తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ | 20 మార్చి 2023
Telugu Current Affairs

తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ | 20 మార్చి 2023

వీక్లీ కరెంట్ అఫైర్స్ 20 మార్చి 2023 తెలుగులో ఉచితంగా పొందండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఔత్సాహికుల కోసం తాజాగా చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.

Advertisement

భారతదేశం - బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ప్రారంభం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంయుక్తంగా భారతదేశం-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ (IBFP) ను మార్చి 18న వర్చువల్ మోడ్‌లో ప్రారంభించారు. ఈ పైప్‌లైన్ నిర్మాణానికి 2018 సెప్టెంబర్‌లో ప్రధానమంత్రులిద్దరూ పునాది రాయి వేశారు. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య మొదటి క్రాస్-బోర్డర్ ఎనర్జీ పైప్‌లైన్, దీనిని దాదాపు 377 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు.

ఇండియాకు చెందిన నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ 2015 నుండి బంగ్లాదేశ్‌కు పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ప్రసుతం నిర్మించిన పైప్‌లైన్ సంవత్సరానికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల హై-స్పీడ్ డీజిల్‌ను రవాణా చేయగల సామర్థ్యం కలిగిఉంది. బంగ్లాదేశ్ ఇప్పుడు దక్షిణాసియాలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. విద్యుత్ మరియు ఇంధన రంగంలో ఈ సహకారం మరింత ఎక్కువ ఉంది.

చైనా కొత్త ప్రధానమంత్రిగా లీ కియాంగ్ ఎన్నికయ్యారు

చైనా మాజీ కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ లి కియాంగ్, ఆ దేశంలో రెండవ అత్యున్నత పదవిని చేపట్టారు. గత 10 సంవత్సరాలుగా ఆ పదవిలో ఉన్న లీ కెకియాంగ్ తర్వాత 11 మార్చి 2023న ఆయన చైనా ప్రదమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చైనా రాజకీయ వ్యవస్థలో ప్రధానమంత్రి రెండవ అత్యున్నత పదవి. ఈ హోదాను సాధారణంగా చైనా యొక్క ప్రీమియర్ అని పిలుస్తారు.

సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్ మొదటి సమావేశం ప్రారంభం

మొదటి సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్ 20 (SAI20) యొక్క సీనియర్ ఆఫీసర్స్ మీటింగ్, మార్చి 13న గౌహతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 'బ్లూ ఎకానమీ' మరియు 'రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' థీమ్‌లతో జరిపారు. జీ20 సభ్య దేశాలు, అతిథి దేశాలు మరియు ఇతర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బ్లూ ఎకానమీ ద్వారా పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతూ జీ20 దేశాల ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి మరియు సముద్ర వనరులను స్థిరంగా ఉపయోగించడం వంటి చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

జీ20 యొక్క సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్, 2022లో ఇండోనేషియా జీ20 ప్రెసిడెన్సీ సమయంలో సహకార పర్యవేక్షణ ద్వారా ఆర్థిక పాలనను మెరుగుపరచడానికి స్థాపించబడింది. ఈ ఎంగేజ్‌మెంట్ గ్రూప్ విధాన సంభాషణ మరియు ప్రభుత్వ రంగ ఆడిట్ ఎకోసిస్టమ్‌లోని ఉత్తమ పద్ధతులను గుర్తించి వాటిని అమలు చేస్తుంది.

హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌

కర్ణాటకలోని హుబ్బల్లిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను మార్చి 12న ప్రధాని మోదీ ప్రారంభించారు. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిందని అధికారులు తెలిపారు. ఈ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌కు శ్రీ సిద్ధారూఢ స్వామీజీ స్టేషన్‌గా నామకరణం చేసినట్లు కూడా వెల్లడించారు.

ఇదే వేదిక ద్వారా 850 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఐఐటి ధార్వాడ్ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. హోస్‌పేట-హుబ్బ‌ళ్లి-తీనాఘాట్ సెక్షన్‌ల విద్యుద్దీకరణ మరియు అప్‌గ్రేడ్ చేసిన హోసపేట స్టేషన్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. అలానే హుబ్బళ్లిలో జయదేవ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

  • అదే సమయంలో కొత్తగా నిర్మించిన బెంగళూరు మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేని మార్చి 12 న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దాదాపు రూ. 8,480 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా బెంగళూరు మైసూరు మధ్య ప్రయాణ సమయం 3 గంటల నుండి 75 నిముషాలకు తగ్గనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే బీఎంపీ (భారతమాల పరియోజన) పథకం కింద అభివృద్ధి చేయబడింది.
  • మార్చి 2023 నాటికి, భారతదేశంలో 4,067.27 కిమీ పొడవుతో 44 ఎక్స్‌ప్రెస్‌వేలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వే 302 కి.మీ పొడవుతో భారతదేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా ఉంది. భారతదేశపు మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్ వేను ముంబై-పూణే నగరాల మధ్య నిర్మించారు.

భారత్ గౌరవ్ పథకం కింద భారత్ నేపాల్ అష్ట యాత్ర

భారత్ గౌరవ్ టూరిస్ట్‌ల రైలు కింద "భారత్ నేపాల్ అష్ట యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 30న శ్రీరామ నవమిని పురస్కరించుకుని 31 మార్చి, 2023న జలందర్ నుండి ఈ రైలు బయలుదేరుతుంది. 9 రాత్రుల 10 రోజుల నిడివితో సాగే ఈ యాత్రలో భారతదేశంలోని అయోధ్య, వారణాసి & ప్రయాగ్‌రాజ్ మరియు నేపాల్‌లోని పశుపతినాథ్ (ఖాట్మండు) వంటి ప్రదేశాలను కవర్ చేస్తుంది.

ఇండియన్ రైల్వే 2021లో భారత్ గౌరవ్ స్కీమ్‌ను ప్రారంభించి. ఇది భారతదేశంలోని వివిధ చారిత్రక, సాంస్కృతిక మరియు మతపరమైన దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అందుబాటులో తీసుకొచ్చారు. మొదటి భారత్ గౌరవ్ రైలు కోయంబత్తూర్ మరియు షిర్డీ మధ్య నడపబడింది. తెలుగు రాష్ట్రాల నుండి మొదటి 'ఆరిజినేటింగ్ భారత్ గౌరవ్ రైలును పూరీ-కాశి-అయోధ్య పేరుతొ మార్చి 18న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యందు ప్రారంభించారు.

బెంగళూరులో మొట్టమొదటి మిథనాల్‌తో నడిచే బస్సు ప్రారంభం

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మార్చి 12 న బెంగళూరులో మొట్టమొదటి మిథనాల్‌తో నడిచే బస్సులను ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను కార్బన్ ఉద్గారాల స్థాయిని తగ్గించే లక్ష్యంతో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, నీతీ ఆయోగ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు అశోక్ లేలాండ్ కలిసి నిర్వహిస్తున్నాయి.

మిథనాల్ ఎకానమీ భావనను ఇప్పటికే చైనా, ఇటలీ, స్వీడన్, ఇజ్రాయెల్, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ మరియు అనేక ఇతర యూరోపియన్ దేశాలు అందిపుచ్చుకున్నట్లు, ఇండియాను కూడా ఈ జాబితాలో చేర్చేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు నీతీ ఆయోగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్

స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లో ప్రముఖ రుణదాతలలో ఒకటైన యునైటెడ్ స్టేట్స్‌లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, మార్చి 10న కుప్పకూలింది. 2007–2008లో చోటు చేసుకున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇది అతిపెద్ద బ్యాంక్ వైఫల్యంగా నమోదుయ్యింది. బీమా చేయని డిపాజిట్ల యొక్క అధిక నిష్పత్తి మరియు హోల్డ్-టు-మెచ్యూరిటీ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టబడిన డిపాజిట్ల యొక్క అధిక భాగం కారణంగా ఈ సంక్షోభం నెలకొంది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) పతనం భారతీయ స్టార్టప్ పరిశ్రమను అప్రమత్తం చేసింది. మెజారిటీ భారతీయ స్టార్టప్‌ కంపెనీలు ఎస్వీబీ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకు పతనంతో ఈ కంపెనీల ఆర్థిక వనరులపై ప్రభావం పడనుంది. ఎస్వీబీ 2003 నుండి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 20కి పైగా భారతీయ కంపెనీలలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్, కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా 1983లో స్థాపించబడింది. ఇది ప్రధానంగా స్టార్టప్ కంపెనీల ఆర్థిక అవసరాలను తీర్చే లక్ష్యంతో రోజర్ వి స్మిత్ ప్రారంభించారు. దాదాపు 40 సంవత్సరాల సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చరిత్రలో 30,000 కంటే ఎక్కువ వ్యవస్థాపక సంస్థలకు విజయపథంలో మద్దతునిచ్చింది.

షీ చేంజ్ క్లైమేట్ భారత అంబాసిడర్‌గా శ్రేయా ఘోదావత్

ప్రముఖ క్లైమేట్ ఎంటర్‌ప్రెన్యూర్ శ్రేయా ఘోదావత్ 13 మార్చి 2023న 'షీ చేంజ్స్ క్లైమేట్' యొక్క భారత అంబాసిడర్‌గా నియమితులయ్యారు. షీ చేంజ్స్ క్లైమేట్ అనేది పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన గ్లోబల్ క్యాంపెయిన్. ఇది మహిళ భాగస్వామ్యతో వాతావరణ మార్పుల ప్రభావాలపై అవగాహనా కల్పించడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

తమిళ రచయిత్రి శివశంకరికి సరస్వతి సమ్మాన్‌ పురస్కారం

ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరి, 2019 లో పబ్లిష్ చేసిన తన సూర్య వంశం పుస్తకం కోసం సరస్వతి సమ్మాన్ 2022 పురస్కారంను దక్కించుకున్నారు. సరస్వతీ సమ్మాన్ అనేది భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ VIIIలో జాబితా చేయబడిన 22 భాషలలో ఏదైనా అత్యుత్తమ గద్య లేదా పద్య సాహిత్య రచనలకు అందించే వార్షిక పురస్కారం. దీనిని 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. విజేతకు 15 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక అందజేస్తారు.

ప్రపంచ అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీకి 4వ స్థానం

ప్రపంచ ఎయిర్ క్వాలిటీ నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 50 నగరాల జాబితాలో ఢిల్లీ నాల్గవ స్థానంలో నిలిచింది. ఐక్యూ ఎయిర్ రిపోర్ట్ 2022, ఢిల్లీలో సగటు PM2.5 స్థాయి 92.6 μg/m3 నమోదు కాబడినట్లు తెలిపింది. ఈ జాబితాలో పాకిస్తాన్ లోని లాహోర్‌ అత్యంత కాలుష్య నగరంగా ప్రధమ స్థానంలో ఉండగా, చైనాలోని హోటాన్ రెండవ స్థానంలో ఉంది.

భారతదేశం 2022లో ప్రపంచంలో ఎనిమిదవ అత్యంత కలుషితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ప్రపంచంలోని టాప్ 50 అత్యంత కలుషితమైన నగరాల్లో 39 నగరాలకు ఇండియా నిలయంగా ఉంది. రాజస్థాన్‌లోని భివాడి ప్రపంచ ర్యాంకింగులో మూడో స్థానంలో ఉండగా, దేశంలో ప్రధమ స్థానంలో ఉంది. ఐక్యూ ఎయిర్ అనేది స్విస్ కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ. ఇది గాలి నాణ్యత పర్యవేక్షణ మరియు పరిశోధన కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

మేఘాలయ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ ప్రారంభం

మేఘాలయ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ మార్చి 14న షిల్లాంగ్‌లో ప్రారంభమైంది. ఈ వేడుకను మేఘాలయ టూరిజం సహకారంతో మేఘాలయ ఫిల్మ్‌మేకర్స్ అసోసియేషన్ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తుంది. స్థానిక ఫిల్మ్ మేకర్లను ప్రోత్సహించేందుకు, పర్యాటకులను ఆకర్శించేందుకు దీనిని నిర్వహిస్తున్నారు. 5 రోజుల్లో నిర్వహిస్తున్న ఈ వేడుకలో దాదాపు 40 సినిమాలు ప్రదర్శించబడ్డాయి. దాదాపు 5,000 మంది వీక్షకులు హాజరయ్యారు.

అత్యల్ప అక్షరాస్యత రేటు కిలిగిన రాష్ట్రంగా బీహార్

విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం, బీహార్ దేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటును కలిగిన రాష్ట్రంగా నిలిచింది. అదే సమయంలో కేరళ దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఉంది. ఈ జాబితాలో  కేరళ 94 శాతం, లక్షద్వీప్ 91.85, మిజోరం 91.33 శాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలవగా, రాజస్థాన్ 66.1 శాతం, అరుణాచల్ ప్రదేశ్ 65.3 శాతం, బీహార్ 61.8 శాతంతో దిగువ మూడు స్థానాల్లో నిలిచాయి.

ఈ జాబితాలో ఆంధప్రదేశ్ 67.02 శాతం, తెలంగాణ 72.80శాతంతో దిగువ స్థానాల్లో ఉన్నాయి.  గ్రామీణ భారతదేశంలో అక్షరాస్యత రేటు 67.77 శాతంగా ఉండగా, పట్టణ భారతదేశంలో 84.11 శాతంగా ఉంది. లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ సమాచారాన్ని అందించారు.

ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్‌గా సురేఖ యాదవ్‌

కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ-హై-స్పీడ్ వందే భారత్‌ను ఆపరేట్ చేసిన మొదటి మహిళా లోకో పైలట్‌గా సురేఖ యాదవ్ నిలిచారు. సురేఖ యాదవ్ గతంలో 2011లో ఆసియాలో మొట్టమొదటి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందారు. 13, 2023న షోలాపూర్ స్టేషన్ మరియు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య వందే భారత్‌ను నడిపి నూతన గుర్తింపును పొందారు. ఈమె 1988లో మొదటి మహిళా లోకో పైలట్‌గా భారతీయ రైల్వేలో కెరీర్ ప్రారంభించారు.

బెంగుళూరులో "అగ్రియూనిఫెస్ట్"ను ప్రారంభించిన నరేందర్ సింగ్ తోమర్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) సహకారంతో బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన 5-రోజుల సాంస్కృతిక కార్యక్రమం “అగ్రియూనిఫెస్ట్” ను కేంద్ర మంత్రి శ్రీ తోమర్ మార్చి 15న ప్రారంభించారు. ఈ వేడుకకు దేశంలోని 60 రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/డీమ్డ్ యూనివర్సిటీలు/సెంట్రల్ యూనివర్శిటీల నుండి 2500 మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్నారు.

సంగీతం, నృత్యం, సాహిత్యం, థియేటర్, లలిత కళలు వంటి 18 ఈవెంట్‌లలో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. వివిధ భారతీయ సంస్కృతులను అనుసంధానం చేయడం ద్వారా భారతీయ వ్యవసాయాన్ని ఏకీకృతం చేయాలనే లక్ష్యంతో 1999-2000లో ఈ అఖిల భారత అంతర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ యువజనోత్సవాన్ని ప్రారంభించారు. తద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయాలలోని యువత ప్రతిభకు ప్రోత్సహం అందిస్తున్నారు.

టీసీఎస్ సీఈవో మరియు ఎండీగా కే కృతివాసన్

ప్రముఖ భారత సాఫ్ట్‌వేర్ & ఐటీ సర్వీస్ ప్రొవైడర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిఇఒ రాజేష్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఆయన ఈ హోదా నుండి వైదొలిగారు. రాజేష్ గోపీనాథన్ స్థానంలో తదుపరి టీసీఎస్ సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా కె కృతివాసన్‌ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్‌గా జి కృష్ణకుమార్

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా జి కృష్ణకుమార్ నియమితులయ్యారు. గత అక్టోబరు 2022లో బిపిసిఎల్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేసిన అరుణ్ కుమార్ సింగ్ స్థానంలో ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ హోదాలో ఆయన 2025 వరకు సేవలు అందించనున్నారు.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ప్రభుత్వ మహారత్న కేటగిరిలో ఉన్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ముంబై, కొచ్చి, నుమాలిగర్ మరియు బినాలోని రిఫైనరీల ద్వారా 40 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ చమురు శుద్ధి చేసే సామర్థ్యంతో భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఇంధన రిటైలర్ వాటా కలిగి ఉంది. అయితే భారత ప్రభుత్వం ప్రస్తుతం 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణతో దీనిని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పూర్తివ్వాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ సంక్షోభం వలన వాయిదా పడింది.

పీఎం మిత్ర పథకం కింద ఏడు రాష్టాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులు

భారత ప్రభుత్వం పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ మరియు అపెరల్ (PM MITRA) పథకం కింద ఏడు రాష్ట్రాలలో మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడు టెక్స్‌టైల్ పార్కులను తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో అభివృద్ధి చేయనున్నారు. వీటి కోసం 13 రాష్ట్రాల నుండి వచ్చిన 18 ప్రతిపాదనలు రాగా, వాటిలో పై 7 సైట్లు ఎంపిక చేయబడ్డాయి.

టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, భారత వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి పీఎం మిత్ర పథకాన్ని ప్రారంభించిది. ఈ రంగంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులు పెంచడం ద్వారా, నూతన టెక్స్‌టైల్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ వస్త్ర తయారీ మరియు ఎగుమతుల కేంద్రంగా మార్చడమనేది ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో నిరుద్యోగులకు ఉపాధికల్పన కూడా ప్రధానమైనది.

అత్యంత దారుణమైన టెర్రర్ పీడిత దేశాల జాబితాలో భారత్

భారతదేశం 25 అత్యంత దారుణమైన టెర్రర్ పీడిత దేశాలలో ఒకటిగా నిలిచింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023 ప్రకారం 25 అత్యంత దారుణమైన టెర్రర్ పీడిత దేశాలలో ఇండియా 13వ స్థానంలో ఉంది. గడిసిన ఏడాదిలో పోల్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద దాడులు 9 శాతం తగ్గి 6,701 మరణాలు నమోదయినట్లు నివేదించింది. అఫ్ఘనిస్తాన్ వరుసగా నాల్గవ సంవత్సరం కూడా తీవ్రవాదంతో ప్రభావితమైన దేశంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

2022లో తీవ్రవాదం ద్వారా ఎక్కువగా ప్రభావితమైన పది దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్‌లో తీవ్రవాద సంబంధిత మరణాలు గణనీయంగా పెరిగినట్లు, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 120 శాతం పెరుగుదలతో 643 మరణాలు నమోదు కబడినట్లు నివేదించింది.

వ్లాదిమిర్ పుతిన్‌పై ఐసీసీ న్యాయమూర్తులు అరెస్ట్ వారెంట్ జారీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) కి చెందిన న్యాయమూర్తులు, మార్చి 17న అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఉక్రెయిన్ యందు యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని అభియోగం మోపారు. గతంలో రష్యాకు తీసుకెళ్లిన ఉక్రేనియన్ పిల్లలను బలవంతంగా కిడ్నప్ లేదా జాతీయతను మార్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రష్యా బాలల హక్కుల కమీషనర్ మరియా ల్వోవా-బెలోవాను కూడా ఇదే నేరాలకు సంబంధించి ఐసీసీ వారెంట్ అందించింది.

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఒక అంతర్జాతీయ ఇంటర్‌ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో  ఉంది. ఇది అంతర్జాతీయంగా చోటు చేసుకునే మారణహోమం మరియు యుద్ధ నేరాల వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై దర్యాప్తు మరియు విచారణను కోరుతుంది. అయితే ఐసీసీ సొంత సైన్యం లేదా దర్యాప్తు వ్యవస్థను కలిగి లేదు. ఇది సభ్యదేశాల వ్యవస్థను ఉపయోగించుకుంటుంది.

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ప్రస్తుతం 123 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వీటిలో చైనా, ఇండియా, రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్‌తో సహా డజన్ల కొద్దీ దేశాలు కనీసం ఈ సంస్థలో చేరలేదు లేదా అంతర్జాతీయ రోమ్ శాసన ఒప్పందంపై సంతకం చేయలేదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క రోమ్ శాసనం అనేది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును స్థాపించిన ఒప్పందం. ఇది 17 జూలై 1998న ఇటలీలోని రోమ్‌లో జరిగిన దౌత్య సదస్సులో ఆమోదించబడింది. 1 జూలై 2002న అమల్లోకి వచ్చింది.

రోమ్ శాసనం ప్రకారం, అంతర్జాతీయ నేరాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సభ్య దేశాలు పూర్తిగా, అధికారికంగా సహకరించవల్సి ఉంటుంది. ఒక దేశం యథార్థంగా దర్యాప్తును నిర్వహించలేక లేదా నేరస్థులను విచారించడానికి ఇష్టపడని చోట మాత్రమే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జోక్యం చేసుకుంటుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇది వరకు ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కోట్ డి ఐవరీ, డార్ఫర్, సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెన్యా, లిబియా, ఉగాండా, బంగ్లాదేశ్/మయన్మార్, పాలస్తీనా మరియు వెనిజులాలో జరిగిన యుద్ధ నేరాల పైనా దర్యాప్తు జరిపిన అనుభవం కలిగి ఉంది.

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో భారతదేశంకు 126వ స్థానం

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో భారతదేశం 126వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం టాప్ 5 సంతోషకరమైన దేశాల జాబితాలో ఐదు యూరప్ దేశాలైన 1. ఫిన్‌లాండ్, 2. డెన్మార్క్, 3. స్విట్జర్లాండ్, 4. ఐస్‌లాండ్, 5. నెదర్లాండ్స్ ఉన్నాయి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ ప్రచురించే వార్షిక నివేదిక.

ఐక్యరాజ్యసమితి విడుదల చేసే ఈ వార్షిక నివేదికలో మొత్తం 137 దేశాలను చేర్చింది. ఫిన్‌లాండ్ వరుసగా ఆరవ సంవత్సరం కూడా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో అత్యున్నత స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ పట్టణీకరణ, నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణ, ఆహార భద్రత, నీటి భద్రత ఆందోళనలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, మహిళల భద్రత, పర్యావరణ కాలుష్యం, ప్రజల మానసిక ఆరోగ్యం వంటి విభిన్న అంశాలపై ముడిపడి ఉంటుంది.

భోపాల్‌లో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌, మార్చి 20న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ప్రారంభమైంది. ఈ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 30 దేశాల నుంచి 200 మంది షూటర్లు పాల్గొంటున్నారు. భోపాల్‌లోని కుషాభౌ థాకరే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ఐఎస్ఎస్ఎఫ్ అధ్యక్షుడు లూసియానో ​​రోసీ గౌరవ అతిథిగా హాజరు కాగా, మధ్యప్రదేశ్ క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ మంత్రి యశోధర రాజే సింధియా, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రణిందర్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌ 1897లో ప్రారంభించారు.

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల భారత్ పర్యటన

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా మార్చి 20-21 తేదీలలో భారతదేశంలో పర్యటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించేందుకు ఈ పర్యటనకు విచ్చేశారు. 2006 నుండి భారతదేశం మరియు జపాన్ మధ్య రెగ్యులర్ వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. గత ఏడాది ప్రధాని మోడీ జపాన్‌లో పర్యటించారు. ప్రస్తుతం ఇండియా జీ20 అధ్యక్షతలో ఉండగా, జపాన్ జీ7 అధ్యక్షతను నిర్వహిస్తున్నది.

భారతదేశం మరియు జపాన్‌లు జి20 మరియు జి7 అధ్యక్ష పదవులను నిర్వహిస్తున్న ముఖ్యమైన సమయంలో ఇద్దరు ప్రధానుల మధ్య సమావేశం జరుగుతోంది. ఈ పర్యటన ఆహారం మరియు ఆరోగ్య భద్రత, శక్తి పరివర్తనలు మరియు ఆర్థిక భద్రతతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై జీ20 మరియు జీ7 కలిసి ఎలా పని చేయడానికి, చర్చించడానికి అవకాశం కల్పిస్తుంది.

ఇండియన్ వెల్స్ మాస్టర్స్ 2023 విజేతగా రోహన్ బోపన్న జోడి

రోహన్ బోపన్న మరియు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియాలో జరిగిన ఇండియన్ వెల్స్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. బోపన్న, ఎబ్డెన్‌ల అన్‌సీడెడ్ జట్టు గ్రేట్ బ్రిటన్‌కు చెందిన టాప్-సీడ్ డచ్ ప్లేయర్‌లు వెస్లీ కూల్‌హాఫ్, నీల్ స్కుప్‌స్కీని 6-3, 2-6, 10-8తో ఓడించింది విజేతగా నిలిచింది.

అస్సాంలో 4వ ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం

అస్సాంలోని బక్సా జిల్లాలో 4వ ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్, మార్చి 20 - 23 తేదీల మధ్య నిర్వహిస్తున్నారు. అస్సాం ఖో ఖో అసోసియేషన్ మరియు బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ ప్రభుత్వంతో కలిసి ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అస్సాం ప్రభుత్వం కూడా పోటీకి తన మద్దతును అందిస్తుంది.

ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం తొమ్మిది దేశాలు-భారత్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, మలేషియా, నేపాల్, భూటాన్, ఇరాన్, శ్రీలంక మరియు ఇండోనేషియాలు పాల్గొంటున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి ఏషియన్ ఖో ఖో ఛాంపియన్‌షిప్ 1996లో కోల్‌కతాలో ప్రారంభించారు.

బాంబే జయశ్రీకి సంగీత కళానిధి పురస్కారం

ప్రఖ్యాత కర్ణాటక గాయని బొంబాయి జయశ్రీకి 2023 సంగీత కళానిధి అవార్డును ప్రదానం చేయనున్నట్లు సంగీత అకాడమీ ప్రకటించింది. ఈ అవార్డును 1942లో అప్పటి అకాడమీ అధ్యక్షుడు కె.వి.కృష్ణస్వామి అయ్యర్ ప్రారంభించారు. ఇది కర్ణాటక సంగీత రంగంలో అత్యున్నత పురస్కారంగా పరిగణించబడుతుంది. దీనితో పాటుగా ఇతర అవార్డులను కూడా మ్యూజిక్ అకాడమీ ప్రకటించింది.

సంగీత కళా ఆచార్య అవార్డు కేరళకు చెందిన కర్ణాటక గాయకురాలు పల్కులంగర అంబికా దేవి మరియు మృదంగం వాద్యకారుడు కేఎస్ కాళిదాస్‌కు అందించారు. టీటీకే అవార్డుకు ప్రముఖ తవిల్ ప్లేయర్ తిరునాగేశ్వరం ఎంపికయ్యారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం, రంగస్థలం, జానపద సంగీతం, శాస్త్రీయ తమిళ సాహిత్యంలో పరిశోధనలు చేస్తున్న అరిమలం ఎస్.పద్మనాభన్‌కు సంగీత విద్వాంసుడు అవార్డును ప్రదానం చేయనున్నారు.

ఖేలో ఇండియా దస్ కా దమ్ టోర్నమెంట్ ప్రారంభం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023ని పురస్కరించుకుని ఖేలో ఇండియా దస్ కా దమ్ టోర్నమెంట్ పేరుతొ ప్రత్యేక క్రీడా ఈవెంటును మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ ప్రారంభించింది. ఈవెంట్‌ను మార్చి 10 నుండి 31 వరకు దేశంలోని 10 నగరాల్లో 10 రకాల క్రీడా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. వీటిలో దాదాపు 15000 మంది మహిళా అథ్లెట్లు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంను మార్చి 10న దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఇలాంటి క్రీడా చొరవ దేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి. జాతీయ/రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనలేని మహిళా క్రీడాకారిణులకు వేదికను అందించడం కోసం ఈ కార్యక్రమం రూపొందించారు.

లక్నోలో 8వ ఎడిషన్ ఇండియన్ ఫార్మా ఫెయిర్

8వ ఎడిషన్ ఇండియన్ ఫార్మా ఫెయిర్ 2023 కు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మార్చి 17, 18వ తేదీల్లో ఆతిధ్యం ఇచ్చింది. ఈ కార్యక్రమం ఫార్మాస్యూటికల్, డ్రగ్ మరియు ఫార్ములేషన్ పరిశ్రమలలో అత్యంత తాజా ట్రెండ్‌లు మరియు సాంకేతికతను పరిచయం చేసేందుకు, ప్రదర్శించేందుకు నిర్వహించారు.

ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్-సెంట్రల్ ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్

ఆఫ్ఘనిస్తాన్‌పై భారతదేశం-మధ్య ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ (JWG) మొదటి సమావేశం 7 మార్చి 2023 న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి భారతదేశం, కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్థాన్‌ల ప్రత్యేక రాయబారులు మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్‌లో రాజకీయ, భద్రత, మానవతా పరిస్థితులతో సహా ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరిగాయి. సార్వభౌమాధికారం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత మరియు దాని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని నొక్కి చెబుతూనే, పాల్గొన్న వారందరూ శాంతియుత, సురక్షితమైన మరియు స్థిరమైన ఆఫ్ఘనిస్తాన్ కోసం తమ మద్దతును పునరుద్ఘాటించారు.

ఈ సమావేశంలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల సహాయాన్ని ప్రకటించింది. ఈ సరుకులను ఇరాన్‌లోని చబహార్ పోర్ట్ ద్వారా పంపనుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న మానవతా సంక్షోభంను కొంతలో కొంత తగ్గించేందుకు ఈ సహాయం చేస్తుంది. ఇదివరకే 8,000 మెట్రిక్ టన్నుల గోధుమలను ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ పంపించింది.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 4 రోజుల భారత పర్యటన

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 4 రోజుల భారత పర్యటన మార్చి 8న ఇండియా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మార్చి 9న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచుకు ప్రధాని నరేంద్ర మోడీ మరియు అల్బనీస్ హాజరయ్యారు.

మార్చి 10న న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు. అలానే రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యారు. ఆంథోనీ అల్బనీస్ భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా మరియు భారతదేశం మధ్య మంచి విదేశీ దౌత్య సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి.

నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్

నేపాల్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రామ్ చంద్ర పాడెల్ మార్చి 9న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ పదవీ కాలం మార్చి 12తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు చోటు చేసుకున్నాయి. 2008లో రిపబ్లిక్‌ ఆఫ్ నేపాల్‌గా అవతరించిన తర్వాత ఇవి మూడో అధ్యక్ష ఎన్నికలు.

నేపాల్‌లో ప్రస్తుతం ప్రధాని పుష్ప కమల్ దహల్ నేతృత్వంలోని తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వం వివిధ రాజకీయ అస్థిరతల మధ్య పరిపాలన అందిస్తుంది. ప్రస్తుత ప్రధానమంత్రి 25 డిసెంబర్ 2022న అప్పటి ప్రెసిడెంట్ బిధ్యా దేవి భండారీచే నియమించబడ్డారు.

ఈఎంఈ యూనిట్‌కి మొదటి మహిళా కమాండ్‌గా కల్నల్ గీతా రాణా

కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్‌కి చెందిన కల్నల్ గీతా రాణా, తూర్పు లడఖ్‌లోని ఫార్వర్డ్ మరియు రిమోట్ లొకేషన్‌లో స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్‌కు మొదటి మహిళా కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వివిధ బోర్డులను క్లియర్ చేసే మహిళా అధికారులకు కమాండ్ రోల్స్ ఇవ్వబడతాయి. వీరు భవిష్యత్తులో ఉన్నత ర్యాంక్‌ పదోన్నతులు పొందేందుకు కూడా పరిగణించబడతారు.

ఇటీవల భారత వైమానిక దళం కూడా గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామీకి పశ్చిమ సెక్టార్‌లోని ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్ కమాండ్‌ని అప్పగించింది. పశ్చిమ సెక్టార్‌లోని ఈ ప్రాంతంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం ఉంది. భారత వైమానిక దళంలో ఒక మహిళా అధికారి పోరాట విభాగానికి బాధ్యతలు చేపట్టడం కూడా ఇదే తొలిసారి.

తెలంగాణలో కొత్తగా 'ఆరోగ్య మహిళ' పథకం ప్రారంభం

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిటి హరీష్ రావు, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం 'ఆరోగ్య మహిళ' పేరుతో కొత్త ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభిచారు. ఈ కార్యక్రమం కింద ప్రతి మంగళవారం 100 ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తారు. అలానే ఉగాది పండుగ తర్వాత మహిళల కోసం న్యూట్రిషన్‌ కిట్‌ పేరుతొ మరో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

వైద్యానికి నోచుకోని నిరుపేద మహిళకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది చేకూర్చనున్నారు.ఇందులో మహిళలకు ఎనిమిది రకాల వైద్య సేవలు అందించబడతాయి. ప్రతి మంగళవారం, గుర్తించబడిన క్లినిక్‌లలో ప్రత్యేకంగా మహిళల వైద్యులతో సహా, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు  అందుబాటులో ఉంచుతారు.

ఈ క్లినిక్‌లలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ట్రీట్‌మెంట్ కూడా అందించి మందులు అందిస్తారు. అవసరమైతే, ఆపరేషన్లు మరియు ఇతరత్రా సహా తదుపరి చికిత్స కోసం మహిళలను జిల్లా ప్రధాన ఆసుపత్రికి రెఫర్ చేస్తారు.

అత్యధిక మహిళా బిలియనీర్లలో ఇండియాకు ఐదవ స్థానం

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మహిళా బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారతదేశం ఐదవ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా విడుదల చేసిన సిటీ ఇండెక్స్ 2023 నివేదికలో 92 మహిళా బిలియనీర్లతో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో నిలవగా, 46 మహిళా బిలియనీర్లతో చైనా రెండువ స్థానం దక్కించుకుంది. తర్వాత 3 స్థానాల్లో జర్మనీ (32), ఇటలీ (16), ఆస్ట్రేలియా (9), ఇండియా (9), మలేషియా (9)లు ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ధనిక స్వయం-నిర్మిత మహిళగా హాంకాంగ్ టెక్ మొగల్ జౌ కున్‌ఫీ, $6.6 బిలియన్లతో అగ్రస్థానంలో నిలవగా, ఆస్ట్రేలియాకు చెందిన కాన్వా సహ వ్యవస్థాపకురాలు మెలానీ పెర్కిన్స్ $3.62 బిలియన్లతో రెండవ స్థానంలో ఉన్నారు. భారతీయ వ్యాపారవేత్త సావిత్రి జిందాల్ మరియు ఆమె కుటుంబం $16.96 బిలియన్ల సంపదతో భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచింది.

అయితే ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళగా, లోరియల్ వైస్ ఛైర్మన్‌ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ $81.49 బిలియన్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. వాల్‌మార్ట్ వారసురాలు అలిస్ వాల్టన్ ($60.16 బిలియన్), న్యూయార్క్‌కు చెందిన సోషలైట్ జూలియా కోచ్ ($59.65 బిలియన్) లు తర్వాత రెండు స్థానాల్లో దాదాపుగా సమంగా ఉన్నారు.

హిందుస్థాన్ యూనిలీవర్ కొత్త ఎండీ & సీఈఓగా రోహిత్ జావా

హిందుస్థాన్ యూనిలీవర్ కొత్త ఎండీ & సీఈఓగా రోహిత్ జావాను నియమించింది. ప్రస్తుతం యూనిలీవర్ ట్రాన్స్‌ఫర్మేషన్ చీఫ్‌గా ఉన్న జావా జూన్ 27 నుండి ఎండీ మరియు సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓగా ఉన్న సంజీవ్ మెహతా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.

హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) ముంబైలో ప్రధాన కార్యాలయంగా వ్యాపారం నిర్వహిస్తున్న భారతీయ వినియోగదారు వస్తువుల సంస్థ. ఇది బ్రిటిష్ కంపెనీ యూనిలీవర్‌కు అనుబంధ సంస్థ. దాని ఉత్పత్తులలో ఆహారాలు, పానీయాలు, శుభ్రపరిచే ఏజెంట్లు, వ్యక్తిగత సంరక్షణ వంటి ఉత్పత్తులు ఇండియాలో మార్కెట్ చేస్తుంది.

ఉత్తరాఖండ్‌లో దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ తీర్థయాత్ర కారిడార్

దేశం యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ తీర్థయాత్ర కారిడార్ సుమారు 900 కి.మీ పొడవున ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మించబడుతోంది. ఈ మార్గంలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రతి 30 కి.మీకి ఒక ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అలానే ఈ మార్గం పరిధిలోని అన్ని అతిథి గృహాలలో కూడా ఛార్జింగ్ పాయింట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడుకను ప్రోత్సహాయించడం ద్వారా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

Post Comment