Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 29 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 29 జనవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 29 జనవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్‌ను రద్దు చేసిన ఐసీసీ

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి), శ్రీలంక క్రికెట్ బోర్డుపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేసింది. గత ఏడాది నవంబర్ 10న ఐసీసీ సభ్యునిగా బాధ్యతలను ఉల్లంఘించినందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్ చేయబడింది. దాని పరిపాలన వ్యవహారాలను స్వయంప్రతిపత్తిగా నిర్వహించడంలో విఫలమైనందుకు మరియు దాని పాలనలో ప్రభుత్వ జోక్యం కారణంగా ఈ నిషేధం నాడు విధించబడింది.

ఈ నిషేధం వలన ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2024 ఆతిథ్య హక్కులను కూడా కోల్పోయింది. దీనిని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. ప్రభుత్వ జోక్యం గురించిన ఆందోళనలను శ్రీలంక క్రికెట్ పరిష్కరించడంలో ఐసీసీ సంతృప్తి చెందడంతో తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.

పాపువా న్యూ గినియాకు తక్షణ సాయం ప్రకటించిన భారత్

మౌంట్ ఉలావున్ అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత పాపువా న్యూ గినియాకు భారతదేశం 1 మిలియన్ డాలర్ల తక్షణ సహాయ సహాయాన్ని ప్రకటించింది. ఈ విపత్తు కారణంగా జరిగిన నష్టం మరియు విధ్వంసం పట్ల పాపువా న్యూ గినియా ప్రభుత్వానికి మరియు ప్రజలకు భారతదేశం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత నెల 20వ తేదీన ఉలవన్ పర్వతం అగ్నిపర్వత విస్ఫోటనం చెందింది. ఈ ప్రకృతి విపత్తు వలన ఇప్పటివరకు 26,000 మందికి పైగా ప్రజలు తమ నివాసాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఖాళీ చేయవలసి. ఇది ఆ ప్రాంతంలో అత్యవసర మానవతా అవసరాలను సృష్టించింది.

ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ కింద భారత్ ఈ సహాయాన్ని అందించింది. ఇండియాతో స్నేహపూర్వక మరియు అభివృద్ధి భాగస్వామిగా ఉన్న పాపువా న్యూ గినియాలోని ప్రజలకు సంఘీభావంగా పునరావాసం మరియు పునర్నిర్మాణ ప్రయత్నాలకు సహాయాన్ని అందించడానికి భారతదేశం తక్షణ సహాయ సహాయాన్ని పంపించింది.

గతంలో 2018లో సంభవించిన భూకంపం మరియు 2019లో అగ్నిపర్వత విస్ఫోటనం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించిన సంక్షోభం మరియు వినాశన సమయాల్లో కూడా ద్వీప దేశానికి భారతదేశం సహాయం అందించింది. సంక్షోభ సమయాల్లో పాపువా న్యూ గినియాకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ఈ సహాయం ప్రతిబింబిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని కూడా హైలైట్ చేస్తుంది.

పాపువా న్యూ గినియా యొక్క అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో మౌంట్ ఉలావున్ ఒకటి. ఇది 1970ల నుండి పెద్ద విస్ఫోటనల ద్వారా లావా, రాతి శకలాలు మరియు బూడిద యొక్క ప్రవాహాలను ఉత్పత్తి చేస్తుంది. మే 25, 2006న కూడా భారీస్థాయిలో విస్ఫోటనం చెందింది. 18వ శతాబ్దం నుండి మొత్తం 22 నమోదు చేయబడిన విస్ఫోటనాలు దీనిలో సంభవించాయి. దీని పొడవు 2,334 మీటర్లు. ఈ అగ్నిపర్వతం సమీపంలో కొన్ని వేల మంది నివసిస్తున్నారు.

కొత్తగా మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇరాన్

ఇరాన్ జనవరి 28న మహ్దా, కేహాన్-2 మరియు హతేఫ్-1 పేర్లతో మూడు కొత్త ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. ఇవి గ్లోబల్ పొజిషనింగ్ మరియు కమ్యూనికేషన్‌కు సంబందించిన చిన్న నానో ఉపగ్రహాలుగా తెలిపింది. నారోబ్యాండ్ కమ్యూనికేషన్ మరియు జియోపొజిషనింగ్ టెక్నాలజీని పరీక్షించడానికి వీటిని ఉపయోగించనున్నట్లు పేర్కొంది. వీటిని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ మరియు సాయుధ దళాల లాజిస్టిక్స్ విభాగం అభివృద్ధి చేసాయి. ఈ ఉపగ్రహాలు ఇరాన్ యొక్క సిమోర్గ్ రాకెట్‌ ద్వారా ప్రయోగించబడ్డాయి.

ఈ ఉపగ్రహాల త్రయంలో కేహాన్- 2 మరియు హటేఫ్ 1 లు  కమ్యూనికేషన్ మరియు నావిగేషన్ క్యూబ్‌శాట్‌లగా పేర్కొంది. మూడవ ఉపగ్రహం మెహదా పరిశోధన ఉపగ్రహంగా వర్ణించబడింది, ఇది వివిధ కక్ష్యలలోకి ఉపగ్రహాలను ఇంజెక్ట్ చేయడానికి సిమోర్గ్ యొక్క పనితీరును అంచనా వేయడానికి ఇరాన్ యొక్క అంతరిక్ష సంస్థకు సహాయం అందిస్తుంది.

ఈ ప్రయోగంతో ఇరాన్ ఈ ఏడాది మొదటి నెలలోనే రెండోసారి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి పశ్చిమ దేశాలను కంగారు పెట్టిస్తుంది. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ ఏడాది జనవరి 20న సొరయా అని పిలువబడే ఒక ఉపగ్రహాన్ని ఎత్తైన భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది, ఇది రిమోట్ సెన్సింగ్ సామర్థ్యం ఉందని ధృవీకరించబడిన నివేదికలు పేర్కొన్నప్పటికీ, సొరయా యొక్క పనితీరు ఏమిటో ఇంకా అస్పష్టంగానే ఉంది.

అయితే ఈ ప్రయోగాలను అనేక పాశ్చాత్య దేశాలు తక్షణమే ఖండించాయి, ఇరాన్ దేశం యొక్క సుదూర బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ ఉపగ్రహ ప్రయోగాలను ఉపయోగిస్తోందని ఇవి ఆరోపిస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు మరియు బాలిస్టిక్ క్షిపణుల కోసం ఉపయోగించే లాంచ్ వెహికల్స్ మధ్య ఉన్న సారూప్యతలను బట్టి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత అభివృద్ధికి ఈ ప్రయోగం దోహదపడుతుందని ఆందోళన వ్యక్తం చేతున్నాయి. అంతరిక్ష సాంకేతికతను శాంతియుతంగా ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని ఈ దేశాలు ఇరాన్‌ను కోరుతున్నాయి.

పశ్చిమ ఆఫ్రికా కూటమిని విడిచిన నైజర్, మాలి & బుర్కినా ఫాసో

పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం (ECOWAS) నుండి నైజర్, మాలి మరియు బుర్కినా ఫాసో దేశాలు వైదొలుగుతున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఈ మూడు భూపరివేష్టిత దేశాలు మిలటరీ జుంటాలచే పాలించబడుతున్నాయి. ఇవి గత ఏడాది కాలంగా సైనిక తిరుగుబాట్లతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దేశాలు ప్రస్తుతం వెస్ట్ ఆఫ్రికన్ కూటమి యొక్క ఆంక్షల క్రింద ఉన్నాయి. అలానే వీటిని ఇప్పటికే ఆఫ్రికన్ యూనియన్ కూడా సస్పెండ్ చేసింది.

ఆగస్టు 2020లో మాలిలో మిలిటరీ తిరుగుబాటు తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒత్తిడికి లోనైంది. ఈ దేశాన్ని పౌర పాలనకు తిరిగి ఇచ్చే ప్రయత్నాల మధ్య, సైన్యం 2021లో ఒక సంవత్సరంలోనే రెండుసార్లు తిరుగుబాటును నిర్వహించింది. అప్పటి నుండి, ఈ ప్రాంతంలో మొత్తం ఆరు విజయవంతమైన తిరుగుబాట్లు జరిగాయి.

జూలై 2023లో నైజర్‌ ప్రభుత్వాన్ని కూడా అప్రజాస్వామికంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మూడు దేశాల నాయకులు తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం తమ దేశాలపై విధించిన ఆంక్షలను అన్యాయంగా అభివర్ణించారు. ఇందులో భాగంగానే ఈ కూటమిని విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ మూడు దేశాలు కొత్తగా అలయన్స్ ఆఫ్ సహెల్ స్టేట్స్ కూటమిని ప్రకటించారు. దీనిని ఈ మూడు దేశాల స్థిరత్వం మరియు ఆర్థిక శ్రేయస్సును పునరుద్ధరించడానికి ఉపయోగించాలని ఆశిస్తున్నారు.

పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం (ECOWAS) అనేది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న పదిహేను దేశాల ప్రాంతీయ రాజకీయ మరియు ఆర్థిక సంఘం. దీనిని 28 మే 1975లో లాగోస్ (నైజీరియా) లో లాగోస్ ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేసారు. ఇది వారి ప్రజల స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా ప్రాంతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి స్థాపించబడింది.

పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘంలో ఉన్న 15 సభ్య దేశాలలో ఎనిమిది ఫ్రెంచ్ మాట్లాడేవి, ఐదు ఇంగ్లీష్ మాట్లాడేవి మరియు రెండు పోర్చుగీస్ మాట్లాడే దేశాలు ఉన్నాయి. 1977లో చేరిన కేప్ వెర్డే మినహా ప్రస్తుత సభ్యులందరూ మే 1975లో సంఘంలో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.

పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘంలో సభ్య దేశాలు : బెనిన్, బుర్కినా ఫాసో, కేప్ వర్దె, గాంబియా, ఘనా, గినియా, గినియా-బిస్సౌ, ఐవరీ కోస్ట్, లైబీరియా, మాలి, నైజర్, నైజీరియా, సెనెగల్, సియెర్రా లియోన్, టోగో.

69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 విజేతలు

టైమ్స్ గ్రూప్ యొక్క 69 వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక 28 జనవరి 2024న హాట్టహాసంగా జరిగింది. ఈ అవార్డులు గత ఏడాదిలో విడుదలైన ఉత్తమ హిందీ చిత్రాలకు, ఉత్తమ నటులకు అందించబడతాయి. ఈ ఏడాది 12th ఫెయిల్ చిత్రం ఉత్తమ అవార్డు అందుకోగా, యానిమల్ చిత్రం అత్యధికంగా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను చేజిక్కించుకుంది.

ఈ అవార్డుల వేడుక గుజరాత్ గిఫ్ట్ సిటీ యందు నిర్వహించబడింది. ఈ వేడుకకు కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా మరియు మనీష్ పాల్ హోస్టులుగా వ్యవహరించారు. జీటివి యందు ఈ కార్యక్రమం ప్రచారం చేయబడింది. ఈ ఏడాది రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ అత్యధికంగా 20 నామినేషన్లు పొందింది.

  • ఉత్తమ చిత్రం : 12th ఫెయిల్
  • ఉత్తమ దర్శకుడు : విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
  • ఉత్తమ నటుడు : రణబీర్ కపూర్ (యానిమల్)
  • ఉత్తమ నటి : అలియా భట్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
  • ఉత్తమ సహాయ నటుడు : విక్కీ కౌశల్ (డుంకీ)
  • ఉత్తమ సహాయ నటి : షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
  • ఉత్తమ కథ : అమిత్ రాయ్ (OMG 2)
  • ఉత్తమ స్క్రీన్ ప్లే : విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
  • విమర్శకుల ఉత్తమ చిత్రం : జోరమ్
  • విమర్శకుల ఉత్తమ ఉత్తమ నటుడు : విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్)
  • విమర్శకుల ఉత్తమ నటి : రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే )
  • ఉత్తమ నేపథ్య గాయకుడు : భూపిందర్ బబ్బల్ (అర్జన్ వైలీ - యానిమల్)
  • ఉత్తమ నేపథ్య గాయని : శిల్పా రావు (బేషారం రంగ్ - పఠాన్)

ఒడిశాలో 4వ చిలికా బర్డ్స్ ఫెస్టివల్ ప్రారంభం

ప్రతిష్టాత్మక 4వ జాతీయ చిలికా పక్షుల పండుగను జనవరి 26 న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఒడిశా పర్యాటక శాఖ, అటవీ, పర్యావరణ & వాతావరణ శాఖ మరియు చిలికా డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎంపిక చేసిన 52 పక్షులను ప్రదర్శనకు ఉంచారు.

చిలికా సరస్సు ఆసియాలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద తీర సరస్సు. ఇది ఒడిషా రాష్ట్రంలోని పూరి, ఖోర్ధా మరియు గంజాం జిల్లాలలో విస్తరించి ఉంది. ఇది దయా నది ముఖద్వారం ద్వారా బంగాళాఖాతంలోకి ప్రవహిస్తుంది. చిలికా సరస్సు భారత ఉపఖండంలో వలస పక్షులకు ప్రసిద్ధి చెందింది.

చిలికా సరస్సు 1971లో ఇందిరా గాంధీ భారత ప్రధానిగా ఉన్న సమయంలో, దాని గొప్ప జీవవైవిధ్యం కారణంగా రామ్‌సర్ కన్వెన్షన్ ప్రకారం అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన మొదటి భారతీయ చిత్తడి నేలగా గుర్తించబడింది. యేటా ఒక మిలియన్ కంటే ఎక్కువ వలస నీటి పక్షులు శీతాకాల విడిది కోసం ఇక్కడికి చేరుకుంటాయ. ఒడిశా ప్రభుత్వం 1992లో దీని సంరక్షణ మరియు అభివృద్ధి కోసం చిలికా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది.

ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2021-2022

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యపై ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) 2021-2022 విడుదల చేసింది. విద్యా మంత్రిత్వ శాఖ 2011 నుండి యేటా ఈ సర్వే నిర్వహిస్తుంది. ఇది దేశంలో నమోదు చేయబడిన అన్ని ఉన్నత విద్యా సంస్థలను కవర్ చేస్తూ, విద్యార్థుల నమోదు, బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు వంటి వివిధ పారామితులపై వివరణాత్మక సమాచారాన్ని సేకరిస్తుంది.

  • ఉన్నత విద్య కోసం 2021-22లో దాదాపు 4.33 కోట్ల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ మొత్తం నమోదు 2020-21లో 4.14 కోట్లతో పోలిస్తే పెరుగుదల కనిపించింది.
  • 2021-22 ఏడాదిలో 2.07 కోట్ల మంది మహిళా విద్యార్థులు ఉన్నత విద్యకోసం నమోదు చేసుకున్నారు.
  • 2021-22 ఏడాదిలో 66.23 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు ఉన్నత విద్యలో చేరగా వారిలో 31.71 లక్షల మంది మహిళా విద్యార్థులు ఉన్నారు.
  • 2021-22 ఏడాదిలో 27.1 లక్షల మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యలో చేరగా వారిలో 13.46 లక్షల మంది మహిళా విద్యార్థులు ఉన్నారు.
  • 2021-22 ఏడాదిలో 1.63 కోట్ల మంది ఓబీసీ విద్యార్థులు ఉన్నత విద్యలో చేరగా వారిలో 78.19 లక్షల మంది మహిళా విద్యార్థులు ఉన్నారు.
  • 2021-22 ఏడాదిలో 30.1 లక్షల మంది మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యలో చేరగా వారిలో 15.2 లక్షల మంది మహిళా విద్యార్థులు ఉన్నారు.
  • 2021-22 ఏడాదిలో ఈశాన్య రాష్ట్రాల నుండి ఉన్నత విద్య కోసం 12.02 లక్షల మంది నమోదు చేసుకోగా, వీరిలో 6.07 లక్షల మంది మహిళా విద్యార్థులు ఉన్నారు.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2014-15లో 23.7 నుండి 2021-22లో 28.4కి పెరిగింది. మహిళా విద్యార్థుల పరంగా 2014-15లో 22.9 నుండి 2021-22లో 28.5కి పెరుగుదల నమోదు అయ్యింది.
  • లింగ సమానత్వ సూచిక (జీపిఐ) పరంగా చూసుకుంటే 2021-22లో మహిళల జీఈఆర్, పురుషుల జీఈఆర్ నిష్పత్తి కంటే 1.01 ఎక్కువ ఉంది. అలానే జీపిఐ 2017-18 నుండి ఒకటి పైన కొనసాగుతోంది. అంటే, వరుసగా ఐదవ సంవత్సరం కూడా స్త్రీ జీఈఆర్ పురుషుల జీఈఆర్ కంటే ఎక్కువగా కొనసాగుతోంది.

తాజా ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే ప్రకారం మొత్తం ఉన్నత విద్య నమోదులో 78.9% మంది అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులలో నమోదు చేసుకోగా, కేవలం 12.1% మంది మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులలో నమోదు చేసుకున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అత్యధిక మంది ఆర్ట్స్ (34.2%), తర్వాత సైన్స్ (14.8%), వాణిజ్యం (13.3%) మరియు ఇంజనీరింగ్ & టెక్నాలజీ (11.8%) కోర్సులలో అడ్మిషన్ పొందారు.

పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులలో మెజారిటీ విద్యార్థులు సోషల్ సైన్స్ (21.1%) తర్వాత సైన్స్ (14.7%)లో నమోదు చేసుకున్నారు. పీహెచ్డీ వంటి పరిశోధన ఉన్నత విద్యలో 2014-15లో 1.17 లక్షల నమోదుతో పోలిస్తే 2021-22లో 81.2% పెరిగి 2.12 లక్షలకు చేరుకుంది. దీనికి సంబంధించి మహిళల నమోదు 2014-15లో 0.48 లక్షలుగా ఉండగా 2021-22 నాటికి 0.99 లక్షలకు రెట్టింపు అయింది. మహిళా పీహెచ్డీలలో 2014-15 నుండి 2021-22 వరకు 10శాతం వార్షిక పెరుగుదల నమోదు అయ్యింది.

దేశంలో ఉన్నత విద్యను అందిస్తున్న మొత్తం విశ్వవిద్యాలయాలలో 58.6% ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండగా,  ఉన్నత విద్య ఎన్‌రోల్‌మెంట్‌లో 73.7% వాటాను ఇవే కలిగి ఉన్నాయి. మొత్తం ఉన్నత విద్య నమోదులో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వాటా 26.3% మాత్రమే కలిగి ఉన్నాయి.

2021-22 సర్వే ప్రకారం దేశంలోని విశ్వవిద్యాలయలలోని వివిధ మౌలిక సదుపాయాల లభ్యత చూసుకుంటే, 99% యూనివర్సిటీలలో లైబ్రరీలు, 88% వాటిలో ప్రయోగశాలలు, 93% వాటిలో కంప్యూటర్ కేంద్రాలు 71% వాటిలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, 91% వాటిలో ప్లే గ్రౌండ్ అందుబాటులో ఉన్నాయి.

ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం 1,168 విశ్వవిద్యాలయాలు , 45,473 కళాశాలలు, 12,002 స్వతంత్ర విద్య సంస్థలు నమోదు చేయబడ్డాయి. 2014-15 నుండి 2021-22 వరకు మొత్తం 341 కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. 17 విశ్వవిద్యాలయాలు (వీటిలో 14 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు) మరియు 4,470 కళాశాలలు మహిళలకు కేటాయించబడి ఉన్నాయి.

2021-22లో మొత్తం అధ్యాపకుల సంఖ్య 15.98 లక్షలుగా నివేదించబడింది, వీరిలో దాదాపు 56.6% మంది పురుషులు మరియు 43.4% మహిళా అధ్యాపకులు ఉన్నారు. మహిళా అధ్యాపకులు 2014-15లో 5.69 లక్షల నుండి 2021-22లో 6.94 లక్షలకు పెరిగారు. 2020-21లో 100 మంది పురుష ఫ్యాకల్టీకి 75 మంది ఉన్న స్త్రీ అధ్యాపకులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 77కి స్వల్పంగా మెరుగుపడింది.

Post Comment