టర్కీ పేరు మార్పు అభ్యర్థనకు యూఎన్ ఆమోదం
టర్కీ పేరును తుర్కీయే (టర్కీయే)గా మార్చాలన్న టర్కీ అభ్యర్థనను ఐక్యరాజ్యసమితి ఆమోదించింనట్లు వెల్లడించింది. టర్కీ 29 అక్టోబర్ 1923న స్వాతంత్ర దేశంగా అవతరించిన సమయంలో ఆంగ్లంలో రిపబ్లిక్ ఆఫ్ టర్కీగా పిలువబడే టర్కీయే కుమ్హురియేటి అనే అధికారిక పేరును స్వీకరించింది. స్థానిక టర్కీ ప్రజల కోరిక మేరకు, అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ గత డిసెంబరులో పేరు మార్పుకు సంబంధించి మెమోరాండమ్‌ను విడుదల చేసారు. ఆంగ్లంలో ఉన్న టర్కీ పేరును తమ వాడుక భాషలో తుర్కీయే (Türkiye) గా మార్చడానికి చర్యను ప్రారంభించింది.
అల్బేనియా కొత్త అధ్యక్షుడిగా బజ్రామ్ బేగాజ్
అల్బేనియా కొత్త అధ్యక్షుడిగా బజ్రామ్ బేగాజ్ ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి అభ్యర్థులెవరూ నామినేట్ కాకపోవడంతో అల్బేనియా పార్లమెంట్ తన కొత్త అధ్యక్షుడిగా ఆ దేశ ఉన్నత సైనిక అధికారి జనరల్ మేజర్ బజ్రామ్ బేగాజ్‌ను ఎన్నుకుంది.
మలేషియాలో తప్పనిసరి మరణశిక్ష చట్టం రద్దు
హత్య, ఉగ్రవాదంతో సహా 11 నేరాలకు సంబంధించి తప్పనిసరి మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు మలేషియా ప్రభుత్వం వెల్లడించింది. మలేషియాలో 2018 నుండి మరణశిక్ష చట్టాలపై తాత్కాలిక నిషేధం అమలులో ఉంది. కొన్ని దేశాలలో కొన్ని నేరాలకు సంభందించి తప్పనిసరి మరణశిక్షలు అమలులో ఉన్నాయి.
మలేషియా పార్లమెంటరీ వ్రాతపూర్వక సమాధానం ప్రకారం, ఆ దేశంలో ప్రస్తుతం 1,341 మంది మరణశిక్ష ఖైదీలు ఉన్నారు, ఇందులో 905 కేసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి శిక్ష విధించబడ్డాయి. ఈ ఏడాది మే నెలలో ఆఫ్రికా దేశం జాంబియా కూడా ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఉత్తర కొరియా మొదటి మహిళా విదేశాంగ మంత్రిగా చోయ్ సోన్-హుయ్
ఉత్తర కొరియా మొదటి మహిళా విదేశాంగ మంత్రిగా అనుభవజ్ఞురాలైన దౌత్యవేత్త చోయ్ సోన్-హుయ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉత్తర కొరియా ఉప విదేశాంగ మంత్రిగా పనిచేసిన చోయ్ సోన్, కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షిస్తున్న అధికార పార్టీ విదేశాంగ మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహించనున్నారు.
ప్రతి సిగరెట్టుపై వ్రాతపూర్వక హెచ్చరికను ప్రవేశపెట్టిన మొదటి దేశంగా కెనడా
ప్రతి సిగరెట్‌పై ముద్రించిన హెచ్చరికను ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశంగా కెనడా నిలిచింది. పొగాకు ప్యాకేజ్‌లపై ఫోటో హెచ్చరికలు అంతగా ప్రభావం చూపకపోవడంతో, పొగాకు ఉత్పత్తులపై ప్రజలలో మరింత అవగాహన కల్పించేందుకు ప్రతి సిగరెట్‌పై ముద్రించిన హెచ్చరికను ప్రవేశపెట్టనుంది.
గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయ్‌లాండ్
మెడికల్ అవసరాల కోసం గంజాయి సాగును చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయ్‌లాండ్ నిలిచింది. ఈ కొత్త నియమావళి ప్రకారం, వైద్యం, ఆహారం మరియు పానీయాలలో గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసింది. అలానే వీటి నిమిత్తం చేసే గంజాయి సాగు, వ్యాపారం కూడా చట్టబద్ధంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో గంజాయి ఉత్పత్తుల వినియోగం, ధూమపానం వంటి కార్యకలాపాల పై నిషేధాన్ని కొనసాగిస్తూనే భారీ జరిమానా విధించనుంది.
సోమాలియా ప్రధానమంత్రిగా హమ్జా అబ్ది బరే
సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహముద్, హమ్జా అబ్ది బరేను దేశ నూతన ప్రధానమంత్రిగా నియమించారు. 2019-20లో జుబాలాండ్ ఇండిపెండెంట్ బౌండరీస్ అండ్ ఎలక్టోరల్ కమీషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన హమ్జా, దానికి ముందు నాలుగేళ్లపాటు ఫెడరల్ ప్రభుత్వంలో పనిచేసిన సోమాలియా ఒగాడెన్ వంశం నుండి ఉద్భవించిన మొదటి ప్రధానమంత్రిగా నిలిచారు. గత నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మొహమ్మద్‌కు హమ్జా మద్దతు పలకడంతో ఆయనకు ప్రధానిమంత్రి పదవి దక్కింది.
కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో గుస్తావో పెట్రో విజయం
M-19 గెరిల్లా ఉద్యమం యొక్క మాజీ సభ్యుడు, లెఫ్టిస్ట్ గుస్తావో పెట్రో కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు, దీనికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో మిస్టర్ పెట్రో ఊహించని విధంగా దాదాపు 7,16,890 ఓట్ల తేడాతో నిర్మాణ రంగ దిగ్గజం రోడాల్ఫో హెర్నాండెజ్‌ను ఓడించారు.
అబార్షన్ రాజ్యాంగ హక్కును రద్దు చేసిన యుఎస్ సుప్రీం కోర్టు
దాదాపు 50 ఏళ్లుగా అమల్లో ఉన్న అబార్షన్ రాజ్యాంగ హక్కును యూఎస్ సుప్రీంకోర్టు తన సంప్రదాయవాద నిర్ణయంతో రద్దు చేసింది. దీని ద్వారా అబార్షన్‌ను నియంత్రించే అధికారం ప్రజలకు మరియు వారి ద్వారా ఎన్నికైన స్థానిక ప్రతినిధులకు తిరిగి అందజేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. దీనితో 1973 నాటి "రోయ్ vs వేడ్" రూపొందించిన ఈ చట్టాన్ని రద్దు చేసింది, ఈ చట్టం స్త్రీకి రాజ్యాంగ బద్దమైన గర్భస్రావ నియంత్రణను మరియు అబార్షన్ గోప్యత హక్కును కల్పిస్తుంది.
ప్రస్తుతం ఈ చట్టం రద్దుతో అబార్షన్ హక్కులను పరిరక్షించే చట్టాలు లేని అమెరికన్ రాష్ట్రాలలో అబార్షన్ నిషేధానికి దారి తీసే అవకాశం ఉంది. అలానే ఉదారవాద ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అబార్షన్ చట్టబద్ధంగా కొనసాగనుంది.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్ మార్కోస్
జూన్ 9వ తేదీన జరిగిన ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్, ఫిలిప్పీన్స్ 17వ అధ్యక్షుడిగా 30 జూన్ 2022 న ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన మాజీ నాయకుడు రోడ్రిగో డ్యుటెర్టే స్థానంలో ఫెర్డినాండ్ మార్కోస్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
48వ G7 శిఖరాగ్ర సమావేశాలు 2022
48వ G7 సమ్మిట్ 2022 జూన్ 26 నుండి 28 మధ్య జర్మనీలోని బవేరియన్ ఆల్ప్స్ యందు స్కాల్స్ ఎల్‌మావు (Schloss Elmau) కోటలో జరిగింది. ఈ ఏడాది జీ7 సమావేశాలకు జర్మనీ ఆతిథ్యం ఇచ్చింది. జర్మనీ గతంలో 2015లో బవేరియాలోని ష్లోస్ ఎల్మౌలో G7 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. స్కాల్స్ ఎల్‌మావు కోటకు చారిత్రాత్మక నేపథ్యం ఉంది. దీనిని 1914 మరియు 1916 మధ్యకాలంలో తత్వవేత్త జోహన్నెస్ ముల్లర్ మరియు వాస్తుశిల్పి కార్ల్ సాట్లర్లు నిర్మించారు.
అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడాలతో కూడిన జీ7 కూటమి యొక్క 2022 శిఖరాగ్ర సమావేశలకు, భారత్, అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్, దక్షిణాఫ్రికా నేతలను జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ప్రత్యేకంగా ఆహ్వానించరు. ఈ సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ వాతావరణం, ఇంధనం, ఆరోగ్యం' అంశంపై ప్రసంగించారు.
ఈ సంధర్బంగా పర్యావరణ అనుకూల విధానాల్లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా సౌరశక్తితో నడిచే ప్రపంచ తొలి విమానాశ్రయం భారత్‌లోనే ఉందని తెలుపుతూ, భారతీయ రైల్వే వ్యవస్థ ఈ దశాబ్దంలో 'నెట్ జీరో' స్థాయిని సాధిస్తుందని వెల్లడించారు.
జీ7 సదస్సు వేదిక వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ షోల్జ్, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లెయెన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాలతో ప్రత్యేకంగా మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఉన్న మార్గాలపై చర్చించారు.