తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 16 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 16 మార్చి 2024

16 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

Advertisement

ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ (కీర్తి) కార్యక్రమం ప్రారంభం

కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ కొత్తగా ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ (కీర్తి) కార్యక్రమాన్ని మార్చి 12న ప్రారంభించింది. 9 మరియు 18 సంవత్సరాల మధ్య ఉన్న పాఠశాల పిల్లలను లక్ష్యంగా చేసుకుని, దేశ వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని చండీగఢ్‌లోని సెక్టార్ 7 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు.

ఈ పథకం రెండు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది. దేశంలోని మారుమూల క్రీడా ప్రతిభను గుర్తించేందుకు మరియు క్రీడలను ఒక సాధనంగా ఉపయోగించి పాఠశాల విద్యార్థులను డ్రగ్స్ మరియు ఇతర గాడ్జెట్ పరధ్యానాల పట్ల వ్యసనాన్ని అరికట్టడానికి ఇది ప్రణాళిక చేయబడింది.

  • కీర్తి ప్రోగ్రామ్ దేశంలో క్రీడా సంస్కృతిని నిర్మించడం మరియు ఒలింపిక్స్, ఆసియా క్రీడల వంటి ప్రపంచ పోటీలలో భారతదేశానికి పతకాలు సాధించగల ప్రతిభను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా 50 కేంద్రాలలో ఘనంగా ప్రారంభించబడింది.
  • అథ్లెటిక్స్, బాక్సింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్‌బాల్ మరియు రెజ్లింగ్‌తో సహా 10 ప్రధాన క్రీడలలో మొదటి దశలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
  • నోటిఫైడ్ టాలెంట్ అసెస్‌మెంట్ సెంటర్‌ల ద్వారా ప్రతిభను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా 20 లక్షల మూల్యాంకనాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • 2036 నాటికి ప్రపంచంలోని టాప్ 10 క్రీడా దేశంగా మరియు 2047 నాటికి మొదటి ఐదు దేశాలలో ఒకటిగా మారేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుందని భావిస్తున్నారు.
  • ఈ కార్యక్రమం ఖేలో ఇండియా పథకం కింద అమలు చేయనున్నారు.

థాయిలాండ్‌లో 8 కళ్ళు మరియు కాళ్ళతో కొత్త తేలు జాతులు గుర్తింపు

థాయ్‌లాండ్‌లోని కైంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో యూస్కార్పియోప్స్ క్రాచన్ అనే కొత్త తేలు జాతిని పరిశోధకులు కనుగొన్నారు. ఈ కొత్త జాతి యుస్కోపియోప్స్ ఉపజాతికి చెందినవిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇవి గోధుమ రంగులో 8 కళ్ళు మరియు కాళ్ళను కలిగివున్నాయి.

క్రాచన్ స్కార్పియన్ చాల చిన్నది, ఇవి కేవలం ఒక అంగుళం (2.5 సెంటీమీటర్లు) పొడవు మాత్రమే ఉన్నాయి. వీటికి చెందిన పరిశోధన వివరాలు పీర్-రివ్యూడ్ జర్నల్ జూకీస్‌లో మార్చి 6న ప్రచురించబడింది. అయితే వీటిని నవంబర్ 2022 లో కెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో స్థానిక వన్యప్రాణులను సర్వే చేస్తున్నప్పుడు పరిశోధకులు మొదటిసారి గుర్తించినట్లు పేర్కొన్నారు.

  • కైంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో కనుగొన్న ఈ కొత్త స్కార్పియన్ జాతికి ఈ పార్కు పేరుతొ యూస్కార్పియోప్స్ క్రాచన్ లేదా కైంగ్ క్రాచన్ స్కార్పియన్ అని నామకరణం చేసారు.
  • కైంగ్ క్రాచన్ నేషనల్ పార్క్ పెట్చాబురి ప్రావిన్స్‌లో ఉంది, ఇది థాయిలాండ్-మయన్మార్ సరిహద్దులో ఉన్న ప్రాంతం.
  • ఈ కొత్త జాతి శరీర ఆకృతి, పరిమాణం, పిన్సర్లు మరియు ఇతర సూక్ష్మ భౌతిక లక్షణాల ద్వారా గుర్తించబడింది.
  • పరిశోధకులు ఈ తేలు కొత్త జాతులకు సంబంధించి ఎటువంటి డిఎన్ఏ విశ్లేషణను అందించ లేదు.
  • చులాలాంగ్‌కార్న్ యూనివర్శిటీకి చెందిన వాసిన్ నవనేటివాంగ్ నేతృత్వంలోని పరిశోధనా బృందం వీటిని గుర్తించారు.

కెంగ్ క్రాచన్ స్కార్పియన్, దాని యూస్కార్పియోప్స్ బంధువు వలె, ఎర కోసం వేటాడేందుకు ఆకస్మిక వ్యూహాలను ఉపయోగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ థాయిలాండ్ జాతీయ ఉద్యానవనాల యొక్క గొప్ప జీవవైవిధ్యాన్ని మరియు మన గ్రహం యొక్క దాచిన అద్భుతాలను వెలికితీసేందుకు నిరంతర అన్వేషణ యొక్క ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది.

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంకు ఉత్తమ ఎయిర్‌పోర్ట్ అవార్డు

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విమానాశ్రయంగా అవార్డు పొందింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) అందించే ఈ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డును 2023 సంవత్సరానికి గాను ప్రపంచ వ్యాప్తంగా 'బెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఎట్ అరైవల్స్' కేటగిరిలో దక్కించుకుంది.

ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రయాణీకులకు అతుకులు మరియు ఆనందదాయకమైన రాకపోకలను అందించడంలో బెంగళూరు విమానాశ్రయం యొక్క తిరుగులేని నిబద్ధతకు నిదర్శనం. సమర్థవంతమైన ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్లియరెన్స్, బ్యాగేజీ క్లెయిమ్‌ వంటి అంశాలలో సులభతరమైన యాక్సెస్ ఆధారంగా ఈ అవార్డు దక్కించుకుంది.

కెంపేగౌడ విమానాశ్రయంతో పాటుగా తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అబుదాబిలోని జాయెద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఈ అవార్డులను దక్కించుకున్నాయి. వీటిలో పాటుగా మరో నాలుగు భారతీయ విమానాశ్రయాలు కూడా వివిధ విభాగాల్లో ఈ అవార్డులు అందుకున్నాయి. వీటిలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ), ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ముంబై), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్) మరియు చండీగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉన్నాయి.

  • ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) ప్రోగ్రామ్ అనేది ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ యొక్క వార్షిక సర్వే.
  • ఇది విమానాశ్రయంలోని ప్రయాణికులకు నేరుగా నిర్వహించబడే సర్వేల ద్వారా వారి ప్రయాణ అనుభవాలను సేకరిస్తుంది.
  • ఇది ప్రయాణీకుల అనుభవ ప్రయాణంలో కీలకమైన అంశాలలో 30కి పైగా పనితీరు సూచికలను కవర్ చేస్తుంది.
  • ఈ అవార్డులు ఆసియా-పసిఫిక్ మరియు మధ్యప్రాచ్యంలోని ఉత్తమ విమానాశ్రయాలకు ప్రకటించబడ్డాయి
  • మొత్తం 31 విమానాశ్రయాలలో ఈ సర్వే నిర్వహించగా వీటిలో ఆసియా-పసిఫిక్ నుండి 27 మరియు మధ్యప్రాచ్యం నుండి 4 విమానాశ్రయాలు ఉన్నాయి.

ఈ ఏడాది 11 ఇండోనేషియా విమానాశ్రయాలలో సుల్తాన్ హసనుద్దీన్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు యోగ్యకర్త అంతర్జాతీయ విమానాశ్రయం రెండూ ఆరు అవార్డు విభాగాల్లో ఐదు గెలుచుకున్నాయి. ఒమన్‌లోని సలాలా విమానాశ్రయం ఐదు అవార్డులతో మధ్యప్రాచ్య విమానాశ్రయాలలో అగ్రస్థానంలో ఉంది. అలానే చైనా, భారత్‌ల నుండి ఆరు చొప్పున విమానాశ్రయాలు ఈ గుర్తింపు పొందాయి.

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా రాకపోకలకు ఉత్తమ విమానాశ్రయం
తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా రాకపోకలకు ఉత్తమ విమానాశ్రయం
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియా-పసిఫిక్‌లో 40 మిలియన్లకు పైగా ప్రయాణీకుల కేటగిరిలో ఉత్తమ విమానాశ్రయం
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియా-పసిఫిక్‌లో 40 మిలియన్లకు పైగా ప్రయాణీకుల కేటగిరిలో ఉత్తమ విమానాశ్రయం
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియా-పసిఫిక్‌లో 15 నుండి 25 మిలియన్ల ప్రయాణీకుల కేటగిరిలో ఉత్తమ విమానాశ్రయం
చండీగఢ్ విమానాశ్రయం ఆసియా-పసిఫిక్‌లో 2 నుండి 5 మిలియన్ల ప్రయాణీకుల కేటగిరిలో ఉత్తమ విమానాశ్రయం

మహిళలకు 10 రోజుల అదనపు క్యాజువల్ లీవులను ప్రకటించిన ఒడిశా

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఏడాదికి 10 రోజుల అదనపు క్యాజువల్ లీవులను ప్రకటించింది. ఇదివరకు ఒడిశాలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరూ సంవత్సరానికి 15 రోజుల క్యాజువల్ లీవ్ పొందేవారు. ఈ కొత్త విధానం మహిళా ఉద్యోగులకు అదనంగా 10 రోజులు మంజూరు చేస్తుంది, దీనితో వారి మొత్తం క్యాజువల్ లీవుల సంఖ్య 25 రోజులకు చేరింది.

ఈ ప్రకటనపై మహిళా ఉద్యోగులు, హక్కుల సంఘాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను గుర్తించి, కార్యాలయంలో వారిని సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఇది ప్రగతిశీల చర్యగా పరిగణించబడుతుంది. ఈ విధాన మార్పు ఒడిశాలో రాష్ట్ర ప్రభుత్వంచే ఉద్యోగం చేస్తున్న గణనీయమైన సంఖ్యలో మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

ఇది కాకుండా, మహిళా బ్లాక్ గ్రాంట్ ఉద్యోగులకు రెండు కాన్పుల వరకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,560 కొత్త ఎయిడెడ్ హైస్కూళ్లు, 940 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 138 మదర్సాలలో పనిచేస్తున్న 33,420 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

మహిళా సాధికారత కోసం ఒడిశా ప్రభుత్వం నిబద్ధత చూపడం ఇదే మొదటిసారి కాదు. ముఖ్యంగా, 1990లలో ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ను అమలు చేయడంలో భారతదేశంలోనే తోలి రాష్ట్రంగా ఒడిశా గుర్తింపు పొందింది.

అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పీఎం - సూరజ్ పోర్టల్ ప్రారంభం

సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సమాజంలోని అట్టడుగు వర్గాలకు క్రెడిట్ మద్దతును అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్‌గార్ అధరిత్ జనకళ్యాణ్ (పీఎం - సూరజ్) పేరుతొ ప్రారంభించిన ఈ కార్యక్రమం వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన లక్ష మంది పారిశ్రామికవేత్తలకు సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించి పీఎం - సూరజ్ పోర్టల్ కూడా మార్చి 13న ప్రధాని మోడీ ప్రారంబించారు. ఈ కార్యక్రమం సమాజంలోని వెనుకబడిన వర్గాల వారికి వ్యాపారాలను ప్రారంభించడంలో లేదా విస్తరించడంలో సహాయపడటానికి వారికి రుణాలను అందించడం ద్వారా ఆర్థిక స్వాతంత్రం కల్పించనుంది.

ఇందులో భాగంగా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, సఫాయి మిత్రలు మరియు సమాజంలోని ఇతర అట్టడుగు వర్గాలకు చేందిన వ్యాపారులకు పూచీకత్తు లేకుండా లక్ష వరకు వ్యక్తిగత రుణం మరియు 15 లక్షల వ్యాపార రుణాలు అందిస్తుంది. ఈ ఆర్థిక సహాయం లబ్ధిదారులకు నేరుగా అందించడం ద్వారా మధ్యవర్తులు మరియు అవినీతికి తోవ లేకుండా చేస్తుంది.

  • పీఎం - సూరజ్ అనేది అట్టడుగు వర్గాలకు వ్యాపార సాధికారత కల్పించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ కార్యక్రమం.
  • ఈ పథకం సమాజంలోని వెనుకబడిన వర్గాల వారికి వ్యాపారాలను ప్రారంభించడంలో లేదా విస్తరించడంలో సహాయపడటానికి వారికి రుణాలను అందిస్తుంది.
  • షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు (బీసీ), సఫాయి మిత్రలు మరియు సమాజంలోని ఇతర అట్టడుగు వర్గాల వ్యాపార ఔత్సాహికులు అర్హులు.
  • ఈ పథకం వ్యాపార విస్తరణ కోసం 15 లక్షల వరకు రుణ సహాయం అందిస్తుంది.

8 ముంబై రైల్వే స్టేషన్ల పేరు మార్పుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం

బ్రిటీష్ వలసరాజ్యాల కాలం నాటి పేర్లతో ఉన్న ఎనిమిది ముంబై రైల్వే స్టేషన్లకు పేరు మార్చాలని మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నూతన పేర్లను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపించింది. రైల్వే శాఖ ఆమోదం పొందిన తర్వాత, కర్రీ రోడ్డు పేరును లాల్‌బాగ్‌గా, శాండ్‌హర్స్ట్ రోడ్డును డోంగ్రీగా, మెరైన్ లైన్‌ పేరును ముంబాదేవిగా పేరు మార్చనున్నారు.

అలానే కాటన్ గ్రీన్ పేరును కాలాచౌకీగా, చర్ని రోడ్డు నుండి గిర్‌గావ్‌గా, డాక్‌యార్డ్ రోడ్డు నుండి మజ్‌గావ్‌గా మరియు కింగ్ సర్కిల్‌ను తీర్థకర్ పార్శివనాథ్‌గా అలానే ముంబై సెంట్రల్ స్టేషన్‌కు నానా జగన్నాథ్ శంకర్‌షేత్ స్టేషన్‌గా పేరు మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఓల్డ్ స్టేషన్ పేరు న్యూ స్టేషన్ పేరు
కర్రీ రోడ్డు లాల్‌బాగ్
శాండ్‌హర్స్ట్ డోంగ్రీ
మెరైన్ లైన్‌ ముంబాదేవి
కాటన్ గ్రీన్ కాలాచౌకీ
చర్ని రోడ్డు గిర్‌గావ్‌
డాక్‌యార్డ్ రోడ్డు మజ్‌గావ్‌
కింగ్ సర్కిల్‌ తీర్థకర్ పార్శివనాథ్‌
ముంబై సెంట్రల్ స్టేషన్‌ నానా జగన్నాథ్ శంకర్‌షేత్ స్టేషన్‌

వీటిలో పాటుగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మహారాష్ట్ర భవన్‌ను నిర్మించేందుకు 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో కాశ్మీర్‌లో భూమి కొనుగోలు చేసిన తొలి భారత రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించింది. దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదన ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ యొక్క మునుపటి బడ్జెట్ సెషన్‌లో పేర్కొంది. ఈ ప్రాంతాన్నిసందర్శించే ఆ రాష్ట్ర పర్యాటకులు మరియు అధికారుల కోసం మహారాష్ట్ర భవన్‌ను నిర్మించనున్నారు.

అలానే అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యానగర్‌గా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే, ఉత్తాన్ (భయందర్) మరియు విరార్ (పాల్ఘర్) మధ్య సముద్ర లింక్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Advertisement

Post Comment