయకత్వం వహిస్తుంది. ఈ ఏడాదికి భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీకి బిజినెస్ 20 (B20) సెక్రటేరియట్‌గా నియమించబడింది.
  2. సివిల్ 20 : ఇది 2013లో అధికారిక G20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్‌గా ప్రారంభించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్‌లకు కాని వాటిని ముందుకు తీసుకురావడానికి ఒక వేదికను అందిస్తుంది.
  3. లేబర్ 20 : ఈ సమ్మిట్ అధికారికంగా 2011లో ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ సమయంలో జరిగింది. ఇది జీ20 ట్రేడ్ యూనియన్ నాయకులను సమావేశపరుస్తుంది. కార్మిక సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన విశ్లేషణలు మరియు విధాన సిఫార్సులను అందిస్తుంది.
  4. పార్లమెంట్ 20 : పార్లమెంట్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్, 2010లో కెనడా ప్రెసిడెన్సీ సమయంలో ప్రారంభించబడింది, దీనికి జీ20 దేశాల పార్లమెంట్‌ల స్పీకర్‌లు నాయకత్వం వహిస్తున్నారు. ఇది పార్లమెంటేరియన్లు సంబంధిత ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వారికీ శిక్షణ, పరిపాలన నాయకత్వ అవగహన కల్పిస్తుంది.
  5. సైన్స్ 20  : ఈ ఎంగేజ్‌మెంట్ గ్రూప్, G20 దేశాల జాతీయ సైన్స్ అకాడమీలతో కూడినది, 2017లో జర్మనీ ప్రెసిడెన్సీ సమయంలో ఇది ప్రారంభించబడింది. అంతర్జాతీయ నిపుణులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ల ద్వారా రూపొందించబడిన ఏకాభిప్రాయం-ఆధారిత సైన్స్-ఆధారిత సిఫార్సులను ఇది విధాన రూపకర్తలకు అందజేస్తుంది.
  6. సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్స్ 20 : ఇది 2022లో ఇండోనేషియా ప్రెసిడెన్సీ ప్రవేశపెట్టిన ఎంగేజ్‌మెంట్ గ్రూప్. ఇది పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో మరియు జీ20 సభ్యుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
  7. స్టార్టప్ 20 : ఈ ఎంగేజ్‌మెంట్ గ్రూప్ 2023 జీ20 ఇండియా ప్రెసిడెన్సీ క్రింద ప్రారంభించబడింది. ఇది స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం మరియు స్టార్టప్‌లు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఇన్నోవేషన్ ఏజెన్సీలు మరియు ఇతర కీలక పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య సమ్మేళనాన్ని ప్రారంభించడం వాటికి నాయకత్వం వహిస్తుంది.
  8. థింక్ 20 : ఇది అధికారిక G20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్‌గా 2012లో మెక్సికన్ ప్రెసిడెన్సీ సమయంలో ప్రారంభించబడింది. ఇది సంబంధిత అంతర్జాతీయ సామాజిక-ఆర్థిక సమస్యలను చర్చించడానికి థింక్ ట్యాంక్‌లు మరియు ఉన్నత-స్థాయి నిపుణులను ఒకచోట చేర్చుతుంది.
  9. అర్బన్ 20 : ఇది G20 దేశాలలోని నగరాలను కలిగి ఉన్న నగర దౌత్య కార్యక్రమం. ఇది స్థిరమైన అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో నగరాల పాత్రను నొక్కిచెప్పే సమిష్టి సందేశాన్ని అభివృద్ధి చేయడానికి నగరాల మధ్య నిశ్చితార్థం యొక్క శాశ్వత అభ్యాసాన్ని స్థాపించడానికి ఇది ప్రయత్నిస్తుంది.
  10. ఉమెన్ 20 : ఇది టర్కిష్ ప్రెసిడెన్సీ సమయంలో 2015లో ప్రారంభించబడింది. 2025 నాటికి శ్రామిక శక్తి భాగస్వామ్యంలో లింగ అంతరాన్ని 25% తగ్గించాలనే లక్ష్యంతో 2014లో బ్రిస్బేన్ సమ్మిట్‌లో ఆమోదించబడిన “25x25” నిబద్ధతను అమలు చేయడం ఉమెన్ 20 యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం.
  11. యూత్ 20 : ఇది 2010లో జరిగిన దాని మొదటి వై20 కాన్ఫరెన్స్‌తో, G20 ప్రాధాన్యతలపై యువత తమ దృష్టిని మరియు ఆలోచనలను వ్యక్తీకరించడానికి అనుమతించే వేదికను అందిస్తుంది. G20 నాయకులకు సమర్పించబడిన సిఫార్సుల శ్రేణితో ముందుకు వస్తుంది.

ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ యందు చేరిన మైల్‌స్వామి అన్నాదురై

ప్రముఖ శాస్త్రవేత్త, మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలువబడే మైల్‌స్వామి అన్నాదురై, ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో చేరినట్లు కంపెనీ తెలిపింది. ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ భారతదేశంలోని మొట్టమొదటి మరియు ఏకైక స్వదేశీ శస్త్రచికిత్స రోబోటిక్ సంస్థగా ప్రసిద్ధి చెందింది.

తమిళనాడులోని సేలం సాగోకు జిఐ ట్యాగ్

తమిళనాడులోని పాపులర్ సేలం సాగోకు జిఐ ట్యాగ్ కేటాయించబడింది. వివిధ రకాల తాటి చెట్ల (టాపియోకా) పిత్ నుండి సేకరించబడే ఈ పిండి పదార్ధంకు భారత ప్రభుత్వంచే జీఐ ట్యాగ్‌ లభించింది. ఈ జిల్లా పరిధిలో దాదాపు 35 వేల హెక్టర్ల భూభాగంలో ఈ చెట్లు సాగు చేయబడుతున్నాయి. దేశంలో 80 శాతం సాగో ఈ జిల్లాలోనే ఉత్పత్తి చేయబడుతుంది. భౌగోళిక గుర్తింపు అనేది దేశంలో ఏదైనా ఉత్పత్తికి చెందిన మేధో సంపత్తి, బ్రాండ్ గుర్తింపు, నాణ్యతా ప్రమాణాలను ప్రోత్సహించడానికి అందించబడే ఒక ప్రభుత్వ గుర్తింపు.

సేలం సాగో దాని ప్రత్యేక రంగు, రుచులకు ప్రసిద్ధి చెందింది. తెల్లని ముత్యలవలె ఉండే ఈ సాగో గింజలు మృదువైన ఆకృతి మరియు అధిక పిండి పదార్ధంకు ప్రసిద్ధి. ఇది ఖీర్, సాబుదానా ఖిచ్డీ మరియు పాయసంతో సహా వివిధ రకాల భారతీయ వంటకాలలో ఉపయోగించబడుతుంది. ఇది యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు సింగపూర్‌తో సహా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతుంది. సేలం జిల్లాకు సంబంధించి గతంలో సేలం ముడి సిల్క్ మరియు మాల్గోవా మామిడి ఉత్పతులు భౌగోళిక గుర్తింపు దక్కించుకున్నాయి.

అరేబియా సముద్రంలో భారత్-ఫ్రాన్స్ ద్వైపాక్షిక వ్యాయామం 'వరుణ 2023' ఫేజ్ II

వరుణ 21వ ఎడిషన్ (వరుణ-23) ఫేజ్ II అరేబియా సముద్రంలో భారతదేశం మరియు ఫ్రెంచ్ నౌకాదళాల మధ్య సెప్టెంబర్ 11-13 తేదీలలో నిర్వహించడింది. ఈ దైపాక్షిక వ్యాయామంలో రెండు వైపుల నుండి గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్‌లు, ట్యాంకర్, మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ మరియు సమగ్ర హెలికాప్టర్లు పాల్గొన్నాయి. మొదటి పేజ్ ఈ  జనవరి 16-20 తేదీలలో జరిగింది.

ఈ వ్యాయామం ఉపరితల యుద్ధం, వాయు వ్యతిరేక యుద్ధం, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం మరియు శోధన మరియు రెస్క్యూ వంటి వివిధ సముద్ర కార్యకలాపాలపై దృష్టి సారించింది. ఇది రెండు నౌకాదళాలు ఉమ్మడి కార్యకలాపాలను అభ్యసించడానికి మరియు వాటి పరస్పర చర్యను మెరుగుపరచడానికి అవకాశాన్ని కూడా అందించింది.

భారతీయ మరియు ఫ్రెంచ్ నావికాదళ మధ్య నిర్వహించే ఈ ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం 1993లో ప్రారంభించబడింది. ఈ వ్యాయామం తర్వాత 2001లో 'వరుణ'గా నామకరణం చేయబడింది. అప్పటి నుండి ఇది ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధానికి ముఖ్య కార్యక్రమంగా మారింది.

కర్తార్‌పూర్ కారిడార్‌లో కల్చరల్ థీమ్ పార్కును అభివృద్ధి చేయనున్న పాకిస్థాన్

పాకిస్తాన్ కర్తార్‌పూర్ కారిడార్‌లో ఒక సాంస్కృతిక థీమ్ పార్కును అభివృద్ధి చేసేందుకు సిద్దమవుతుంది. ఇది భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా బాబా నానక్ మందిరాన్ని పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌తో కలిపే వీసా రహిత మార్గంగా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ కర్తార్‌పూర్ కారిడార్ ఒక ప్రైవేట్ కంపెనీ సహకారంతో థీమ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది.

కర్తార్‌పూర్ కారిడార్‌కు ఎక్కువ మంది యాత్రికులను ఆకర్షించడానికి ఈ థీమ్ పార్క్ అభివృద్ధి చేయబడుతుంది. కర్తార్‌పూర్ కారిడార్ 2019లో ప్రారంభించబడింది. గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించడానికి భారతదేశం నుండి మిలియన్ల మంది సిక్కు యాత్రికులకు ఇది ఉపయోగపడనుంది. గురుద్వారా దర్బార్ సాహిబ్ సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది సిక్కుమత వ్యవస్థాపకుడైన గురునానక్ దేవ్ జీ తన జీవితంలో చివరి 18 సంవత్సరాలు గడిపిన ప్రదేశం.

ఈయూ సైన్స్ రీసెర్చ్ స్కీమ్ హోరిజోన్‌లో మళ్ళీ చేరిన యూకే

యూరోపియన్ యూనియన్  యొక్క ఫ్లాగ్‌షిప్ సైంటిఫిక్ రీసెర్చ్ స్కీమ్ హారిజన్‌లో యూకే మళ్లీ చేరుతున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం సెప్టెంబర్ 7, 2023న ప్రకటించబడింది. యూకే-ఆధారిత శాస్త్రవేత్తలు సెప్టెంబర్ 21, 2023 నుండి €95 బిలియన్ ఫండ్ నుండి నిధుల కోసం దరఖాస్తు చేసుకోనేందుకు అవకాశం లభిస్తుంది.

ఉత్తర ఐర్లాండ్ ప్రోటోకాల్‌పై అసమ్మతి కారణంగా యూకే గత మూడు సంవత్సరాలుగా హారిజన్ నుండి దూరంగా ఉంది. అయితే ఈయూలో యూకే ఒక అనుబంధ దేశంగా ఈ పథకంలో మళ్ళీ పాల్గొనేందుకు వీలు కల్పించే ఈ ఒప్పందాన్ని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇది యూకే సైన్స్ మరియు రీసెర్చ్‌కు ప్రధాన ప్రోత్సాహం. హారిజన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనా సహకార కార్యక్రమం.

ఇది ఆరోగ్యం, వాతావరణ మార్పులు మరియు డిజిటల్ సాంకేతికతలతో సహా అనేక రకాల విభాగాలలో ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూరుస్తుంది. యూకే శాస్త్రవేత్తలు ఇప్పుడు అత్యాధునిక పరిశోధన ప్రాజెక్టులపై వారి యూరోపియన్ సహచరులతో కలిసి పని చేయగలుగుతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కొత్త ఆవిష్కరణలు మరియు ఆవిష్కరణలకు దారితీస్తుందని భావిస్తున్నారు. సైన్స్ మరియు రీసెర్చ్‌లో గ్లోబల్ లీడర్‌గా తన స్థానాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని యూకే ప్రభుత్వం తెలిపింది. హారిజోన్‌లో మళ్లీ చేరాలనే నిర్ణయం ఈ నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం.

Post Comment