రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 18 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.
2024-25 రబీ పంటలకు ఎంఎస్‌పీ పెంపునకు కేబినెట్ ఆమోదం
మార్కెటింగ్ సీజన్ 2024-25 కోసం ఆరు రబీ లేదా శీతాకాలపు పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడానికి అక్టోబర్ 18, 2023న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఈ అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు ఆమోదం తెలిపింది.
పెంచిన మద్దతు ధరలలో అత్యధికంగా కందులు (మసూర్)కు క్వింటాల్‌కు 425 రూపాయల పెంపుదలకు ఆమోదం లభించగా, తర్వాత రేప్‌సీడ్ మరియు ఆవాలుకు క్వింటాల్‌కు రూ.200 చొప్పున అత్యధికంగా ఎంఎస్‌పి పెరుగుదల ఆమోదించబడింది. అలానే గోధుమలు, కుసుమలకు క్వింటాల్‌కు రూ.150 చొప్పున పెంచేందుకు ఆమోదం తెలపగా, బార్లీ మరియు కందులకు వరుసగా క్వింటాల్‌కు రూ.115 మరియు రూ.105 చొప్పున పెంచడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ క్యాబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో విలేకరులతో సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ 2024-25 మార్కెటింగ్ సీజన్‌లో తప్పనిసరి రబీ పంటలకు ఎంఎస్‌పీ పెరుగుదల 2018-19 యూనియన్ బడ్జెట్‌లో ఎంఎస్‌పీని కనీసం 1.5 రెట్ల స్థాయిలో నిర్ణయించే విధంగా ఉందని చెప్పారు. ఆహార భద్రతను పెంపొందించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం నూనెగింజలు, పప్పుధాన్యాలు మరియు మిల్లెట్ల వైపు పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.
రబీ పంటలకు ఎంఎస్‌పిని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం రైతులకు లాభసాటి ధరలను అందించడం మరియు పంటల వైవిధ్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఉంది. 2025 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగానే ఎంఎస్‌పీ పెంపుదల కూడా ఉంది. ఎంఎస్‌పి అనేది రైతుల నుండి పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం హామీ ఇచ్చే కనీస ధర.
మిషన్ ఇంద్రధనుష్ 5.0 మూడవ దశ ప్రచారం పూర్తి
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క ఫ్లాగ్‌షిప్ రొటీన్ ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్ అయిన ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 5.0 యొక్క మూడవ దశ ప్రచార కార్యక్రమం అక్టోబర్ 14న ముగిసింది. మిషన్ ఇంద్రధనుష్ 5.0 రొటీన్ ఇమ్యునైజేషన్ సేవలు ఇదివరకు పొందని పిల్లలు మరియు గర్భిణులకు చేరేలా రూపొందించబడింది.
దేశవ్యాప్తంగా ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 5.0 ప్రచారం యొక్క మొదటి 2 రౌండ్లలో 34 లక్షల మంది పిల్లలు మరియు 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ మోతాదులను అందించారు. 2014 నుంచి దేశవ్యాప్తంగా మిషన్ ఇంద్రధనుష్ యొక్క 11 దశలు పూర్తయ్యాయి. 12వ దశ ప్రస్తుతం కొనసాగుతోంది, ఈ ప్రచారం కింద ఇప్పటి వరకు మొత్తం 5.06 కోట్ల మంది పిల్లలు మరియు 1.25 కోట్ల మంది గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్‌లు వేశారు.
మిషన్ ఇంద్రధనుష్ 5.0 ప్రచారం నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద అందించబడిన అన్ని టీకాలకు రోగనిరోధక కవరేజీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 2023 నాటికి మీజిల్స్ & రుబెల్లా నిర్మూలన లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్ కవరేజీని మెరుగుపరచడం లక్ష్యంగా దీనిని కొనసాగిస్తున్నారు. దేశంలోని అన్ని జిల్లాల్లో పైలట్ మోడ్‌లో రొటీన్ ఇమ్యునైజేషన్ కోసం యూ-విన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
మిషన్ ఇంద్రధనుష్ 5.0 ప్రచారం మోత్తం మూడు రౌండ్లలో నిర్వహించబడింది. మొదటి రౌండ్ ఆగష్టు 7 -12, రెండవ రౌండ్ సెప్టెంబర్ 11-16, మూడవ రౌండ్ అక్టోబర్ 9-14 లలో నిర్వహించబడింది. అంటే ఒక్కో నెలలో 6 రోజులు సాధారణ ఇమ్యునైజేషన్ డేని అమలు పర్చారు. బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా మరియు పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాలు/యూటీలు ఈ ప్రచారానికి సంబంధించిన మూడు రౌండ్‌లను 14 అక్టోబర్ 2023 నాటికి ముగించాయి. ఈ నాలుగు రాష్ట్రాలు కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఆగస్టులో దీనిని నిర్వహించలేకపోయాయి.
లేహ్ జిల్లాలో ఖేలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్
లడఖ్‌లో, లేహ్ జిల్లాలోని స్పితుక్‌లో కొత్తగా నిర్మించిన ఓపెన్ స్టేడియం అథ్లెటిక్స్, బాక్సింగ్ మరియు విలువిద్యపై దృష్టి సారించే ఖేలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్ (KISCE) స్థాపనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది. ఈ కేంద్రం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 3.139 కోట్ల రూపాయలు మరియు తదుపరి ఆర్థిక సంవత్సరానికి 1.195 కోట్ల రూపాయల వ్యయంతో రెండు సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయడానికి ఉద్దేశించబడింది.
ఖేలో ఇండియా స్టేట్ ఎక్సలెన్స్ సెంటర్‌ను స్థాపించాలనే లడఖ్ ప్రతిపాదనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిందని లడఖ్ యువజన సేవలు మరియు క్రీడల శాఖ ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించింది. దీనికి సంబంధించి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు యుటి లడఖ్‌లోని యువజన సేవలు మరియు క్రీడల శాఖ మధ్య సమీప భవిష్యత్తులో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది.
లడఖ్ యూనియన్ టెరిటరీలో ఫుట్‌బాల్, ఐస్ హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్ కోసం ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాత, ఈ చొరవ కేంద్రపాలిత ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి ఒక అద్భుతమైన శాస్త్రీయ విధానాన్ని అందిస్తుంది. లడఖ్‌కు చెందిన యువ క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో పోటీ పడేందుకు ఈ కేంద్రం ఒక వేదికను కూడా అందిస్తుంది.
భారత ప్రభుత్వంతో ఐబీఎం మూడు వ్యాపార ఒప్పందాలు
అమెరికా బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం, భారత ఐటీ మంత్రిత్వ శాఖతో సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్వాంటం కంప్యూటింగ్ రంగాలలో మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. భారతదేశం అత్యాధునిక నూతన సాంకేతిక పరిజ్ఞానాలలో స్థానం పొందేందుకు నిర్ణయాత్మక అడుగులు వేస్తున్నందున, సంబంధిత రంగాలలో ఆవిష్కరణలను పెంచడానికి ఈ ఒప్పందం చేసుకుంది.
ఐబీఎం భారత సెమీకండక్టర్ మిషన్‌తో తన అనుభవాన్ని పంచుకుంటుంది. ప్రపంచ సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థలో భారతదేశాన్ని ఒక కీలకమైన సంస్థగా మార్చడంలో ఈ సంస్థ సహాయం అందిస్తుంది. సెమీకండక్టర్ల తయారీలో పరిశోధన మరియు అభివృద్ధి, నైపుణ్యం మరియు ఆర్కిటిపికల్ చిప్ డిజైన్ వంటి అంశాల యందు గైడ్ చేస్తుంది.
భారతదేశ జాతీయ క్వాంటం మిషన్‌కు మద్దతుగా ఐబీఎం సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌తో కూడా సహాయం అందిస్తుంది. ఐబీఎం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఫ్యూచర్‌స్కిల్స్ ప్రోగ్రామ్‌కు మద్దతు ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఫ్యూచర్‌డిజైన్ స్టార్టప్‌లతో భాగస్వామిగా ఉంటుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలంకు మొదటి ప్యాసింజర్ రైలు
ఒడిశాలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలానికి మొదటి ప్యాసింజర్ రైలు ఆమోదం పొందింది. ఈ రైలు మయూర్‌భంజ్ జిల్లాలోని బాదంపహార్‌ను కోల్‌కతా (షాలిమార్) మరియు రూర్కెలాతో కలుపుతుంది. త్వరలోనే రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ఆగ్నేయ రైల్వే పరిధిలోని భారతీయ రైల్వేలు ఇటీవల ఆమోదించిన నాలుగు జతల రైళ్లలో మూడు ఒడిశాలోని గిరిజనులు అధికంగా ఉండే మయూర్‌భంజ్ జిల్లాకు కేటాయించారు.
ఈ కొత్త రైళ్లలో కోల్‌కతా (షాలిమార్)-బాదంపహార్-కోల్‌కతా (షాలిమార్) వీక్లీ ఎక్స్‌ప్రెస్, బాదంపహార్-రూర్కెలా-బాదంపహార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, రూర్కెలా-టాటానగర్-రూర్కెలా (వారానికి 6 రోజులు) మరియు టాటానగర్- బాదంపహార్-టాటానగర్ (వారానికి 6 రోజులు) ఉన్నాయి. టాటా-బాదంపహార్ మార్గంలో మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు కనెక్టివిటీ ఉండటం ఇదే మొదటిసారి.
కొత్త రైలు మయూర్‌భంజ్ జిల్లా ప్రజల చిరకాల డిమాండ్. ఈ రైలు బాదంపహార్‌ను ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన నగరాలతో కలుపుతుంది. ఈ కొత్త రైలు స్థానిక ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తుంది. ఇది గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆకాంక్షాత్మక జిల్లాలకు అదనపు కనెక్టివిటీని అందిస్తుంది.
511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ కౌశల్య కేంద్రాలు ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ కౌశల్య వికాస్ కేంద్రాలను మహారాష్ట్రలో 19 అక్టోబర్ 2023న ప్రారంభించారు. మహారాష్ట్రలోని 34 గ్రామీణ జిల్లాల్లో ఏర్పాటైన ఈ కేంద్రాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గ్రామీణ కౌశల్య వికాస్ కేంద్రాలు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఒక్కో కేంద్రం దాదాపు 100 మంది యువకులకు కనీసం రెండు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కింద ఎంప్యానెల్డ్ పరిశ్రమ భాగస్వాములు మరియు ఏజెన్సీల ద్వారా ఈ శిక్షణ అందించబడుతుంది.
మొదటి భారతీయ కోస్ట్ గార్డ్ శిక్షణా నౌక అభివృద్ధికి ఒప్పందం
భారత రక్షణ మంత్రిత్వ శాఖ మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్‌తో ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం ఒక ట్రైనింగ్ షిప్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. బై (ఇండియన్- ఐడీడీఎం) కేటగిరీ కింద రూ.310 కోట్ల వ్యయంతో ఈ నౌకను నిర్మించనున్నారు. వచ్చే మూడేళ్లలోగా ఈ నౌక డెలివరీ అవుతుందని భావిస్తున్నారు.
ఈ శిక్షణ నౌక 70 మంది కోస్ట్ గార్డ్ మరియు ఇతర అంతర్జాతీయ అండర్-ట్రైనీ అధికారులకు ప్రాథమిక సముద్ర శిక్షణను అందించడానికి సమగ్ర హెలికాప్టర్ సామర్థ్యాలతో కూడిన మొదటి ప్రత్యేక వేదిక అవుతుంది. సముద్రంలో ఎదురయ్యే సవాళ్లపై ఇండియన్ కోస్ట్ గార్డ్ క్యాడెట్‌లకు లోతైన అంతర్దృష్టి మరియు నైపుణ్యాన్ని అందించే ఆధునిక హైటెక్ నిఘా మరియు పర్యవేక్షణ వ్యవస్థలతో ఈ నౌక అభివృద్ధి చేయబడుతుంది.
నావిగేషన్, సీమాన్‌షిప్, షిప్ హ్యాండ్లింగ్ మరియు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లతో సహా వివిధ రకాల సముద్ర నైపుణ్యాలలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు మరియు క్యాడెట్‌లకు శిక్షణ ఇవ్వడానికి ఈ శిక్షణా నౌక ఉపయోగించబడుతుంది. భారత తీర రక్షక దళం యొక్క శిక్షణా సామర్థ్యాలను పెంపొందించే దిశగా శిక్షణా నౌక నిర్మాణం ఒక ముఖ్యమైన ముందడుగు. సముద్ర భద్రత సవాళ్ల కోసం భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ అధికారులు మరియు క్యాడెట్‌లను సిద్ధం చేయడంలో ఓడ కీలక పాత్ర పోషిస్తుంది.
ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2023-24ని ప్రారంభం
కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇండియా స్కిల్స్ 2023-24 కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యూ ఢిల్లీలోని కౌశల్ భవన్‌లో ప్రారంభించిన ఈ పోటీలు నవంబర్ 2023 నుండి జనవరి 2024 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి. ఇండియా స్కిల్స్ పోటీ అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే జాతీయ స్థాయి నైపుణ్య పోటీ. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ పోటీని నిర్వహిస్తుంది.
ఇండియాస్కిల్స్ పోటీ నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం మరియు దేశవ్యాప్తంగా ఉన్న యువకుల నైపుణ్యాలను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ పోటీలో ప్రాతినిధ్యం కోసం ప్రతిభావంతులైన యువకులను గుర్తించడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి కూడా ఈ పోటీ సహాయపడుతుంది. ఇండియాస్కిల్స్ 2023 పోటీలో ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ మరియు సేవా నైపుణ్యాలతో సహా 50కి పైగా నైపుణ్యాలలో పోటీలు ఉంటాయి. ఈ పోటీలో 18 నుంచి 25 ఏళ్లలోపు యువకులు పాల్గొనవచ్చు.
ఇండియాస్కిల్స్ 2023 పోటీలో విజేతలు 2024లో ఫ్రాన్స్‌లోని లియోన్‌లో జరిగే వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి అర్హులు. యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పోటీ పడేందుకు ఈ పోటీ వేదికను కల్పిస్తుంది. శ్రామిక శక్తి కోసం ప్రతిభావంతులైన యువకులను గుర్తించి శిక్షణ ఇవ్వడానికి కూడా ఈ పోటీ సహాయపడుతుంది.
అప్నా చంద్రయాన్ వెబ్ పోర్టల్ ప్రారంభం
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాఠశాల విద్యార్థుల కోసం ఇస్రో యొక్క చంద్రయాన్ -3 మిషన్‌పై వెబ్ పోర్టల్ మరియు దానికి సంబందించిన 10 ప్రత్యేక మాడ్యూల్స్‌ను ప్రారంభించారు. అప్నా చంద్రయాన్ పేరుతొ ప్రారంభించిన ఈ వెబ్ పోర్టల్, విద్యార్థులకు క్విజ్‌లు, పజిల్‌లు మరియు ఇతర కార్యాచరణ-ఆధారిత సహాయక సామగ్రిని అందిస్తుంది.
ఈ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీధర పనికర్ సోమనాథ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ వెబ్ పోర్టల్‌లో ఫౌండేషన్ మరియు ప్రిపరేటరీ స్థాయి విద్యార్థుల కోసం కలరింగ్ షీట్‌లు, డాట్-టు-డాట్ కార్యకలాపాలు, ప్రిపరేటరీ, మిడిల్ మరియు సెకండరీ స్థాయిల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ క్విజ్‌లు, జిగ్సా పజిల్స్ మరియు పిక్చర్ బిల్డర్‌స్ వంటివి ఉంచారు.
వీటితో పాటు, చంద్రయాన్ 3 విజయంపై బహుళ భాషలలో 10 ప్రత్యేక మాడ్యూల్స్ విడుదల చేశారు. ఇవి భారతీయ యువతను సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు ప్రేరేపిస్తాయి. అలానే సామాజిక అంశాలు, ఈ మిషన్ యందు పాల్గొన్న శాస్త్రవేత్తల భావోద్వేగ ప్రయాణ అనుభవాలు మరియు ఈ ప్రయోగ గ్రాఫిక్స్, ఫోటోగ్రాఫ్‌లు, ఇలస్ట్రేషన్‌లు, యాక్టివిటీలు, సవాలు చేసే ప్రశ్నలు వంటివి అందుబాటులో ఉంచారు.
6వ అటల్ బిహారీ వాజ్‌పేయి జాతీయ అవార్డలు
నొడియాలో జరిగిన 9వ గ్లోబల్ లిటరరీ ఫెస్టివల్‌లో కళ మరియు సంస్కృతిని ప్రోత్సహించిన వ్యక్తులకు 6వ అటల్ బిహారీ వాజ్‌పేయి జాతీయ అవార్డులతో సన్మానించారు. మాజీ ప్రధాని మరియు ప్రముఖ కవి అటల్ బిహారీ వాజ్‌పేయి వారసత్వంను కొనసాగించేందుకు భారతదేశంలోని వివిధ మూలల నుండి ప్రతిష్టాత్మకమైన వ్యక్తులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందించబడ్డాయి.
ప్రఖ్యాత కవి డాక్టర్ రామ సింగ్‌కు అటల్ బిహారీ వాజ్‌పేయి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించగా, మిగతా అవార్డులు అందుకున్న వారిలో పద్మశ్రీ పీటీ. రామ్ దయాళ్ శర్మ (రచయిత), పద్మశ్రీ కృష్ణ కన్హాయి (పెయింటింగ్), ఉస్తాద్ అక్రమ్ ఖాన్ (తబలా ప్లేయర్), శీతల పాండే (లిరిక్స్ రైటర్), కుమారి సోమశేఖరి ( క్లాసికల్ డ్యాన్సర్), సితేష్ అలోక్ (రచయిత), డాలీ దబ్రాల్ (క్లాసికల్ డ్యాన్సర్), ఆదిత్య ఆర్య (ఫోటోగ్రాఫర్) లు ఉన్నారు.