తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ 26 నవంబర్ 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.
విజయవాడ రైల్వేస్టేషన్‌కు ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికేషన్
నవంబర్ 24న చెన్నై ట్రేడ్ సెంటర్‌లో జరిగిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌లో విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం సర్టిఫికేషన్- హైయెస్ట్ స్టాండర్డ్ ఐజిబిసి (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) రేటింగ్ లభించింది. ఈ ధ్రువీకరణ పత్రాన్ని విజయవాడ రైల్వేస్టేషన్‌కు చెందిన రైల్వే సీనియర్ అధికారులు అందుకున్నారు. పర్యావరణ ప్రమాణాలను మెరుగుపరచడంలో మరియు అందించడంలో చేసిన కృషికి గాను విజయవాడ రైల్వే స్టేషన్ అత్యధిక ప్లాటినం రేటింగ్‌ను సాధించింది.
ఈ ఏడాది జనవరిలో ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు కూడా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించే గ్రీన్ కాన్సెప్ట్‌లను అనుసరించినందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా 'గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ అందించబడింది. అలానే ఇదే నెలలో హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ కూడా ఐజీబీసీ గ్రీన్ రైల్వే స్టేషన్స్ రేటింగ్ యొక్క 'ప్లాటినం' సర్టిఫికేషన్ అందుకుంది. అయితే దేశంలో ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి రైల్వే స్టేషన్ కెవాడియా స్టేషన్.
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా అందించబడే అత్యధిక రేటింగ్, పర్యావరణ పనితీరును మెరుగుపరచడంలో స్టేషన్ యొక్క ప్రయత్నాలకు ఒక గుర్తింపు. దీనిని పొందేందుకు స్టేషన్ దాని శక్తి వినియోగం, నీటి వినియోగం మరియు వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడానికి అనేక చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది.
54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విజేతలు
54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) వేడుకలు నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలోని పనాజీలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం నిర్వహించబడ్డాయి. ఈ వేడుకను గోవా ప్రభుత్వం హోస్ట్ చేసింది. ప్రముఖ భారతీయ చిత్రనిర్మాత శేఖర్ కపూర్ అంతర్జాతీయ జ్యూరీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది మొత్తం 105 దేశాల నుండి 270 సినిమాలు ఎంట్రీ పొందగా వాటిలో అంతర్జాతీయ విభాగంలో 198 సినిమాలు ఉన్నాయి. మొత్తం 19 సినిమాలు అవార్డులు అందుకున్నాయి.
ఈ సంవత్సరం ఫెస్టివల్‌లో కొత్తగా బెస్ట్ వెబ్ సిరీస్ (ఓటీటీ ) అవార్డు కేటగిరీ ప్రవేశపెట్టారు. ఈ విభాగంలో 15 ఓవర్-ది-టాప్ మీడియా సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి 10 భాషల్లో 32 ఎంట్రీలు ఎంపిక చేయబడ్డాయి. 20 నవంబర్ 2023న నిర్వహించిన ప్రారంభ వేడుకకు కరిష్మా తన్నా మరియు అపర్శక్తి ఖురానా హోస్ట్ చేశారు. ఈ వేడుక కలర్స్ టీవీ మరియు జియోసినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ అవార్డుతో పాటుగా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి మరియు ప్రత్యేక జ్యూరీ ప్రైజ్ విభాగాల్లో అవార్డులు అందజేస్తారు.
అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు: శేఖర్ కపూర్ (భారతీయ నిర్మాత, చైర్‌పర్సన్), జోస్ లూయిస్ ఆల్కైన్ (స్పానిష్ సినిమాటోగ్రాఫర్), జెరోమ్ పైలార్డ్ (ఫ్రెంచ్ నిర్మాత), కేథరీన్ డస్సార్ట్ (ఫ్రెంచ్ నిర్మాత), హెలెన్ లీక్ (ఆస్ట్రేలియా నిర్మాత). రాజ్‌కుమార్ హిరానీ 'ఉత్తమ వెబ్ సిరీస్ (ఓటీటీ)' అవార్డుకు జ్యూరీ హెడ్‌గా వ్యవహరించారు.
- ఈ ఫెస్టివల్‌లో ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను 'భారతీయ సినిమాకి చేసిన కృషికి ప్రత్యేక గుర్తింపు' అవార్డుతో సత్కరించారు.
- నవంబర్ 28న జరిగే ముగింపు కార్యక్రమంలో హాలీవుడ్ నటుడు-నిర్మాత మైఖేల్ డగ్లస్‌ను సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.
- యూనిసెఫ్ సహకారంతో బాలల హక్కులకు సంబంధించిన ఐదు చిత్రాలను ప్రదర్శించారు. ఈ ఐదు చిత్రాలలో రెండు భారతదేశానికి చెందినవి కాగా, మూడు ఇరాన్ మరియు శ్రీలంకకు చెందినవి ఉన్నాయి. ఈ రెండు భారతీయ చిత్రాలలో జాతీయ అవార్డు గెలుచుకున్న బెంగాలీ చిత్రం దాము, మనీష్ సైనీ దర్శకత్వం వహించిన గుజరాతీ చిత్రం 'గాంధీ & కో ఉన్నాయి.
- 54వ ఐఎఫ్‌ఎఫ్‌ఐలో 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో కేటగిరిలో 'ఓద్' చిత్రం ఉత్తమ చలనచిత్ర అవార్డును అందుకుంది.
ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అద్యక్షతలో భారత్
భారతదేశం 2024 సంవత్సరానికి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించింది. లండన్‌లోని దాని ప్రధాన కార్యాలయంలో జరిగిన ISO యొక్క 63వ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రకటన చేయబడింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర వినియోగదారునిగా మరియు రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారునిగా ఉంది. ప్రపంచ చక్కెర వినియోగంలో సుమారు 15% వాటా మరియు చక్కెర ఉత్పత్తిలో 20%, భారతీయ చక్కెర వాటాను భారత్ కలిగి ఉంది.
దాదాపు 90 దేశాలు సభ్యులుగా ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అధ్యక్ష హోదా పొందటం భారత్ వ్యవసాయ రంగం సాధించిన గొప్ప విజయంగా చెప్పొచ్చు. చక్కెర వ్యాపారంలో పశ్చిమ అర్ధగోళంలో బ్రెజిల్, తూర్పు అర్ధగోళంలో భారతదేశం మార్కెట్ లీడరుగా ఉన్నాయి. యూఎస్ఏ మరియు బ్రెజిల్ తర్వాత ఇథనాల్ ఉత్పత్తిలో ప్రపంచంలో 3 వ అతిపెద్ద దేశంగా భారతదేశం ఉంది.
భారతదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ శాతం 2019-20లో 5% నుండి 2022-23లో 12%కి పెరిగింది, అదే సమయంలో ఉత్పత్తి 173 కోట్ల లీటర్ల నుండి 500 కోట్ల లీటర్లకు పెరిగింది. ఈ గణాంకాలు గ్రీన్ ఎనర్జీ పట్ల దేశ నిబద్ధత, దేశీయ మార్కెట్‌లో మిగులు చక్కెర సవాళ్లను శిలాజ ఇంధనాలుగా మార్చగల సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. ఇవి భారతదేశ కాప్ 26 లక్ష్యాలు సాధించే దిశగా ముఖ్యమైన ముందడుగు.
భారతదేశంలో చక్కెర పరిశ్రమలు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా మరియు మధ్యప్రదేశ్‌లలో ఉన్నాయి . 60% మిల్లులు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్‌లో ఉన్నాయి. భారత జాతీయ చక్కెర పరిశోధనా సంస్థ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉంది. ఇది షుగర్ కెమిస్ట్రీ, షుగర్ టెక్నాలజీ, షుగర్ ఇంజనీరింగ్ మరియు అనుబంధ రంగాలలోని అన్ని శాఖలలో సాంకేతిక విద్య మరియు పరిశోధనలో శిక్షణను అందిస్తుంది.
భారతదేశంలో చెరకు ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, తరువాత మహారాష్ట్ర మరియు కర్ణాటక ఉన్నాయి. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అనేది లండన్‌లో ఉన్న ఇంటర్‌గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇది 1968 అంతర్జాతీయ చక్కెర ఒప్పందం ద్వారా స్థాపించబడింది, ఇది ఒప్పందాన్ని నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది.
మొజాంబిక్‌లో భారతదేశ తదుపరి హైకమిషనర్‌గా రాబర్ట్ షెట్‌కిన్‌టాంగ్
ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాకు ప్రస్తుత భారత రాయబారిగా ఉన్న రాబర్ట్ షెట్‌కిన్‌టాంగ్, రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్‌కు తదుపరి భారత హైకమిషనర్‌గా నియమించబడ్డారు. రాబర్ట్ షెట్‌కిన్‌టాంగ్ 2001 బ్యాచుకు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి. షెట్‌కిన్‌టాంగ్ త్వరలో ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక మరియు రక్షణ సహకారంతో సహా అనేక రంగాలలో మొజాంబిక్‌తో భారతదేశ సంబంధాలను ప్రోత్సహించడానికి అతను బాధ్యత వహిస్తాడు.
రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్ అనేది ఆగ్నేయ ఆఫ్రికాలో తూర్పున హిందూ మహాసముద్రం, ఉత్తరాన టాంజానియా సరిహద్దులో ఉన్న ఒక దేశం. 1975లో పోర్చుగల్ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుండి రెండు దేశాల మధ్య సుదీర్ఘ బంధం ఉంది. మొజాంబిక్ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటి , మానవ అభివృద్ధి సూచికలో 189 దేశాలలో 181వ స్థానంలో ఉంది.
- దేశం : రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్
- రాజధాని : మాపుటో
- కరెన్సీ : మొజాంబికన్ మెటికల్
- అధికారిక భాష : పోర్చుగీస్
- అధ్యక్షుడు : ఫిలిప్ న్యుసి
- ప్రధాన మంత్రి : అడ్రియానో మలేయాన్