డైలీ కరెంటు అఫైర్స్ తెలుగులో ఉచితంగా పొందండి. అన్ని రకాల పోటీపరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ & టెక్నాలజీ, బిజినెస్ & ఎకానమీ, అవార్డులు, దినోత్సవాలు, క్రీడా ముఖ్యాంశాలు ఇలా వివిధ కేటగిరిల వారీగా తాజా కరెంటు అఫైర్స్ పొందండి.
-
నేషనల్ అఫైర్స్ జులై 2022
-
ఇంటర్నేషనల్ అఫైర్స్ జులై 2022
-
వార్తల్లో వ్యక్తులు జులై 2022
-
ప్రభుత్వ పథకాలు & పాలసీలు
-
బిజినెస్ & ఎకానమీ అఫైర్స్ జులై 2022
-
డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్ జులై 2022
-
రిపోర్టులు & ర్యాంకులు జులై 2022
-
అవార్డులు & గౌరవాలు జులై 2022
-
స్పోర్ట్స్ అఫైర్స్ జులై 2022
-
జులై నెలలో ముఖ్యమైన రోజులు
-
డౌన్లోడ్ కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్
నేషనల్ అఫైర్స్ జులై 2022
జులై 1 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
1 జూలై 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయం మరియు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. రీసైకిల్ చేసేందుకు వీలుకాని ప్లాస్టిక్ పర్యావరణ వ్యవస్థను నాసినం చేయడంతో పాటుగా నేల నీటి నిల్వ సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. అలానే వినాశకరమైన వరదల సమయంలో డ్రైనేజీ వ్యవస్థలను అడ్డుకోవడంలో పాటుగా మానవ ఆరోగ్యానికి హానికలిగిస్తుంది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఇప్పటికే పలు దేశాలు నిషేధిస్తూ వస్తున్నాయి. ఈ జాబితాలో బంగ్లాదేశ్ 2022 నుండి ప్రపంచంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని అమలు చేసిన మొదటి దేశంగా ఉంది.
అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి
ప్రముఖ తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలను ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో నిర్వహించిన ఈ జయంతి వేడుకలలో 30 అడుగుల ఎత్తైన అల్లూరి సీతారామ రాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా ప్రధాని మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు భారతదేశ సంస్కృతి, గిరిజనుల గుర్తింపు, పరాక్రమం, ఆదర్శాలు మరియు విలువలకు ప్రతీక పేర్కొన్నారు. సీతారామరాజు గారి పుట్టినప్పటి నుండి ఆయన ప్రాణ త్యాగం వరకు, ఆయన జీవిత ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, స్వాతంత్ర్య సమరయోధుల సేవలకు తగిన గుర్తింపును అందించడానికి మరియు దేశవ్యాప్తంగా ప్రజలకు వారి గురించి అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహిస్తుంది.
ఒడిశా అడవికి మహిళా అటవీ సంరక్షకురాలి పేరు
ఒడిశాలోని బోనై ఫారెస్ట్ డివిజన్‌లోని అటవీ అధికారులు ఒక చిన్న అడవి పాచ్‌కు దాని సంరక్షకురాలు సరోజినీ మొహంతా పేరును నామకరణం చేసారు. సరోజిని వన అని పేరు పెట్టిన ఈ నిరాదరణకు గురైన అటవీ ప్రాంతాన్ని, 42 ఏళ్ళ రోజువారీ కూలీ సరోజినీ మొహంతా కేవలం రెండేళ్లలో దానిని అడవిగా తీర్చిదిద్దింది. ఆ చిన్న తోటల ప్రాంతాన్ని కాపాడుకోవడంలో ఆమె చేసిన అంకితభావానికి గౌరవార్దంగా, అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని ఆమె పేరున నామకరణం చేసారు.
భారతదేశపు తొలి అటానమస్ నావిగేషన్ టిహాన్ ప్రారంభం
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ భారతదేశం యొక్క మొట్టమొదటి అటానమస్ (స్వయంప్రతిపత్తి) నావిగేషన్ సదుపాయం TiHAN (టిహాన్) ను ఐఐటీ హైదరాబాదులో ప్రారంభించారు. TiHAN అనగా టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ అని అర్ధం.
టిహాన్ ప్రారంభం భారతదేశాన్ని భవిష్యత్ మరియు తదుపరి తరం 'స్మార్ట్ మొబిలిటీ' సాంకేతికతలో గ్లోబల్ ప్లేయర్‌గా నిలిపే మొదటి అడుగుగా ఆయన పేర్కొన్నారు. ఇది మానవరహిత వాహనాల నియంత్రణ టెక్నాలజీలు, ఇతర సంబంధిత సాంకేతికలను అభివృద్ధి చేసేందుకు పని చేయనుంది.
స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియాలకు అదనపు బాధ్యతలు
కేంద్ర కేబినెట్ మంత్రులు స్మృతి ఇరానీ మరియు జ్యోతిరాదిత్య సింధియాలకు మైనారిటీ వ్యవహారాలు మరియు ఉక్కు మంత్రిత్వ శాఖల అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇది వరకు ఈ శాఖల బాధ్యతలు నిర్వహించిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, రామ్ చంద్రప్రసాద్ సింగులు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలు స్మృతి ఇరానీ మరియు జ్యోతిరాదిత్య సింధియాలు స్వీకరించారు.
స్మాల్-సిటీ స్టార్టప్‌ల కోసం గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇండియా ప్రారంభం
చిన్న నగరాల్లో 10,000 స్టార్టప్‌లకు సహాయం చేయడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి స్టార్టప్ స్కూల్ ఇండియా (SSI) ను గూగుల్ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 70 మెట్రోయేతర భారతీయ నగరాల్లో 10,000 మంది యువ స్టార్టప్ వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ శిక్షణ కార్యక్రమం 06 జులై 2022 నుండి 15 సెప్టెంబర్ 2022 వరకు నిర్వహించనున్నారు.
'స్వానిధి మహోత్సవ్' ప్రారంభించిన హర్దీప్ సింగ్
గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి, 07 జులై 2022న ' స్వానిధి మహోత్సవ్'ను ప్రారంభించారు. వీధి వ్యాపారులకు సహాయం చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించే పీఎం స్వనిధి పథకం విజయాన్ని పురస్కరించుకుని ఈ సాంస్కృతిక ఉత్సవంను నిర్వహిస్తున్నారు. ఈ పథకాన్ని 07 జులై 2022న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఇండియా ఫస్ట్ యానిమల్ హెల్త్ సమ్మిట్ 2022 ప్రారంభం
కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి పర్షోత్తమ్ రూపాలా భారతదేశపు మొట్టమొదటి జంతు ఆరోగ్య సదస్సు 2022ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ICFA) మరియు అగ్రికల్చర్ టుడే గ్రూపు ఏర్పాటు చేశాయి. జంతు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగా దీనిని నిర్వహించారు.
త్రిపురలో వారం రోజుల ఖర్చీ ఫెస్టివల్ ప్రారంభం
ఖర్చి పూజ త్రిపురలో అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి. ఇది జూలై నెలలో అమావాస్య యొక్క ఎనిమిదవ రోజున వస్తుంది. 14 మంది దేవుళ్లకు మరియు దేవతలకు ప్రార్థనలు చేస్తూ, వారం రోజుల పాటు జరిగే సాంప్రదాయ ఖర్చీ పండుగ, వేలాది మంది భక్తులు ఖయేర్‌పూర్‌లో తరలిరావడంతో ప్రారంభమైంది. ఇది అగర్తలాలో చతుర్దశ ఆలయంలో జరుపుకుంటారు. ఖర్చి పూజ సమయంలో, చతుర్దశ దేవతను బయటకు తీసి, పవిత్ర జలంలో స్నానం చేసి, ఆలయంలో తిరిగి ప్రతిష్టిస్తారు.
జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 12 జులై 2022 జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. 657 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 400 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ విమానాశ్రయం త్వరలో పౌర సేవలు అందించనుంది. డియోఘర్ విమానాశ్రయాన్ని బాబా బైద్యనాథ్ విమానాశ్రయంగా కూడా పిలుస్తారు. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో నిర్మించిన రెండవ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారింది.
గుజరాత్‌లో గతి శక్తి యూనివర్సిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం
గుజరాత్‌లోని జాతీయ రోడ్డు రవాణా సంస్థకు చెందిన నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇనిస్టిట్యూట్ (NRTI) ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేసి, దానిని గతి శక్తి విశ్వవిద్యాలయంగా మార్చనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్‌గా ముస్తాఫిజుర్ రెహ్మాన్
బంగ్లాదేశ్ ప్రభుత్వం ముస్తాఫిజుర్ రెహమాన్‌ను భారతదేశానికి బంగ్లాదేశ్ తదుపరి హైకమిషనర్‌గా నియమించింది. ముస్తాఫిజుర్ రెహమాన్ ప్రస్తుతం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయాలకు బంగ్లాదేశ్ శాశ్వత ప్రతినిధిగా మరియు స్విట్జర్లాండ్‌లో రాయబారిగా పనిచేస్తున్నారు.
భూటాన్‌కు తదుపరి రాయబారిగా సుధాకర్ దలేలా
సుధాకర్ దలేలా భూటాన్ రాయల్ కింగ్‌డమ్‌కు భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. 1993 ఐఎఫ్ఎస్ బ్యాచుకు చెందిన సుధాకర్ దలేలా ప్రస్తుతం వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్'గా విధులు నిర్వహిస్తున్నారు.
కేరళలో భారతదేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు
భారతదేశం యొక్క మొట్టమొదటి మంకీపాక్స్ కేసును కేరళ నివేదించింది. ఇటీవలే యూఏఈ నుంచి తిరిగి వచ్చిన 35 ఏళ్ళ వ్యక్తిలో మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలిందని కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. మంకీపాక్స్ అనేది మంకీపాక్స్ వైరస్ వల్ల వచ్చే అరుదైన వ్యాధి. మంకీపాక్స్ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. ఈ వ్యాధి లక్షణాలు మశూచి వ్యాధిని పోలివుంటాయి.
ఏస్సీఓ సాంస్కృతిక మరియు పర్యాటక రాజధానిగా వారణాసి
పవిత్ర నగరమైన వారణాసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క మొదటి ' సాంస్కృతిక మరియు పర్యాటక రాజధాని'గా ప్రకటించబడింది. బీజింగ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ ఆర్గనైజేషన్ అనేది చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా మరియు పాకిస్తాన్‌లతో కూడిన ఆర్థిక మరియు భద్రతా కూటమి. ఈ ఏడాది కొత్తగా ఇరాన్ దీని యందు చేరింది.
ఇది సభ్యదేశాల మధ్య ప్రజల పరిచయాలు మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడింది. దీనిని 1996 లో స్థాపించారు. దీనికి సంబంధించి 2022-23 ఏడాదికి గాను పవిత్ర నగరమైన వారణాసి, సాంస్కృతిక మరియు పర్యాటక రాజధాని'గా ఉండనుంది.
బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్ 296 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు ₹14,850 కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ రోడ్డు ఉత్తరప్రదేశ్ యందు 7 జిల్లాలను కవర్ చేయనుంది.
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేసారు. దీనితో భారత రెండవ మహిళా అధ్యక్షరాలుగా ఆమె నిలిచారు. అలానే ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడిన షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందిన మొదటి వ్యక్తి. ఈమె జూన్ 20, 1958లో ఒడిశాలోని రాయరంగ్‌పూర్‌లోని బైదాపోసి ప్రాంతంలో సంతాలీ కుటుంబంలో జన్మించారు.
ద్రౌపది ముర్ము భారతీయ జనతాపార్టీ తరుపున శాసన సభ్యురాలుగా పనిచేసారు. అలానే 2015 లో ఆమె జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసారు. ఇటీవలే జరిగిన అధ్యక్ష ఎన్నికలలో బీజేపీ మద్దతుతో పోటీచేసిన ఆమె, 64.03 ఓటింగ్ శాతంతో ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించి ప్రతిభా పాటిల్ తర్వాత భారత రెండవ మహిళా అధ్యక్షరాలుగా బాధ్యతలు స్వీకరించారు.
యేటా జులై 22వ తేదీన ఇండియా ఫ్లాగ్ అడాప్షన్ డే
యేటా జులై 22 వ తేదీని జాతీయ జెండా స్వీకరణ దినోత్సవంగా జరుపుకోనున్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన భారత జాతీయ పతాకం 1947 జూలై 22 న జరిగిన భారత మొదటి రాజ్యాంగ సభ సమావేశంలో ఆమోదించింది. ఆ రోజుకు గుర్తుగా యేటా ఆ తేదీని జాతీయ జెండా స్వీకరణ దినోత్సవంగా జరుపుకోనున్నారు.
ఇంటర్నేషనల్ అఫైర్స్ జులై 2022
ఇజ్రాయెల్ 14వ ప్రధానమంత్రిగా యాయిర్ లాపిడ్
ఇజ్రాయెల్ 14వ ప్రధానమంత్రిగా యాయిర్ లాపిడ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇజ్రాయెల్ యందు త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అంత వరకు యాయిర్ లాపిడ్ ఆ దేశ ప్రధానిగా పని చేయనున్నారు
యూఎస్ సుప్రీంకోర్టు తోలి నల్లజాతీయ జడ్జిగా కేతంజీ జాక్సన్
యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్‌లో మొదటి నల్లజాతి మహిళా జడ్జిగా కేతంజీ బ్రౌన్ జాక్సన్ ప్రమాణస్వీకారం చేసారు. ప్రస్తుతం యూఎస్ సుప్రీం కోర్టులో ఉన్న 115 న్యాయమూర్తిలలో ఆరుగురు మహిళా న్యాయమూర్తిలు ఉండగా అందులో కేతంజీ జాక్సన్ ఒకరు.
యూకే ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా
యూకే ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించారు. రాజకీయ కారణాలతో తన ప్రభుత్వంలో ఉన్న 40 మందికి పైగా మంత్రులు ఒక్కొక్కరుగా వైదొలగడంతో బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రెక్సిట్ ప్రక్రియలో కీలక భూమిక పోషించిన బోరిస్ జాన్సన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులరిటీ సంపాదించుకున్నారు. ఇటీవలే బోరిస్ జాన్సన్ ఇండియాను సందర్శించిన మొదటి బ్రిటిష్ ప్రధానమంత్రిగా గుర్తింపు పొందాడు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, 08 జులై 2022 న రాజకీయ ప్రచార కార్యక్రమంలో ఉండగా కాల్పులకు గురయ్యి ఆసుపత్రిలో మరణించారు. ఆధునిక జపాన్‌లో 6 డిసెంబర్ 2012 నుండి 16 సెప్టెంబర్ 2020 వరకు సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా షింజో అబే గుర్తింపు పొందారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే విజయం
శ్రీలంక పార్లమెంట్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే 134 ఓట్లతో విజయం సాధించారు. దీనితో రాణిల్ విక్రమసింఘే శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీలంకలో చోటు చేసుకున్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రధాని మహేంద్ర రాజపక్స, అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశ బహిస్కరణకు గురయ్యారు.
శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్ గుణవర్దన ప్రమాణ స్వీకారం
శ్రీలంక కొత్త ప్రధానిగ మంత్రిగా దినేష్ గుణవర్దన 22 జులై 2022 న ప్రమాణ స్వీకారం చేశారు. రాణిల్ విక్రమసింఘే శ్రీలంక అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దినేష్ గుణవర్దన చేత ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇటాలియన్ ప్రధానమంత్రి మారియో డ్రాఘి రాజీనామా
ఇటాలియన్ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి తన మద్దతును ప్రజా కూటమి భాగస్వామి ఫైవ్ స్టార్ ఉపసంహరించుకోవడంతో తన పదవికి రాజీనామా సమర్పించారు. దీనితో ఇటలీలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలలో ముందోస్తూ ఎన్నికలు నిర్వహించనున్నారు.
గ్లోబల్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యొక్క అత్యవసర కమిటీ మంకీపాక్స్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ వ్యాధికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాలలో 16 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 5 మంది మరణించారు.
కువైట్ కొత్త ప్రధానమంత్రిగా షేక్ అహ్మద్ నవాఫ్
కువైట్ కొత్త ప్రధానమంత్రిగా షేక్ అహ్మద్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాహ్ ఎన్నికయ్యారు. మే 2022లో రాజీనామా చేసిన సబా అల్-ఖలేద్ అల్-హమద్ అల్-సబా తర్వాత కొత్త ప్రధానమంత్రి, అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్ - సబా నియమితులయ్యారు.
వార్తల్లో వ్యక్తులు జులై 2022
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ప్రమాణస్వీకారం చేయించారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పవడంతో, శివసేన తిరుబాటు ఏమ్మెల్యేలతో కలిసి బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 విజేతగా సినీ శెట్టి
ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీ 58వ ఎడిషన్‌లో కర్ణాటకకు చెందిన సినీ శెట్టి మిస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటాన్ని గెలుచుకుంది. ఈ వేడుక 03 జులై 2022న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ యందు నిర్వహించారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో 31 మంది పోటీపడగా సినీ శెట్టి విజేతగా నిలిచింది. అలానే ఫెమినా మిస్ ఇండియా 2022 మొదటి రన్నరప్‌గా రూబల్ షెకావత్, రెండవ రన్నరప్‌గా షినతా చౌహాన్ నిలిచారు.
పీటీ ఉషతో సహా మరో ముగ్గురు రాజ్యసభకు ఎంపిక
లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష, సంగీత విద్వాంసుడు ఇళయరాజా, ప్రముఖ పరోపకారి మరియు ధర్మస్థల ఆలయ నిర్వాహకుడు వీరేంద్ర హెగ్గడే మరియు ప్రముఖ తెలుగు స్క్రీన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్'లు రాష్ట్రపతి కోటాలో పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ అయ్యారు.
భారత రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్ (ఆర్టికల్స్ 4(1) మరియు 80(2)) ప్రకారం కళలు, సాహిత్యం, శాస్త్రాలు మరియు సామాజిక సేవలకు గానూ పన్నెండు మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 ఏళ్ళు ఉంటుంది.
జైసల్మేర్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి టీనా దాబీ
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్‌గా, పాపులర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి టీనా దాబీ బాధ్యతలు స్వీకరించారు. టీనా దాబీ 2015 యూపీఎస్సీ పరీక్షలో తోలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంక్ సాధించి వార్తలకు కెక్కింది. అప్పటికి ఆమె వయస్సు 22 ఏళ్ళు. యూపీఎస్సీ సివిల్స్ చరిత్రలో టాప్ ర్యాంకు సాధించించిన మొదటి దళిత మహిళాగా ఆమె గుర్తింపు పొందింది.
ఫోర్బ్స్ అమెరికా జాబితాలో భారతీయ-అమెరికన్ బిలియనీర్
ఫోర్బ్స్ 2021 ' అమెరికా యొక్క అత్యంత ధనవంతుల స్వీయ - నిర్మిత (సెల్ఫ్ మేడ్) మహిళల జాబితాలో భారతీయ- అమెరికన్ బిలియనీర్ జయశ్రీ ఉల్లాల్ చోటు సంపాధించారు. అరిస్టా నెట్‌వర్క్ ప్రెసిడెంట్ & సీఈఓ జయశ్రీ ఉల్లాల్, అమెరికా ధనవంతుల జాబితాలో ఉన్న ఐదుగురు భారతీయ-అమెరికన్‌లలో ఒకరుగా నిలిచారు. $1.9 బిలియన్ల నికర విలువతో ఆమె జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు.
డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌గా ఆర్కే గుప్తా
సెంట్రల్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ ఆర్‌కె గుప్తా నియమితులైనట్లు పర్సనల్ మినిస్ట్రీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం హోదాలో ఉన్న టీ శ్రీకాంత్ స్థానంలో ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
'ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నెట్' బికె సింగల్ కన్నుమూశారు
విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (VSNL) మాజీ ఛైర్మన్ బ్రిజేంద్ర కె సింగల్, సుదీర్ఘ అనారోగ్యంతో 82 ఏళ్ళ వయస్సులో 09 జులై 2022 న తుదిశ్వాస విడిచారు. భారతీయ ఇంటర్నెట్ వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందిన సింగల్, 1991 లో విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ స్థాపించి, ఇండియా ఇంటర్నెట్ తరానికి బీజం పోశారు. సింగల్ భారతీయ టెలికమ్యూనికేషన్ రంగంలో అగ్రగామి వ్యాపార వేత్తగా మరియు 'ఇంటర్నెట్ & డేటా సేవల పితామహుడిగా గుర్తింపు పొందారు.
గుజరాత్ చెందిన వ్యక్తిలో ప్రత్యేకమైన బ్లడ్ గ్రూప్
భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్‌లో గుండె జబ్బుతో బాధపడుతున్న 65 ఏళ్ల వ్యక్తికి అరుదైన రక్తం రకం EMM నెగటివ్ ఉన్నట్లు కనుగొనబడింది. ఈ రకానికి చెందిన బ్లడ్ గ్రూపు ప్రపంచ వ్యాప్తంగా 10 మంది ఉండగా, భారత్ యందు ఇది మొదటిది. సాధారణంగా మానవ శరీరంలో O, A, B, AB రకానికి చెందిన రక్త వర్గాలు ఉంటాయి. అరుదైన రక్త గ్రూపుల జాబితాలో HH బ్లడ్ గ్రూప్, Rh జీరో మరియు AB నెగిటివ్ గ్రూపులు గుర్తించబడ్డాయి.
మణిపూర్ గవర్నర్ లా గణేశన్‌కు అదనపు బాధ్యతలు
బెంగాల్ మాజీ గవర్నర్ జగ్‌దీప్ ధంఖర్ రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించడంతో పశ్చిమ బెంగాల్ అదనపు బాధ్యతలను మణిపూర్ గవర్నర్ లా గణేశన్‌కు అప్పగించారు. జగ్‌దీప్ ధంఖర్ ప్రస్తుతం అధికార పార్టీ మద్దతుతో భారత ఉపరాష్ట్ర ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
కేవిఐసీ కొత్త ఛైర్మన్‌గా మనోజ్ కుమార్
ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నూతన చైర్మన్‌గా మనోజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ అనేది 1957లో భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది ప్రధానంగా ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల అభివృద్ధికి మరియు గ్రామీణ నిరుద్యోగతను తగ్గించేందుకు పని చేస్తుంది.
K2 అధిరోహించిన మొదటి బంగ్లాదేశీగా వసీఫా నజ్రీన్
ప్రపంచంలోని రెండవ ఎత్తైన పర్వతం అయిన పాకిస్తాన్ యొక్క K2 శిఖరాన్ని అధిరోహించిన మొదటి బంగ్లాదేశీగా వసీఫా నజ్రీన్ రికార్డుకెక్కారు. వసీఫా నజ్రీన్ ఇది వరకు 2012 లో ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా అధిరోహించారు. అలానే ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన రెండవ బంగ్లాదేశీ మహిళగా నిలిచారు.
K2 పర్వతం ఉత్తర పాకిస్తాన్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో కారకోరం శ్రేణిలో ఉంది. 8611 మీటర్లు లేదా 28,251 అడుగుల ఎత్తుతో ఎవరెస్ట్ పర్వతం తర్వాత ప్రపంచ రెండవ ఎత్తైన పర్వతంగా ఉంది.
భారతదేశపు అత్యంత ధనిక మహిళగా రోష్ణి నాడార్
హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ₹84,330 కోట్ల సంపదతో భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈ జాబితాలో ఫల్గుణి నాయర్ (నైకా) కిరణ్ మజుందార్-షా (బయోకాన్) తర్వాత 2, 3వ స్థానాలలో ఉన్నారు.
బంగ్లాదేశ్ తదుపరి హైకమిషనర్‌గా ప్రణయ్ కుమార్ వర్మ
1994 బ్యాచ్‌కు చెందిన దౌత్యవేత్త మరియు ఐఎఫ్ఎస్ అధికారి ప్రణయ్ కుమార్ వర్మ బంగ్లాదేశ్‌లో భారతదేశ తదుపరి హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రణయ్ కుమార్ వర్మ ప్రస్తుతం సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంలో భారత రాయబారిగా పని చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు & పాలసీలు జులై 2022
డిజిటల్ ఇండియా వీక్ 2022ను ప్రారంభించిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా వీక్ 2022ను జులై 4న గాంధీనగర్‌లో ప్రారంభించారు. ఈ సంధర్బంగా ప్రభుత్వ పథకాల ప్రాప్యతను సులభతరం చేసే 'మై స్కీమ్' వేదికను పౌరులకు అంకితం చేస్తారు. ఇది ప్రభుత్వ పథకాలకు సంబంధించి వన్-స్టాప్ సెర్చ్ మరియు డిస్కవరీ పోర్టలుగా సేవలు అందించనుంది.
ఇదే వేదికలో భారతీయ భాషలలో ఇంటర్నెట్ మరియు డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేయగలిగే 'డిజిటల్ ఇండియా భాషిణి'ని కూడా ప్రారంభించారు. అలానే భారతదేశంలోని టైర్-II మరియు టైర్-III నగరాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు మరియు మద్దతూ పలికేందుకు జాతీయ డీప్-టెక్ స్టార్టప్ ప్లాట్‌ఫారమ్ అయిన 'డిజిటల్ ఇండియా జెనెసిస్' (ఇన్నోవేటివ్ స్టార్టప్‌లకు జెన్-నెక్స్ట్ సపోర్ట్)ను కూడా ప్రధాని ప్రారంభించారు.
డిజిటల్ ఇండియా వీక్ అనేది ప్రజలకు ఉపయోగపడే సులభతరమైన డిజిటల్ ఉత్పత్తులు రూపొందించే స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించే కార్యక్రమం. డిజిటల్ ఇండియా వీక్, ఈ ఏడాది 'క్యాటలైజింగ్ న్యూ ఇండియాస్ టెకాడే' థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు జులై 4 నుండి జులై 6 మధ్య జరుగనున్నాయి.
సీబీఎస్ఈ 'పరీక్ష సంగం ' పోర్టల్ ప్రారంభం
బోర్డు పరీక్ష ఫలితాలు, నమూనా పత్రాలు మరియు ఇతర వివరాలను క్రమబద్ధీకరించడానికి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 'పరీక్ష సంగం' పేరుతో నూతన పోర్టల్‌ను ప్రారంభించింది.
'నారీ కో నమన్' పథకాన్ని ప్రారంభించిన హిమాచల్ సీఎం
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, ఆ రాష్ట్ర మహిళల కోసం ' నారీ కో నమన్ ' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC) పరిధిలోని బస్సులలో మహిళకు టికెట్టు ఛార్జిలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు.
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణ
కేంద్ర ప్రభుత్వం, 2010 ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) ను కొత్త నిబంధనలతో సవరించనుంది. ఎఫ్‌సిఆర్‌ఎ అనేది వ్యక్తులు లేదా ఛారిటబుల్ ట్రస్ట్‌లు, సొసైటీలు విదేశీ మూలాల నుండి విదేశీ సహకారం లేదా విరాళాన్ని స్వీకరించేందుకు సంబంధించింది. ఎఫ్‌సిఆర్‌ఎ 2010, సెక్షన్ 11 ప్రకారం అటువంటి వ్యక్తి/సంస్థ సంబంధిత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతిని పొంది ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సవరించిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) నిబంధనల ప్రకారం ఎటువంటి అనుమతి లేకుండా బంధువులు, తెలిసిన వారి నుండి 10 లక్షల వరకు విదేశీ సహాయానికి అవకాశం కల్పిస్తుంది. అదే విధంగా అంతకు మించి సహకారం పొందిన వారికి, ప్రభుత్వ అనుమతి పొందేందుకు మూడు నెలల గడువు కల్పస్తుంది.
అదే సమయంలో విదేశీ నిధులను స్వీకరించే సంస్థ/వ్యక్తి ప్రతి త్రైమాసికంలో తన అధికారిక వెబ్‌సైట్‌లో అటువంటి విరాళాలను ప్రకటించాలనే నిబంధనను కూడా ప్రభుత్వం తొలగించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంది.
అఖిల భారతీయ శిక్షా సమాగాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
జాతీయ విద్యా విధానం 2022 అమలుపై అఖిల భారతీయ శిక్షా సమాగాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జులై 7న వారణాసిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మొదలగు వారు పాల్గున్నారు.
ఈ కార్యక్రమాన్ని జూలై 7 నుండి 9 వరకు నిర్వహిస్తోంది. ఈ వేదికలో ప్రముఖ విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు మరియు విద్యావేత్తల నాయకులకు తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇదే సమయంలో జాతీయ విద్యా విధానం (NEP) 2020 యొక్క సమర్థవంతమైన అమలు కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించనున్నారు.
ఢిల్లీ భవన నిర్మాణ కార్మికుల కోసం 'మిషన్ కుశాల్ కర్మి'
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, భవన నిర్మాణ కార్మికులు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడంలో సహాయపడేందుకు కొత్తగా 'మిషన్ కుశాల్ కార్మి' కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారాసంబంధిత పరిశ్రమలో నమోదైన 2 లక్షల మంది నిర్మాణ కార్మికులకు ఉద్యోగ నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించి, వారికీ ఉపాధి కల్పించే ఆలోచనలు చేస్తున్నారు.
రూర్బన్ మిషన్ డెల్టా రేటింగ్‌లో జార్ఖండ్ మొదటి స్థానం
నీతి ఆయోగ్ విడుదల చేసిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (SPMRM) డెల్టా ర్యాంకింగ్‌లో జార్ఖండ్ 76.19 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (SPMRM) 2016 లో ప్రారంభించారు. ఇది గ్రామీణ ప్రాంతాలను సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తుంది.
వినియోగదారుల సాధికారత కోసం "జాగృతి" మస్కట్
వినియోగదారుల సాధికారత కోసం ప్రభుత్వం "జాగృతి" మస్కట్'ను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు సాధికారత మరియు వారి హక్కుల పట్ల అవగాహన కల్పించడం కోసం వినియోగించుకోనున్నారు.
వీటిలో వినియోగదారుల రక్షణ చట్టం 2019 యందు ఉన్న హాల్‌మార్కింగ్, నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్ టోల్-ఫ్రీ నంబర్ 1915, తూనికలు మరియు కొలతల చట్టం, సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ యొక్క నిర్ణయాలు మరియు ఫిర్యాదుల పరిష్కారంపై వినియోగదారుల టెస్టిమోనియల్‌లు ఉన్నాయి.
రాజస్థాన్ యందు డిజిటల్ లోక్ అదాలత్ ప్రారంభం
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ఉదయ్ ఉమేష్ లలిత్ భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత డిజిటల్ లోక్ అదాలత్‌ను రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇటీవలే నిర్వహించిన 18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్ వేదిక ద్వారా దీనిని పరిచయం చేసారు.
లోక్ అదాలత్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, 1987 ప్రకారం ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది దేశంలో ఉపయోగించే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికగా రూపొందించబడింది. ఇది పంచాయతీపై పెండింగ్‌లో ఉన్న కేసులు లేదా న్యాయస్థానంలో ప్రీ-లిటిగేషన్ దశలో ఉన్న కేసులను పరిష్కరిస్తుంది.
అస్సాం మహిళాల కోసం స్వానిర్భర్ నారీ పథకం ప్రారంభం
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అస్సాంలోని గౌహతిలో స్వదేశీ నేత కార్మికులకు సాధికారత కోసం ' స్వనిర్భర్ నారీ ' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళా నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందివ్వనున్నారు, అదే సమయంలో వారి వ్యాపారంలో దళారుల పాత్రను తొలగించనున్నారు.
బిజినెస్ & ఎకానమీ అఫైర్స్ జులై 2022
గెయిల్ తదుపరి చైర్మన్‌గా సందీప్ కుమార్ గుప్తా
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క ఫైనాన్స్ డైరెక్టర్ సందీప్ కుమార్ గుప్తా, భారతదేశపు అతిపెద్ద గ్యాస్ యుటిలిటీ గెయిల్ (ఇండియా) లిమిటెడ్‌కు తదుపరి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పిఇఎస్‌బి) 10 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయగా, అందులో సందీప్ కుమార్ ఎంపికయ్యారు. ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్న మనోజ్ జైన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓగా పరితోష్ త్రిపాఠి
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పరితోష్ త్రిపాఠి నియామకాన్ని ప్రకటించింది. ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది జాయింట్ వెంచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సంస్థలో 70% మెజారిటీ వాటాను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కలిగి ఉంది.
సీఐఐ అధ్యక్షుడిగా ఆర్ దినేష్
టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేష్ 2022-23క ఏడాదికి గాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) యొక్క నియోగిత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన గతంలో సీఐఐ సౌత్ రీజియన్ యందు సీఈఓగా పనిచేశారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది 1895లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది. సీఐఐ అనేది ప్రభుత్వేతర వాణిజ్య & న్యాయవాద సమూహం. ఇది ప్రపంచ, ప్రాంతీయ మరియు పరిశ్రమల అజెండాలను రూపొందించడానికి వ్యాపార, రాజకీయ, విద్యావేత్త మరియు సమాజంలోని ఇతర నాయకులను నిమగ్నం చేస్తుంది.
ఎన్ఎస్ఈ ఎండీ & సీఈఓగా ఆశిష్ కుమార్ చౌహాన్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ స్థానంలో ఆశిష్ కుమార్ చౌహాన్‌ను నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఆశిష్ కుమార్ ప్రస్తుతం బీఎస్ఈ యందు ఎండీ మరియు సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ హోదాలో ఆయన 2022 నవంబర్ వరకు ఉండనున్నారు. ఆ తర్వాత కొత్త ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు.
జులై 18 నుండి ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ పైన 5 శాతం జీఎస్టీ
ఈ ఏడాది జూలై 18 నుండి బ్రాండ్ లేని ప్రీ - ప్యాక్డ్ మరియు లేబుల్ చేయబడిన ఆహార పదార్థాల 5 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 25 కిలోల లోపు బరువున్న తృణధాన్యాలు, పప్పులు మరియు పిండి వంటి బ్రాండ్ లేని ప్రీ - ప్యాక్డ్ మరియు లేబుల్ చేయబడిన ఆహార పదార్థాల సింగిల్ ప్యాకేజీలకు 5 శాతం జీఎస్టీ నుండి మినహాయింపు ఉంటుంది
భారతదేశపు తొలి ప్యాసింజర్ డ్రోన్ వరుణ ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశపు మొట్టమొదటి ప్యాసింజర్ డ్రోన్ వరుణను ఆవిష్కరించారు. ఢిల్లీలో జరిగిన నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజనైజేషన్ ఆర్గనైజేషన్ (NIIO) సెమినార్ 'స్వావ్లంబాన్' సందర్భంగా ప్రధాని దీనిని ఆవిష్కరించారు. దీనిని భారతీయ స్టార్టప్ సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ రూపొందించింది. ఇది గరిష్టంగా 130 కేజీల బరువుతో 25 కిలోమీటర్లు ఎగిరే సామర్థ్యం కలిగి ఉంది.
ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా ఆశిష్‌కుమార్ చౌహాన్ బాధ్యతలు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఆశిష్‌కుమార్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. చౌహాన్ గతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) యొక్క ఎండీ మరియు సీఈవోగా పనిచేసారు.
డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్ జులై 2022
భారత సైన్యం సురక్షా మంథన్-2022
జోధ్‌పూర్ (రాజస్థాన్)లో సరిహద్దు & తీర భద్రతకు సంబంధించిన అంశాలపై భారత సైన్యం యొక్క ఎడారి కార్ప్స్ "సురక్షా మంథన్ 2022"ని నిర్వహించింది. ఈ మంథన్‌కు శ్రీ పంకజ్ కుమార్ సింగ్ (BSF), వీఎస్ పఠానియా (కోస్ట్ గార్డ్), లెఫ్టినెంట్ జనరల్ రాకేష్ కపూర్ మరియు సైన్యంలోని సేవలందిస్తున్న ఇతర అధికారులు సంయుక్తంగా అధ్యక్షత వహించారు
సురక్షా మంథన్ అనేది వివిధ సరిహద్దు దళాల మధ్య పరస్పర సంబంధాలను బలపర్చుకునేందుకు మరియు భద్రతా బెదిరింపులు మరియు సరిహద్దు రక్షణ సవాళ్లు కోసం చేర్చించుకునేందుకు నిర్వహిస్తారు.
భారత నావికాదళంలో తోలి ఏఎల్ హెచ్ స్క్వాడ్రన్ చేరిక
భారత నావికాదళం యొక్క సముద్ర నిఘా ఉపకరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆధునాతన ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ 324 (INAS 324) ను ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా విశాఖపట్నంలో ప్రారంభించారు.
రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా, తూర్పు సముద్ర తీరంలో మొదటి ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ ( INAS ) 324 చేరింది. ఈ అధునాతన తేలికపాటి హెలికాప్టర్ స్క్వాడ్రన్, దేశ సముద్ర నిఘా సామర్ధ్యాన్ని మరింతా పెంచనున్నాయి.
యూఎన్ ఫోర్స్ కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ సుబ్రమణియన్
దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి మిషన్ (UNMISS)కి కొత్త ఫోర్స్ కమాండర్‌గా భారతదేశానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ మోహన్ సుబ్రమణియన్‌ను నియమిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రకటించారు.
యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్ (UNMISS) అనేది సుడాన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి, పౌరులను రక్షించడానికి, మానవ హక్కుల ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి మరియు దాడులపై దర్యాప్తు చేయడానికి, మానవతా సహాయానికి మద్దతు ఇవ్వడానికి మరియు శాంతి ఒప్పందం అమలును ప్రోత్సహించడానికి 2011 లో స్థాపించబడింది.
ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ 'దునగిరి'ని ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్
గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (GRSE) నిర్మించిన Y-3023 దునగిరి ప్రాజెక్ట్ 17A యుద్ధనౌకను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కోల్‌కతాలోని హుగ్లీ నదిలో ప్రారంభించారు. P17A ఫ్రిగేట్‌లు మెరుగైన స్టెల్త్ ఫీచర్‌లు, ఆధునాతన ఆయుధాలు, సెన్సార్‌లు మరియు ప్లాట్‌ఫారమ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లతో సేవలు అందించనున్నాయి.
ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఇండియన్ నేవీకి అప్పగింత
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్'ను భారత నౌకాదళానికి అప్పగించింది. సుమారు రూ. 20,000 కోట్ల వ్యయంతో, పూర్తి స్వదేశీ సాంకేతికతో నిర్మించిన ఈ నౌక హిందూ మహాసముద్రంలో సేవలు అందించనుంది.
రిపోర్టులు & ర్యాంకులు జులై 2022
ఎన్ఎఫ్ఎస్ఏ అమలులో ఒడిశాకు అగ్రస్థానం
భారతదేశంలోని రేషన్ షాపుల ద్వారా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఆక్ట్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ)ని అమలు చేస్తున్న రాష్ట్రల ర్యాంకింగ్‌లో ఒడిశా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని ఆహారం మరియు పోషకాహార భద్రతపై నిర్వహించిన రాష్ట్ర ఆహార మంత్రుల సదస్సు సందర్భంగా కేంద్ర ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఈ నివేదికను విడుదల చేసారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం రాష్ట్ర ర్యాంకింగ్ ఇండెక్స్ 2022 ప్రకారం ఒడిశా మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇకపోతే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దేశంలో ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉంది.
రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ 2021లో గుజరాత్, కర్ణాటక అగ్రస్థానం
స్టార్టప్ ఎకోసిస్టమ్స్‌కు మద్దతుపై రాష్ట్రాల ర్యాంకింగ్ యొక్క మూడవ ఎడిషన్ ఫలితాలను మంత్రి శ్రీ పీయూష్ గోయల్ విడుదల చేశారు. ఐదు కేటగిర్లుగా అందిస్తున్న ఈ ర్యాంకింగులో రాష్ట్రాల వారీగా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు బెస్ట్ పెర్ఫార్మర్స్ స్థానాన్ని దక్కించుకోగా, ఈశాన్య రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో మేఘాలయ అగ్ర స్థానాన్ని దక్కించుకుంది.
టాప్ పెర్ఫార్మర్స్ రాష్ట్రల జాబితాలో కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా మరియు తెలంగాణ రాష్ట్రాలు అగ్రస్థానం దక్కించుకోగా, యూటీల జాబితాలో జమ్మూ & కాశ్మీర్ టాపులో నిలిచింది. అదే విధంగా లీడర్స్ విభాగంలో అస్సాం, పంజాబ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అగ్రస్థానం దక్కించుకోగా ఇదే కేటగిరిలో యూటీ జాబితాలో అండమాన్ & నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్ మరియు గోవా టాప్ స్థానాన్ని దక్కించుకున్నాయి.
ఔత్సాహిక నాయకులు విభాగంలో ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలువగా చండీగఢ్, దాద్రా మరియు నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, పుదుచ్చేరి మరియు త్రిపుర రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో టాపులో నిలిచాయి.
ఇక చివరిగా ఎమర్జింగ్ స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలు అగ్రస్థానం దక్కించుకోగా, ఇదే జాబితాలో మిజోరం మరియు లడఖ్ ప్రాంతం యూటీల పరిధిలో టాప్ స్థానాన్ని దక్కించుకున్నాయి.
2023లో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్
2023 లో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ అధిగమించనుందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. యునైటెడ్ స్టేట్స్ చేసిన ముందస్తు అంచనా కంటే నాలుగు సంవత్సరాల ముందుగానే భారత్ ఈ మార్కును చేరుకున్నట్లు అంచనా వేసింది. 2050 నాటికి ఇండియా 1.668 బిలియన్ల జనాభాను కలిగి ఉంటుందని అంచనా వేస్తుంది.
జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022 లో భారత్ రాంక్ 135
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022 లో 146 దేశాల జాబితాలో ఇండియా 135వ ర్యాంకులో నిలిచింది. 2021లో 156 దేశాల జాబితాలో 140వ స్థానానికి మెరుగుపడినప్పటికీ, 2012లో 135 దేశాలలో 105వ ర్యాంక్‌తో పోలిస్తే ఇది చాలా దిగజారుడు ర్యాంకుగా పరిగణించాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2006 నుండి ఈ ర్యాంకులను ఏటా విడుదల చేస్తుంది.
సొంత ఇంటర్నెట్ సేవలను కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా కేరళ
కేరళ ఇప్పుడు సొంత ఇంటర్నెట్ సేవను కలిగి ఉన్న దేశంలోనే మొదటి మరియు ఏకైక రాష్ట్రంగా అవతరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. 2019 లో ప్రారంభించిన కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలోని 30 వేలకు పైగా బీపీఎల్ కుటుంబాలకు అందిస్తున్నారు. కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ఇటీవలే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) లైసెన్స్ పొందటంతో ఈ ఘనత దక్కించుకుంది.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022లో భారతదేశ ర్యాంక్ 87
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారతదేశం 87వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో జపాన్, సింగపూర్ మరియు దక్షిణ కొరియా దేశాలు మొదటి మూడు స్థానాలలో నిలిచాయి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది పాస్‌పోర్ట్ హోల్డర్ యాక్సెస్ చేయగల గమ్యస్థానాల ఆధారంగా నిర్ణయించబడుతుంది.
మొదటి హర్ ఘర్ జల్ ' సర్టిఫైడ్ జిల్లాగా బుర్హాన్‌పూర్
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా దేశంలోనే మొదటి ' హర్ ఘర్ జల్ ' సర్టిఫైడ్ జిల్లాగా అవతరించింది. బుర్హాన్‌పూర్‌లోని ప్రతి 254 గ్రామాల ప్రజలు, గ్రామసభలు ఆమోదించిన తీర్మానం ద్వారా తమ గ్రామాలను 'హర్ ఘర్ జల్'గా ప్రకటించారు. దీని ద్వారా ఆ గ్రామాల్లోని ప్రజలందరికీ కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చారు.
జల్ జీవన్ మిషన్‌ను ఆగస్టు 15, 2019న ప్రారంభించినప్పుడు, బుర్హాన్‌పూర్‌లోని మొత్తం 1,01,905 కుటుంబాలలో 37,241 గ్రామీణ కుటుంబాలు (36.54%) మాత్రమే కుళాయి కనెక్షన్ల ద్వారా త్రాగునీటిని పొందుతున్నారు.
'హర్ ఘర్ జల్' కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం 2024 నాటికి దేశంలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది.
ఇండియాలో మొట్టమొదటి బ్రెయిన్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
స్ట్రోక్, మూర్ఛ, పార్కిన్సన్స్, బ్రెయిన్ ట్యూమర్ మరియు డిమెన్షియా వంటి మెదడు మరియు మానసిక ఆరోగ్య సమస్యలను నిర్ధారించడానికి మరియు ప్రాథమిక సంరక్షణను అందించడానికి బెంగళూరు జయనగర్ జనరల్ హాస్పిటల్‌లో దేశంలో మొట్టమొదటి బ్రెయిన్ హెల్త్ క్లినిక్ (BHC) ప్రారంభమయ్యింది. దీని కర్ణాటక హెల్త్ మినిస్టర్ డా కే. సుధాకర్ ప్రారంభించారు.
అవార్డులు & గౌరవాలు జులై 2022
అశోక్ సూటాకు సీఐఐ క్వాలిటీ రత్న అవార్డు 2021 ప్రధానం
హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశోక్ సూటాకు 2021 ఏడాదికి సంబంధించి సీఐఐ క్వాలిటీ రత్న అవార్డును ప్రదానం చేశారు. నాణ్యమైన ఇనిషియేటివ్‌ల ద్వారా భారతీయ పరిశ్రమ యొక్క పోటీతత్వాన్ని పెంపొందించడంలో ఆయన గణనీయమైన కృషిని పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు అందజేసారు.
2019 సంవత్సరంలో ప్రారంభించిన వార్షిక సీఐఐ క్వాలిటీ రత్న అవార్డును భారతదేశంలో నాణ్యమైన పనితనం. అత్యుత్తమ నాయకత్వం, సహకారం మరియు విశిష్ట సేవలకు గుర్తింపుగా అందిస్తారు. ఈ అవార్డును ఏటా నిర్వహించే క్వాలిటీ సమ్మిట్‌లో ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అందజేస్తుంది.
తనూజా నేసరికి ఆయుర్వేద రత్న అవార్డు
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్ (AIIA) డైరెక్టర్ తనూజా నేసరికి యూకే పార్లమెంట్ ఆయుర్వేద రత్న అవార్డును ప్రదానం చేసింది. యూకే యొక్క ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ సైన్సెస్, భారతదేశం మరియు విదేశాలలో ఆయుర్వేద వృద్ధిని ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేసింది.
డా. రాజేంద్ర ప్రసాద్ స్మారక అవార్డు ప్రారంభం
అకడమిక్ ఎక్సలెన్స్ కోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర సైన్స్ మరియు టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా సేవలు అందించారు. అలానే భారత స్వాతంత్ర్య కార్యకర్తగా, రాజకీయవేత్తగా, న్యాయవాదిగా దేశానికి సేవ చేసారు.
భారతీయ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్'కు అరుదైన గౌరవం
భారతీయ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) యొక్క 'మాజీ ప్రధాన ఆర్థికవేత్తల గోడ'పై కనిపించిన మొదటి మహిళ మరియు రెండవ భారతీయ ఆర్థికవేత్తగా నిలిచింది. గోపీనాథ్ 2018 అక్టోబర్‌లో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులయ్యారు.
గత ఏడాది డిసెంబర్‌లో ఐఎంఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. గీతా గోపీనాథ్ అంతర్జాతీయ ద్రవ్య నిధిలో బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళా ఆర్థికవేత్తగా గుర్తింపు పొందారు.
దియా మీర్జాకు 'మదర్ థెరిసా మెమోరియల్ అవార్డు
ప్రముఖ బాలీవుడ్ నటి మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం (UNEP) నేషనల్ గుడ్‌విల్ అంబాసిడర్ దియా మీర్జాకు ప్రతిష్టాత్మకమైన మదర్ థెరిసా మెమోరియల్ అవార్డుతో మహారాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. అలానే పర్యావరణ కార్యకర్త మిస్టర్ అఫ్రోజ్ షా కూడా ఇదే అవార్డును ప్రధానం చేసారు.
68వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2022
2020 కి సంబంధించి 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను భారత ప్రభుత్వం ప్రకటించింది. విజేతలతో తమిళ చిత్రం " సూరరై పొట్రు" ఉత్తమ ఫీచర్, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటిగా, మరో రెండు కేటగిర్లలో అత్యధికంగా 5 జాతీయ అవార్డును గెలుచుకుంది. "తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్" చిత్రం కోసం అజయ్ దేవగన్ కూడా ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నారు.
ప్రాంతీయ భాషలలో తెలుగు నుండి కలర్ ఫోటో చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వగా, నాట్యం చిత్రానికి గాను ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా టీవీ రాంబాబు, ఉత్తమ కొరియోగ్రఫీకి గాను సంధ్య రాజు అవార్డులు అందుకున్నారు. అలానే అలా వైకుంఠపురం చిత్రానికి గాను ఎస్. థమన్ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడుగా అవార్డు దక్కించుకున్నారు. అవార్డుల పూర్తి జాబితా
స్పోర్ట్స్ అఫైర్స్ జులై 2022
80 మ్యాచ్‌లు గెలిచిన తొలి ఆటగాడిగా నోవాక్ జకోవిచ్
టెన్నిస్ చరిత్రలో, నాలుగు గ్రాండ్ స్లామ్‌లలో కలిపి 80 మ్యాచ్‌లు గెలిచిన తోలి టెన్నిస్ క్రీడాకారుడిగా నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. తాజాగా జరిగిన వింబుల్డన్ 2022 మొదటి రౌండులో విజేతగా నిలవడంతో ఈ ఘనత దక్కించుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు & స్టువర్ట్ బ్రాడ్ చెత్త రికార్డు
భారత తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, టెస్ట్ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాడు. ఇటీవలే బర్మింగ్‌హామ్'లో జరిగిన భారత్ మరియు ఇంగ్లండ్'ల 5వ టెస్టులో ఈ రికార్డు చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఓవరులో రికార్డు స్థాయిలో 29 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.
మరోవైపు ఇదే ఓవరు యందు అదనపు పరుగులతో ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్న స్టువర్ట్ బ్రాడ్, టెస్టు క్రికెట్టులొ ఒక ఓవర్ యందు అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త బౌలరుగా నిలిచాడు. ఈ రికార్డు క్రికెట్ మూడు ఫార్మేట్ల యందు స్టువర్ట్ బ్రాడ్ పేరట ఉండటం గమనార్హం.
ఐడబ్ల్యుఎఫ్ అధ్యక్షుడిగా మొహమ్మద్ జలూద్
ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (IWF) నూతన అధ్యక్షుడుగా ఇరాక్ దేశానికి చెందిన మొహమ్మద్ జలూద్ ఎన్నికయ్యారు. ఐడబ్ల్యుఎఫ్ చరిత్రలో ఆసియా నుండి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. మొహమ్మద్ జలూద్ ఇదివరకు ఐడబ్ల్యుఎఫ్ సెక్రటరీ జనరల్'గా పనిచేసారు.
రన్నర్ పరుల్ చౌదరి పేరిట కొత్త జాతీయ రికార్డు
లాస్ ఏంజెల్స్‌లో జరిగిన సౌండ్ రన్నింగ్ మీట్‌లో భారత రన్నర్ పరుల్ చౌదరి మహిళల 3000 మీటర్ల ఈవెంట్‌లో 8.57 నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తి చేసి ఇండియా నుండి కొత్త నేషనల్ రికార్డు నెలకొల్పింది. దీనితో ఆరు సంవత్సరాల క్రితం న్యూ ఢిల్లీలో సూర్య లోగనాథన్ యొక్క 9:04.5 సెకన్ల రికార్డును ఆమె బద్దలు కొట్టింది.
టీ20లో అత్యధిక వరుస విజయాలు సాధించిన కెప్టెనుగా రోహిత్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో వరుసగా 14 టీ20లను గెలిచిన జట్టుకు నాయకత్వం వహించిన మొదటి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ విజయాల పరంపర 2019లో బంగ్లాదేశ్‌పై భారత్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు నుండి ప్రారంభమైంది.
వింబుల్డన్ 2022 విజేతలు
వింబుల్డన్ పురుషుల ఛాంపియన్‌షిప్ వరుసగా నాలుగోసారి మరియు ఓవరాల్‌గా ఏడో సారి నొవాక్ జొకోవిచ్ సొంతం చేసుకున్నాడు. తుది పోరులో 4-6, 6-3, 6-4, 7-6 (3)తో నిక్ కిర్గియోస్‌పై విజయం సాధించాడు. ఈ విజయం జొకోవిచ్ యొక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ సంఖ్యను 21 కి చేర్చింది.
వింబుల్డన్ 2022 మహిళల ఛాంపియన్‌షిప్'ను ఎలెనా రిబాకినా సొంతం చేసుకుంది. తుదిపోరులో 3-6, 6-2, 6-2తో ఓన్స్ జబీర్‌ను ఓడించి మహిళల టైటిల్‌ను గెలుచుకుంది. కజకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రైబాకినా, ఆ దేశం నుండి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి క్రీడాకారిణిగా నిలిచింది.
టీ20ల్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా భువనేశ్వర్
అంతర్జాతీయ టీ20ల్లో చరిత్రలో 500 డాట్ బాల్స్ వేసిన మొదటి బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్ బద్రీ 383 డాట్ బాల్స్'తో రెండవ స్థానంలో ఉండగా, టీమ్ సౌథీ (368), మిచెల్ స్టార్క్ (354) లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.
94 ఏళ్ల భగవానీ దేవికి వరల్డ్ మాస్టర్స్‌లో స్వర్ణం
భారతదేశానికి చెందిన 94 ఏళ్ల స్ప్రింటర్ భగవానీ దేవి, ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 2022లో బంగారు పతకం మరియు రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది. హర్యానికి చెందిన ఈమె 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌ను 24.74 సెకన్ల టైమింగ్‌తో పూర్తి చేయడం బంగారు పతకం దక్కించుకుంది.
ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు 1975లో టొరంటోలో ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా 18 వేర్వేరు దేశాలు మరియు 23 నగరాలచే నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో పాల్గునేందుకే కనీస వయోపరిమితి 35 ఏళ్ళు.
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2022
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 18వ ఎడిషన్, ఈ ఏడాది జూలై 15 నుండి 24 మధ్య యునైటెడ్ స్టేట్స్‌లోని ఒరెగాన్‌లోని యూజీన్ నగరంలో హాట్టహాసంగా నిర్వహించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌స్ అనేది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ ద్వారా నిర్వహించబడే ద్వైవార్షిక అథ్లెటిక్స్ పోటీ. ఈ క్రీడల్లో 192 దేశాల నుండి రెండు వేలకు పైగా క్రీడాకారులు సుమారు 50 క్రీడా ఈవెంట్లలో పాల్గొన్నారు. 2025 లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లకు టోక్యో ఆతిథ్యం ఇవ్వనుంది.
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2022 విజేతగా పీవీ సింధు
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2022 టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న పివి సింధు 21-9, 11-21, 21-15తో ప్రపంచ 11వ ర్యాంకర్ వాంగ్ జి యిని ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది. ఈ ఏడాది 2022 లో సింధుకు ఇది మూడవ టైటిల్. ఇందులో ఏడాది ప్రారంభంలో స్విస్ ఓపెన్, సయీద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్స్ ఉన్నాయి.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు రజతం
ఒరెగాన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. దీనితో 2003లో లాంగ్-జంపర్ అంజు బాబీ జార్జ్ కాంస్యం తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన మొదటి వ్యక్తిగా మరియు 2వ భారతీయుడుగా చరిత్రకెక్కాడు. ఈ పోటీ విజేతగా నిలిచిన అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్ల అత్యుత్తమ త్రో జావెలిన్ త్రో విభాగంలో రికార్డు నమోదు చేసి స్వర్ణ పతకం దక్కించుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2022 విజేతలు
కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభ వేడుకలకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మరియు హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌లు భారతదేశ పతాకధారులుగా ఎంపికయ్యారు. జూలై 28 నుండి 8 ఆగస్టు 2022 మధ్య జరుగనున్న ఈ క్రీడలలో భారత్ నుండి 215 మంది క్రీడాకారులు వివిధ పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ 2022 ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జూలై 28 నుండి 8 ఆగస్టు 2022 మధ్య నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో గతంలో బ్రిటిష్ పాలనలో ఉన్న దాదాపు 54 కామన్వెల్త్ దేశాల క్రేడాకారులు పాల్గొంటారు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో మొదటిసారిగా మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
స్క్వాష్ ఆటగాడు అనాహత్ సింగ్ కేవలం 14 సంవత్సరాల వయస్సులో కామన్వెల్త్ క్రీడలలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన భారతీయ అథ్లెట్ గా నిలిచాడు. అలానే లాన్ బౌల్స్ క్రీడకు ప్రాతినిధ్యం వహిస్తున్న 45 ఏళ్ళ సునీల్ బహదూర్ అతి పెద్ద వయస్కుడుగా నిలిచాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2022 లో 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు చెందిన మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించింది. అదేవిధంగా 73 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు చెందిన అచింత షెయులీ స్వర్ణ పతకం సాధించాడు. అలానే 67 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మిజోరాంకు చెందిన జెరెమీ లాల్‌రినుంగా ఇండియాకు స్వర్ణ పతకం అందించాడు.
55 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు చెందిన సంకేత్ సర్గర్ రజతం గెలుచుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి రజతం పతకం దక్కించుకుంది. అలానే మరో భారతీయ వెయిట్‌లిఫ్టర్ గురురాజా పూజారి పురుషుల 61 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 44 వ చెస్ ఒలింపియాడ్‌ను చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా పాల్గొన్నారు. 44 వ చెస్ ఒలింపియాడ్ 28 జులై 2022 నుండి 10 ఆగష్టు 2022 వరకు నిర్వహించనున్నారు.