రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 25 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.
డెహ్రాడూన్‌లో యునైటెడ్ నేషన్స్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్ మీట్
డెహ్రాడూన్‌లో అడవులపై ఐక్యరాజ్యసమితి ఫోరమ్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. అటవీ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కంట్రీ-లెడ్ ఇనిషియేటివ్ ఈవెంట్‌ను అక్టోబర్ 26 నుండి 28 మధ్య పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించింది.
ఈ సమావేశంలో స్థిరమైన అటవీ నిర్వహణను ప్రోత్సహించడానికి యూఎన్ ఫారెస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ తీసుకున్న విధాన చర్యలపై చర్చలు జరిగాయి. అటవీ మంటలు మరియు అటవీ నిర్వహణ కోసం అమలు చేయగల ఫ్రేమ్‌వర్క్‌లు మరియు సిఫార్సులతో ఈ సమావేశం ముగిసింది. ఇవి మే 2024లో న్యూయార్క్‌లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో షెడ్యూల్ చేయబడిన యూఎన్ఎఫ్ఎఫ్ యొక్క 19 వ సెషన్‌లో చర్చల కోసం పరిగణలోకి తీసుకోబడతాయి.
యునైటెడ్ నేషన్స్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్ అనేది అడవుల నిర్వహణ, సంరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించే అత్యున్నత స్థాయి ఇంటర్ గవర్నమెంటల్ పాలసీ ఫోరమ్. ఈ ఫోరమ్‌లో అన్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు మరియు శాశ్వత పరిశీలకులు, యూఎన్ఎఫ్ఎఫ్ సెక్రటేరియట్ మరియు ఇతర ప్రాంతీయ సంస్థలు సభ్యులుగా ఉంటాయి. దీనిని 18 అక్టోబర్ 2000 లో ఏర్పాటు చేసారు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.
యూఎన్ఎఫ్ఎఫ్ వ్యవస్థాపక సభ్యదేశంగా భారతదేశం ఇందులో ప్రత్యేక హోదాను కలిగి ఉంది. యూఎన్ జనరల్ అసెంబ్లీ 2017-2030 కాలానికి అడవుల కోసం మొట్టమొదటి యూఎన్ వ్యూహాత్మక ప్రణాళికను ఆమోదించింది. ఈ వ్యూహాత్మక ప్రణాళికలో అడవుల వెలుపల చెట్లతో సహా అన్ని రకాల అడవుల యొక్క స్థిరమైన నిర్వహణను సాధించడానికి, అటవీ నిర్మూలన మరియు అటవీ క్షీణతను ఎదుర్కోవడానికి ప్రపంచ ఫ్రేమ్‌వర్క్ రూపొందించింది.
ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా అడవి మంటల స్థాయిలో భయంకరమైన పెరుగుదల కనిపిస్తుంది. ఇది జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థ, మానవ శ్రేయస్సు, జీవనోపాధి మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాలకు దారితీస్తుంది. దాదాపు 100 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి, ఇది ప్రపంచంలోని 3% అటవీ ప్రాంతంతో సమానం.
ఐఎన్ఎస్ శివాజీలో 10-రోజుల ఆల్ ఇండియా నౌ సైనిక్ క్యాంప్
ఆల్ ఇండియా నౌ సైనిక్ క్యాంప్ 2023 (AINSC 2023) లోనావాలాలోని ఐకానిక్ నేవల్ బేస్ ఐఎన్ఎస్ శివాజీపై నిర్వహించబడింది. అక్టోబర్ 15 నుండి 24 మధ్య జరిగిన ఈ పది రోజుల వార్షిక శిక్షణ క్యాంపులో దేశవ్యాప్తంగా 17 డైరెక్టరేట్‌ల నుండి భారతదేశంలోని అత్యుత్తమ యువ క్యాడెట్‌లు పోటీపడ్డారు. ఈ క్యాంపు ఈసారి మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌సిసి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఎలక్షన్ కమిషన్ నేషనల్ ఐకాన్'గా రాజ్‌కుమార్ రావు
భారత ఎన్నికల సంఘం త్వరలో జరిగే ఐదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నటుడు రాజ్‌కుమార్ రావును నేషనల్ ఐకాన్'గా ప్రకటించింది. ఇప్పటికే ఈ హోదాలో నియమించబడ్డ ప్రముఖుల జాబితాలో పంకజ్ త్రిపాఠి, అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని మరియు మేరీ కోమ్ వంటి వారు ఉన్నారు.
రాజ్‌కుమార్ రావు గతంలో న్యూటన్ చిత్రంలో ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే అధికారి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. 90వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో భారతదేశం నుండి నామినేట్ అయ్యింది.
పౌరులు ఎన్నికలలో పాల్గొనేలా ఓటర్లను ప్రేరేపించేందుకు ఎన్నికల సంఘం దేశంలోని ప్రముఖలను జాతీయ ఐకాన్‌లుగా నియమిస్తుంది. వీరు తమ సోషల్ మీడియా మరియు న్యూస్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేయడంతో పాటుగా ఎన్నికల పట్ల, ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత పట్ల ప్రజలలో అవగహన కల్పిస్తారు.
ఇద్దరు భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్తలకు బిడెన్ సత్కారం
భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్ మరియు సుబ్ర సురేష్‌లకు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మరియు నేషనల్ మెడల్ లభించాయి. ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వైట్ హౌస్‌లో ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మరియు ఆవిష్కర్తలను కూడా బిడెన్ సత్కరించారు.
నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ మరియు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనేది అమెరికా యొక్క శ్రేయస్సును బలోపేతం చేయడానికి సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌లలో ఆదర్శప్రాయమైన విజయాలు సాధించిన అమెరికన్లకు ఇవ్వబడ్డాయి. దీనిని యూఎస్ కాంగ్రెస్ 1959లో స్థాపించింది. దీనిని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ద్వారా అందిస్తారు.
జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్సెస్, ఎడ్యుకేషన్ సైన్సెస్, ఇంజనీరింగ్, జియోసైన్సెస్, మ్యాథమెటికల్ మరియు ఫిజికల్ సైన్సెస్, మరియు సోషల్, బిహేవియరల్ మరియు ఎకనామిక్ సైన్సెస్‌లలో విశిష్ట సేవలందించిన అర్హులైన వ్యక్తులకు యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ దీనిని అందజేస్తారు.
ఇండో-అమెరికన్ అశోక్ గాడ్గిల్ 1950లో ముంబైలో జన్మించారు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు అయిన ఈయన బర్కిలీ విశ్వవిద్యాలయంలో ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ డివిజన్ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1956లో ముంబైలో జన్మించిన సుబ్ర సురేష్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుండి బీటెక్ పూర్తి చేశారు. ఈయన అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా హయాంలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ యొక్క 13వ డైరెక్టరుగా పనిచేశారు. ఈయన 2011లో పద్మశ్రీ, 2013లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ పతకం వంటి గౌరవాలు అందుకున్నాడు.
రెండు రోజుల కిర్గిజ్‌స్థాన్ పర్యటనలో జైశంకర్
కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షతన జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ 22వ సమావేశంలో పాల్గొనడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రెండు రోజుల కిర్గిజ్‌స్థాన్ పర్యటనకు వెళ్లారు. అక్టోబర్ 25-26 తేదీలలో కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొనే భారత ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహించారు. ఈ సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మరియు చైనా కౌంటర్ వాంగ్ యి కూడా హాజరయ్యారు
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యందు కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) అనేది రెండవ ముఖ్యమైన ఫోరమ్. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్య మరియు సామాజిక-ఆర్థిక సహకారం రంగాలపై దృష్టి పెడుతుంది. అక్టోబరు 26న కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఛైర్‌గా పాకిస్తాన్ బాధ్యతలు చేపడుతుంది. ఈ సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001లో చైనా మరియు రష్యాలచే స్థాపించబడిన యురేషియా రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ భద్రత మరియు రక్షణ సంస్థ. ఇందులో 9 సభ్య దేశాలు మరియు యురేషియా నుండి 4 పరిశీలక దేశాలు ఉన్నాయి. 2022-2023 ఏడాదికి భారతదేశ దీని రొటేటరీ అధ్యక్ష పదవిని నిర్వహిస్తుంది. రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ దీని చైర్మన్‌గా వ్యవహరిస్తుంది. సభ్య దేశాలు : చైనా, రష్యా, భారతదేశం, ఇరాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్.
కలోల్‌లో దేశంలోనే తొలి నానో డీఏపీ ప్లాంట్ ప్రారంభం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారతదేశం యొక్క మొట్టమొదటి ద్రవ నానో డి-అమోనియా ఫాస్ఫేట్ (డిఏపీ) ప్లాంట్‌ను గాంధీనగర్‌లోని కలోల్‌లో ప్రారంభించారు. ఈ ప్లాంట్‌ను ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (ఇఫ్కో) నిర్మించింది. 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఈ ప్లాంట్ 25 టన్నుల డీఏపీకి సమానమైన 5 కోట్ల నానో డాప్ లిక్విడ్ బాటిళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది.
నానో డిఏపీ అనేది ఒక విప్లవాత్మకమైన కొత్త ఎరువులు. ఇది సాంప్రదాయ డిఏపీ ఎరువుల కంటే ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తుంది. ఇది తక్కువ ధరలో తక్కువ కాలుష్య కారకాలతో లబిస్తుంది. దీనిని రవాణా చేయడం మరియు నిల్వ చేయడం కూడా సులభం. నానో డిఎపి ప్లాంట్ ప్రారంభోత్సవం భారతీయ వ్యవసాయానికి ఒక పెద్ద ముందడుగు. ఆహార ఉత్పత్తి మరియు ఎరువులలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ఇది సహాయపడుతుంది.
గాంధీనగర్‌లోని నానో డిఎపి ప్లాంట్ సంవత్సరానికి 5 కోట్ల నానో డిఎపి లిక్విడ్ బాటిళ్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 25 లక్షల టన్నుల సాంప్రదాయ డిఎపి ఎరువులకు సమానం. ఇది దిగుమతి చేసుకునే ఎరువులపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు ఆహార ఉత్పత్తిలో దేశం మరింత స్వయం సమృద్ధి సాధించడానికి సహాయపడుతుంది.
రాంలీలాలో రావణ్ దహన్ చేసిన మొదటి మహిళగా కంగనా రనౌత్
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఢిల్లీలోని లవ్ కుష్ రామ్‌లీలాలో రావణ్ దహన్ చేసి చరిత్ర సృష్టించింది. ఎర్రకోటలో ఏటా దసరా రోజు నిర్వహించే 50 ఏళ్ల ఈ ఈవెంట్ చరిత్రలో ఒక మహిళ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఇదే తొలిసారి. గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, సినిమా స్టార్లలో అజయ్ దేవగన్, జాన్ అబ్రహం, గతేడాది తెలుగు నటుడు ప్రభాస్ ఈ రావణ్ దహన్ కార్యక్రమం నిర్వహించిన జాబితాలో ఉన్నారు.
రావణ్ దహన్ అనేది దసరా పండగ యొక్క అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా నిర్వహిస్తారు. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం భారతదేశంలోని అనేక ప్రదేశాలలో సర్వసాధారణం. హిందూ క్యాలెండర్ ప్రకారం, దసరా దుష్ట రాజు రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయంగా పరిగణించబడుతుంది.