తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 2023 | పోటీ పరీక్షల ప్రత్యేకం
Study Material

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 2023 | పోటీ పరీక్షల ప్రత్యేకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు, మిషన్ కాకతీయ, షీ టీమ్స్, మిషన్ భగీరథ, దళిత బందు వంటి ప్రధాన పథకాలతో పాటుగా పదుల సంఖ్యలో ఇతర సంక్షేమ పథకాలను అందిస్తుంది. పోటీ పరీక్షల దృక్కోణంలో వాటికీ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ అనేది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మరియు సరస్సులను పునరుద్ధరించే పథకం. రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయను12 మార్చి 2015 లో ప్రారంభించింది. ఇది జూన్ 2014లో తెలంగాణ మొదటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన మొదటి కార్యక్రమం.

12 మార్చి 2015న ప్రారంభమై ఈ కార్యక్రమం మొత్తం ఐదు దశల్లో మార్చి 2018 నాటికి ముగిసింది. ఇది పూర్తయ్యే సరికి దాదాపు రాష్ట్రంలో 27,713 చెరువులు, 45,800 నీటి ట్యాంకులు మనుగడలోకి వచ్చాయి. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సుమారు 8700 కోట్ల రూపాయలు ఖర్చు చేసిచేసింది, ఈ పథకం ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించారు.

  • పథకం ప్రారంభం : 12 మార్చి 2015
  • ప్రయోజనం : చెరువులు, కాలువల పునరుద్ధరణ పథకం

మిషన్ భగీరథ

మిషన్ భగీరథ అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన పథకం. ఈ పథకం ద్వారా పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించడమే కాకుండా తెలంగాణ పట్టణాలు మరియు గ్రామాల దాహార్తిని తీర్చడానికి 1.30 లక్షల కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమం వలన ప్రస్తుతం తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లోని 20 లక్షల గృహాలకు, గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల గృహాలకు పైపుల ద్వారా త్రాగు నీటిని అందిస్తుంది.

ఈ కార్యక్రమాన్ని 6 ఆగస్టు 2016న గజ్వేల్ నియోజకవర్గంలోని మెదక్ జిల్లా, కోమటిబండ గ్రామంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించారు. దీని కోసం దాదాపు 43,791 కోట్లు ఖర్చు చేశారు. ఇది రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీటిని అందిస్తున్న భారతదేశంలోని ఏకైక పథకంగా గుర్తింపు పొందింది. మిషన్ భగీరథ అమలు కోసం ఏకంగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. ఇది పూర్తి తెలంగాణ నిధులతో రూపొందిన పథకం.

  • పథకం ప్రారంభం : 06 ఆగష్టు 2016
  • ప్రయోజనం : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత మంచిననీరు

తెలంగాణకు హరితహారం కార్యక్రమం

తెలంగాణకు హరితహారం అనేది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. ఈ హరితహారం 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుచే అధికారికంగా ప్రారంభించబడింది. రాష్ట్రంలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనంను పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ప్రారంభించే సమయానికి రాష్ట్రంలో ఉన్న 24% చెట్ల భౌగోళిక విస్తీర్ణాన్ని, 33%కి పెంచే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం ద్వారా అటవీ స్మగ్లింగ్, ఆక్రమణలు, అగ్నిప్రమాదం మరియు పశువుల మేత వంటి బెడదల నుండి అడవులను రక్షించడంతో పాటుగా, క్షీణించిన అడవులను పునరుజ్జీవింపజేశారు. దీని నిర్వహణ కోసం గ్రామస్థాయిలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. జియో ట్యాగింగ్ ద్వారా అటవీ శాఖ నాటిన మొక్కలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది.

  • పథకం ప్రారంభం : 02 జులై 2015
  • ప్రయోజనం : రాష్ట్రంలో పచ్చదనంను పెంపొందించే కార్యక్రమం

తెలంగాణ షీ టీమ్స్ కార్యక్రమం

షి టీమ్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని మహిళల రక్షణ, భద్రతకోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం. దీనిని 24 అక్టోబర్ 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంను సింగపూర్‌ ప్రభుత్వం నిర్వహించే ఇదే విధమైన కార్యక్రమ స్ఫూర్తితో రూపొందించారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి హైదరాబాద్ అదనపు కమిషనర్, స్వాతి లక్రా దీనికి నాయకత్వం వహిస్తున్నారు.

ఈ షీ టీమ్స్ రాష్ట్రంలో ఈవ్ టీజర్లు, స్టాకర్లు మరియు మహిళలను వేధించేవారిని అరికట్టడానికి చిన్న చిన్న బృందాలుగా, సమూహాలలో పనిచేస్తాయి. ఇవి ప్రధానంగా హైదరాబాద్‌లో రద్దీగా ఉండే పబ్లిక్ ఏరియాలలో పనిచేస్తాయి. అలానే వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ద్వారా అందే ఫిర్యాదులకు ప్రతిస్పందించి, సమస్యలు పరిష్కరిస్తారు. అలానే రాష్ట్రంలో బాల్య వివాహాల నివారణకు కూడా వీరు కృషి చేస్తున్నారు.

  • పథకం ప్రారంభం : 24 అక్టోబర్ 2014
  • ప్రయోజనం : రాష్ట్రంలో పచ్చదనంను పెంపొందించే కార్యక్రమం

తెలంగాణ ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం

ఆరోగ్య లక్ష్మి అనేది అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం. దీనిని 01 జనవరి 2015లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద మహిళలకు నెలకు 25 రోజుల పాటు ప్రతి రోజు 200 మిల్లీలీటర్ల పాలు,  ఒక గుడ్డు అందిస్తారు.

ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు 2.5 కిలోల ఆహార ప్యాకెట్‌తో పాటు నెలకు 16 గుడ్లు అందజేస్తారు. అలానే 3 మరియు ఆరు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు, బియ్యం, పప్పు, కూరగాయలు మరియు స్నాక్స్‌తో పాటు రోజుకు ఒక గుడ్డు సరఫరా చేయబడుతుంది.

  • పథకం ప్రారంభం : 01 జనవరి 2015
  • ప్రయోజనం : రాష్ట్రంలో పచ్చదనంను పెంపొందించే కార్యక్రమం

కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్

కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి ప్రభుత్వం దీనిని అమలు చేస్తుంది. ఈ పథకాన్ని 2 అక్టోబర్ 2014 న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. వధువు వయస్సు తప్పనిసరి 18 ఏళ్ళు నిండి ఉండాలి. అదే సమయంలో కుటుంబ వార్షిక ఆదాయం 2లక్షలకు మించకూడదు.

  • పథకం ప్రారంభం : 2 అక్టోబర్ 2014
  • ప్రయోజనం : నిరుపేద యువతుల వివాహాల కోసం ఆర్థిక సాయం

కేసీఆర్ కిట్ & అమ్మఒడి పథకం

కె.సి.ఆర్‌. కిట్‌ & అమ్మఒడి అనేది తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు రూపొందించిన కార్యక్రమం. కేసీఆర్ కిట్ ద్వారా తల్లీ బిడ్డల సంక్షేమం కోసం గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి ముందు మరియు తరువాత వైద్య, రవాణా సౌకర్యాన్ని కల్పిస్తారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డ ప్రసవానికి గురైన మహిళలకు ఆర్థిక మరియు వైద్య సహాయం అందిస్తుంది. ఇది మొదటి రెండు ప్రసవాలకు వర్తింపజేస్తారు.

కె.సి.ఆర్‌. కిట్‌ కార్యక్రమాన్ని 02 జూన్ 2017 లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. నవజాత శిశువు మరియు తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ ఫ్లాగ్‌షిప్ పథకంను తీర్చిదిద్దారు. ప్రసవించిన తర్వాత తల్లికి నవజాత శిశువులు ( నియోనేట్స్ ) వెచ్చగా మరియు పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైన 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందించబడుతుంది. ఇవి మూడు నెలలకు సరిపోతాయి. ఇందులో బట్టలు, నాణ్యమైన బేబీ సబ్బులు, బేబీ ఆయిల్ , బేబీ పౌడర్, దోమ తెరలు, బొమ్మలు, నాప్‌కిన్‌లు మరియు డైపర్‌లు వంటివి ఉంటాయి.

అమ్మఒడి : కేసీఆర్ కిట్ విజయవంతం అయిన తర్వాత ఈ పథకం 18 జనవరి 2018న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఖర్చు లేకుండా ఆసుపత్రిని సందర్శించడానికి మరియు డ్రాప్ చేయడానికి ఉచిత 102 సర్వీస్ వ్యాన్‌ను ఏర్పాటు చేస్తారు. దీన్ని అవసరమైనన్ని సార్లు ఉపయోగించవచ్చు. దీని  కోసం ప్రత్యేకంగా 102 కాల్ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 241 మల్టీ యుటిలిటీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి.

  • పథకం ప్రారంభం : 02 జూన్ 2017 & 18 జనవరి 2018
  • ప్రయోజనం : గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి ముందు, తరువాత వైద్య, రవాణా సౌకర్యాన్ని కల్పిస్తారు.

తెలంగాణ రైతు బీమా పథకం

రైతు బీమా అనేది రాష్ట్రంలోని రైతులు ఏదైనా కారణంతో ప్రాణాలు కోల్పోతే, కుటుంబ సభ్యులు/ఆశ్రిత వ్యక్తులకు ఆర్థిక ఉపశమనం మరియు సామాజిక భద్రత కల్పించడం కోసం రూపొందించబడింది. 18 నుండి 59 సంవత్సరాల వయస్సు గల రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకోవడానికి అర్హులు. నమోదు చేసుకున్న రైతు సహజ మరణంతో సహా ఏదైనా కారణం వల్ల మరణిస్తే, 5 లక్షల బీమా మొత్తం 10 రోజులలోపు నియమించబడిన నామినీ ఖాతాలో జమ చేయబడతాయి. ఈ పథకంను 15 ఆగస్టు 2018లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.

  • పథకం ప్రారంభం : 15 ఆగస్టు 2018
  • ప్రయోజనం : మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం & సామాజిక భద్రత

రైతు బంధు పథకం

రైతు బంధు అనేది తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రారంభ వ్యవసాయ పెట్టుబడి మద్దతు అందించే పథకం. ఈ పథకాన్ని 25 ఫిబ్రవరి 2018న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రైతు సమన్వయ సమితి సదస్సులో ప్రకటించారు. 10 మే 2018 న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. ఇది వ్యవసాయం మరియు ఉద్యానవన పంటలకు పెట్టుబడి మద్దతు అందిస్తుంది.

దీనిని రబీ (యాసంగి) మరియు ఖరీఫ్ (వర్షాకాలం) రెండూ కాలాల్లో సీజన్‌కు 5వేల చెప్పున పెట్టుబడి సహాయం అందిస్తారు. రైతులు, ఈ పెట్టుబడి సహాయాన్ని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల వేతనాలు మరియు ఇతర పెట్టుబడులు వంటి ఇన్‌పుట్‌ల కొనుగోలు కోసం ఉపయోగించుకుంటారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రత్యక్ష రైతు పెట్టుబడి మద్దతు పథకంగా గుర్తింపు పొందింది.

  • పథకం ప్రారంభం : 10 మే 2018
  • ప్రయోజనం : రైతులకు ప్రారంభ వ్యవసాయ పెట్టుబడి మద్దతు

తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం

కంటి వెలుగు అనేది తెలంగాణాలో చేపట్టిన సార్వత్రిక నేత్ర పరీక్షా కార్యక్రమం. నివారించదగిన అంధత్వం-రహిత స్థితిని సాధించే లక్ష్యంతో 15 ఆగస్టు 2018న ఈ కార్యక్రమం యొక్క మొదటి దశ ప్రారంభించబడింది. ఇది రాష్ట్రంలోని మొత్తం జనాభాను కవర్ చేస్తుంది. దీనికి సంబదించిన రెండవ దశను 18 జనవరి 2023న ఖమ్మంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.

రెండవ దశలో రాష్ట్రంలోని పౌరులందరికీ కంటి పరీక్షలు & దృష్టి పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికీ కళ్లద్దాలను ఉచితంగా అందించారు. సాధారణ కంటి జబ్బులకు మందులను, అవసరమైతే శాస్త్ర చికిత్సను ఉచితంగా నిర్వహించారు. తీవ్రమైన కంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద కంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌గా పరిగణించబడుతుంది.

  • పథకం ప్రారంభం : 15 ఆగస్టు 2018
  • ప్రయోజనం : సార్వత్రిక నేత్ర పరీక్షా కార్యక్రమం

 

దళిత బంధు పథకం

దళిత బంధు అనేది తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల ప్రజల అభ్యున్నతి కోసం రూపొందించిన కార్యక్రమం. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, 16 ఆగస్టు 2021న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శాలపల్లిలో ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది.

ఈ పథకం ప్రాథమికంగా దళిత కుటుంబాలను బలోపేతం చేయడానికి మరియు వారిలో వ్యవస్థాపకత ఆలోచనను పెంపొందించేందుకు రూపొందించబడింది. ఈ పథకం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దళిత కుటుంబాలకు వన్-టైమ్ గ్రాంట్ వలె అందిస్తారు.

  • పథకం ప్రారంభం : 16 ఆగస్టు 2021
  • ప్రయోజనం : షెడ్యూల్డ్ కులాల ప్రజల అభ్యున్నతి కోసం ఆర్థిక సాయం

మన ఊరు - మన బడి కార్యక్రమం

మన ఊరు - మన బడి అనేది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సర్వతోముఖాభివృద్ధి మరియు సమర్థవంతమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూపొందించిన కార్యక్రమం. ఈ పథకం 08 మార్చి 2022 న వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదిక‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 2021 బడ్జెట్‌ సమావేశాల్లో ఈ కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథక అమలు, విధివిధానాల రూపకల్పన కోసం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావులతో కూడిన సబ్‌కమిటీ ఏర్పాటుచేయబడి.

ఈ కమిటీ 2021 మార్చి 23 నుండి జూన్‌ 17 మధ్య అనేక సమావేశాలు జరిపింది. మన ఊరు-మన బడి ముసాయిదా ప్రణాళికను తయారుచేసి. దీనిని 2022 జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్‌ ముందు ఉంచింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో ‘మన ఊరు మన బడి’ ప్రణాళికకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ కార్యక్రమం కింద టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్‌, పెయింటింగ్‌ వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్‌ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్స్‌, డిజిటల్‌ విద్య అమలు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పధకంలో దేశ విదేశాలలో ఉన్న పూర్వ విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేశారు.

మన ఊరు-మన బడి పథకం కింద రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలను కేజీ టు పీజీ క్యాంపసులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలే కాకుండా కస్తూరిబాయి గాంధీ బాలికా విద్యాయాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలలో కూడా ఒకే క్యాంపస్‌ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నారు.

ఈ కార్యక్రమం కింద తొలి కేజీ టు పీజీ క్యాంపస్‌ను 02 ఫిబ్రవరి 2023న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ప్రారంభించారు.  దీనికి తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ యొక్క పేరును నామకరణం చేశారు.

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది తెలంగాణ గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను తగ్గించడం మరియు హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడం కోసం రూపొందించిన కార్యక్రమం. ఒక్కో కిట్‌లో ఒక కేజీ న్యూట్రిషనల్ మిక్స్ పౌడర్, ఒక కేజీ ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్, 500 గ్రాముల నెయ్యి ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని రక్తహీనత ఎక్కువగా ఉన్న తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లోని గర్భిణులకు పంపిణి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని 21 డిసెంబర్ 2022న కామారెడ్డిలో ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు ప్రారంభించారు.

  • పథకం ప్రారంభం : 21 డిసెంబర్ 2022
  • ప్రయోజనం : గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను తగ్గించడం కోసం పౌష్ఠిక ఆహారం.

తెలంగాణ ధరణి పోర్టల్

ధరణి (ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) అనేది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మరియు వ్యవసాయేతర ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం రూపొందించబడిన డిజిటల్ వేదిక. దీనిని ప్రభుత్వంలో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని పెంచడం, అలాగే భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం అందించడం మరియు ప్రజలకు సురక్షితమైన, అవాంతరాలు లేని సేవలను అందించే లక్ష్యంతో రూపొందించారు.

ధరణి పోర్టల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 29 అక్టోబర్ 2020న మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించారు. ధరణి పోర్టల్‌లో ప్రజలకు చెందిన సుమారు 1,45,58,000 ఎకరాల వ్యవసాయ భూమి వివరాలు పొందుపర్చబడి ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే, కొనుగోలుదారు 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఇ-పాస్‌బుక్ పొందొచ్చు.

  • పథకం ప్రారంభం : 29 అక్టోబర్ 2020
  • ప్రయోజనం : సులభతరమైన ఆస్తుల రిజిస్ట్రేషన్ సౌకర్యం

తెలంగాణ ఆసరా పింఛన్లు

ఆసరా పింఛన్లు అనేవి తెలంగాణ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులు మరియు చేనేత, కల్లుగీత కార్మికులకు సామజిక భద్రత కల్పించే పథకం. ఈ పథకాన్ని 8 నవంబర్ 2014లో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

ప్రస్తుతం ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు 2016/- రూపాయలు. ఎయిడ్స్ బాధితులకు, వికలాంగుల పింఛన్లకు 3,016 రూపాయలు అందిస్తున్నారు. ఈ పథకంలో లబ్ది దారుల సంఖ్య దాదాపు 47 లక్షలకు చేరింది. 57 ఏళ్ళు నిండిన వృద్దులు అందరికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.

  • పథకం ప్రారంభం : 8 నవంబర్ 2014
  • ప్రయోజనం : బలహీన వర్గాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సామాజిక భద్రత

సాఫ్ట్‌నెట్, టాస్క్, టీ-హబ్, టీ-ఫైబర్, వుయ్ హబ్ కార్యక్రమాలు

1. సాఫ్ట్‌నెట్ : సాఫ్ట్‌నెట్ అనగా సొసైటీ ఫర్ తెలంగాణ నెట్‌వర్క్ అని అర్ధం. ఇది రాష్ట్రంలో నాణ్యమైన డిజిటల్ విద్యను అందించేందుకు ఉపగ్రహ కమ్యూనికేషన్లు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు నెట్వర్క్ కనెక్టివిటీ పెంచేందుకు 8 జీశాట్ ఉపగ్రహాలను ఉపయోగిస్తుంది. దీని కోసం సాఫ్ట్‌నెట్, ప్రత్యేకంగా ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ కార్యక్రమాలు 28 సెప్టెంబర్ 2016 నుండి అమలులోకి వచ్చాయి. తద్వారా టీశాట్ నిపుణ, టీశాట్ విద్య వంటి ఎడ్యుకేషన్ చానెల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా అకాడమిక్ మరియు పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నారు. అలానే దూరవిద్య, వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధి, టెలి-మెడిసిన్ మరియు ఈ-గవర్నెన్స్ వంటి సేవల కోసం ప్రభుత్వ పరిపాలన విభాగం ఈ సంకేతకతను ఉపయోగించుకుంటుంది.

2. టాస్క్ : టాస్క్ అనగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ & నాలెడ్జ్ అని అర్ధం. ఇది తెలంగాణ కళాశాల విద్యార్థులకు నైపుణ్య మరియు ఉపాధి శిక్షణ అవకాశాలను అందించే కార్యక్రమం. దీనిని జూన్ 2015లో ప్రారంభించారు. ఇందులో దాదాపు 800 కాలేజీలు అనుసందించబడి ఉన్నాయి. దీని ద్వారా దాదాపు 1 లక్ష మంది యువత నైపుణ్యం పొంది ఉన్నారు.

3. టీ-హబ్ : టీ-హబ్ అనగా టెక్నాలజీ హబ్ అని అర్ధం. రాష్ట్రంలో ఇన్నోవేషన్ హబ్ మరియు ఎకోసిస్టమ్ ఎనేబుల్ వ్యవస్థను రూపొందించే క్రమంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో ఈ టీ-హబ్ భవనాన్ని నిర్మించారు. దీనిని 5 నవంబర్ 2015లో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, అప్పటి తెలంగాణ గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.

1జీబీ ఇంటర్నెట్ వేగంతో, అన్‌లిమిటెడ్ వైఫై సదుపాయంతో పాటుగా జీ+5 విధానంలో ఈ టీ హబ్ భవంతిని నిర్మించారు. ఈ వేదిక ద్వారా యువతకు బిజినెస్ ప్లాన్ ఎలా రాయాలి?, స్టార్టప్‌లను వ్యాపారపరంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి? పేటెంట్లు, ఇంటలెక్చువల్ రైట్స్ మరియు ఇతర లీగల్ అంశాల్లో సంబంధిత నిపుణులు మార్గదర్శకం చేస్తారు. ఈ వేదిక తర్వాత కాలంలో ఎన్నో ఆవిష్కరణలకు వేదిక అయ్యింది.

4. టీ-ఫైబర్ : టీ-ఫైబర్ అనేది తెలంగాణలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు సరసమైన & నమ్మదగిన హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేందుకు రూపొందించిన పథకం. ఇది అత్యాధునిక నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో 'డిజిటల్ తెలంగాణ' లక్ష్యాన్ని చేరుకునేలా రూపొందించబడింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు మరియు సంస్థలు. ఇ-గవర్నెన్స్, ఇ-హెల్త్, ఇ-కామర్స్, ఇ-బ్యాంకింగ్, వీడియో ఆన్ డిమాండ్ మొదలైన అనేక సేవలను అందించడానికి టి-ఫైబర్ ప్రాథమిక వేదికగా కూడా రూపొందుతుంది. దీని 12 మార్చి 2015లో స్థాపించారు.

5. వుయ్ హబ్ : వుయ్ హబ్ అనేది తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ప్రారంభించబడిన ఇంక్యుబేటర్ కేంద్రం. ఈ కార్యక్రమం ప్రధానంగా మహిళా పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు మరియు ఎంటిటీలకు మద్దతు కల్పిస్తుంది. మహిళలకు ఆర్థిక, సామాజిక మద్దతు అడ్డంకులను తొలగించడం ద్వారా వారి వ్యాపారాలలో విజయం సాధించడంలో సహాయపడుతుంది.

వుయ్ హబ్ 2017లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (GES) కి ప్రతిస్పందనగా అమల్లోకి వచ్చింది. నవంబర్ 2017లో ఈ ప్రోగ్రామ్ ప్రకటించబడింది. మార్చి 2018 నుండి కార్యకలాపాలు మొదలుపెట్టింది.

బియ్యం, గొర్రెలు, భూ పంపిణి కార్యక్రమాలు

బియ్యం పంపిణీ : ఇది బీపీఎల్ కుటుంబాలకు ఆహార భద్రతను కల్పించే పథకం. ఈ పథకం కింద జనవరి 2015 నుండి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రతి నెల 1వ తేదీ నుంచి బియ్యం సరఫరా చేస్తున్నారు. దాదాపు 87.57 లక్షల అర్హత కలిగిన కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందుతున్నాయి. ఇదే కార్యక్రమం ద్వారా ఏటా 56 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో భాగంగా పాఠశాలలు మరియు హాస్టళ్లకు సూపర్‌ఫైన్ బియ్యం లేదా సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు.

గొర్రెల పంపిణీ : ఇది రాష్ట్రంలోని 4 లక్షల మంది యాదవ/గొల్ల/కురుమ కుటుంబాల అభ్యున్నతి కోసం రూపొందించబడింది. ఈ కార్యక్రమం ద్వారా నైపుణ్యం కలిగిన కుటుంబాలకు పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా రాష్ట్రంలో తగినంత మాంసం ఉత్పత్తిని సులభతరం చేస్తుంది. ఈ పథకం ద్వారా సాంప్రదాయ గొర్రెల కాపరి కుటుంబాలకు 75% సబ్సిడీపై (20+1) గొర్రెలను సరఫరా చేస్తుంది. ఈ కార్యక్రమం 20 జూన్ 2017 లో ప్రారంభించారు. దీని ద్వారా దాదాపు 2 కోట్ల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేసారు.

దళితులకు భూ పంపిణీ : ఈ కార్యక్రమం ద్వారా భూమిలేని ఎస్సీ మహిళలకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం తొలి ఏడాది రూ.94 కోట్లు వెచ్చించి 959 మంది దళితులకు 2,524 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. ఈ కార్యక్రమం 15 ఆగష్టు 2014లో ప్రారంభించబడింది.

బాలికా ఆరోగ్య రక్ష పథకం

బాలికా ఆరోగ్య రక్ష పథకం అనేది పాఠశాల బాలికలకు సంబందించిన కార్యక్రమం. ఈ పథకం ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి చెప్పున ఏడాదికి నాలుగు సార్లు హెల్త్ & హైజీన్ కిట్లను బాలికలకు అందజేస్తారు. ఈ కిట్లలలో 3 ఒంటి సబ్బులు, 3 బట్టల సభ్యులు, రెండు జతల నైలాన్ రిబ్బన్లు, షాంపూ, హెయిర్ బ్యాండ్స్, 30 శానిటరీ న్యాప్కిన్స్, పౌడర్ డబ్బా, పేస్ట్, టంగ్ క్లినర్, దువ్వెన, బొట్టు బిళ్ళలు వంటి 13 రకాల, 30 వస్తువులు ఉంటాయి.

ఈ పథకాన్ని 24 ఆగష్టు 2018లో అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు హసన్‌పర్తిలో ప్రారంభించారు. రాష్ట్రంలోని 6 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ పంచాయతీరాజ్ బడులు, గురుకులాలు, కస్తూర్భా పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు యందు చదువుకునే 7 నుండి 10వ తరగతి విద్యార్థినీలు ఈ పథకం పరిధిలో అర్హులు.

  • పథకం ప్రారంభం : 24 ఆగష్టు 2018
  • ప్రయోజనం : 7 నుండి 10వ తరగతి విద్యార్థినీలకు హెల్త్ & హైజీన్ కిట్లు

తెలంగాణా దీపం పథకం

తెలంగాణా దీపం పథకం అనేది మహిళలకు గ్యాస్ సిలిండర్లను అందించే కార్యక్రమం. ఈ పథకం కింద, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎల్‌పిజి కనెక్షన్లు సబ్సిడీలతో అందించబడతాయి. తెలంగాణ రాష్ట్రంను కిరోసిన్ ఫ్రీగా మార్చే ఆలోచనతో పాటుగా మహిళకు కట్టెల పొయ్యిల నుండి వచ్చే ఇబ్బందుల నుండి రక్షణ కల్పించేందుకు ఈ పథకం రూపొందించారు. ఈ కార్యక్రమం మొదట 09 జులై 1999లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యందు ప్రారంభించబడింది. దీనిని ప్రస్తుత ప్రభుత్వం అదే పేరుతొ కొనసాగిస్తుంది.

  • పథకం ప్రారంభం : 09 జులై 1999
  • ప్రయోజనం : మహిళలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అందజేస్తారు.

తెలంగాణ షీ క్యాబ్స్ పథకం

షీ క్యాబ్స్ పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన మహిళల డ్రైవర్లకు సొంత వాహనాలను అందించే కార్యక్రమం. పట్టణ ప్రాంతంలో ఉండే మహిళకు ఉపాధి స్వావలంబన కల్పించే ఉద్దేశ్యంతో 08 సెప్టెంబర్ 2015లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన మహిళా డ్రైవర్లకు 35శాతం సబ్సిడీతో టాక్సీని కొనుక్కునే అవకాశం కల్పిస్తుంది.

  • పథకం ప్రారంభం : 08 సెప్టెంబర్ 2015
  • ప్రయోజనం : మహిళా డ్రైవర్లకు 35శాతం సబ్సిడీతో టాక్సీని కొనుక్కునే అవకాశం

తెలంగాణ స్త్రీ నిధి పథకం

స్త్రీ నిధి పథకం అనేది మహిళలకు జీవనోపాధి ఫైనాన్స్ అందించే కార్యక్రమం. 2011 అక్టోబర్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి రూ.1,000 కోట్లతో మహిళా సహకార బ్యాంకు 'స్త్రీ నిధి'ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 4.22 లక్షలకు పైగా ఉన్న స్వయం సహాయక బృందాలకు 5 నుండి 10 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం స్త్రీ నిధి సురక్ష-బీమా అనే నూతన పథకాన్ని కూడా అమలు చేస్తుంది. అర్హులైన స్త్రీనిధి లబ్ధిదారులు ఒక్కసారిగా రూ.690 చెల్లించి పథకంలో సభ్యత్వం పొందితే, మూడు సంవత్సరాల వ్యవధిలో సులభమైన వాయిదాలలో తిరిగి చెల్లించే రుణాలను పొందేందుకు అర్హులు అవుతారు. పథకం కింద నమోదు చేసుకున్న సభ్యులు మరణిస్తే, ఆమె కుటుంబానికి లక్ష రూపాయల జీవిత బీమా అందిస్తారు.

  • పథకం ప్రారంభం : అక్టోబర్ 2011
  • ప్రయోజనం : మహిళలకు జీవనోపాధి ఫైనాన్స్ అందిస్తుంది.

సాదా బైనామా భూమి రిజిస్ట్రేషన్లు

సాదా బైనామా భూమి రిజిస్ట్రేషన్లు అనేది గ్రామీణ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబందించిన కార్యక్రమం. దీని ద్వారా గ్రామాలలోని భూవివాదాలు పరిష్కరించి, రికార్డులు సవరిస్తూ, గ్రామాల్లోని 5 ఎకరాల లోపు అన్ని భూములను అర్హుల పేరిట ఉచితంగా రిజిస్టర్ చేస్తారు.దీనిని కేవలం గ్రామాలకే కాకుండా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలోని వ్యవసాయ భూములకు కూడా వర్తింపజేశారు.ఈ కార్యక్రమం జూన్ 2016లో అమలు చేశారు.

పూర్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు రిజిస్ట్రేషన్ చేయకుండానే భూములను విక్రయించడం, కొనుగోలు చేయడం వంటివి చేసేవారు. ఈ లావాదేవీలను సాధారణ పరిభాషలో 'సాదా బైనామాలు' (అవి అమ్మకం మరియు కొనుగోళ్ల ఒప్పందాలు ) అంటారు. ఈ 'సాదా బైనామా' లావాదేవీలు గతంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ (RoR) చట్టం కింద క్రమబద్ధీకరించబడ్డాయి.

పేదలకు ఇళ్లు & డబుల్ బెడ్ రూమ్

పేదలకు ఇళ్ళు అనేది తెలంగాణలోని పేదలకు నాణ్యమైన మరియు గౌరవప్రదమైన గృహాలను అందించడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. పేదలకు గృహాలు ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మరియు ఇతర పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లతో కూడిన రెండు మరియు మూడు అంతస్తుల భవనాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్వతంత్ర గృహాలుగా నిర్మించబడతాయి. ఈ పథకం 02 జూన్ 2014 నుండి అమలులో ఉంది. అయితే 100% సబ్సిడీ గృహాలను అందించడం ద్వారా పేదలకు గౌరవాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం 2015 అక్టోబర్ నెలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని రూపొందించింది.

ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ద్వారా అమలు చేస్తుంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం మొదటి పైలట్ ప్రాజెక్ట్ 5 మార్చి 2016న ఎర్రవల్లిలో ప్రారంభించారు. సికింద్రాబాద్‌లోని భోయిడ్‌గూడలోని ఐడీహెచ్‌ కాలనీలో మరో పైలట్‌ను ప్రారంభించారు. ఒక్కో ఫ్లాట్‌కు 7.9 లక్షల చొప్పున రూ. 37 కోట్లతో 580 చదరపు గజాలలో 32 బ్లాకుల్లో G+2లో రెండు బెడ్‌రూమ్‌లు, హాల్ మరియు కిచెన్‌తో కూడిన 396 యూనిట్లు నిర్మించబడుతున్నాయి.

Post Comment