Advertisement
రోజువారీ కరెంట్ అఫైర్స్ 24 నవంబర్ 2023 | Current affairs in Telugu
Telugu Current Affairs

రోజువారీ కరెంట్ అఫైర్స్ 24 నవంబర్ 2023 | Current affairs in Telugu

తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ 24 నవంబర్ 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

26న జాతీయ గోపాల్ రత్న అవార్డుల ప్రదానం

26న జాతీయ గోపాల్ రత్న అవార్డులను విజేతలను ప్రకటించారు. నవంబర్ 26న, జాతీయ పాల దినోత్సవం సంధర్బంగా అస్సాంలోని గౌహతిలోని వెటర్నరీ కళాశాల మైదానంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మంత్రి పర్షోత్తమ్ రూపాలా వీటిని అందజేశారు. జాతీయ గోపాల్ రత్న అవార్డు అనేది దేశీయ జంతువులను పెంచే రైతులు, ఏఐ టెక్నీషియన్లు, డైరీ కోఆపరేటివ్ సొసైటీలు/మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ/పాడి రైతుల ఉత్పత్తిదారుల సంస్థలకు అందించే అత్యున్నత జాతీయ అవార్డులలో ఒకటి. ఈ అవార్డును మూడు విభాగాల్లో ప్రదానం చేస్తారు.

  • బెస్ట్ డైయిరీ ఫార్మర్ రీరింగ్ ఇండీజీనియస్ క్యాటిల్/బఫెలో బీడ్స్
  • బెస్ట్ డైరీ కోఆపరేటివ్/ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ/ డైరీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)
  • ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుడు (AIT)

విజేతలకు 5 లక్షల నుండి రెండు లక్షల వరకు నగదు బహుమతి అందజేస్తారు. విజేతలతో మొదటి ర్యాంక్‌కు 5 లక్షలు, రెండవ ర్యాంక్‌కు 3 లక్షలు మరియు మూడవ ర్యాంక్‌కు 2 లక్షలు అందుకుంటారు. మొదటి రెండు స్థానాలలో నిలిచిన వారికీ మెరిట్ సర్టిఫికేట్ మరియు మెమెంటో కూడా అందజేస్తారు.

అవార్డు కేటగిరి విజేతల పేరు
1 దేశవాళీ పశువులు/గేదె జాతుల పెంపకంలో ఉత్తమ పాడి రైతు
  • రామ్ సింగ్, కర్నాల్, , హర్యానా (1వ స్థానం)
  • నీలేష్ మగన్‌భాయ్ అహిర్, సూరత్, గుజరాత్ (2వ స్థానం)
  • బృందా సిద్ధార్థ్ షా, వల్సాద్, గుజరాత్. (3వ స్థానం)
  • రాహుల్ మనోహర్ ఖైర్నార్, నాసిక్, మహారాష్ట్ర (3వ స్థానం)
2 బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీ/మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ/ డైరీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్
  • పుల్పల్లి క్షీరోల్పడక సహకార సంఘం D Ltd, వయనాడ్, కేరళ. (1వ స్థానం)
  • టీఎం హోసూర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కోఆపరేటివ్ సొసైటీ,  మాండ్య, కర్ణాటక. (2వ స్థానం)
  • ఎంఎస్ 158 నాథంకోవిల్‌పట్టి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, దిండిగల్, తమిళనాడు (3వ స్థానం)
3 ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుడు
  • సుమన్ కుమార్ సాహ్ , అరారియా, బీహార్ (1వ స్థానం)
  • అనిల్ కుమార్ ప్రధాన్ , అనుగుల్, ఒడిశా (2వ స్థానం)
  • ముద్దపు ప్రసాదరావు , శ్రీకాకుళం , ఆంధ్రప్రదేశ్ (3వ స్థానం)

జాతీయ గోపాల్ రత్న అవార్డులను భారత ప్రభుత్వంలోని పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ, ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ స్థాపించింది. పశువుల పెంపకం మరియు పాడిపరిశ్రమ అభివృద్ధి రంగంలో విశేష కృషి చేసిన వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను అందజేస్తారు.

37 ఏళ్ల తర్వాత కదులుతున్న ప్రపంచ అతిపెద్ద మంచుకొండ

మూడు దశాబ్దాల క్రితం హిమానీనదం బద్దలైన తర్వాత అంటార్కిటిక సముద్రపు అడుగుభాగంలో నేలకూలిన ప్రపంచ అతిపెద్ద మంచుకొండ (A23a), 37 ఏళ్ల తర్వాత తొలిసారి తన స్థానం నుండి కదులుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వే ప్రకారం A23a దాని 1986 గ్రౌండింగ్ తర్వాత వెడ్డెల్ సముద్రం నుండి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం వైపు కదులుతున్నట్లు నివేదించింది.

1986లో అంటార్కిటిక్ తీరం నుండి విడిపోయిన ఈ మంచు ద్విపానికి A23a ఐస్‌బర్గ్‌గా నామకరణం చేశారు. ఇది దాదాపు 1,500 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో న్యూయార్క్ నగరం కంటే మూడు రేట్లు పెద్దదిగా ఉంటుంది. దాదాపు ట్రిలియన్ మెట్రిక్ టన్నుల బరువున్న ఈ కొండ చరియలు ఇప్పుడు బలమైన గాలులు మరియు ప్రవాహాల సహాయంతో అంటార్కిటిక్ ద్వీపకల్పం యొక్క ఉత్తర కొనను దాటి వేగంగా కదులుతున్నట్లు ఇటీవలి ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.  A23a మంచుకొండ కదలటం మారుతున్న వాతావరణం మరియు ధ్రువ ప్రాంతాలపై దాని ప్రభావాలను గుర్తు చేస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం వేడెక్కడం వలన హిమానీనదాలు, మంచు షెల్ఫ్‌ల నుండి మరిన్ని మంచుకొండలు విరిగిపోయి నీరుగా కరగడం మనం చూడొచ్చు. ఇది షిప్పింగ్ మరియు సముద్ర జీవులకు ముప్పు కలిగిస్తుంది. అలానే ధ్రువాలలో అధిక మొత్తంలో మంచు కరుగుదల సముద్ర మట్టం పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది.

పితోరాఘర్‌లో భారత్-నేపాల్ సంయుక్త సైనిక విన్యాసాలు

భారతదేశం మరియు నేపాల్ మధ్య 17వ ఎడిషన్ ఇండో - నేపాల్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ సూర్య కిరణ్ - XVII ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌లో నవంబర్ 24 నుండి డిసెంబర్ 7 మధ్య నిర్వహించారు. కుమాన్ రెజిమెంట్‌కు చెందిన బెటాలియన్ 354 మంది సిబ్బందితో కూడిన ఇండియన్ ఆర్మీ కంటెంజెంట్‌కు నాయకత్వం వహించగా, నేపాల్ ఆర్మీ కంటెంజెంట్‌కు తారా దళ్ బెటాలియన్ ప్రాతినిధ్యం వహించింది.

జంగిల్ వార్‌ఫేర్‌లో ఇంటర్‌ఆపెరాబిలిటీని మెరుగుపరచడం, పర్వత భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడం మరియు శాంతి పరిరక్షణ కార్యకలాపాలపై ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం చేయడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. ఈ వ్యాయామం భారతదేశం మరియు నేపాల్ సైనికుల మధ్య ఆలోచనలు మరియు అనుభవాలను మార్పిడి చేసుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.

సూర్యకిరణ్ వ్యాయామం భారతదేశం మరియు నేపాల్ మధ్య ఉన్న స్నేహం, నమ్మకం, సాధారణ సాంస్కృతిక సంబంధాల యొక్క బలమైన బంధాలను సూచిస్తుంది. ఈ వ్యాయామం భాగస్వామ్య భద్రతా లక్ష్యాలను సాధించడం, స్నేహపూర్వక పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

బ్రిక్స్ సభ్యత్వం కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్న పాకిస్థాన్

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా ఐదు దేశాల కూటమి అయిన బ్రిక్స్‌లో చేరడానికి పాకిస్తాన్ అధికారికంగా దరఖాస్తు చేసుకుంది. 2024లో బ్రిక్స్ రొటేటింగ్ ప్రెసిడెన్సీ చేపడుతున్న రష్యా హయాంలో ఈ కూటమిలో చేరేందుకు పాకిస్తాన్ ప్రణాలిక చేస్తుంది. ఈ దరఖాస్తు అభ్యర్థనపై భారత్ ప్రస్తుతనానికి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపర్చలేదు.

రష్యాలో 2024లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా చేరబోతున్న అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో సహా ఇప్పటికే ఉన్న బ్రిక్స్ సభ్యులు మరియు కొత్తగా ఆహ్వానించబడిన దేశాలతో సహా పాకిస్తాన్ కూడా ఇందులో భాగం కావొచ్చు.

ఇప్పటికే అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లకు బ్రిక్స్‌లో చేరడానికి ఆహ్వానాలు అందజేయబడ్డాయి. ఈ దేశాలు జనవరి 1, 2024 నుండి బ్రిక్స్ అధికారిక సభ్య దేశాలుగా మారనున్నాయి. రష్యాలో మాస్కో యొక్క రొటేటింగ్ ప్రెసిడెన్సీలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఇవి పాల్గొంటాయి.

బ్రిక్స్ సభ్యత్వం కోసం పాకిస్తాన్ యొక్క దరఖాస్తు ప్రస్తుత సభ్యుల నుండి, ముఖ్యంగా భారతదేశం నుండి కొంత ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశం ఉంది. భారతదేశం మరియు పాకిస్తాన్‌ల మధ్య సుదీర్ఘమైన శత్రుత్వ చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న పాకిస్తాన్ ప్రభావం గురించి భారతదేశం ఆందోళన కూడా చెందుతుంది. అయితే ఈ అభ్యంతరాలను అధిగమించి బ్రిక్స్‌లో సభ్యత్వం పొందగలమన్న విశ్వాసం పాకిస్థాన్‌కు ఉంది. దేశం తన బ్రిక్స్ భాగస్వాములను చురుకుగా లాబీయింగ్ చేస్తోంది మరియు భారతదేశంతో దాని సంబంధాలను మెరుగుపరచడానికి కూడా కృషి చేస్తోంది.

గాంధీనగర్‌లో గ్లోబల్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ కన్వెన్షన్

గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో గ్లోబల్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ కన్వెన్షన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ నవంబర్ 24న ప్రారంభించారు. ఈ ఈవెంట్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించింది. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలలో ఉన్న 4,000 మంది ప్రొఫెషనల్ అకౌంటెంట్‌లకు వేదిక అందించింది. ఈ కార్యక్రమం నవంబర్ 24 నుండి 26 మధ్య మూడు రోజులపాటు జరిగింది.

75 ఏళ్ల ఐసీఏఐ చరిత్రలో గుజరాత్‌లో ఈ స్థాయిలో అంతర్జాతీయ ఈవెంట్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సదస్సులో భారత్‌లో పెద్దఎత్తున అకౌంటింగ్‌ సంస్థలను ఎలా సృష్టించవచ్చు, దేశం గ్లోబల్‌ అకౌంటింగ్‌ హబ్‌గా ఎలా మారుతుందనే అంశాలపై కూడా చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీఏఐ,  గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ) మరియు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.

Post Comment