2023 జనవరి నెలకు సంబంధించిన సమకాలిన బిజినెస్ మరియు ఎకానమీ అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఈఓగా అజయ్ కుమార్ శ్రీవాస్తవ
ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా అజయ్ కుమార్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. శ్రీవాస్తవ ప్రస్తుతం ఇదే బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అజయ్ కుమార్ 1991 లో అలహాబాద్ బ్యాంకు నుండి పీఓగా కెరీర్ ప్రారంభించారు.
భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా ఇండియన్ ఓవర్సీస్, 1937 లో ముత్తయ్య చిదంబరం చెట్టియార్ చే స్థాపించబడింది. ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం తమిళనాడు రాజధాని చెన్నైలో ఉంది. ఈ బ్యాంకు దాదాపు 3,214 దేశీయ శాఖలు, 4 విదేశీ శాఖలను కలిగి ఉంది.
2023-2025 కాలానికి ఉత్కర్ష్ 2.0ని ప్రారంభించిన ఆర్‌బిఐ
2023-2025 కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మధ్యస్థ-కాల వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్ ' ఉత్కర్ష్ 2.0 ' ను ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రారంభించారు. మొదటి దశ ఉత్కర్ష్ కార్యక్రమాన్ని జూలై 2019 లో ప్రారంభించారు. ఇది గుర్తించదగిన మైలురాళ్లను సాధించడంటంతో తాజాగా ఉత్కర్ష్ 2.0 రూపకల్పన చేశారు.
2023-25 కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మార్గనిర్దేశం చేసే ఉత్కర్ష్ 2.0లో ఆరు విజన్ స్టేట్‌మెంట్‌లతో పాటు కోర్ పర్పస్, వాల్యూస్ మరియు మిషన్ స్టేట్‌మెంట్‌ను పొందుపర్చారు. ఇందులో ఆర్‌బిఐ పనితీరు మెరుగుపర్చడం, ఆర్‌బిఐపై పౌరులు మరియు సంస్థల విశ్వాసాన్ని బలోపేతం చేయడం, జాతీయ మరియు అంతర్జాతీయంగా మెరుగైన ఔచిత్యం మరియు ప్రాముఖ్యతను పొందటం వంటివి ఉన్నాయి.
అలానే బ్యాంకింగ్ రంగంలో పారదర్శక, జవాబుదారీ మరియు నైతికతతో నడిచే అంతర్గత పాలనను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూలమైన ఉత్తమ డిజిటల్ మరియు భౌతిక మౌలిక సదుపాయాలు కల్పించడం, వినూత్నమైన, డైనమిక్ మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చుదిద్దడం వంటివి సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూడవ అతిపెద్ద ఆటో మార్కెట్‌గా భారతదేశం
భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచ మూడవ అతిపెద్ద ఆటో మార్కెట్‌గా అవతరించింది. గడిచిన ఏడాదిలో 4.25 మిలియన్ కొత్త వాహనాలను విక్రయించినట్లు నిక్కీ ఆసియా రిపోర్టు వెల్లడించింది. ఈ జాబితాలో చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా సురీందర్ చావ్లా
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా సురీందర్ చావ్లాను నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నియామకాన్ని ఆమోదించింది. సురీందర్ గతంలో ఆర్బీఎల్ బ్యాంకులో సేవలు అందించారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 2017లో న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. 22021 లో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుండి షెడ్యూల్డ్ బ్యాంక్ హోదాను దక్కించుకుంది.
మెటా ఇండియా గ్లోబల్ బిజినెస్ హెడ్‌గా వికాస్ పురోహిత్
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్) ఇండియా యొక్క నూతన గ్లోబల్ బిజినెస్ గ్రూప్ డైరెక్టర్‌గా టాటా CLiQ మాజీ సీఈఓ అయినా వికాస్ పురోహిత్‌ను నియమించింది. వికాస్ పురోహిత్ ప్రకటనకర్తలు మరియు యాడ్ ఏజెన్సీ భాగస్వాముల ద్వారా మెటా సంస్థ రెవిన్యూ పెంచేందుకు పని చేస్తాడు. దేశంలోని ప్రముఖ బ్రాండ్‌లు మరియు ఏజెన్సీలతో వ్యూహాత్మక వ్యాపార కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తాడు.
ఐఐటీ బెంగళూరు పూర్వ విద్యార్థి అయినా పురోహిత్, గతంలో ఆదిత్య బిర్లా, టాటా, అమెజాన్, రిలయన్స్ వంటి సంస్థలో పనిచేసారు. బిజినెస్, సేల్స్ మరియు మార్కెటింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగివున్నారు.
ఇండియా ఫాస్టెస్ట్ పేమెంట్ యాప్ పేరూప్ ప్రారంభం
భారతదేశపు అత్యంత వేగవంతమైన చెల్లింపు యాప్ పేరూప్ (PayRup) 9 జనవరి 2023 న ప్రారంభించబడింది. పేరూప్ వెబ్ 3.0 యొక్క అత్యాధునిక సాంకేతికత ద్వారా నిర్మించబడింది.
ఇది డిజిటల్ చెల్లింపుదారులకు అత్యుత్తమ, అధునాతన డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని అందిస్తుంది. పేరూప్ ద్వారా వినియోగదారులు అన్ని రకాల యుటిలిటీ బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. దీనిని బెంగుళూరుకు చెందిన మహదేవప్ప హలగట్టి రూపొందించారు.
కాగ్నిజెంట్ నూతన సీఈఓగా రవి కుమార్
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రవి కుమార్‌ను నియమించింది. ఇటీవలే పదవీ విరమణ చేసిన బ్రియాన్ హంఫ్రీస్ స్థానంలో ఆయన తక్షణమే బాధ్యతలు స్వీకరించనున్నారు. రవి కుమార్ అక్టోబర్ 2022 వరకు ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మరియు సీఓఓగా ఉన్నారు. ఇన్ఫోసిస్ యందు దాదాపు 20 ఏళ్ళు వర్క్ అనుభవం కలిగి ఉన్నారు.
కాగ్నిజెంట్ ఒక అమెరికన్ బహుళజాతి సమాచార సాంకేతిక మరియు కన్సల్టింగ్ సేవలు అందించే కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూజెర్సీలోని టీనెక్‌లో ఉంది. కాగ్నిజెంట్ బ్యాంకింగ్, హెల్త్ కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా పరిశ్రమల కోసం ఐటీ కన్సల్టింగ్ మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ సేవలను అందిస్తుంది.
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులు వయాకామ్18 సొంతం
వచ్చే 5 సంవత్సరాలకు ( 2023-27 ) సంబంధించి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (WIPL) మీడియా హక్కులను ప్రముఖ టెలివిజన్ సంస్థ వయాకామ్18 రూ. 951 కోట్లకు దక్కించుకుంది. దీనికి సంబంధించిన జరిగిన వేలంలో డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ, జీ వంటి సంస్థలు పోటీ పడగా, అత్యధిక బిడ్ వేచిన వయాకామ్18 ఈ హక్కులను దక్కించుకుంది. ఈ ఏడాది నుండి మహిళల ఐపిఎల్ ఐదు జట్లతో పూర్తిసాయిలో జరగనుంది.
త్వరలో స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ భరోస్
ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన మేడ్-ఇన్-ఇండియా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ 'భరోస్'ను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ మరియు అశ్విని వైష్ణవ్ విజయవంతంగా పరీక్షించారు. పూర్తి స్వదేశీ వనరులతో రూపొందించిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్, వినియోగదారులకు పూర్తి వ్యక్తిగత సమాచార భద్రతను కల్పిస్తుందని వెల్లడించారు.
లినక్స్ ఓపెన్‌సోర్సు సాఫ్ట్‌వేర్ ఆధారంగా రూపొందించబడిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ప్రధానంగా గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ యొక్క ఐఓఎస్ లకు పోటీగా రూపొందించబడింది. ఐఐటీ మద్రాస్, జండాక్ ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ త్వరలో వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుంది.
ఇండియా పోస్ట్ నుండి తరంగ్ మెయిల్ సర్వీస్ ప్రారంభం
ఇండియా పోస్ట్ సముద్ర మార్గం ద్వారా పార్సెల్‌లు మరియు మెయిల్‌లను డెలివరీ చేయడానికి తరంగ్ మెయిల్ సర్వీస్‌ను ప్రారంభించింది. సూరత్‌లోని హజీరా ఓడరేవులో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ జనవరి 20న జెండా ఊపి ప్రారంభించారు.
సౌరాష్ట్ర మరియు దక్షిణ గుజరాత్ నుండి ముంబై మధ్య వేగవంతమైన పోస్టల్ సేవల కోసం గోఘ-హజీరా మార్గంలో రోపాక్స్ ఫెర్రీ సేవలను ఉపయోగించుకోవాలని ఇండియా పోస్ట్ భావించింది. దీని ద్వారా డెలివరీ రవాణా సమయాన్ని 10-12 గంటల నుండి 3-4 గంటల వరకు తగ్గించడమే కాకుండా ఈ నగరాల మధ్య పారిశ్రామిక ప్యాకేజీల వేగవంతమైన కదలికలకు అవకాశం కల్పిస్తుంది.
ఇండియాలో 'షీ ఫీడ్స్ ది వరల్డ్ ' కార్యక్రమం ప్రారంభం
పెప్సికో ఫౌండేషన్, పెప్సికో మరియు కేర్ యొక్క దాతృత్వ విభాగం భారతదేశంలో ' షీ ఫీడ్స్ ది వరల్డ్ ' కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ కుటుంబాల ఆహార భద్రత మరియు పోషణను మెరుగుపరచడం లక్ష్యంగా గ్రామీణ మహిళా రైతులకు ఆహార ఉత్పత్తి సంబంధిత శిక్షణ అందించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వారిని భాస్వామ్యం చేస్తారు.
మొదటి విడతలో భాగంగా ఈ కార్యక్రమంను పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్ మరియు కూచ్ బెహార్ జిల్లాలలో అమలు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా 48 వేల మహిళల జీవితంలో నూతన వెలుగులు నింపనున్నారు.