Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ 14 మార్చి 2023 | తెలుగు ఎడ్యుకేషన్
Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 14 మార్చి 2023 | తెలుగు ఎడ్యుకేషన్

వీక్లీ కరెంట్ అఫైర్స్ 13 మార్చి 2023 తెలుగులో ఉచితంగా పొందండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఔత్సాహికుల కోసం తాజాగా చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.

2023 ఆస్కార్ అవార్డుల విజేతలు

95 వ అకాడమీ అవార్డుల విజేతలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఉత్తమ చిత్రాలకు. నటులకు, సినిమా నిపుణులకు అకాడమీ అవార్డులను అందించింది. ఈ వేడుక లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 12, 2023న హాట్టహాసంగా నిర్వహించబడింది. ఈ అవార్డు వేడుకకు జిమ్మీ కిమ్మెల్ హోస్టుగా వ్యవహరించారు.

ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల విజేతలలో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' ఉత్తమ చిత్రంతో సహా అత్యధికంగా ఏడు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం 11 విభాగాలలో నామినేషన్ పొందగా 7 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ చిత్రం రెండు అవార్డులను, ది వేల్, టాప్ గన్: మావెరిక్, బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, విమెన్ టాకింగ్, పినోచియో మరియు నావల్నీ వంటి చిత్రాలు ఒక్కో అవార్డును గెలుచుకున్నాయి.

ఈ ఏడాది ఇండియా నుండి ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ మరియు తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ వివిధ విభాగాల్లో ఆస్కార్ తుది నామినేషన్ దక్కించుకోగా, వీటిలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యూమెంటరీగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. అలానే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు గీతం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.

  • ఉత్తమ చిత్రం : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  • ఉత్తమ దర్శుకుడు : డేనియల్ క్వాన్ & డేనియల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ నటుడు : బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్ (ది వేల్)
  • ఉత్తమ నటి : మిచెల్ యో చూ ఖెంగ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : డేనియల్ క్వాన్ & డేనియల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : సారా పోలీ & మిరియం టోవ్స్ (విమెన్ టాకింగ్)
  • ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో
  • ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం : ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ : నవల్నీ -(డేనియల్ రోహెర్ & ఒడెస్సా రే)
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ : ది ఎలిఫెంట్ విస్పరర్స్ (కార్తికి గోన్సాల్వెస్ & గునీత్ మోంగా)
  • బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : వోల్కర్ బెర్టెల్మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
  • బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు (కీరవాణి & చంద్రబోస్)
  • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్: ది వే ఆఫ్ వాటర్

ఆస్కార్ అవార్డు అందుకున్న వివిధ భారతీయ చిత్రాలు

ఇప్పటి వరకు పదుల సంఖ్యలో భారతీయ చిత్రాలు ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ కాగా కేవలం 5 చిత్రాలు మాత్రమే వివిధ విభాగాల్లో అకాడమీ అవార్డును సొంతం చేసుకున్నాయి. ఈ జాబితాలో 1958 లో విడుదలైన మదర్ ఇండియా చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో భారతదేశం నుండి మొదటి ఆస్కార్ నామినేషన్ పొందిన చిత్రంగా నిలిచింది.

అయితే ఇండియా నుండి మొట్టమొదటి ఆస్కార్ అవార్డును భాను అతయ్య 1983 లో గాంధీ చిత్రానికి గాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అందుకున్నారు. అలానే 2009 లో విడుదలైన స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం అత్యధికంగా 3 ఆస్కార్ అవార్డులు అందుకున్న చిత్రంగా నిలిచింది.

భారతీయ సినిమా / వ్యక్తులు గెల్చుకున్న ఏడాది అవార్డు కేటగిరి
భాను అతయ్య (గాంధీ) 1983 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
రెసుల్ పూకుట్టి (స్లమ్‌డాగ్ మిలియనీర్) 2009 ఉత్తమ సౌండ్ మిక్సింగ్
గుల్జార్ (స్లమ్‌డాగ్ మిలియనీర్) 2009 ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (జై హో)
ఆర్ రెహమాన్ (స్లమ్‌డాగ్ మిలియనీర్) 2009 బెస్ట్ ఒరిజినల్ స్కోర్
గునీత్ మోంగా (పిరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటన్స్) 2019 ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్)
కార్తికి గోన్సాల్వేస్ & గునీత్ మోంగా (ది ఎలిఫెంట్ విస్పరర్స్) 2023 ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్)
కీరవాణి & చంద్రబోస్ (ఆర్ఆర్ఆర్) 2023 ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు)

మీరాబాయి చానుకు ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

టోక్యో ఒలింపిక్ గేమ్స్ రజత పతక విజేత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 2022 బిబిసి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకుంది. ప్రజాభిప్రాయం ద్వారా ఏటా ఉత్తమ బారతీయ మహిళా క్రీడాకారులకు బీబీసీ ఈ అవార్డు అందిస్తుంది. గత ఏడాది కూడా ఈ అవార్డును మీరాబాయినే సొంతం చేసుకుంది. దీనితో వరుసగా రెండుసార్లు ఈ అవార్డును గెలుచుకున్న మొదటి అథ్లెట్‌గా చాను నిలిచింది.

మీరాబాయి చాను 2020 టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా నిలిచింది. 2022లో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. అలానే ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది.

భారత హాకీ పురుషుల జట్టుకు కొత్త కోచ్‌గా క్రైగ్ ఫుల్టన్

భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త చీఫ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్రెయిగ్ ఫుల్టన్‌ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) నియమించింది. గత నెలలో ఇండియాలో జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్‌లో భారత్ క్వార్టర్-ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైన కారణంగా రాజీనామా చేసిన గ్రాహం రీడ్ స్థానంలో క్రెయిగ్ ఫుల్టన్ నియమితులయ్యారు.

క్రెయిగ్ ఫుల్టన్ 1996 మరియు ఏథెన్స్ 2004 ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన కెరీర్‌లో మొత్తం 195 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. 2014 నుండి 2018 మధ్య ఐరిష్ పురుషుల హాకీ టీమ్‌కు కోచ్‌గా సేవలు అందించారు. రియో ​​2016 ఒలింపిక్స్‌కు ఆ జట్టు అర్హత సాధించడంలో క్రెయిగ్ ఫుల్టన్ కీలక పాత్ర పోషించాడు.

యువ ఉత్సవ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మార్చి 4న పంజాబ్‌లోని ఐఐటీ రోపర్ నుండి యువ ఉత్సవ-ఇండియా@2047ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏకకాలంలో ప్రతాప్‌గఢ్ (యుపి), హరిద్వార్ (ఉత్తరాఖండ్), ధార్ మరియు హోసంగాబాద్ (ఎంపి), హనుమాన్‌గఢ్ (రాజస్థాన్), సరైకేలా (జార్ఖండ్), కపుర్తలా (పంజాబ్), జల్గావ్ (మహారాష్ట్ర), విజయవాడ (ఆంధ్రప్రదేశ్), కర్సర్ (తెలంగాణ), పాలఖడ్ (కేరళ), కడలూరు (తమిళనాడు) లో ప్రారంభం అయ్యింది.

మొదటి దశలో భాగంగా 31 మార్చి 2023 నాటికి దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లోని పాఠశాలలు మరియు కళాశాలలలో యువ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రంను యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ మరియు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS) ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. దేశంలోని యువతను మమేకం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో యువ కళాకారులు, రచయితలు, ఫోటోగ్రాఫర్లు, వక్తలకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు.

ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం

అమెరికా, ఆస్ట్రేలియా, భారతదేశం మరియు జపాన్ దేశాలకు చెందిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం మార్చి 3, 2023న దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించారు. సెప్టెంబరు 2022లో న్యూయార్క్‌లో జరిగిన చివరి సమావేశంకు కొనసాగింపుగా దీనిని నిర్వహించారు.

క్వాడ్ సమ్మిట్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి హయాషి యోషిమాసా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు మరియు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపారు. అలానే క్వాడ్ దేశాలలో సైబర్ భద్రతను మెరుగుపరచడానికి ఇటీవలే ప్రారంభించిన 'క్వాడ్ సైబర్ ఛాలెంజ్ ' ప్రచార కార్యక్రమం కోసం కూడా చర్చించారు.

క్వాడ్ అనగా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (చతుర్భుజ భద్రతా సంభాషణ) అని అర్ధం. ఇది ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ దేశాల మధ్య చర్చల ద్వారా నిర్వహించబడే వ్యూహాత్మక భద్రతా డైలాగ్. దీనిని మొదటిసారి 2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ప్రారంభించారు. రాజకీయ కారణాలతో ఆస్ట్రేలియా వైదొలగడంతో 2008లోనే దీని ప్రస్థానం ముగిసింది. అయితే వివిధ చర్చల ద్వారా 2017లో దీనిని తిరిగి పునఃప్రారంభించారు.

జన్ ఔషధి రైలును జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రులు

కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మరియు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 3 మార్చి 2023న, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (PMBJP) కి సంబంధించిన జన్ ఔషధి రైలును న్యూఢిల్లీ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం బ్రాండింగ్ కోసం ఛత్తీస్‌గఢ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును జన్ ఔషధి రైలుగా ఉపయోగించుకుంటున్నారు.

ఈ రైలు ద్వారా వచ్చే రెండు నెలల్లో నాలుగు రాష్ట్రాల పరిధిలో దాదాపు 184 స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం కోసం ప్రచారం చేయనున్నారు. జన్ ఔషధి కేంద్రాలలో లభించే జనరిక్ ఔషధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమంను దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు.

దేశంలో ప్రస్తుతం తొమ్మిది వేలకు పైగా జన్ ఔషధి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల సంఖ్యను 10 వేలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జన్ ఔషధి కేంద్రల ద్వారా ఔషధాలను బ్రాండెడ్ మందుల ధరల కంటే 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే అందిస్తున్నారు.

స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ 2023 అవార్డులు ప్రదానం

గ్రామీణ నీరు మరియు పారిశుద్ధ్య రంగంలో మహిళా ఛాంపియన్లను సత్కరించేందుకు జల్ శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన “స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ 2023” ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ 2023 ద్వారా జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క స్వచ్ఛ్ భారత్ మిషన్ – గ్రామీణ్ (SBM - G), జల్ జీవన్ మిషన్ (JJM) మరియు నేషనల్ వాటర్ మిషన్ (NWM) పరిధిలో అసాధారణ సేవలు అందించిన 18 మంది మహిళలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సన్మానించారు.

ఇదే వేదిక ద్వారా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ. గజేంద్ర సింగ్ షెకావత్ జల శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్-2023ని ప్రారంభించారు. తాగునీటి వనరుల స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది దీని ప్రధాన ప్రాధన్యత. అలానే జల్ శక్తి సే నారీ శక్తిపై వీడియో మరియు స్మారక స్టాంప్‌ను విడుదల చేసారు. అలానే మిగతా కార్యక్రమాలకు చెందిన సంకలనాలు ప్రారంభించారు.

  1. ప్రధాని నరేంద్ర మోడీ 2014లో స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన కేవలం 5 సంవత్సరాలలో దేశంలోని దాదాపు అన్ని గ్రామాలు తమను తాము బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చుకున్నాయి.
  2. 2019 లో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా దేశంలో 11 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు కుళాయిల ద్వారా త్రాగు నీటిని అందిస్తున్నారు.
  3. స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ 2023 ద్వారా అట్టడుగు స్థాయి నుండి మహిళా సాధకులను నీటి-సురక్షిత భవిష్యత్తు కోసం పని చేసేలా, వారు ఇతరులను ప్రేరేపించేలా ప్రణాళిక రుపొందిస్తున్నారు.
  4. జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్-2023 కార్యక్రమంను "జల్ శక్తి సే నారీ శక్తి" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. దీని ద్వారా జల సురక్షిత కార్యక్రమాలలో మహిళలను భాగస్వామ్యం చేయనున్నారు.
  5. ప్రధాని మోదీ 2019లో జల శక్తి అభియాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో 46 లక్షలకు పైగా నీటి సంరక్షణ మరియు నీటి సేకరణ పనులు జరిపారు.
  6. నేషనల్ వాటర్ మిషన్ 2022 లో ప్రారంభించబడింది. ఇది నీటి సంరక్షణ, వృధాను తగ్గించడం మరియు సమీకృత నీటి వనరుల అభివృద్ధి మరియు నిర్వహణకు సంబంధించిన కార్యక్రమం. ఇది జల్ జీవన్ మిషన్ యందు భాగం.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అలెస్ బిలియాట్స్కీకి పదేళ్ల జైలు శిక్ష

2022 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అలెస్ బిలియాట్స్కీకి బెలారస్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. స్మగ్లింగ్ మరియు ఫైనాన్సింగ్ ఉల్లంఘన చర్యలలో దోషిగా నిర్ధారించబడ్డాడని వియాస్నా మానవ హక్కుల సంఘం తెలిపింది. 2022 నోబెల్ శాంతి బహుమతి అందించిన ముగ్గురిలో అలెస్ బిలియాట్స్కీకి ఒకరు.

బెలారసియన్ నాయకుడు అలెగ్జాండర్ లుకాషెంకో యొక్క నిరంకుశ పాలనను అంతమొందించేందుకు బిలియాట్స్కీ విస్తృత స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేఖ ఉద్యమాలు నిర్వహించారు. దీనికి ప్రతి చర్యగా ప్రభుత్వం వివిధ కారణాలతో ఆయనని అనేక సార్లు అరెస్టు చేసింది. అందులో ప్రధానంగా 2021 బెలారస్ ఎన్నికలలో ప్రతిపక్ష కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి బెలారస్‌లోకి అధికమొత్తంలో నగదును అక్రమంగా తరలించాడని ఆరోపించింది. ఇప్పుడు ఇదే కేసులో ఆయనికి జైలు శిక్ష విధించబడింది.

బెలారస్ తూర్పు యూరప్లో ఉన్న ఒక భూపరివేష్టిత దేశం. దీని తూర్పుసరిహద్దులలో రష్యా, దక్షిణసరిహద్దులో ఉక్రెయిన్, పశ్చిమసరిహద్దులో పోలాండ్, ఉత్తరసరిహద్దులో లిథువేనియా, లాత్వియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని నగరం మిన్‌స్క్.

సశాస్త్ర సీమ బల్‌ డైరెక్టర్ జనరల్‌గా రష్మీ శుక్లా

సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అధికారి రష్మీ శుక్లాను సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈమె మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. ఈమె గతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌లో విధులు నిర్వర్తించారు. ఈమె హోదాలో జూన్ 2024 వరకు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

2019లో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సేల ఫోన్లు ట్యాప్ చేయబడినప్పుడు ఆమె మహారాష్ట్ర పోలీసులో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ చర్యతో 2019లో బీజేపీతో విడిపోయిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కూటమి నుండి విడిపోయిన ఏక్నాథ్ షిండే వర్గం తిరిగి బీజేపీ సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సశాస్త్ర సీమా బల్ అనేది నేపాల్ మరియు భూటాన్‌లతో సరిహద్దుల వెంబడి బోర్డర్ రక్షణ కార్యకలాపాలు నిర్వహించే భారతదేశ సరిహద్దు రక్షణ దళం. ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న ఏడు కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటి. దీనిని 1963లో ఏర్పాటు చేసారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

ఈసీ నియామకాలపై సుప్రీంకోర్టు చారిత్రత్మక తీర్పు

భారత ప్రధాన ఎన్నికల కమీషనర్లు భారత ఉప ఎన్నికల కమిషనర్లు నియామక విధానానికి సంబంధించి మార్చి 2న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పు నివేదిక ప్రకారం ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సలహా మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్‌ల నియామకాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది.

జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి పార్లమెంటు చట్టం చేసే వరకు ఈ ప్యానెల్ అమలులో ఉంటుందని పేర్కొంది. భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎన్నికల కమిషన్ ఏకపక్ష ధోరణితో, ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థని అధికార పక్షానికి అనుకూలంగా అన్ని రకాలగా ఉపయోగించుకోవడానికి దూరంగా ఉండాలని నొక్కి చెప్పింది. రాజ్యాంగంలోని నిబంధనలకు లోబడి న్యాయమైన మరియు చట్టబద్ధమైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(2) ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లను నియమించడానికి భారత రాష్ట్రపతికి అధికారం ఉంది. భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ భారత ఎన్నికల కమిషన్‌కు నేతృత్వం వహిస్తారు. ఇది జాతీయ మరియు రాష్ట్ర శాసనసభలకు మరియు రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతికి ఎంపికకు సంబధించి నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి రాజ్యాంగబద్ధంగా అధికారం కలిగి ఉంటుంది.

వియత్నాం కొత్త అధ్యక్షుడిగా వో వాన్ థుంగ్‌

వియత్నాం నేషనల్ అసెంబ్లీ వో వాన్ థుంగ్‌ను ఆ దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అవినీతి ఆరోపణలతో జనవరి 2023లో ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన న్గుయెన్ జువాన్ ఫుక్ స్థానంలో వో వాన్ థుంగ్‌ నూతన ప్రెసిడెంటుగా బాధ్యతలు స్వీకరించారు.

వియత్నాం ఆగ్నేయ ఆసియాలోని ఒక దేశం. దీనికి ఉత్తరాన చైనా, వాయవ్యాన లావోస్, నైరుతిన కాంబోడియా, తూర్పు దిక్కున మలేషియా, ఫిలిప్ఫీన్స్, ఇండోనేషియాలు సరిహద్దులుగా ఉన్నాయి. దీని రాజధాని నగరం హనోయి.

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై నిపుణుల కమిటీ ఏర్పాటు

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదికను పరిశీలించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా పెట్టుబడిదారులు కోట్ల నష్టానికి దారితీసిన నియంత్రణ వైఫల్యానికి కారణమైన అంశాలు మరియు ఉనికిని పరిశోధించి పూర్తి నివేదికను ఇవ్వనుంది.

ఈ కమిటీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఓపీ భట్, రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేపీ దేవధర్, బ్రిక్ దేశాల న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ మాజీ చీఫ్ కేవీ కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, సెక్యూరిటీ నిపుణుడు మరియు న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ ఉన్నారు.

ఈక్విటీ, క్రెడిట్ మరియు డెరివేటివ్ మార్కెట్‌లను విశ్లేషించడానికి నాథన్ ఆండర్సన్ 2017లో ఈ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను స్థాపించారు. అదానీ గ్రూప్‌పై గత రెండేళ్ల పరిశోధన అనంతరం వారు అదానీ గ్రూపు నర్మగర్భంగా స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం మరియు పన్ను మినహాయింపు పద్దతులను అక్రమంగా ఉపయోగించుకుందని ఆరోపించింది.

నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2023 మొదటి ఎడిషన్ ప్రారంభం

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2023 మొదటి ఎడిషన్ మార్చి 6న ప్రారంభమైంది. ఈ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌ను సైనిక భద్రతా సమస్యలను చర్చించడానికి అలాగే నేవల్ కమాండర్లకు సీనియర్ ప్రభుత్వ కార్యనిర్వాహకులతో సంభాషించే అవకాశం కల్పించేందుకు నిర్వహించారు.

ఏటా నిర్వహించే ఈ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ సముద్రంలో జరగడం మరియు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు కూడా తదుపరి రోజులలో నావల్ కమాండర్లతో ఇంటరాక్ట్ అవుతారు.

నావల్ స్టాఫ్ చీఫ్, ఇతర నావల్ కమాండర్‌లతో కలిసి గత ఆరు నెలల్లో భారత నావికాదళం చేపట్టిన ప్రధాన కార్యాచరణ, మెటీరియల్, లాజిస్టిక్స్, మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ మరియు పరిపాలనా కార్యకలాపాలను సమీక్షిస్తారు.

  • చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ : జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)
  • చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ : జనరల్ మనోజ్ పాండే
  • చీఫ్ ఆఫ్ నావెల్ స్టాఫ్ : అడ్మిరల్ ఆర్. హరి కుమార్
  • చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ : మార్షల్ వివేక్ రామ్ చౌదరి

సంతోష్ ట్రోఫీ విజేతగా కర్ణాటక

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో, మార్చి 4న జరిగిన 76వ జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ (సంతోష్ ట్రోఫీ) ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక 3-2తో మేఘాలయను ఓడించి విజేతగా నిలిచింది. కర్ణాటక సంతోష్ ట్రోఫీని గెలవడం 54 ఏళ్ళ తర్వాత ఇదే మొదటిసారి. ఇది కర్ణాటకకు ఐదవ సంతోష్ ట్రోఫీ. ఈ టోర్నమెంటులో అత్యంత విజయవంతమైన జట్టుగా పశ్చిమ బెంగాల్ (32 టైటిల్స్) ఉంది.

నేషనల్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ లేదా సంతోష్ ట్రోఫీ అనేది రాష్ట్ర స్థాయి జట్టులతో ఆడే జాతీయ ఫుట్‌బాల్ పోటీ. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ 1996లో మొదటి జాతీయ క్లబ్ లీగ్, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ ప్రారంభానికి ముందు, సంతోష్ ట్రోఫీ భారతదేశంలో అత్యుత్తమ దేశీయ ఫుట్‌బాల్ టోర్నమెంటుగా పరిగణించబడేది. టోర్నమెంట్ ప్రతి సంవత్సరం జోన్‌లుగా విభజించబడిన అర్హత కలిగిన జట్లతో నిర్వహించబడుతుంది.

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా ఎస్ఎస్ దూబే

1989 బ్యాచ్ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్ అయిన ఎస్ఎస్ దూబే 28వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా (సీజీఎ) బాధ్యతలు స్వీకరించారు. సీజీఎగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఈయన పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యందు అడిషనల్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా విధులు నిర్వర్తించేవారు.

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల వివరాలను నిర్వహించే విభాగం. ఇది భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ అకౌంటింగ్ సలహాదారునిగా, ప్రభుత్వ అకౌంటింగ్ సిస్టమ్‌ యొక్క సాంకేతికంగా నిర్వహణ బాధ్యతను చూసుకుంటుంది. అలానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 150 ప్రకారం వార్షిక అప్రాప్రియేషన్ ఖాతాలు (సివిల్) మరియు యూనియన్ ఫైనాన్స్ ఖాతాల వివరాలు పార్లమెంటుకు సమర్పిస్తుంది. దీనిని 1985లో స్థాపించారు.

ఇండో-ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం ఫ్రింజెక్స్ ప్రారంభం

ఇండో-ఫ్రాన్స్ తొలి జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ ఫ్రింజెక్స్-2023 కేరళలోని తిరువనంతపురంలోని పాంగోడ్ మిలిటరీ స్టేషన్‌లో మార్చి 07న ప్రారంభమైంది. భారత సైన్యం మరియు ఫ్రెంచ్ సైన్యం ఈ ఫార్మాట్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఇరు దేశాల సైన్యాల మధ్య ఇంటర్-ఆపరేబిలిటీ, సమన్వయం మరియు సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. దీనిని మార్చి 7, 8వ తేదీలలో నిర్వహించారు.

ఆర్‌బిఐ మిషన్ 'హార్ పేమెంట్ డిజిటల్' ప్రచార కార్యక్రమం ప్రారంభం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించడానికి మార్చి 6 నుండి 12, 2023 వరకు “హార్ పేమెంట్ డిజిటల్” మిషన్‌ పేరుతొ డిజిటల్ చెల్లింపుల అవగాహన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ ఏడాది “డిజిటల్ పేమెంట్ అప్నావో, ఔరాన్ కో భీ సిఖావో” (డిజిటల్ చెల్లింపులను స్వీకరించండి మరియు ఇతరులకు కూడా నేర్పండి) అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇక నుండి ఏటా మార్చి 6 నుండి12వ తేదీల మధ్య డిజిటల్ పేమెంట్స్ అవేర్‌నెస్ వీక్ (DPAW) నిర్వహించనుంది.

గోవాలో 23వ కామన్వెల్త్ లా కాన్ఫరెన్స్

23వ కామన్వెల్త్ లా సదస్సును గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, మార్చి 6వ తేదీన పనాజీలో ప్రారంభించారు. మార్చి 5 నుండి 9, 2023 వరకు జరుగుతున్న ఐదు రోజుల ఈ సదస్సులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మరియు గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు. ఈ సదస్సుకు 52 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

కామన్వెల్త్ లా కాన్ఫరెన్స్ అనేది 54 కామన్వెల్త్‌ దేశాల న్యాయవాదులు, న్యాయమూర్తులు మరియు విద్యావేత్తలకు చెందిన ద్వైవార్షిక సమావేశం. ఇది 1955 నుండి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో న్యాయవాద వృత్తిని ప్రభావితం చేసే ప్రస్తుత సమస్యలపై చర్చలు నిర్వహిస్తారు. అదే సమయంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి నూతన ఆవిష్కరణలు, సాంకేతిక అంశాల గురించి సమాచారం పంచుకుంటారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కిరెన్ రిజిజు మాట్లాడుతూ కాలం చెల్లిన మరియు ప్రాచీనమైన భారతీయ చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేపట్టిందని, అలాగే గత 8 సంవత్సరాలలో శాసన పుస్తకం నుండి తొలగించబడిన 1486 చట్టాలను తొలగించిందని తెలియజేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మరో 65 వాడుకలో లేని చట్టాలను, ఇతర నిబంధనలను రద్దు చేసేందుకు బిల్లును తీసుకురానున్నట్లు తెలిపారు.

భారత న్యాయవ్యవస్థను పూర్తిగా పేపర్‌లెస్‌గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈకోర్టుల దశ IIIని ప్రారంభించినట్లు వెల్లడించారు. పర్చువల్ కోర్టులు, ఇ-సేవా కేంద్రాలు మరియు హైకోర్టులలో ఇన్ఫర్మేషన్ కియోస్క్‌ల ద్వారా న్యాయవ్యవస్థను సామాన్య ప్రజలకు దగ్గర చేస్తున్నట్లు తెలిపారు. హైకోర్టులు మరియు జిల్లా కోర్టులలో ఇ-ఫైలింగ్ సౌలభ్యం ద్వారా 24x7 కేసులను దాఖలు చేయడానికి వీలు కల్గుతుందని తెలియజేసారు.

పుప్పొడి మోసే పురాతన శిలాజాలను కనుగొన్నా రష్యన్ శాస్త్రవేత్తలు

రష్యన్ శాస్త్రవేత్తలు అత్యంత పురాతనమైన సంభావ్య పరాగ సంపర్కాల శిలాజాలను కనుగొన్నారు. రష్యాలోని చెకర్డా గ్రామ సమీపంలో పుప్పొడితో కప్పబడిన ఇయర్‌విగ్ లాంటి కీటకాల అవశేషాలు కనుగొనబడ్డాయి. టిల్యార్డెంబియిడ్స్ అని పిలువబడే శిలాజ కీటకాలు వాటి తలలు, శరీరాలు మరియు కాళ్ళపై పుప్పొడిని కలిగి ఉన్నాయి. వీటిని ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు క్రిస్మస్ బాబుల్స్ లాగా కనిపించినట్లు వెల్లడించారు.

ఈ శిలాజాలు సుమారు 280 మిలియన్ సంవత్సరాల కిందటివిగా అంచనా వేశారు. ఈ కాలంలో పుచ్పించే మొక్కలు లేకపోవడం వలన ఈ పుప్పొడి జిమ్నోస్పెర్మ్స్ అని పిలువబడే విత్తనాలను ఉత్పత్తి చేసే, పుష్పించని మొక్కల నుండి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా ఈ పురాతన కీటకాలు పరాగసంపర్కానికి దోహదపడ్డాయో లేదో తెలుసుకోవడం అసాధ్యం అని అంగీకరించారు. అయితే మొక్కలు మరియు ఈ కీటకాల మధ్య సన్నిహిత అనుబంధం జిమ్నోస్పెర్మ్స్ కాలం నుండే ఉన్నట్లు తేల్చారు.

ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం

1. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు : నాగాలాండ్ సీఎంగా నీఫియు రియో ఐదవసారి ప్రమాణస్వీకారం చేశారు. అలానే ఉప ముఖ్యమంత్రులుగా తాడితుయ్ రంగ్‌కౌ జెలియాంగ్ మరియు యంతుంగోబాధ్యతలు స్వీకరించారు. అలానే నాగాలాండ్ శాసనభకు ఎన్నికైన మొదటి మహిళా ఎమ్మెల్యే సల్హౌతుయోనువో క్రూసే, ఆ రాష్ట్ర మొదటి మహిళా మంత్రిగా కేబినెట్లో చేరారు.

27 ఫిబ్రవరి 2023 న 60 సీట్లకు జరిగిన నాగాలాండ్ శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీకీ మెజార్టీ మార్కు దక్కక పోవడంతో, అత్యధికంగా 25 సీట్లు సాధించిన నీఫియు రియో యొక్క నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, 12 సీట్లు దక్కించుకున్న బీజేపీ కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

2. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు : మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ కె సంగ్మా వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా ప్రిస్టోన్ టైన్‌సాంగ్ మరియు స్నియాభలాంగ్ ధర్'లు బాధ్యతలు స్వీకరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న జరిగిన 59 స్థానాల మేఘాలయ శాసనసభ ఎన్నికలలో కాన్రాడ్ సంగ్మా యొక్క నేషనల్ పీపుల్స్ పార్టీ అత్యధికంగా 26 సీట్లు దక్కించుకోవడంతో బిజెపి, యుడిపి, పిడిఎఫ్, హెచ్‌ఎస్‌పిడిపి మరియు కొంతమంది స్వతంత్రుల మద్దతుతో మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ 2.0 ప్రభుత్వాని ఏర్పాటు చేసింది.

3. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు : త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ 14 మే 2022న తన పదవికి రాజీనామా చేయడంతో మాణిక్ సాహా మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

16 ఫిబ్రవరి 2023 న జరిగిన 60 స్థానాల త్రిపుర శాసనసభ ఎన్నికలలో 32 సీట్లతో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీ సాధించింది. కాగా ఇటీవలే ఏర్పాటు చేసిన తిప్ర మోత పార్టీ అరంగేట్రంలో 13 సీట్లు గెలుచుకుని త్రిపుర అసెంబ్లీలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.

ఐఏఎఫ్ ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్‌కు తోలి మహిళ కమాండ్‌గా షాలిజా ధామి

గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి భారత వైమానిక దళంలో ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు. అదే సమయంలో వెస్ట్రన్ సెక్టార్‌లో క్షిపణి స్క్వాడ్రన్‌కు కూడా నాయకత్వం వహించనున్నారు.

ధామి 2003లో హెలికాప్టర్ పైలట్‌గా నియమితుడయ్యారు. ఈమె దాదాపు 2800 గంటలకు పైగా పైలట్‌ అనుభవాన్ని కలిగి ఉన్నారు. గతంలో అనేక సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్‌లను నిర్వహించిన అనుభవం కలిగి ఉన్నారు.

8వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డులు ప్రదానం

కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ మార్చి 7న న్యూఢిల్లీలో 8 వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డులను ప్రదానం చేశారు. 3లక్షల నగదు బహుమతితో ఒక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సహా మొత్తం 13 మంది ఫొటోగ్రాఫర్లకు అవార్డులు అందించారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీ విజేతకు లక్ష రూపాయలు మరియు అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో ఒక్కొక్కటి చొప్పున 75 వేల రూపాయల ప్రైజ్ మనీ అందజేశారు.

  • లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - సిప్రా దాస్
  • ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు - శశి కుమార్ రామచంద్రన్
  • అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు - అరుణ్ సాహా
  • ప్రొఫెషనల్ విభాగంలో ప్రత్యేక ప్రస్తావన అవార్డులు - దీపజ్యోతి బానిక్, మనీష్ కుమార్ చౌహాన్, ఆర్.ఎస్.గోపకుమార్, సుదీప్తో దాస్, ఉమేష్ హరిశ్చంద్ర నికమ్
  • అమెచ్యూర్ విభాగంలో ప్రత్యేక ప్రస్తావన అవార్డులు - సిఎస్ శ్రీరంజ్, డాక్టర్ మోహిత్ వాధావన్, రవిశంకర్ ఎస్.ఎల్, శుభదీప్ బోస్, తరుణ్ అదురుగట్ల

మనీలాండరింగ్ పరిధిలోకి క్రిప్టో లావాదేవీలు

క్రిప్టో కరెన్సీలలో వ్యాపారం చేయడానికి భారతదేశ మనీలాండరింగ్ చట్టాలు వర్తిస్తాయిని మార్చి 7న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వర్చువల్ డిజిటల్ ఆస్తులు మరియు ఫియట్ కరెన్సీల మధ్య లావాదేవీలు, అలానే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల వర్చువల్ డిజిటల్ ఆస్తుల మధ్య మార్పిడి మరియు డిజిటల్ ఆస్తుల బదిలీలు మనీలాండరింగ్ చట్టాల పరిధిలోకి వస్తాయని ఈ నోటిఫికేషన్ నివేదిస్తుంది.

వర్చువల్ డిజిటల్ ఆస్తులను భద్రపరచడం లేదా నిర్వహించడం మరియు వర్చువల్ డిజిటల్ ఆస్తుల ఆఫర్ మరియు అమ్మకానికి సంబంధించిన ఆర్థిక సేవలలో భాగస్వామ్యం కూడా దీని పరిధిలో కవర్ చేయబడుతుంది. క్రిప్టోకరెన్సీల వినియోగానికి వ్యతిరేకంగా ఆర్బీఐ అనేకసార్లు హెచ్చరించినప్పటికీ వాటికి సంబంధించి ఎటువంటి నిబంధనలను భారతదేశం ఇంకా ఖరారు చేయలేదు.

క్రిప్టోకరెన్సీలు పోంజీ స్కీమ్‌తో సమానంగా ఉన్నందున వాటిని నిషేధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేకసార్లు పేర్కొంది. భారతదేశం యొక్క మనీలాండరింగ్ నిబంధనలను క్రిప్టోకరెన్సీలకు వర్తింపజేయడం వలన దేశ సరిహద్దులు దాటి ఈ ఆస్తుల బదిలీని పర్యవేక్షించడంలో అధికారులకు సులువుతుంది లభిస్తుంది.

ఇస్రో చేతికి నిసార్ ఉపగ్రహం

ఇస్రో మరియు నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ-పరిశీలన ఉపగ్రహం 'నాసా-ఇస్రో సార్ (నిసార్)'ను స్వీకరించింది. ఇది భూమి యొక్క మారుతున్న పర్యావరణ వ్యవస్థలు, డైనమిక్ ఉపరితలాలు మరియు మంచు ద్రవ్యరాశిని కొలుస్తుంది. అలానే బయోమాస్, సహజ ప్రమాదాలు, సముద్ర మట్టం పెరుగుదల మరియు భూగర్భ జలాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహ పేలోడ్‌ను బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లోని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో అనుసంధానించి దాని పనితీరును పరిశీలించనున్నారు. దీనిని ఇస్రో యొక్క జిఎస్ఎల్వి మార్క్ II ప్రయోగ వాహనం ద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో శ్రీహరికోటలోని లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించనున్నారు.

  • NASA - నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (వాషింగ్టన్, డీసీ, 1958)
  • ISRO - ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (బెంగళూరు, 1969)

సిక్కింలో భుమ్చు ఫెస్టివల్ 2023

సిక్కింలో నిర్వహించే వార్షిక భుమ్చు ఫెస్టివెల్ ఘనంగా ముగిచింది. భుమ్చు అనేది భారతదేశంలోని సిక్కింలోని తాషిడింగ్ మొనాస్టరీలో జరుపుకునే బౌద్ధ పండుగ. దీనిని ఏటా ఫిబ్రవరి/మార్చి నెలకు సంబంధించిన చంద్ర క్యాలెండర్‌లోని మొదటి నెల 15వ రోజున జరుపుకుంటారు.

భుమ్చు అంటే టిబెటన్ భాషలో "పవిత్రమైన నీటి కుండ" అని అర్థం. ఈ పవిత్ర వాటర్ వాజ్ వేడుక ట్రిసోంగ్ డ్యూట్సోనిన్ టిబెట్ రాజు, గురు పద్మసంభవ పాలనలో ప్రారంభమైంది. మంచి శకునానికి సంకేతంగా ఈ జాడీ ఉన్న జలాన్ని ఆరాధకులకు అందిస్తారు.

2 Comments

    1. మా మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ప్రస్తుతం డిజిటల్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని మీరు ఉచితంగా ఈ పేజీ ద్వారా పొందగలరు. https://telugueducation.com/telugu-current-affairs-magazine

      Reply

Post Comment