పునఃప్రారంభమైన కాంగ్రా వ్యాలీ సమ్మర్ ఫెస్టివల్
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ధర్మశాల పోలీస్ గ్రౌండ్‌లో కాంగ్రా వ్యాలీ సమ్మర్ ఫెస్టివల్-2022ను పునఃప్రారంభించారు. ఇది జూన్ 2 నుండి జూన్ 9 వరకు ఘనంగా నిర్వహించారు. ఈ ఫెస్టివల్ హిమాచల్ ప్రదేశ్ సంస్కృతి మరియు సంప్రదాయాలను వేసవిలో ఆ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు పరిచయం చేయడానికి నిర్వహించబడుతుంది. ఇది గత 10 ఏళ్లుగా నిర్వహణకు నోచుకోలేదు. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రత్యేక చొరవతో దీనిని తిరిగి పునఃప్రారంభించారు.
సిక్కిం రాష్ట్ర సీతాకోక చిలుకగా బ్లూ డ్యూక్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, 'బ్లూ డ్యూక్‌ను' రాష్ట్ర సీతాకోకచిలుకగా ప్రకటించారు. బ్లూ డ్యూక్ అనేది సిక్కింలో కనిపించే ఒకానొక సీతాకోకచిలుక జాతి. సిక్కింలో సుమారు 720 రకాల సీతాకోకచిలుకలు ఉండగా, ఇటీవలే నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో బ్లూ డ్యూక్ 57 శాతం ఓట్లతో ఆ రాష్ట్ర బటర్‌ఫ్లైగా ఎంపికైంది. బ్లూ డ్యూక్'ను శాస్త్రీయంగా 'బస్సరోనా దుర్గా' అను నామంతో పిలుస్తారు. ఇది సిక్కిం మరియు తూర్పు హిమాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
బహ్రెయిన్‌లో 8 రోజుల ఏపీఈడీఏ మాంగో ఫెస్టివల్
అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) జూన్ 13 నుండి 20 తేదీ మధ్య బహ్రెయిన్‌లో భారత రాయబార కార్యాలయం మరియు అల్ జజీరా గ్రూప్‌తో కలిసి ఎనిమిది రోజుల పాటు మామిడి పండ్ల ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ మామిడి పండ్ల ఉత్సవంలో దాదాపు 34 రకాల బారతీయ మామిడి పండ్ల రకాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమాన్ని బారతీయ మాంగోస్ ఎగుమతి పెంచేందుకు నిర్వహించారు.
హిమాచల్‌లో అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం 'ఉన్మేష్'
హిమాచల్ ప్రదేశ్‌లో మూడు రోజుల అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం "ఉన్మేష్" ప్రారంభమైంది. సిమ్లాలోని చారిత్రాత్మక గైటీ థియేటర్‌లో సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర కళ మరియు సాంస్కృతిక శాఖ సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు సాహిత్య అకాడమీ ఈ ఉత్సవాన్ని నిర్వహించాయి. ఈ ఉత్సవం దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య ఉత్సవంగా నిలిచింది. ఈ ఉత్సవాలకు 15 దేశాల నుండి 60 కి పైగా భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 425 మంది రచయితలు, కవులు, అనువాదకులు, విమర్శకులు మరియు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఢిల్లీలో జ్యోతిర్గమయ ఉత్సవాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఢిల్లీలో సంగీత కళాకారుల ప్రతిభను ప్రదర్శించే జ్యోతిర్గమయ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, సంగీత నాటక అకాడమీ నిర్వహించిన ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న అరుదైన సంగీత వాయిద్యాకారుల ప్రదర్శనను నిర్వహించారు. దీనిని ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసారు.