తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : జాతీయ అంశాలు
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : జాతీయ అంశాలు

2023 జనవరి నెలకు సంబంధించిన సమకాలిన జాతీయ అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.

వింటేజ్ వాహనాల కోసం ఒడిశాలో ప్రత్యేక రిజిస్ట్రేషన్

పాతకాలపు వాహనాలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా అవతరించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భారతదేశంలోని పాత వాహనాల వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి, పాతకాలపు మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎటువంటి మార్పులు చేయకుండా, రిజిస్ట్రేషన్ నమోదు అయ్యి 50 ఏళ్ళు పూర్తియిన వాహనాలను వింటేజ్ వాహనాలుగా పరిగణిస్తారు.

దీని కోసం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ నియమాలలో ప్రత్యేక ప్రొవిజిన్ ఏర్పాటు చేసారు. ఇది 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పాతకాలపు ద్వి మరియు నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికీ కొత్తగా ప్రారంభించిన భారత్ సిరీస్ నెంబర్ ప్లేట్ (BH సిరీస్) తో వాహన రిజిస్ట్రేషన్ నమోదు చేస్తారు.

ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ నాయకత్వ హోదాలో భారత్

థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌ ప్రధాన కేంద్రంగా సేవలు అందిస్తున్న ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ (APPU) నాయకత్వాన్ని జనవరి 2023 నుండి భారతదేశం స్వీకరించనుంది. గత సెప్టెంబర్ 2022లో బ్యాంకాక్‌లో జరిగిన 13వ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నాలుగేళ్ళ కాలానికి భారత్ ఈ నాయకత్వ బాధ్యతలు వహించనుంది.

దీనితో ఈ నాలుగేళ్ళ కోసం పోస్టల్ సర్వీసెస్ బోర్డు మాజీ సభ్యుడు, డాక్టర్ వినయ ప్రకాష్ సింగ్‌ను పోస్టల్ యూనియన్ సెక్రటరీ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది. పోస్టల్ సెక్టరులో ఒక అంతర్జాతీయ సంస్థకు భారత్ నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి.

ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ అనేది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 32-సభ్య దేశాలకు చెందిన ఒక అంతర్-ప్రభుత్వ సంస్థ. ఇది ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. సభ్య దేశాల మధ్య తపాలా సంబంధాలను విస్తరించడం, సులభతరం చేయడం, మెరుగుపరచడం మరియు పోస్టల్ సేవల రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడం కోసం దీనిని 1982లో ఏర్పాటు చేసారు.

సియోమ్ వంతెనను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పూర్తి చేసిన అరుణాచల్ ప్రదేశ్‌లోని సియోమ్ వంతెనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. దాదాపు 724 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన సియోమ్ వంతెనతో పాటుగా మరో 27 ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు లడఖ్ నుండి అరుణాచల్ వరకు చైనా సరిహద్దుల వెంబడి భారతదేశ సరిహద్దు మౌలిక సదుపాయాలను భారీగా పెంచనున్నాయి.

అలాంగ్-యింకియాంగ్ రోడ్‌లోని ఈ సియోమ్ వంతెన, భారత సైనికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సహాయ పడనుంది. అలానే హోవిట్జర్‌ల వంటి భారీ పరికరాలు మరియు మెకనైజ్డ్ వాహనాలను ఎగువ సియాంగ్ జిల్లా, ట్యూటింగ్ మరియు యింకియాంగ్ ప్రాంతాలకు వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి (LAC) ఫార్వార్డ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

అహ్మదాబాద్-ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ పేరు మార్పు

అహ్మదాబాద్ మరియు ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు పేరును అక్షరధామ్ ఎక్స్‌ప్రెసుగా మార్చనున్నట్లు కేంద్ర  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థకు చెందిన ప్రముఖ గుజరాతీ అద్యాత్మక గురువు ప్రముఖ్ స్వామి మహారాజ్ యొక్క శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ఆయన గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రముఖ్ స్వామి మహారాజ్, భగవాన్ స్వామినారాయణ్ యొక్క గుణతీత్ గురువుల వారసత్వంలో ఐదవ ఆధ్యాత్మిక వారసుడు. ఈయన 7 డిసెంబర్ 1921న ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 2016లో కాలం చెందారు.

నేషనల్ జీనోమ్ ఎడిటింగ్ & ట్రైనింగ్ సెంటర్‌ ప్రారంభం

పంజాబ్‌లో దేశంలో మొట్టమొదటి నేషనల్ జీనోమ్ ఎడిటింగ్ & ట్రైనింగ్ సెంటరును కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జనవరి 5న ప్రారంభించారు. దీనిని మొహాలీలోని నేషనల్ అగ్రి-ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (NABI) యందు ఏర్పాటు చేశారు.

నేషనల్ జీనోమ్ ఎడిటింగ్ & ట్రైనింగ్ సెంటర్ (NGETC) వివిధ జీనోమ్ ఎడిటింగ్ పద్ధతులను అనువర్తించడానికి, ప్రాంతీయ జీనోమ్ ఎడిటింగ్ అవసరాలను తీర్చడానికి జాతీయ వేదికగా ఉపయోగపడనుంది. అలానే యువ జన్యు పరిశోధకులకు శిక్షణ మరియు మార్గనిర్దేశాన్ని అందించేందుకు సహాయపడనుంది. మధ్యవర్తిత్వ జన్యు సవరణ ద్వారా మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను అభివృద్ధి చేయొచ్చు.

ప్రపంచ మొట్టమొదటి తాళపత్ర మాన్యుస్క్రిప్ట్ మ్యూజియం ప్రారంభం

కేరళ రాజధాని తిరువనంతపురంలో ప్రపంచంలోనే మొట్టమొదటి పామ్ లీఫ్ మాన్యుస్క్రిప్ట్ మ్యూజియంను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ ఆర్కైవ్స్‌లోని 300 ఏళ్ల నాటి కాంప్లెక్స్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్‌లో దీనిని ఏర్పాటు చేసారు.

ఇందులో దాదాపు 187 మాన్యుస్క్రిప్ట్‌లు, కేరళ మూలికా వైద్యానికి సంబంధించిన పురాతన పత్రాలు మరియు ఈ ప్రాంతాన్ని పాలించిన ట్రావెన్‌కోర్ పాలనకు చెందిన రాజుల ఆర్థిక మరియు పరిపాలన విశేషాలు ఇందులో ప్రదర్శనకు ఉంచారు.

భారతీయ రైల్వేలలో పొడవైన పూర్తి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్

ఘజియాబాద్ - పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రైల్వే సెక్షన్ దేశంలోనే అత్యంత పొడవైన పూర్తి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ABS) విభాగంగా మారినట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ప్రయోగరాజ్ డివిజన్ పరిధిలోని ఈ 762 కిలోమీటర్ల ఈ రద్దీ మార్గంలో మరిన్ని రైళ్లను నడపడానికి మరియు లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా రైళ్లు సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకునేందుకు అవకాశం లభిస్తుంది.

భారతదేశ అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

2022లో భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) ట్రాకర్ నివేదిక ప్రకారం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిర్దేశించిన సురక్షిత పరిమితి (40 ug/m3) కంటే 2.5 రెట్లు అధిక కాలుష్యం నమోదు అయినట్లు వెల్లడించింది.

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ట్రాకర్ యొక్క తాజా రిపోర్టు, 57 భారతీయ నగరాల్లోని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్‌ల (CAAQMS) డేటా ఆధారంగా రూపొందించబడింది. ఈ రిపోర్టు ప్రకారం ఈ 10 కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ, ఫరీదాబాద్, ఘజియాబాద్, పాట్నా, ముజఫర్‌పూర్, నోయిడా, మీరట్, గోవింద్‌గర్, గయా మరియు జోధాపూర్ ఉన్నాయి.

ముంబైలో వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ 14వ ఎడిషన్

వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ 14వ ఎడిషన్, నవీ ముంబైలోని సిడ్కో ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫిబ్రవరి16-18 తేదీల మధ్య జరగనుంది. భారతీయ మసాలా దినుసులకు సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో, వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ సమావేశాలను నిర్వహిస్తుంది.

ప్రపంచ 'స్పైస్ బౌల్'గా పేరుగాంచిన భారతదేశం అనేక నాణ్యమైన, అరుదైన మరియు ఔషధ సుగంధాలను ఉత్పత్తి చేస్తుంది. స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం కొచ్చిన్ (కేరళ) లో ఉంది.

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నూతన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 15న వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలో ఎనిమిదివ వందే భారత్ రైలు. దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ - వారణాసి మధ్య ప్రారంభించారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వే నడుపుతున్న ప్రతిష్టాత్మక ఆధునిక సెమీ-హై స్పీడ్ రైలుగా పరిగణించ బడుతుంది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తుంది. ఇవి గరిష్టంగా గంటకు 160 కిమీ వేగంతో నడుస్తాయి.

  1. న్యూఢిల్లీ - వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (759 కిమీ)
  2. న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (655 కిమీ)
  3. ముంబై సెంట్రల్ - గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (522 కిమీ)
  4. న్యూఢిల్లీ - అంబ్ అందౌర వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (412 కిమీ)
  5. చెన్నై సెంట్రల్ - మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (496 కిమీ)
  6. బిలాస్‌పూర్ - నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (412 కిమీ)
  7. హౌరా - న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (561 కిమీ)
  8. విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (698 కిమీ)

2 Comments

Post Comment