తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 06 మార్చి 2023 | పోటీ పరీక్షల స్పెషల్
Telugu Current Affairs

తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 06 మార్చి 2023 | పోటీ పరీక్షల స్పెషల్

వీక్లీ కరెంట్ అఫైర్స్ 06 మార్చి 2023 తెలుగులో ఉచితంగా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల సౌలభ్యం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న తాజా సమకాలిన అంశాలను మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఈ సమాచారం మీ పోటీపరీక్షల సన్నద్ధతను మరింత మెరుగుపరుచుస్తుందని భావిస్తున్నాం.

Advertisement

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని 2 రోజుల భారత్ పర్యటన

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రెండు రోజుల భారత్ పర్యటన నిమిత్తం మార్చి 2, 3వ తేదీలలో ఇండియాను సందర్శించారు. ఈ పర్యటనలో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అదే సమయంలో ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో ఆమెతో పాటు ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ కూడా ఉన్నారు.

భారతదేశం మరియు ఇటలీల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమయి ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తియ్యాయి. ప్రధాన మంత్రి మెలోని పర్యటన భారతదేశం మరియు ఇటలీ మధ్య దీర్ఘకాల సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ పర్యటనలో ఆమె 8వ రైసినా డైలాగ్, 2023లో ముఖ్య అతిథిగా మరియు ముఖ్య వక్తగా పాల్గొంటారు. మెలోనీ గత ఏది అక్టోబర్ 22న ఇటలీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌ విజేతగా ఆస్ట్రేలియా

కేప్ టౌన్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది విజేతగా నిలిచింది. మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ఇది ఆరో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీ. 2009 లో ప్రారంభమైన ఈ టోర్నమెంటును ఇప్పటి వరకు 8 సార్లు నిర్వహించగా, 6 సార్లు ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలవగా, వెస్ట్ ఇండీస్ ఒకసారి, ఇంగ్లాండ్ జట్టు మరోసారి గెలుచుకుంది.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2023 కు దక్షిణాఫ్రికా ఆతిధ్యం ఇచ్చింది. 2024 లో జరిగే తర్వాత టోర్నమెంటుకు బంగ్లాదేశ్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంటును అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రెండేళ్లకోసారి నిర్వహిస్తుంది. ఐసీసీ ర్యాంకింగులో టాప్ 10 లో ఉండే జట్లు ఇందులో పాల్గొంటాయి.

కర్ణాటకలోని శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28న కర్ణాటకలోని శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దాదాపు 450 కోట్లతో ఈ కొత్త విమానాశ్రయం నిర్మించారు. విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ భవనం గంటకు 300 మంది ప్రయాణీకుల తాకిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఈ టెర్మినల్ భవనం పద్మాకారంలో (లోటస్) ఆకారంలో నిర్మించారు.

శివమొగ్గ విమానాశ్రయం కర్ణాటకలోని మల్నాడు ప్రాంతంలోని శివమొగ్గ మరియు ఇతర పొరుగు ప్రాంతాల నుండి కనెక్టివిటీ మరియు యాక్సెసిబిలిటీని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఇదే వేదిక ద్వారా ప్రధాని మోదీ శివమొగ్గలో రెండు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు, ఇందులో శివమొగ్గ - షికారిపుర - రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్ మరియు కోటేగంగూరు రైల్వే కోచింగ్ డిపో ఉన్నాయి.

హైదరాబాద్‌లో బయోఏషియా సమ్మిట్ 20వ ఎడిషన్

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ కన్వెన్షన్ 'బయోఏషియా సమ్మిట్' 20వ ఎడిషన్‌ ఫిబ్రవరి 24 -26 వ తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశాలను తెలంగాణ పరిశ్రమలు & ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. ఈ సమావేశాలు లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో నూతన ఆవిష్కరణలకు సంబంధించి నిర్వహిస్తారు.

ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని 'అడ్వాన్సింగ్ ఫర్ వన్ : షేపింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమానైజ్డ్ హెల్త్ కేర్ థీమ్‌తో నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ ఫోరమ్‌లో ప్రభుత్వ ప్రముఖులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు, సైంటిస్టులు, పరిశోధకులు మరియు ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఇతర ప్రతినిధులు చురుగ్గా పాల్గొంటారు.

భారత పర్యటనలో డెన్మార్క్ యువరాజు మరియు యువరాణి

డెన్మార్క్ యువరాజు ఫ్రెడరిక్ ఆండ్రే హెన్రిక్ క్రిస్టియన్ మరియు క్రౌన్ ప్రిన్సెస్ మేరీ ఎలిజబెత్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఫిబ్రవరి 26న ఇండియా చేరుకున్నారు. డానిష్ రాజకుటుంబం భారత్  రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌కర్ ఆహ్వానం మేరకు వారు భారత్‌లో పర్యటిస్తున్నారు.

ఈ పర్యటనలో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌కర్‌తో పాటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా కలిశారు. అలానే ఆగ్రాలోని తాజ్ మహల్ మరియు చెన్నైలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు.

ఎక్సర్‌సైజ్ డెసర్ట్ ఫ్లాగ్ VIIIలో పాల్గొన్న భారత వైమానిక దళం

110 మంది వైమానిక యోధులతో కూడిన భారత వైమానిక దళ బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ దహ్ఫ్రా ఎయిర్‌బేస్‌లో ఎక్సర్‌సైజ్ డెసర్ట్ ఫ్లాగ్ VIIIలో పాల్గొంది. ఈ ఎక్సర్‌సైజ్ ఫిబ్రవరి 27 నుండి 17 మార్చి 2023 వరకు జరగనుంది. ఈ వ్యాయామంలో ఐదు తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ మరియు రెండు C-17 విమానాలు పాల్గొన్నాయి. తేజస్ యుద్ధ విమానాలు భారతదేశం వెలుపల అంతర్జాతీయ ఫ్లయింగ్ వ్యాయామంలో పాల్గొనడం ఇదే మొదటిసారి.

ఎక్సర్‌సైజ్ డెసర్ట్ ఫ్లాగ్ అనేది బహుపాక్షిక వైమానిక వ్యాయామం. దీనిలో యూఏఈ, ఫ్రాన్స్, కువైట్, ఆస్ట్రేలియా, యూకే, బహ్రెయిన్, మొరాకో, స్పెయిన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు యూఎస్ఏ వైమానిక దళాలు పాల్గొంటాయి. వివిధ వైమానిక దళాల యొక్క ఉత్తమ అభ్యాసాల నుండి నేర్చుకోవడమే ఈ వ్యాయామం యొక్క ప్రధాన లక్ష్యం.

అస్సాంలో మొదటి 'చింతన్ శివిర్' ప్రారంభం

ఆయుష్ మంత్రిత్వ శాఖ తన మొదటి 'చింతన్ శివిర్'ను అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో ఫిబ్రవరి 27, 28వ తేదీల మధ్య నిర్వహించింది. ప్రారంభ సెషన్‌లో కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌తో పాటు ఆయుష్ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ పాల్గొన్నారు. ఆయుష్ & సాంప్రదాయ వైద్యానికి సంబంధించి ఇప్పటికే ఉన్న విధానాలు మరియు కార్యక్రమాలను మరింత ప్రభావితంగా ముందుకు తీసుకుపోయేందుకు దీనిని నిర్వహించారు.

ఈ మూడు  రోజుల సమావేశాల్లో మొదటి రోజు ఆయుష్‌లో డిజిటల్ ఆరోగ్యం మరియు సాంకేతికత, ఆయుష్ రీసెర్చ్, ఫ్యూచర్ స్ట్రాటజీ, ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ అనే అంశం, మూడవ రోజు ఆయుష్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ఇనిషియేటివ్స్, కెపాసిటీ బిల్డింగ్, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ వంటి అంశాలపై చర్చించారు.

లియోనెల్ మెస్సీకి ఉత్తమ ఫిఫా మెన్స్ ప్లేయర్ అవార్డు

అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ, బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ ప్లేయర్ అవార్డును దక్కించుకున్నాడు. ఫిబ్రవరి 27న పారిస్‌లో జరిగిన ది బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నాడు. పురుషుల ఫుట్‌బాల్‌లో ఆగస్టు 2021 నుండి డిసెంబర్ 2022 మధ్య మెస్సీ అత్యుత్తమ ప్రదర్శనకు ఈ అవార్డును అందించారు.

లియోనెల్ మెస్సీకి ఇది ఏడవ బెస్ట్ ఫిఫా ప్లేయర్ అవార్డు. స్పెయిన్ క్రీడాకారిణి అలెక్సియా పుటెల్లాస్ వరుసగా రెండో ఏడాది బెస్ట్ ఫిఫా విమెన్ ఫుట్‌బాల్ ప్లేయర్ అవార్డును గెలుచుకుంది. వార్షిక బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ అవార్డులు ఆ ఏడాది ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు అందిస్తారు. దీనికి సంబందించిన మొదటి అవార్డు ప్రదానోత్సవం 9 జనవరి 2017న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరిగింది.

నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో బోలా టినుబు విజయం

ఫిబ్రవరి 25న జరిగిన నైజీరియా అధ్యక్ష ఎన్నికలలో సీనియర్ రాజకీయ నాయకుడు బోలా టినుబు విజయం సాధించారు. ఎన్నికలలో టినుబు కేవలం 37% ఓట్లను మాత్రమే పొందగా, ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి అతికు అబూబకర్ 29% ఓట్లు, మూడవ స్థానంలో నిలిచిన ఓబీకి 25% ఓట్లు వచ్చాయి. 50% కంటే తక్కువ ఓట్లతో పదవీ బాధ్యతలు స్వీకరించిన నైజీరియా మొదటి అధ్యక్షుడిగా టినుబు అవతరించారు.

నైజీరియా ఆఫ్రికాలో అతి ఎక్కువ జనాభా మరియు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకలిగిన దేశంగా ఉంది. ఆఫ్రికా ఖండంలోని అగ్ర చమురు ఉత్పత్తిదారులలో ఒకటిగా ఉంది. దీని రాజధాని నగరం అబుజా, అధికారిక భాష ఇంగ్లీష్.

ఢిల్లీలో రైసినా డైలాగ్ యొక్క 8వ ఎడిషన్ ప్రారంభం

భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక వ్యూహలకు సంబంధించి నిర్వహించే భారతదేశ ప్రధాన సదస్సు, రైసినా డైలాగ్‌ను ఫిబ్రవరి 2న ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ముఖ్య అతిథిగా మరియు ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.

రైసినా డైలాగ్ 2023లో మంత్రులు, మిలిటరీ కమాండర్లు, పరిశ్రమల కెప్టెన్లు, సాంకేతిక నిపుణులు సహా 100 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మార్చి 02 నుండి మార్చి 04 మధ్య నిర్వహించే ఈ సమావేశలలో దేశ భౌగోళిక రాజకీయాలు మరియు భౌగోళిక వ్యూహలపై చర్చలు నిర్వహించారు.

నాగాలాండ్‌ తొలి మహిళా ఎమ్మెల్యేలుగా హేకానీ జఖాలు & సల్హౌటుయోనువో క్రూసే

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో మొట్టమొదటిసారి ఇద్దరు మహిళ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 సంవత్సరాల తర్వాత ఈ అద్భుతం చోటు చేసుకుంది.

ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన సల్హౌతుయోనువో క్రూసే మరియు హెకానీ జఖాలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన మొదటి మహిళా అభ్యర్థులుగా నిలిచారు.

ఇది వరకు నాగాలాండ్‌లో మహిళలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరు విజేతగా నిలవలేదు. అయితే1977లో రానో ఎమ్ షైజా లోక్‌సభకు ఎన్నికైన ఏకైక మహిళగా ఉన్నారు, అలానే 2022 వరకు ఫాంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభలో బాధ్యతలు నిర్వర్తించారు.

నాగాలాండ్ ఈశాన్య భారతదేశంలో మయన్మార్ సరిహద్దులో ఉన్న ఒక పర్వత రాష్ట్రం. ఇది భారతదేశంలోని ఉత్తరాన అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన అస్సాం సరిహద్దులుగా కలిగి ఉంది. దీని రాజధాని నగరం కొహిమా.

విశాఖపట్నంలో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS), 2023ని నిర్వహించింది. ఈ సదస్సును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సదస్సులో మొత్తం 13 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదన జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ రెండు రోజుల సదస్సులో మొత్తం 340కి పైగా అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు, వీటి ద్వారా రాబోయే కాలంలో రాష్ట్రంలో 20 రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగాలు రానున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు అనిల్ అంబానీ వంటి ప్రముఖ భారత్ వ్యాపారవేత్తలతో పాటుగా 25 దేశాల నుంచి వివిధ రంగాల పెట్టుబడిదారులు హాజరయ్యారు.

ప్రధాన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (2,35,000 కోట్లు), జేఎస్‌డబ్యూ గ్రూప్ (50,632 కోట్లు) ఏబీసీ లిమిటెడ్ (1.2 లక్షల కోట్ల), అరబిందో గ్రూప్ (10,365 కోట్లు), అదానీ గ్రీన్ ఎనర్జీ (21,820 కోట్లు), ఆదిత్య బిర్లా గ్రూప్ (9,300 కోట్లు), జిందాల్ స్టీల్ (7,500 కోట్లు) ఉన్నాయి.

ఆసియాలోనే అత్యంత పొడవైన సైకిల్ రేస్ శ్రీనగర్‌లో ప్రారంభం

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆసియాలోనే సుదీర్ఘమైన సైకిల్ రేస్ మార్చి 1న శ్రీనగర్‌లో ప్రారంభమైంది. ఒక మహిళతో సహా 29 మంది సైక్లిస్టులు తొలిసారిగా 3651 కిలోమీటర్ల ఈవెంట్‌ను పూర్తి చేసేందుకు బయలుదేరారు. ప్రపంచ అల్ట్రాసైక్లింగ్ అసోసియేషన్ ద్వారా ఆసియా అల్ట్రాసైక్లింగ్ ఛాంపియన్‌షిప్ హోదా పొందిన ఈ రేసును శ్రీనగర్‌ డివిజనల్ కమీషనర్ శ్రీ విజయ్ కుమార్ బిధూరి జెండా ఊపి ప్రారంభించారు.

భారతదేశంలో ఇప్పటి వరకు గరిష్టంగా 1000 కి.మీ రేసులు మాత్రమే జరిగాయి. ఈ రేసు 12 ప్రధాన రాష్ట్రాల మీదగా, మూడు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలను కవర్ చేస్తూ, దేశంలోని ఇరవైకి పైగా ప్రధాన నగరాల మీదగా జాతీయ రహదారి-44 వెంబడి కొనసాగనుంది. ఈ రేసు కన్యాకుమారిలో ముగుస్తుంది.

బిమ్స్‌టెక్ ఎనర్జీ పాలక మండలి తోలి సమావేశానికి భారతదేశం ఆతిథ్యం

ఫిబ్రవరి 27న జరిగిన బిమ్స్‌టెక్ (BIMSTEC) ఎనర్జీ పాలక మండలి మొదటి సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశం బెంగుళూరులోని షాంగి-లా హోటల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో భారతదేశం యొక్క “నైబర్‌హుడ్ ఫస్ట్” & “యాక్ట్ ఈస్ట్” విధానాలు హైలైట్ చేయబడ్డాయి. అలానే సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ రంగాలకు సంబంధించి చర్చలు జరిగాయి.

అదే సమయంలో భారతదేశంలో బిమ్స్‌టెక్ ఎనర్జీ సెంటర్ (బీఈసీ) ఏర్పాటుపై భారతదేశం ఒక ప్రదర్శన ఇచ్చింది. బెంగుళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిపిఆర్‌ఐ) ప్రాంగణంలో బిఇసిని ఏర్పాటు చేయనున్నట్లు సభ్య దేశాలకు తెలియజేసింది. అలానే సిఈఏ చైర్‌పర్సన్ ఘనశ్యామ్ ప్రసాద్ బిమ్స్‌టెక్ ఎనర్జీ సెంటర్‌కు మొదటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నామినేట్ చేసింది.

బిమ్స్‌టెక్ అనగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC) అని అర్ధం. ఇది ఏడు దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియా దేశాలతో కూడిన అంతర్జాతీయ సంస్థ. దీనిలో సభ్య దేశాలుగా బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయ్‌లాండ్‌లు ఉన్నాయి. ఇది బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా జూన్ 6, 1997న ఏర్పడింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది.

బీహార్‌లోని భోజ్‌పూర్‌లో రెండు రోజుల మిల్లెట్స్ మహోత్సవ్

బీహార్‌లోని భోజ్‌పూర్‌లో ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో రెండు రోజుల మిల్లెట్స్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శ్రీ పశుపతి కుమార్ పరాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మిల్లెట్‌లపై ప్రత్యేక దృష్టిని కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోని వాటాదారులను ఈ ఉమ్మడి వేదికపైకి తీసుకువచ్చారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవ కారణంగా, ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. మిల్లెట్స్‌కు విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకు భారత ప్రభుత్వం ఏడాది పొడుగునా అన్ని రాష్ట్రాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటితో పాటుగా ఈ ఏడాది నవంబర్ 3-5 తేదీల్లో మెగా-ఫుడ్ ఈవెంట్ - వరల్డ్ ఫుడ్ ఇండియా-2023ని న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించనుంది.

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2023

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ (NYPF) 4వ ఎడిషన్ 2023 మార్చి 2 న న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశాలు "ఐడియాస్ ఫర్ బెటర్ టూమారో : ఇండియా ఫర్ ది వరల్డ్" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. 2017 న ప్రధాన మంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో అందించిన ఆలోచన ఆధారంగా ఇది రూపొందించబడింది. మొదటి నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 లో నిర్వహించారు.

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అనేది భారతీయ విద్యార్థులకు, యువతకు పార్లమెంటరీ వ్యవస్థల పని తీరును తెలియజేసేది, ఈ కార్యక్రమం ఏటా జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో మూడు దశలలో నిర్వహిస్తారు. బ్రిటన్ నుండి భారతదేశానికి అధికార మార్పిడి, రాజ్యాంగ రూపకల్పన వంటి చారిత్రాత్మక సంఘటనలపై విద్యార్థులకు అవగహన కల్పిస్తారు.

Advertisement

Post Comment