తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 28 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 28 జనవరి 2024

January 28, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

Advertisement

2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు

2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, మెల్బోర్న్ పార్క్‌లో జనవరి14 నుండి 28 వరకు జరిగింది. ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ యొక్క 112వ ఎడిషన్, ఓపెన్ ఎరాలో 56వది. ఈ టోర్నమెంట్‌ సింగిల్స్, డబుల్స్ మరియు మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లుగా నిర్వహిస్తారు. ఇది గ్రాండ్‌స్లామ్ క్యాలెండర్ ఇయర్‌లో మొదటి టొర్నమెంట్.

1. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేత : ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను ఇటలీ యువ టెన్నిస్ ఆటగాడు జానిక్ సిన్నర్ దక్కించుకున్నాడు. ఫైనల్ మ్యాచులో  3–6, 3–6, 6–4, 6–4, 6–3తో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ఇది అతని మొదటి మేజర్ సింగిల్స్ టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒక ఇటాలియన్ ప్లేయర్ టైటిల్ సాధించడం ఇదే తొలిసారి.

22 ఏళ్ళ జానిక్ సిన్నర్, 2008లో నోవాక్ జొకోవిచ్ తర్వాత అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియనుగా నిలిచాడు. 2005 నుండి బిగ్ త్రీ సభ్యులలో (నోవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్ & రాఫెల్ నాదల్) ఎవరూ పాల్గొనని మొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ ఇది. డిఫెండింగ్ ఛాంపియన్ జొకోవిచ్ నీ సెమీఫైనల్స్‌లో సిన్నర్ చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతని 33-మ్యాచ్ విజయాల పరంపరను ముగించింది. 2019 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ యందు జొకోవిచ్ ఓడిపోవడం ఇదే తొలిసారి.

2. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ విజేత : ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబలెంకా సొంతం చేసుకుంది. ఫైనల్‌లో జెంగ్ క్విన్‌వెన్‌ను 6–3, 6–2తో ఓడించి విజేతగా నిలిచింది. ఇది ఆమెకు రెండో మేజర్ సింగిల్స్ టైటిల్.

సబలెంకా ఈ టోర్నమెంటులో ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. మొత్తం టోర్నమెంటులో ఆమె కేవలం 31 గేమ్‌లను మాత్రమే కోల్పోయింది. 2013 లో విక్టోరియా అజరెంకా తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కాపాడుకున్న మొదటి క్రీడాకారిణిగా సబలెంకా నిలిచింది. ఆస్ట్రేలియన్ టోర్నమెంట్ చరిత్రలో ఈ ఏడాది తొలిసారి మెయిన్ డ్రాలో ఆరుగురు మాజీ ఛాంపియన్‌లు ఉన్నారు. వీరిలో సబాలెంకా, నవోమి ఒసాకా, సోఫియా కెనిన్, కరోలిన్ వోజ్నియాకి, ఏంజెలిక్ కెర్బర్ మరియు అజరెంకా ఉన్నారు.

3. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ విజేత : ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టెన్నిస్ టైటిల్‌ను రోహన్ బోపన్న మరియు మాథ్యూ ఎబ్డెన్ జోడి గెలుచుకుంది. ఫైనల్లో 7–6, 7–5తో సిమోన్ బోలెల్లి మరియు ఆండ్రియా వవాస్సోరిని ఓడించి విజేతగా నిలిచారు. డబుల్స్‌లో బోపన్నకు ఇది తొలి మేజర్ టైటిల్ కాగా, ఎబ్డెన్‌కు ఇది రెండోది. ఓపెన్ ఎరాలో మేజర్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా బోపన్న నిలిచాడు.

బోపన్న సెమీఫైనల్‌కు చేరుకోవడం ద్వారా మొదటిసారి ఏటీపీ నెంబర్ వన్ డబుల్స్ ర్యాంకింగ్‌ను సాధించాడు. దీనితో టెన్నిస్ చరిత్రలో అతి పెద్ద వయస్సులో నెంబర్ వన్ ర్యాంకింగ్ సాధించిన క్రీడాకారుడిగా కూడా నిలిచాడు. బోపన్నకు తన కెరీరులో ఇది రెండవ గ్రాండ్‌స్లామ్. 2017లో మిక్స్‌డ్ డబుల్స్ యందు అయన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాడు.

4. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మహిళల డబుల్స్ విజేత : ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టెన్నిస్ టైటిల్‌ను తైవాన్ & బెల్జియంకు చెందిన హ్సీహ్ సు-వీ మరియు ఎలిస్ మెర్టెన్స్ సొంతం చేసుకున్నారు. ఫైనల్లో 6–1, 7–5తో లుడ్‌మిలా కిచెనోక్ మరియు జెనా ఒస్టాపెంకోను ఓడించి విజేతగా నిలిచారు. ఇది జట్టుగా వారి రెండవ ప్రధాన టైటిల్ కాగా, వ్యక్తిగతంగా ఇది హ్సీహ్ సు-వీ యొక్క ఎనిమిదో మేజర్ టైటిల్ మరియు మెర్టెన్స్ యొక్క నాల్గవది. హ్సీహ్ సు-వీ ఈ ఈవెంట్‌లో మహిళల డబుల్స్ మరియు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ రెండింటినీ సొంతం చేసుకుంది.

5. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మిక్స్‌డ్ డబుల్స్ విజేత : ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్ టైటిల్‌ను హ్సీహ్ సు-వీ మరియు జాన్ జీలిన్స్‌కి సొంతం చేసుకున్నారు. ఫైనల్‌లో 6–7, 11–9 తో డెసిరే క్రావ్‌జిక్ మరియు నీల్ స్కుప్స్కీని ఓడించి విజేతగా నిలిచారు. ఈ విజయంతో జీలిన్స్‌కి ఈవెంట్‌లో మొదటి పోలిష్ ఛాంపియన్ మరియు ఫైనలిసస్టుగా నిలిచాడు. ఇది అతని మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్.

2024లో భారతదేశం యొక్క మొదటి యునికార్న్‌గా క్రుట్రిమ్

ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ క్రుట్రిమ్, 2024 ఏడాదికి సంబంధించి మొదటి యునికార్న్ కంపెనీగా అవతరించింది. ఈ సంస్థ ఈ ఏడాది మొదటి నెలలో పెట్టుబడి సంస్థ మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా మరియు ఇతర మద్దతుదారుల నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్‌లో $50 మిలియన్లను సేకరించింది. భారతీయ మీడియా ప్రకారం, ఈ నిధులు $1 బిలియన్ల విలువకు సమానం. దీనితో ఈ సంవత్సరం యునికార్న్ హోదాను పొందిన మొదటి కంపెనీగా క్రుట్రిమ్ నిలిచింది.

అలానే క్రుట్రిమ్ భారతదేశంలో మొట్టమొదటి ఎఐ యునికార్న్ సంస్థగా కూడా అవతరించింది. క్రుట్రిమ్ భారతీయ భాషలను ప్రాసెస్ చేయగల మరియు అర్థం చేసుకోగల పెద్ద భాషా నమూనాను అభివృద్ధి చేస్తోంది. అలానే వాయిస్-ఎనేబుల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్‌ను ప్రారంభించాలని, అంతర్గత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూట్ చిప్‌లను అభివృద్ధి చేయాలని మరియు ప్రపంచవ్యాప్తంగా దాని పరిధిని విస్తరించాలని యోచిస్తోంది.

నాటో ఎక్సర్‌సైజ్ స్టెడ్‌ఫాస్ట్ డిఫెండర్ 2024 ప్రారంభం

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నాటో అతిపెద్ద సైనిక వ్యాయామం స్టెడ్‌ఫాస్ట్ డిఫెండర్ 2024ను జనవరి 24న ప్రారంభించింది. ఇందులో భాగంగా యుద్ధనౌక అట్లాంటిక్ మీదుగా ఐరోపాలోని కూటమి భూభాగానికి యునైటెడ్ స్టేట్స్ నుండి బయలుదేరింది. ఈ వ్యాయామం నెలరోజులు లేదా అంతకు మించి జరగనుంది.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు దాని రక్షణను పరీక్షించేందుకు రూపొందించిన ఈ స్టెడ్‌ఫాస్ట్ డిఫెండర్ 24 వ్యాయామంలో దాదాపు 90,000 మంది సైనికులు పాల్గొంటారని పశ్చిమ సైనిక కూటమి తెలిపింది. రష్యా వంటి ప్రత్యర్థి దాడికి 31 దేశాల కూటమి ప్రతిస్పందనను అనుకరించేలా ఈ వ్యాయామం రూపొందించబడింది.

ఈ వ్యాయామంలో దాదాపు 50 నౌకాదళ నౌకలు, 80 విమానాలు మరియు 1,100 యుద్ధ వాహనాలు పాల్గొంటాయి. ఈ వ్యాయామం ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 1988 రిఫోర్జర్ డ్రిల్ తర్వాత అతిపెద్దది. రష్యా 2022లో ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించినప్పటి నుండి నాటో దాని రక్షణను సరిదిద్దింది.

అనేక నెలల పాటు మరియు వేల కిలోమీటర్లలో సంక్లిష్టమైన బహుళ-డొమైన్ కార్యకలాపాలను నిర్వహించడానికి మరియు కొనసాగించడానికి నాటో యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఈ వ్యాయామం రూపొందించబడింది. భూమి, గాలి, సముద్రం, సైబర్ మరియు అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన బహుళ-డొమైన్ వ్యాయామాలు ఇందులో అంతర్భాగంగా ఉంటాయి.

భారతదేశం- సౌదీ అరేబియా సంయుక్త సైనిక వ్యాయామం సదా తన్సీక్

భారతదేశం-సౌదీ అరేబియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 'సదా తన్సీక్' ప్రారంభ ఎడిషన్ జనవరి 29న రాజస్థాన్‌లోని మహాజన్‌లో ప్రారంభమైంది. ఈ వ్యాయామం 29 జనవరి నుండి ఫిబ్రవరి 10, 2024 వరకు నిర్వహించబడుతోంది. సౌదీ అరేబియా నుండి 40 మందితో కూడిన రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ బృందం ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇండియన్ ఆర్మీ కంటెంజెంట్‌కు 45 మందితో కూడిన బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ (మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ) బెటాలియన్ ప్రాతినిధ్యం వహిస్తోంది.

ఇది భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య మొట్టమొదటి ఉమ్మడి సైనిక వ్యాయామం. ఈ చోరవ రెండు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క VII అధ్యాయం క్రింద సెమీ ఎడారి భూభాగంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించబడుతుంది. రెండు వైపుల దళాలకు శిక్షణ ఇవ్వడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. ఉప-సాంప్రదాయ డొమైన్‌లో కార్యకలాపాలను నిర్వహించే వ్యూహాలు, పద్ధతులు మరియు విధానాలలో తమ ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి ఈ వ్యాయామం ఉపయోగించుకొన్నారు.

రంజీ ట్రోఫీలో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ  చేసిన తన్మయ్ అగర్వాల్

హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేయడంతో రికార్డులను బద్దలు కొట్టాడు. 28 ఏళ్ల ఈ కుర్రోడు 160 బంతుల్లో 33 ఫోర్లు మరియు 21 సిక్స్‌లతో 201.88 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 323 పరుగులు సాదించాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో ఏ బ్యాటర్ అయినా 150 లోపు బంతుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టడం ఇదే తొలిసారి. విస్డెన్ అల్మానాక్ ప్రకారం, 1772లో మొదటి 'ఫస్ట్-క్లాస్' క్రికెట్ మ్యాచ్ ఆడినట్లు గుర్తించబడినందున, సుమారు 252 సంవత్సరాలలో ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ఈ రికార్డులతో పాటు రంజీ చరిత్రలో ఒకే రోజులో 300 ప్లస్ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా కూడా నిలిచాడు.

ఇది కాకుండా ఈ హైదరాబాద్ బ్యాటర్ 119 బంతుల్లో ఈ ఫీట్ సాధించి, 1985లో బరోడాపై 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన రవిశాస్త్రి పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించి, ఒక భారతీయుడిచే వేగవంతమైన ఫస్ట్-క్లాస్ డబుల్ సెంచరీని కూడా కొట్టాడు. ఈ రికార్డులను పరిశీలిస్తే, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ. అగర్వాల్ ధాటికి హైదరాబాద్ కేవలం 48 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 529 పరుగులు చేసింది.

Advertisement

Post Comment