Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ 03 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 03 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 03 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో ఐటీసి భాగస్వామ్య ఒప్పందం

ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ ఐటీసీ తన స్నాక్స్, పాస్తా మరియు నూడుల్స్ బ్రాండ్‌ల గ్లోబల్ ప్రచారం కోసం అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఒక ఏడాది వరకు అమలులో ఉంటుంది. భారతదేశంలో అర్జెంటీనా జట్టుకు ఉన్న బలమైన అభిమానుల సమూహం తమ ఆహార బ్రాండ్‌లను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని భావిస్తుంది.

ఐటీసీ లిమిటెడ్ కోల్‌కతా కేంద్రంగా ఉన్న దేశంలో ఒకానొక్క పెద్ద వ్యాపార సంస్థ. ఇది ఎఫ్ఎంసీజీ, హోటళ్లు, సాఫ్ట్‌వేర్, ప్యాకేజింగ్, పేపర్‌బోర్డ్‌లు, స్పెషాలిటీ పేపర్లు మరియు అగ్రిబిజినెస్ వంటి పరిశ్రమల్లో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీకి 5 విభాగాలలో 13 వ్యాపారాలు ఉన్నాయి. ఇది 90 దేశాలలో తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.

వైజాగ్‌లో ఎర్త్ మెటీరియల్స్‌పై ఐఐపీఈ నేషనల్ కాన్ఫరెన్స్

వైజాగ్‌లో ఎర్త్ మెటీరియల్స్‌పై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. ఈ సమావేశం ఫిబ్రవరి 1, 2 తేదీలలో విశాఖపట్నంలోని హోటల్ గ్రీన్ పార్క్‌ యందు జరిగింది. రెండు రోజుల జాతీయ సదస్సు శక్తి ప్రయోజనాల కోసం భూమి పదార్థాల అన్వేషణ, అభివృద్ధి మరియు వినియోగంపై దృష్టి సారించింది. హైడ్రోకార్బన్లు, అణు ఇంధనాలు, వైట్ హైడ్రోజన్ మరియు భూఉష్ణ శక్తితో సహా ఇంధన ప్రయోజనాల కోసం ఉపయోగించే సహజ వనరుల యొక్క వివిధ అంశాలను ఈ సమావేశం ప్రస్తావించింది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 2016లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ క్రింద పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడింది. ఇది తర్వాత జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించబడింది. ఇది ఇంధన రంగంకు సంబందించిన పరిశోధనా సంస్థ. పెట్రోలియం మరియు ఇంధన రంగాలలో పరిమాణాత్మక మరియు గుణాత్మక అంతరాన్ని తీర్చడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఉత్పత్తి చేయడానికి ఇది కట్టుబడి ఉంది.

డేవిస్ కప్ జట్టుకు ఆతిథ్యం ఇచ్చిన ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్

డేవిస్ కప్ కోసం 60 ఏళ్ల తర్వాత తొలిసారి పాకిస్థాన్‌కు వెళ్లిన జాతీయ డేవిస్ కప్ జట్టుకు ఆ దేశంలోని భారత హైకమిషన్ ఆతిథ్యం ఇచ్చింది. పాకిస్థాన్‌లోని భారత హైకమిషన్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళ గీతికా శ్రీవాస్తవ , భారత ఆటగాళ్లు మరియు అధికారులకు సాదర స్వాగతం అందించారు.

1964 తర్వాత పాకిస్థాన్‌లో భారత్ డేవిస్ కప్ టై ఆడడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో భారత్ 4-0తో పాకిస్థాన్‌ను ఓడించి, ప్రపంచ గ్రూప్ యందు అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. డేవిస్ కప్ 2024 వరల్డ్ గ్రూప్ I ప్లే-ఆఫ్‌ గేమ్ ఫిబ్రవరి 3 మరియు 4 తేదీల్లో ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ యందు నిర్వహించబడ్డాయి.

పురుషుల టెన్నిస్‌లో డేవిస్ కప్ అనేది ఒక ప్రీమియర్ ఇంటర్నేషనల్ టీమ్ ఈవెంట్. ఇది అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యచే నిర్వహించబడుతుంది. దీనిలో 155 దేశాల టెన్నిస్ జాతీయ క్రీడాకారులు జట్టుగా ప్రతి సంవత్సరం పోటీ పడతారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక జట్టు క్రీడా పోటీగా గుర్తింపు పొందింది. ఇది 1900 లో గ్రేట్ బ్రిటన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఒక సవాలుగా ప్రారంభమైంది. ఈ ప్రపంచ టెన్నిస్ టోర్నమెంట్ యందు భారత్ 1966, 1974, 1987 లలో రన్నర్స్-అప్ జట్టుగా నిలిచింది.

భారత నౌకాదళంలో అధికారికంగా చేరిన ఐఎన్ఎస్ సంధాయక్

భారత నావికాదళానికి చెందిన మొదటి సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరి 3న వైజాగ్‌లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కమీషన్ వేడుకల్లో భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్‌ కూడా పాల్గొన్నారు. ఐఎన్ఎస్ సంధాయక్ 1981 నుండి 2021 వరకు భారత నౌకాదళంలో సేవలందించింది. పాత నౌక విరమణ తర్వాత అదే పేరుతొ ఈ కొత్త వెర్షన్ ప్రారంభించబడింది. ఇది తూర్పు నౌకాదళ కమాండ్ కింద భారత నౌకాదళంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్‌గా పనిచేస్తుంది.

ఐఎన్ఎస్ సంధాయక్ అనేది కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్  భారత ప్రభుత్వం ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న నాలుగు అధునాతన సర్వే వెసెల్స్‌లో మొదటిది. ఇది డిసెంబర్ 5, 2021న సముద్ర ట్రయల్స్ కోసం ప్రారంభించబడింది. డిసెంబర్ 4, 2023న భారత నౌకాదళానికి అందించబడింది. ప్రస్తుతం ఇది అధికారంగా సేవలలో చేరనుంది. దీనిని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ రూపొందించింది. ఈ సంస్థ ప్రస్తుతం మరో మూడు సర్వే నౌకలను అభివృద్ధి చేస్తుంది.

ఐఎన్ఎస్ సంధాయక్ తీర మరియు లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, శోధన మరియు రెస్క్యూ, సముద్ర పరిశోధన మరియు ఆసుపత్రి నౌకగా ఉపయోగపడుతుంది. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్‌గా భారతదేశం యొక్క పాత్రను మరింత బలోపేతం చేస్తుందని మరియు శాంతి & భద్రతను కాపాడుకోవడంలో భారత నౌకాదళానికి సహాయపడుతుందని భారత నౌకాదళం పేర్కొంది.

విలువైన కోల్టన్ నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించిన కెన్యా

కెన్యా ఇటీవల తన సరిహద్దుల్లో విలువైన కోల్టన్ నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. కెన్యా తన సరిహద్దుల్లో కోల్టన్‌ను కనుగొనినట్లు అధికారికంగా ప్రకటించడం ఇదే మొదటిసారి. కోల్టన్ అనేది స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉపయోగించే విలువైన ఖనిజం.

కెన్యాలో అత్యంత విలువైన ఖనిజాల జాడలు ఉన్నట్లు మైనింగ్ అధికారులు గతంలో సూచనప్రాయంగా ప్రకటించారు, అయితే తాజాగా కెన్యా మైనింగ్, బ్లూ ఎకానమీ మరియు సముద్ర వ్యవహారాల మంత్రి సలీం మ్వుర్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దేశంలోని ఆరు కౌంటీలలో ఖనిజ నిక్షేపాలు కనుగొనబడినట్లు తెలిపారు, అయితే వాటి విలువ ఇంకా నిర్ణయించబడలేదుని పేర్కొన్నారు.

కోల్టాన్ తరచుగా మెటాలిక్ టాంటాలమ్‌గా శుద్ధి చేయబడుతుంది, ఇది కెపాసిటర్‌లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఒక ఉష్ణ-నిరోధక పొడి, ఇది ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. కోల్టాన్ ధర ఎంత టాంటాలమ్‌ను కలిగి ఉంటుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది, అయితే సగటున ఒక కిలోగ్రాము అరుదైన ధాతువు $48 విలువ ఉంటుంది.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రపంచంలోని 70% కంటే ఎక్కువ కోల్టన్ నిల్వలను కలిగి ఉంది, ఇది దశాబ్దాలుగా ఆ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో హింసాత్మక సంఘర్షణకు ఆజ్యం పోసింది. కెన్యాలో కనుగొనబడిన కోల్టన్ నిక్షేపాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 పేరుతో భారతదేశపు అతిపెద్ద మరియు మొట్టమొదటి మొబిలిటీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఈవెంట్ యందు 50 పైగా దేశాల నుండి 800 మందికి పైగా ఎగ్జిబిటర్‌లు పాల్గొన్నారు.ఈ ఎక్స్‌పోలో 600 కంటే ఎక్కువ ఆటో కాంపోనెంట్ తయారీదారుల ఉనికితో పాటుగా, 28కి పైగా వాహన తయారీదారులు కూడా పాల్గొంటున్నారు. అలానే 13 గ్లోబల్ మార్కెట్‌ల నుండి 1000కి పైగా బ్రాండ్‌లు ఈ ఈవెంట్‌లో తమ ఉత్పత్తులు, సాంకేతికతలు మరియు సేవలను ప్రదర్శించాయి.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 మొబిలిటీ మరియు ఆటోమోటివ్ వాల్యూ చైన్‌లలో భారతదేశ సామర్థ్యాలను ప్రదర్శించింది. ఈ కార్యక్రమం సంబంధిత పరిశ్రమ ప్రదర్శనలు, సమావేశాలు, కొనుగోలుదారు-విక్రయదారుల సమావేశాలు, రాష్ట్ర సెషన్‌లు, రహదారి భద్రతా పెవిలియన్ మరియు గో-కార్టింగ్ వంటి పబ్లిక్-సెంట్రిక్ ఆకర్షణలకు వేదిక అందించింది. ఇది భారతదేశంలోని మొట్టమొదటి గ్లోబల్ మొబిలిటీ షో. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో తాజా పురోగతులను ప్రదర్శించడం మరియు చలనశీలత యొక్క భవిష్యత్తుపై చర్చలకు వేదికను అందించడం ఈ ఈవెంట్ లక్ష్యం.

ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే, కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మరియు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 ప్రారంభోత్సవంలో పాల్గొన్న గోయల్, 2030 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌గా అవతరించవచ్చు అని  అన్నారు. ఈ ఈవెంట్ యందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రసంగించారు. రాబోయే 25 ఏళ్లలో మొబిలిటీ రంగంలో అపారమైన అవకాశాలను హైలైట్ చేస్తూ, ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి పరిశ్రమ వేగంగా రూపాంతరం చెందాలని ప్రధాని మోదీ కోరారు.

మొబిలిటీ సెక్టార్ అవసరాలలో టెక్నికల్ వర్క్‌ఫోర్స్ మరియు శిక్షణ పొందిన డ్రైవర్ల ఆవశ్యకతను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ఈ పరిశ్రమకు మానవ వనరులను అందిస్తున్న దేశంలోని 15 వేలకు పైగా ఐటీఐలు ఉన్నాయని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌ను సృష్టించేందుకు ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. ఫ్రేమ్ పథకం రాజధానితో పాటు అనేక ఇతర నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులకు దారితీసిందని ఆయన చెప్పారు.

ఆటో మరియు ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందున భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరిస్తుంది, ”అని ప్రధాని మోదీ అన్నారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకం వంటి కార్యక్రమాల ద్వారా ఈ పరిశ్రమ కోసం ప్రభుత్వం ₹ 25,000 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

2024ని నేవల్ సివిలియన్స్ సంవత్సరంగా ప్రకటించిన నేవీ

నావికాదళ పౌరుల పరిపాలన, సామర్థ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి భారత నావికాదళం 2024ని 'నేవల్ సివిలియన్స్ సంవత్సరం'గా ప్రకటించింది. నేవల్ సివిలియన్ సిబ్బంది భారతీయ నావికాదళం యొక్క మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు మూడింట ఒకవంతు ఉన్నారు. వీరు భారతీయ నేవీలోని అన్ని డొమైన్‌లలో నౌకాదళ వృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నారు.

వీరు నావల్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్, డాక్‌యార్డ్‌లు, మెటీరియల్ ఆర్గనైజేషన్స్, ఎన్ఎడిలు, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్‌లు, ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ల నిర్మాణ కార్యాచరణలో సేవలు అందిస్తున్నారు. పౌర సిబ్బందిలో సంస్థాగత సామర్థ్యం మరియు సంతృప్తి స్థాయిలను పెంపొందించడానికి నేవీ గతంలో అనేక కార్యక్రమాలు రూపొందించింది. మరియు అమలు చేయబడ్డాయి. భారత నావికాదళం ఎల్లప్పుడూ వారి విశ్వసనీయమైన, సంఘటిత సహకారం కోసం వారికి శిక్షణ, సంక్షేమం వంటి ప్రోత్సాహం అందిస్తుంది.

37 వ సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళా ప్రారంభం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో 37 వ సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళాను ఫిబ్రవరి 2, 2024న ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రాఫ్ట్ ఫెయిర్. దీనిని హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.

ఈ ఏడాది ఈ మేళాకు టాంజానియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది ఈ వేడుక ఫిబ్రవరి వరకు నిర్వహిస్తారు. సూరజ్‌కుండ్ మేళా మన సంస్కృతీ వైవిధ్యం, సంప్రదాయాల పండుగ. ఇది కళ మరియు క్రాఫ్ట్ ప్రేమికులతో హస్తకళాకారులను కనెక్ట్ చేయడానికి కూడా వేదికను కల్పిస్తుంది.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, సూరజ్‌కుండ్‌ ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్స్‌ మేళా మన సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెబుతున్నదన్నారు. కళ మరియు క్రాఫ్ట్ అనేవి సరిహద్దులను దాటి అవగాహన వంతెనలను నిర్మిస్తాయని రాష్ట్రపతి అన్నారు. కళాకారులు మరియు హస్తకళాకారులను మానవత్వం యొక్క సృజనాత్మక రాయబారులుగా అభివర్ణించారు.

Post Comment