భారత రాజ్యాంగం అనేది భారతదేశ అత్యున్నత చట్టంగా పరిగణించబడుతుంది. రాజ్యాంగం అనేది రాజకీయ & ప్రభుత్వ సంస్థల నిర్మాణం, విధానాలు, అధికారాలు, విధులను తెలియజెప్పే ఫ్రెమ్ వర్క్. రాజ్యాంగం పౌరుల ప్రాథమిక హక్కులను, నిర్దేశక సూత్రాలు మరియు వారి విధులను కూడా నిర్దేశిస్తుంది.
డా. బీఆర్ అంబేద్కర్ దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి దీనిని రూపొందించారు. అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ పితామహుడిగా అభివర్ణిస్తారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది.
రాజ్యాంగం రూపొందించడానికి భారత రాజ్యాంగ నిర్మాణ సభ మొత్తం 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమయ్యింది. ఇందులో 14 రోజులు రాజ్యాంగం రాతప్రతిపై వెచ్చించింది. భారత రాజ్యాంగం మొత్తం 25 భాగాలుగా, 12 షెడ్యూళ్ళుగా, 448 అధికారణాలుగా రూపొందించబడింది. భారత రాజ్యాంగంను ఇప్పటి వరకు 105 సార్లు సవరించారు. చివరిగా 15 ఆగష్టు 2021లో సవరించబడింది.
భారత రాజ్యాంగం 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగ నిర్మాణ సభచే ఆమోదయించబడింది, అయితే అధికారికంగా 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది. నవంబర్ 26వ తేదీని ప్రతి ఏడాది భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. అలానే జనవరి 26వ తేదీని ప్రతి ఏడాది భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.
గోపాల కృష్ణ గోఖలే 1914లో మొదటగా భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని అభిప్రాయపడ్డారు. 1934లో కమ్యూనిస్ట్ నాయకుడైన ఎం. ఎన్. రాయ్ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకత గురించి విన్నవించారు. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారి రాజ్యాంగ పరిషత్తు కోసం డిమాండ్ చేసింది. ఈ పరిణామాల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించటానికి అనుమతిని మంజూరు చేసింది.
6 డిసెంబర్ 1946 లో రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు జరిగింది. 9 డిసెంబర్ 1946 లో ప్రస్తుతం పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో మొదటి రాజ్యాంగ నిర్మాణ సభ జరిగింది. ఈ సమావేశంలో ప్రసంగించిన మొదటి వ్యక్తిగా జేబీ కృపలానీ నిలిచారు. మొదటి రాజ్యాంగ సమావేశం ద్వారా సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడయ్యాడుగా ఎన్నికయ్యారు. ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తూ, ముస్లిం లీగ్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.
ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో పరోక్ష ఓటింగు పద్దతిలో మొత్తం 389 మంది సభ్యులు ఎన్నుకోబడ్డారు. 11 డిసెంబర్ 1946 న మొదటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. ఇదే రోజున హెచ్.సీ ముఖర్జీని ఉపాధ్యక్షుడిగా మరియు బీఎన్ రావును రాజ్యాంగ న్యాయ సలహాదారునిగా నియమించారు. 13 డిసెంబర్ 1946న జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగంలోని అంతర్లీన సూత్రాలను నిర్దేశిస్తూ "ఆబ్జెక్టివ్ రిజల్యూషన్" సమర్పించారు. ఈ ఆశయాల తీర్మానం (ఆబ్జెక్టివ్ రిజల్యూషన్) తరువాత కాలంలో రాజ్యాంగ ప్రవేశికగా మారింది.
భారత రాజ్యాంగం ఏర్పడిన కాలక్రమం
- 13 డిసెంబర్ 1946న జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగంలోని అంతర్లీన సూత్రాలను నిర్దేశిస్తూ "ఆబ్జెక్టివ్ రిజల్యూషన్" సమర్పించారు
- నెహ్రు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ 22 జనవరి 1947 లో ఏకగ్రీవంగా ఆమోదించబడింది.
- 22 జూలై 1947 లో పింగళి వెంకయ్య త్రివర్ణ పతకం జాతీయ జెండాగా ఆమోదించబడింది.
- 15 ఆగస్టు 1947న భారత్ స్వాతంత్ర్య దేశంగా ఏర్పడింది. భారతదేశం ఇండియా & పాకిస్థాన్‌గా విడిపోయింది.
- 29 ఆగస్టు 1947న బిఆర్ అంబేద్కర్ చైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు జరిగింది.
- 1949 మేలో భారత్, కామన్ వెల్త్ సభ్య దేశంగా ధృవీకరించబడింది.
- 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగం రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా ఆమోదించబడింది.
- 24 జనవరి 1950లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన "జన గణ మన"భారతదేశ జాతీయ గీతంగా ఆమోదించబడింది.
- 24 జనవరి 1950లో బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతర గీతం భారతదేశ జాతీయ గేయంగా ఆమోదించబడింది.
- 24 జనవరి 1950: రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది.
- 24 జనవరి 1950న డా రాజేంద్ర ప్రసాద్ భారత మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు.
- 26 జనవరి 1950న భారత్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
- ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి 2 సంవత్సరాలు, 11 నెలలు మరియు 18 రోజులు పట్టింది.
భారత రాజ్యాంగంపై విదేశీ రాజ్యాంగాల ప్రభావం
భారత రాజ్యాంగం దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యాయనం చేయడం ద్వారా రూపొందించబడింది. వీటిలో మెజారిటీ అంశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వీకరించబడ్డాయి. యునైటెడ్ కింగ్‌డమ్ నుండి పార్లమెంట్ వ్యవస్థ, రాష్ట్రపతి, ఏక పౌరసత్వం, ప్రిరోగేటివ్ రిట్ వంటి అంశాలను తీసుకున్నారు.
అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ప్రవేశిక, ప్రభుత్వ సమాఖ్య నిర్మాణం, సుప్రీం కోర్టు, రాష్ట్రపతి అభిశంసన వంటి అంశాలు స్వీకరించారు. ఐర్లాండ్ నుండి ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు సభ్యుల నామినేట్ చేయడం, రాష్ట్రపతి ఎన్నిక వంటివి తీసుకున్నారు.
ఆస్ట్రేలియా నుండి కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితా, రాష్ట్రాల మధ్య వాణిజ్య స్వేచ్ఛ, పార్లమెంట్ ఉమ్మడి సెషన్ నిబంధనలు స్వీకరించారు.
ఫ్రాన్స్ నుండి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భావనలు & పీఠికలోని గణతంత్ర ఆదర్శాలను సేకరించారు. కెనడా నుండి ఫెడరల్ ప్రభుత్వం, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ, అవశేష అధికారాలు, రాష్ట్రాల గవర్నర్ నియామకం వంటి తీసుకున్నారు. సోవియట్ యూనియన్ నుండి ప్రాథమిక విధులు .ప్రణాళికా సంఘం, పీఠికలో సామాజిక, ఆర్థిక & రాజకీయ ఆదర్శాలను స్వీకరించారు.
జర్మనీ నుండి అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ సంబంధించి నిబంధనలను జోడించారు. దక్షిణ ఆఫ్రికా నుండి రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక అంశాలను తీసుకున్నారు. జపాన్ నుండి పార్లమెంట్ చట్టాలు రూపొందించడం, సుప్రీం కోర్టు పనితీరు అంశాలను స్వీకరించారు.
భారత రాజ్యాంగ ప్రవేశిక
భారత రాజ్యాంగం ప్రవేశికతో (Preamble) మొదలవుతుంది. ఈ సంప్రదాయం అమెరికా నుండి స్వీకరించారు. 13 డిసెంబర్ 1946న జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగంలోని అంతర్లీన సూత్రాలను నిర్దేశిస్తూ "ఆబ్జెక్టివ్ రిజల్యూషన్" సమర్పించారు. ఈ ఆశయాల తీర్మానం (ఆబ్జెక్టివ్ రిజల్యూషన్) తరువాత కాలంలో రాజ్యాంగ ప్రవేశికగా మారింది. నెహ్రు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ 22 జనవరి 1947 లో ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ ప్రవేశిక స్వరూపం ప్రస్తుతం ఈ క్రింది విధంగా ఉంది.
"భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తీర్మానిస్తున్నాం. పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పిస్తూ. "ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకంలో , విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్చని, అందరికి హోదాని, అవకాశాలని పెంపొందించే సమానత్వాన్ని మరియు వ్యక్తిగత గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను నిర్దారించే సౌభ్రాతృత్వాన్ని కలిగించడానికి 26 నవంబర్ 1949న చట్ట రూపంగా మాకు మేము సమర్పించుకుంటున్నాం."
- సార్వభౌమత్వం అనగా దేశంలోని సమస్త వ్యక్తులపైనా, సంస్థల పైన విదేశీ ప్రాభల్యం లేకపోవడం.
- సామ్యవాదం అనగా దేశంలో ప్రభుత్వ మరియు ప్రయివేట్ రంగాలకు సమానమైన అవకాశాలు అందించడం.
- లౌకికవాదం అనగా దేశంలోని అన్ని మతాలకు సమానమైన హోదాను, మద్దతును కల్పించడం.
- ప్రజాస్వామ్యం అనగా దేశంలోని ప్రజలే సార్వభౌమత్వం కలిగి ఉండటం, అనగా వారికీ ఇష్టమైన ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం కలిగి ఉంటారు.
- గణతంత్ర దేశం అనగా రాజు లేదా ఇతర ఏ వ్యక్తి చేతిలో సార్వభౌమాధికారం లేకపోవడం.
- సమాన న్యాయం అనగా ప్రజలకు సమానమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించడం.
- స్వచ్ఛ అనగా ప్రజలకు వ్యవహారాలపై ఎటువంటి పరిమితులు లేకపోవడం. అనగా ప్రజల ఆలోచనలలో, భావప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో ఆంక్షలు లేకపోవడం.
- సమానత్వం అనగా దేశంలో ఏ వర్గానికి ప్రత్యేక హక్కులు కాని, హోదా కాని లేకపోవడం .
- సౌబ్రాత్రుత్వం అనగా ప్రజలు అంతా సోదరా భావంతో, ఏక పౌరసత్వంను కలిగి వుండటం.
Your site is very useful.