Advertisement
Fundamental rights article 12 to 35 in Telugu | Indian Polity in Telugu
Indian Constitution Study Material

Fundamental rights article 12 to 35 in Telugu | Indian Polity in Telugu

భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 మధ్య ప్రాథమిక హక్కులను పొందుపర్చారు. వీటిని అమెరికా రాజ్యాంగం నుండి మన రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించారు. న్యాయ నిర్హేతుకమైన ఈ ప్రాథమిక హక్కులు ఎంతో విశిష్టమైనవి & సమగ్రమైనవి. ప్రాథమిక హక్కులు పౌరులకు సంబంధించినవి. ఇవి అపరిమితమైనవి కావు, అయినప్పటికీ ఇవి గుణాత్మకమైనవి.

ప్రాథమిక హక్కులు పౌర స్వేచ్ఛలకు హామీ ఇస్తాయి. భారతదేశ పౌరులుగా శాంతి మరియు సామరస్యంతో తమ జీవితాలను గడిపేందుకు ఇవి అవకాశం కల్పిస్తాయి. భౌతిక, మేధోపరమైన, నైతిక మరియు ఆధ్యాత్మిక స్వచ్ఛను కల్పిస్తాయి. అత్యవసర పరిస్థితులలో వీటిఫై ప్రభుత్వాలు సహేతుకమైన నిబంధనలను విధించవచ్చు. అలానే కొన్ని హక్కులు ప్రభుత్వ అధికారం పైకూడా పరిమితిని విధించే అధికారాన్ని కలిగివున్నాయి.

భారత రాజ్యాంగంలో మొత్తం 7 ప్రాథమిక హక్కులు పొందుపర్చారు. అయితే హస్తిహక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఈ హక్కు సోషలిజం మరియు సంపద యొక్క సమాన పంపిణీ లక్ష్యాన్ని సాధించడంలో చాలా సమస్యలను సృష్టించినందున దీనిని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తప్పించారు. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు

  1. సమానత్వ హక్కు (ఆర్టికల్ 14-18)
  2. స్వచ్ఛ హక్కు (ఆర్టికల్ 19-22)
  3. పీడన నిరోధక హక్కు (ఆర్టికల్ 23-24)
  4. మత స్వాతంత్రపు హక్కు (ఆర్టికల్ 25-28)
  5. సాంస్కృత, విద్యా హక్కులు (ఆర్టికల్ 29-30)
  6. ఆస్తి హక్కు (ఆర్టికల్ 31 తొలగించబడింది)
  7. రాజ్యాంగ పరిహార హక్కు (ఆర్టికల్ 32)

1. సమానత్వ హక్కు (Right to equality)

భారతీయ పౌరులు అందరికి చట్టం ముందు సమానత్వం, చట్టం వలన సమాన రక్షణ కల్పించడమే సమానత్వ హక్కు యొక్క ముఖ్య లక్షణం. వ్యక్తిగత హోదాతో సంబంధం లేకుండా చట్టాలు అందరికీ ఒకే పద్ధతిలో వర్తిస్తాయని దీని అర్థం. ఇక్కడ వ్యక్తి అంటే పౌరులు మాత్రమే కాదు చట్టబద్దమైన కార్పొరేషన్లు, సంస్థలు, సొసైటీలు, కంపెనీలు వంటివి వస్తాయి. ఈ హక్కు భారతీయులకే కాదు, దేశంలో ఉండే విదేశీయులకు కూడా వర్తిస్తుంది.

సమానత్వ హక్కులను ఆర్టికల్ 14 నుండి 18 మధ్య పొందుపర్చారు. మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశంతో సంబంధం లేకుండా వ్యక్తులందరికీ సమాన అవకాశాలను అందించడంతో పాటుగా అంటరానితనం, వివక్ష వంటి సాంఘిక దురాచారాలను నిర్ములించడమే సమానత్వ హక్కు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సమానత్వం అనే భావం బ్రిటిష్ న్యాయ శాస్త్రవేత్త ఎవి డైసీ ప్రతిపాదించిన సమన్యాయం అనే సిద్డంటం నుండి గ్రహించారు.

  1. ఆర్టికల్ 14 - చట్టం ముందు అందరూ సమానం అనే భావనను కల్పిస్తుంది.
  2. ఆర్టికల్ 15 -కులం, మతం, జాతి, లింగం కారణంగా విచక్షణ లేకపోవడం.
  3. ఆర్టికల్ 16 - ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికి సమాన అవకాశాలు కల్పించడం.
  4. ఆర్టికల్ 17 - అంటరానితనంను నిషేధిస్తుంది.
  5. ఆర్టికల్ 18 - సైనిక, విద్యాపరమైన యోగ్యతలను మినహాయించి అన్ని బిరుదులను రద్దు చేస్తుంది.

చట్టం ముందు సమానత్వం అనేది అపరిమితమైనది కాదు. దీనికి రాజ్యాంగం ద్వారా ఇతర మినహాయింపులు ఉన్నాయి. ఆర్టికల్ 36 ద్వారా భారత రాష్ట్రపతి, గవర్నర్లకు కొన్ని రక్షణలు కల్పిస్తుంది. వీరు తమ విధులు నిర్వర్తించడంలో ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాదు. అదే సమయంలో వీరు పదివిలో ఉండగా ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉండదు.

విదేశీ అధినేతలు, రాయబారులు, దౌత్యవేత్తలు క్రిమినల్, సివిల్ ప్రొసిడింగులకు అతీతులు. అలానే ఐక్యరాజ్యసమితి, దాని ప్రతినిధులు కూడా రక్షణలు కలిగి ఉంటారు. ఆర్టికల్ 18 ప్రకారం ఆ పౌరుడు విదేశీ రాజ్యం నుంచి ఏ బిరుదును స్వీకరించరాదు. భారతరత్న, పద్మ అవార్డులు వంటివి రాజ్యాంగ బద్దమేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

2. స్వేచ్ఛ హక్కు (Right to freedom)

స్వేచ్ఛ హక్కు పౌరులకు వాక్ స్వాతంత్ర్యం మరియు భావవ్యక్తీకరణ, సంఘాల ఏర్పాటు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవప్రదంగా జీవించే స్వేచ్ఛ మొదలైన వాటికి సంబంధించి ప్రాథమిక స్వేచ్ఛను ఇస్తుంది. వీటిని ఆర్టికల్ 19 నుండి 22 మధ్య పొందుపర్చారు.

  1. ఆర్టికల్ 19 : స్వేచ్చకు సంబంధించిన ఆరు హక్కులకు రక్షణ కల్పిస్తుంది.
  2. ఆర్టికల్ 20 : క్రిమినల్ నేరాలకు సంబంధించిన నిరాధార అభియోగాల శిక్షల నుండి రక్షణ.
  3. ఆర్టికల్ 21 : ప్రాణ రక్షణకు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది.
  4. ఆర్టికల్ 21A : పౌరులందరికీ ప్రాథమిక విద్యను పొందే హక్కును కల్పిస్తుంది.
  5. ఆర్టికల్ 22 : కొన్ని వివాదాల్లో అరెస్టు నుండి నిర్బంధం నుండి రక్షణ కల్పిస్తుంది.

1. ఆర్టికల్ 19 : ఇది స్వేచ్చకు సంబంధించిన ఆరు హక్కులకు రక్షణ కల్పిస్తుంది. ఇందులో వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, సమావేశమవ్వడం, సంస్థలు, నివాసం, సంచారం, వృత్తి వంటివి ఉన్నాయి.

  1. వాక్ స్వాతంత్రం & భావ వ్యక్తీకరణ - ఇది పౌరులకు తమ అభిప్రాయాలను, ఉద్దేశ్యాలని, నమ్మకాలని మరియు విశ్వాసాలను నోటి మాట ద్వారా లేదా లిఖిత పూర్వకంగా లేదా చిత్ర రూపంలో వ్యక్తం చేసే స్వచ్ఛను కల్పిస్తుంది.
  2. సమావేశ హక్కు - ఇది పౌరులకు శాంతియుతంగా సమావేశమ్యాయ్యే హక్కును కల్పిస్తుంది. ఇందులో పబ్లిక్ మీటింగులు, ప్రదర్శనలు, ఊరేగింపులు వంటివి ఉంటాయి. వీటి వలన శాంతి భద్రతలకు ఆటంకం కలగకూడదు.
  3. సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు - ఇది పౌరులందరికీ సంస్థలని, యూనియన్లను, సహకార సంఘాలను ఏర్పరచుకునే హక్కు కల్పిస్తుంది. వీటిలో కంపెనీలు, రాజకీయ పార్టీలు, క్లబ్బులు, ఆర్గనైజషన్లు, సొసైటీలు వంటివి ఉన్నాయి.
  4. స్వేచ్ఛగా సంచరించే హక్కు - ఇది ప్రతి పౌరుడుకు భారత్ భూభాగంలో ఎక్కడైనా స్వచ్ఛగా సంచరించే హక్కును కల్పిస్తుంది.
  5. నివాస స్వచ్ఛ హక్కు - ఇది ప్రతి పౌరుడుకు భారత్ భూభాగంలో ఎక్కడైనా స్వచ్ఛగా నివశించే లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కును అందిస్తుంది.
  6. వృత్తి స్వచ్ఛ - ఇది పారులందరికీ స్వఛ్చగా తమకు నచ్చిన వృత్తిని స్వీకరించే అవకాశం కల్పిస్తుంది. తమకు నచ్చే వ్యాపారం, వర్తకంను కొనసాగించే స్వఛ్చను ఇస్తుంది. అయితే కొన్ని వ్యాపారాల కోసం ప్రభుత్వం నైపుణ్య పరమైన, సాంకేతిక పరమైన నిబంధనలను విధించవచ్చు.

2. ఆర్టికల్ 20 : ఇది నిందితులు/ దోషి యొక్క హక్కులను పరిరక్షించే ప్రాథమిక హక్కును అందిస్తుంది. క్రిమినల్ నేరాలకు సంబంధించిన నిరాధార అభియోగాల శిక్షల నుండి కొన్ని రక్షణలను కల్పిస్తుంది.

  1. ఆర్టికల్ 20(1): ఎక్స్-పోస్ట్-ఫాక్టో చట్టం - ఇది గతంలో చేసిన నేరాలకు భవిష్యత్తులో దానికి సంబంధించి చేసే కొత్త చట్టాల నుండి రక్షణ కల్పిస్తుంది.
  2. ఆర్టికల్ 20(2): డబుల్ జియోపార్డీ - ఇది ఒకే నేరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు నేరస్తుడికి విచారించకుండా మరియు శిక్షించకుండ రక్షణ కల్పిస్తుంది. సంబంధిత అంశంలో నిందితుడిపై ఇప్పటికే "విచారణ" మరియు "శిక్ష" విధించబడినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.
  3. ఆర్టికల్ 20(3): స్వీయ నేరారోపణకు వ్యతిరేకంగా హక్కు- ఆర్టికల్ 20(3) ప్రకారం, నిందితుడు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోలేరు. విచారణ దశలో సహా అన్ని సమయాల్లో, భౌతిక మరియు మానసిక ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణ అందుబాటులో ఉంటుంది. రక్షణ అనేది వ్యక్తిగత జ్ఞానానికి మాత్రమే వర్తిస్తుంది. భౌతిక సాక్ష్యాలకు వర్తించదు.

3. ఆర్టికల్ 21 : ఇది ప్రాణ రక్షణకు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది. ఇది భారత పౌరులకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా రక్షణ వర్తిస్తుంది. ఇది నిరంకుశ కార్యనిర్వాహక చర్యలకు మాత్రమే వర్తిస్తుంది. శాసన పరమైన చర్యలకు వర్తించదు.

వీటిలో వ్యక్తి ఔన్నుత్య జీవన హక్కు, హానికరమైన పరిశ్రమల నుండి రక్షణ హక్కు, జీవనోపాధి హక్కు, ఏకాంత హక్కు, ఆరోగ్య హక్కు, ఉచిత న్యాయ సలహా హక్కు, ఒంటరి కారాగార వాస హక్కు, విదేశాలకు వెళ్లే హక్కు, సత్వర విచారణ హక్కు, బలవంత చాకిరీకి వ్యతిరేక హక్కు, అత్యవసర ఔసుధ సహాయ హక్కు, రాజ్య బహిష్కరణ వ్యతిరేక హక్కు, సముచిత విచారణ హక్కు, సమాచార హక్కు వంటివి ఉన్నాయి.

4. ఆర్టికల్ 21A : ఇది 6 నుండి 14 ఏళ్ళ బాలల అందరికీ ఉచిత, నిర్బంధ ప్రాధమిక విద్యను అందించాలని పేర్కొంటుంది. అయితే ఉన్నత, వృత్తి పరమైన విద్య దీని పరిధిలో లేదు. దీనిని2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. చిన్న పిల్లలకు నిర్బంధ, ఉచిత విద్య అంశం రాజ్యాంగం 4వ భాగంలో ఆర్టికల్ 45లో ఇది వరకే ఉంది. అయితే ఆదేశ సూత్రాలలో ఉండే ఈ అంశం న్యాయస్థాన పరిధిలో అనేది కాదు. 86వ సవరణ ద్వారా చేర్చిన 21A న్యాయ నిర్హేతుకమైనది.

5. ఆర్టికల్ 22 : ఇది అక్రమ అరెస్ట్ మరియు నిర్బంధం నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ నిర్బంధం రెండు రకాలు. ఒకటి శిక్షాత్మక నిర్బంధం (పునీటివ్ డిటెన్షన్), రెండవది నివారక నిర్బంధం (ప్రివెంటివ్ డిటెన్షన్). శిక్షాత్మక నిర్బంధం అంటే నేరం చేసిన నేరస్తుడిని విచారించడం కోసం చేసే నిర్బంధం. కాగా కోర్టులో విచారణ, నేర నిర్ణయం లేకుండానే వ్యక్తిని నిర్బంధించడం నివారక నిర్బంధం అవుతుంది. ఇది ముందోస్తు నేర నివారణలో భాగంగా జరుగుతుంది.

శిక్షాత్మక నిర్బంధంలో కూడా నిందితుడు తన అరెస్టుకు గల కారణాలను, తాను కోరే న్యాయవాది సలహా పొందటానికి ఈ హక్కు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో అరెస్ట్ అయినా 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం కల్పిస్తుంది.న్యాయస్థానం నిర్బంధాన్ని పొడిగించకపోతే 24 గంటల తర్వాత విడుదల కబడే హక్కు కల్పిస్తుంది. ఇది విదేశీయలకు, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయ్యేవారికి వర్తించదు.

నివారక నిర్బంధం అనేది భవిష్యతులో వ్యక్తి నేరం చేయకుండా లేదా వారి వలన శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా ముందోస్తు అరెస్ట్ లేదా నిర్బంధం చేయడం. చట్టబద్దమైన సలహా బోర్డు వివరణాత్మక కారణాలతో నిర్బంధాన్ని పొడిగిస్తూ నివేదిక ఇస్తే తప్ప ఏ వ్యక్తిని మూడు నెలల కాలాన్ని మించి నిర్బంధంలో ఉంచరాదు. అలానే నిర్బంధించిన వ్యక్తికీ దానికి గల కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది

3. పీడన నిరోధక హక్కు (Right against exploitation)

హ్యూమన్ ట్రాఫిక్, వెట్టి సాకిరి, గనులు, కర్మాగారాలు మరియు ప్రమాదకర పరిస్థితుల్లో బాల కార్మికులను విముక్తి కలిగించడం వంటి హక్కులు కల్పిస్తుంది. ఈ హక్కు భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా వర్తిస్తుంది. రాజ్యా చర్య నుండే కాకా ప్రైవేట్ వ్యక్తుల చర్య నుండి కూడా ఈ హక్కు రక్షణ కల్పిస్తుంది. వ్యభిచారం, దేవదాసీలు, బానిసత్వం, హ్యూమన్ ట్రాఫిక్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుండి ఇది రక్షణ కల్పిస్తుంది.

ఆర్టికల్ 23 : వ్యభిచారం, దేవదాసీలు, బానిసత్వం, హ్యూమన్ ట్రాఫిక్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుండి ఇది రక్షణ కల్పిస్తుంది.  కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులలో దేశ ప్రయోజనార్థం నిర్బంధ మిలిటరీ సర్వీసును ప్రభుత్వం తప్పనిసరి చేయొచ్చు. దీనికి రాజ్యం ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ ఎంపికలో రాజ్యం, మతం, జాతి, కుల, వర్గ వివక్ష చూపరాదు.

ఆర్టికల్ 24 : ఇది గనులు, కర్మాగారాలు మరియు ప్రమాదకర పరిస్థితుల్లో బాల కార్మికులను నిషేధిస్తుంది. పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఏదైనా ఫ్యాక్టరీలో లేదా ఇతర పని చేయడానికి నియమించుకునే వారిని శిక్షిస్తుంది. 2012 నుండి ఈ హక్కు అన్ని రకాల వృత్తుల్లో, రంగాల్లో పనిచేసే బాల కార్మికులకు వర్తింపు చేసింది. దీని అర్ధం దేశంలో బాలకార్మిక వ్యవస్థ పూర్తిగా నిషేధించబడింది.

4. మత స్వేచ్ఛ హక్కు (Right to freedom of religion)

మత స్వేచ్ఛ హక్కు భారత రాజ్యాంగంలోని 25, 26, 27 మరియు 28 ఆర్టికల్స్‌లో పొందుపర్చారు. పౌరులందరూ తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కును ఇవి అందిస్తాయి. భారత రాజ్యాంగ పీఠికలో "సెక్యులర్" అనే పదం ఉంచడబడింది. ఇది మతపరమైన హక్కులను ప్రాథమిక హక్కులుగా జోడించడం ద్వారా వ్యక్తిగత మతాలు లేదా సమూహాలను కాపాడుతుంది.

1. ఆర్టికల్ 25 : రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 భారతదేశంలోని వ్యక్తులందరికీ మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ఇందులో ఈ క్రింది అంశాలు ఉన్నాయి.

  1. అంతరాత్మను అనుచరించు స్వేచ్ఛ : భగవంతునితో గానీ, జీవులతో గానీ లేదా ఇతరత్రా గానీ ఒక వ్యక్తికీ గల అంతర్లీనమైన స్వేచ్ఛ.
  2. అవలంబన హక్కు : తన మాట విశ్వాసాలను, నమ్మకాలను స్వఛ్చగా, బహిరంగంగా వ్యక్తపరిచే హక్కు.
  3. ఆచరణ హక్కు : మతపరమైన ఆరాధన, సంస్కార క్రియలు, ఉత్సవాలు మరియు నమ్మకాలను, భావాలను చెప్పుకోవడం.
  4. ప్రచార హక్కు : తమ మత విశ్వాసాల గురించి లేదా మత సిద్ధాంతాల గురించి ప్రచారం చేసుకునే హక్కు.

2. ఆర్టికల్ 26 : ఇది పౌరులందరికీ మత వ్యవహారాల నిర్వహణలో స్వచ్ఛను కల్పిస్తుంది. ఇందులో మత, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించుటకు నిర్వహించుకునే హక్కు. అలానే మత విషయాలలో స్వీయ వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు. స్థిర చరాస్తుల సంపాదన, అధీన హక్కు. చట్టాన్ని అనుచరించి ఆస్తి నిర్వహణ హక్కు కల్పిస్తుంది. ఆర్టికల్ 25 వ్యక్తుల మత పరమైన హక్కులకు హామీ ఇస్తే, ఆర్టికల్ 26 దాని ఉప శాఖలకు హామీ అందిస్తుంది.

3. ఆర్టికల్ 27 : ఇది మతమును ప్రోత్సహాయించుటకు పన్నులు చెల్లించేందుకు, స్వీకరించేందుకు అవకాశం కల్పిస్తుంది. అయితే వీటి కోసం బలవంత పెట్టరాదు. అలానే ప్రభుత్వం  వచ్చిన ఆదాయాన్ని ఏ మతాన్ని ప్రోత్సహించేందుకు గానీ, నిర్వహించేందుకు గాని ఉపయోగించకూడదు. అలానే ఏ మతం యందు ప్రత్యేక అభిమానం చూపరాదు.

4. ఆర్టికల్ 28 : ఇది మత బోధన హాజరు నుండి స్వచ్ఛ కల్పిస్తుంది. ప్రభుత్వ నిధులు ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంస్థలు మరియు ఇతర సంస్థల్లో ఎటువంటి మతబోధన జరగరాదు. ఇది మతపరమైన విద్యా సంస్థలకు మినహాయింపు ఉంటుంది. అలానే వ్యక్తులకు బలవంతంగా మతపరమైన బోధనా కార్యక్రమాల్లో కానీ, ప్రార్థనలలో పాల్గొమని కోరరాదు.

5. సాంస్కృత, విద్యా హక్కులు (Cultural and educational rights)

భారతదేశంలోని మతపరమైన మరియు భాషా పరమైన మైనారిటీ సమూహాలకు రాజ్యాంగం ద్వారా వారి ప్రత్యేక సంస్కృతి, భాష లేదా లిపిని కాపాడుకోవడానికి ఈ సాంస్కృత, విద్యా హక్కులు వీలు కల్పిస్తాయి. వీటిని ఆర్టికల్ 29 మరియు 30 లలో పొందుపర్చారు. అలానే ప్రభుత్వ సహాయంతో లేదా ప్రభుత్వం నిర్వహించే విద్యాసంస్థల్లో మత, జాతి, కుల, బాషా ప్రతిపాదికిన ఎవరిని నిరాకరించరాదు.

ఆర్టికల్ 29 : ఇది భారతదేశంలోని మతపరమైన మరియు భాషా పరమైన మైనారిటీ సమూహాలకు రాజ్యాంగం ద్వారా వారి ప్రత్యేక సంస్కృతి, భాష లేదా లిపిని కాపాడుకోవడానికి రక్షణ కాపాడబోతుంది. అయితే సుప్రీం కోర్టు ప్రకారం ఇది కేవలం మైనారిటీ సమూహాలకే కాదు భారతీయ పౌర సమూహాలందరికీ వర్తిస్తుంది. ఇందులో భాషను కాపాడుకునే క్రమంలో భాషా రక్షణ కోసం ఉద్యమించే స్వచ్ఛ కూడా ఈ హక్కు కల్పిస్తుంది.

ఆర్టికల్ 30 : ఇది భాషా, మతపరమైన అల్పసంఖ్య వర్గాల వారికీ తమకు నచ్చే విధంగా విద్యా సంస్థలు నెలకొల్పుకోవడానికి, నిర్వహించడానికి హక్కు కలిపిస్తుంది. అలానే వీటిని ప్రభుత్వం వీటిని స్వాధీనం చేసుకునే సమయంలో వాటికీ తగ్గ నష్ట పరిహారం పొందే రక్షను కూడా కల్పిస్తుంది. అదే సమయంలో ఏ సంస్థలకు ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయంలో ఎటువంటి వివక్ష ఉండరాదు. ఈ హక్కులు కేవలం మైనారిటీ వర్గాలకు మాత్రమే వర్తిస్తాయి.

6. హస్తి హక్కు (Right to property)

1978లో సవరణ చేసే వరకు భారత రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కుగా ఉండేంది. దీనిని ఆర్టికల్ 31 రూపంలో పొందుపర్చారు. దీనిని రాజ్యాంగ 44వ సవరణ ద్వారా ఆర్టికల్ 31 మరియు ఆర్టికల్ 19(1)(ఎఫ్) పార్ట్ III నుండి పూర్తిగా తొలగించరు. ప్రస్తుతం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల జాబితాలో ఆస్తి హక్కు లేదు.

ఈ హక్కు సోషలిజం మరియు సంపద యొక్క సమాన పంపిణీ లక్ష్యాన్ని సాధించడంలో అనేక సమస్యలను సృష్టించినందున, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. అయితే దీని బదులుగా ఆర్టికల్ 300-A రూపంలో రాజ్యాంగంలో ఒక కొత్త నిబంధన చేర్చబడింది. ఇది చట్టం యొక్క అధికారం ద్వారా తప్ప ఏ వ్యక్తి తన ఆస్తిని కోల్పోకుండా రక్షణ కల్పిస్తుంది. దీని ద్వారా భూస్వామి, జమీందారీ వ్యవస్థలను ప్రభుత్వం నియంత్రించగల్గింది.

7. రాజ్యాంగ పరిరక్షణ హక్కు (Right to constitutional remedies)

ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన పరిస్థితులలో కూడా వాటి రక్షణకు ఒక సమర్ధవంతమైన యంత్రాంగంను రాజ్యాంగంలో పొందుపర్చారు అదే రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ప్రాథమిక హక్కులు ప్రభుత్వం, కార్య నిర్వాహక వ్యవస్థ ద్వారా అవి నామమాత్రంగా, అర్థరహితంగా మారకుండా ఈ హక్కు రక్షిస్తుంది. ఇది పై 5 ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించే ప్రాథమిక హక్కు. దీనిని ఆర్టికల్ 32 లో పొందు పర్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ను రాజ్యాంగంలో అతి ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. సుప్రీం కోర్టు కూడా ఆర్టికల్ 32ను రాజ్యాంగ మౌలిక లక్షణమని పేర్కొంది. దీనిని తొలగించడం కానీ, కుదించడం కానీ చేయరాదని పేర్కొంది. పౌరులు ప్రాథమిక హక్కుల అమలుకై సముచిత చర్యల ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రహించే హక్కును ఇది కల్పిస్తుంది. వీటి అమలు కోసం వివిధ ఆదేశాలను, ఉత్తర్వులను లేదా రిట్స్‌ని జారీచేసే అధికారం సుప్రీం కోర్టు కలిగిఉంది.

ఆర్టికల్ 226 ద్వారా ఈ ఆదేశాలను, ఉత్తర్వులను లేదా రిట్స్‌ని జారీచేసే అధికారం హైకోర్టుకి కూడా రాజ్యాంగం కల్పించింది. అదే సమయంలో ఇతర కోర్టులకు కూడా వీటిని జారీచేసే అధికారంను పార్లమెంట్ కల్పించవచ్చు, అయితే సుప్రీం కోర్టు అధికారాలకు భంగం కలగకుండా ఉండాలి. కానీ ఆర్టికల్ 359 ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కోసం సుప్రీం కోర్టును ఆశ్రహించే ఈ హక్కును రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి కల్పించింది.

భారత రాజ్యాంగంలో రిట్స్ రకాలు

రిట్‌లు అనేది సుప్రీం కోర్ట్ లేదా హైకోర్టు నుండి వచ్చిన వ్రాతపూర్వక ఉత్తర్వులు లేదా ఆదేశాలు. ఇవి భారత పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా రాజ్యాంగపరమైన పరిష్కారాలను ఆదేశిస్తాయి. భారత రాజ్యాంగంలో హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్టియోరారీ మరియు క్వో వారంటో వంటి ఐదు రకాల రిట్‌లు ఉన్నాయి.

రిట్‌లను భారత రాజ్యాంగం ఇంగ్లీష్ లా నుండి గ్రహించింది. వీటిని ఇంగ్లాండులో ప్రిరాగేటివ్ రిట్స్ అంటారు. ఆర్టికల్ 32 ద్వారా భారత దేశంలో రిట్‌లను సుప్రీం కోర్టు ఎవరికైనా జారీ చేసే అధికారం కలిగి ఉంది. ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టు తమ పరిధిలోని వ్యక్తులకు, ప్రభుత్వాలకు, సంస్థలకు మాత్రమే రిట్స్ జారీ చేసే అధికారం కలిగి ఉంది.

  1. హేబియస్ కార్పస్
  2. మాండమస్
  3. ప్రొహిబిషన్
  4. సెర్టియోరారీ
  5. క్వో-వారంటో

1. హేబియస్ కార్పస్ రిట్

హేబియస్ కార్పస్ అనేది రాజ్యాంగంలోని పౌరులకు కల్పించిన ఒక ముఖ్యమైన ప్రాథమిక హక్కు. ఇది చట్టవిరుద్ధమైన మరియు నిరవధిక జైలు శిక్ష లేదా నిర్బంధం నుండి రక్షణ కల్పిస్తుంది. ఇదొక లాటిన్ పదం, దీని అర్ధం "నాకు శరీరాన్ని చూపించు" అని వస్తుంది. హెబియస్ కార్పస్ చారిత్రాత్మకంగా ఏకపక్ష కార్యనిర్వాహక అధికారానికి వ్యతిరేకంగా వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడానికి సహాయపడుతుంది.

దీని కోసం ఖైదీ, లేదా వారి తరపున మరొక వ్యక్తి, సుప్రీం కోర్టును లేదా తమ పరిధిలోని హైకోర్టు లేదా సంబంధిత న్యాయమూర్తికి పిటిషన్ వేయవచ్చు. కోర్టు సదురు పిటేషన్ అర్హుతను పరిశీలించి, అవసరమైతే హేబియస్ కార్పస్ రిట్‌ను జారీ చేస్తుంది. దీని ఆదేశం ప్రకారం సదురు ఖైదీని తక్షణమే కోర్టు ముందు హాజరుపర్చాల్సి ఉంటుంది. కోర్టు నిర్బంధానికి లేదా అరెస్టుకు గల కారణాలు విచారించి, చట్టవిరుద్ధమని తేలితే తక్షణమే సదురు వ్యక్తిని విడుదల చేస్తుంది.

హేబియస్ కార్పస్ రిట్‌ను ప్రభుత్వ అధికారులకే కాక ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు. అయితే నిర్బంధం చట్ట బద్దమైనప్పుడు, శాసనసభ లేదా కోర్టు ధిక్కారం వలన ప్రొసీడింగులు జరిగినప్పుడు, నిర్దిష్ట న్యాయస్థానం ద్వారా నిర్బందించినప్పుడు మరియు కోర్టు పరిధిలో నిర్బంధం జరిగినప్పుడు ఇది వర్తించదు. అనగా హేబియస్ కార్పస్ రిట్‌ను ఉపయోగిచుకోలేము.

2. మాండమస్ రిట్

ఒక ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వం ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కును ఉల్లంఘించిన సమయంలో న్యాయస్థానం మాండమస్ రిట్ జారీ చేస్తుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారి తాను చేయవల్సిన విధులను విస్మరిస్తే, ఆ విధులను నిర్వహించమని ఉన్నత న్యాయస్థానం ఈ రిట్ ద్వారా ఆదేశిస్తుంది. దీనిని తమ అధికార పరిధిలో ఉన్న విధులను నిర్వర్తించడానికి విస్మరించిన లేదా నిరాకరించిన అధికారులకు, కార్పొరేషనలకు, ప్రభుత్వాలకు, దిగువ న్యాయస్థానాలకు, ట్రిబ్యునలోకి జారీ చేస్తుంది.

అయితే మాండమస్ రిట్ ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు, చట్ట బద్దమైన అధికారం లేని శాఖాపరమైన ఆదేశాల అమలకు, చేసిన విధి ఐచ్ఛిక పరమైనదై, ఆదేశిక పూర్వమైనది కానప్పుడు, కాంట్రాక్టు ధర్మ బాధ్యతను నిర్వర్తించనప్పుడు, భారత రాష్ట్రపతి, గవర్నర్లకు, న్యాయపరమైన విధులు నిర్వర్తించిన హైకోర్టు ప్రధాన న్యామూర్తికి వర్తించదు.

3. ప్రొహిబిషన్ రిట్

ప్రొహిబిషన్ రిట్‌ను దిగువ కోర్టులు లేదా ట్రిబ్యునల్ తమ అధికార పరిధిని అధిగమించకుండా మరియు వ్యతిరేకంగా వ్యవహరించకుండా నిరోధించడానికి లేదా ఆపడానికి ఉన్నత న్యాయస్థానం జారీ చేస్తుంది. అనగా మాండమస్ రిట్ ద్వారా కోర్టులు లేదా ట్రిబ్యునల్‌కు తమ అధికార బాధ్యతలను గుర్తుచేస్తూనే, ప్రొహిబిషన్ రిట్‌ ద్వారా వాటి పరిధిని మించి వ్యవహరిస్తే నియంత్రిస్తుంది.

ప్రొహిబిషన్ రిట్‌ని జ్యుడిషియల్, క్యాషీ జ్యుడిషియల్ అధికారులకు మాత్రమే జారీ చేస్తుంది. పరిపాలన సంబంధమైన అధికారులకు, శాసన సంబంధమైన సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు లేదా సంస్థలకు ఇది వర్తించదు.

4. సెర్టియోరారీ రిట్

సెర్టియోరారీ అనేది దిగువ కోర్టు లేదా ప్రభుత్వ సంస్థ యొక్క నిర్ణయాన్ని న్యాయపరమైన సమీక్షను కోరేందుకు ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్. కింది స్థాయి కోర్టు లేదా ట్రిబ్యునల్ తన అధికార పరిధిని అతిక్రమించి, కేసును విచారించి తీర్పు లేదా ఆదేశాలను జారీ చేసినప్పుడు, ఆ తీర్పును లేదా ఆదేశాన్ని రద్దు చేస్తూ సంబందితను తమ పరిధిలోకి తీసుకునేందుకు ఉన్నత న్యాయస్థానం దీనిని జారీ చేస్తుంది.

ఇది అధికార పరిధిలను అతిక్రమించడం లేదా విస్మరించడం లేక శాసనంలో పొరపాట్లు వంటి కారణాలపై జారీ చేయడం జరుగుతుంది. ప్రొహిబిషన్ రిట్‌ కేవలం నిరోధాత్మకం కాగా,  సెర్టియోరారీ నిరోధాత్మకమే కాకుండా నివారిణి కూడా. ఈ రిట్‌ని జ్యుడిషియల్, క్యాషీ జ్యుడిషియల్ అధికారులకు మాత్రమే జారీ చేస్తుంది. అయితే 1991 నుండి దీనిని పరిపాలన సంబంధమైన అధికారులకు వర్తింపజేస్తుంది.

5. క్వో-వారంటో రిట్

క్వో వారంటో అనేది ఒక ప్రత్యేకమైన హక్కు, ఇది ఎవరికి నిర్దేశించబడిందో వారు కలిగి ఉన్న హక్కు. క్వో వారంటో అనే పదాల అర్థం " మీ అధికారం ఏమిటి". ఏదైనా పదవిని, ఫ్రాంచైజీని, స్వేచ్ఛను లేదా అధికారాన్ని క్లెయిమ్ చేసిన వ్యక్తికి వ్యతిరేకంగా ఆ పదవిని ఏ అధికారం/అర్హుతతో కలిగి ఉన్నారో చూపించమని ఉన్నత న్యాయస్థానం ఈ రిట్‌ను జారీ చేస్తుంది. ఆ పదవిని నిర్వహించేందుకు వ్యక్తికి అర్హత లేదని తేలితే, అతన్ని దాని నుండి తొలగిస్తుంది.

ఈ రిట్ అర్హుత/చట్టబద్దత లేకుండా అక్రమంగా ప్రజా ప్రజాపదవిలో దూరిపోవడాన్ని నిరోధిస్తుంది. ఈ రిట్‌ను బాధితుడే కాకుండా ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.

Post Comment