Daily Current affairs in Telugu : 22 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Daily Current affairs in Telugu : 22 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Daily Current affairs in Telugu 22 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

శ్రీలంకలో భారత కొత్త హైకమిషనర్‌గా సంతోష్ ఝా

శ్రీలంకలో భారత కొత్త హైకమిషనర్‌గా సంతోష్ ఝా బాధ్యతలు డిసెంబర్ 22న బాధ్యతలు స్వీకరించారు. ఆస్ట్రేలియాకు తదుపరి భారత హైకమిషనర్‌గా నియమితులైన గోపాల్ బాగ్లే స్థానంలో సంతోష్ ఝా నియమితులయ్యారు. సీనియర్ దౌత్యవేత్త అయిన సంతోష్ ఝా, ఈ బాధ్యతలు చేపట్టడానికి ముందు యూరోపియన్ యూనియన్, బెల్జియం మరియు లక్సెంబర్గ్‌లలో భారత రాయబారిగా ఉన్నారు. అతను ఇంతకుముందు 2019-2020 వరకు ఉజ్బెకిస్తాన్‌లో భారత రాయబారిగా మరియు 2017-2019 వరకు వాషింగ్టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా కూడా పనిచేశాడు.

శ్రీలంక, దక్షిణ ఆసియాలోని ఒక ద్వీప దేశం. ఇది హిందూ మహాసముద్రంలో, బంగాళాఖాతంకి నైరుతి దిశలో, భారత ద్వీపకల్పం నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసంధి ద్వారా వేరు చేయబడి ఉంది. శ్రీలంక నైరుతిలో మాల్దీవులు వాయువ్యంలో భారతదేశంతో సముద్ర సరిహద్దును కలిగిఉంది.

  • దేశం : శ్రీలంక
  • రాజధాని : కొలంబో
  • కరెన్సీ : శ్రీలంక రూపాయి
  • అధికారిక భాషలు : సింహళం , తమిళం
  • అధ్యక్షుడు : రణిల్ విక్రమసింఘే
  • ప్రధాన మంత్రి : దినేష్ గుణవర్దన

కవయిత్రి సుకృతా పాల్ కుమార్‌కు ఠాగూర్ సాహిత్య బహుమతి

ప్రముఖ కవయిత్రి మరియు విమర్శకురాలు సుకృతా పాల్ కుమార్ తన "సాల్ట్ & పెప్పర్: సెలెక్టెడ్ పోయెమ్స్" పుస్తకానికి గాను ప్రతిష్టాత్మకమైన 6వ రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతిని గెలుచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రపంచ శాంతి, సాహిత్యం, కళ, విద్య మరియు మానవ హక్కులను ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాహిత్య కృషిని గుర్తిస్తుంది. అలానే ఈ ఏడాది రవీంద్రనాథ్ ఠాగూర్ సాంఘిక సాఫల్యానికి సంబంధించిన సాహిత్య బహుమతిని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అందుకున్నారు. సామాజిక సంక్షేమానికి ఆయన చేసిన కృషికి గాను ఇది అందించబడింది.

2018లో అమెరికాకు చెందిన ప్రచురణకర్త పీటర్ బుండాలో స్థాపించిన ఈ అవార్డు ప్రపంచ శాంతి, సాహిత్యం, కళ, విద్య మరియు మానవ హక్కుల కోసం ఒక వేదిక. ఇది సామాజిక సాధన బహుమతితో మానవ హక్కులు మరియు ప్రపంచ శాంతికి సంబంధించిన కార్యాలను కూడా గుర్తిస్తుంది. ఈ అవార్డు గ్రహీతకు 5వేల డాలర్ల నగదు బహుమతి మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం అందిస్తారు.

ఐటీటీఎఫ్‌ ఫౌండేషన్‌లో చేరిన తొలి భారతీయరాలుగా వీట డాని

అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ గవర్నింగ్ బోర్డ్ మెంబర్‌గా నియమితులైన తొలి భారతీయరాలుగా వీట డాని చరిత్ర సృష్టించారు. వీటా మరియు ఆమె సంస్థ (డాని ఫౌండేషన్) భారతీయ టేబుల్ టెన్నిస్ యొక్క ఉన్నత పథాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇండియన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆమె సహ యజమానిగా కూడా ఉన్నారు.

ఐటీటీఎఫ్‌ ఫౌండేషన్ అనేది అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ యొక్క అనుబంధ ప్రభుత్వేతర సంస్థ. ఇది 2018లో స్థాపించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా టేబుల్ టెన్నిస్ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. టేబుల్ టెన్నిస్‌ని జనాదరణ పొందిన, సార్వత్రికమైన మరియు సమ్మిళిత క్రీడగా మార్చే లక్ష్యంతో విస్తృత ప్రేక్షకులకు, ముఖ్యంగా వెనుకబడిన సమూహాలకు అందుబాటులో ఉంచడం దీని ప్రధాన లక్ష్యం.

యునెస్కో 2023 ఆసియా-పసిఫిక్ అవార్డులు

భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నివాళిగా, పంజాబ్ మరియు హర్యానాకు చెందిన మూడు ప్రాజెక్టులకు ప్రతిష్టాత్మక యునెస్కో అవార్డు లభించింది. పంజాబ్‌లోని రాంబాగ్ గేట్ మరియు మరియు రాంపార్ట్‌ల పట్టణ పునరుద్ధరణ, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ కోసం ఈ సంవత్సరం యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులలో అత్యున్నత గౌరవమైన 'అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్'ని పొందాయి.

అలానే చైనాలోని ఫాన్లింగ్ గోల్ఫ్ కోర్స్, చైనాలోని యాంగ్‌జౌలో డాంగ్‌గువాన్ గార్డెన్ నివాసాలు మరియు కేరళలోని కున్నమంగళం భగవతీ ఆలయం వద్ద ఉన్న కర్ణికార మండపం అవార్డ్స్ ఆఫ్ డిస్టింక్షన్  గౌరవం పొందాయి. బీజింగ్‌లోని పెకింగ్ విశ్వవిద్యాలయంలో యాన్ నాన్ యువాన్‌తో సహా మరో ఐదు ప్రాజెక్టులు మెరిట్ అవార్డుతో గుర్తించబడ్డాయి. వీటిలో చైనాలోని పాన్ ఫ్యామిలీ రెసిడెన్స్, సుజౌ, హర్యానాలోని చర్చ్ ఆఫ్ ఎపిఫనీ, ముంబైలోని డేవిడ్ సాసూన్ లైబ్రరీ మరియు రీడింగ్ రూమ్, న్యూఢిల్లీలోని బికనీర్ హౌస్ ఉన్నాయి.

చైనాలోని లుయోయాంగ్‌లోని జియా క్యాపిటల్‌లోని ఎర్లిటౌ సైట్ మ్యూజియమ్‌కు హెరిటేజ్ కాంటెక్స్ట్ అవార్డు లభించింది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కోసం కేరళలోని కున్నమంగళం భగవతి ఆలయం వద్ద కర్ణికార మండపం, పంజాబ్‌లోని పిపాల్ హవేలీ మరియు ఖాట్మండులో ఉన్న సికామి చెన్ అవార్డు అందుకున్నాయి.

ఈ సంవత్సరం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 8 దేశాల నుండి 48 ప్రాజెక్ట్ ఎంట్రీలు నమోదు చేసుకోగా వాటి స్థిరత్వం మరియు ప్రభావం ఆధారంగా మొత్తం 12 ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసింది. యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్, 2000 నుండి ఈ ప్రాంతంలోని వారసత్వ విలువ కలిగిన నిర్మాణాలు మరియు భవనాలను పునరుద్ధరించడం, పరిరక్షించడం ప్రయత్నాలను గుర్తిస్తుంది.

మహిళల కంపార్ట్‌మెంట్లలో అత్యవసర పానిక్ బటన్‌లు

సెంట్రల్ రైల్వే మహిళా ప్రయాణికుల భద్రతా కోసం కొత్తగా 'పానిక్ బటన్' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది అత్యవసర పరిస్థితుల్లో అధికారులను అప్రమత్తం చేయడానికి సహాయపడుతుంది. మహిళల కంపార్ట్‌మెంట్లలో అమర్చే ఈ రెడ్ పుష్ బటన్, కోచ్ వెలుపల అమర్చిన ఫ్లాషర్ యూనిట్లపై ఆడియో విజువల్ సూచనను ఇస్తుంది, తద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది.

ప్రస్తుతం మహిళా ప్రయాణీకుల భద్రత కోసం కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా హెల్ప్‌లైన్ నంబర్‌లపై ఆధారపడవలసి ఉంటుంది. లేదా అత్యవసర పరిస్థితుల్లో చైన్ లాగడంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పానిక్ బటన్ వ్యవస్థతో తక్షణ ప్రతిస్పందనకు అవకాశం లభిస్తుంది.

పాట్-మిత్రో అప్లికేషన్‌ను ప్రారంభించిన టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ

జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనపనార రైతుల కోసం పాట్ మిత్ర అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జనపనార రైతులకు కనీస మద్దతు ధర మరియు ముఖ్యమైన వ్యవసాయ సమాచారాన్ని అందించడానికి దీనిని రూపొందించి. 6 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్‌ను టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రచనా షా ప్రారంభించారు.

పాట్-మిత్రో అప్లికేషన్‌ జనపనార రైతులకు విలువైన వనరుగా మారనుంది. ఇది అరచేతిలో వారికి అవసరమైన సమాచారం మరియు సాధనాలను అందిస్తుంది. ఇది వారి దిగుబడిని మెరుగుపరచడానికి, ఆదాయాన్ని పెంచడానికి మరియు జనపనార మార్కెట్ యొక్క సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి వారికి సహాయపడుతుంది.

ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ 2023 అవార్డులు

భారత మహిళల జట్టు కెప్టెన్ సవితా పునియా వరుసగా మూడోసారి ఎఫ్‌ఐహెచ్ గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకుంది. అలానే భారతదేశానికి చెందిన హార్దిక్ సింగ్ 2023 ఏడాదికి సంబంధించి ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. 2019 మన్‌ప్రీత్ సింగ్ మరియు 2021 -2022 హర్మన్‌ప్రీత్ సింగ్ తర్వాత ఈ గౌరవనీయమైన అవార్డును గెలుచుకున్న మూడవ భారత పురుష ఆటగాడిగా నిలిచాడు.

మహిళల విభాగంలో 2023 ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన క్సాన్ డి వార్డ్ ఎంపికైంది. అలానే డచ్ గోల్ కీపర్ పిర్మిన్ బ్లాక్ పురుషులలో ఎఫ్‌ఐహెచ్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నాడు. తెరెసా లిమా (స్పెయిన్) మరియు గాస్‌పార్డ్ జేవియర్ (ఫ్రాన్స్) ఎఫ్‌ఐహెచ్ రైజింగ్ స్టార్స్ అవార్డులు దక్కించుకున్నారు.

చైనా మహిళల ప్రధాన కోచ్ అలిసన్ అన్నన్ మరియు జర్మనీ పురుషుల ప్రధాన కోచ్ ఆండ్రే హెన్నింగ్ ఎఫ్‌ఐహెచ్ కోచ్‌ల ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకోగా, అయన్నా మెక్‌క్లీన్ (ట్రినిడాడ్-అండ్-టొబాగో) మరియు బెన్ గోంట్‌జెన్ (జర్మనీ) ఎఫ్‌ఐహెచ్ అంపైర్స్ ఆఫ్ ది ఇయర్ గుర్తింపులను పొందారు.

  • ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్ : హార్దిక్ సింగ్ (ఇండియా)
  • ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ (విమెన్ ) : క్సాన్ డి వార్డ్ (నెదర్లాండ్స్‌)
  • ఎఫ్‌ఐహెచ్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ : పిర్మిన్ బ్లాక్ (డచ్)
  • ఎఫ్‌ఐహెచ్ గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్ (విమెన్) : సవితా పునియా (ఇండియా)

ఏపీ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డిసెంబర్ 21న తన 50వ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులు మరియు అధ్యాపకులకు బైజస్ యొక్క ఇ-కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీని కార్యక్రమం నిర్వహించారు. 620 కోట్ల విలువైన ట్యాబ్‌లను దాదాపు 4,34,285 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణి చేశారు.

ఈ టాబ్లెట్‌లు బైజస్ లెర్నింగ్ కంటెంట్ మరియు డ్యుయోలింగో అప్లికేషన్‌తో ప్రీఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడం ఇది వరుసగా రెండో ఏడాది. ఇప్పటివరకు ₹1306 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్‌లను ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసింది.

ఏపీలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడానికి, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను ప్రదర్శించడానికి 'ఆడుదాం ఆంధ్రా' అనే అతిపెద్ద రాష్ట్రవ్యాప్త క్రీడా మహోత్సవంను డిసెంబర్ 15న ప్రారంభించింది. ఈ యూత్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ క్రీడాస్ఫూర్తి మరియు ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం 2023 డిసెంబర్ 26 నుండి 2024 ఫిబ్రవరి 10 వరకు నిర్వహించబడుతుంది.

డిసెంబరు 26న ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ ప్రతి గ్రామంలో లేదా వార్డు సచివాలయం స్థాయిలో నిర్వహిస్తారు. నాకౌట్ రౌండ్లలో విజేతలు ఫిబ్రవరి 3న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరిగే ఫైనల్ ఈవెంట్‌ యందు పోటీపడతారు. ప్రభుత్వం అన్ని క్రీడలకు సంబంధించి 12 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొనే అవకాశాన్ని పొందాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.  ఈ కార్యక్రమం గ్రామ/వార్డు, సచివాలయ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ఆర్డినెన్స్ స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు. 15 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఈ ఈవెంట్ యందు పాల్గొనేందుకు అర్హులు. టోర్నమెంట్లలో విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు మరియు మెమెంటోలు అందజేయబడతాయి.

Advertisement

Post Comment