తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 18 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 18 మార్చి 2024

18 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

Advertisement

జర్నలిస్టులు గ్రీష్మా కుతార్, రితికా చోప్రాలకు చమేలీ దేవి జైన్ అవార్డ్

ప్రముఖ మహిళా జర్నలిస్టులు గ్రీష్మా కుతార్, రితికా చోప్రా సంయుక్తంగా చమేలీ దేవి జైన్ అవార్డ్ 2024ను గెలుచుకున్నారు. అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ కేటగిరిలో వీరు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం మార్చి 14న న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో (సిడి దేశ్‌ముఖ్ హాల్) జరిగింది. ఈ అవార్డును మీడియా ఫౌండేషన్ అందిస్తుంది.

రితికా చోప్రా : రితికా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చీఫ్ ఆఫ్ నేషనల్ బ్యూరో (గవర్నమెంట్) ఎడ్యుకేషన్ జర్నలిస్టుగా సేవలు అందిస్తున్నారు. ఈ సంస్థ యొక్క జాతీయ విద్యా సంపాదకురాలు కూడా అయిన చోప్రా, విద్య మరియు ప్రభుత్వ విధాన రంగాలలో లోతైన పరిశోధనాత్మక కథనాలకు ప్రసిద్ధి చెందారు.

గ్రీష్మా కుతార్‌ : గ్రీష్మా కుతార్‌ ఇండిపెండెంట్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈమె మణిపూర్ సంఘర్షణ వంటి మారుమూల సంఘర్షణలను గ్రౌండ్ లెవెల్‌ నుండి పరిశోధనాత్మక కథనాలు ప్రచురించి ప్రసిద్ధి చెందారు. ఈమె కథనాలు భారతదేశంలోని అట్టడుగు వర్గాల సమస్యలను జాతీయ రాజకీయ కథనాల సామాజిక మరియు సాంస్కృతిక ప్రభావంపై బలమైన దృష్టిని కలిగి ఉన్నాయి.

  • చమేలీ దేవి జైన్ అవార్డు 1980 నుండి మీడియా ఫౌండేషన్ ద్వారా అందించబడుతుంది.
  • మీడియం రంగంలో 'ఔట్ స్టాండింగ్ ఉమెన్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్'కు ఈ అవార్డు అందజేస్తారు.
  • చమేలీ దేవి జైన్ భారతదేశపు మార్గదర్శక మహిళా జర్నలిస్టులలో ఒకరిగా గుర్తింపు పొందారు.
  • ఈమె ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలుగా, పాత్రికేయురాలుగా మహిళల హక్కుల కోసం పోరాడారు.
  • జర్నలిజం మరియు మహిళా సాధికారతకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఆమె 1982లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.

చమేలీ దేవి జైన్ అవార్డును ఇదివరకు బర్ఖా దత్, నీర్జా చౌదరి, ఉషా రాయ్, పమేలా ఫిలిపోస్, సునీతా నారాయణ్, నిరుపమా సుబ్రమణియన్ మరియు ప్యాట్రిసియా ముఖిమ్ అందుకున్నారు. ఈ అవార్డు గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళా జర్నలిస్టులను గుర్తించి, వారిని సేవలను గౌరవిస్తుంది.

మీడియా ఫౌండేషన్ 1979లో వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ మరియు సమాచార స్వాతంత్య్రాన్ని నిలబెట్టడం మరియు మీడియా మరియు కమ్యూనికేషన్ ద్వారా జీవన నాణ్యతను పెంపొందించే లక్ష్యంతో స్థాపించబడింది.

భారతీయ రచయిత అమితవ్ ఘోష్‌కు ప్రతిష్టాత్మక ఎరాస్మస్ అవార్డు

ప్రముఖ భారతీయ రచయిత అమితవ్ ఘోష్‌కు ప్రతిష్టాత్మకమైన ఎరాస్మస్ ప్రైజ్ 2024 లభించింది. వాతావరణ మార్పులు మరియు పర్యావరణంతో మానవాళికి గల సంబంధాన్ని అన్వేషించే సాహిత్యానికి ఆయన చేసిన విశేషమైన కృషికి గాను ఈ అవార్డు అందించబడింది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రీమియమ్ ఎరాస్మియానమ్ ఫౌండేషన్ ఈ అవార్డును అందిస్తుంది.

  • అమితవ్ ఘోష్ కోల్‌కతాచెందిన ఒక భారతీయ రచయిత.
  • అమితవ్ ఘోష్ 2018లో భారతదేశ అత్యున్నత సాహిత్య గౌరవమైన 54వ జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు.
  • అమితవ్ ఘోష్ భారతదేశం మరియు దక్షిణాసియా ప్రజలకు సంబంధించి చారిత్రక కల్పన, వలసవాదం మరియు వాతావరణ మార్పులు వంటి అంశాలకు చెందిన నాన్-ఫిక్షన్ రచనలకు ప్రసిద్ధి చెందాడు.
  • అమితవ్ ఘోష్ జ్ఞానపీఠ్ అవార్డుతో పాటుగా సాహిత్య అకాడమీ అవార్డు, ఆనంద పురస్కార్, డాన్ డేవిడ్ ప్రైజ్, పద్మశ్రీ వంటి అవార్డులు కూడా అందుకున్నారు.

ఎరాస్మస్ ప్రైజ్ ఐరోపా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సంస్కృతి, సమాజం లేదా సాంఘిక అంశాలకు సంబంధించి అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు అందించబడుతుంది. ఈ వార్షిక అవార్డును నెదర్లాండ్స్‌కు చెందిన ప్రీమియం ఎరాస్మియానమ్ ఫౌండేషన్ బోర్డ్ అందిస్తుంది.

ఈ బహుమతిని డచ్ పునరుజ్జీవన మానవతావాది డెసిడెరియస్ ఎరాస్మస్ పేరుతో అందజేస్తారు. ఈ అవార్డు విజేతకు టైటానియం ప్లేట్‌లతో తయారు చేయబడిన హార్మోనికా శైలిలో మడతపెట్టిన రిబ్బన్ మరియు 150,000 యూరోల నగదు బహుమతి అందజేస్తారు. ఈ బహుమతి మొదటిసారి 1958లో అందించారు. ఈ అవార్డు వేడుక సాధారణంగా ఆమ్‌స్టర్‌డామ్‌లోని రాయల్ ప్యాలెస్‌లో జరుగుతుంది.

భారతదేశంలో ఫ్లై91 పేరుతొ కొత్త విమానయాన సంస్థ కార్యకలాపాలు ప్రారంభం

గోవాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై91 (FLY91) తన మొదటి వాణిజ్య విమానాలను మార్చి 18 నుండి ప్రారంభించింది. దీనితో ఫ్లై91 భారతదేశంలో తొమ్మిదవ దేశీయ విమానయాన సంస్థగా అవతరించింది. ఈ ప్రాంతీయ క్యారియర్ తన మొదటి విమానాన్ని గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిపింది.

ఈ సంస్థ త్వరలో గోవా, బెంగళూరు, సింధుదుర్గ్ మరియు హైదరాబాద్‌లకు విమానాలను నడుపుతుంది. ఈ సంస్థ కేవలం రూ. 1991 (అన్నీ కలుపుకొని) ప్రత్యేక ధరతో విమాన ప్రయాణ అనుభవాన్ని ఆఫర్ చేస్తుంది. ఈ సంస్థ ప్రస్తుతం 350 మంది సిబ్బందితో రెండు ఏటిఆర్ 72-600 విమానాలతో సేవలు ప్రారంభించింది, రాబోయే నెలల్లో మరో నాలుగు విమానాలు అందుబాటులోకి తేనుంది.

  • ఫ్లై91 (జస్ట్ ఉడో ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్) అనేది గోవా ప్రధాన కేంద్రగా ప్రారంభమైన ప్యూర్ ప్లే ప్రాంతీయ ఎయిర్‌లైన్.
  • ఇది ప్రభుత్వ రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద దేశంలో రీజనల్ విమానయాన సేవలు అందించనుంది.
  • ఈ సంస్థ భారతదేశంలోని టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడంపై ఫోకస్ చేస్తుంది.
  • రాబోయే ఐదేళ్లలో భారతదేశం అంతటా 50 నగరాలకు తన సేవలు విస్తరించేందుకు ప్రణాళిక చేస్తుంది.
  • ఫ్లై91 మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ : మనోజ్ చాకో

బెలారస్ విదేశాంగ మంత్రి సెర్గీ అలీనిక్ భారత్ పర్యటన

బెలారస్ విదేశాంగ మంత్రి సెర్గీ అలీనిక్ మార్చి 11 నుండి 13 మధ్య ఇండియాలో పర్యటించారు. ఈ పర్యటన బెలారస్ మరియు భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా జరిగింది. పర్యటన సందర్భంగా ఆయన విదేశాంగ మంత్రి డా ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో భారతదేశం-బెలారస్ ద్వైపాక్షిక సంబంధాల స్థితిని మంత్రులు సమీక్షించారు. వాణిజ్యం, ఆర్థిక, బీమా, రక్షణ, విద్య, ఐటీ మరియు సైన్స్ వంటి రంగాలలో అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరియు ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాల గురించి చర్చించారు. అలానే ఐక్యరాజ్యసమితి, షాంఘై సహకార సంస్థ మరియు ఇతర అనేక బహుపాక్షిక సమూహాలు/సంస్థల్లో పరస్పర ఆసక్తి మరియు సహకారం యొక్క ప్రాంతీయ/ప్రపంచ సమస్యల గురించి కూడా వీరు చర్చించారు.

ఈ పర్యటనలో భారత్ - బెలారస్ మధ్య 28 ద్వైపాక్షిక పత్రాలపై సంతకాలు జరిగాయి. అలానే 6 నుండి 7 కొత్త ఒప్పందాలపై కూడా సంతకాలు చేశారు. మైక్రోఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఎరువులు మరియు అనేక ఇతర వినూత్న రంగాల అభివృద్ధికి ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకోనున్నాయి.

  • రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ తూర్పు ఐరోపాలో ఒక భూపరివేష్టిత దేశం.
  • దీని తూర్పు మరియు ఈశాన్యంలో రష్యా, దక్షిణాన ఉక్రెయిన్, పశ్చిమాన పోలాండ్ మరియు వాయువ్యంలో లిథువేనియా మరియు లాట్వియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
  • రాజధాని : మిన్స్క్
  • అధికారిక భాషలు : బెలారసియన్ , రష్యన్
  • కరెన్సీ : బెలారసియన్ రూబుల్
  • అధ్యక్షుడు : అలెగ్జాండర్ లుకాషెంకో
  • ప్రధాన మంత్రి : రోమన్ గోలోవ్చెంకో

భారత లోక్‌సభ ఎన్నికల 2024 షెడ్యూల్ విడుదల

భారత ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 16న ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల కసరత్తు అయిన ఈ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు 44 రోజుల వ్యవధిలో ఏడు దశల్లో జరగనున్నాయి, ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.

భారతదేశంలోని మొత్తం 543 మంది లోక్‌సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మరియు సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు 1951–52 భారత సాధారణ ఎన్నికల తర్వాత 44 రోజుల పాటు సుదీర్ఘంగా జరగనున్నాయి.

  • ఈ ఎన్నికలలో దాదాపు 150 కోట్ల భారత జనాభాలో దాదాపు 97 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్ సభకు ఎన్నికలు నిర్వహించబడతాయి.
  • భారతదేశంలో మొత్తం లోక్‌సభ స్థానాలు 543. రాజ్యాంగంలోని 104వ సవరణ ద్వారా ఆంగ్లో - ఇండియన్ కమ్యూనిటీకి రిజర్వు చేయబడిన రెండు స్థానాలను రద్దు చేశారు.
  • భారతదేశ పౌరులు ఓటు హక్కు పొందేందుకు కనీస వయస్సు 18 సంవత్సరాలు.
  • 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం 16 మార్చి 2024న ప్రకటించింది.
  • 17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2024తో ముగియనుంది.
  • అరుణాచల్ ప్రదేశ్‌లోని మాలోగం గ్రామంలో నమోదైన ఏకైక ఓటరు కోసం ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.
  • ఈ ఎన్నికలలో 5.5 మిలియన్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ఉపయోగించనున్నారు.
  • ఈ ఎన్నికల కోసం దేశ వ్యాప్తంగా ఒక మిలియన్ కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్‌లు కేటాయించారు.
  • ఈ ఎన్నికలలో 15 మిలియన్ల ఎన్నికల సిబ్బంది మరియు భద్రతా సిబ్బంది సేవలు అందించనున్నారు.

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ 2014 నుండి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశాన్ని పరిపాలిస్తోంది. 17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2024న ముగియనుంది. మునుపటి సాధారణ ఎన్నికలు ఏప్రిల్-మే 2019లో జరిగాయి. ఈ ఎన్నికలలో గెలిచిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

భారతదేశం రెండు ప్రధాన పార్టీలతో బహుళ-పార్టీ వ్యవస్థను కలిగి ఉంది. దేశంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలు ప్రధాన జాతీయ పార్టీలుగా జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నాయి. అయితే ప్రస్తుత ఎన్నికలలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) మరియు ప్రతిపక్షం ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) కూటమిల అభ్యర్థులు నేరుగా పోటీపడుతున్నారు.

  1. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ : రాజీవ్ కుమార్
  2. భారత ఎన్నికల కమీషనర్ (1) : సుఖ్‌బీర్ సింగ్ సంధు
  3. భారత ఎన్నికల కమీషనర్ (2) : జ్ఞానేష్ కుమార్
  4. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి : ముఖేష్ కుమార్ మీనా
  5. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి: వికాస్ రాజ్
ఎన్నికల తేదీలు ఎన్నికల దశ
I II III IV V VI VII
నోటిఫికేషన్ తేదీ 20 మార్చి 28 మార్చి 12 ఏప్రిల్ 18 ఏప్రిల్ 26 ఏప్రిల్ 29 ఏప్రిల్ 7 మే
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 27 మార్చి 4 ఏప్రిల్ 19 ఏప్రిల్ 25 ఏప్రిల్ 3 మే 6 మే 14 మే
నామినేషన్ పరిశీలన 28 మార్చి 5 ఏప్రిల్ 20 ఏప్రిల్ 26 ఏప్రిల్ 4 మే 7 మే 15 మే
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 30 మార్చి 8 ఏప్రిల్ 22 ఏప్రిల్ 29 ఏప్రిల్ 6 మే 9 మే 17 మే
ఎన్నికల తేదీ 19 ఏప్రిల్ 26 ఏప్రిల్ 7 మే 13 మే 20 మే 25 మే 1 జూన్
ఓట్ల లెక్కింపు తేదీ 4 జూన్ 2024
నియోజకవర్గాల సంఖ్య 101​ 87 95 96 49 57 57

దశలవారీ ఓటింగ్ షెడ్యూల్

  • ఫేజ్ 1 (ఏప్రిల్ 19): 21 రాష్ట్రాలు/యూటీలలో 102 నియోజకవర్గాలు.
  • ఫేజ్ 2 (ఏప్రిల్ 26): 13 రాష్ట్రాలు/యూటీలలో 89 నియోజకవర్గాలు.
  • ఫేజ్ 3 (మే 7): 12 రాష్ట్రాలు/యూటీలలో 94 నియోజకవర్గాలు.
  • ఫేజ్ 4 (మే 13): 10 రాష్ట్రాలు/యూటీలలో 96 నియోజకవర్గాలు.
  • ఫేజ్ 5 (మే 20): ఎనిమిది రాష్ట్రాలు/యూటీలలో 49 నియోజకవర్గాలు.
  • ఫేజ్ 6 (మే 25): ఏడు రాష్ట్రాలు/యూటీలలో 57 నియోజకవర్గాలు.
  • ఫేజ్ 7 (జూన్ 1): ఎనిమిది రాష్ట్రాలు/యూటీలలో 57 నియోజకవర్గాలు.
ఆంద్రప్రదేశ్ & తెలంగాణ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 2024 - ( IV ఫేజ్ )
ఎన్నికల ప్రక్రియ ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ 18 ఏప్రిల్ 2024
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 25 ఏప్రిల్ 2024
నామినేషన్ పరిశీలన 26 ఏప్రిల్ 2024
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 29 ఏప్రిల్ 2024
ఎన్నికల తేదీ 13 మే 2024
ఓట్ల లెక్కింపు తేదీ 4 జూన్ 2024
 ఆంధ్రప్రదేశ్  నియోజకవర్గాల సంఖ్య లోక్‌సభ (25) & అసెంబ్లీ (175)
 తెలంగాణ  నియోజకవర్గాల సంఖ్య లోక్‌సభ (17) & అసెంబ్లీ (119)
 నోట్ : ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకే సమయంలో నిర్వహిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాది నవంబర్ 30న ఇప్పటికే పూర్తియ్యాయి.
రాష్ట్రాల వారీగా మొత్తం లోక్‌సభ, రాజ్యసభ మరియు అసెంబ్లీ సీట్లు
క్ర.స రాష్ట్రం/యూటీ లోక్‌సభ సీట్లు అసెంబ్లీ సీట్లు రాజ్యసభ సీట్లు
1 ఆంధ్రప్రదేశ్ 25 175 11
2 అరుణాచల్ ప్రదేశ్ 2 60 1
3 అస్సాం 14 126 7
4 బీహార్ 40 243 16
5 ఛత్తీస్‌గఢ్ 11 90 5
6 గోవా 2 40 1
7 గుజరాత్ 26 182 11
8 హర్యానా 10 90 5
9 హిమాచల్ ప్రదేశ్ 4 68 3
10 జార్ఖండ్ 14 81 6
11 కర్నాటక 28 224 12
12 కేరళ 20 140 9
13 మధ్యప్రదేశ్ 29 230 11
14 మహారాష్ట్ర 48 288 19
15 మణిపూర్ 2 60 1
16 మేఘాలయ 2 60 1
17 మిజోరం 1 40 1
18 నాగాలాండ్ 1 60 1
19 ఎన్సిటీ ఢిల్లీ 7 70 3
20 ఒడిషా 21 147 10
21 పుదుచ్చేరి 1 30 1
22 పంజాబ్ 13 117 7
23 రాజస్థాన్ 25 200 10
24 సిక్కిం 1 32 1
25 తమిళనాడు 39 234 18
26 తెలంగాణ 17 119 7
27 త్రిపుర 2 60 1
28 ఉత్తర ప్రదేశ్ 80 403 31
29 ఉత్తరాఖండ్ 5 70 3
30 జమ్మూ & కాశ్మీర్ 5 90 4
31 పశ్చిమ బెంగాల్ 42 294 16
32 6 కేంద్రపాలిత ప్రాంతాలకు 6
33 రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు 12
34 లోక్‌సభలో నామినేటెడ్ సభ్యులు 2
మొత్తం సీట్లు 545 4123 245

Advertisement

Post Comment