తెలుగులో కరెంట్ అఫైర్స్ 01 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 01 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 01 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

Advertisement

ఇండియన్ ఆర్మీ మొదటి మహిళ సుబేదార్‌గా ప్రీతి రజక్‌

ఛాంపియన్ ట్రాప్ షూటర్ అయిన హవల్దార్ ప్రీతి రజక్, భారత సైన్యంలో సుబేదార్ ర్యాంక్‌ను పొందిన మొదటి మహిళగా నిలిచారు. ట్రాప్ షూటింగ్‌లో అత్యద్భుత ప్రదర్శన ఆధారంగా రజక్ డిసెంబర్ 2022లో కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్‌లో చేరారు. షూటింగ్ విభాగంలో ఆర్మీలో హవల్దార్‌గా చేరిన తొలి క్రీడాకారిణిగా ఆమె నాడు నిలిచారు.

ప్రీతి రజక్ చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలు 2022లో ట్రాప్ మహిళల టీమ్ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ అసాధారణ ప్రదర్శన ఆధారంగా ఆమెకు సుబేదార్‌గా మొదటి అవుట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ లభించింది. తద్వారా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) సుబేదార్ స్థాయికి ఎలివేట్ చేయబడింది.

2020లో ఆర్మీ ఇతర ర్యాంకుల్లో మహిళలు చేరేందుకు అనుమతించిన తర్వాత ఒక మహిళా సైనికురాలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. మహిళల ట్రాప్ షూటింగ్‌లో ఆమె ప్రస్తుతం భారతదేశంలో 6వ స్థానంలో ఉంది. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ కోసం మోవ్‌లోని ఎలైట్ ఆర్మీ మార్క్స్‌మన్‌షిప్ యూనిట్‌లో శిక్షణ పొందుతోంది.

ఆమె సాధించిన విజయం భారత సాయుధ దళాలలో లింగ సమానత్వం వైపు ఒక ముఖ్యమైన అడుగు సూచిస్తుంది. మిలిటరీలో చేరాలని ఆకాంక్షించే మహిళలకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. ఆమె అంకితభావం, ప్రతిభ, విజయాలు దేశవ్యాప్తంగా ఉన్న యువతులకు స్ఫూర్తిదాయకం.

ముగ్గురు భారతీయ యువ శాస్త్రవేత్తలకు యూకే బ్లావత్నిక్ అవార్డులు

ముగ్గురు భారతీయ సంతతి పరిశోధకులు ప్రొఫెసర్ రాహుల్ ఆర్ నాయర్ , ప్రొఫెసర్ మెహుల్ మాలిక్ మరియు ప్రొఫెసర్ తన్మయ్ భరత్‌లకు యూకే బ్లావత్నిక్ అవార్డులు అందించబడ్డాయి. వీరితో పాటుగా మరో 9 మంది యూకే యువ పరిశోధకులకు కూడా ఈ అవార్డు అందించబడింది. ఫిబ్రవరి 27న లండన్‌లో జరిగే బ్లాక్-టై గాలా డిన్నర్ మరియు అవార్డు వేడుకలో వీరు ఈ అవార్డు అందుకుంటారు. అవార్డు గ్రహీతకు 480,000 పౌండ్ల గ్రాంట్‌ అందిచబడుతుంది.

1. ప్రొఫెసర్ నాయర్ మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో మెటీరియల్ ఫిజిసిస్ట్‌గా పని చేస్తున్నారు. ఈయన ఫిజికల్ సైన్సెస్ & ఇంజనీరింగ్‌ విభాగంలో ఈ అవార్డు అందుకున్నారు. నొవెల్ మెంబ్రెయిన్ ఆధారిత ఫిల్టర్ టెక్నాలజీ అభివృద్ధిలో పరిశోదనలు నిర్వహిస్తున్నారు.

2. ప్రొఫెసర్ మెహుల్ మాలిక్, హెరియట్-వాట్ విశ్వవిద్యాలయంలో క్వాంటం భౌతిక శాస్త్రవేత్తగా మరియు ఫిజిక్స్ ప్రొఫెసరుగా సేవలు అందిస్తున్నారు. ఈయన విప్లవాత్మక పద్ధతుల ద్వారా క్వాంటం కమ్యూనికేషన్‌లను అభివృద్ధి చేస్తున్నారు.

3. డాక్టర్ తన్మయ్ భరత్, ఎంఆర్‌సి లాబొరేటరీ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ (లైఫ్ సైన్సెస్) యందు పరిశోధకుడిగా ఉన్నారు. స్ట్రక్చరల్ మైక్రోబయాలజిస్ట్ అయిన ఈయన సూక్ష్మజీవుల కణ ఉపరితల అణువుల యొక్క పరమాణు-స్థాయి చిత్రాలను రూపొందించడానికి అత్యాధునిక క్రియో-ఈటీ పద్ధతులను అభివృద్ధి చేశారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యువ శాస్త్రవేత్తల కోసం బ్లావత్నిక్ అవార్డులు అందించబడతాయి. లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ & ఇంజనీరింగ్ మరియు రసాయన శాస్త్రాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన యువ పరిశోధకులకు ఈ అవార్డులు అందిస్తారు.

బ్లావత్నిక్ అవార్డులు ప్రపంచంలోని యువ ప్రారంభ పరిశోధకులకు అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకటిగా పరిగణించబడతాయి. ఈ అవార్డులు 2007లో బ్లావత్నిక్ ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా స్థాపించబడ్డాయి. ఇవి 42 సంవత్సరాల లోపు యువ పరిశోధకులకు మాత్రమే అందించబడతాయి.

మొట్టమొదటి ఖనిజ అన్వేషణ డ్రోన్ అభివృద్ధి చేసిన మారుత్ డ్రోన్స్

డ్రోనెటెక్ స్టార్టప్ మారుత్ డ్రోన్స్ భారతదేశపు మొట్టమొదటి ఖనిజ అన్వేషణ డ్రోన్‌లను నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) లిమిటెడ్‌కు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. అధునాతన సెన్సార్‌లను ఉపయోగించి మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ అత్యాధునిక కస్టమ్ డ్రోన్‌ను మారుత్ డ్రోన్స్ అభివృద్ధి చేసింది.

హైదరాబాద్‌కు చెందిన ఈ డ్రోన్ స్టార్టప్ భారతదేశం యొక్క ప్రారంభ సెట్ కస్టమ్ డ్రోన్‌లను ఉత్పత్తి చేయడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఇది భారతదేశంలో ఖనిజాలను కనుగొనే మరియు వెలికితీసే విధానంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం కల్పిస్తుంది. ఇది భారతదేశంలో మైనింగ్ మరియు అన్వేషణ రంగంలో గణనీయమైన అభివృద్ధిగా భావించవచ్చు.

మారుత్ ఈ డ్రోన్‌లు మాగ్నెటోమీటర్‌లు, హైపర్‌స్పెక్ట్రల్ సెన్సార్‌లు మరియు లిడార్ (లైట్ డిటెక్షన్ మరియు రేంజింగ్) సిస్టమ్‌లతో సహా అధునాతన సెన్సార్‌లతో కస్టమైజ్ చేసింది. ఇవి భూమి యొక్క ఉపరితలం యొక్క కూర్పు గురించి వివరణాత్మక డేటాను సేకరించడానికి వీలు కల్పిస్తాయి. ప్రస్తుతం ఇటివంటి రెండు కస్టమైజ్ చేసిన ఆక్టాకాప్టర్ డ్రోన్‌లను ఎన్ఎండీసీకి అందజేసింది. వీటిని ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో ఇనుప ఖనిజాన్ని అన్వేషించడానికి ఉపయోగించనున్నారు. ఇది భారతదేశంలోని అత్యంత ధనిక ఇనుప ఖనిజ నిక్షేపాలలో ఒకటి.

మారుత్ డ్రోన్స్ అనేది హైదరాబాద్‌కు చెందిన ఎండ్ టు ఎండ్ డ్రోన్ సొల్యూషన్‌లను రూపొందించే ఒక డ్రోన్ స్టార్టప్. ఈ డ్రోన్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీని తెలంగాణకు చెందిన ప్రేమ్ కుమార్ విస్లావత్, సాయి కుమార్ మరియు సూరజ్ పెద్దిలు 28 మార్చి 2019లో స్థాపించారు. ఈ ముగ్గురు ప్రస్తుతం ఈ సంస్థ యొక్క వివిధ విభాగాలకు సీఈఓ లుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం మరియు సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ కోసం లాజిస్టిక్స్‌ డ్రోన్ సొల్యూషన్‌ అందిస్తుంది.

భారత్-యూఏఈ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందానికి కేంద్రం ఆమోదం

భారత్ మరియు యూఏఈ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ఇరుదేశాల పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రత్యేకించి పెద్ద పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు, ఫలితంగా విదేశీ పెట్టుబడులు మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అలానే ఈ ఒప్పందం ఉపాధి కల్పనపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని కూడా భావిస్తున్నారు.

ఈ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఇరుదేశాల వాణిజ్య విధానాలను కూడా సులభతరం చేస్తుంది. రెండు దేశాలలో వ్యాపారాల మధ్య మరింత సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది తయారీ, మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలలో పెట్టుబడులను ఆకర్షించగలదు, ఇది ప్రభుత్వం యొక్క ఆత్మనిర్భర్ భారత్ చొరవకు దోహదం చేస్తుంది. భారత్ మరియు యూఏఈలు మే 2022 నుండి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం) కూడా అమలు చేస్తున్నాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అనేది పశ్చిమ ఆసియాలోని ఒక అరబ్ దేశం. ఇది అరేబియా ద్వీపకల్పం యొక్క తూర్పు చివరలో ఉంది. ఇది ఒమన్ మరియు సౌదీ అరేబియాతో భూ సరిహద్దులను, అదే సమయంలో పెర్షియన్ గల్ఫ్‌లో ఖతార్ మరియు ఇరాన్‌లతో సముద్ర సరిహద్దులను కలిగి ఉంది.

  • దేశం : యూఏఈ
  • రాజధాని : అబుదాబి
  • కరెన్సీ : యూఏఈ దిర్హామ్
  • అధికారిక భాష : అరబిక్
  • ప్రధాన మంత్రి : మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్
  • అధ్యక్షుడు : మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్

ఢిల్లీలో ఇండియన్ కోస్ట్ గార్డ్ 48వ రైజింగ్ డే వేడుకలు

ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క 48 వ రైజింగ్ డే వేడుకలు ఫిబ్రవరి 1, 2024న న్యూఢిల్లీలో జరుపుకులున్నారు. 1977లో స్థాపించబడిన ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత సముద్ర భద్రతలో బలీయమైన శక్తిగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో 152 నౌకలు మరియు 78 విమానాలు సేవలు అందిస్తున్నాయి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ వయం రక్షమాః (మేము రక్షిస్తాము) అనే నినాదం కింద ఇప్పటి వరకు 11,554 మంది ప్రాణాలను కాపాడింది. అలానే ఇప్పటి వరకు 15,343 కోట్ల విలువైన అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.

ఇండియన్ కోస్ట్ గార్డ్ డేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన జరుపుకుంటారు. ఇది సముద్ర భద్రత మరియు భారతదేశం యొక్క సముద్ర ప్రయోజనాల పరిరక్షణలో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క సహకారాన్ని గుర్తించే రోజుగా జరుపుకుంటారు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలపై నిషేధం విధించిన ఆర్‌బిఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తాజా డిపాజిట్లను అంగీకరించడంతో పాటు ప్రధాన వ్యాపార పరిమితులను విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో పెద్ద సంఖ్యలో మనీలాండరింగ్ మరియు నో యువర్-కస్టమర్ (కేవైసీ) ఉల్లంఘనలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ నిబంధల ఉల్లంఘన గురించింది కొన్ని నెలల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా హెచ్చరించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తనిఖీలో 35 కోట్ల పేటీఎం వాలెట్లలో 31 కోట్లు పనికిరాకుండా పడిఉండటం, వేల ఖాతాలకు ఒకే పాన్ కార్డ్ లింక్ చేయబడి ఉండటం, లక్షల ఖాతాలకు కేవైసీ లేకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి ఆర్‌బిఐకి సదురు బ్యాంకు సరైన సమాచారం అందివ్వకపోవడంతో ఈ పరిమితులు విధించినట్లు కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 29, 2024 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో, వాలెట్‌లలో మరియు ఫాస్ట్‌ట్యాగ్‌లలో తాజా డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు మరియు ఫండ్ బదిలీలను స్వీకరించకుండా నిషేధం విధించింది. అయితే ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు తమ అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌ని ఉపసంహరణలు, బిల్లు చెల్లింపులు మరియు యూపీఐ లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చు అని తెలిపింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థగా మే 23, 2017న తన బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ కంపెనీలో మెజారిటీ షేర్లలో 51 శాతం విజయ్ శేఖర్ శర్మ చేతిలో ఉన్నాయి, మిగిలిన 49 శాతం వన్ 97 కమ్యూనికేషన్స్ కలిగి ఉంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పొదుపు ఖాతాలు, కరెంట్ ఖాతాలు, భాగస్వామి బ్యాంకులతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు మరియు ఇతర సేవలతో పాటు వాలెట్లలో బ్యాలెన్స్, యూపీఐ మరియు ఫాస్ట్‌ట్యాగ్ సహా పలు డిజిటల్ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తుంది. చెల్లింపు బ్యాంకుల నిబంధనల ప్రకారం, ఇవి ఎటువంటి డబ్బును రుణంగా ఖాతాదారులకు ఇవ్వలేవు, అలానే రూ. 2,00,000 వరకు మాత్రమే ఖాతాదారుల నుండి డిపాజిట్లను స్వీకరించగలవు.

ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలన కోసం 5 దేశాలను గౌరవించిన డబ్ల్యుహెచ్ఓ

ట్రాన్స్ ఫ్యాట్ ఎలిమినేషన్‌లో ముందున్న 5 దేశాలకు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అవార్డులతో గౌరవించింది. పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్ ఫ్యాట్‌లను తొలగించడంలో పురోగతి సాధించిన దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడం ఇదే మొదటిసారి. డెన్మార్క్, లిథువేనియా, పోలాండ్, సౌదీ అరేబియా మరియు థాయ్‌లాండ్ దేశాలకు ట్రాన్స్ ఫ్యాటీ-యాసిడ్‌లను తొలగించడంలో పురోగతిని ధృవీకరించే మొట్టమొదటి ఐటిఎఫ్ఎ ఎలిమినేషన్ సర్టిఫికేట్‌లను జనవరి 29న అందజేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో 2023 నాటికి ప్రపంచ ఆహార సరఫరా నుండి ట్రాన్స్ ఫ్యాట్‌లను పూర్తిగా తొలగించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినప్పటికీ, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ ఈ లక్ష్యం దిశగా అద్భుతమైన పురోగతి ఉన్నట్లు వెల్లడించింది.

2023లో ఈజిప్ట్, మెక్సికో, మోల్డోవా, నైజీరియా, నార్త్ మాసిడోనియా, ఫిలిప్పీన్స్ మరియు ఉక్రెయిన్ వంటి 7 కొత్త దేశాలు ఈ విధానాలను అమలులోకి తెచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 53 దేశాలు ఈ విధానాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఆహారాలలో ఉండే ఒకరకమైన అసంతృప్త కొవ్వు రకం. ట్రాన్స్ ఫ్యాట్ వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు, కానీ వీటి వలన మానవ ఆరోగ్యానికి భారీ ప్రమాదాలు కలుగుతాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి, కొన్ని క్యాన్సర్‌లను కూడా కల్గిస్తాయి. రుమినెంట్ జంతువుల ఆహార ఉత్పత్తులలో (ఉదా : పాలు, వెన్న, చీజ్, మాంసం ఉత్పత్తులు) సహజంగా ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఉత్పన్నం అవుతుంది.

ఐఎస్ఎస్ఎఫ్ 2024లో రిథమ్ సాంగ్వాన్ & ఉజ్వల్ మాలిక్‌లకు స్వర్ణం

భారత జంట రిథమ్ సాంగ్వాన్ మరియు ఉజ్వల్ మాలిక్ కైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ 2024లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని అందించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో వారు 17-7తో ఆర్మేనియన్ జోడీ ఎల్మిరా కరాపెట్యాన్, బెనిక్ ఖల్ఘట్యాన్‌లను ఓడించారు.

అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అర్జున్ బాబుటా, సోనమ్ ఉత్తమ్ మస్కర్ రజతం సాధించారు. వారు ఫైనల్‌లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన సియోనైడ్ మెకింతోష్ మరియు డీన్ బేల్ చేతిలో 16-14 తేడాతో ఓడిపోయారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024

జనవరి 19 నుండి 31 వరకు చెన్నై వేదికగా జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 విజయవంతంగా ముగిసాయి. తమిళనాడులోని చెన్నై, మదురై, తిరుచ్చి మరియు కోయంబత్తూర్ వంటి నాలుగు నగరాల్లో నిర్వహించిన ఈ క్రీడలలో దేశం నలుమూలల నుండి 5,600 మంది అథ్లెట్లు పోటీ పడ్డారు.

ఈ ఏడాది కూడా మహారాష్ట్ర ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టైటిల్‌ను కాపాడుకుంది. మహారాష్ట్ర 57 స్వర్ణాలు, 48 రజతాలు, 53 కాంస్యాలతో పతకాల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఆరు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈవెంటులలో మహారాష్ట్ర నాలుగు సార్లు అగ్రస్థానంలో నిలిచి 4 టైటిల్స్ దక్కించుకుంది.

ఇక ఆతిథ్య రాష్ట్రమైన తమిళనాడు 38 స్వర్ణాలు, 21 రజతాలు, 39 కాంస్యాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇది వరకు రెండు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టైటిళ్లను గెలుచుకున్న హర్యానా 35 స్వర్ణాలు, 22 రజతాలు మరియు 46 కాంస్య పతకాలతో మూడో స్థానంలో నిలిచింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ 13 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్యాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో పతకాల పట్టికలో 13వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఆసియా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యందు ఐదు వ్యక్తిగత బంగారు పతకాలను గెలుచుకుంది. 17 ఏళ్ల ఈ స్విమ్మర్ మహిళల 200మీ (బటర్‌ఫ్లై మరియు ఫ్రీస్టైల్‌ ), 800మీ, 400మీ మరియు 1500మీలో విజేతగా నిలిచింది.

ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యందు భారతదేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రాతినిధ్యం వహించాయి. ఆతిథ్య తమిళనాడు నుండి 559 మంది అథ్లెట్ల అతిపెద్ద బృందం ఇందులో పాల్గొంది, డిఫెండింగ్ ఛాంపియన్ మహారాష్ట్ర నుండి 415 మంది, రెండుసార్లు ఛాంపియన్‌గా ఉన్న హర్యానా నుండి 491 మంది అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొన్నారు.

రాష్ట్రం గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మొత్తం
1 మహారాష్ట్ర 57 48 53 158
2 తమిళనాడు 38 21 9 98
3 హర్యానా 35 22 46 103
4 ఢిల్లీ 13 18 25 56
5 రాజస్థాన్ 13 17 17 47
6 తెలంగాణ 13 4 7 24
7 ఉత్తర ప్రదేశ్ 11 13 18 42
8 పంజాబ్ 11 13 15 39
9 కేరళ 11 9 15 35
10 మణిపూర్ 10 11 10 31
13 ఆంధ్రప్రదేశ్ 7 9 11 27

Advertisement

Post Comment