ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పథకాల జాబితా 2023 | పోటీ పరీక్షల ప్రత్యేకం
Study Material

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పథకాల జాబితా 2023 | పోటీ పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు పేరుతొ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, లా నేస్తం, నేతన్న నేస్తం వంటి ప్రధాన పథకాలతో పాటుగా పదుల సంఖ్యలో ఇతర సంక్షేమ పథకాలను అందిస్తుంది. పోటీ పరీక్షల దృక్కోణంలో వాటికీ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Advertisement

జగనన్న అమ్మ ఒడి పథకం

పిల్లలని బడికి లేదా కళాశాలకు పంపే నిరుపేద తల్లి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి ఆర్థిక సహాయం అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం 2019-2020 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు/కళాశాలలతో సహా అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు/ జూనియర్ కళాశాలల్లో I నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు అందిస్తున్నారు.

ఈ పథకం డ్రాపౌట్‌లకు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మరియు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు వర్తించదు. అలానే మిగతా విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరి. కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఈ ప్రయోజనం కల్పిస్తారు.

  • పథకం ప్రారంభం : 9 జనవరి 2020
  • ప్రారంభ ప్రదేశం : చిత్తూరులోని పివికెఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం
  • ప్రయోజనం : ఏటా జనవరిలో విద్యార్థి తల్లికి 15,000/- ఆర్థిక సాయం
  • ఎవరు అర్హులు : I నుండి ఇంటర్మీడియట్ చదివే నిరుపేద విద్యార్థులు

జగనన్న విద్యా దీవెన పథకం

జగనన్న విద్యా దీవెన అనేది ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతొ పిలిచే పథకాన్ని మొదటిసారిగా 27-6-2008 తేదీన అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రస్తుతం జగనన్న విద్యా దీవెన పేరుతొ ప్రతి మూడు నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ఈ పథకం మొదటిసారి 24 ఫిబ్రవరి 2020లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ మరియు ఇతర కోర్సులను అభ్యసించే విద్యార్థులకు వర్తిస్తుంది. ఈ పథకం కింద 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తారు. విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరి. ఈ పథకం డ్రాపౌట్‌లకు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మరియు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు వర్తించదు.

  • పథకం ప్రారంభం : 24 ఫిబ్రవరి 2020
  • ప్రారంభ ప్రదేశం : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం
  • ప్రయోజనం : 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • ఎవరు అర్హులు : ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ మరియు ఇతర కోర్సులు

జగనన్న వసతి దీవెన పథకం

జగనన్న వసతి దీవాన పథకం కింద బీపీఎల్‌ విద్యార్థులకు హాస్టల్‌, మెస్‌ ఛార్జీలను ప్రభుత్వం అందజేస్తుంది. కాలేజీల్లో విద్యార్థుల హాజరును పెంచేందుకు ప్రారంభించారు. ఈ పథకం మొదటిసారి 24 ఫిబ్రవరి 2020లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. దీనిని జగనన్న విద్యా దీవెన పథకానికి అదనంగా అందిస్తున్నారు.

ఈ పథకం ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ మరియు ఇతర కోర్సులను అభ్యసించే విద్యార్థులకు వర్తిస్తుంది. ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు పది వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15వేలు, డిగ్రీ విద్యార్థులకు 20వేల ఆర్థిక సాయం అందిస్తారు. విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరి. ఈ పథకం డ్రాపౌట్‌లకు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మరియు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు వర్తించదు.

  • పథకం ప్రారంభం : 24 ఫిబ్రవరి 2020
  • ప్రారంభ ప్రదేశం : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం
  • ప్రయోజనం : ఏడాదికి 20 వేల వరకు ఆర్థిక సాయం.
  • ఎవరు అర్హులు : ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ మరియు ఇతర కోర్సులు

జగనన్న విద్యా కానుక

జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే 1 నుండి పదో తరగతి విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, బెల్ట్, ఒక జత బూట్లు, జత సాక్స్, నోట్‌బుక్‌లు, డిక్షనరీ, స్కూల్ బ్యాగ్‌లతో కూడిన కిట్‌ను అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన అభ్యాస ఫలితాలను తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం 16 ఆగస్టు 2019ల మొదటిసారి ప్రారంబించారు.

  • పథకం ప్రారంభం : 16 ఆగష్టు 2019
  • ప్రారంభ ప్రదేశం : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం
  • ప్రయోజనం : స్టూడెంట్ కిట్
  • ఎవరు అర్హులు : ప్రభుత్వ పాఠశాలలో చదివే 1 నుండి 10వ తరగతి విద్యార్థులు

మన బడి నాడు నేడు

మన బడి నాడు నేడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచే కార్యక్రమం. ఈ పథకం ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడులను సిద్ధం చేసేందుకు రూపొందించారు. ఈ కార్యక్రమం కింది టాయిలెట్లు, ఫ్యాన్లు. ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, పాఠశాలల్లో కాంపౌండ్ గోడలు వంటి మౌలిక సదుపాయాలను పెంపొందిస్తారు.

ఈ కార్యక్రమం 14 నవంబర్ 2019లో మూడు సంవత్సరాల లక్ష్యంతో12000 కోట్లు బడ్జెట్ అంచనాతో ప్రారంభించబడింది. ఫేజ్-1లో దాదాపు 15,715 పాఠశాలలలో ఈ కార్యక్రమం అమలు చేశారు.

  • పథకం ప్రారంభం : 14 నవంబర్ 2019
  • ప్రారంభ ప్రదేశం : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం
  • ప్రయోజనం : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన

వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం

వైఎస్ఆర్ ఆసరా అనేది స్వయం సహాయక గ్రూపులకు (డ్వాక్రా గ్రూప్స్) చెందిన రుణ మాఫి పథకం. ఈ పథకాన్ని 11 సెప్టెంబర్ 2020న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. 2019 ముందు డ్వాక్రా మహిళలు తీసుకున్న సుమారు 27169 కోట్ల బ్యాంకు బకాయిలు మరియు రుణాలను ప్రభుత్వం నాలుగు విడుతలలో వారి ఖాతాలో జమ చేస్తుంది. ఇదే కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు 0% వడ్డీ రుణాలు మంజూరు చేయబడతాయి. ఈ వడ్డీని బ్యాంకర్లకు ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుంది.

  • పథకం ప్రారంభం : 11 సెప్టెంబర్ 2020
  • ప్రారంభ ప్రదేశం : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం
  • ప్రయోజనం : డ్వాక్రా రుణాల మాఫి & సున్నా వడ్డీ రుణాలు

వైఎస్ఆర్ చేయూత పథకం

వైఎస్ఆర్ చేయూత అనేది బలహీనమైన సామాజిక-ఆర్థిక నేపథ్యంకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఆర్థిక సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఏడాదికి 18750 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల కాలంలో మొత్తం 75000 ఆర్థిక సాయం అందిస్తారు.

ఈ పథకాన్ని 12 ఆగస్టు 2020లో మొదటిసారి ప్రారంభించారు. ఇదే కార్యక్రమం ద్వారా మహిళకు స్వయం ఉపాధిని కల్పించేందుకు వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం అమూల్ , పీ&జీ, ఐటీసీ లిమిటెడ్, హిందూస్తాన్ యూనిలీవర్, అల్లానా గ్రూప్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి వ్యాపార సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

  • పథకం ప్రారంభం : 12 ఆగష్టు 2020
  • మంత్రిత్వ శాఖ : మహిళా సంక్షేమ శాఖ
  • ప్రయోజనం : నాలుగేళ్లలో మొత్తం 75000/- ఆర్థిక సాయం
  • ఎవరు అర్హులు : 45 నుండి 60 ఏళ్ళ మధ్య ఉండే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనారిటీ మహిళలు

వైఎస్ఆర్ కాపు నేస్తం

వైఎస్ఆర్ కాపు నేస్తం అనేది కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాలకు చెందిన పేదరిక రేఖకు దిగువన ఉన్న 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఆర్థిక సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున ఐదేళ్లలో మొత్తం 75000 ఆర్థిక సాయం అందిస్తారు.

ఈ పథకాన్ని 24 జూన్ 2020లో మొదటిసారి ప్రారంభించారు. ఇదే కార్యక్రమం ద్వారా మహిళకు స్వయం ఉపాధిని కల్పించేందుకు వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం అమూల్ , పీ&జీ, ఐటీసీ లిమిటెడ్, హిందూస్తాన్ యూనిలీవర్, అల్లానా గ్రూప్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి వ్యాపార సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

  • పథకం ప్రారంభం : 24 జూన్ 2020
  • మంత్రిత్వ శాఖ : మహిళా సంక్షేమ శాఖ
  • ప్రయోజనం : ఐదేళ్లలో మొత్తం 75000/- ఆర్థిక సాయం
  • ఎవరు అర్హులు : 45 నుండి 60 ఏళ్ళ మధ్య ఉండే కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాల మహిళలు

వైఎస్ఆర్ లా నేస్తం

వైఎస్ఆర్ లా నేస్తం అనేది జూనియర్ న్యాయవాదులకు స్టైపెండ్ అందించే పథకం. ఈ పథకం జూనియర్ లాయర్లకు ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించారు. లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక, ప్రాక్టీసులో ఉన్న మొదటి మూడేళ్లు, నెలకు 5,000 స్టైపెండ్ ఈ పథకం ద్వారా అందిస్తారు.

ఈ కార్యక్రమాన్ని జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా 03 డిసెంబర్ 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం పొందేందుకు దరఖాస్తుదారు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్వహించే న్యాయవాదుల రోల్స్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలి.

  • పథకం ప్రారంభం : 03 డిసెంబర్ 2019
  • మంత్రిత్వ శాఖ : న్యాయ శాఖ
  • ప్రయోజనం : నెలకు 5వేల చెప్పున మూడేళ్లు
  • ఎవరు అర్హులు : జూనియర్ న్యాయవాదులు

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్యం అందించేందుకు రూపొందించబడింది. ఈ పథకం కింద ప్రతి బీపీఎల్ కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు హెల్త్ కవరేజీని అందిస్తుంది. గుర్తించబడిన ఆసుపత్రిల ద్వారా రీయింబర్స్‌మెంట్ మెకానిజం కింద ఉచిత వైద్య సేవ అందిచబడుతుంది.

ఈ పథకం 2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ చేత ప్రారంభించబడింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతొ ప్రారంభించిన ఈ పథకం దేశంలోనే మొదటి పూర్తిస్థాయి ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఇదే పథకాన్ని 3 జనవరి 2020లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు మార్చి ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ కొత్త పధకంను వెయ్యి రూపాల కనీస చికిత్స నుండి వర్తింప జేస్తున్నారు. అలానే రాష్టంలోనే కాకుండా బయట రాష్ట్రాలు మరియు విదేశీ వైద్యానికి కూడా వర్తింపజేస్తున్నారు. ఈ పథకం 3255 రకాల వ్యాధులకు కవర్ చేస్తున్నారు.

ఇదే పథకాన్ని ఉద్యోగులు మరియు పెన్షనర్స్ హెల్త్ స్కీమ్ మరియు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కింద వచ్చే బీపీఎల్ కుటుంబాలకు ఆరోగ్య రక్ష పేరుతొ అందిస్తున్నారు. వీరు ఈ పథకం పరిధిలో అర్హుత పొందేందుకు కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఏడాదికి రూ.1200/- హెల్త్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

  • పథకం ప్రారంభం : 3 జనవరి 2020
  • మంత్రిత్వ శాఖ : కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : ఏడాదికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా
  • ఎవరు అర్హులు : బీపీఎల్ కుటుంబాలు

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకంను పేద రోగులు చికిత్స నుండి కోలుకునే కాలంలో పోస్ట్-థెరపీటిక్ జీవనోపాధి భత్యాన్ని అందించేందుకు 11 సెప్టెంబర్ 2020 ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ సహాయంతో చికిత్స పొందిన తర్వాత, ఈ ఆరోగ్య ఆసరా పథకం వర్తింపజేస్తారు. ఈ కింద రోజుకు గరిష్టంగా 225/- లేదా నెలకు గరిష్టంగా 5,000/- సాయం అందిస్తారు. ఈ వేతన-నష్ట భత్యం 26 ప్రత్యేక ప్రాంతాలలో 836 రకాల శస్త్రచికిత్సలకు వర్తిస్తుంది. ఈ పథకం కింద, పేద రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందుతారు.

  • పథకం ప్రారంభం : 11 సెప్టెంబర్ 2020
  • మంత్రిత్వ శాఖ : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
  • ప్రయోజనం : రోజుకు గరిష్టంగా 225/- లేదా నెలకు గరిష్టంగా 5,000/-  సాయం
  • ఎవరు అర్హులు : బీపీఎల్ కుటుంబాలు

వైఎస్ఆర్ బీమా పథకం

రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులు ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం చెందినప్పుడు, సంబంధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడం ఈ పథకాన్ని 01 జులై 2021లో ప్రారంభించారు. ఈ పథకం కింద సహజ మరణం పొందిన 18 నుండి 50 ఏళ్ళ లోపు వ్యక్తుల కుటుంబాలకు 2 లక్షలు, 51 నుండి 60 ఏళ్ళ లోపు వ్యక్తులకు 30వేల రూపాయల భీమా అందిస్తారు.

అదే ప్రమాదంలో మృతి చెందిన 18 నుండి 70 ఏళ్ళ వ్యక్తులకు 5 లక్షలు, అంగవైకుల్యం పొందిన వారికీ 2.5 లక్షల ప్రమాద బీమా అందిస్తారు. అదే సమయంలో మరణించిన వ్యక్తి యొక్క పిల్లలు 9, 10, ఇంటర్ మరియు ఐటీఐ చదువుతున్నట్లు అయితే 12 వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం కల్పిస్తారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అందించే ఆమ్ అద్మీ బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పరిధిలో అమలు చేయబడుతుంది.

  • పథకం ప్రారంభం : 01 జులై 2021
  • మంత్రిత్వ శాఖ : కార్మిక శాఖ
  • ప్రయోజనం : గరిష్టంగా 5 లక్షల వరకు ప్రమాద బీమా
  • ఎవరు అర్హులు : బీపీఎల్ కుటుంబాలు

వైఎస్ఆర్ కంటి వెలుగు

వైఎస్ఆర్ కంటి వెలుగు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశలవారీగా చేపట్టిన ఉచిత సామూహిక కంటి స్క్రీనింగ్ కార్యక్రమం. దీనిని మొదటిసారి 10 అక్టోబర్ 2019 లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని మొత్తం 5.40 కోట్ల జనాభాకు అవసరమైన చోట ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైతే పూర్తి ఉచిత శస్త్రచికిత్స అందిస్తుంది.

  • పథకం ప్రారంభం : 10 అక్టోబర్ 2019
  • మంత్రిత్వ శాఖ : ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ
  • ప్రయోజనం : ఉచిత కంటి పరీక్షలు & చికిత్స
  • ఎవరు అర్హులు : అందరూ

వైఎస్ఆర్ రైతు భరోసా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న తొమ్మిది నవరత్న సంక్షేమ పథకాలలో వైఎస్ఆర్ రైతు భరోసా ఒకటి. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులతో సహా రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 13,500/- చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కేంద్ర పీఎం కిసాన్ పథకంతో పాటుగా అందించబడుతుంది. ఇందులో పీఎం కిసాన్ వాటా 6 వేలు.

భూమి పరిమాణంతో సంబంధం లేకుండా సమిష్టిగా సాగు చేయదగిన భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాల అందరికి మూడు విడతలుగా అందించబడుతుంది. ఈ పథకం నాణ్యమైన పంట దిగుబడి కోసం ప్రారంభ పెట్టుబడి సాయంగా అందిస్తారు. ఈ పథకం అక్టోబర్ 15, 2019లో ప్రారంభించబడింది.

  • పథకం ప్రారంభం : 15 అక్టోబర్ 2019
  • మంత్రిత్వ శాఖ : వ్యవసాయ మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : 13,500/- పంట పెట్టుబడి సాయం
  • ఎవరు అర్హులు : వ్యవసాయ సాగు రైతులు

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం

వైఎస్ఆర్ నేతన్న పథకంను చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించడం కోసం అనంతపురం జిల్లా ధర్మవరంలో 2019 డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 81,024 నేతన్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ఈ పథకం కింద ప్రతి ఏటా సొంతంగా మగ్గాలు ఉన్న నేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.24 వేలు నేరుగా జమ చేస్తారు. దీని ద్వారా ఈ 5ఏళ్ళ కాలంలో ప్రతి లబ్ధిదారుడు మొత్తం రూ.1.2 లక్షల సాయం అందుకుంటారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (ఆప్కో) ద్వారా చేనేత ఉత్పత్తులకు ఇ-మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. దాని కోసం అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో ఒప్పందం చేసుకుంది.

  • పథకం ప్రారంభం : 21 డిసెంబర్ 2019
  • మంత్రిత్వ శాఖ : ఆంధ్రప్రదేశ్ జౌళి శాఖ
  • ప్రయోజనం : ఏడాదికి 24 వేలు ఆర్థిక సాయం
  • ఎవరు అర్హులు : సొంతంగా మగ్గాలు ఉన్న నేత కార్మికులు

వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం

వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్యకారులకు 'నో ఫిషింగ్" సమయంలో ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం. ఈ పథకంను నవంబర్ 21, 2019లో తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం కింద మెకానైజ్డ్, మోటరైజ్డ్, మోటరైజ్డ్ ఫిషింగ్ నెట్‌లు, వేట తెప్పలను నిర్వహిస్తున్న మత్స్యకారులకు 'నో ఫిషింగ్" సమయంలో 10,000 ఆర్థిక సాయం అందిస్తారు.

  • పథకం ప్రారంభం : 21 నవంబర్ 2019
  • మంత్రిత్వ శాఖ : మత్స్య మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : ఏడాదికి 10 వేలు ఆర్థిక సాయం
  • ఎవరు అర్హులు : మెకానైజ్డ్, మోటరైజ్డ్, మోటరైజ్డ్ ఫిషింగ్ నెట్‌లు, వేట తెప్పలను నిర్వహిస్తున్న మత్స్యకారులకు

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంను సముద్రంలో చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు మరణించడం/శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు బాధితులు/బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ. 10.00 లక్షల పరిహారం అందించేందుకు రుపొందించారు. ఈ పథకం 18 నుండి 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న మెకానైజ్డ్, మోటరైజ్డ్, మోటరైజ్డ్ ఫిషింగ్ నెట్‌లు, వేట తెప్పలను నిర్వహిస్తున్న మత్స్యకారులు అర్హులు. దీనిని 21 నవంబర్ 2019 న "ప్రపంచ మత్స్యకార దినోత్సవం" సందర్బంగా ప్రారంభించారు.

  • పథకం ప్రారంభం : 21 నవంబర్ 2019
  • మంత్రిత్వ శాఖ : మత్స్య మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : 10 లక్షల ప్రమాద బీమా
  • ఎవరు అర్హులు : మెకానైజ్డ్, మోటరైజ్డ్, మోటరైజ్డ్ ఫిషింగ్ నెట్‌లు, వేట తెప్పలను నిర్వహిస్తున్న మత్స్యకారులకు

మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీ

మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీ పథకంను మత్స్యకారుల జీవనోపాధిపై ఆర్థిక భారం తగ్గించేందుకు రూపొందించబడింది. ఈ పథకం కింద మెకనైజ్డ్ బోట్ యజమాని నెలకు 3,000 లీటర్ల వరకు సబ్సిడీని పొందవచ్చు. అలానే మోటరైజ్డ్ పడవ యజమాని నెలకు 300 లీటర్ల వరకు సబ్సిడీని పొందవచ్చు. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం లీటరు డీజిల్‌పై రూ.9 సబ్సిడీని అందజేస్తోంది.

  • పథకం ప్రారంభం : 21 నవంబర్ 2019
  • మంత్రిత్వ శాఖ : మత్స్య మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీ
  • ఎవరు అర్హులు : మెకానైజ్డ్, మోటరైజ్డ్ బొట్లు నిర్వహిస్తున్న మత్స్యకారులకు

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఏటా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లు/యజమానులకు ఏపీ ప్రభుత్వం రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తోంది. దీనిని నిర్వహణ ఖర్చుల కోసం మరియు బీమా మరియు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను పొందడం కోసం అందిస్తున్నారు. సొంత వాహనం, డ్రైవింగ్ లైసెన్స్‌ కలిగి ఉంది 18 ఏళ్లు పైబడిన వారు ఈ పథకం పరిధిలో అర్హులు.

ఈ పథకంను 14 మే 2018న పాదయాత్ర సమయంలో, ఏలూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 4 అక్టోబర్ 2019న దీనిని మొదటిసారి అమలు చేశారు.

  • పథకం ప్రారంభం : 4 అక్టోబర్ 2019
  • మంత్రిత్వ శాఖ : రవాణా మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు 10వేల ఆర్థిక సాయం
  • ఎవరు అర్హులు : ఆర్థికంగా వెనుకబడిన టాక్సీ డ్రైవర్లు

వైఎస్ఆర్ సున్న వడ్డీ పథకం

వైఎస్ఆర్ సున్న వడ్డీ పథకం అనేది స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అందించే కార్యక్రమం. ఈ పథకంను గ్రామీణ మహిళలలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించడానికి రూపొందించబడింది. ఈ పథకాన్ని 24 ఏప్రిల్ 2020న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

  • పథకం ప్రారంభం : 24 ఏప్రిల్ 2020
  • మంత్రిత్వ శాఖ : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ
  • ప్రయోజనం : డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు
  • ఎవరు అర్హులు : డ్వాక్రా మహిళలు

వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం

వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమం. రాష్ట్రంలోని దాదాపు 30.16 లక్షల మంది మహిళలు మరియు పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం 2020 సెప్టెంబర్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిని ప్రారంభించారు.

ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పేరుతొ రాష్ట్రంలోని సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కేఆర్ పురం వంటి 77 గిరిజన మండలాల్లో పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు అలానే 6-72 నెలల వయస్సు ఉన్న పిల్లలందరూ ఈ పథకం పరిధిలోకి వస్తారు.

  • పథకం ప్రారంభం : 07 సెప్టెంబర్ 2020
  • మంత్రిత్వ శాఖ : మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ
  • ప్రయోజనం : పిల్లలు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం
  • ఎవరు అర్హులు : గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు

వైఎస్ఆర్ పెన్షన్ కానుక

వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది సీనియర్ సిటిజన్లలు, వికలాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ కోసం నెలవారీ పెన్షన్ అందించే కార్యక్రమం. దీనిని సమాజంలోని బడుగు, బలహీన వర్గాల వారు ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వారి రోజువారీ అవసరాలు, కష్టాలను తీర్చడానికి రూపొందించారు.

ఈ పథకం 1 జూలై 2019 నుండి లబ్ధిదారులకు చెల్లించబడుతుంది. దీనిని గ్రామ వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇంటివద్ద ప్రతినెల అందిస్తారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 60 ఏళ్ళు నిండిన అవ్వా తాతలకు 2,500/-, వికలాంగులు, లింగమార్పిడిదారులు మరియు డప్పు కళాకారులకు 3,000 /-, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు 10,000 పెన్షన్ మొత్తం అందిస్తున్నారు.

  • పథకం ప్రారంభం : 1 జూలై 2019
  • మంత్రిత్వ శాఖ : పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నెలవారీ పెన్షన్
  • ఎవరు అర్హులు : 60 ఏళ్ళు నిండిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు

వైఎస్ఆర్ నవోదయం పథకం

వైఎస్ఆర్ నవోదయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) యొక్క బ్యాంకు రుణాలను పునర్నిర్మించడం ద్వారా ఆర్థిక ఉపశమనం కల్పించే కార్యక్రమం. రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

ఈ పథకం పరిధిలో బార్బర్‌లు, టైలర్లు, నేత కార్మికులను కూడా తీసుకొచ్చారు. దీనిని 31-03-2020 లోపు రుణ ఖాతాలకు మాత్రమే వర్తింపజేశారు. ఈ పథకంను నవంబర్, 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

  • పథకం ప్రారంభం : నవంబర్ 2019
  • మంత్రిత్వ శాఖ : మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ
  • ప్రయోజనం : సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల యొక్క బ్యాంకు రుణాలను పునర్నిర్మించడం
  • ఎవరు అర్హులు : 31-03-2020 లోపు రుణ ఖాతాలు కల్గిన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు

రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు)

వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో ఉత్పాదకతను పెంపొందించడానికి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి, జ్ఞాన బదిలీ యొక్క ప్రధాన లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి సుస్థిర వ్యవసాయం దిశగా రైతులకు విజ్ఞానం మరియు ఇంటివద్దకే సేవా బట్వాడా అందించే డిజిటల్ & ఇంటిగ్రేటెడ్ మోడల్ కేంద్రాలు.

ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి 30 మే 2020లో ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10778 రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి రైతులకు ప్రభుత్వ ధృవీకరించబడిన వ్యవసాయ ఇన్‌పుట్‌లు (విత్తనాలు, ఎరువులు & పురుగుమందులు), పశుసంవర్ధక & మత్స్య ఇన్‌పుట్‌లను సరఫరా చేస్తున్నాయి, అలానే రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సలహాలను అందించే రైతు నాలెడ్జ్ సెంటర్లుగా ఉపయోగపడుతున్నాయి.

ఈ కేంద్రాల ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి, వైఎస్ఆర్ తోటబడి, పసు విజ్ఞాన బడి, మత్యసాగు బడి మరియు  డా.వైఎస్ఆర్ రైతు భరోసా మ్యాగజైన్ వంటి అదనపు సేవలు అందిస్తున్నారు. ఈ కేంద్రాలు వాటి పరిధిలోని భూమి విస్తీర్ణం, పండిన పంటలు, పశువుల వివరాలు వంటి మొదలైన వివరాలతో పూర్తి డేటాబేస్ కలిగిఉంటాయి.

ఆర్‌బీకే కాల్ సెంటర్ 155251 ద్వారా రైతులకు సంక్షేమ పథకాలు మరియు వ్యవసాయ సాంకేతిక సందేహాలపై సలహాలు ఇవ్వబడుతున్నాయి. దాదాపు 64 మంది క్వాలిఫైడ్ ఎగ్జిక్యూటివ్‌లు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో నిమగ్నమై ఉన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, సెరీకల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, నీటిపారుదల మొదలైన అన్ని లైన్ డిపార్ట్‌మెంట్‌ల సహకారంతో వ్యవసాయ విస్తరణ వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఈ కేంద్రాలు 2021లో స్కోచ్ అవార్డు అందుకున్నాయి. అలానే యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ఛాంపియన్ అవార్డ్ ఆఫ్ ఫుడ్ అగ్రికల్చర్ కోసం నామినేట్ చేయబడింది.

  • పథకం ప్రారంభం : 30 మే 2020
  • మంత్రిత్వ శాఖ : వ్యవసాయ మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : రైతులకు ఇంటి వద్దకే వ్యవసాయ ఇన్‌పుట్‌లను & వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తాయి.
  • ఏపీలో మొత్తం ఆర్‌బీకేలు  : 10778 రైతు భరోసా కేంద్రాలు

వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు

వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను, 26 జనవరి 2022 (గణతంత్ర దినోత్సవం) నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటుగా గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామాలకు వైద్యం అందించేందుకు 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని 10,032 గ్రామ సచివాలయాలను ప్రాధమికంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లుగా గుర్తించారు. కొత్తగా 8,500 హెల్త్ క్లినిక్ భవనాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,032 విలేజ్ క్లినిక్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో పని చేయడానికి బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను నియమించారు. ఈ క్లినిక్‌లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్‌ మెడికిల్‌ ఎక్విప్‌మెంట్‌ అందుబాటులో ఉన్నాయి.

  • పథకం ప్రారంభం : 26 జనవరి 2022
  • మంత్రిత్వ శాఖ : ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : గ్రామీణ ప్రాంతాల్లో ఇంటివద్దకే వైద్య సదుపాయం
  • ఏపీలో మొత్తం హెల్త్ క్లీనిక్  : 10,032

వైఎస్ఆర్ జలయజ్ఞం పథకం

వైఎస్ఆర్ జలయజ్ఞం అనేది ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో తాగునీటి అవసరాల కోసం సామూహిక నీటిపారుదల ప్రాజెక్టులు మరియు నీటి సరఫరా ప్రాజెక్టులు నిర్మించే కార్యక్రమం. ఈ పథకాన్ని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ప్రారంభించారు.

ఈ పథకం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55 భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టారు. అప్పటి నుండి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం 29 సెప్టెంబర్ 2020లో దీనిని నవీకరించింది.

  • పథకం ప్రారంభం : 29 సెప్టెంబర్ 2020
  • మంత్రిత్వ శాఖ : జల వనరులు & నీటిపారుదల మంత్రిత్వ శాఖ.
  • ప్రయోజనం : సామూహిక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం

వైఎస్ఆర్ కళ్యాణ కానుక

వైఎస్ఆర్ కళ్యాణ కానుక అనేది రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహ వేడుకలకు ఆర్థిక సహాయం మరియు భద్రతను అందించడానికి మరియు వివాహం తర్వాత కూడా ఆర్థిక భద్రత కల్పించడానికి ఉద్దేశించబడింది.

ఈ పథకం ప్రధానంగా బాల్య వివాహాలను రద్దు చేయడంతోపాటు వివాహాన్ని నమోదు చేయడం ద్వారా వధువును రక్షించడం కోసం రూపొందించబడింది. ఈ పథకం కింది వివిధ సామాజిక వర్గాల వారీగా 20వేల నుండి లక్ష రూపాయల వరకు అందజేస్తారు. ఈ పథకం పొందేందుకు వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18 సంవత్సరాలు మరియు వరుడు వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. మొదటిసారి వివాహం చేసుకున్న వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, వధువు వితంతువు అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

వైఎస్ఆర్ ఆదర్శం పథకం

వైఎస్ఆర్ ఆదర్శం అనేది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమం. ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC), ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ (APCSC), ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APBCL) మరియు ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా ఇసుక మరియు ఇతర నిత్యావసర వస్తువుల రవాణా కోసం వాహనం ఇవ్వబడుతుంది. దీనిని అక్టోబర్ 2019 లో ప్రారంభించారు. ఎంపికైన వారికీ నెలకు 20 వేలు సంపాదించేలా ఉపాధి కల్పిస్తారు.

జగనన్న చేదోడు పథకం

జగనన్న చేదోడు పథకం టైలర్‌లు, చాకలివారు మరియు బార్బర్‌ల కోసం ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి రూ.10,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ లేదా వార్డు వాలంటీర్లు నిర్వహించే నవసకం సర్వేల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుడు వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి. ఈ పథకాన్ని 10 జూన్ 2020లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

  • పథకం ప్రారంభం : 10 జూన్ 2020
  • ప్రయోజనం : టైలర్‌లు, చాకలివారు మరియు బార్బర్‌ల కోసం ఆర్థిక సహాయం

జగనన్న తోడు పథకం

జగనన్న తోడు అనేది వీధి వ్యాపారులు మరియు చేతివృత్తుల వారికి సంవత్సరానికి రూ. 10,000 వడ్డీ రహిత టర్మ్ లోన్ అందించే కార్యక్రమం.

అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం దీనిని రూపొందించింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 25 నవంబర్ 2023లో ప్రారంభించారు.

  • పథకం ప్రారంభం : 25 నవంబర్ 2023
  • ప్రయోజనం : వీధి వ్యాపారులు మరియు చేతివృత్తుల వారికి వడ్డీ రహిత టర్మ్ లోన్స్

ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 06 ఏప్రిల్ 2023న పల్నాడు జిల్లా లింగమగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని కుటుంబాలకు ఇంటి వద్దకే వైద్య సేవలు అందించడంతోపాటుగా, అన్ని కుటుంబాలకు నిపుణులైన వైద్యులతో సేవలను అందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో దాదాపు 2,873 మంది వైద్యులు మరియు 15,516 మంది వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటారు.

ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా క్వాలిఫైడ్ డాక్టర్లు తమ సేవలను ఇంటింటికి చేరవేస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు కూడా భాగం కానున్నారు. ఈ కార్యక్రమం పరిధిలో దాదాపు 14 రకాల రోగనిర్ధారణ పరీక్షలు, 105 రకాల మందులు, ల్యాబ్ సౌకర్యాలు మరియు 936 మొబైల్ మెడికల్ యూనిట్లు (104 లు) అందుబాటులో ఉంటాయి.

  • పథకం ప్రారంభం : 06 ఏప్రిల్ 2023
  • మంత్రిత్వ శాఖ : ఆరోగ్య & కుటుంబ మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : రాష్ట్రంలోని కుటుంబాలకు ఇంటి వద్దకే వైద్యులు

ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు

రాష్ట్రంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ 14 ఫిబ్రవరి 2023న మొదటి దశలో భాగంగా 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లలను ప్రారంభించారు. ప్రతి టూరిస్ట్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుళ్లతో సహా ఆరుగురు పోలీసు సిబ్బంది ఉంటారు. ఇవి స్థానిక పోలీస్ స్టేషన్‌లకు అనుసంధానించబడి ఉంటాయి.

కొత్తగా ప్రారంభించిన ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు  విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, వైఎస్ఆర్ జిల్లా వొంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయం, కాకినాడ జిల్లా పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయం, రాజమండ్రిలోని పుష్కరఘాట్, ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేశారు.

వీటితో పాటుగా ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లాలోని మంగినపూడి బీచ్ మరియు మోపిదేవి ఆలయం, ఇంద్రకీలాద్రి ఆలయం మరియు ఎన్టీఆర్ జిల్లాలోని భవానీ ద్వీపం, మైపాడు బీచ్, నెల్లూరు జిల్లాలోని పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, నంద్యాల జిల్లాలోని మహానంది మరియు అహోబిలం ఆలయాలు, మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయం. కర్నూలు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో హార్సిలీ హిల్స్ మరియు సత్యసాయి జిల్లాలో లేపాక్షి ఆలయం యందు కూడా వీటిని అందుబాటులకి తీసుకొచ్చారు.

  • పథకం ప్రారంభం : 14 ఫిబ్రవరి 2023
  • మంత్రిత్వ శాఖ : టూరిజం
  • ప్రయోజనం : పర్యాటకుల భద్రత & గైడెన్స్

ఏపీ దిశ పోలీస్ స్టేషన్లు

ఫిబ్రవరి 8, 2020న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదటి దిశ పోలీస్ స్టేషన్‌ను, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రారంభించారు. దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లను మహిళకు అంకితం చేశారు. ఇవి మహిళలు మరియు పిల్లలపై నేరాల కేసులను ప్రత్యేకంగా పరిష్కరిస్తాయి.

మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా దిశ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అప్లికేషన్ ద్వారా ఆపద సమయంలో మహిళలు నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్ల నుండి సహాయం పొందొచ్చు. ఇది ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, బ్లడ్ బ్యాంకులకు కూడా అనుసందించబడి ఉంటుంది. దిశా పోలీస్ స్టేషన్‌లు అత్యాచారం, లైంగిక వేధింపులు మరియు లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడం (పోక్సో) చట్టం, బాధితులైన మహిళలకు సత్వర న్యాయం అందిస్తాయి.

  • పథకం ప్రారంభం : 08 ఫిబ్రవరి 2020
  • మంత్రిత్వ శాఖ : మహిళలు మరియు పిల్లలపై నేరాల కేసులు సత్వర పరిష్కారం
  • ప్రయోజనం : మహిళలు మరియు పిల్లలకు భద్రత

ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం 2019

హైదరాబాద్‌లో 26 ఏళ్ల పశువైద్యురాలిపై జరిగిన అత్యాచారం మరియు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొద్ది రోజుల తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై నిర్దిష్ట నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించడం మరియు వేగవంతంగా న్యాయ పరిష్కారం అందించే లక్ష్యంగా దిశా చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం సంబంధిత కేసులను కేసులను 21 రోజుల్లో విచారించి, సత్వర న్యాయ పరిష్కారం అందించాల్సి ఉంటుంది. ఈ చట్టం నింధుతులకు మరణ శిక్షను కూడా ప్రతిపాదిస్తుంది.

దిశా బిల్లు 2019 (ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం 2019)ను డిసెంబర్ 13, 2019 న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టబడింది. అదే రోజు ఆమోదయించబడింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉమ్మడి జాబితాలో ఉన్నందున దీని ఆమోదం కోసం 2020లో భారత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించబడింది.

రాష్ట్రాల నుండి స్వీకరించబడిన బిల్లులు నోడల్ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లతో సంప్రదించి ప్రాసెస్ చేయబడతాయి. ఈ బిల్లుకు సంబంధించి వివరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు వివిధ న్యాయపరమైన వివరణలు అడగగా, రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించి స్పష్టత ఇవ్వలేకపోయింది. దీనితో ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు.

ప్రస్తుతం ఉన్న క్రిమినల్ లా సవరణ చట్టం, 2018 ప్రకారం, ఇటువంటి కేసులు విచారణను పూర్తి చేయడానికి తప్పనిసరి వ్యవధి నాలుగు నెలలుగా ఉంది. ఇది సోషల్ లేదా డిజిటల్ మీడియా ద్వారా మహిళలను వేధించిన కేసుల్లో రెండేళ్ల నుండి నాలుగేళ్ల జైలుశిక్షను అందిస్తుంది. అలానే ప్రస్తుతం, మహిళలు మరియు పిల్లలపై అత్యాచారం కేసులకు సంబంధించిన అప్పీల్ కేసుల పరిష్కారానికి వ్యవధి ఆరు నెలలగా ఉంది. అయితే దిశా చట్టం వీటికి విరుద్దంగా 21 రోజులల్లో సత్వర విచారణ పూర్తిచేయడంతో పాటుగా ఏకంగా సత్వర మరణశిక్షను ప్రతిపాదిస్తుంది.

  • బిల్లు ఆమోదం : 13 డిసెంబర్ 2019
  • ప్రయోజనం : మహిళలు మరియు పిల్లల లైంగిక వేధింపుల కేసుల్లో సత్వర న్యాయం

ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ : ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ అనేది ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటింటికీ అందించేందుకు రూపొందించిన కార్యక్రమం. దీనిని 2019లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం పరిధిలో 2.8 లక్షల మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ఒక్కో వలంటీర్ 50 కుటుంబాలకు అనుసందించబడి ఉంటారు. వీరు ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందజేస్తారు. వీరికి నెలకు రూ.6000 గౌరవ భత్యం అందిస్తారు. ప్రజా పరిపాలనలో ఇటువంటి వ్యవస్థను రూపొందించడం ఇదే మొదటిసారి.

ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ : గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ప్రజలకు స్థానిక ప్రభుత్వ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంను 2019లో గాంధీ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దీనితో భారతదేశంలో గ్రామ సచివాలయాలను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.

ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల సేవలు మరియు సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి ఏర్పాటు చేయబడిన సెక్రటేరియట్‌లు. ఈ గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 లకు పైగా సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. వీటిలో సేవలు అందించేందుకు దాదాపు 1,98,164 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 15000 లకు పైగా గ్రామ/వార్డు సచివాలయాలు ప్రజల వద్దకు నేరుగా ప్రభుత్వ సేవలను అందిస్తున్నాయి.

జగనన్న ఇళ్ల పట్టాలు

జగనన్న ఇళ్ల పట్టాలు అనేది నిరుపేదలకు ఇల్లు స్థలాలు అందించే కార్యక్రమం. దీనిని వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్, వైఎస్ఆర్ ఆవాస్ యోజన, పెదలకు ఇల్లు పట్టాలు అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమాన్ని 26 డిసెంబర్ 2020లో తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లె మండలం కొమరగిరి గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని దాదాపు దాదాపు 27 లక్షల మంది మహిళకు ఇళ్ల పట్టాలు అందజేశారు.

  • పథకం ప్రారంభం : 26 డిసెంబర్ 2020
  • మంత్రిత్వ శాఖ :గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : మహిళలకు ఇళ్ల పట్టాలు లేదా ఇల్లు

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం

జగనన్న విదేశీ విద్యా దీవెన అనేది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకం. ఈ పథకం గతంలో ఈ పథకాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరుతొ అందించే వారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకంకు జగనన్న విదేశీ విద్యా దీవెనగా పేరుమార్చి 11 జూలై 2022 న నూతనంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వీశాల్లోని అగ్రశ్రేణి 200 విశ్వవిద్యాలయాలలో ప్రభుత్వ సహాయంతో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.

ఈ పథకం ద్వారా వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన విద్యార్డులకు వంద శాతం పూర్తి ట్యూషన్ ఫీజు చెల్లిస్తుంది. 100- 200 మధ్య ర్యాంకు ఉన్న యూనివర్సిటీలలో చేరితే 50శాతం ట్యూషన్ ఫీజు లేదా గరిష్టంగా 50 లక్షల వరకు అందిస్తుంది.

  • పథకం ప్రారంభం : 11 జూలై 2022
  • మంత్రిత్వ శాఖ :గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ
  • ప్రయోజనం : మహిళలకు ఇళ్ల పట్టాలు లేదా ఇల్లు

Advertisement

Post Comment