Advertisement
తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : ప్రభుత్వ పథకాలు & పాలసీలు
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : ప్రభుత్వ పథకాలు & పాలసీలు

2023 జనవరి నెలకు సంబంధించిన సమకాలిన ప్రభుత్వ పథకాలు మరియు పాలసీల వివరాలు తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.

ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 ప్రారంభం

ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ (IYM) 2023 జనవరి 1న ప్రారంభమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2021లో దీని ఆమోదించింది. మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం 2023 ప్రతిపాదనను భారత ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది.

ఇందులో భాగంగా ఈ ఏడాది పొడుగునా కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు మరియు భారత రాయబార కార్యాలయాలలో మిల్లెట్ల కోసం ప్రమోషన్ మరియు వాటి ప్రయోజనాల గురించి వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారతదేశాన్ని 'గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్స్'గా ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఒక 'ప్రజా ఉద్యమం'గా మార్చాలనే ఆలోచనలో మోదీ ఉన్నారు.

సింధు లోయ నాగరికత కాలం నుండే 'మిల్లెట్లు' భారతదేశ ప్రధాన ఆహార పంటలుగా ఉన్నాయి. ప్రస్తుతం 130 కంటే ఎక్కువ దేశాలలో వీటిని పండిస్తున్నారు. మిల్లెట్‌లు ఆసియా మరియు ఆఫ్రికా దేశాల అంతటా సాంప్రదాయ ఆహారంగా దినుసులుగా పరిగణించబడుతున్నాయి. చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలుగా పిలుచుకునే మిల్లెట్లను జంతువుల మేత మరియు మానవ ఆహారం కోసం సాగు చేస్తున్నారు.

మిల్లెట్‌లలో జొన్నలు, రాగి (ఫింగర్ మిల్లెట్), కొర్ర (ఫాక్స్‌టైల్ మిల్లెట్), ఆర్కే (కోడో మిల్లెట్), సామ (చిన్న మిల్లెట్), బజ్రా (పెర్ల్ మిల్లెట్), చేనా/బార్ (ప్రోసో మిల్లెట్) మరియు సాన్వా వంటివి ఉన్నాయి.

కలసా-బండూరి ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

కర్నాటక యొక్క కలసా - బండూరి ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఉత్తర కర్ణాటకలోని బెలగావి, బాగల్‌కోట్, ధార్వాడ్ మరియు గడగ్ జిల్లాల పరిధిలో దాదాపు 14 కరువు పీడిత నగరాలకు తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి మహాదాయి నది నుండి నీటిని మళ్లించడం కోసం ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గోవా మరియు మహారాష్ట్ర ప్రభుత్వాల నుండి అభ్యంతరాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలలో దాదాపు కేంద్ర అధికార పార్టీయే ప్రభుత్వంలో ఉండటంతో ఈ ప్రాజెక్టు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) కి ఆమోదం లభించింది. ఉత్తర కర్ణాటకలోని పై నాలుగు జిల్లాలు రాజస్థాన్ తర్వాత దేశంలో అత్యంత పొడి ప్రాంతాలుగా ఉన్నాయి.

త్రిపురలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 'మిషన్-929'

భారత ఎన్నికల సంఘం, త్రిపురలో ఓటింగు శాతాన్ని పెంచేందుకు కొత్తగా మిషన్ - 929 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో త్రిపుర వ్యాప్తంగా తక్కువ పోలింగ్ నమోదుయ్యే దాదాపు 929 పోలింగ్ బూత్‌లలో 92 శాతం ఓటింగు పోల్ అయ్యేలా లక్ష్యం పెట్టుకున్నారు.

దీని కోసం సాధారణ ఓటరు అవగాహనా కార్యక్రమాలు కాకుండా, ఎన్నిక సిబ్బంది నేరుగా సీనియర్ సిటిజన్లు మరియు వైకల్యం ఉన్న వ్యక్తుల వద్దకు పోయి ఎన్నికలలో పాల్గొనేలా సహాయం అందిస్తారు.

ఆయుర్వేద నిపుణుల కోసం 'స్మార్ట్' కార్యక్రమం ప్రారంభం

ఆయుర్వేద కళాశాలలు మరియు ఆసుపత్రుల ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగాలలో శాస్త్రీయ పరిశోధనలను పెంచే లక్ష్యంతో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కొత్తగా SMART (స్కోప్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషనల్స్‌) కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమాన్ని జనవరి 2న నేషనల్ కమీషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (NCISM) ఛైర్మన్ వైద్య జయంత్ దేవపూజారి మరియు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్. రబీనారాయణ ఆచార్య ప్రారంభించారు.

ఈ ప్రోగ్రాం ద్వారా ఆస్టియో ఆర్థరైటిస్, ఐరన్ డెఫిషియెన్సీ అనీమియాతో సహా క్రానిక్ బ్రోన్కైటిస్, డిస్లిపిడెమియా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఊబకాయం, డయాబెటిస్ మెల్లిటస్, సోరియాసిస్, ఆందోళన, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి వ్యాధుల ఉత్తమ చికిత్స కోసం పరిశోధనలు చేస్తున్న ఆయుర్వేద నిపుణలకు ఆర్థిక సహాయం, ప్రోత్సాహం అందిస్తారు.

ఎలక్ట్రానిక్ సుప్రీం కోర్ట్ రిపోర్ట్స్ ప్రాజెక్టు ప్రారంభం

భారతీయ న్యాయవ్యవస్థను మరింతగా డిజిటలైజేషన్ చేయడానికి ఎలక్ట్రానిక్ సుప్రీం కోర్ట్ రిపోర్ట్స్ (e -SCR) ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ సుప్రీం కోర్టు తీర్పుల యొక్క డిజిటల్ వెర్షన్‌ను అందించడానికి చొరవగా ఉండనుంది.

ఈ పోజెక్టు ద్వారా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు మరియు సామాన్య ప్రజలకు సుమారు 34,000 తీర్పులను ఉచితంగా యాక్సెస్ చేయడానికి అవకాశం కల్పించనున్నారు. ఈ సమాచారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్, దాని మొబైల్ యాప్ మరియు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (NJDG) యొక్క తీర్పు పోర్టల్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది.

కేరళలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో పనిచేసే కార్మికుల కోసం, ప్రత్యేక సంక్షేమ నిధి బోర్డును అందుబాటులోకి తీసుకొచ్చిన దేశంలోని మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. దీనికి సంబంధించిన పథకానికి కేరళ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు అయ్యంకాళి పట్టణ ఉపాధి హామీ పథకం ద్వారా రిజిస్టర్ చేసుకున్న 18 నుండి 55 ఏళ్ళ కార్మికులు, 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్‌లతో సహా ఇతర ప్రత్యేక ప్రయోజనాలను అందుకుంటారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) 2005 లో అప్పటి మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం గ్రామీణ కార్మికుల సామాజిక భద్రతా మరియు పని చేసే హక్కుకి హామీ ఇవ్వడం లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకం పరిధిలో రిజిస్టర్ చేసుకున్న కార్మికులకు ఏడాదిలో 100 పని దినాలను కల్పిస్తారు.

విదేశాల వైద్య సహాయం కోసం ఆరోగ్య మైత్రి ప్రాజెక్టు

ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరోగ్య మైత్రి ప్రాజెక్టును ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభం వల్ల ప్రభావితమయ్యే అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం నుండి అవసరమైన వైద్య సామాగ్రిని అందిస్తారు.

వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ వర్చువల్ సమ్మిట్ ముగింపు సెషన్‌లో  ప్రసంగించిన మోదీ, భారతదేశం తన నైపుణ్యాన్ని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి 'సైన్స్ అండ్ టెక్నాలజీ చొరవ'ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

అలానే భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల కోసం 'గ్లోబల్-సౌత్ స్కాలర్‌షిప్‌లను' కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖల పరిధిలోని యువ అధికారులను అనుసంధానం చేయడానికి 'గ్లోబల్-సౌత్ యంగ్ డిప్లొమాట్స్ ఫోరమ్'ని ప్రతిపాదిస్తున్నాట్లు వెల్లడించారు.

అంధత్వ నియంత్రణ పాలసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్

అంధత్వ నియంత్రణ పాలసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. రాష్ట్రంలో అంధత్వ వ్యాప్తి రేటును తగ్గించే లక్ష్యంతో, రాజస్థాన్ ప్రభుత్వం 'దృష్టి హక్కు (రైట్ టు సైట్)' పేరుతొ నూతన పాలసీ తీసుకొచ్చింది. జనవరి 14న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దీనికి సంబందించిన పాలసీ డాక్యూమెంటును విడుదల చేశారు.

ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో దృష్టి లోపంతో బాధపడుతున్న 3 లక్షలకు పైగా ప్రజలలో వెలుగులు నింపనున్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలో కెరటోప్లాస్టి కేంద్రలను, కంటి బ్యాంకులను అందుబాటులో ఉంచనున్నారు. ఈ రంగంలో ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందుతున్న ప్రైవేట్ సంస్థలు, స్వచ్చంధ సంస్థలు, ధార్మిక సంస్థల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోనుంది.

నేత్ర దానంకు సంబంధించి రాష్ట్రంలో విస్తృత స్థాయిలో అవగహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేత్ర నిపుణులు, ఐ సర్జన్లకు, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందివ్వనున్నారు. దేశంలో అంధత్వం యొక్క ప్రాభల్యం 2020 లో 1.1 శాతంగా ఉంది. అంధత్వ నియంత్రణ విధానం ద్వారా దానిని 0.3 స్థానికి తగ్గించే ప్రయత్నం జరుగుతుంది.

స్టార్టప్‌ల మెంటర్‌షిప్ కోసం MAARG పోర్టల్ ప్రారంభం

స్టార్టప్‌ల మెంటర్‌షిప్ కోసం కొత్తగా MAARG (మెంటర్‌షిప్, అడ్వైజరీ, అసిస్టెన్స్, రెసిలెన్స్ & గ్రోత్) ప్లాట్‌ఫారమ్‌ను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జనవరి 16న నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో ప్రారంభించారు.

ఈ మార్గ్ ప్లాట్‌ఫారమ్‌ స్టార్టప్‌లు మరియు వ్యవస్థాపకుల మధ్య మెంటర్‌షిప్‌ను సులభతరం చేస్తుంది. ఇది రిమోట్ ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలకు కీలకమైన అవకాశాలను, సాంకేతిక సహాయంను అందించడంలో సహాయపడుతుంది. అలానే అర్హత కలిగిన స్టార్టప్‌లకు నిధుల సేకరణ, స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు ప్రాప్యత కల్పిస్తుంది. మార్గ్ పోర్టల్ : www.maarg.startupindia.gov.in

కంటి వెలుగు రెండో దశను ప్రారంభించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కంటి వెలుగు రెండవ దశ కార్యక్రమంను జనవరి 18న ఖమ్మంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద కంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌గా పరిగణించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. అలానే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు.

కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జనవరి 19 నుండి వచ్చే 100 రోజుల పాటు, దాదాపు 1500 వైద్య బృందాలతో ప్రత్యేక ఆరోగ్య శిబిరాల్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మొదటి దశ కార్యక్రమంను 827 ఆరోగ్య బృందాలు, ఎనిమిది నెలల పాటు నిర్వహించారు. మిగిలిన ప్రాంతాల్లో ప్రస్తుతం ఆరోగ్య శిబిరాలు ప్రారంభం కానున్నాయి.

కంటి వెలుగు పథకంను 15 ఆగష్టు 2018లో మెదక్ జిల్లా, మల్కాపూరులో ప్రారంభించారు. తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తారు.

నదులు ప్రాముఖ్యత హైలెట్ చేసేందుకు భారత్ ప్రవాహ్ కార్యక్రమం

సాహిత్యం, సంభాషణలు మరియు కమ్యూనికేషన్ ద్వారా సామాన్యుడి దైనందిన జీవితంలో నదులు, నౌకాశ్రయాలు మరియు షిప్పింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు 'భారత్ ప్రవాహ్- ఇండియా అలాంగ్ ఇట్స్ షొర్స్' అనే నూతన కార్యక్రమంను కేంద్ర  షిప్పింగ్ మరియు ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

షిప్పింగ్, నదులు, సముద్రాల గురించి విశాలమైన దృక్పథాన్ని సృష్టించే ఉద్దేశ్యంతో వివిధ రంగాలకు చెందిన వాటాదారులను ఒకచోట చేర్చడానికి రాబోయే కాలంలో భారత్ ప్రవాహ్ ఒక ఉమ్మడి వేదికగా మారనుంది. సముద్ర రంగానికి సంబంధించిన సవాళ్లు, విధాన సమస్యలు మరియు భవిష్యత్తు లక్ష్యాలను ఈ కార్యక్రమం హైలైట్ చేస్తుంది.

కేరళ విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు

కేరళ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ డిపార్ట్‌మెంట్ పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాలలో రుతుక్రమ సెలవులను అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వును జారీ చేసింది. అలానే 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు గరిష్టంగా 60 రోజుల వరకు ప్రసూతి సెలవులు మంజూరు చేసినట్లు కూడా వెల్లడించించి. దీనితో విద్యార్థినులకు రుతుక్రమ మరియు ప్రసూతి సెలవులు మంజూరు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది.

రుతుక్రమ సమయంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న మానసిక, శారీరక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని అన్ని యూనివర్సిటీల్లో ఈ రుతుక్రమ సెలవులు అమలు అయ్యేలా ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

165 వెటర్నరీ అంబులెన్స్‌లను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ పశువైద్య సంరక్షణను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 165 వెటర్నరీ అంబులెన్స్ యూనిట్లను జనవరి 25న జెండా ఊపి ప్రారంభించారు. డా. వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ పథకం రెండవ విడతలో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. మే 2021లో మొదటి బ్యాచ్‌లో భాగంగా 175 అంబులెన్స్ యూనిట్లను ప్రారంభించారు.

ఈ పథకంలో భాగంగా మొత్తం 340 వెటర్నరీ అంబులెన్స్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పశువైద్య అంబులెన్స్‌లు ప్రాథమిక వైద్య సేవలతో పాటుగా, గొర్రెలు, మేకలు, పశువులు మరియు పెంపుడు జంతువులకు చిన్న శస్త్రచికిత్సలు చేయడానికి అనుకూలంగా రూపొందించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రెండు వెటర్నరీ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతుంది.

అంబులెన్స్ సేవలతో పాటు, జిల్లా పశువైద్యశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు విజయవాడ, పులివెందులలో రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

రైల్వే సీట్ ఆక్యుపెన్సీని పెంచడానికి 'ఐడియాల్ ట్రైన్ ప్రొఫైల్'

రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్‌ సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ యొక్క భారీ ట్రయల్‌ కార్యక్రమాన్ని ఇండియన్ రైల్వే విజయవంతంగా పూర్తిచేసింది. దీనికి సంబంధించి మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సీట్ ఆక్యుపెన్సీని పెంచడానికి కొత్తగా 'ఆదర్శ రైలు ప్రొఫైల్'ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆదర్శ రైలు ప్రొఫైల్ అనేది ఒకరకమైన సీట్ కెపాసిటీ ఆప్టిమైజేషన్ డెసిషన్ సపోర్టు చేసే ఏఐ టెక్నాలజీ. ఇది ఒక రైలు ప్రయాణంకు సంబంధించి 5,000 కంటే ఎక్కువ టికెట్ మరియు క్లాస్ కాంబినేషన్‌లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతుంది. ఇది రైల్వే ప్రయాణికుల డిమాండ్ నమూనాను క్రమం తప్పకుండా విశ్లేషిస్తుంది. ఈ వివరాలు ఆధారంగా ఆయా తేదీలలో, ఆయా మార్గాలలో సీట్ల లభ్యతను పెంచడమో లేదా స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేయడమో జరుగుతుంది.

ఈ AI మాడ్యూల్‌ను సెంటర్ ఆఫ్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)కి చెందిన ఆర్ గోపాలకృష్ణన్ నేతృత్వంలోని అంతర్గత బృందం అభివృద్ధి చేసింది. రెండు సంవత్సరాల పాటు బృందం చేసిన విస్తృత ప్రయత్నం తర్వాత ఈ మాడ్యూల్ అందుబాటులోకి వచ్చింది.

Post Comment