తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 17 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 17 మార్చి 2024

17 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

Advertisement

పీబీ-శబ్ద్ పేరుతొ న్యూస్ షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించిన ప్రసార భారతి

ప్రముఖ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి, పీబీ-శబ్ద్ పేరుతొ న్యూస్ షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించింది. మార్చి 13న న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసార భారతి మరియు డీడీ న్యూస్ మరియు ఆకాశవాణి న్యూస్ వెబ్‌సైట్‌లతో పాటు అప్‌డేట్ చేసిన న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ నుండి న్యూస్ షేరింగ్ సర్వీస్ అయిన పీబీ-శబ్ద్ (PB-SHABD) సేవలు ప్రారంభించారు.

కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వీటిని ఆవిష్కరించారు. పీబీ-శబ్ద్ అక్షర, ఆడియో, వీడియో మరియు చిత్రాలతో సహా వివిధ ఫార్మాట్‌లలో వార్తల ఫీడ్‌లను అందిస్తుంది. ఈ సేవలు అన్ని ప్రధాన భారతీయ భాషలు మరియు యాభై విభిన్న అంశాలతో కవర్ చేయబడతాయి.

ఈ యాప్‌లో కస్టమైజ్డ్ వార్తల ఫీడ్‌, బ్రేకింగ్ న్యూస్ కోసం పుష్ నోటిఫికేషన్‌లు, మల్టీమీడియా కంటెంట్ ఇంటిగ్రేషన్, ఆఫ్‌లైన్ రీడింగ్ కెపాబిలిటీ, రియల్ టైమ్ కవరేజ్ కోసం లైవ్ స్ట్రీమింగ్, సులభమైన సోషల్ మీడియా షేరింగ్, లొకేషన్-బేస్డ్ న్యూస్ డెలివరీ, కథనాలను సేవ్ చేయడానికి బుక్‌మార్కింగ్ వంటి అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

  • ప్రసార భారతి ఒక భారతీయ ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ సంస్థ.
  • ఇది 23 నవంబర్ 1997లో న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయబడింది.
  • దీని పరిధిలో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఏజెన్సీలు సేవలు అందిస్తున్నాయి.
  • రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ 2021 ప్రకారం డిడి న్యూస్ మరియు ఆల్ ఇండియా రేడియో భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన న్యూస్ బ్రాండ్‌లుగా గుర్తించబడ్డాయి.
  • ప్రసార భారతి కొత్త చైర్మన్‌గా నవనీత్ కుమార్ సెహగల్ ఇటీవలే మార్చి 2024లో నియమితులయ్యారు.
  • ఇది కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో సేవలు అందిస్తుంది.

ఆఫ్రికాలో వేగవంతమైన మలేరియా మరణాల తగ్గింపు కోసం యౌండే డిక్లరేషన్

ఆఫ్రికాలో వేగవంతమైన మలేరియా మరణాల తగ్గింపు కోసం 11 ఆఫ్రికా దేశాలు యౌండే డిక్లరేషన్‌పై సంతకం చేశాయి. మలేరియా భారం ఎక్కువగా ఉన్న ఆఫ్రికన్ దేశాలకు చెందిన ఆరోగ్య మంత్రులు మార్చి 6న కామెరూన్‌లోని యౌండేలో సమావేశమై ఈ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఈ కార్యక్రమంను ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు కామెరూన్ ప్రభుత్వం సహ-హోస్ట్ చేసాయి.

యౌండే డిక్లరేషన్‌పై సంతకం చేసిన దేశాలలో బుర్కినా ఫాసో, కామెరూన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఘనా, మాలి, మొజాంబిక్, నైజర్, నైజీరియా, సూడాన్, ఉగాండా మరియు టాంజానియాలు ఉన్నాయి. ఈ డిక్లరేషన్‌ మలేరియా నియంత్రణ కార్యక్రమాలకు దేశీయ నిధులను పెంచడం, డేటా సేకరణ మరియు విశ్లేషణ వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది.

ప్రపంచ మొత్తం మలేరియా కేసుల్లో 94% (233 మిలియన్ కేసులు) మరియు 95% మలేరియా మరణాలు (580,000 మరణాలు) ఈ ఖండంలో సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. మానవతా సంక్షోభాలు, ఆరోగ్య సేవల ప్రాప్యత లేకపోవడం మరియు వాతావరణ మార్పులు, లింగ-సంబంధిత అడ్డంకులు, పురుగుమందులు మరియు మాదకద్రవ్యాల నిరోధకత వంటి జీవసంబంధమైన బెదిరింపులు వంటి కారణాల వల్ల 2017 నుండి ఈ ఖండంలో ఈ కేసులు పెరుగుతున్నాయి.

యౌండే డిక్లరేషన్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని విస్తరించడం మరియు పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం ద్వారా పునరుద్ధరించబడిన నిబద్ధతతో ఆఫ్రికాలో మలేరియా మరణాలను తొలగించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.

సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్‌ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడుగా రచిన్ రవీంద్ర

24 ఏళ్ళ న్యూజీలాండ్ యువ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర, సర్ రిచర్డ్ హ్యాడ్లీ పతకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. గత ఏడాది మార్చిలో జట్టులోకి ప్రవేశించిన తర్వాత, రవీంద్ర భారతదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో మూడు సెంచరీలు మరియు రెండు అర్ధ సెంచరీలతో సహా 64 సగటుతో 578 పరుగులు చేశాడు.

ఈ అద్భుతమైన ఆట తీరుకు గాను రవీంద్ర 2023 సంవత్సరానికి ఐసీసీ యొక్క ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అలానే డిసెంబర్ నెలలో జరిగిన ఐపీల్ 2024 వేలంలో 1.8 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఒప్పందాన్ని కూడా పొందాడు.

ఈ ఏడాది బే ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 240 పరుగులతో న్యూజిలాండ్‌లో అత్యధిక తొలి టెస్టు సెంచరీని నమోదు చేయడంతోపాటు, దక్షిణాఫ్రికాపై బ్లాక్‌క్యాప్స్ తొలి టెస్టు సిరీస్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు.

సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ అనేది న్యూజిలాండ్ అత్యుత్తమ ఆటగాడికి అందించే వార్షిక అవార్డు. ఈ అవార్డు 2011 నుండి ఏటా అందిస్తున్నారు. న్యూజీలాండ్ ఉత్తమ మహిళా క్రికెటర్ కోసం 2023 నుండి డెబ్బీ హాక్లీ మెడల్ అందిస్తున్నారు.

  • సర్ రిచర్డ్ హాడ్లీ పతకం - రచిన్ రవీంద్ర (ఉత్తమ పురుష క్రికెటర్)
  • డెబ్బీ హాక్లీ పతకం - మెలీ కెర్ బెర్ట్ (ఉత్తమ మహిళా క్రికెటర్)
  • సట్‌క్లిఫ్ పతకం - ట్రూడీ అండర్సన్ (క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు)
  • టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – కేన్ విలియమ్సన్
  • పురుషుల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – డారిల్ మిచెల్
  • మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ – మెలీ కెర్
  • పురుషుల టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – మిచెల్ సాంట్నర్
  • మహిళల టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ – మెలీ కెర్

పోబిటోరా అభయారణ్యాన్ని డి-నోటిఫై చేయాలన్న అస్సాం ప్రభుత్వ చర్యపై సుప్రీం స్టే

పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యాన్ని డి-నోటిఫై చేయాలన్న అస్సాం క్యాబినెట్ యొక్క వివాదాస్పద చర్యపై భారత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఇటీవలే పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఏర్పాటుకు సంబంధించి విడుదల చేసిన దాదాపు 26 ఏళ్ల (1998) నాటి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని అస్సాం ప్రభుత్వం భావించింది.

అయితే అస్సాం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పర్యావరణవేత్తలు మరియు వన్యప్రాణుల నిపుణుల నుండి విమర్శలను ఎదుర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీంతో స్పందించిన కోర్టు డీ నోటిఫికేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ మార్చి 13న స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 24, 2024న షెడ్యూల్ చేసింది.

  • అస్సాంలోని గౌహతి సమీపంలో ఉన్న డీపోర్ బీల్ మరియు పోబిటోరా అనే రెండు వన్యప్రాణుల అభయారణ్యాలు బ్రహ్మపుత్ర నదికి సమీపంలో  ఉన్నాయి.
  • 900-హెక్టార్ల ఈ సహజ చిత్తడి నేల మరియు వన్యప్రాణుల అభయారణ్యం ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు కీలకమైన ఆవాసలుగా ఉన్నాయి.
  • ఈ రెండు రక్షిత ప్రాంతలను డి-నోటిఫై చేసి అభివృద్ధి ప్రాజెక్టులకు అనుసంధానం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.
  • ఇందులో భాగంగానే ఇటీవలే కాలంలో ఈ ప్రాంతమలోని సరస్సులోకి వ్యర్థాలు మరియు మురుగునీరు అనియంత్రితంగా డంపింగ్ చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది.
  • దీని ఉనికికి ముప్పు వాటిల్లడంపై గౌహతి హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయబడింది.
  • దీనికి సమాధానంగా డీపోర్ బీల్ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పర్యావరణ సున్నితమైన జోన్‌గా పేర్కొంటూ జనవరి 18, 2024లోగా నోటిఫికేషన్ జారీ చేయాలని అస్సాం ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

జాతీయ ఉద్యానవనలు, వన్యప్రాణుల అభయారణ్యలు ప్రకటించడం లేదా డి-నోటిఫై చేయడం చాలా సుదీర్ఘమైన ప్రక్రియ, ఇది ఆకస్మికంగా జరగదు. ఏదైనా అభయారణ్యం లేదా జాతీయ ఉద్యానవనం యొక్క డీనోటిఫికేషన్ ప్రతిపాదనకు వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 ప్రకారం నేషనల్ బోర్డ్ ఫర్ వన్యప్రాణుల సిఫార్సు చేయాలి, ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదం చేయాల్సి ఉంటుంది.

సుప్రీం కోర్ట్ జోక్యం తాత్కాలిక ఉపశమనాన్ని అందించినప్పటికీ, పోబిటోరా భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఈ అభయారణ్యం యొక్క దీర్ఘకాలిక విధి అస్సాం ప్రభుత్వ ప్రతిస్పందన మరియు కోర్టు యొక్క తుది తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఈ ఉదంతం భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణతో అభివృద్ధి అవసరాలను సమతుల్యం చేయడం గురించి కొత్త చర్చలను రేకెత్తిస్తుంది.

సాహిత్య అకాడమీ అవార్డులు 2023

సాహిత్య అకాడమీ తన 2023 వార్షిక సాహిత్య అకాడమీ అవార్డులను 24 భాషలలో ప్రకటించింది. ఈ ఏడాది 9 కవితా పుస్తకాలు, 6 నవలలు, 5 చిన్న కథలు, 3 వ్యాసాలు మరియు 1 సాహిత్య అధ్యయనం సాహిత్య అకాడమీ అవార్డులను గెలుచుకున్నాయి.

24 భారతీయ భాషల్లో ప్రముఖ జ్యూరీ సభ్యులు సిఫార్సు చేసిన ఈ అవార్డులను సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ మాధవ్ కౌశిక్ అధ్యక్షతన 2023 డిసెంబర్ 20న సమావేశమైన సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది. ఈ అవార్డులను మార్చి 12న నిర్వహించిన సాహిత్యోత్సవంలో నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ 70వ వార్షికోత్సవ వేడుక వేదికగా అందజేశారు.

ఈ అవార్డులు 1 జనవరి 2017 మరియు 31 డిసెంబర్ 2021 మధ్య ఐదు సంవత్సరాలలో మొదటిసారిగా ప్రచురించబడిన పుస్తకాలకు సంబంధించి అందించబడ్డాయి. విజేతలకు రాగి ఫలకం, శాలువా మరియు లక్ష రూపాయల నగదు బహుమతి అందజేసారు.

వర్గం అవార్డు గ్రహీతలు
కవిత్వం
  • విజయ్ వర్మ (డోగ్రీ)
  • వినోద్ జోషి (గుజరాతీ)
  • మన్షూర్ బనిహాలి (కాశ్మీరి)
  • సోరోఖైబామ్ గంభీని (మణిపురి)
  • అశుతోష్ పరిదా (ఒడియా)
  • స్వర్ణజిత్ సావి (పంజాబీ)
  • గజే సింగ్ రాజ్‌పురోహిత్ (రాజస్థానీ),
  • అరుణ్ రంజన్ మిశ్రా (సంస్కృతం)
  • వినోద్ అసుదాని (సింధీ)
నవల
  • స్వప్నమయ్ చక్రబర్తి (బెంగాలీ)
  • నీలం సరన్ గౌర్ (ఇంగ్లీష్)
  • సంజీవ్ (హిందీ)
  • కృష్ణత్ ఖోట్ (మరాఠీ)
  • రాజశేఖరన్ (దేవీభారతి) (తమిళం)
  • సాదిక్వా నవాబ్ సాహెర్ (ఉర్దూ)
చిన్న కథలు
  • ప్రణవ్‌జ్యోతి దేకా (అస్సామీ)
  • నందీశ్వర్ దైమారీ (బోడో)
  • ప్రకాష్ ఎస్. పరీంకర్ (కొంకణి)
  • తారసీన్ బాస్కీ (తురియా చంద్ బాస్కీ) (సంతాలి
  • టి. పతంజలి శాస్త్రి (తెలుగు)
వ్యాసాలు
  • లక్ష్మీషా తోల్పాడి (కన్నడ)
  • బసుకినాథ్ ఝా (మైథిలి)
  • జుధాబీర్ రాణా (నేపాలీ)
సాహిత్య అధ్యయనం ఈవీ రామకృష్ణన్ (మలయాళం)
  • సాహిత్య అకాడమీ అవార్డు అనేది భారతదేశంలో అందించే అత్యుత్తమ సాహిత్య పురస్కారం.
  • ఈ అవార్డు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లోని 22 భాషలలో ప్రచురించబడిన అత్యుత్తమ పుస్తక రచయితలకు ప్రదానం చేయబడుతుంది.
  • అలాగే సాహిత్య అకాడమీ అవార్డు ఇంగ్లీష్ మరియు రాజస్థానీ భాషలలో రచనలకు కూడా అందించబడుతుంది.
  • సాహిత్య అకాడమీ అవార్డులు మొదటిసారి 1954 లో అందజేశారు.

కొత్త ఎన్నికల కమిషనర్‌లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు నియామకం

మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్‌బీర్ సింగ్ సంధు లోక్‌సభ ఎన్నికలకు ముందు కొత్త ఎన్నికల కమిషనర్‌లుగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సెలక్షన్ ప్యానెల్ వీరిని మార్చి 15న ఎన్నికల కమిషనర్లుగా నియమించింది. ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో వీరు ఏ నూతన బాధ్యతలు స్వీకరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయడం, ఈ నెల మొదటి వారంలో 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొన్ని రోజుల ముందు అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామా చేయడంతో ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డయి.

ఎన్నికల కమీషనర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 14, 2024న గెజిట్‌లో ప్రచురించబడింది. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన జ్ఞానేష్ కుమార్ (కేరళ కేడర్) మరియు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు ఈ పదవులకు నియమించబడ్డారు.

జ్ఞానేష్ కుమార్ : జ్ఞానేష్ కుమార్ కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 60 ఏళ్ల కుమార్ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి పనిచేశారు. జనవరి 31, 2024న అమిత్ షా ఆధ్వర్యంలోని సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. అంతకు ముందు, అతను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు.

సుఖ్‌బీర్ సింగ్ సంధు : సుఖ్‌బీర్ సింగ్ కూడా 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయితే ఉత్తరాఖండ్ కేడర్‌కు చెందినవాడు. 2021లో పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంధు ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

  • కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ సెలక్షన్ ప్యానెల్ ద్వారా జరుగుతుంది.
  • కేంద్ర న్యాయ మంత్రి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రస్తుత విధానం ప్రకారం అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను సిద్ధం చేస్తుంది.
  • ఆ తర్వాత, ప్రధానమంత్రి నేతృత్వంలోని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు కేంద్ర మంత్రితో కూడిన ఎంపిక ప్యానెల్ తుది నియామకాలను ఎంపిక చేస్తుంది.
  • ఎంపిక ప్యానెల్ ప్రతిపాదించిన అధికారులను రాష్ట్రపతి అధికారికంగా నియమిస్తారు.
  • ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ప్యానెల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యుడుగా ఉండాలని గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
  • అయితే ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని నియమించేలా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకొచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లో 8 రైల్వే స్టేషన్‌ల పేరు మార్పుకు ప్రతిపాదన

ఉత్తరప్రదేశ్‌లో 8 రైల్వే స్టేషన్‌ల పేరు మార్చాలనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన ఆమోదం తెలిపింది. ఈ చొరవ అమేథీ బీజేపీ ఎంపి స్మృతి ఇరానీ నేతృత్వంలోని ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక గుర్తింపు మరియు వారసత్వాన్ని కాపాడటం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రభుత్వం పంపిన ఈ ప్రతిపాదనలో కాసింపూర్ హాల్ట్‌ను జైస్ సిటీగా, జైస్‌ను గురు గోరఖ్‌నాథ్ ధామ్‌గా, బనీని స్వామి పరమహంస్‌గా, మిస్రౌలీని మా కాళికాన్ ధామ్‌గా, నిహాల్‌ఘర్‌ను మహారాజా బిజిలీ పాసిగా, అక్బర్‌గంజ్‌ను అహోర్వా భవానీ ధామ్, వారిస్‌గంజ్ నుండి అమర్ షాహిద్ భలే సుల్తాన్‌గా మరియు ఫుర్సత్‌గంజ్ నుండి తాపేశ్వరనాథ్ ధామ్‌గా  మార్చనున్నట్లు పేర్కొన్నారు.

ఓల్డ్ స్టేషన్ పేరు న్యూ స్టేషన్ పేరు
కాసింపూర్ హాల్ట్ జైస్ సిటీ
జైస్ గురు గోరఖ్‌నాథ్ ధామ్‌
బాణీ స్వామి పరమహంస
మిస్రౌలీ మా కాలికాన్ ధామ్.
నిహాల్‌ఘర్ మహారాజా బిజిలీ పాసి
అక్బర్‌గంజ్ మా అహోర్వ భవానీ ధామ్
వారిస్‌గంజ్ అమర్ షాహిద్ భలే సుల్తాన్
ఫుర్సత్‌గంజ్ తాపేశ్వరనాథ్ ధామ్

Advertisement

Post Comment