కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | వార్తల్లో వ్యక్తులు
Magazine 2022

కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | వార్తల్లో వ్యక్తులు

ప్రముఖ గాయకుడు కేకే మరణం

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ (కేకే), 53 సంవత్సరాల వయస్సులో కోల్‌కతాలో గుండెపోటుతో మరణించారు. కోల్‌కతాలోని నజ్రుల్ మంచ్‌లో ఒక సంగీత కచేరీలో ప్రదర్శనలో పాల్గున్న కేకే అస్వస్థతకు గురై గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కేకే 1996 లో రహమాన్ సంగీతం అందించిన తమిళ సినిమా కాదల్ దేశం సినిమాతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ మరియు బెంగాలీ చిత్రాలకు గానం అందించారు.

నేషనల్ స్పెల్లింగ్ బీ 2022 విజేతగా హరిణి లోగన్

టెక్సాస్‌కు చెందిన 14 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థిని హరిణి లోగన్ 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేతగా నిలిచింది. ఎనిమిదో తరగతి చదువుతున్న హరిణి తుదిపోటీలో మరో ఇండో అమెరికన్ విక్రమ్ రాజును ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో జరిగే వార్షిక ఇంగ్లీష్ స్పెల్లింగ్ కార్యక్రమం. ఇది 1925 నుండి ఏటా క్రమం తప్పకుండా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమ విజేతలుగా అత్యధికసార్లు భారతీయ విద్యార్థులు నిలిచారు.

శ్రియా లెంకాకు మొదటి భారతీయ కె-పాప్ స్టారుగా గుర్తింపు

ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రియ లెంక భారతదేశపు మొట్టమొదటి కె-పాప్ స్టారుగా అవతరించింది. ఈమె ప్రస్తుతం దక్షిణ కొరియా డిఆర్ మ్యూజిక్ (బ్లాక్‌స్వాన్‌లో మ్యూజిక్ లేబుల్) నిర్వహించిన కార్యక్రమంలోఎంపికైన ఇద్దరు ఫైనలిస్టులలో శ్రియ లెంక ఒకరుగా నిలిచారు. ఈమె గర్ల్ గ్రూప్ బ్లాక్‌స్వాన్‌లో ఐదవ సభ్యురాలిగా చేరడం ద్వారా ఈ ఘనత సాధించింది.

బ్లాక్‌స్వాన్ అనేది డిఆర్ మ్యూజిక్ ద్వారా ఏర్పడిన దక్షిణ కొరియాకు చెందిన ఐదుగురు సభ్యుల అమ్మాయిల సమూహం. దీనిని గతంలో రానియా మరియు బీపీ రానియా అని పిలిచేవారు. ఇది 2011లో టెడ్డీ రిలే అనే నాటకంతో ప్రారంభమైంది.

అంతర్జాతీయ క్రికెట్ నుండి మిథాలీ రాజ్ రిటైర్

భారత లెజెండరీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 39 ఏళ్ల మిథాలీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె 1999 లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేసింది. తన కెరీర్లో మొత్తం 232 అంతర్జాతీయ వన్డేలలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆమె, 50.68 సగటుతో మొత్తం 7805 పరుగులు సాధించింది.

మిథాలీ రాజ్ ప్రస్తుతం మహిళల వన్డేలలో ఆల్ టైమ్ రన్ స్కోరర్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అలానే అత్యధిక క్రికెట్ వరల్డ్ కప్'లకు ప్రాతినిథ్యంవహించిన మహిళా క్రికెటరుగా ఆమె రికార్డుకెక్కారు. మిథాలీ భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, అర్జున అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు.

ప్రసార భారతి సీఈఓగా మయాంక్ కుమార్ అగర్వాల్‌

దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ మయాంక్ కుమార్ అగర్వాల్‌కు ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రసార భారతి పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ సీఈఓగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన శశి శేఖర్ స్థానంలో అగర్వాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రసార భారతి  ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది 1997 లో ఏర్పాటు చేయబడింది.

ఇండో-యుకె సంస్కృతి వేదిక అంబాసిడర్‌గా ఎఆర్ రెహమాన్

భారతీయ సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్, బ్రిటీష్ కౌన్సిల్ యొక్క 'ఇండియా-యుకె టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్' అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జూన్ 7న భారతదేశంలోని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ జాన్ థామ్సన్ మరియు బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ బార్బరా విక్హామ్ ప్రారంభించారు. ఈ వేడుకను ఏటా ఇండో-యుకె సంస్కృతి సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా జరుపుకుంటారు.

జో బిడెన్, సైన్స్ సలహాదారునిగా ఆరతి ప్రభాకర్‌

యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో విస్తృతమైన అనుభవం ఉన్న ఇండో-అమెరికన్ అనువర్తిత భౌతిక శాస్త్రవేత్త ఆరతి ప్రభాకర్‌ను సైన్స్ సలహాదారినిగా నియమించుకున్నారు.

కర్ణాటక లోకాయుక్తగా జస్టిస్ బీఎస్ పాటిల్

కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ భీమనగౌడ సంగనగౌడ పాటిల్, ఆ రాష్ట్ర నూతన లోకాయుక్తగా నియమితులయ్యారు. జస్టిస్ బీఎస్ పాటిల్ ఇదివరకు ఉప లోకాయుక్తగా సేవలు అందించారు. మాజీ కర్ణాటక లోకాయుక్త జస్టిస్ పీ . విశ్వనాథ్ శెట్టి పదవీవిరమణ పొందటంతో ఆయన స్థానంలో జస్టిస్ బీఎస్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు.

పీసీఐ చీఫ్‌గా జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్

రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) మొదటి మహిళా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 2021లో స్టిస్ (రిటైర్డ్) సీకే ప్రసాద్ పదవీ విరమణ చేసిన నుండి పిసిఐ చైర్‌పర్సన్‌ పదవి ఖాళీగా ఉంది.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మొదటిసారిగా 1966లో పార్లమెంట్ ద్వారా మొదటి ప్రెస్ కమీషన్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసారు. ఇది 1978 ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం మరియు భారతదేశంలోని వార్తాపత్రికలు మరియు వార్తా సంస్థల ప్రమాణాలను మెరుగుపరచడం కోసం పనిచేస్తుంది.

కాయ్ కొత్త చైర్మన్‌గా ప్రమోద్ కె మిట్టల్‌

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ ప్రమోద్ కె మిట్టల్‌, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) యొక్క కొత్త చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మిట్టల్ గతంలో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేసారు.

సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది భారతీయ ప్రభుత్వేతర వాణిజ్య సంఘం. ఇది ప్రధానంగా టెలికమ్యూనికేషన్ పరిశ్రమపై దృష్టి సారించిన న్యాయవాద సమూహం. ప్రస్తుతం కాయ్'లో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా సంస్థలు ప్రధాన సెల్యులార్ ఆపరేటర్స్ పాత్రను పోషిస్తున్నాయి.

మిసెస్ ఇండియా వరల్డ్ విజేతగా సర్గమ్ కౌశల్

మిసెస్ ఇండియా వరల్డ్ 2022-2023 విజేతగా శ్రీమతి సర్గం కౌశల్ టైటిల్‌ను గెలుచుకున్నారు. జూన్ 15న ముంబైలోని గోరేగావ్‌లోని నెస్కో సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిసెస్ ఇండియా వరల్డ్ 2021 మరియు మిసెస్ వరల్డ్ 2022లో నేషనల్ కాస్ట్యూమ్ విన్నర్ అయిన నవదీప్ కౌర్, సర్గం కౌశల్ తలకు పట్టాభిషేకం చేసింది. మిసెస్ ఇండియా వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, ఇప్పుడు సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.

నీతి ఆయోగ్ నూతన సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్

నీతి ఆయోగ్ యొక్క నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) గా పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ఈ నెల జూన్ 30, 2022న ప్రస్తుత సీఈఓ అమితాబ్ కాంత్ పదవీకాలం పూర్తయిన తర్వాత అయ్యర్ పదవీకాలం ప్రారంభమవుతుంది. పరమేశ్వరన్ అయ్యర్ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అయ్యర్ 2016 మరియు 2020 మధ్య స్వచ్ఛ భారత్ మిషన్‌కు నాయకత్వం వహించారు.

'ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ' అధ్యక్షుడిగా శ్యామ్ శరణ్

ప్రతిష్టాత్మకమైన ' ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ' అధ్యక్షుడిగా మాజీ విదేశాంగ కార్యదర్శి మరియు అణు వ్యవహారాలు మరియు వాతావరణానికి సంబంధించిన ప్రధాన మంత్రి ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన శ్యామ్ శరణ్ నియమితులయ్యారు.

ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ (ఐఐసీ) అనేది న్యూఢిల్లీలో ఉన్న ఒక అనధికారిక సంస్థ. ఇందులో సభ్యులుగా కళాకారులు, విద్యావేత్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, న్యాయమూర్తులు, న్యాయనిపుణులు, పార్లమెంటేరియన్లు, వైద్యులు, మంత్రులు, గవర్నర్లు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు మరియు ఇతర డొమైన్‌లకు చెందిన దాదాపు ఏడువేల మంది వ్యక్తులు ఉంటారు.

కొత్త CBDT ఛైర్మన్‌గా నితిన్ గుప్తా

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సస్ (సీబీడీటీ) కొత్త చైర్మన్‌గా నితిన్ గుప్త నియమితులయ్యారు. ఈయన 1986 బ్యాచుకు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి. ప్రస్తుతం ఆయన సీబీడీటీలో ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటులో మెంబరుగా ఉన్నారు.

Post Comment