తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 14 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 14 జనవరి 2024

January 14, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

భూటాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ విజయం

30 నవంబర్ 2023 మరియు 9 జనవరి 2024న జరిగిన భూటాన్‌లో జాతీయ అసెంబ్లీ ఎన్నికలలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. ఈ పార్టీ నాయకుడు లోటే షెరింగ్ భూటాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భూటాన్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ నివేదించిన ప్రకారం, 47 నేషనల్ అసెంబ్లీ సీట్లలో పీడీపీ పార్టీ 30 స్థానాలను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది.

భూటాన్ 2008లో సాంప్రదాయ రాచరికం నుండి పార్లమెంటరీ ప్రభుత్వానికి రూపాంతరం చెందిన తర్వాత ఇది దేశం యొక్క నాల్గవ సాధారణ ఎన్నికలు. 800,000 కంటే తక్కువ మంది జనాభా ఉన్న చిన్న హిమాలయ రాజ్యం, కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం తర్వాత తన పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి కష్టపడుతోంది.

ఒకప్పుడు ప్రపంచ సంతోషకరమైన దేశంగా పేరుగాంచిన ఈ దేశం ప్రస్తుతం నిరుద్యోగం మరియు పెరుగుతున్న జీవన వ్యయాలతో సతమతమౌతుంది. ప్రస్తుతం ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉంది. తాజా ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలే ప్రధాన భూమిక పోషించాయి. ఈ ఎన్నికలలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని రెండు పార్టీలు ప్రచారం చేశాయి.

భూటాన్, దక్షిణ-మధ్య ఆసియాలోని ఒక భూపరివేష్టిత దేశం. ఇది హిమాలయాల తూర్పు శిఖరాలపై ఉన్నచారిత్రాత్మక మారుమూల రాజ్యం. భూటాన్ తన సరిహద్దులను కేవలం చైనా, ఇండియా దేశాలతో పంచుకుంటుంది. ఈ దేశం నాలుగు భారత రాష్ట్రాలతో తన సరిహద్దులను పంచుకుంటుంది. వీటిలో ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఇండో-భూటాన్ మొత్తం సరిహద్దు పొడవు 699 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఇది నవంబర్ 11, 1865 న సించులా ఒప్పందం ద్వారా స్థాపించబడింది.

  • దేశం : భూటాన్
  • రాజధాని : థింపూ
  • అధికారిక భాష : జొంగ్ఖా
  • కరెన్సీలు : భూటానీస్ గుల్ట్రమ్, భారత రూపాయి
  • రాజు : జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్
  • ప్రధానిమంత్రి : లోటే షెరింగ్

కుక్కల ఉత్పత్తి & అమ్మకాన్ని నిషేధించిన దక్షిణ కొరియా

దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీ కుక్క మాంసం ఉత్పత్తి మరియు అమ్మకాలను నిషేధించే ఒక మైలురాయి బిల్లును జనవరి 9, 2024న ఆమోదించింది. దాదాపు 208 ఓట్లతో ఆమోదం పొందిన ఈ బిల్లు, మానవ వినియోగం కోసం కుక్కలను వధించడం, సంతానోత్పత్తి చేయడం, వ్యాపారం చేయడం మరియు విక్రయించడాన్ని నిషేధిస్తుంది. కుక్క మాంసం తినడం నేరంగా పరిగణించనప్పటికీ, దాని చుట్టూ ఉన్న మొత్తం పరిశ్రమను ఇది సమర్థవంతంగా మూసివేస్తుంది.

ఈ వివాదాస్పద అభ్యాసానికి వ్యతిరేకంగా అనేక సంవత్సరాల చర్చ మరియు ప్రచారం తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. దక్షిణ కొరియాలో ఒక సందర్భంలో ఎక్కువగా ఉన్న కుక్క మాంసం వినియోగం ఇటీవలి దశాబ్దాలలో, ముఖ్యంగా యువ తరాలలో క్రమంగా తగ్గుముఖం పట్టింది.

ఈ నిషేధం 2027లో అమలులోకి వస్తుంది. కుక్క మాంసం పరిశ్రమ ఇతర రకాల వ్యాపారాలకు మారడానికి మూడు సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌ని అనుమతిస్తుంది. ఈ కొత్త చట్టాన్ని ఉల్లంఘిస్తే గరిష్టంగా 30 మిలియన్ల కొరియన్ వాన్ (సుమారు $22,800) జరిమానా లేదా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.

కుక్క మాంసం అమ్మే రైతులు మరియు వ్యాపారాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధికి మారడానికి వారికి ఆర్థిక సహాయం మరియు మద్దతును అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బిల్లు ఆమోదం దక్షిణ కొరియాలో జంతు సంక్షేమం కోసం ఒక పెద్ద ముందడుగు మరియు ప్రపంచవ్యాప్తంగా జంతు హక్కుల సంఘాలచే చారిత్రాత్మక విజయంగా ప్రశంసించబడింది.

భారత సాంప్రదాయ ఔషధలకు సంకేతాలను ప్రారంభించిన డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయుర్వేదం, సిద్ధ మరియు యునాని వ్యవస్థల కోసం కొత్త ఔషధ సంకేతాలను ప్రారంభించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మధ్య సహకార ప్రయత్నంతో జనవరి 10, 2024 న న్యూఢిల్లీలో వీటిని అధికారికంగా లాంచ్ చేశారు. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ (ఐసీడీ) 11 - ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2 ను డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసింది.

డబ్ల్యూహెచ్‌ఓ యొక్క ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ (ఐసీడీ)-11 సిరీస్ యందు ఆయుర్వేదం, సిద్ధ మరియు యునాని వైద్యం ఆధారంగా వ్యాధులకు సంబంధించిన డేటా మరియు పదజాలం చేర్చబడ్డాయి. ఈ ప్రయత్నంతో, ఆయుర్వేదం, యునాని మరియు సిద్ధ వైద్యంలో వ్యాధులను నిర్వచించే పదజాలం ఒక కోడ్‌గా సూచించబడుతుంది.

డబ్ల్యూహెచ్‌ఓ ఆయుర్వేదం, యునాని మరియు సిద్ధ యొక్క మోర్బిడిటీ కోడ్‌ల మాడ్యూల్‌ను చేర్చడం సాంప్రదాయ వైద్యానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ ప్రయత్నం భారతదేశం యొక్క హెల్త్‌కేర్ డెలివరీ సిస్టమ్, రీసెర్చ్, ఆయుష్ ఇన్సూరెన్స్ కవరేజ్, రీసెర్చ్ & డెవలప్‌మెంట్, పాలసీ మేకింగ్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తుంది. అలానే సమాజంలోని వివిధ వ్యాధులను నియంత్రించడానికి భవిష్యత్ వ్యూహాలను రూపొందించడానికి కూడా ఈ కోడ్‌లను ఉపయోగించవచ్చు.

ప్రపంచ స్థాయిలో సాంప్రదాయ ఔషధ వ్యవస్థల గుర్తింపు మరియు ఏకీకరణ కోసం ఈ ఔషధ సంకేతాలను ప్రారంభించడం ఒక ముఖ్యమైన ముందడుగు. ప్రామాణిక కోడ్‌ల ఉపయోగం ఆయుర్వేదం, సిద్ధ మరియు యునాని ఔషధాల యొక్క ఉపయోగం మరియు ప్రభావాన్ని మెరుగ్గా ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది, ఇది మరింత సమాచారంతో కూడిన పరిశోధన మరియు విధాన నిర్ణయాలకు దారి తీస్తుంది.

ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ సిరీస్‌ అనేది ప్రపంచ వ్యాప్తంగా వివిధ వ్యాధులకు సంబందించిన సాంకేతిక భాష. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థచే నిర్వహించబడుతుంది. ఐసీడీ డేటాబేస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తృత శ్రేణి ఉపయోగాలను అందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మానవ వ్యాధి మరియు మరణం యొక్క పరిధి, కారణాలు మరియు పరిణామాలపై క్లిష్టమైన జ్ఞానాన్ని ఇది అందిస్తుంది.

భారత్ ప్రభుత్వం దేశంలో ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి (ఆయుష్) వైద్య విధానాలను ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చేయడం కోసం 9 నవంబర్ 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖను స్థాపించింది. మన ప్రాచీన వైద్య విధానాల గురించిన అపారమైన జ్ఞానాన్ని పునరుజ్జీవింపజేయడం మరియు ఆరోగ్య సంరక్షణ ఆయుష్ వ్యవస్థల యొక్క సరైన అభివృద్ధి మరియు ప్రచారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ఏర్పడింది.

మల్కన్‌గిరి విమానాశ్రయాన్ని ప్రారంభించిన నవీన్‌ పట్నాయక్‌

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇటీవలే నిర్మించిన మల్కన్‌గిరి విమానాశ్రయాన్నిజనవరి 9న ప్రారంభించారు. గౌడగూడ పంచాయతీలోని కటేల్‌గూడ ప్రాంతంలో 233 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ  విమానాశ్రయం 70 కోట్ల రూపాయలతో స్థాపించబడింది. ఈ విమానాశ్రయం 1620-మీటర్ల పొడవు మరియు 30-మీటర్ల వెడల్పు గల రన్‌వేను కలిగి ఉంది.

ఈ విమానాశ్రయం ఒడిశా నైరుతి ప్రాంతంలోని మల్కన్‌గిరి జిల్లా పరిదిలోని గిరిజన-ఆధిపత్య ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంపొందించడం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రారంభ దశలో ప్రాథమికంగా తొమ్మిది-సీట్ల విమానాలకు వసతి కల్పిస్తుంది. ఇదే వేదిక ద్వారా గోవింద్‌పల్లి వద్ద ₹4,000 కోట్ల సమగ్ర నీటిపారుదల ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 92,815 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించడంతోపాటు 1.5 లక్షల మందికి తాగునీరుని అందించనున్నారు.

భారత సాయుధ బలగాలు కోసం ఉగ్రామ్ రైఫిల్‌

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డీవో) సాయుధ దళాలు, పారామిలిటరీ మరియు రాష్ట్ర పోలీసు సంస్థల కార్యాచరణ అవసరాల కోసం 'ఉగ్రామ్' అనే పేరుతో స్వదేశీ అస్సాల్ట్ రైఫిల్‌ను ప్రారంభించింది. ఉగ్రామ్ స్వదేశీ అసాల్ట్ రైఫిల్‌ను ప్రారంభించడం భారతదేశ రక్షణ సాంకేతికతలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. దీనిని పూణేలోని డిఆర్డీవో యొక్క ఆర్మమెంట్ అండ్ కంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది.

ఉగ్రామ్ అనేది గ్యాస్-ఆపరేటెడ్, మ్యాగజైన్-ఫెడ్, సెలెక్టివ్-ఫైర్ రైఫిల్. ఇది 7.62x51ఎంఎం నాటో క్యాట్రిడ్జ్ ఛాంబర్‌తో రూపొందించబడింది. ఇది నిమిషానికి 20 రౌండ్ల సామర్థ్యంతో, 500 మీటర్ల ప్రభావవంతమైన పరిధిని కలిగి గురిపెడుతుంది. ఇది ప్రస్తుతం భారత సాయుధ దళాలతో సేవలో ఉన్న ఇన్సాస్ రైఫిల్‌ను భర్తీ చేయడానికి ఉద్దేశించబడింది.

రక్షణ తయారీలో స్వావలంబన సాధించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఉగ్రామ్ అభివృద్ధి ఒక ప్రధాన మైలురాయి. ఇది ఇన్సాస్ రైఫిల్ కంటే మెరుగైన వెర్షన్. ఇది భారత సాయుధ దళాల కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

  • క్యాలిబర్: 7.62x51ఎంఎం నాటో
  • బరువు: 4.0 కిలోలు
  • పొడవు: 920 మి.మీ
  • బారెల్ పొడవు: 415 మిమీ
  • ఫైరింగ్ సామర్థ్యం: 30 రౌండ్లు

అయోధ్యలోని హనుమాన్ గర్హి బేసన్ లడ్డూకు జీఐ ట్యాగ్‌ గుర్తింపు

అయోధ్య హనుమాన్ గర్హి బేసన్ లాడూకి జనవరి 10, 2024న భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌ మంజూరు చేయబడింది. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం వేళా ఈ గుర్తింపు అందుకోవడం ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పెంపొందించడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు లబ్ది చేకూరుస్తుంది.

హనుమాన్ గర్హి లడూలు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఒక ప్రసిద్ధ రుచికరమైన స్వీట్. వీటిని శెనగపిండి, పంచదార మరియు ఏలకులతో తయారు చేస్తారు. ఇవి సాంప్రదాయకంగా హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ లడ్డులు వాటి మృదువైన, మెల్ట్-ఇన్-మీ-నోట్ ఆకృతి మరియు గొప్ప రుచికి ప్రసిద్ధి చెందాయి.

హనుమాన్ గర్హి ఆలయం అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో ఒకటి. ఈ ఆలయం హనుమంతుడు తన తల్లి అంజనీ ఒడిలో కూర్చున్న అందమైన విగ్రహాన్ని కలిగి ఉంది. ఎంతో గౌరవప్రదమైన ఈ ఆలయాన్ని ఏడాది పొడవునా అనేక మంది భక్తులు సందర్శిస్తారు. ఈ 10వ శతాబ్దపు ఆలయానికి చేరుకోవడానికి సందర్శకులు 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

డోర్‌స్టెప్ కార్గో పికప్ సర్వీస్‌ను ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) రాష్ట్రంలో కార్గో పార్శిళ్లను డోర్‌స్టెప్ పికప్‌ను ప్రారంభించింది. దీనితో దేశంలోనే ఇలాంటి సర్వీస్‌ను ప్రారంభించిన తొలి ప్రభుత్వ రవాణా సంస్థగా ఏపీఎస్‌ఆర్‌టీసీ నిలిచింది. దీని కోసం ఈ సంస్థ స్వంత కార్గో బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాతిపదికన ఈ సేవలు విజయవాడ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను www.apsrtclogistics.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

ఆర్టీసీ సొంతంగా కార్గో సర్వీస్‌ను ప్రారంభించిన తర్వాత, 2017-18లో రూ. 58.57 కోట్లు ఆర్జించింది. గడిసిన ఆర్థిక సంవత్సరంలో రోజుకు 25 వేలకు పైగా బుకింగ్స్‌తో రూ.169.20 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి ఇప్పటివరకు రూ.147.37 కోట్ల మొత్తం ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ ఇప్పటికే గత అక్టోబర్ నెల నుండి రాష్ట్రంలోని 84 నగరాలు మరియు పట్టణాల నుండి 10 కి.మీ పరిధిలోని వినియోగదారులకు డోర్ డెలివరీ సేవలు ప్రారంభించింది.

ముంబై అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా పిలువబడే అటల్ సేతును డిసెంబర్ 12, 2023న ప్రారంభించారు, ఇది ప్రస్తుతం భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెనగా నిలిచింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం 21.8 కిలోమీటర్లు పొడవుతో, దాదాపు 16.5 కిలోమీటర్ల మేర విస్తారమైన అరేబియా సముద్రంలో నిర్మించబడింది. డిసెంబర్ 2016 లో ఈ అటల్ సేతు నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

అటల్ సేతు దక్షిణ ముంబైలోని సెవ్రీని, నవీ ముంబైలోని న్హవా షెవాతో కలుపుతుంది. ఇది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ముంబై, థానే, పాల్ఘర్ మరియు రాయ్‌గడ్‌లో కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సెవ్రి మరియు న్హవా షెవా మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడం కూడా ఈ వంతెన లక్ష్యం. ఒకొప్పుడు దాదాపు రెండు గంటలు పట్టే ఈ ప్రయాణం, ఇప్పుడు కేవలం 20 నిమిషాలలో ముగుస్తుంది.

6-లేన్ల ఈ వంతెన సముద్రం మీదుగా 16.5 కి.మీ మరియు భూమిపై దాదాపు 5.5 కి.మీల వరకు విస్తరించి ఉంది. ఇది భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన, అలానే దేశంలో అతి పొడవైన వంతెనగా కూడా అవతరించింది. దీనిని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కాంట్రాక్ట్ (ఈపీసీ) ప్రాతిపదికన అభివృద్ధి చేసింది.

ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకారం దీని నిర్మాణం కోసం మొత్తం 17,840 కోట్ల రూపాయలు వెచ్చించారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 30,755 మిలియన్ యెన్‌ల రుణాన్ని కూడా మంజూరు చేసింది.

అటల్ సేతు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదిక ద్వారా ప్రధాని 12,700 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, జాతికి అంకితం మరియు శంకుస్థాపన చేశారు.

వీటిలో తూర్పు ఫ్రీవే యొక్క ఆరెంజ్ గేట్ నుండి మెరైన్ డ్రైవ్‌కు అనుసంధానించే భూగర్భ రహదారి సొరంగం, సూర్య ప్రాంతీయ బల్క్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ ప్రారంభోత్సవం, ఉరాన్-ఖార్కోపర్ రైల్వే లైన్ యొక్క 2వ దశ మరియు ట్రాన్స్-హార్బర్ లైన్‌లో కొత్త సబర్బన్ స్టేషన్ 'దిఘా గావ్'కి పునాది రాయి వంటివి ఉన్నాయి.

అటల్ సేతు భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిబద్ధతకు నిదర్శనం. ఇది పురోగతి మరియు కనెక్టివిటీకి చిహ్నం, ముంబై మరియు భారతదేశం యొక్క భవిష్యత్తులో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 7 తీవ్రతతో వచ్చే భూకంపాలను తట్టుకునేలా ఈ వంతెనను నిర్మించారు. దీని జీవితకాలం 120 సంవత్సరాలు. ఈ వంతెన అత్యాధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను కలిగి ఉంది. ఇది పర్యావరణ అనుకూలమైన సాంకేతికతో నిర్మించబడింది.

సెంట్రల్ రీసెర్చ్ లాబొరేటరీలో అత్యాధునిక అభిజ్ఞాన్ ఆడిటోరియం ప్రారంభం

ఘజియాబాద్‌లోని డిఫెన్స్ పబ్లిక్ సర్వీస్ యూనిట్ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) యొక్క సెంట్రల్ రీసెర్చ్ లాబొరేటరీలో అత్యాధునిక ఆడిటోరియం 'అభిజ్ఞాన్'ను రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే జనవరి 10, 2024న ప్రారంభించారు. సాయుధ దళాలకు అత్యాధునిక సాంకేతికతలు/ఉత్పత్తులను అందించే లక్ష్యంతో దేశీయ స్టార్టప్‌లు మరియు ఇంక్యుబేటర్‌లకు వేదిక సహకారాన్ని అందించేందుకు దీనిని అభివృద్ధి చేసారు.

అభిజ్ఞాన్ ఆడిటోరియం ప్రోడక్ట్ డెమోలు, సింపోజియంలు, హ్యాకథాన్‌లు, టెక్ చర్చలు మరియు ఉపన్యాసాల కోసం ఉపయోగించబడుతుంది. ఇది 250 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మించారు. ఈ ఆడిటోరియంలో అద్భుతమైన అకౌస్టిక్స్, స్మార్ట్ ఇంటర్‌ఫేస్‌లు, పెద్ద ఇంటరాక్టివ్ డేటా వాల్ మరియు లైవ్ ఫీడ్ కోసం విస్తృతమైన ఫీచర్‌లతో మూడు కెమెరాలు అందుబాటులో ఉంచారు. ఏకకాలంలో ప్రదర్శన కోసం రెండు అధిక రిజల్యూషన్ డిస్‌ప్లేలు కూడా ఉన్నాయి.

శ్రీ రాంలాలా దర్శన పథకాన్ని ప్రారంభించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరానికి ఉచిత తీర్థయాత్ర అవకాశాన్ని కల్పించేందుకు శ్రీ రాంలాలా దర్శన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం రామమందిర భక్తులకు ఉచిత వార్షిక రైలు ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ పథకాన్ని ఐఆర్సీటీసీ సహకారంతో ఛత్తీస్‌గఢ్ టూరిజం బోర్డు అమలు చేస్తుంది.

శ్రీ రాంలాలా దర్శన పథకం ద్వారా ఏడాదికి 20 వేల మంది యాత్రికులకు అవకాశం కల్పిస్తారు. 18 నుండి 75 సంవత్సరాల వయస్సు వాళ్లు అర్హులు. యాత్రికులు జిల్లా మెడికల్ బోర్డు నిర్వహించిన ఆరోగ్య పరీక్షలో ఫిట్నెస్ నిరూపించుకోవాలి. ఈ పథకం అమలు కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ తీర్థయాత్ర దూరం దాదాపు 900 కిలోమీటర్లు.

2023 అర్జున్ అవార్డుల ప్రత్యేక రికార్డులు

ఈక్వెస్ట్రియన్‌ గేమ్ కేటగిరిలో అర్జున అవార్డును అందుకున్న మొదటి భారతీయ మహిళ క్రీడాకారిణిగా దివ్యకృతి సింగ్ చరిత్రకెక్కారు. అలానే రాజస్థాన్ నుండి ఈ గౌరవాన్ని సాధించిన మొదటి మహిళగా కూడా ఆమె నిలిచింది. చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్‌లో టీమ్ ఈవెంట్‌లో ఈమె బంగారు పతకాన్ని గెలుచుకుంది.

పారా-ఆర్చర్ శీతల్ దేవి, అర్జున అవార్డు అందుకున్న భారత దేశ మొదటి ఆర్మ్‌లెస్ పారా-ఆర్చరుగా అవతరించారు. శీతల్ దేవి జమ్మూ మరియు కాశ్మీర్‌కు చెందిన పారా ఆర్చర్, ఆమె తన ఫోకోమెలియా పరిస్థితిని అధిగమించి 2022 ఆసియా పారా గేమ్స్‌లో మహిళల డబుల్ కాంపౌండ్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. అలానే ఇదే క్రీడా ఈవెంటులో మిక్స్‌డ్ డబుల్స్ మరియు మహిళల వ్యక్తిగత విభాగంలో కూడా రెండు బంగారు పతకాలను అందుకుంది.

2024లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారత్ ఆతిథ్యం

భారతదేశం 2024లో యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ కమిటీ యొక్క 46వ సెషన్‌కు అధ్యక్షత వహిస్తుంది మరియు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు యునెస్కో భారత రాయబారి/పిఆర్ విశాల్ వి.శర్మ ప్రకటించారు. ఈ సెషన్ న్యూఢిల్లీలో జూలై 21 నుండి 31, 2024 వరకు జరుగుతుంది. సాప్రపంచ సాంస్కృతిక మరియు సహజ వారసత్వ ప్రదేశాల పరిరక్షణను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రపంచ వారసత్వ కమిటీకి భారతదేశం అధ్యక్షత వహించడం మరియు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

భారతదేశం స్వయంగా 42 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో గొప్ప సాంస్కృతిక మరియు సహజ వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్ ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. భారత్ నుండి ఇటీవలే నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చేత స్థాపించబడిన శాంతినికేతన్, కర్ణాటకలోని హోయసల గత ఏడాది సెప్టెంబరులో భారత్ యొక్క 41, 42 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గౌరవం దక్కించుకున్నాయి.

యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అనేది విద్య, కళలు, శాస్త్రాలు మరియు సంస్కృతిలో అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే లక్ష్యంతో 1945లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం పారిస్ (ఫ్రాన్స్) లో ఉంది. ప్రస్తుతం దీని డైరెక్టర్ జనరలుగా ఆడ్రీ అజౌలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Post Comment