Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ 06 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 06 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 06 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్ 2024

బ్రాండ్ ఫైనాన్స్ ప్రచురించిన బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్ 2024 వెలువడింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార బ్రాండ్ మరియు వ్యాపార విలువలను సృష్టించడంలో రాణిస్తున్న సీఈఓలను గుర్తిస్తుంది. 2024 ఏడాదికి గాను చైనీస్ వ్యాపారవేత్త, టెన్సెంట్ సీఈఓ పోనీ మా హువాటెంగ్, 81.6 స్కోరుతో అగ్రస్థానం దక్కించుకున్నారు. వుయ్ చాట్ బ్రాండ్ యొక్క అసాధారణమైన నాయకత్వం కోసం హువాటెంగ్ అగ్రస్థానాన్ని పొందారు.

ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ & ఎండీ ముఖేష్ అంబానీ దేశంలో అగ్రస్థానంలో దక్కించుకోవడంతో పాటుగా, ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచారు. ఆయన మైక్రోసాఫ్ట్ యొక్క సత్య నాదెళ్ల, గూగుల్ యొక్క సుందర్ పిచాయ్, ఆపిల్ యొక్క టిమ్ కుక్ మరియు టెస్లా యొక్క ఎలోన్ మస్క్ వంటి ప్రపంచ కార్పొరేట్ లీడర్‌లతో పాటు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ వంటి తోటి భారతీయుల కంటే ముందు వరుసలో స్తానం దక్కించుకున్నారు.

బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్ 2024 యొక్క టాప్ 10 ర్యాంకింగులో మొత్తం 3 మంది భారతీయ వ్యాపారవేత్తలు ఉండగా, అదనంగా భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, లీనా నాయర్ మరియు శంతను నారాయణ్ కూడా ఇందులో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎన్‌విడియా కార్పొరేషన్ సీఈఓ జెన్సన్ హువాంగ్, ఈ ఏడాది మూడవ స్థానంలో నిలిచారు. ప్రముఖ ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ చానెల్ సీఈఓ లీనా నాయర్ మహిళలలో అగ్రశ్రేణి మహిళా బ్రాండ్ గార్డియన్‌గా నిలిచారు.

  1. హువాటెంగ్ మా: 81.6 (వుయ్ చాట్)
  2. ముఖేష్ అంబానీ: 80.3 (రిలయన్స్ ఇండస్ట్రీస్)
  3. జెన్సన్ హువాంగ్: 79.9  (ఎన్‌విడియా కార్పొరేషన్)
  4. టిమ్ కుక్: 79.3 (ఆపిల్)
  5. నటరాజన్ చంద్రశేఖరన్: 79.2 (టాటా సన్స్)
  6. అనీష్ షా: 78 (మహీంద్రా గ్రూప్)
  7. శంతను నారాయణ్: 77.9 (అడోబ్ ఇంక్)
  8. సుందర్ పిచాయ్: 77.6 (గూగుల్)
  9. సత్య నాదెళ్ల: 77.2 (మైక్రోసాఫ్ట్)
  10. లీనా నాయర్: 76.1 (చానెల్)

బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్ అనేది వ్యాపారాలు మరియు పెట్టుబడిదారులకు ఒక విలువైన వనరు. ఇది సీఈఓ లను విజయవంతమైన బ్రాండ్ సంరక్షకులుగా మార్చే లక్షణాలపై అంతర్దృష్టులను అందిస్తుంది. ఇది వ్యాపారంలో స్థిరమైన వృద్ధిని సాధించగల నాయకులను గుర్తించడంలో వ్యాపారాలకు సహాయపడుతుంది.

ఈ ఏడాది టాప్ 100 సీఈఓల నేతృత్వంలోని బ్రాండ్‌ల విలువ సగటున 10% వృద్ధి చెందగా, టాప్ టెన్ సీఈఓల నేతృత్వంలోని బ్రాండ్‌ల విలువ సగటున 40% వృద్ధిని సాధించినట్లు ఈ నివేదిక తెలిపింది. అలానే టాప్ 100 సంస్థల సీఈఓల సగటు పరిహారం గత సంవత్సరం కంటే 9% పెరిగినట్లు, అత్యధిక పెరుగుదల 26% ఉన్నట్లు నివేదించింది. సుందర్ పిచాయ్‌ అత్యధిక సంపాదనపరుడిగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది.

1,000 మంది వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులు మరియు వినియోగదారులపై చేసిన సర్వే ఆధారంగా ఈ సూచిక రూపొందించబడింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రతి సంవత్సరం ఈ సూచిక ప్రచురించబడుతుంది.

దక్షిణ కొరియా, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందంపై సంతకం

దక్షిణ కొరియా మరియు సౌదీ అరేబియాలు రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. సౌదీ అరేబియా ఫిబ్రవరి 4-8 తేదీల్లో వరల్డ్ డిఫెన్స్ షోకు ఆతిథ్యం ఇచ్చిన సందర్భంగా, రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి రెండు దేశాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి. ఇరు రెండు దేశాలు గత నవంబర్ నెలలోనే $3.2 బిలియన్ల ఆయుధ సరఫరాకు సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా దక్షిణ కొరియా, సౌదీ అరేబియాకు వైమానిక రక్షణ వ్యవస్థలను ఎగుమతి చేసింది.

కొత్త అవగాహన ఒప్పందం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. వరల్డ్ డిఫెన్స్ షో కోసం రియాద్‌ను సందర్శించిన కొరియా రక్షణ మంత్రి షిన్ వోన్-సిక్ మరియు అతని సౌదీ కౌంటర్ ఖలీద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌లు ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

ఇతర ప్రపంచ ఆయుధ ఎగుమతిదారుల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, దక్షిణ కొరియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల సరఫరాదారులలో ఒకటిగా మారడానికి అమ్మకాలను పెంచుకోవాలని చూస్తోంది. ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దాని ఆయుధాల అమ్మకాలు 2022లో $7.25 బిలియన్ల నుండి $17 బిలియన్లకు పెరిగాయి. కొరియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రకారం, మధ్యప్రాచ్యానికి దేశం యొక్క ఆయుధాల ఎగుమతులు 2013 మరియు 2022 మధ్య దాదాపు పదిరెట్లు పెరిగినట్లు తెలుస్తుంది

లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నివేదిక ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో సౌదీ అరేబియాతో దక్షిణ కొరియా కంపెనీలు హన్వా, పూంగ్సాన్ మరియు ఎల్ఐజీ నెక్సల్ బహుళ రాకెట్ లాంచర్లు, మందుగుండు సామగ్రి మరియు ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్‌ల కోసం ఏకంగా $989 మిలియన్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

ఉత్తరాఖండ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రీతు బహ్రీ

ఉత్తరాఖండ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రీతూ బహ్రీ బాధ్యతలు స్వీకరించారు. దీనితో ఉత్తరాఖండ్ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నియామకానికి ముందు ఆమె గతంలో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఆమె తండ్రి జస్టిస్ అమృత్ లాల్ బహ్రీ కూడా ఇదే కోర్టులో న్యాయమూర్తిగా గతంలో సేవలు అందించారు.

గత ఏడాది అక్టోబర్ 26న పదవీ విరమణ చేసిన మాజీ ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ స్థానంలో జస్టిస్ బహ్రీ నియమితులయ్యారు. ఆయన పదవీ విరమణ తర్వాత సీనియర్ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ కుమార్ తివారీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఇంత వరకు సేవలు అందించారు. దేశంలోని 25 హైకోర్టుల్లో ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

తమిళగ వెట్రి కజగం పేరుతొ కొత్త పార్టీని ప్రకటించిన తమిళ నటుడు విజయ్

ప్రముఖ తమిళ నటుడు విజయ్, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతొ ఫిబ్రవరి 2న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. దీనిని తమిళనాడు విజయ పార్టీగా కూడా పిలుచుకుంటున్నారు. తన తల్లిదండ్రుల తర్వాత ప్రతిదీ ఇచ్చిన తమిళనాడు ప్రజలకు మరియు తమిళ సమాజానికి తాను చేయగలిగినంత సహాయం చేయాలనే దీర్ఘకాల ఉద్దేశం మరియు కోరికతో పార్టీ ప్రారంభించినట్లు ప్రకటించారు.

తమిళగ వెట్రి కజగం పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. 2026 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని విజయ్ ప్రకటించాడు. ఆ ఎన్నికలలో విజయం సాధించి, తమిళనాడు ప్రజలు కోరుకునే రాజకీయ పరివర్తనకు మార్గం సుగమం చేస్తానని విజయ్ ప్రకటించారు.

ఎన్నికల ఆర్డినెన్స్ ఆమోదం పొందిన తర్వాత, తమ పార్టీ విధానాలు, మేనిఫెస్టోలు, వ్యూహాలు మరియు కార్యక్రమాలు ఆవిష్కరించబడతాయి మరియు తమిళనాడు ప్రజల కోసం మా రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందని ప్రకటన చేశారు.

తమిళనాడులోని చెన్నైలో వేలాది మంది విజయ్ అభిమానులు, మద్దతుదారులు హాజరైన కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు . పార్టీ జెండా ఆకుపచ్చ రంగులో, మధ్యలో తెల్లటి నక్షత్రం మరియు నక్షత్రం క్రింద పార్టీ పేరు తమిళంలో వ్రాయబడి ఉంది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంపైనే పార్టీ ప్రధాన దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు.

విజయ్ తన విజయ్ మక్కల్ ఇయక్కం (విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్) ద్వారా అనేక సంవత్సరాలుగా సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. గతంలో కూడా పలు రాజకీయ అంశాలపై ఆయన గళం విప్పిన సందర్భాలు ఉన్నాయి. తమిళ సినిమా అభిమానులు ఆయనను దళపతి అని ప్రేమగా పిలుచుకుంటారు.

విజయ్ తమిళనాడులో అత్యంత ప్రజాదరణ మరియు ప్రభావవంతమైన నటులలో ఒకరు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం రాష్ట్ర రాజకీయ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఆయనకున్న పాపులారిటీని ఎన్నికల విజయంగా మార్చుకుంటారో లేదో చూడాలి.

హ్యూమన్ డిఎన్‌ఎ బ్యాంక్‌ను ఏర్పాటు చేసిన బనారస్ యూనివర్శిటీ

బనారస్ హిందూ యూనివర్శిటీ, జనవరి 30, 2024న ఉత్తర భారతదేశపు మొట్టమొదటి మానవ డిఎన్ఏ బ్యాంక్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా జన్యు అధ్యయనాల నిర్వహణ మరియు సంబంధిత ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అలానే దీనికి అదనంగా వైల్డ్‌లైఫ్ డిఎన్ఏ బ్యాంక్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుంది.

ఈ డిఎన్ఏ బ్యాంక్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఆటోమేటెడ్ డిఎన్ఏ ఎక్స్‌ట్రాక్టర్ మెషిన్‌తో ఏర్పాటు చేశారు. ఇది రక్తం, లాలాజలం, వెంట్రుకలు లేదా కణజాలం వంటి వివిధ జీవసంబంధ పదార్థాల నుండి డిఎన్ఏను సంగ్రహించగలదు. ఇది 30 నిమిషాల్లో 32 నమూనాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉంది.

భారతదేశంలోని విభిన్న జనాభా నుండి జన్యు డేటాను సేకరించి విశ్లేషించడం డిఎన్ఏ బ్యాంక్ లక్ష్యం. ఎండోగామి (ఒక సన్నిహిత సమూహంలో వివాహం) కారణంగా నిర్దిష్ట జనాభాలో ఎక్కువగా కనిపించే వ్యాధులను అధ్యయనం చేయడానికి ఈ డేటా ఉపయోగించబడుతుంది. అలానే జన్యుశాస్త్ర పరిశోధన రంగానికి అనేక విధాలుగా ఇది ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఉదాహరణకు భారతీయ జనాభాలో సాధారణమైన తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల జన్యు ప్రాతిపదికను అధ్యయనం చేయడానికి ఇది పరిశోధకులను అనుమతిస్తుంది.

బిహెచ్‌యు ఈ హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ స్థాపన చొరవను ఎస్టోనియా నుండి ప్రేరణ పొందింది. ఎస్టోనియాలో ఉన్నటువంటి జీనోమ్ బ్యాంక్‌ మాదిరి చొరవను ప్రారంభించాలని గత ఏడాది మార్చిలో ప్రకటించింది. బిహెచ్‌యు యొక్క చొరవకు ఎస్టోనియన్ జీనోమ్ బ్యాంక్ ఒక నమూనాగా పనిచేస్తుంది.

2000లో స్థాపించబడిన ఎస్టోనియన్ జీనోమ్ బ్యాంక్, ఆ దేశ జనాభాలో 20% యొక్క జన్యు డేటా మరియు వైద్య చరిత్రను నిల్వ చేస్తుంది, వైద్యులు ఒకే క్లిక్‌తో రోగి యొక్క పూర్తి వైద్య చరిత్రను యాక్సెస్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. ముందస్తు రోగనిర్ధారణ మరియు వ్యాధుల నివారణకు, ముఖ్యంగా జన్యు సిద్ధత ఉన్నవారికి ఈ సమాచారం కీలకం.

గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విజయ్ బిష్ణోయ్

గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఫిబ్రవరి 5న అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అక్టోబర్ 2021 నుండి ఆయన గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. 2023 ఆగస్టులో శాశ్వత న్యాయమూర్తి ప్రోమోట్ చేయబడ్డారు. అంతకు ముందు మణిపూర్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, శాశ్వత న్యాయమూర్తిగాకూడా పనిచేశారు.

గౌహతి హైకోర్టును భారత ప్రభుత్వ చట్టం 1935 ఆమోదించబడిన తర్వాత 1 మార్చి 1948న అప్పటి భారత గవర్నర్ జనరల్ ప్రకటించారు. అప్పటి అస్సాం ప్రావిన్స్ కోసం 5 ఏప్రిల్ 1948 నుండి అమలులోకి వచ్చే విధంగా ఈ హైకోర్టును స్థాపించారు. దీనిని మొదట అస్సాం మరియు నాగాలాండ్ హైకోర్టు అని పిలిచేవారు. 1971లో ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం ద్వారా ఇది గౌహతి హైకోర్టుగా పేరు మార్చబడింది.

గౌహతి హైకోర్టు రాష్ట్రాల పరంగా అతిపెద్ద అధికార పరిధిని కలిగి ఉంది. దీని ప్రాంతం అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మరియు మిజోరాం రాష్ట్రాలను కవర్ చేస్తుంది. దానికి ముందు ఇది మేఘాలయ, మణిపూర్ మరియు త్రిపురలకు కూడా హైకోర్టుగా ఉండేది. ఈ రాష్ట్రాలలో హైకోర్టులు ఏర్పాటు చేసిన తర్వాత, గౌహతి హైకోర్టు ఈ మూడు రాష్ట్రాలలో తన అధికార పరిధిని నిలిపివేసింది.

ఎడిబి యొక్క ఇండియా కంట్రీ డైరెక్టర్‌గా మియో ఓకా నియామకం

ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) మియో ఓకాను భారతదేశం కోసం దాని కొత్త కంట్రీ డైరెక్టర్‌గా నియమించింది. మనీలాలోని ఎడిబి ప్రధాన కార్యాలయంలో దక్షిణాసియాకు డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందిన టేకో కొనిషి స్థానంలో ఆమె ఈ బాధ్యతలు స్వీకరించింది. ఆమె ఈ హోదా ద్వారా భారతదేశంలో ఎడిబి కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు.

మియో ఓకా గత 18 సంవత్సరాలకు పైగా వివిధ హోదాల్లో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు యందు సేవలు అందిస్తున్నారు. గతంలో ఆమె అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ సెక్టార్‌లో డైరెక్టర్‌గా సేవలు అందించారు. జపనీస్ జాతీయురాలు అయిన ఈమె 7 సంవత్సరాలకు పైగా దక్షిణాసియా ప్రాంతంలో ఎమర్జింగ్ ఏరియాస్ బృందాన్ని నిర్వహించారు. ఎడిబిలో ఆమె పదవీకాలం కంటే ముందు, జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పనిచేశారు.

ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అనేది 19 డిసెంబర్ 1966లో స్థాపించబడిన ఆసియా ప్రాంతానికి చెందిన ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకు. దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ (మండలుయోంగ్ - మనీలా) యందు ఉంది. 31 మంది సభ్యులతో ప్రారంభించిన ఈ బ్యాంకు ప్రస్తుతం 68 మంది సభ్యులను కలిగి ఉంది.

ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, అభివృద్ధి చెందుతున్న తన సభ్య దేశాలకు, ప్రైవేట్ రంగానికి మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలకు మౌలిక సదుపాయాల నిర్మాణం మరియు నిర్వహణకు మద్దతుగా రుణాలు, గ్రాంట్లు మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. ఈ బ్యాంకు నుండి రుణాలు పొందిన టాప్ 5 ఆసియా దేశాలలో చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇండోనేషియా మరియు బంగ్లాదేశ్ఉన్నాయి.

పిటి ఉషకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

లెజెండరీ స్ప్రింటర్ మరియుఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు అయిన పిటి ఉష, నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.

టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృతరాజ్, బ్యాడ్మింటన్ ఐకాన్ ప్రకాష్ పదుకొణె, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరియు దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ తర్వాత ఈ అవార్డును అందుకున్న ఐదవ వ్యక్తిగా పిటి ఉష నిలిచారు. పిటి ఉష ఇది వరకు 1985 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1985, 1983లలో రెండు సార్లు అర్జున అవార్డులు కూడా ఆమె దక్కించుకున్నారు.

పిటి ఉష భారతీయ ట్రాక్ మరియు ఫీల్డ్ రాణిగా గుర్తింపు పొందారు. 1977 నుండి 2000 మధ్య తన చిరస్మరణీయ కెరీర్‌లో, భారతదేశం కోసం 103 అంతర్జాతీయ పతకాలను ఆమె గెలుచుకుంది. ఆమె ఆసియా క్రీడలలో నాలుగు స్వర్ణాలు మరియు ఏడు రజత పతకాలను కూడా క్లెయిమ్ చేసింది. భారతదేశం నుండి ఒలింపిక్స్ యొక్క మూడు ఎడిషన్లలో ఆమె పోటీ పడింది.

పిటి ఉష 6 జూలై 2022న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేత రాజ్యసభకు నామినేట్ చేయబడింది. డిసెంబర్ 2022లో ఆమె భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 2022లో ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్ ఇద్దరూ లేనప్పుడు ఎగువ సభ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఆమెను రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో నియమించారు. రాజ్యసభ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తొలి నామినేటెడ్‌ ఎంపీగా ఆమె చరిత్ర సృష్టించారు.

Post Comment