తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 30 జనవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.
యునెస్కో ట్యాగ్ కోసం భారత్ నుండి మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్ నామినేట్
2024-25 సంవత్సరానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో జాబితా కోసం మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్ ఆఫ్ ఇండియాను భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. 17వ మరియు 19వ శతాబ్దాల మధ్య అభివృద్ధి చెందిన ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్ ఆఫ్ ఇండియా, మరాఠా పాలకుల యొక్క వ్యూహాత్మక సైనిక పరాక్రమాన్ని సూచిస్తుంది.
ఈ నామినేషన్‌లో మహారాష్ట్ర మరియు తమిళనాడు నుండి మొత్తం పన్నెండు కోటలను జాబితా చేసారు. వీటిలో సల్హేర్ కోట, శివనేరి కోట, లోహ్‌గడ్, ఖండేరి కోట, రాయ్‌గడ్, రాజ్‌గడ్, ప్రతాప్‌గడ్, సువర్ణదుర్గ్, పన్హాలా ఫోర్ట్, విజయ్ దుర్గ్, మహారాష్ట్రలోని సింధుదుర్గ్ మరియు తమిళనాడులోని జింగీ కోట ఉన్నాయి. ఈ కోటలు అన్ని మరాఠా పాలన యొక్క వ్యూహాత్మక సైనిక శక్తులను ప్రదర్శిస్తాయి.
ఈ కోటలు భారత ద్వీపకల్పంలోని సహ్యాద్రి పర్వత శ్రేణులు, కొంకణ్ తీరం, దక్కన్ పీఠభూమి మరియు తూర్పు కనుమలకు విలక్షణమైన ప్రకృతి దృశ్యంను అందిస్తున్నాయి. ఈ భూభాగాలు మరియు భౌగోళిక లక్షణాలను ఏకీకృతం చేయడం ద్వారా ఈ అసాధారణమైన కోటల నెట్‌వర్క్ ఏర్పడుతుంది.
మహారాష్ట్రలో మొత్తం 390 కోటలు ఉన్నాయి. వాటిలో కేవలం 12 కోటలు మాత్రమే మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్ ఆఫ్ ఇండియా క్రింద ఎంపిక చేయబడ్డాయి. ఈ ఎనిమిది కోటలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే రక్షించబడుతున్నాయి. అవి శివనేరి కోట, లోహ్‌గడ్, రాయ్‌గడ్, సువర్ణదుర్గ్, పన్హాలా కోట, విజయదుర్గ్, సింధుదుర్గ్ మరియు జింగీ కోట.
అయితే సల్హేర్ కోట, రాజ్‌గడ్, ఖండేరి కోట మరియు ప్రతాప్‌గఢ్ మహారాష్ట్ర ప్రభుత్వ పురావస్తు మరియు మ్యూజియంల డైరెక్టరేట్ ద్వారా రక్షించబడుతున్నాయి. భారతదేశంలోని మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్‌లలో సల్హేర్ కోట, శివనేరి కోట, లోహ్‌గడ్, రాయగడ, రాజ్‌గడ్ మరియు గింగీ కోటలు కొండ కోటలు, ప్రతాప్‌గడ్ కొండ-అటవీ కోట, పన్హాలా కొండ-పీఠభూమి కోట, విజయదుర్గ్ వంటివి తీరప్రాంత కోటలు అయితే ఖండేరి కోట, సింధుదుర్గ్, సువర్ణదుర్గ్ అనేవి ద్వీప కోటలు.
ప్రస్తుతం భారతదేశంలో 42 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో 34 సాంస్కృతిక ప్రదేశాలు, ఏడు సహజ ప్రదేశాలు మరియు ఒకటి రెండు కేటగిర్లలో ఎంపిక చేయబడింది. మహారాష్ట్రలో ప్రస్తుతం ఆరు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో అజంతా గుహలు (1983), ఎల్లోరా గుహలు (1983), ఎలిఫెంటా గుహలు (1987), ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్) (2004), విక్టోరియన్ గోతిక్ మరియు ఆర్ట్ డెకో ఎన్‌సెంబుల్స్ ఆఫ్ ముంబై (2018) ఉన్నాయి. అలానే సీరియల్ ప్రాపర్టీగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళకు చెందిన పశ్చిమ కనుమలు కూడా ఉన్నాయి.
ఒడిశాలో లఘు బనా జాత్య ద్రబ్యా క్రయా పథకం ప్రారంభం
ఒడిశా ప్రభుత్వం ఇటీవలే లాభ (LABHA : లఘు బనా జాత్య ద్రబ్యా క్రయా) పథకాన్ని ప్రారంభించింది. ఇది గిరిజన సంఘాలకు సాధికారత కల్పించడం మరియు చిన్న అటవీ ఉత్పత్తుల (ఎంఎఫ్‌సి) యొక్క స్థిరమైన నిర్వహణకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 100% రాష్ట్ర-నిధులతో కూడిన కనీస మద్దతు ధర చొరవ.
ఈ పథకం కింద గిరిజన కలెక్టర్లకు న్యాయమైన పరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (ఎంఎఫ్‌పి) కోసం కనీస ధరకు హామీ ఇస్తుంది. ఈ ధర ఏటా కలెక్టర్ల ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ చెల్లింపులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడతాయి. తద్వారా పారదర్శకతను ప్రోత్సహించి, మధ్యవర్తుల దోపిడీని తగ్గిస్తుంది.
ఈ పథకం ఇప్పటికే ప్రభుత్వం అమలుచేస్తున్న మహిళా సాధికారత కార్యక్రమం అయిన మిషన్ శక్తితో అనుసందించబడుతుంది. ఉత్పత్తుల సేకరణ మరియు విలువ జోడింపు దాని స్వయం-సహాయ సమూహాల నెట్‌వర్క్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ పథకం ఒడిశాలో గిరిజన సంక్షేమం కోసం ఒక మైలురాయి చొరవగా పరిగణించబడుతుంది. గిరిజన సంఘాలు, ముఖ్యంగా మహిళల ఆదాయం పెంచడం ద్వారా వారికి ఆర్థిక భద్రత అందిస్తుంది.
రాజ్యసభ ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదల
భారత ఎన్నికల సంఘం 15 రాష్ట్రాలలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజాగా పదవీవిరమణ చేయనున్న 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 10 స్థానాలు ఉండగా, మహారాష్ట్ర (6), బీహార్ (6), పశ్చిమ బెంగాల్ (5), మధ్యప్రదేశ్ (5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తెలంగాణ (3), రాజస్థాన్ (3), ఒడిశా (3), ఉత్తరాఖండ్ (1), ఛత్తీస్‌గఢ్ (1), హర్యానా (1), మరియు హిమాచల్ ప్రదేశ్ (1) ఉన్నాయి.
ఈ 56 మంది రాజ్యసభ సభ్యులలో 50 మంది పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనుండగా, మిగిలిన ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది. ప్రస్తుత రాజ్యసభలో, మొత్తం 238 మంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు. వీరిలో బిజెపి నుండి 93 మంది, కాంగ్రెస్ నుండి 30 మంది, తృణమూల్ కాంగ్రెస్ నుండి 13 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి 10 మంది, డీఎంకే నుండి 10 మంది ఉన్నారు.
వీరితో పాటుగా కళలు, సాహిత్యం, శాస్త్రాలు మరియు సామాజిక సేవలకు చేసిన కృషికి గానూ రాష్ట్రపతి మరో 12 మంది సభ్యులను పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేస్తారు. ప్రజాస్వామ్యం యొక్క పార్లమెంటరీ రూపంలో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని తరచుగా 'పెద్దల సభ'గా పరిగణిస్తారు. ప్రజల సభ అయిన లోక్‌సభ ఆమోదించిన బిల్లులను నిశితంగా పరిశీలించి, అవసరమైనట్లు భావించే సిఫార్సులను చేసే బాధ్యతను రాజ్యసభ నిర్వర్తిస్తుంది.
రాజ్యసభ అనేది పార్లమెంటు యొక్క శాశ్వత సభ, దీనిలో 6 సంవత్సరాల పదవీకాలానికి సభ్యులు ఎన్నోకోబడతారు. ఈ సభ్యులలో మూడింట ఒక వంతు ప్రతి రెండు సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు. ఇది దాని కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారిస్తుంది. రాజ్యసభ ఎన్నికలలో ఓటింగ్ పరోక్షంగా ఉంటుంది. రాష్ట్ర శాసనసభల ఎన్నికైన సభ్యులు రాజ్యసభ అభ్యర్థులకు ఓటు వేస్తారు. ఈ ఎన్నికల ఫలితాలు రాజ్యసభ కూర్పు మరియు భారత పార్లమెంటులో అధికార సమతుల్యతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.
- రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ : ఫిబ్రవరి 8
- నామినేషన్లు వేయడానికి చివరి తేదీ : ఫిబ్రవరి 15
- నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 16
- అభ్యర్థుల ఉపసంహరణకు చివరి : తేదీ ఫిబ్రవరి 20
- రాజ్యసభ ఎన్నికల తేదీ : ఫిబ్రవరి 27
- ఎన్నికల సమయం : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 4 వరకు
- ఓట్ల లెక్కింపు : ఫిబ్రవరి 27
ట్రాయ్ కొత్త ఛైర్మన్‌గా అనిల్ కుమార్ లాహోటి నియామకం
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్‌గా రైల్వే బోర్డు మాజీ చీఫ్ అనిల్ కుమార్ లహోటీ నియమితులయ్యారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్'చే ఆమోదించబడిన ఈ నియామకం భారతదేశ టెలికమ్యూనికేషన్ రంగంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ట్రాయ్ మాజీ చైర్మన్ పీడీ వాఘేలా తన రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత నవంబర్ 2023లో పదవీవిరమణ చేసారు.
1984-బ్యాచ్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్ అయిన అనిల్ కుమార్ లహోటీ, మధ్యప్రదేశ్‌లోని మాధవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని మరియు ఐఐటీ రూర్కీ నుండి స్ట్రక్చర్స్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను పూర్తిచేశారు. ఈయన రైల్వే బోర్డులో పనిచేయడానికి ముందు, ఉత్తర, మధ్య, ఉత్తర మధ్య, పశ్చిమ మరియు పశ్చిమ మధ్య రైల్వేలలో వివిధ హోదాల్లో పనిచేశారు. భారతీయ రైల్వేలో ఈయన 36 సంవత్సరాలు సుదీర్ఘంగా అనుభవం కలిగి ఉన్నారు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోని టెలికమ్యూనికేషన్స్ రంగాన్ని నియంత్రించే ప్రభుత్వ సంస్థ. ఇది 20 ఫిబ్రవరి 1997 లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మరియు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తుంది.
ఢిల్లీ & హైదరాబాద్‌లో ఓలా ఇ-బైక్ టాక్సీ సేవలు ప్రారంభం
ఓలా గ్రూప్ యొక్క ఓలా మొబిలిటీ తన కొత్త ఇ-బైక్ టాక్సీ సేవను ఢిల్లీ మరియు హైదరాబాద్‌లో ప్రారంభించింది. బెంగుళూరులో విజయవంతమైన పైలట్ ప్రోగ్రామ్ తర్వాత ఓలా తన ఇ-బైక్ టాక్సీ సేవలను ఢిల్లీ మరియు హైదరాబాద్‌లో ప్రారంభించింది. వచ్చే రెండు నెలల్లో ఈ రెండు నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ కంపెనీ ప్లాన్ చేస్తుంది.
ఇదే వేదిక ద్వారా ఈ-బైక్ సేవల ధరలను కూడా ఈ కంపెనీ ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం, ఓలా ఇ-బైక్ ఛార్జీలు 5 కి.మీలకు ₹ 25 నుండి, 10 కి.మీకి ₹ 50 మరియు 15 కి.మీకి ₹ 75 నుండి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ చార్జీలు సాధారణ టాక్సీలు మరియు ఆటోలతో పోల్చితే సరసమైన ధరలుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా తన సేవలను క్రమంగా పెంచాలని యోచిస్తోంది.
ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగించడం ద్వారా, ఓలా దేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం మరియు స్థిరమైన రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు గ్రీన్ ఇనిషియేటివ్‌లపై భారతదేశం యొక్క పెరుగుతున్న దృష్టికి అనుగుణంగా ఉంది.
ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశవ్యాప్తంగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో కూడా పెట్టుబడి పెడుతోంది. ఈ సంస్థ ఇప్పటికే బెంగుళూరు సిటీలో 200 ల ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో బైక్ టాక్సీల కోసం అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఫ్లీట్‌గా మారనుంది. ఈ చొరవ గిగ్ కార్మికులకు బహుళ-పని అవకాశాలను సృష్టిస్తుంది మరియు స్థిరమైన వాణిజ్య భవిష్యత్తుకు దోహదం చేస్తుంది.
బీహార్ సీఎంగా 9వ సారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్
జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా జనవరి 28న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్ సహా 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నిన్న మొన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమి చేరడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మీరింది.
నితీష్ కుమార్ 2000లో తొలిసారిగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రభుత్వం వారంలోపే మెజారిటీ లేక పడిపోయింది. 2005లో రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఐదేళ్ల పూర్తికాలం పని చేశారు. 2010 ఎన్నికలలో గెలిచి మూడవసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నికలు బీహార్‌లో రక్తపాతం లేదా పోలింగ్ హింస లేకుండా అత్యంత న్యాయమైన ఎన్నికలగా ప్రకటించబడ్డాయి. ఈ ఎన్నికలలో జేడీయూ మరియు బీజేపీ కూటమి 206 సీట్లు గెలుచుకున్నాయి.
అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో జెడి(యు) ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన సీఎంగా వైదొలిగారు. ఆయన స్థానంలో ఆ పార్టీకి చెందిన జితన్ రామ్ మాంఝీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2015లో రాబోయే బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో, నితీష్ కుమార్ ఏడాదిలోపే జితన్ రామ్ మాంఝీ నుండి సీఎంగా బాధ్యతలు స్వీకరించి 4వ సారి ప్రమాణస్వీకారం చేసారు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌లతో కలిసి బీహార్‌లో బీజేపీని ఎదుర్కోవడానికి మహాఘట్‌బంధన్ (మహాకూటమి)ని ఏర్పాటు చేశాడు. ఈ ఎన్నికలలో మహాకూటమి బీజేపీ మరియు దాని మిత్రపక్షాలపై 178 తేడాతో గెలుపొందింది. దీనితో నితీష్ 5వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఆర్జేడీ ఈ ఎన్నికలలో 80 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 71తో రెండవ స్థానంలో నిలిచింది. దీనితో తేజస్వి యాదవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
2017లో ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణల కారణంతో మహాకూటమిలో విభేదాలు వచ్చి 6 జూలై 2017న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాని తర్వాత రోజే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కూటమితో జోడికట్టి 6వ సారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2020 ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమితో కలిసి ఆయన 125 సీట్లు గెలుచుకుని 7వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికలలో మహాఘటబంధన్ 110 సీట్లు సాధించింది.
9 ఆగష్టు 2022లో ఎన్‌డిఎతో విభేదించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా రాజీనామా చేసి తిరిగి మహాఘటబంధన్‌తో కలిసి 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కాలంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి తరుపున కీలక భూమిక పోషించారు. కేంద్రంలో బీజేపీ పార్టీని గద్దె దింపేందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేశారు. అయితే ఈ కూటమితో విభేదించి జనవరి 28న మహాఘటబంధన్ ప్రభుత్వానికి ముగింపు పలికి తిరిగి బీజేపీ సహాయంతో రికార్డు స్థాయిలో 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
243 మంది సభ్యుల ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో జేడీయూకి 44 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 78 మంది, ఆర్జేడీకి 79 మందితో పాటు కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ సహాయంతో ఏర్పాటు చేసిన ప్రస్తుత నితీష్ ప్రభుత్వం, మహాఘటబంధన్ కూటమి కంటే కేవలం ఎనిమిది సీట్ల మెజారిటీ మాత్రమే కలిగి ఉంది. నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలవడంతో పాటుగా దేశంలో అత్యధికసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేసిన వ్యక్తిగా చరిత్రకెక్కారు.
కొమొరోస్ అద్యక్షడుగా అజాలి అసోమాని తిరిగి ఎన్నిక
కొమొరోస్ అధ్యక్షుడిగా అజాలీ అసోమాని తిరిగి ఎన్నికయ్యారు. జనవరి 1 న జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ అజాలి అసోమాని 63% ఓట్లతో నాల్గొవ సారి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. 2002, 2016, 2019 మరియు 2024లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2023 నుండి ఆయన ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్‌గా కూడా సేవలు అందిస్తున్నారు.
కొమొరోస్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అజాలి అసోమానిని అభినందించారు. భారతదేశం- కొమొరోస్ భాగస్వామ్యాన్ని, భారతదేశం-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రెండు దేశాలు కృషి చేస్తూనే ఉంటాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 'విజన్ సాగర్'ను మరింత బలోపేతం చేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఆయన్ని అభినందించారు.
కొమొరోస్ అనేది తూర్పు ఆఫ్రికా తీరంలో హిందూ మహాసముద్రంలో ఉన్న మూడు కొమొరో దీవుల సమూహం. కొమొరోస్ 6 జూలై 1975న ఫ్రాన్స్ నుండి స్వాతంత్రం పొందింది. ఇది దక్షిణ అర్ధగోళంలో ఉన్న ఏకైక అరబ్ కూటమి యొక్క దేశం. కొమొరోస్ వైశాల్యం ప్రకారం మూడవ-చిన్న ఆఫ్రికన్ దేశం.
- దేశం : కొమొరోస్
- ఖండం : ఆఫ్రికా
- రాజధాని : మొరోని
- అధికారిక భాషలు : కొమోరియన్, ఫ్రెంచ్, అరబిక్
- కరెన్సీ : కొమోరియన్ ఫ్రాంక్
- అధ్యక్షుడు : అజాలి అసోమాని