వీక్లీ కరెంట్ అఫైర్స్ 20 ఫిబ్రవరి 2023 తెలుగులో ఉచితంగా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల సౌలభ్యం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న తాజా సమకాలిన అంశాలను మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఈ సమాచారం మీ పోటీపరీక్షల సన్నద్ధతను మరింత మెరుగుపరుచుస్తుందని భావిస్తున్నాం.
ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫిబ్రవరి 13న అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2015 లో తన కెరీర్ ప్రారంభించిన మోర్గాన్, ఇంగ్లాండ్ తరుపున 225 వన్డే మ్యాచులకు ప్రాతినిధ్యం వహించాడు. ఈయన నాయకత్వంలో 125 వన్డేలు ఆడిన ఇంగ్లాండ్ జట్టు 76 మ్యాచులలో విజేతగా నిలిచింది. మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లండ్ 2019లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
మోర్గాన్ 100 టీ20ఐలు (కెప్టెన్‌గా 57) ఆడిన ఇంగ్లండ్‌కు మొదటి పురుష క్రికెటర్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌లో జన్మించిన మోర్గాన్, 2006 అండర్-19 ప్రపంచ కప్‌లో ఐర్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 5 ఆగష్టు 2006న స్కాట్లాండ్‌తో జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్ తరపున తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అలానే మోర్గాన్ రెండు దేశాల తరుపున ఒన్డే సెంచరీలు చేసిన మొదటి ఆటగాడుగా నిలిచాడు.
ఏంజెలా మెర్కెల్‌కు యునెస్కో శాంతి బహుమతి
జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫెలిక్స్ హౌఫౌట్-బోయిగ్నీ యునెస్కో శాంతి బహుమతి 2022ను అందుకున్నారు. ఈ అవార్డును గత ఏడాది చివరిలో యునెస్కో ప్రకటించింది. తాజాగా ఐవోరియన్‌లో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో ఆమెకు అందజేశారు.
స్వదేశంలో మరియు యూరోపియన్ భాగస్వాములలో ప్రతిఘటన ఉన్నప్పటికీ 2015-2016 మధ్యకాలంలో 1.2 మిలియన్లకు పైగా శరణార్థులకు జర్మనీలోకి ఆహ్వానించి, వారికీ సహాయం చేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డు అందించారు.
ఏంజెలా మెర్కెల్ ఒక జర్మన్ మాజీ రాజకీయవేత్త మరియు శాస్త్రవేత్త. ఆమె 2005 నుండి 2021 వరకు జర్మనీ ఛాన్సలర్‌గా పనిచేశారు. మెర్కెల్ 2005లో జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఛాన్సలర్‌గా ఉన్న సమయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) లో కీలక నాయకురాలిగా వ్యవహరించారు.
2014 -15 లలో సిరియా , ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇతర ప్రాంతాలలో చోటుచేసుకున్న సంఘర్షణల కారణంగా సొంత దేశాలను విడిచిన లక్షలాది మంది వలసదారులకు ఆమె నాయకత్వంలోని జర్మనీ పునరావాసం కల్పించింది.
బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా మొహమ్మద్ షహబుద్దీన్
బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా ఆ దేశ మాజీ న్యాయమూర్తి మరియు స్వాతంత్ర్య సమరయోధుడు మహ్మద్ షహబుద్దీన్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి షహబుద్దీన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికకు అవకాశం లేకుండా ఆయన 22వ బంగ్లాదేశ్ అధ్యక్షుడుగా అవతరించారు.
మహ్మద్ షహబుద్దీన్ 1949లో పాబ్నాలో జన్మించాడు. ఈయన 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్నారు. ఆతర్వాత అవినీతి నిరోధక కమిషన్ కమిషనరుగా, న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వర్తించారు.
ప్రస్తుత బంగ్లాదేశ్ రాష్ట్రపతి అబ్దుల్ హమీద్ పదవీకాలం ఏప్రిల్ 23తో ముగియనుంది. ఈయన ఐదేళ్లపాటు వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేశారు. బంగ్లాదేశ్ రాజ్యాంగం ఏ వ్యక్తికి రెండు పర్యాయాలకు మించి అధ్యక్ష పదవిని చేపట్టడానికి అనుమతించదు.
ప్రసాద్ పథకం కింద కర్ణాటకలో 4 యాత్రిక కేంద్రాలు ఎంపిక
ప్రసాద్ మరియు స్వదేశ్ దర్శన్ 2.0 పథకాల కింద అభివృద్ధి కోసం కర్ణాటకలో నాలుగు యాత్రికుల కేంద్రాలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో మైసూరులోని చాముండేశ్వరి ఆలయం, ఉడిపి జిల్లాలోని శ్రీ మధ్వ వన, బీదర్ జిల్లాలోని పాప్నాష్ ఆలయం, బెళగావి జిల్లాలోని శ్రీ రేణుకా యల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. స్వదేశ్ దర్శన్ పథకం కింద హంపి మరియు మైసూరు వారసత్వ ప్రదేశాలు ఇప్పటికే ఆ రాష్ట్రం నుండి ఎంపిక చేయబడ్డాయి.
భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2014-2015 సంవత్సరంలో ప్రసాద్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశంలోని తీర్థయాత్ర గమ్యస్థానాలను ఏకీకృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశం అంతటా పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఆ ప్రాంతాల నివాసితులకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రసాద్ పథకం పరిధిలో ఎంపికైన ప్రాముఖ్య యాత్ర కేంద్రాల జాబితాలో అమృత్‌సర్, అజ్మీర్, ద్వారక, మధుర, వారణాసి, గయా, పూరి, కాంచీపురం, వెల్లంకన్ని, కేదార్‌నాథ్, కామాఖ్య మరియు పాట్నా వంటివి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతి మరియు శ్రీశైలం ఇందులో చోటు దక్కించుకున్నాయి.
ఏపీలో 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలలో 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. ఈ పర్యాటక పోలీసు స్టేషన్‌లు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిచే నిర్వహించబడతాయి. ఇవిస్థానిక పోలీస్ స్టేషన్‌లతో అనుసంధానించబడి, ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక భద్రతకు ఊతం ఇస్తాయి.
కొత్తగా ప్రారంభించిన టీపీఎస్‌లలో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, వంటిమిట్ట, కుక్కుటేశ్వర స్వామి ఆలయం, రాజమండ్రిలోని పుష్కరఘాట్, ద్వారకా తిరుమల, మంగినపూడి బీచ్, మోపిదేవి ఆలయం, ఇంద్రకీలాద్రి ఆలయం, భవానీ ద్వీపం, మైపాడు బీచ్, శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మహానంది, అహోబిలం, మంత్రాలయం, హార్సిలీ కొండలు, లేపాక్షి దేవాలయాలు ఉన్నాయి.
ఐసీఏఐ కొత్త అధ్యక్షుడిగా అనికేత్ సునీల్ తలతి
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త అధ్యక్షుడుగా అనికేత్ సునీల్ తలాటి నియమితులయ్యారు. ఈయన 2023-24 ఏడాదికి సంబంధించి ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అదే సమయంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడుగా రంజీత్ కుమార్ అగర్వాల్ ఎన్నికయ్యారు.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియంత్రణలోని భారతదేశపు అతిపెద్ద ప్రొఫెషనల్ అకౌంటింగ్ బాడీ. ఇది దేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తికి సంబందించిన వ్యవహారాలను నియంత్రించడం కోసం చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం ద్వారా 1949లో స్థాపించబడింది.
ఇది భారతదేశంలో అకౌంటింగ్ ప్రమాణాలు మరియు ఆడిటింగ్ ప్రమాణాలను నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) కి, భారత ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
అక్రమ మైనింగ్‌ను అరికట్టడానికి ఖనన్ ప్రహరీ మొబైల్ యాప్
అనధికార బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను నివేదించడం కోసం భారత ప్రభుత్వం "ఖనన్‌ప్రహరి" అనే మొబైల్ యాప్ మరియు కోల్ మైన్ సర్వైలెన్స్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMSMS) అనే ఒక వెబ్ యాప్‌ను ప్రారంభించింది. ఇవి అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పౌరులు ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పిస్తాయి.
తద్వారా లా & ఆర్డర్ ఎన్‌ఫోర్సింగ్‌లను ఉపయోగించి కోల్‌ఫీల్డ్ ప్రాంతాలలో అక్రమ బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి అక్రమ బొగ్గు మైనింగ్ సంఘటనను జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోగ్రాఫ్‌ల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తాయి.
భారత్ & ఫిజీ మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
భారతదేశం మరియు ఫిజీ దేశాలు దౌత్య మరియు అధికారిక పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నవారి వీసా మినహాయింపుకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, దౌత్య మరియు అధికారిక పాస్‌పోర్ట్ హోల్డర్‌లు 90 రోజుల వరకు వీసా లేకుండా ఇరు దేశాల్లో సందర్శించేందుకు లేదా నివశించేందుకు అనుమతి లభిస్తుంది.
ఈ ఎంఓయూ ఒప్పందం ఫిజీ ప్రధాన మంత్రి సితివేణి రబుకా మరియు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సమక్షంలో జరిగింది. ఈ ఒప్పందం ఫిజీని సందర్శించే భారత యాత్రికులకు, అలానే వైద్య చికిత్స మరియు విద్యా ప్రయోజనాల కోసం భారతదేశాన్ని సందర్శించే ఫిజీ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఫిజీ, దక్షిణ పసిఫిక్‌లోని 322 ద్వీపాలతో కూడిన ఒక ద్వీపసమూహం. దీని రాజధాని నగరం సువా. ఇది ఆస్ట్రేలియా ఖండంలోకి వస్తుంది. దీని మొత్తం జనాభా 10 లక్షలు. ఫిజీ మొత్తం జనాభాలో 37 శాతం మంది భారతీయ హిందువులు ఉండగా, 20 శాతం మంది ముస్లింలు మరియు 6 శాతం క్రైస్తవులు ఉన్నారు.
యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి బ్యాంకుగా పేటీఎం
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ దేశంలో యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి బ్యాంకుగా నిలిచింది. ఈ యూపీఈ లైట్ ఫీచర్ తక్షణ యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం చేస్తుంది. దీని ద్వారా ఒకే క్లిక్‌తో వేగవంతమైన చెల్లింపులను నిర్వహించవచ్చు. దీని కోసం వినియోగదారుడు ప్ర్యత్యేకంగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
యూపీఐ లైట్ అనేది వినియోగదారులను ఆఫ్‌లైన్‌లో చిన్న-విలువ చెల్లింపులను చేయడానికి డిజైన్ చేయబడిన 'ఆన్-డివైస్ వాలెట్' ఫీచర్. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ యూపీఈ లైట్ ఫీచర్‌ను గత ఏడాది సెప్టెంబరులో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది బ్యాంకింగ్ సిస్టమ్‌పై భారాన్ని తగ్గించడానికి రూపొందించబడింది.
విశాఖపట్నంలో రెండు రోజుల 'గ్లోబల్ టెక్ సమ్మిట్'
జీ20 సమ్మిట్‌లో భాగమైన గ్లోబల్ టెక్ సమ్మిట్ 2023 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 16, 17వ తేదీలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 25కి పైగా దేశాల నుంచి దాదాపు 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంకు ముఖ్యా అతిధిగా హాజరయ్యారు.
గ్లోబల్ టెక్ సమ్మిట్ అనేది ఆరోగ్యం, టెక్, ఫైనాన్స్, ఫార్మా, సైన్స్ మరియు ఇతర పారిశ్రామిక రంగాలలో నూతన సాంకేతికతను ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించే కార్యక్రమం. గ్లోబల్ టెక్ సమ్మిట్ బహుళ రంగాలలో నూతన ఆవిష్కరణలు మరియు పరిశ్రమ వృద్ధికి తోడ్పడే అత్యుత్తమ, మార్కెట్-ఆధారిత ఈవెంట్‌లను ఉత్పత్తి చేయడానికి కట్టుబడి ఉంటుంది. దేనిని భారతదేశంలో నిర్వహించడం ఇదే మొదటిసారి.
స్పెయిన్‌లో పీరియడ్ లీవ్ చట్టం ఆమోదం
స్పెయిన్ పార్లమెంట్ ఫిబ్రవరి 16న పీరియడ్ లీవ్ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం బాధాకరమైన పీరియడ్స్ ఉండే మహిళలకు పని నుండి వేతనంతో కూడిన "రుతుక్రమం సెలవు " తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీనితో ఈ రకమైన చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి యూరోపియన్ దేశంగా స్పెయిన్ నిలిచింది.
జపాన్ 1947లో కార్మిక చట్టంలో రుతుక్రమ సెలవులను ప్రవేశపెట్టిన మొదటి దేశంగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తక్కువ సంఖ్యలో దేశాల్లో మాత్రమే ఋతు సెలవులు అందించబడుతున్నాయి, వాటిలో జపాన్, ఇండోనేషియా మరియు జాంబియా వంటి దేశాలు ఉన్నాయి.
యూట్యూబ్ కొత్త సీఈవోగా ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్
భారతీయ అమెరికన్ నీల్ మోహన్ గూగుల్ వీడియో విభాగం యూట్యూబ్‌కి కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. నీల్ మోహన్ 2015 నుండి యూట్యూబ్‌కి చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. గూగుల్ యొక్క ప్రారంభ ఉద్యోగులలో ఒకరైన సుసాన్ వోజ్కికి 2014 నుండి యూట్యూబ్ సీఈవోగా ఉన్నారు. ఆమె ఈ పదవి నుండి తప్పుకోవడంతో నీల్ మోహన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలుగులో ఫిబ్రవరి 2023 కరెంట్ అఫైర్స్
-
వీక్లీ కరెంట్ అఫైర్స్ : 1 ఫిబ్రవరి 2023
-
వీక్లీ కరెంట్ అఫైర్స్ : 6 ఫిబ్రవరి 2023
-
వీక్లీ కరెంట్ అఫైర్స్ : 13 ఫిబ్రవరి 2023
-
వీక్లీ కరెంట్ అఫైర్స్ : 20 ఫిబ్రవరి 2023
-
వీక్లీ కరెంట్ అఫైర్స్ : 27 ఫిబ్రవరి 2023
-
కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ : ఫిబ్రవరి 2023
-
కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు : ఫిబ్రవరి 2023
-
ముఖ్యమైన రోజులు & తేదీలు : ఫిబ్రవరి 2023
ఇండో జపాన్ ఎక్సర్‌సైజ్ ధర్మ గార్డియన్ ప్రారంభం
ఇండో జపాన్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ “ధర్మ గార్డియన్” జపాన్‌లోని షిగా ప్రావిన్స్‌లోని క్యాంప్ ఇమాజులో ఫిబ్రవరి 17న ప్రారంభమయ్యింది. ఈ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ 17 ఫిబ్రవరి నుండి 02 మార్చి 2023 వరకు నిర్వహించబడుతోంది. భారత సైన్యం యొక్క గర్హ్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ మరియు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ దళాలు ఈ సంవత్సరం కసరత్తులో పాల్గొంటున్నాయి.
ఎక్సర్‌సైజ్ ధర్మ గార్డియన్ భారత సైన్యం మరియు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య రక్షణ సహకార స్థాయిని మరింత మెరుగుపర్చేందుకు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు నిర్వహిస్తారు. ఇది ఎక్సర్‌సైజ్ ధర్మ గార్డియన్ యొక్క 4వ ఎడిషన్.
కర్ణాటక బ్యాంక్‌కి ప్రతిష్ట పురస్కారం
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క 'డిజిధన్ అవార్డ్స్ 2021-22' కింద కర్ణాటక బ్యాంక్‌కి 'ప్రతిష్ట పురస్కారం' లభించింది. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ కేటగిరీలో అత్యధిక భీమ్-యుపిఐ లావాదేవీలు నమోదు చేసినందుకు గాను ఈ అవార్డు అందించారు.
ఏఐ-ఆధారిత ఆధార్ మిత్ర చాట్‌బాట్ ప్రారంభం
ఆధార్ జారీ చేసే సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ మిత్ర అనే కొత్త ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఈ ఏఐ ఆధారిత చాట్‌బాట్, ఆధార్ కార్డుకు సంబంధించిన సందేహాలకు మరియు సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.
రంజీ ట్రోఫీ 2023 విజేతగా సౌరాష్ట్ర
ఫిబ్రవరి 19న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రంజీ ట్రోఫీ 2023 ఫైనల్‌లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో బెంగాల్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత 3 సీజన్లలో సౌరాష్ట్రకు ఇది రెండో టైటిల్. సౌరాష్ట్రకు లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ నాయకత్వం వహించాడు. జయదేవ్ ఉనద్కత్ రెండో ఇన్నింగ్స్‌లో 6/85తో సహా తొమ్మిది వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
రంజీ ట్రోఫీ అనేది భారత దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఛాంపియన్‌షిప్. ఇది ప్రాంతీయ మరియు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న బహుళ జట్ల మధ్య నిర్వహించబడుతుంది. ఇందులో 32 జట్లు నాలుగు గ్రూపులుగా పోటీ పడతాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 1935లో రంజీ ట్రోఫీని స్థాపించింది.